సమ్మక్క-సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతరా
స్వయంపాలన యాతరా
మేడారం కోయదొరల
వనరాజ్యం ఖ్యాతిరా || సమ్మక్క ||

అది చిలుకల గుట్ట అడివిరా – ఆడ
చిలుకలు సాము జేసురా
పులుసు వాగు పూనుగొండ్లరా – ఆడ
పడిగిద్దరాజు పుట్టెరా
సంపెంగ వాగు వంకరా – అది
జంపన్నగా పారుతుండెరా
ఏడు గొట్లయి రగిలి
గుట్ట తనువై మిగిలి
మేడారమే కొలువు
పోరాటపు నెలవు || సమ్మక్క ||

అది అడ్వితల్లి గుండె గూడెము – సూడు
ఆడమగలంత సైన్యమూ
పోడుగొట్టి చేసే ఎవుసమూ – ఆడ
వానపడ్తానే ఫలితమూ
కాయకష్టం మింగె కరువురా – కోయ
బతుకులాడ బరువురా.
కరువులో కప్పం గట్టాలంటూ
కాకతీయులే కాలు దువ్వితే
కన్నెపల్లెలో మాటేసి
కొండ కోనలతో చుట్టేసి || సమ్మక్క ||

మన అమ్మల రాజ్యమొకటుండెరా – అది
లోకమంతా విలసిల్లెరా
అది ఆత్మగౌరవాల బాసరా – అది
ఆకలి పేగుల కేకరా
బండారు వర్ణాల కొండరా నొసట
మంకెన పూల బొట్టురా
సిగలో ఎన్నెల బెట్టి
సిల్ల చేతుల బట్టి
పరుల పాలనపైన
పౌరుషము నెగజల్లి || సమ్మక్క ||

ఆడ ఉసికేబోస్తె రాలదెందుకు – నీతి
మనుషులా త్యాగమైనందుకు
అడివిమాదనే ప్రకటనెందుకు – ఆది
వాసుల సొత్తయినందుకు
శ్రమజీవులా పోరాటమెందుకు విశ్వ
మంతా శ్రమదైనందుకు
మూలవాసుల మీద
జులుము చెల్లదంటు
కొమురం భీములా
రామ్ గోండులా || సమ్మక్క ||

ఇది పోరాట చరితల జాడరా – ఈడ
ప్రతిన దప్ప ప్రతిమలొద్దురా
నిండు ప్రాణాలు బాణంగా దూసిరా – జువ్వి
చెట్టుకు త్యాగాలు దాసిరా
గుండె గుండెల్లోన గుడులురా – గుడి
బ్రాహ్మణ పూజారులొద్దురా
గట్టుదాటి వలస
ముట్టడించొస్తుంది
అడివి బిడ్డల్లార పయిలమూ
అందుకోండ్రమరుల బాణము

సమ్మక్క సారక్క జాతరా
స్వయం పాలన యాతరా
కోడి బెల్లాలెదురేసి
కొండోల్లు కోయోల్లు పిల్సిరా
కొండోల్లు కోయోల్లు పిల్సిరా

(సమ్మక్క సారలమ్మ నుండి – బిర్సాముండా, కోమురంభీం – రాంజీ గోండు ఆదివాసుల వనరాజ్యం కోసం దీక్షతో పోరాడిన ఆదివాసీ అమరులకు జోహార్లర్పిస్తూ…)

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply