సమకాలీన ప్రాధాన్యం కలిగిన పరిశోధన

1980– 90 ల నడుమ తెలుగు సాహిత్యరంగంలో, ముఖ్యంగా కవిత్వంలో స్త్రీల కంఠాలు బలంగా వినబడడం మొదలైంది. సామాజిక, రాజకీయ రంగాలన్నిటిలోని  పితృస్వామ్య ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, స్త్రీల దృక్కోణం నుండి వాటిని పునర్నిర్వచిస్తూ ఒక ప్రభంజనంలా ముందుకు వచ్చింది  స్త్రీవాద సాహిత్యం. అందులోనూ కవిత్వానిది మరింత ఉధృతి.

ఆ సమయంలో ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ కవితా సంపుటితో సాహిత్యావరణాన్ని ముంచెత్తింది విమల కవిత్వం. విప్లవోద్యమం లోనూ, విప్లవ సాహితోద్యమం లోనూ ఆమె క్రియాశీల కార్యకర్త. విమల రాస్తున్నది విప్లవ కవిత్వమా, స్త్రీవాద కవిత్వమా, అని అప్పట్లో చర్చలు జరగటం నాకు గుర్తే. నిజానికి ఆ రెండు పాయలకూ ఒక విలువైన చేర్పు ఆమె కవిత్వం. స్త్రీల పోరాటాలు సామాజిక విముక్తి పోరాటాల్లో భాగంగా సాగాలని చెబుతూనే, విప్లవోద్యమ ఎజెండాలో స్త్రీల విముక్తికి ఎంత ప్రాధాన్యం ఉండాలో కూడా ఆమె కవిత్వం బలంగా చెప్పింది. ఆమె కవితా శిల్పం లోని ప్రత్యేకమైన నిర్మాణం, విలక్షణమైన డిక్షన్ విప్లవ, స్త్రీవాద కవిత్వాలకు అదనపు సౌందర్యాన్ని తెచ్చాయి.

తొలి కవితా సంపుటి తరువాత ‘మృగన,’ ‘వగరు జ్ఞాపకాల నవ్వు’ కవితా సంపుటులు, ‘కొన్ని నక్షత్రాలు, కాసిన్ని కన్నీళ్ళు’ అనే కథా సంపుటి కూడా తెచ్చింది విమల. ఆమె తొలినాటి కవిత్వానికీ, తరువాతి రచనలకు సాహిత్య వస్తువుల్లో స్పష్టమైన తేడా కనబడుతుంది. తొలినాళ్లలోని ఉత్తేజకరమైన స్వరం, విషాదాల చేదుపాటలను అనివార్యంగా ఆలపించాల్సి వచ్చింది. దీనికి కారణాలను కవి జీవన ప్రయాణంలో మాత్రమే వెదకటం పొరబాటవుతుంది. ఆమె ప్రాతినిధ్యం వహించిన ఉద్యమాల్లో, సామాజిక సంబంధాల్లో వచ్చిన ప్రతికూల పరిణామాల ప్రతిధ్వనులే ఆ మార్పులు. నిజానికి అవి ఒక సమూహానికి ఎదురైన అనుభవాలే తప్ప, విమల అనే వ్యక్తికి  పరిమితమైనవి కూడా కాదు.

ఆ ఆటుపోట్లను గుర్తించి, పరిశీలించి, వాటిని ఎదుర్కొనే మార్గాలను తెలుసుకోటానికి విమల పడిన ఘర్షణకు, వెదుకులాటకు ఆనవాళ్లు ఈ రెండోదశ లోని ఆమె రచనలు. 1990 నుండి, ఇవాల్టి వరకూ విమల చేసిన రచనలను పరిశీలించటమంటే, ఆ కాలం వెంట సాగిన ఉద్యమాల, వాటిలోని భాగస్వాముల సంఘర్షణను పరిశీలన చెయ్యటమే.

ఆసక్తికరమైన ఈ పనిని తన పరిశోధనాంశంగా ఎన్నుకున్నది పల్లపు స్వాతి. విమల ఉద్యమ– సాహిత్య క్రమాల నడుమ సంబంధాన్ని, ఆమె రచనల లోని రూప, సారాలనూ వివిధ అధ్యాయాలుగా, ఉప విభాగాలుగా విభజించి పరిశీలించింది. కవిత్వంలోనూ,వచనం లోనూ విమల సాధించిన ప్రత్యేకతలను సూక్ష్మ పరిశీలన చేసింది. భాషా ప్రయోగాల్లోని వైవిధ్యాన్ని గుర్తించి చూపింది.

నిజానికి వీటిలోని కొన్ని అంశాలు మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం కలిగినవి. అయితే, ఈ సిద్ధాంత గ్రంథం పరిమాణానికున్న పరిమితి దృష్ట్యా అది కష్టమైన పని. తనకున్న అవకాశాల మేరకు విలువైన కృషి చేసింది స్వాతి. విమల సాహిత్యంపై స్థూలమైన అవగాహనకు ఈ పరిశోధన ఒక మంచి ఆధారంగా నిలబడుతుంది. అందుకు ఆమెను అభినందించాలి.

ఈ సిద్ధాంత గ్రంధంపై నా ఆసక్తికి ఒక వ్యక్తిగత కారణం కూడా ఉంది. 1990 లో , హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి  నా ఎం. ఫిల్. పరిశోధనాంశంగా ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ని తీసుకోటానికి అక్కడి తెలుగు డిపార్ట్మెంట్ తో ఒక యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. కె కె ఆర్ గారి ప్రోత్సాహం, మద్దతు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదేమో. ఆ జ్ఞాపకాలలోకి , మరొకసారి విమల సాహిత్య అధ్యయనంలోకి తీసుకువెళ్లింది ఈ పరిశోధనా పత్రం.

సమకాలీన ఉద్యమాలపై, సాహిత్య రీతులపై ఆలోచనకు ఆస్కారం ఇచ్చే ఈ అంశాన్ని ఎన్నుకున్న స్వాతి, పరిశోధనా రంగంలో మరెంతో ముందుకు నడవాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు.
                     

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply