సాక్ష్యం

భూమి ఎంత అందమైనదో
ఎన్నెన్ని పురిటి నొప్పులను మోసిందో
చిత్రపటాలు కాదు
ఆదివాసీ జీవన విధానమే సాక్ష్యం

భూమి కింద
ఖనిజాలు ఉన్నాయని చెప్పడానికి
ఛాయాచిత్రాలు కాదు
పంటభూమిలో తల్లిఒడిలో పసిపాప గుండెల్లో
బులెట్టు దిగిన శబ్దమే సాక్ష్యం

భూమిపై మానవ హననం జరుగుతుందని
గాలిలో తిరిగే డ్రోన్లు కాదు
పసిపాపల కనుల నుండి రాలుతున్న
కన్నీటి ధారలే సాక్ష్యం
రక్తం మడుగులో నిండిన
బియ్యం గింజలే సాక్ష్యం

రాజు గారి గుర్రం మీద
బురదజల్లిందెవరో నాకు తెలియదు
రాకుమారుడి ఆపిల్ పండును
దొంగిలించిందెవరో నాకు తెలియదు
కనుల మీద కలల మీద
కంచెలను అల్లినవారు తెలుసు
పిల్లల మీద అమ్మల మీద
ఉలితో చెక్కిచంపిన ఆ చేతులెవ్వరివో తెలుసు
రాజుల పాద ముద్రలు కాదు
అహం నిండిన గుర్రాలు, బుల్డోజర్లు కాదు
నాకు తెలుసనడానికి
మనిషి మీద మనిషికి
బూడిదవ్వని ప్రేమలే సాక్ష్యం.

పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం  ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ చదువుతున్నాడు.

Leave a Reply