దండాలు బాబయ్యా…
మాకోసమే పుట్టావు నాయనా
మా కోసమే ఊపిరిడిశావు నాయనా
ఆ మద్దెన నీ నడకంతా
అడవి తల్లి పేగుల్లో నెత్తుటి పరవళ్ళేనయ్యా…
ఏ తల్లి బిడ్డవో మాకేం దెలుసు
దిక్కులేని మా కోసం
దేశమే నిన్ను కన్నదేమో తండ్రీ
ఎంత కరుణ నీదయ్యా…
ఎంత గొప్ప జన్మమయ్యా
నీ కనికారం చూపులు జూసి
చుక్కలు తల దించుకున్నాయి
నీ మమకారం మనసు జూసి
మృగాలు దారి తప్పుకున్నాయి
నీ నడక తప్పో ఒప్పో మాకేం దెలుసు బిడ్డా
మంది కోసం మరణం వైపు నడిచినోడివి
పంచభూతాలు ఆయుధాలైన చోట
ఆయుధానికి పుట్టుకేంటి చావేంటి
పోయిరా నాయనా
ఈ కొండలు… ఈ లోయలు
ఈ సెలయేళ్లు… ఈ చెట్లు… ఈ పక్షులు
డేగలతో ఢీకొట్టినప్పుడు
ఆ భయంకరమైన చప్పుడు
మూతపడని నీ కనురెప్పలదే అనుకుంటాం
సలాం నాయనా సలాం…