మన వాడ నిన్నింకా తలపోస్తోంది
నిన్న-నేడు-రేపు…
కాలాన్ని దాటిన కదనానివి నీవు.
కూలిన లందలో, నీడలేని పూరిగుడిసెలో, చిగురిస్తావు చందమామలా…
నైరాశ్యమో, నిస్సత్తువో
తెలీదు గానీ…
శిరస్సు అవనత పతాకమై
జారిపోకుండా నిలబెడుతున్నది ఇంకనూ నీవే…
సమూహమో ఏకాంతమో
రాజీ లేకుండా గొంతు రాజుకున్నదంటే
అక్కడ నీవుoటావని…
చెట్టు నీడన కాదు మనకు జ్ఞానోదయం.
దిక్కులేని శోకాల్లో, అస్పృశ్యతా చీలల్లో
బతకడమే యుద్దమైన చరిత్రలో.
ఎప్పటికీ…
నీవు నిప్పువి,సీతారా సాక్షానివి
నీవు గతమని ఎవరన్నారు?
సంభాషించే మట్టివి, పగిలిన విత్తనానివి
మన కలల్ని పొదిగే ఉమ్మనీటి జ్ఞాపకానివి.
నీవు లేవని ఎవరన్నారు?
స్పందించే ఈ కంఠనాళం నీవు పూనిందే…
కలలు కలలుగా పొంగుతున్న
గుండెలో ఆటుపోటుగా నీవే..
పేర్చుతున్న ప్రతీ వాక్యమూ
నీ ఆవాహనే…
నడిగడ్డనో మన వెలివాడనో..
కేవలం నడక కాదు నీవు.
సాయుధనదీ సంరంభానివి
ఎదురీత చిరునామాలో స్థిరమైన
జెండావి…
(అమరుడు కర్రెం నర్సప్ప కోసం)
కాలాన్ని దాటిన కదనానివి నీవు.
….
కేవలం నడక కాదు నీవు.
సాయుధనదీ సంరంభానివి
మన కలల్ని పొదిగే ఉమ్మనీటి జ్ఞాపకానివి.
ఎంత అద్భుతంగా రాశారు సూర్య..