సంస్కృతీ కేత‌నం విర‌సం

అనేక నిర్బంధాల మ‌ధ్య విర‌సం త‌న 28వ మ‌హాస‌భ‌లు నెల్లూరులో జ‌న‌వ‌రి 8,9 తేదీల్లో జ‌రుపుకోబోతోంది. న‌క్స‌ల్బ‌రీ సాంస్కృతిక ప‌తాకంగా విర‌సం సాహిత్య‌, మేధో రంగాల్లో ప‌ని చేస్తున్న‌ది. విప్ల‌వంలో సంస్కృతి త‌న కార్య‌రంగం అని ప్ర‌క‌టించుకుంది. ఆరంభం నుంచి సాహిత్య క‌ళా సాంస్కృతిక రంగాల్లో వ‌ర్గ‌పోరాట పంథాను ప్ర‌చారం చేస్తోంది. 

ఈసారి సంస్కృతి-మార్క్సిజం అనే థీమ్ మీద స‌భ‌లు జరుపుకుంటోంది. సంస్కృతి అనేది ఇవాళ అతి పెద్ద సంక్షోభంలో చిక్కుక‌పోయింది. దాన్ని అర్థం చేసుకోడానికి చాలా కొత్త ర‌కాలుగా ప్ర‌య‌త్నించాలి. ఇందులో భాగంగానే విర‌సం ఈ స‌భ‌లు నిర్వ‌హిస్తోంద‌ని ఆశింవ‌చ్చు. 

సంస్కృతిని మార్క్సిస్టు ప‌ద్ధ‌తిలో ప‌రిశీలించ‌డానికి ఈ స‌భ‌లు దోహ‌దం చేస్తాయి. సంస్కృతిలో తిరోగ‌మ‌న శ‌క్తులు ఇవాళ బ‌లంగా ఉన్నాయి.  సంఘ్‌ప‌రివార్  భార‌తీయ సంస్కృతి అనే పేరుతో ఫాసిజాన్ని తీసుకొచ్చింది. ప్ర‌గ‌తిశీల ఆలోచ‌న‌లు ఉన్న‌వాళ్లంద‌రూ ఇవాళ అనివార్యంగా భార‌తీయ సంస్కృతిని వ్య‌తిరేకించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

సమాజంలో మార్పును అడ్డుకోవ‌డంలో భార‌తీయ సంస్కృతి పేరుతో స‌నాత‌న సంస్కృతి చాలా పెద్ద ఎత్తున ప‌ని చేస్తున్న‌ది.  పాల‌క‌వ‌ర్గ సంస్కృతికి  యథాతధ స్థితిని కొనసాగించే ల‌క్ష‌ణం ఉంటుంది. అణ‌చివేత‌, దోపిడీ కొన‌సాగ‌డంలో  సంస్కృతి పాత్ర చాలా ఉంది.  సంస్కృతి అనేక  సామాజికాంశాల ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. వాటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకే సంస్కృతీ అధ్యయనం సామాజిక విశ్లేషణలన్నిటినీ ఆక్రమించి ఉంటుంది.  

ఇవాళ మారుతున్న రాజకీయార్థిక, సాంస్కృతిక  పరిస్థితులు  సంస్కృతికి ఉండే ఈ ఆధిప‌త్య స్వ‌భావాన్ని మ‌రింత పెంచింది.  సంస్కృతి ఫాసిజంగ మారింది. సంఘ్‌ప‌రివార్ సాంస్కృతిక జాతీయ‌వాదం అని దానికి ముద్దు పేరు పెట్టుకున్న‌ది.   

ఈ నేపథ్యంలో వర్గపోరాటం గీటురాయిగా మార్క్సిస్టు సిద్ధాంత పునాది మీది  సంస్కృతి అధ్యయనాన్ని తీవ్రం చేయవలసి ఉన్నది.  అనేక సామాజిక సిద్ధాంతాలు సంస్కృతి కేంద్రంగా ఇటీవ‌ల అభివృద్ధి చెందాయి.  సామాజిక సంబంధాలు, నాగ‌రిక‌త‌,  వ్య‌క్తి నిర్మాణం, ఆధునిక‌త వంటి  ఎన్నో కోణాల్లో సంస్కృతీ సిద్ధాంతాలు ఉన్నాయి.  

అవి మ‌న దేశంలోని సంస్కృతీ సంక్షోభాన్ని అర్థం చేసుకోడానికి  ప‌నికి వ‌స్తాయి.      రోజువారీ  సాంస్కృతిక విషయాలు, అనుభవాలు, పాల‌క‌వ‌ర్గం సంస్కృతిని వాడుకుంటున్న తీరు మొద‌లైన‌వి కూడా ఈ అధ్య‌య‌నం భాగం కావాలి.  

భార‌తీయ సంస్కృతి అన‌డేదానికి  ఈ ఆధిక్య స్వ‌భావం   కుల వ్య‌వ‌స్థ నుంచి, వ‌ర్ణాశ్ర‌మ ధ‌ర్మాల నుంచి వ‌చ్చింది. దీనికి దోపిడీ ఉత్ప‌త్తి వ్య‌వ‌స్థ అండ‌గా ఉంది. పాల‌క‌వ‌ర్గ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో దోపిడీ ఉన్న‌ట్లే సాంఘిక సాంస్కృతిక రంగాల్లో ఆధిక్య‌త ఉంటుంది.   

కులం, పితృస్వామ్యం అనే పునాదుల మీద మ‌న నాగ‌రిక‌త ఉన్న‌ది. ఇక్క‌డి నుంచి సంస్కృతికి ఆధిక్య స్వ‌భావం వ‌చ్చింది. ఆ త‌ర్వాత కులం అనేది హిందూ మ‌తంగా మారింది. 

కుల వ్య‌వ‌స్థ‌లోని అంత‌రాల నిర్మాణం, దాన్ని బ‌ల‌ప‌రిచే భావ‌జాలం అంతా చాలా క‌లిసి సంస్కృతి సంక్లిష్ట‌మైన విష‌యంగా మారింది. మ‌న దేశంలో సంస్కృతికి  అస‌మాన‌త‌లు అనేది కేంద్రం. 

చారిత్రక భౌతికవాదాన్ని మానవ సమాజ చరిత్రను వివరించే శాస్త్రీయమైన సిద్ధాంతం.  అందులోని పద్ధతిని వినియోగించి చరిత్రలోని అన్ని సామాజిక విషయాలను వివరించగలం. అప్పుడే చారిత్రక భౌతికవాద పద్ధతిలో సాంస్కృతిక సిద్ధాంతాన్ని  రూపొందించడానికి వీలవుతుంది. 

సాంస్కృతిక ఆధిక్యాల స్థూల రూపాలను, స్థూల పనితీరును పరిశీలించినంత మాత్రాన సరిపోదు. వాటి సూక్ష్మ రూపాల మీద కేంద్రీకరించాల్సి ఉంది. భారతదేశంలోని సంస్కృతీ సంక్లిష్టతల్లో ఇదొక ముఖ్యమైన విషయం. సాంస్కృతిక ఆవరణ అంటేనే అనేకానేక సూక్ష్మరూపాల ఆధిపత్య ప్రపంచం.   సంస్కృతి కూడా ఒకానొక  భౌతిక ఉత్పత్తి  కాబట్టి అది నిరంతరం ప్రజల ఆచరణలో   పునరుత్పత్తి అవుతుంటుంది. అంతసాంకంటే లోతుగా ప్రజల ఆలోచలనల్లోంచి,  మనసుల్లోంచి  పునరుత్పత్తి అవుతుంటుంది. వర్తమాన పరిస్థితుల్లోని అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల వల్ల మారుతున్నట్లు కనిపిస్తుంది.  కొత్త రూపాల్లో పుడుతున్నట్లనిపిస్తుంది. వాస్తవానికి ప్రజల మనో ప్రపంచంలోని లోతైన వేళ్ల నుంచి అది విజృంభిస్తుంటుంది.   జనామోదంలో శక్తివంతమవుతుంటుంది. ఆ రకంగా ఆధిక్యత ఒక సహజ విషయంగా మారుతుంది.  అసమ సమాజ చరిత్ర పొడవునా  సంస్కృతి ప్రధానంగా ఆధిక్య లక్షణంతోపాటు  ప్రతికూల లక్షణంతో కొనసాగుతూ వచ్చింది. ఇది ఆయా కాలాల్లో పాలకవర్గ అధికారం సుస్థిరంగా ఉండటానికి దోహదపడిరది. దోపిడీ వ్యవస్థలకు రక్షణ కవచంగా పని చేసింది.

విర‌సం ఇప్ప‌టి దాకా త‌న‌కు ఉన్న సాంస్కృతిక అనుభ‌వాల‌ను, అవ‌గాహ‌న‌ల‌ను ఇవ్వాల్టి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అభివృద్ధి చేయాల్సిన బాధ్య‌త ఉన్న‌ది. విప్ల‌వం కోసం ప‌ని చేసే  సాహిత్య సంస్థకు ఇంత‌కంటే వేరే క‌ర్త‌వ్యం ఏముంటుంది?

Leave a Reply