శవయాత్ర

శవయాత్ర చుట్టూ ఫైరింజన్లు
ఎప్పుడైనా మంటలు లేచి నలువైపులా
దావానలంలా వ్యాపించవచ్చని ముందుజాగ్రత్త
లాఠీల మధ్య శవ ఊరేగింపు
ఎప్పుడైనా బాహుబలి లేచి
వ్యవస్థపై తిరుగుబాటు చేయవచ్చని ముందుచూపు
పోస్టుమార్టంలో
పనికొచ్చే అవయవాలన్నీ తీసేసుకుని ఖననానికి బయలుదేరింది
ఇతరులకు మార్పిడి చేస్తే
మరో యోధుడు పుట్టుకొస్తాడని

నక్సలైట్లు దేశభక్తులని
నక్సలైట్ల ఎజెండాయే నా జెండాని
ప్రకటించిన ప్రభుత్వాలు
బందోబస్తు పేరిట శవయాత్ర చుట్టూ నిఘా పెట్టింది
కలివిడిగా కలసి నడుస్తున్న వారిపై కన్నేసింది
పెదవులు దాటి వస్తున్న మాటలపై చెవేసింది
కలసి పనిచేసినవారు మప్టీలో రావచ్చని డ్రోన్లను వదిలింది
అనుమాన వ్యక్తులను చూపులో బంధించింది
దహనసంస్కరణల తంతును కెమెరాలో భద్రపరిచింది
శాంతిభద్రతలకు విఘాతం కలుగలేదని ఊపిరి పీల్చుకుంది

తూట్లుపడిన పల్చటి తోలు కప్పుకున్న
అస్తిపంజరపు శవాన్ని ఊరేగిస్తున్నారు
శవయాత్ర పొడువునా
అట్టడుగువర్గాల కన్నీటి చుక్కల పూలవర్షం
భావాలు పంచుకున్న మేధావుల అక్షరాలు
న్యాయం అందిన చేతుల దండాలు
టపటప నాలుగు చినుకులు రాలుస్తూ
ఆకాశం ప్రకటించిన సానుభూతి
మౌనంగా మంద్రంగా వీస్తూ గాలి సంతాప సందేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో పనిచేసి రిటైర్ అయ్యారు. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్. 360 డిగ్రీస్‘ పేరుతో వ్యాస సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల వారీగా సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్ర రాస్తున్నారు.

One thought on “శవయాత్ర

Leave a Reply