ఆకాశానికి నిప్పంటుకుంది
నక్షత్రాలు పక్షులై ఎటో ఎగిరిపోయాయి
ఇక సమయం లేదు పద
మిగిలిన ఆ ఒక్క చందమామ ఉరితాటికి వేలాడక ముందే పద
పర్వతాలూ కూలుతున్నాయి
భూమి మహా సముద్రంలో
సగం మునిగింది
సమయం లేదు పద
వెలుగులు మసకబారిన సూరీడు
మంచు ముద్దయి గడ్డకట్టక ముందే
పద సమయం లేదు పద
కురిసిన ధూసర వర్ణపు బూడిద వర్షంలో
విరిగిపడి ఇంద్రధనుస్సు వెలియక ముందే
పద, సమయం లేదిక పద
మనం అనేకులం అయితేనేం ఒక్కటై
కదం తొక్కుదాం
పద, పద పద
సమయం లేదిక పద
మన ఊపిరిలూది భగ భగ రాజేసిన సూర్యుడిని
ఎగరేద్దాం గాలిపటం చేసి ఆకాశంలో
పద,పద సమయం లేదిక పద
పిలువిక, పిల్లలని వాళ్ళ నవ్వులనీ
ఆ నవ్వులే వాన చినుకులై
తగల బడే ఆకాశాన్ని ఆర్పేస్తాయి
పద సమయం లేదిక పద
చిరకాపు స్వప్నం కోసం,
స్వేచ్ఛ జీవన లోకం కోసం
యుద్ధంలో మరణించిన
యుగ యుగాల యోధుల్లారా
సాదా సీదా మనుషుల్లారా
మా కోసం తిరిగి రండిక
కుంగిన ఈ నేలని పైకి లేపుదాం కలిసి
పద సమయం లేదిక పద
మన నాలుకలు, చేతులు తెగ నరకక ముందే
మన మరణానికి ముందే
మనకై కట్టిన సమాధులన్నీ కూల్చే
వెరుపెరుగని ధీక్కార గీతం పాడుదాం
పద, పద సమయం లేదిక పద
పద, పద సమయం లేదిక
సమయం లేదిక పద
Excellent