సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ -అంబేడ్కర్ విశ్లేషణ

అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి, ‘భౌద్ధ మతం’ గురించి, బౌద్ధ మతంపై జరిగిన ‘ప్రతీఘాతుక విప్లవం’ గురించి ‘బ్రాహ్మణ మత విజయం’ గురించి రాసిన సందర్భాలను అధ్యయనం చేస్తే వాటి ఆధారంగా భారత సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి అంబేడ్కర్ ఉపయోగించిన ప్రాతిపదికలను, స్త్రీల పరిస్థితులను గురించి రాసిన విషయాలను అర్థం చేసుకోవచ్చు. ముందుగా అంబేడ్కర్ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి ఉపయోగించిన ప్రాతిపదికలను చూద్దాం.

మతం ఆధారంగా సామాజిక దశలను గుర్తించడం.
భారత దేశానికే ప్రత్యేకమైన వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల ఆధారంగా సామాజిక పరిస్థితిని విశ్లేషించడం.
ఆయా సమాజాలలోని శాస్త్రకారులూ, స్మృతి కారుల రచనల ద్వారా శూద్రులూ, మహిళల పరిస్థితిని అంచనా వేయడం.

మతం ఆధారంగా గుర్తించిన సామాజిక దశలు:
“చారిత్రకంగా చూసినపుడు భారత సమాజాన్ని మూడు భాగాలుగా అర్థం చేసుకోవచ్చు అని కూడా ఒక సందర్భంలో అంటారు అంబేడ్కర్. అవి 1. బ్రాహ్మణవాద భారతదేశం, 2.బౌద్ధ భారతదేశం, 3.హిందూ భారత దేశం”1. అయితే ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కూడా అంబేడ్కర్ రచనలు, ప్రసంగాల్లోని ప్రస్తావించిన అంశాల ఆధారంగా మనం ఇక్కడ 4 దశలలో స్త్రీల పరిస్తితి గురించి మాట్లాడుకుంటాం. అవి -1. వేదకాలంలో స్త్రీల పరిస్థితి 2. కౌటిల్యుని కాలంలో స్త్రీల పరిస్థితి, 3. బౌద్ధ కాలంలో స్త్రీల పరిస్థితి 4. భౌద్ధానంతర కాలంలో స్త్రీల పరిస్థితి.

వర్ణ వ్యవస్థ-కుల వ్యవస్థ గురించి అంబేడ్కర్ చేసిన విశ్లేషణ:
“హిందూ సమాజం అన్ని సమాజాల మాదిరిగానే వర్గాలతో ఏర్పడినదనే విషయాన్ని ముందు మనం గుర్తుంచుకోవడం చాలా అవసరం. అవి ఏమంటే 1 బ్రాహ్మణులు లేదా పురోహిత వర్గం 2 క్షత్రియులు లేదా యోధవర్గం 3 వైశ్యులు లేదా వాణిజ్య వర్గం 4. శూద్రులు లేదా చేతి పని వారు, సేవక వర్గం. ఇది ప్రధానంగా వర్గ వ్యవస్థ. ఇందులోని వ్యక్తులు అర్హత కలిగిన వారైతే వర్గాలు మార్చుకోవచ్చును. ఆ విధంగా వర్గాలు తమ సిబ్బందిని మార్చుకుంటూ ఉండేవన్న వాస్తవం పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాలి”2. మరో మాటలో చెప్పాలంటే “వర్ణవ్యవస్థ వర్గ వ్యవస్థగా ఉంది. వర్ణాలు కులాలు రెండు కూడా ఒక వ్యక్తి హోదాని, వృత్తిని సూచిస్తాయి. అయితే వర్ణవ్యవస్థలో ఈ హోదా, వృత్తి వంశపారంపర్యం కాదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు ఆ వర్గంలో లేదా ఆ వర్ణంలో ఉండేవారు వారి హోదాని, వృత్తిని గురుకులాలలోనే వారి గురువులు నిర్ణయించేవారు. కానీ వర్ణాలు కులంగా మారిన తర్వాత ఇవి వంశపారంపర్యం అయ్యాయి వారి హోదాని ఇక గురువుల నిర్ణయించే పద్ధతి కాకుండా ఒక వ్యక్తి తండ్రి నుంచి కొడుకుకి వంశపారంపర్యంగా లభించేది”

వేద కాలంలో స్త్రీల పరిస్థితి: (క్రీస్తు పూర్వం 1500-500 వరకూ అనుకోవచ్చు.) “బ్రహ్మచర్యాన్ని ముగించి వివాహానికి సిద్ధమైన యువతి ఉపనయనానికి అర్హురాలనే విషయం అధర్వణ వేదంలో స్పష్టంగా ఉంది. స్త్రీలు మంత్రాలు జపించవచ్చనీ స్త్రీలకు కూడా వేదాలు చదవడం నేర్పారని శ్రౌత సూత్రాలలో స్పష్టంగా ఉంది. స్త్రీలు గురుకులాలలో విద్య నేర్చారనీ వేదాలలోని వివిధ శాఖలను అధ్యయనం చేసి మీమాంసలో (వ్యాఖ్యానం) ఆరితేరారు అనడానికి పాణిని రచించిన అష్టాధ్యాయ ఒక సాక్ష్యం. పతంజలి రచించిన మహాభాష్యంలో విద్యార్థినులకు గురువులుగా మహిళలే వేదాలు బోధించారని పేర్కొన్నాడు. మతం, తత్వశాస్త్రం, అధిభౌతిక శాస్త్రం వంటి సంక్లిష్ట విషయాలపై స్త్రీలు పురుషులతో బహిరంగ చర్చల్లో పాల్గొన్న ఉదంతాలు కొల్లలు. జనకుడు, సులభల మధ్యా యాజ్ఞవల్కుడు, గార్గిల మధ్యా యాజ్ఞవల్కుడు, మైత్రేయిల మధ్యా శంకరాచార్య, విద్యాధరిల మధ్య జరిగిన బహిరంగ వాగ్వివాదాలు మనువుకు ముందు కాలంలో స్త్రీలు విద్య, అధ్యయనాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని తెలియజేస్తున్నాయి.

ఒకప్పుడు స్త్రీలను అత్యున్నతంగా గౌరవించారనటంలో సందేహం లేదు. ప్రాచీన భారతదేశంలో మహారాజు పట్టాభిషేక సమయంలో ప్రముఖ పాత్ర వహించిన పత్నులలో రాణి కూడా ఒకరు. ఇతరులకు అర్పించినట్టే రాజు రాణికి కూడా పూజలు అర్పించేవాడు. రాణికే కాకుండా పట్టాభిషిక్తుడు అవుతున్న రాజు కింది కులాలకు చెందిన తన ఇతర భార్యలకు కూడా పూజలు అర్పించేవాడు. పట్టాభిషేకం పూర్తయ్యాక తన శ్రేణులలోని ముఖ్య నాయకుల భార్యలకు కూడా నమస్కరించే వాడు”

కౌటిల్యుని కాలంలో స్త్రీల పరిస్థితి:
“క్రీస్తుపూర్వం 642 లో బీహార్లో మగధస్థాపన భారతదేశ రాజకీయ చరిత్రలో తొలి మైలురాయిగా చెప్పవచ్చు. శిశు నాగ పేరుతో ప్రసిద్ధుడైన మగధ రాజ్య స్థాపకుడు ఆర్యేతర నాగజాతికి చెందినవాడు. మగధ సామ్రాజ్యం ప్రారంభంలో చిన్నదే అయినా ఆ తర్వాత శిశునాగ వంశీయులు దాన్ని బాగా అభివృద్ధి చేశారు. నాగ వంశీయుల పాలన క్రీస్తుపూర్వం 413 దాకా కొనసాగింది. తర్వాత నందులు మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 322 దాకా పరిపాలించారు. తర్వాత మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్తుడు చివరి నందరాజుని పదవీచ్యుతుని కావించాడు. చంద్రగుప్తుడు శిశునాగవంశంలో చివరి పాలక చక్రవర్తి కుటుంబానికి చెందినవాడు. ఆ రకంగా చంద్రగుప్తుడు మగధ నాగ సామ్రాజ్య పునస్థాపన చేశాడని చెప్పవచ్చును”

ఈ చంద్రగుప్తుని ఆస్థానంలోని ఆర్థికవేత్త చాణుక్యుడు లేదా కౌటిల్యుడు. కౌటిల్యుడు స్త్రీలకి సంబంధించిన అనేక చట్టాలు చేశాడు. ఈ విషయాలను బట్టి, ఆర్యేతరులు రాజ్యం స్థాపించి పాలించిన కాలంలో స్త్రీల పరిస్థితి సాపేక్షికంగా మెరుగైనదిగానూ, స్వేచ్ఛగానూ ఉందని అంబేడ్కర్ కౌటిల్యుని రచనలనుండి విశేషంగా ఉటంకిస్తారు.

“కౌటిల్యుని కాలంలో స్త్రీలు 12 ఏళ్లకు, పురుషులు 16 ఏళ్లకు వయస్కులు అయినట్టుగా పరిగణించేవారు. వయస్కులయ్యే వయసు అంటే వివాహ యోగ్యమైన వయసు అనే అనుకోవాలి. వివాహాలు రజస్వల అయిన తరవాతే జరిగేవనేది బౌద్ధాయనుల ‘గృహ్య సూత్రాల’ నుండి స్పష్టం అవుతోంది. అందులో వివాహ సమయంలో వధువుకు రుతుక్రమం వస్తే అనుసరించవలసిన ప్రాయశ్చిత్త పద్ధతుల గురించి ప్రస్తావన ఉంది.

‘ఏ వ్యక్తి అయినా అమ్మాయికి వివాహ పూర్వమే వేరొకరితో శారీరక సంబంధం కలిగి ఉన్నదన్న విషయాన్ని చెప్పకుండా ఆమెకు వివాహం చేస్తే అతనికి దండుగ విధించడమే కాకుండా అతను వధువు తరఫున పుచ్చుకున్న శుల్కం, స్త్రీధనాన్ని కూడా తిరిగి ఇవ్వాలి. అలాగే తన వైపు దోషాలను బయట పెట్టకుండా వివాహం చేసుకున్న అబ్బాయి రెట్టింపు దండగ చెల్లించడమే కాకుండా అతను చెల్లించిన కన్యాశుల్కం స్త్రీ ధనం కూడా కోల్పోతాడు.

రజస్వల అయిన మూడేళ్ల వరకూ అవివాహితగా ఉన్న ఒకే కులానికి, శ్రేణికి చెందిన కన్యతో సంబంధం పెట్టుకోవడం నేరం కాదు. అలాగే రజస్వల అయిన మూడేళ్ల వరకు కన్యగా ఉండి తన శరీరంపై ఆభరణాలు లేని వేరే కులానికి చెందిన యువతితో సంబంధం కలిగి ఉండడం కూడా తప్పు కాదు. కౌటిల్యుడు ఏక పత్నీత్వాన్ని సమర్ధిస్తాడు. పురుషులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండొచ్చు. ఆ సందర్భాలను కౌటిల్యుడు ఈ విధంగా వివరిస్తాడు. ‘ఒక స్త్రీ ప్రాణం ఉన్న పిల్లల్ని కనలేకపోయినా లేదా మగ పిల్లవాడు కలగకపోయినా లేక గొడ్రాలైనా ఆమె భర్త మరో వివాహం చేసుకోవడానికి కనీసం ఎనిమిదేళ్ల పాటు ఆగాలి. ఆమె విగతజీవికి జన్మనిస్తే పదేళ్ల పాటు ఆగాలి. ఆడపిల్లల్ని మాత్రమే కంటే పన్నెండేళ్ళ పాటు ఆగాలి. అప్పటికీ మగపిల్లలు కావాలనుకుంటే మరో వివాహం చేసుకోవచ్చు. ఈ నియమాలను ఉల్లంఘించిన పక్షంలో ఆమెకు శుల్కం స్త్రీధనం మాత్రమే కాకుండా తగినంత పరిహారం ధన రూపంలో చెల్లించాలి. అంతేకాకుండా 24 పనల దండుగను ప్రభుత్వానికి చెల్లించాలి. వివాహ సమయంలో శుల్కం స్త్రీధనం పొందని స్త్రీలకు కూడా అది చెల్లించి తన భార్యలకు తత్సమానమైన పరిహారాన్ని, తగినంత పోషణ సొమ్మును చెల్లించిన పక్షంలో అతను ఎందరినైనా వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే స్త్రీలను సృష్టించిందే కొడుకులను కనడానికి.

కౌటిల్యుని కాలంలో స్త్రీలు పరస్పర ద్వేషం, అసహ్యం కారణాలతో విడాకులు పొందవచ్చు. భర్తని ద్వేషించే ఒక స్త్రీ అతని ఆమోదం లేకుండా వివాహాన్ని రద్దు చేయడానికి వీలు లేదు. అలాగే భార్య అనుమతి లేకుండా భర్త వివాహాన్ని రద్దు చేయలేడు. కానీ పరస్పరం ద్వేషించుకొనే వారి విషయంలో విడాకులు పొందవచ్చు. భార్య నుండి ప్రమాదాన్ని శంకించి విడిపోదలచుకున్న పురుషుడు వివాహ సమయంలో ఆమెకు ఇచ్చినవన్నీ ఆమెకు చెల్లించాలి. ఒకవేళ భర్త నుండి ప్రమాదాన్ని శంకించి భార్యతో విడిపోదలుచుకున్న స్త్రీ ఆమెకు చెందే ఆస్తిపై హక్కులను కోల్పోతుంది. చెడు ప్రవర్తన ఉన్న భర్తను ఆమె వదిలి వేయవచ్చు.

కౌటిల్యుని కాలంలో ఒక స్త్రీ గాని వితంతువు గాని పునర్వివాహం చేసుకోవడంపై నిషేధం లేదు.
“ఒక స్త్రీకి భర్త చనిపోయినప్పుడు ఆమె పవిత్ర జీవితం గడప దలచుకుంటే ఆమెకు ఒకేసారిగా ఆమె మాన్యం, ఆమె ఆభరణాలు మాత్రమే కాకుండా ఆమెకు చెల్లించవలసిన శుల్కం కూడా వెంటనే ఇవ్వాలి. ఇవి పొందిన అనంతరం ఆమె మరో వివాహం చేసుకుంటే ఆ ధనాన్ని, ఆభరణాలు అయితే వాటి విలువపై వడ్డీతో సహా చెల్లించాలి. ఒకవేళ వితంతువు తిరిగి వివాహం చేసుకోదలచుకుంటే ఆమె మామ గారు లేదా భర్త లేదా ఇద్దరు, ఆమెకు ఇచ్చిన వాటిని రెండవ వివాహం సందర్భంలో ఆమెకు చెల్లించాలి. స్త్రీలు పునర్వివాహం ఎప్పుడు చేసుకోవచ్చన్న విషయం “భర్తల సుదీర్ఘ ప్రయాణం” అన్న అంశం గురించిన ప్రస్తావించిన సందర్భంలో వివరంగా ఉంది.

“ఒక వితంతువు తన మామగారు ఎంపిక చేసిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమెకు మామగారు కానీ భర్త గాని ఇచ్చిన సొమ్మును కోల్పోతుంది. ఒకవేళ ఆ స్త్రీ (జ్ఞాతి) బంధువునే వివాహం చేసుకుంటే ఆమె పునర్వివాహ సమయంలో మామగారు ఇచ్చినవి ఏమైనా ఆ బంధువు ఆమె మామ గారికి తిరిగి ఇచ్చేయాలి. ఒక స్త్రీ సంరక్షణ భారం వహించేవారు ఎవరైనా అంతే బాధ్యతతో ఆమె ఆస్తిని కాపాడాలి. పునర్వివాహం చేసుకున్న స్త్రీ మరణించిన భర్తకు చెందిన ఆస్తిపై హక్కును ఏర్పరుచుకోజాలదు.”

“ఆమె ఒకవేళ పవిత్ర జీవితం గడప తలుచుకుంటే ఆమె ఆస్తిని అనుభవించవచ్చు. కొడుకు లేదా కొడుకులు ఉన్న స్త్రీ, తన స్త్రీ ధనాన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దానిపై ఆమె కొడుకులకు హక్కు ఉంటుంది. “భర్తతో విడిపోయిన స్త్రీ పునర్వివాహం తర్వాత మునుపటి భర్త ద్వారా కలిగిన కొడుకుల పోషణ కోసం ఆస్తిని ఉపయోగించ దలచుకుంటే దానిని కొడుకుల పేరు మీదకు మార్చవలిసి ఉంటుంది. ఒకవేళ ఒక స్త్రీ వేరు వేరు భర్తల నుండి అధిక సంఖ్యలో కొడుకులను కలిగి ఉంటే ఆమె తన భర్తల నుండి సంక్రమించిన ఆస్తిని యధాతధంగా ఉంచాలి. ఒక స్త్రీ కి ఆస్తి మీద పూర్తి స్వతంత్రతతో స్వేచ్ఛగా అనుభవించి ఖర్చుపెట్టే సర్వ హక్కులు ఉండి ఉన్నప్పటికి ఆమె పునర్వివివాహం చేసుకుంటే ఆస్తిని ఆమె తన కొడుకుల పేర రాయ వలసిందే.”

“గొడ్రాలయిన ఒక స్త్రీ మరణించిన తన భర్త పడకకు విధేయంగా ఉంటే ఆమె తన గురువు రక్షణలో ఉంటూ జీవించి ఉన్నంత కాలం ఆస్తిని అనుభవించవచ్చు. ఆస్తి కలిగిన వితంతువుకు రాగల ప్రమాదాలను ఇది దూరంగా ఉంచుతుంది. ఆమె మరణానంతరం ఆస్తి దాయాదులకు చెందుతుంది. భర్త జీవించి ఉండగా భార్య చనిపోతే ఆమె ఆస్తిని కొడుకులు, కూతుళ్ళు పంచుకుంటారు. మగ పిల్లలు లేని పక్షంలో ఆడపిల్లలు పంచుకుంటారు. పిల్లలు లేని సందర్భంలో భర్త తాను వివాహ సమయంలో ఇచ్చిన శుల్కం తిరిగి తీసుకుంటాడు. బంధువులు బహుమతి రూపంలో గాని కట్నాల రూపంలో గాని ఆమెకు ఇచ్చిన వాటిని తిరిగి తీసుకోవచ్చు. ఆ రకంగా స్త్రీకి సంబంధించిన ఆస్తి వ్యవహారాన్ని పరిష్కరించాలి.

భర్తలు కొంతకాలం కోసం విదేశాలకు వెళ్లిన సందర్భాలలో శూద్రులకు వైశ్యులకు క్షత్రియులకు లేదా బ్రాహ్మణ కులాలకు సంబంధించిన భార్యలు వారికి పిల్లలు లేకపోయి ఉంటే వరుసగా ఒక ఏడాది, రెండు, మూడు, నాలుగు ఏళ్ళు చొప్పున భర్తల కోసం వేచి చూడాలి. పిల్లలు కలిగి ఉంటే ఏడాదికంటే ఎక్కువ కాలం ఎదురు చూడాలి. వారికి పోషణ ఖర్చు అందుతూ ఉంటే పైన చెప్పిన సమయానికి రెట్టింపు సమయం వేచి చూడాలి. ఒకవేళ పోషణ అందకపోతే బంధువులు (జ్ఞాతులు) నాలుగు లేదా ఎనిమిదేళ్ల పాటు పోషించాలి. తర్వాత వివాహ సమయంలో ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకొని, వారిని పునర్వివాహం చేసుకోవడం కోసం వదిలి పెట్టాలి. ఆమె బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి భర్త చదువుల కోసం విదేశాలకు వెళ్లి ఆమెకు పిల్లలు లేకపోయి ఉంటే పదేళ్లపాటు భర్త కొరకు ఎదురు చూడాలి. ఒకవేళ పిల్లలు ఉంటే పన్నెండేళ్ళ పాటు ఎదురు చూడాలి. ఒకవేళ భర్త రాజసేవకుడు అయి ఉంటే జీవితాంతం ఎదురు చూడాలి. ఒకవేళ జాతి అంతరించి పోకుండా కాపాడడం కోసం భర్త గోత్రానికి చెందిన సవర్ణ వ్యక్తితో ఆమె పిల్లల్ని కని ఉంటే ఆమె శిక్షార్హురాలు కాజాలదు. భర్త లేని సమయంలో ఆమెకు పోషణ ఖర్చు అందక పోయి, ఆమె సంపన్న బందువులు ఆమెను ఆదరించక పోతుంటే ఆమె తనకు నచ్చిన, తనను పోషించగల వ్యక్తిని పునర్వివాహం చేసుకోవచ్చు.

మనువు లాగా కాకుండా కౌటిల్యుడు వివాహిత స్త్రీ ఆర్థిక స్వాతంత్రాన్ని వాగ్దానం చేసే ప్రతి జాగ్రత్తనూ తీసుకున్నాడనే విషయం కౌటిల్యుని అర్థశాస్త్రంలో వివాహిత స్త్రీల మాన్యాలు, పోషణ గురించి పొందుపరచిన విషయాల నుండి స్పష్టం అవుతుంది. ‘పోషణ లేదా ఆభరణాలు స్త్రీకి సంబంధించిన ఆస్తి అవుతాయి. పోషణ ఖర్చు నిమిత్తం నిర్ణయించిన విలువ ఆమె పేరున రాయాలి. ఆభరణాలకు సంబంధించిన పరిమితి ఏమీ లేదు. ఆమె పోషణ నిమిత్తం భర్త ఏ ఏర్పాటు చేయని సమయంలో ఈ ఆస్తిని ఆమె తన కోసం కానీ తన కొడుకు కోసం కానీ కోడలి కోసం కానీ ఖర్చు పెట్టడం నేరం కాదు. విపత్తుల సందర్భంగా గాని, అనారోగ్యం కరువుల సందర్భంగా కానీ ప్రమాద నివారణ కోసం లేదా దానధర్మాల సందర్భంగా గాని ఈ ఆస్తిని భర్త కూడా వినియోగించవచ్చు. పిల్లలకు జన్మనిచ్చిన జంట పరస్పర అంగీకారంతో ఈ ఆస్తిని ఖర్చుపెట్టడం పట్ల కూడా ఫిర్యాదు ఉండదు. మొదటి నాలుగు పద్ధతుల్లోని ఏదో ఒక పద్ధతిలో వివాహం చేసుకున్న వారు మొదటి మూడేళ్లు ఈ ఆస్తిని అనుభవించడం పై కూడా ఫిర్యాదు ఉండదు. గాంధర్వ, అసుర పద్ధతుల్లో వివాహం చేసుకున్న వారు వడ్డీతో సహా ఈ మొత్తాన్ని తిరిగి సమకూర్చ వలసి ఉంటుంది. రాక్షస, పైశాచిక వివాహాలలో ఈ ఆస్తిని వినియోగించడం దొంగతనంతో సమానం. ఆ రకంగా వివాహ విధులకు సంబంధించిన విషయాలతో వ్యవహరించవలసి ఉంటుంది.’

‘అపరిమిత కాలం వరకు పోషణను పొందే హక్కు కలిగిన స్త్రీ తనకు అవసరమైనంత తిండి, బట్ట లేదా తనకు భరణం ఇవ్వాల్సిన వ్యక్తి ఆదాయాన్ని బట్టి తన అవసరానికి మించి కూడా భరణం పొందవచ్చు. ఒకవేళ ఆ కాలం పరిమితం అయితే అతని ఆదాయాన్ని బట్టి నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణయించి (ఆ కాలానికి సరిపడా తిండి బట్టతో పాటు అదనంగా పదవ వంతు మొత్తాన్ని) ఆమెకు చెల్లించవలసి ఉంటుంది. అలాగే వివాహ సమయంలో ఆమెకు ఇచ్చిన శుల్కం, స్త్రీ ధనం చెల్లించాలి. పునర్వివాహం చేసుకోవడానికి అనుమతించినందుకు పరిహారం కూడా చెల్లించాలి. ఒకవేళ ఆమె తన మామగారి సంరక్షణలో ఉన్నా లేదా స్వతంత్రంగా బతుకుతున్నా ఆమె భర్తపై పోషణ నిమిత్తం కేసు వేయజాలదు. ఆ రకంగా పోషణ విషయాన్ని పరిష్కరించాలి’.

ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ కౌటిల్యుని కాలంలో భర్త కొట్టినా అవమానపరిచినా అతనికి వ్యతిరేకంగా భార్య కోర్టుకు వెళ్లవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే మనువుకు ముందు కాలంలో ఒక స్త్రీ స్వేచ్ఛగానూ పురుషునికి సమాన భాగస్వామిగానూ ఉంది”

బౌద్ధంలో స్త్రీలు:
చంద్రగుప్తుని తర్వాత పరిపాలించిన వారిలో బింబిసారుడు, అశోకుడు మగధ రాజ్యాన్ని చాలా విస్తరించారు. కాబట్టి ఇక అది మగధ రాజ్యంగా కాకుండా మౌర్య సామ్రాజ్యంగా విస్తరించింది. అశోకుడు బౌద్ధ మతాన్ని రాజ్యమతంగా చేశాడు.

“బౌద్ధంలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులుండేవి. మహిళలకు, పురుషులకు ఒకేరకమైన న్యాయ స్మృతి ఉండేది. అలాగే బుద్ధుని కాలంలో కూడా కుందల్ కాషా, క్షేమ అనే ఇద్దరు బౌద్ధ భిక్షుణిలు ధర్మశాస్త్రాల్లో విద్వాంసులు. వాద ప్రతివాదాల్లో ఆరితేరినవారు. జైన, బుద్ధ విశ్వాసాలలో మహిళలకు సమాన హోదా ఉండేది. మహిళలకు విద్యార్జన చేసే, బోధన చేసే, వృత్తి చేపట్టే, తమను తాము అభివృద్ధి చేసుకుని, నిర్వాణం పొందే స్వేచ్ఛ సైతం ఉండేది”.

“బుద్ధుడు స్త్రీలకు సమాన హోదాను, సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాడు. ఆ రకంగా బుద్ధ భగవానుడే స్త్రీల స్వాతంత్ర్యాన్ని ఎత్తిపట్టిన మొట్టమొదటివాడని చెప్పవచ్చు”

బౌద్ధానంతర హిందూ సమాజంలో స్త్రీలు:
అశోకుడు బౌద్ధాన్ని రాజ్యమతంగా చేయడం బ్రాహ్మణ మతానికి తీవ్ర విఘాతం కలిగించింది. బ్రాహ్మణులకు రాజ్య పోషణ కరువైంది. జంతు బలుల నిషేధంతో బ్రాహ్మణులకు ఆదాయ మార్గాలు కరువయ్యాయి. 140 సంవత్సరాల పాటు మౌర్య సామ్రాజ్య పాలన ముగిసే వరకు అణచివేతకు గురైన వర్గంగా వాళ్ళు బతికారు. కాబట్టి బౌద్ధ రాజ్యంపై పుష్యమిత్రుడి నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. పుష్యమిత్రుడు శుంగవంశపు బ్రాహ్మణుడు. “క్రీస్తుపూర్వం 185 నుండి 149 వరకు ఇతను రాజ్యం చేశాడు. అధికారం చేపట్టగానే అశ్వమేధ యాగం చేసాడు. బౌద్ధుల మీద విపరీతంగా హింస ప్రయోగించాడు. బౌద్ధ ఆరామాలను నాశనం చేశాడు. భిక్షుల తలకు 100 బంగారు నాణేలు చొప్పున ప్రకటించాడు”

“ఆర్యచట్టం ప్రకారం 1. రాజరికం క్షత్రియుని హక్కు మాత్రమే. బ్రాహ్మణుడు రాజు ఎప్పటికీ కాలేడు. 2. ఏ బ్రాహ్మణుడు ఆయుధ సంబంధిత వృత్తి చేపట్టకూడదు. 3. రాజు అధికారానికి వ్యతిరేకంగా జరిగే విప్లవం పాపం. ఆరకంగా విప్లవాన్ని నిర్వహించడం ద్వారా పుష్యమిత్రుడు ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి నేరాన్ని చేశాడు. అతడు బ్రాహ్మణుడు కాబట్టి పుష్యమిత్రుని నేరాలన్నిటినీ ఒప్పులుగా చేయడానికి చట్టాన్ని మార్చారు”

“ఈ న్యాయపరమైన మార్పులు ఎంత విప్లవాత్మకమైనవో అంతగా అవశ్యకమైనవి. తుది మౌర్య రాజుని చంపి పుష్యమిత్రుడు సంపాదించిన స్థానాన్ని చట్టబద్ధం చేయటమూ క్రమబద్ధం చేయటమూ వారి లక్ష్యం. ఈ న్యాయపరమైన మార్పుల ద్వారా బ్రాహ్మణుడు న్యాయసమ్మతంగా రాజు కాగలడు, న్యాయ సమ్మతంగా సాయుధుడు కాగలడు, చాతుర్వర్ణ వ్యవస్థను వ్యతిరేకించే రాజును న్యాయ సమ్మతంగా సింహాసనం దించేయగలడు. లేదా హత్య చేయగలడు. బ్రాహ్మణాధికారాన్ని వ్యతిరేకించే ఏ వ్యక్తినైనా న్యాయసమ్మతంగా చంపగలడు. స్వీయ ప్రయోజన రక్షణార్థం అవసరమైతే ఊచకోత కోసే హక్కును మనువు బ్రాహ్మణులకు ప్రసాదించాడు. “మౌర్యులకు వ్యతిరేకంగా పుష్యమిత్రుడు చేసిన విప్లవం మనస్మృతికి శాసన రూపం కల్పించడం ద్వారా బ్రాహ్మణ మతాన్ని స్థాపించడానికి మార్గాన్ని సుగమం చేసింది”

ఒకసారి కులాలంటూ ఏర్పడ్డాకా అవి మనుగడ సాగించడానికి శాశ్వతంగా కొనసాగడానికి ఏంచేశారో అర్థం చేసుకోవడానికి అంబేడ్కర్ ఒక ఊహాజనిత సిద్ధాంతాన్ని (హైపాథీసిస్) ప్రతిపాదిస్తారు.

“బహిర్ వివాహంపై అంతర్ వివాహ ఆపాదనం అంటే కులం పుట్టుక” అన్నది అంబేద్కర్ ప్రతిపాదన. “కులంగా మారాలనుకుంటున్న ఒక ఊహ కల్పిత సముదాయాన్ని తీసుకొని దాని లక్ష్యం నెరవేరాలంటే అది ఏ విధానాలు పాటించాల్సి ఉంటుందో కొద్దిగా విశ్లేషణ చేద్దాం. కులాంతర వివాహాలను నిషేధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా ఆ సముదాయం సాధించేదేమీ ఉండదు. ఎందుకంటే అంతర్ వివాహ పద్ధతి కన్నా ఎంతో ముందు నుంచి బహిర్ వివాహ పద్ధతి బలంగా అమలులో ఉన్నది. అంతేకాక పరస్పర సన్నిహిత సంపర్కంతో సహజీవనం సాగిస్తున్న వివిధ సాంఘిక బృందాలు ఒకదానితో ఒకటి సంబంధ బాంధవ్యాలను పెంచుకొని ఒక సమరూప సమాజంగా విలీనమైపోయేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తుంటాయి. కుల నిర్మాతలు ఈ సహజమైన ధోరణికి విరుద్ధంగా కుల నిర్మాణం దిశగా బలమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక సముదాయంలోని ప్రజలు మరొక సముదాయం వారితో పెళ్లి సంబంధాలు ఏర్పరచుకోకుండా ఒక శక్తివంతమైన పరిధిని గీయవలసి ఉంటుంది. అయితే బయట వారితో పెళ్లిను నిషేధించడం వల్ల అనేక గడ్డు సమస్యలు పుట్టుకొస్తాయి. వాటిని పరిష్కరించడం అంత తేలిక కాదు. సాధారణంగా ఏ సమూహంలోనైనా ఆడ, మగ జనాభా సమానంగా ఉంటుంది. వివాహయోగ్యులైన ఆడ, మగవారి సంఖ్య కూడా సాధారణంగా సమానంగానే ఉంటుంది. అయితే అనేక చారిత్రక ఆకస్మిక పరిస్థితుల కారణంగా వాస్తవ సమాజాలలో ఈ సమానత నియమానికి భంగం ఏర్పడుతుంది. కానీ అంతర్వివాహాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్న సమూహానికి స్త్రీ పురుషుల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగా ఉండడం అనేది అత్యంత అవసరంగా మారుతుంది. అలా సమాన సంఖ్యను నిలుపుకోవడం అనేది పరమ లక్ష్యం కూడా అవుతుంది. లేకపోతే అంతర్ వివాహ పునాది బీటలు వారుతుంది. ఒక సముదాయంలోని వారందరికీ పెళ్ళికి అవసరమైన జోడి లభించి తీరాలి. లేకపోతే వారు బయట సమూహాలలో తమ జంటను వెతుక్కుంటారు. వారిని ఆపడం ఏ కుల కట్టుబాటు తరమూ కాదు కాబట్టి కులంగా మార్పు చెందాలంటే సమూహంలో వివాహ యోగ్యమైన స్త్రీ పురుషుల సంఖ్య ఎప్పుడు సమానంగానే ఉండాలి. ఈ సంఖ్య సమానత్వాన్ని ప్రకృతికి వదిలేస్తే కుదరదు. ఎందుకంటే భార్య భర్త ఇద్దరూ ఒకేసారి మరణించినప్పుడు మాత్రమే సంఖ్యా సమానత్వం సాధ్యం. అది ఎప్పుడో ఒకసారి కానీ జరగదు. భార్య కన్నా భర్త ముందే మరణించవచ్చు. అప్పుడు ఆమె ఆ సమూహంలో అదనపు స్త్రీ అవుతుంది. ఆమెను ఎలాగో వదిలించుకోవాలి లేకపోతే ఆమె అంతర్ వివాహ కట్టుబాటును ఉల్లంఘించే అవకాశం ఉంది. అదే విధంగా భార్య ముందుగా మరణించి భర్త మిగిలినప్పుడు అందరూ ఆయనపై సానుభూతి చూపవచ్చు కానీ అదనపు పురుషుడిగా అతని వల్ల తలెత్తే సమస్య నుంచి బయట పడాలంటే అతన్ని కూడా ఎలాగో వదిలించుకోవాలి. లేకపోతే అతను కులం కట్టును ధిక్కరించవచ్చు. అలా అదనపు స్త్రీ లేదా అదనపు పురుషుడు కులానికి ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు. వాళ్ల సంగతి పట్టించుకోకుండా వారి సమస్యకు పరిష్కారం చూపకుండా వదిలేస్తే వారు కులం బయట వారితో సంబంధాలు పెట్టుకుంటారు. అంతేకాదు కులం బయటి వారి ద్వారా సంతానాన్ని కూడా పొంది కులం లోపలికి తీసుకువచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూద్దాం. మొదటిది మరణించిన భర్త చితిమంటల్లో ఆమెను కూడా కాల్చేయడం. కానీ స్త్రీ పురుషుల సంఖ్యలో వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ మార్గం ఆచరణ సాధ్యం కాని మార్గం. కొన్ని సందర్భాల్లో ఇది పనిచేయవచ్చు కొన్నిసార్లు ఇది సాధ్యం కాకపోవచ్చు. చూడటానికి ఇది అతి సులభ పరిష్కారంగా కనపడినా ఆచరణలో కష్టసాధ్యమైనది. ప్రతి అదనపు స్త్రీని ఈ మార్గంలో వదిలించుకోవడం కుదరని పని అంటే ఈ అదనపు స్త్రీ సమూహంలో ఉండిపోతుంది.

ఈమె మళ్లీ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం వితంతువు గానే ఉండిపోయేలా కట్టడి చేయడం రెండవ మార్గం. ఇది ఆచరణలో సాధ్యమైన మార్గం. చంపడం కన్నా మానవీయమైనదే కాక మళ్లీ పెళ్లి అనే సమస్యను కూడా ఇది పరిష్కరిస్తుంది. కానీ సమూహంలోపల నైతిక విలువలను ఈ మార్గం కాపాడలేదు. బలవంత వైధవ్యాల్లో స్త్రీ బతికే ఉంటుంది. ఎవరికో ఒకరికి సక్రమమైన భార్యగా బతికే సహజమైన హక్కును కోల్పోయి ఉండడం చేత అక్రమ సంబంధం అనే ప్రవర్తనకు బలం చేకూరుతుంది. అయితే ఇదేమంత గడ్డు సమస్య కాదు ఏ మగవానికీ ఆమెపై వ్యామోహం కలగని విధంగా ఆమె పరిస్థితిని దిగజార్చితే సరిపోతుంది. ఇక అదనపు పురుషుని సమస్య. భార్య చనిపోయిన మగవాడిని ఆజన్మ బ్రహ్మచారిగా ఉంచడం ఒక పరిష్కారం. సాంప్రదాయకమైన ఈ పురుషాధిక్యత వల్ల మగవారి ఇష్టా ఇష్టాలకు సముదాయాలు ఎక్కువ విలువ ఇస్తాయి. అదే స్త్రీలు మాత్రం మతపరంగా సాంఘికంగా ఆర్థికంగా రకరకాల అన్యాయమైన నిషేధాలను ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఆంక్షలు, నిషేధాలను మగవాళ్లే తయారు చేస్తారు కాబట్టి అవి అతని మీద పెద్దగా పని చేయవు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కులంలోపల అదనపు స్త్రీతో వ్యవహరించినట్టే అదనపు పురుషునితో వ్యవహరించడం కుదరని పని కాబట్టి అతనిని ఎప్పుడూ గృహస్థునిగా ఉంచడమే ఒక పరిష్కారం. అంటే కులం లోపలే అతనికి ఒక భార్యను సమకూర్చవలసి ఉంటుంది. దానికి మిగిలిన ఒకే ఒక మార్గం పెళ్లీడు ఇంకా రాని బాలికతో అతనికి వివాహం చేయడం. అప్పుడు అతను కులం లోపలే ఉండిపోతాడు. ఆడ మగల మధ్య సంఖ్యాపరమైన సమానత్వాన్ని సాధించడానికి నాలుగు మార్గాలు కనబడుతున్నాయి ఒకటి భర్తతోపాటే భార్యను కూడా కాల్చేయడం. రెండు బలవంతంగా వైధవ్యం విధించడం. మూడు భార్యను కోల్పోయిన మగవానిపై ఆజన్మ బ్రహ్మచర్యం విధించడం. నాలుగు పెళ్లీడు రాని బాలికతో అతనికి పెళ్లి చేయడం. ఈ ఆచారాలు లేకుండా అంతర్వివాహాన్ని కట్టుదిట్టంగా అమలు చేయలేరు. అంతర్ వివాహం లేకుండా కులమే లేదు8.”

బౌద్ధం భారతదేశంలో ఒక విప్లవం అనీ బౌద్ధం పై బ్రాహ్మణ మతం చేసిన తిరుగుబాటుని ప్రతీఘాతుక విప్లవం అనీ అంబేడ్కర్ విశ్లేషిస్తారు. ఈ ప్రతీఘాతుక విప్లవంలో స్త్రీల పరిస్థితిని మనువు ఎలా దిగజార్చాడో అంబేడ్కర్ మనుస్మృతిని విశేషంగా ఉటంకించడం ద్వారా వివరిస్తారు.

“స్త్రీల గురించి గురించి మనువు చెప్పిన దానిలో దిగ్భ్రాంతి కలిగించే కొత్త విషయమేమీ లేదు. భారతదేశంలో బ్రాహ్మణీయం పుట్టినప్పటినుంచీ ఉన్నవే. ఈ అభిప్రాయాలన్నీ బ్రాహ్మణులవే. మనువుకు ముందు ఇవన్నీ సామాజిక సిద్ధాంతాలు గానే ఉనికిలో ఉన్నాయి. మనువు చేసింది ఏమిటంటే సామాజిక సిద్ధాంతంగా ఉన్నదాన్ని రాజ్యాంగ చట్టాలుగా రూపొందించడం. రెండో విషయం ఏంటంటే ఈ అనర్హతలను మనువు స్త్రీలకు ఎందుకు ఆపాదించాడనేవిషయం. బౌద్ధ ధర్మం వైపు పెద్ద ఎత్తున మళ్ళడం ద్వారా బ్రాహ్మణీయ మతం పునాదులను కదిలిస్తున్నది ఆర్యసమాజంలో ముఖ్య సమూహాలైన స్త్రీలు, శూద్రులే. బౌద్ధం వైపు వెల్లువలా దూకుతున్న స్త్రీల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలనేదే మనువు కోరిక.

ఈ కారణంగానే మనువు స్త్రీలపై ఈ అనర్హతలను విధించి వారిని శాశ్వతంగా అశక్తులను చేశాడు. సందేహం ఉన్నవారెవరైనా మనుస్మృతిలో ఉటంకించిన ఈ క్రింది నిషేధాలను పరిశీలించవచ్చు.

V. 88. వర్ణ సంకరం వల్ల జన్మించిన వారికి, సన్యాసం స్వీకరించిన వారికి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారికి అంత్యక్రియలనూ కర్మలనూజరపరాదు.

V. 89. భిన్న మతాలలో చేరిన స్త్రీలకు, స్వేచ్ఛగా వ్యవహరించే స్త్రీలకు, గర్భస్థ శిశువునూ భర్తనూ గాయపరిచిన స్త్రీలకు, మద్యం సేవించే స్త్రీలకు ఈ అంత్యక్రియలు నిషిద్ధం.
ఈ నిషేధం ఇతరులతో పాటు సన్యాసం స్వీకరించిన వారిపట్లా మత భ్రష్టులైన వారిపట్లా ఎక్కుపెట్టాడు. సన్యాసుల పట్ల విధించిన నిషేధం పరివ్రాజకులను ఉద్దేశించినది. భిన్న సంప్రదాయాలలో చేరిన మహిళలు అంటే మనువు దృష్టిలో ఉన్నది బౌద్ధమతమే అనడంలో సందేహం లేదు. అందువల్ల సన్యాసులకు, మతం మారిన స్త్రీలకు అంత్యక్రియలు కర్మకాండలు జరపరాదని అన్నాడంటే అది బౌద్ధ మతం స్వీకరించిన స్త్రీ లేదా పురుషుని కుటుంబాన్ని ఉద్దేశించినదే ననేది స్పష్టమే. మరో మాటలో చెప్పాలంటే వారిని కుటుంబం నుంచి వెలి వేయాలని చెప్పడమే. మనువు బౌద్ధ మతానికి బద్ధ వ్యతిరేకి. స్త్రీలపై అనేక రకాలైన అసమానతలను గుప్పించడం వెనుక రహస్యం అదే. ఎందుకంటే కుటుంబాన్ని బౌద్ధ మతం నుండి కాపాడాలంటే స్త్రీలను అదుపు చేయాలని మనువుకు తెలుసు. అందుకే ఆ పని చేసాడు. భారతదేశంలో స్త్రీల అధోగతికి కారణం మనువుకు ఆపాదించాలి”

“మనుస్మృతిని మొదలుపెట్టడమే స్త్రీల పట్ల చాలా చులకన భావనతో మొదలుపెడతాడు.
II. 213. పురుషులను వశపరచుకోవడం (ప్రపంచంలో) స్త్రీల నైజం. ఆ కారణంగానే తెలివైన పురుషులు స్త్రీల సన్నిధిలో ఏమరుపాటుగా వ్యవహరించరు.

II. 214. మూర్ఖులనే కాదు స్త్రీలు విజ్ఞులను కూడా తప్పుదోవ పట్టించి కోరికలకు క్రోధానికి బానిసలను చేయగలరు.

II.215. పురుషుడు తల్లితో గాని, చెల్లితో గాని, కూతురుతో గానీ ఏకాంత ప్రదేశాలలో ఉండరాదు. ఎందుకంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి. అవి విజ్ఞుడిని సైతం లొంగదీయగలవు.

IX. 14. స్త్రీలకు అందంతోనూ వయసుతోను పని లేదు. మగవాడైతే చాలు. అందగాడి కైనా సరే పూర్తి కైనా సరే కురూపికైనా సరే తమని తాము అర్పించుకుంటారు.

IX. 15. పురుషుల పట్ల వ్యామోహం వల్లా చంచల స్వభావం వల్లా సహజంగానే ఉండే కర్కశత్వం వల్ల ఎంత జాగ్రత్తగా రక్షించినప్పటికీ స్త్రీలు తమ భర్తల పట్ల అవిధేయంగా ఉంటారు.

IX. 16. సృష్టికర్త వారి స్వభావాన్ని ఆ విధంగా సృష్టించాడు కాబట్టి పురుషుడు పట్టుదలతో శ్రమించి వారికి కాపలా కాయడం తప్పనిసరి.

స్త్రీలకి వ్యతిరేకంగా మనువు ఈ ఉద్దేశంతోనే చట్టాలు తయారుచేశాడు. స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వేచ్ఛగా ఉండకూడదు. మనువు అభిప్రాయంలో……..
IX. 2. స్త్రీలను పగలు, రాత్రి తమ కుటుంబంలోని మగవాళ్ళ పై ఆధారపడేలా ఉంచాలి. ఒకవేళ వాళ్లు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడితే వారిని అదుపు చేయాలి.

V. 147. బాలిక కానీ యువతి గానీ వృద్ధురాలు గానీ ఆమె సొంత ఇంట్లోనైనా సరే స్వతంత్రంగా ఏదీ చేయకూడదు.

V. 149. ఆమె తండ్రి నుండి కానీ భర్త నుండి కానీ కొడుకుల నుండి కానీ వేరు పడాలని ప్రయత్నించకూడదు. వారిని వదిలి పెట్టడం ద్వారా ఆమె రెండు కుటుంబాలకు (తనది తన భర్తది) అప్రతిష్ట కలుగచేస్తుంది. స్త్రీ కి విడాకుల హక్కు ఉండరాదు.

IX. 45. “వివాహానంతరం భార్యాభర్తలు ఒకటవుతారు. దానర్థం ఒకసారి వివాహం అయిన స్త్రీ ఇక విడిపోవడం అనేది ఉండకూడదు.”

చాలామంది హిందువులు విడాకుల విషయంలో మనువు చెప్పిన చట్టం విషయంలో ఇక్కడే ఆగిపోయి మనువు వివాహాన్ని చాలా పవిత్రంగా భావించాడనీ అందువల్లనే విడాకులను అనుమతించలేదని భావిస్తూ ఆత్మ సంతృప్తి పొందుతుంటారు. ఇది చాలా వాస్తవ దూరమైన విషయం. అతను విడాకుల చట్టం రూపొందించిన ఉద్దేశం పూర్తిగా వేరు. అది పురుషుల్ని స్త్రీకి కట్టబెట్టడం కోసం కాదు. స్త్రీని పురుషుడికి కట్టబెట్టి పురుషుని స్వేచ్ఛగా వదిలిపెట్టడానికే ఉద్దేశించినవి. ఎందుకంటే పురుషుడు తన భార్యను వదిలిపెట్టడాన్ని మనువు నిరోధించలేదు. పురుషుడు స్త్రీ ని వదిలి పెట్టడానికే కాదు అమ్మి వేయడానికి సైతం అనుమతిస్తాడు. భార్య మాత్రం విడిపోయి స్వతంత్రురాలు కావడాన్ని నిరోధిస్తాడు. మనువు ఏం చెప్పాడో చూడండి….

IX. 46. అమ్మకం వల్ల గానీ, పరిత్యజించడం వల్ల గానీ భార్య భర్త నుండి విడుదల కాజాలదు.
దీనర్థం భార్య ను అమ్మివేసినా విడిచి పెట్టినా తనను కొనుక్కున్న వారికి గాని వేరొకరికి గాని చట్టబద్దమైన భార్య కాజాలదు. దీనికన్నా దుర్మార్గం మరొకటి లేదు. మనువు తన న్యాయ సూత్రాలు రూపొందించేటప్పుడు న్యాయాన్యాయాలను గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. బౌద్ధం స్త్రీలకు అనుమతించిన స్వేచ్ఛను వారికి దక్కకుండా చేయాలని అతను తలచాడు. స్త్రీలకు స్వాతంత్రం ఉండడాన్ని మనువు సహించలేకపోయాడు. దానిని అరికట్టడానికే ఆమెకు స్వేచ్ఛ లేకుండా చేశాడు. ఆస్తికి సంబంధించి మనువు భార్య స్థాయిని ఒక బానిస స్థాయికి దిగజార్చాడు.

స్త్రీలకు మేధోపర జిజ్ఞాస కానీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛగానీ ఆలోచించే స్వేచ్ఛగానీ ఉండకూడదు. బౌద్ధం వంటి ఇతర మతాలలో చేరకూడదు. ఒకవేళ అలా చేరి మరణించేవరకూ ఆ మతంలోనే కొనసాగితే చనిపోయాక తర్పణాలు వదలకూడదు.

చివరగా జీవితాదర్శంగా మనువు స్త్రీల ముందు ఉంచిన విషయం గురించి ఒక్క మాట. అది మనువు మాటల్లో చెప్పడమే ఉత్తమం.
V. 151. తండ్రి గానీ తండ్రి అనుమతితో సోదరుడు గానీ ఆమెను వివాహబంధంలో ఎవరికి ఇస్తారో అతను జీవించి ఉన్నంత కాలం ఆమె అతనికే విధేయురాలుగా ఉండాలి. అతను మరణించాక అతని స్మృతిని అవమానపరచకూడదు. విధివంచితుడైనా వేరే చోట సుఖాలను వెతుక్కుంటున్నా, మంచి అలవాట్లు లేకున్నా విధేయురాలైన భార్య భర్తని ఎల్లప్పుడూ దైవంలాగా పూజిస్తూ ఉండాలి.

V. 155. స్త్రీలు భర్తలను వదిలిపెట్టి ఏ క్రతువులూ ఏ నోములూ ఏ ఉపవాసాలూ చేయనవసరం లేదు. భర్తకు విధేయురాలుగా ఉండడం అనే ఒక్క విషయం తోటే ఆమెకు స్వర్గం ప్రాప్తిస్తుంది.
ఈ ఆదర్శం సారాంశంగా మనువు అనేక ధర్మపన్నాలు నిర్దేశించాడు.

V. 153. పవిత్ర మంత్రాలతో వివాహం చేసుకున్న భర్త తోనే రుతుకాలంలోనూ ఋతుకాలం కానికాలంలోనూ ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆమె సుఖ సంతోషాలు ఉంటాయి.

V. 150. ఆమె ఎల్లప్పుడు సంతోషంగానూ అతని కుటుంబ వ్యవహారాలు చక్కపెట్టడంలో తెలివిగానూ గిన్నెలు శుభ్రం చేయడంలో జాగ్రత్తగానూ ఖర్చుపెట్టడంలో పొదుపరిగానూ ఉండాలి.

ఇవీ హిందువులు స్త్రీలకు చూపించిన గొప్ప ఆదర్శం!!!
స్త్రీల అనర్హతల గురించి మనువు నిర్మించిన ఈ కట్టడానికి గోపురం లాంటి మరొక చట్టాన్ని ప్రకటించాడు. అది స్త్రీలను చంపడం ఉపపాతకమే అంటే చిన్న నేరం అన్నాడు. తాగడం, స్త్రీలను, శూద్రులను, వైశ్యులను, క్షత్రియులను, నాస్తికులను చంపడం కూడా చిన్నపాటి నేరాలే. శూద్రులను వైశ్యులను క్షత్రియులను చంపడం ఉపపాతకములు అని మనువు ఎందుకన్నాడో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణులు వీరందరి కంటే ఉన్నతులు అని నిరూపించదలుచుకున్నాడు. అందువల్ల బ్రాహ్మణుడ్ని చంపడం “మహాపాతకం” అన్నాడు. మరి ఇదే విషయం స్త్రీలకు ఎందుకు అన్వయించలేదు? ఎందుకంటే మనువు దృష్టిలో స్త్రీ ఏ విలువా లేనిది.10”

స్త్రీల ప్రతి చిన్న కదలికనీ నియంత్రించేలా శాసనాలు రాయడం వల్ల స్త్రీలకూ పురుషులకూ కూడా అవి నరనరానా జీర్ణించుకుపోయి ఒక బలమైన భావజాలంగా స్థిరీకరించుకుపోయాయి. “శూద్రుల గురించీ, మహిళల గురించీ మనుస్మృతి పేర్కొన్న ఆదేశాల ముద్ర హిందూస్థాన్ లోని పితృస్వామిక సంస్కృతి పై ఉంది. తద్వారా సమాజం స్త్రీల సాధికారత అనే భావనలకు దూరంగా ఉండిపోయింది”11.

స్త్రీల సాధికారత గురించి అంబేడ్కర్ అభిప్రాయాలు12:
1938లో ఒక విద్యార్థి బృందంతో మాట్లాడుతూ “స్త్రీ ఒక వ్యక్తి. అందుకే ఆమెకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి” అని ప్రకటించారు.

“చిన్న వయసులోనే పెళ్ళి చేసి తల్లిదండ్రులు పిల్లల జీవితాలను పాడుచేయకూడదు. తన భార్య కాబోయే వ్యక్తి విషయంలో భర్తలకి ఎలా ఎంపిక స్వేచ్ఛ ఉంటుందో అలాగే తన భర్తను ఎంచుకొనే విషయంలో ఆడపిల్ల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి”.

1942 లో జరిగిన మహిళా పరిషద్‌లో కొన్ని విషయాల గురించి ఆయన నొక్కి చెప్పారు. “ఆడపిల్లకి, మగపిల్లలకీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కుదర్చకండి. ముందు వాళ్ళని ఆర్థికంగా స్వతంత్రులు కానివ్వండి. ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్లే వచ్చే అనర్థాల గురించి వివరించండి. పెళ్ళి అనేది ఒక ఆడపిల్ల ఎదుగుదలకి అడ్డంకి. ఆమె పై పెళ్ళిని రుద్దకండి. పెళ్లి తరవాత ఆమె తన భర్తకి స్నేహితురాలిగా, సమానహక్కులున్న ఇల్లాలిగా ఉండాలి. ఆమె తన భర్తకు బానిసగా మారకూడదు”.
“మీ జీవితం ఎంత కష్టభూయిష్టమైనదైనా సరే మీ కొడుకులనూ కూతుళ్లను బడికి పంపండి. ఇంట్లోని మగవాళ్ళు చచ్చిన గొడ్డు మాంసం తీసుకువస్తే ఖచ్చితంగా వ్యతిరేకించండి. మీ బట్టలు చిరిగిపోతే వాటిని వేసుకొనేముందు కుట్టుకొని, ఉతికి వేసుకోండి. సవర్ణ కులాల మహిళలకూ మీకూ మధ్య ఎటువంటి తేడాలూ కనపడకూడదు. ఈ మాత్రం చేసినా సరే మన కులాలను విముక్తి చేయడంలో మీరు ముఖ్యమైన పాత్ర నిర్వహించినట్టే.”

పేదరికం, ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కలిగి ఉండడం తమ జాతిని వేగంగా అభివృద్ధి చెందకుండా నిరోధిస్తాయని గుర్తుచేశారు.

“ఒక్క బిడ్డనైతేనే సరిగ్గా పెంచగలం. తక్కువ మంది పిల్లలుంటే స్త్రీలు పిల్లల్ని కనే భయంకరమైన బరువు నుండి విముక్తమై ఇతర కర్తవ్యాలకోసం తమ శక్తిని వినియోగించగలుగుతారు.”
దళితులపై సవర్ణులు చేసే దాడులను ఎదుర్కోవడానికి వారు శారీరకంగా దృఢంగా ఉండాలనీ, మల్ల యుద్ధం, కర్ర సాము వంటి విద్యల్లో నిపుణులు కావాలని బోధించారు. దళితవాడల్లో అటువంటి విద్యలు నేర్పే వారి కోసం తిరిగారు. అటువంటి విద్యలను నేరుస్తున్న మహిళా కార్యకర్తలని అభినందించి ఆదర్శంగా చూపించారు. స్త్రీలు కీలక పాత్ర వహించినపుడే సమాజం ముందుకుపోతుందని బలంగా విశ్వసించారు.

రెఫరెన్స్:
1. కులాల పుట్టుక- (మొదటి సంపుటి)
2. కులాల పుట్టుక – (మొదటి సంపుటి)
3. హిందూస్త్రీ ఉత్థాన పతనాలు –అందుకు బాధ్యులెవరు (7వ సంపుటి), (ఫెమినిస్ట్ అంబేడ్కర్,ఆగష్టు 2019, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ )
4. హిందూస్త్రీ ఉత్థాన పతనాలు –అందుకు బాధ్యులెవరు (7వ సంపుటి), (ఫెమినిస్ట్ అంబేడ్కర్)
5. స్త్రీలు-ప్రతీఘాతుక విప్లవం (మూడవ సంపుటి), ఫెమినిస్టు అంబేడ్కర్
మహిళల గురించి బాబాసాహెబ్ అభిప్రాయాలు – మేము కూడా చరిత్ర నిర్మించాం-ఊర్మిళా పవార్, మీనాక్షీ మూన్ మే 2023, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (ఫెమినిస్ట్ అంబేడ్కర్)
6. బ్రాహ్మణ మత విజయం –(మూడవ సంపుటి)
7. కులాల పుట్టుక – (మొదటి సంపుటి)
8. హిందూస్త్రీ ఉత్థాన పతనాలు-అందుకు బాధ్యులెవరు? (ఏడవ సంపుటి), (ఫెమినిస్ట్ అంబేడ్కర్)
9. స్త్రీలు-ప్రతీఘాతుక విప్లవం (మూడవ సంపుటి), ఫెమినిస్టు అంబేడ్కర్
10. మహిళల గురించి బాబాసాహెబ్ అభిప్రాయాలు – మేము కూడా చరిత్ర నిర్మించాం-ఊర్మిళా పవార్, మీనాక్షీ మూన్ (ఫెమినిస్ట్ అంబేడ్కర్)
11. మహిళల గురించి బాబాసాహెబ్ అభిప్రాయాలు – మేము కూడా చరిత్ర నిర్మించాం-ఊర్మిళా పవార్, మీనాక్షీ మూన్ (ఫెమినిస్ట్ అంబేడ్కర్)

కథా రచయిత, అనువాదకురాలు, యాక్టివిస్ట్.

Leave a Reply