శాంతమ్మ సమరగాథ (శాంతి-సమరయోధుల పాట)

సాకి :
వినవే వినవే ఓ భారతి
వింటే బిడ్డల త్యాగనిరతి
కనవే కనవే ఓ భారతి
కంటే త్యాగాల నీ కారతి
ఓ…. ఓ భారతీ/నీ కారతి
ఓ…. ఓ భారతీ/నీ కారతి
ఓ…. ఓ భారతీ/నీ కారతి
ఓ…. ఓ భారతీ/నీ కారతి

పల్లవి :
నా పేరు పేదల శాంతమ్మా
నా ఊరు తెలుగు నేలమ్మా
కూలి రైతులతో నా బంధమూ
అన్నార్తుల వెంటే నా పయనము
నేగన్న కలలల్లో నా దేశము
సమతలై పండగ నా పంతము
దాటితి నదులెన్నో రాష్ట్రాలు ఎన్నో
తిర్గితి అడవులు గ్రామాలు అన్నీ

అనుపల్లవి :
లోకమే అమ్మా
శోకమే అమ్మా
ఎల్లలే ఎరుగని
త్యాగమే అమ్మా
కష్టాలె గుండెలో
దాచితివి అమ్మా
కల్లోల సంద్రాలు
దాటిస్తివమ్మ

                 ||నా పేరు||

1)
నే కన్న కొడుకులు ఐదుగురు
ఆహుతయ్యరా ఆ నలుగురు
ఒళ్ళంతా జల్లెడై మీ తనువులు
కళ్ళల్లో ఆరని నవ కాంతులు
జనమే మిమ్ము పంచ పాండవులంటే నేనెంత ముర్సిపోతి
అమరులై నల్గురు ఆరని కన్నీళ్లు నేనెంత కుమిలి పోతి

                        ||లోకమే||

2)
తెల తెల్ల పువ్వుల్ల స్వచ్ఛంగా
తెల్లారగా వచ్చే సూర్యునిలా
చీకట్లు చీల్చిన వెన్నెలగా
తళతళ మెరిసే తారలుగా
నల్గురి ఊసై పూసిన మనసులో మల్లెల్ని చూపాలా
నెలకు అంటీ మొల్సిన విత్తుల గుత్తుల్ని చూపాలా

3)
గుండెనే గూడుగా జేసూకొని
సుడిగుండాలన్నీ దాటూకొని
రెక్కలే డాలుగా చేసూకొని
కాళ్ళకే చక్రాలు కట్టూకుని
యాడికెళ్ళినా సల్లంగుండమని దీవెనలిచ్చితినో
ప్రాణాలు లేని దేహంబులనిస్తే ఘోల్లు ఘోల్లు ఏడ్చితినో

4)
నా వెంకటేషుడే రియాజన్న
హరగోపాలే రామకృష్ణ
నరసింహచలం సుధాకర్
గాజర్ల రవియే గణేషన్న
ఎంతని చెప్పను నలుగురి లక్ష్యం ప్రజలపైనే ప్రేమని
నా స్వంతం అంటూ ఏమీలేని జన చింతనాపరులని

5)
ఖనిజ సంపదనంతా దోసేటోడు
అడవి బిడ్డల తరిమివేసేవాడు
శాంతి చర్చలు లేవు పొమ్మండు
నిర్మూలనకే సయ్యండూ
నలుగురు అడిగిన న్యాయాన్నిప్పుడు గేయంగా పాడుతాను
నా బిడ్డలాయుష్షూ ఆదివాసులకు ప్రాణంగ బోస్తాను

నా పేరు పేదల శాంతమ్మ
మారుపేరు నవభారతమ్మా
శాంతికై సమరాన్ని ముద్దాడ్తిని
జన విముక్తికై తండ్లాడితిని

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply