మారుతి హాలంతా కలియదిరుగుతున్నాడు. కన్పించిన వాళ్లందర్నీ పేరుపెట్టి మరీ పలకరిస్తున్నాడు. మారుతి వల్లే హాలంతా సందడిగా వుంది. తెలుగు కన్నడ భాషలు రెండూ కలగలిసిన మాటలతో సంగీతం వినట్టుంది. భాష వొక్కటేగాదు మనుషులు కూడా యేదో పురాతనత్వం మోస్తున్నట్లున్నారు. నాకు యిట్లా మనుషులను గమనిస్తూ కూచోవడం యిష్టమైన పని. “వేదవతిని చూపిస్తా ఆలూరు వస్తావా” అని మారుతీ అడుగుతూనే ఎగిరిగంతేసి యీ సమావేశానికొచ్చానా, వేదవతి ని మించి వేదవతి గట్లుమీద నివసిస్తున్న యీ మనుషుల్ని చూడ్డం యిష్టంగా వుంది. దూరంగా దగ్గరగా చూపులువిసురుతూ నేనందర్నీ గమనిస్తున్నాననుకుంటున్నా గానీ నన్ను కూడా ఒక మనిషి గమనిస్తున్నట్టు అనిపిస్తోంది. నల్లగా దృఢంగా తీక్షణమైన చూపులుగలతను నన్ను పదే పదే చూస్తున్నాడు. నేనతన్ని చూసినప్పుడు తప్పుకుంటున్నాడు.
వేదవతి ఒక నది. కర్ణాటకలో బాబాబుడంగిరి కొండల్లో పుట్టి అనంతపురం జిల్లాలో నుండి కర్నూలు – బళ్లారి జిల్లాల సరిహద్దుగా ప్రయాణించి తుంగభద్ర నదిలో కలుస్తుంది. యేటా అంతో యింతో నీళ్ళుండే నది. నది ఒడ్డున యీ ప్రాంతాల్లో కరువు కాపురం చేస్తుంటే నదినీళ్లేమో గల గలా తుంగభద్రలో కలిసి అటునుంచి కృష్ణానదిలో పడి కిందికే వెళ్లిపోతుంటాయి. వేదవతి నీళ్లు నిలుపుకోవడానికి యే యేర్పాట్లూ లేవు. ప్రజలకి యిన్ని యేండ్లగా ఆ ఆలోచన కూడా లేదు. ఇప్పుడిప్పుడే మారుతి లాంటివాళ్లు యీ ప్రాంతంలో వేదవతి మీద చిన్న యెత్తిపోతల పథకం కోసం ప్రజల్ని కూడగడుతూ వున్నారు. దానిగురించే యీ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులతో, రైతులతో యీ సమావేశం యేర్పాటుచేశారు. నేను ఆటలో అరటిపండులా వేడుక చూడ్డానికి వచ్చినవాణ్ణి.
“హాగేను సార్,హాగె మాడ్రే నమ్మగె వొళ్లేదా..”
(అట్లనా సార్, అట్ల చేస్తే మాకు మంచిదా..) అనడుగుతున్నాడు ఒకాయన, మారుతిని.
“నన్నడిగితే శానా మంచిదనే చెప్తా బజారన్నా. మీకేమి మంచిదో మీరే తెలుసుకోవల్లగదా. మీరు గూడా నాయకులు గదా మీ ప్రాంతానికి మంచేందో చెడేందో మీకు తెలిసిండాలబ్బా… నా మీద నమ్మకముంటే మంచిదే. నేను చెప్పిందే మీరు యినుకోవాలని గాదు. నీళ్లంటేనే గదా పంటలు పండేది. మన హగరీ(స్థానికంగా వేదవతి ని హగరి అంటారు) నదిలో ప్రతియేటా యెన్నోటు నీళ్లు తుంగభద్ర లో కలుస్తున్నాయో మీ కండ్లతో చూస్తానే వున్నారు. ఔనా కాదా రంగన్న పెద్నాయనా, వాటిని మన దగ్గర ఆపుకుంటే మన రైతులకు యింత ప్రాణం పోసినట్లైతుందా లేదా దాన్ని గురించి మనం యోచన చేయాల్నని యీ మీటింగు. యిక్కడ మాట్లాడుకొని మరచిపోయ్యేది కాదు మన వూర్లలో అందరికీ చెప్పాలా… “
“బాగా సెప్తివి సారూ… మనూరి పిల్లగానివి కాబట్టి మన రైతులు గురించి యోచన సేసుండావు నువ్వు. యీ కార్యుముకి యెంత ఖర్చవుతుందో “
“యెంతో గాదు పెద్నాయనా అంతా నూరూ నూటిరవై కోట్లతోని అయిపోతుంది. అదుగో ఆసార్ను చూసేవా, సుబ్బారాయుడు సారని పెద్ద ఇంజినీరు. మొన్నామొన్న దాకా ప్రభుత్వంలో ఇంజనీర్లు కే పెద్ద ఇంజనీర్గా వుద్యోగం చేసినాడు. పెద్ద పెద్ద ఆనకట్లను కట్టే ప్లాన్లు గీసేది యిట్లా సార్లే. సార్లట్లా వాళ్ళు మనెంబడి సానామంది వుండారు. వాళ్ళు లెక్కలేసి చెప్పిండేదే యిదంతా. ప్రభుత్వము గోదావరి పుష్కరాలనీ కృష్ణాపుష్కరాలనీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చులో పదిపైసలు భాగంతో మనం అడుగుతుండే ప్రాజెక్టు కట్టొచ్చు. “
” మళ్లా అంత పెద్ద కట్ట కడితే యెన్ని భూములు మునిగిపోతాయో, దానికి వొప్పుకోవల్లగదా రైతులు… “
” నువ్వు అడిగింది కరెక్ట్… అట్లా విషయాలు అడిగి తెలుసుకోని, గవర్నమెంట్ ను గట్టిగా అడగనీకీ మిమ్మల్ని తయారుజేయాలనే యీ మీటింగు. మీరు కూచొని వింటే విషయాలు తెలుస్తాయ్. మీరూ మీకొచ్చే డౌట్లూ అడగొచ్చు… కూచోండి మళ్లా… “
అంటున్నాడు మారుతి.
సమావేశానికి ప్రధాన వక్తగా వచ్చిన రిటైర్డ్ ఛీప్ ఇంజనీర్ సుబ్బరాయుడు సారు కర్నూలు జిల్లా పశ్చిమ భాగానున్న ఆలూరు ప్రాంతంలో అశోకుడు పాలనలో వుండిన సువర్ణగిరి అనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు యీ ప్రాంతంలో నాగరికత వెలసిల్లినా కరువూ కాటకాలు మాత్రం పట్టిపీడిస్తూనే వున్నాయనీ, ఆ బాధలు తీరాలంటే నీటిపారుదల వుండాలనీ, యిక్కడ పారే నదినీటిని నిలుపుకుంటే రైతులకు వుపయోగపడుతుందినీ దానికి తక్కువ ఖర్చుతో తక్కువ పొలాల మునకతో సాధించుకోవచ్చని వివరించాడు.
రాయలసీమ విద్యావంతుల వేదిక తరఫున వచ్చిన మరో యిద్దరు వక్తలు కూడా చాలా వివరాలు చెప్పారు. వచ్చిన వాళ్లంతా చాలా శ్రద్ధగా వినడం చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ప్రజలు చాలా నష్టపోయారనీ యిప్పుడైనా మేల్కొని యిట్లాంటి ముఖ్యమైనవి సాధించుకోవాలనే అభిప్రాయం వాళ్ళకు అర్థమై దని, మారుతి చొరవ తీసుకుని సమావేశానికొచ్చిన కొందరిని మాట్లాడ మన్నప్పుడు తెలిసింది. అయితే అనుమానాలు వ్యక్తం చేసినవాళ్లూ వున్నారు. నన్ను గమనిస్తున్న నల్లటి ఎర్రజీరల కళ్ల మనిషి అభ్యంతరాలు చెబుతుంటే, గమనించిన మారుతి,
‘సిధ్ధలింగప్ప అన్నా పైకిరా, పైకొచ్చి మాట్లాడమని’ అతన్ని వేదిక నెక్కించాడు.
“మా వూరు పాళ్యం అదే కురబల పాళ్యం, ఇరవై అడుగుల గోడ కట్టి యెత్తిపోతల పథకం నుంచి తుంగభద్ర కాలువ లోకి నీళ్లు తీసుకుపోతామంటున్నారు. నది మా వూరి దగ్గర్నుంచీనే పోతుంది. మావూరు మునుగుతుందేమో, ఆ వూరి సర్పంచిని నేను, మావూరోళ్లు వొప్పుకోరు దీనికి” అని సందేహం వ్యక్తం చేశాడు.
దానికి సుబ్బరాయుడు సార్, ‘వూరు మునిగేంత నీళ్లు నిలబడవు. నిలబడే నీటిని యెప్పటికప్పుడు పంపులు ద్వారా తోడి కాలువలోకి పంపిణీ చేస్తారని’ తెలిపాడు.
సమావేశం ముగించుకొని హాల్ నుంచి బయటకు పోతున్నప్పుడు, నన్ను గమనిస్తూండిన పాళ్యం సర్పంచి సిధ్ధలింగప్ప నా దగ్గరకొచ్చి, ‘మీరు హర్ధగేరి వెల్ఫేర్ హాస్టళ్లలో వుండి ఆడనే హైస్కూల్ వరకూ చదువుకున్నారు గదా సార్’ అన్నాడు.
‘అవునండీ చదువుకున్నా, మీకెలా తెల్సు ‘అన్నా.
‘అప్పుడు మీ జతగాడు నంజుండ గుర్తున్నాడా సార్ ‘అన్నాడు.
హర్ధగేరి వెల్ఫేర్ హాస్టల్ రోజుల నాటి జ్ఞాపకాలన్నీ ఒక్క క్షణం నా మనసులోకి తోసుకుంటూ వచ్చేసాయి. వాటితో పాటు కెంచన్నగారి నంజుండ… నన్నంటుకొని తిరిగిన నా జతగాడు. చీకటంటే భయం. ఒక్కడే వుండటమంటే భయం. పగలైనా సరే యెవరూ లేని గదుల్లోకి పోవడమంటే భయం. ఆ నంజుండ గుర్తులేకేమి.
‘అవునండీ గుర్తున్నాడు. మీరు అతనికి యేమవుతారు ‘.
‘వాని మేనమామ సార్ నేను. మా యింట్లో అందరికీ మీరు బాగా తెలుసు, మీరు రాసిన పుస్తకాలు మావోని దగ్గరుండాయి. మీ గురించి పేపర్లలో కన్పించినప్పుడల్లా మా నంజుండ శానా సంబరపడతాడు… ఒకసారి మా వూరికి రాండిసార్ ‘.
‘ఓహో మీరు నంజుండ మామనా. సంతోషమండీ. నేనేమంత పెద్ద రచయితను కాదులెండి. అంత చెప్పుకోవడానికేమీ లేదుగానీ, యెలా వున్నాడు నంజుండ. ఎక్కడున్నాడు… ‘ఆసక్తిగా అడిగా.
‘హేగిదానందరే హేళోకాగల్లా సార్. వొట్టుమేలే హేళొబేకందరే చెన్నాగిల్లా… ‘ఒక్కసారిగా అతను కన్నడం లోకి వెళ్లాడు. గొంతున దుఖ్ఖాన్ని అణచిపెట్టుకుంటున్నట్టూ తెలుస్తోంది. బాధ సహజంగా మాతృభాషలో పలుతుందనుకుంటా. వెంటనే తెలుగులోకొచ్చి ‘పెళ్లి పెటాకులు లేకుండా వాడొక మాయదారి రోగం పాలున పడ్డాడు సార్, ఒకసారి వొచ్చి పలకరిచ్చిపోండి సార్’. అన్నాడు.
‘చూద్దాంలెండి.. అతడి నెంబర్ యివ్వండి మాట్లాడతా’ పొడిపొడిగా అన్నట్టున్నాను. పాపం నిరాశ పడ్డట్టున్నాడు. సిధ్ధలింగప్ప ముఖంలో అది కన్పించింది.
భోజనాలు ముగించుకొని కర్నూలు కు తిరిగి వచ్చేటప్పుడు, మారుతి సిధ్ధలింగప్ప గురించి ప్రస్తావించాడు.
‘నీ గురించి చానా చానా అడిగినాడ్సార్. నీ పుస్తకాలు గురించి కూడా తెలుసు. నీ మీద చానా గురుంది.ఆయన అల్లుడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడంట, వాళ్లూరికంట పోనంటపో. ఎప్పుడు పోతావో చెప్పూ నేనూ వస్తా. సిధ్ధలింగప్ప కు యీ ప్రాజెక్టు మీద మంచి అభిప్రాయం యేర్పరుద్దాం. ఇదేగాదు, ఆ వూరికి పెద్ద కథుంది. యీ సిధ్ధలింగప్ప ఒకానొకప్పుడు పేద్ద ఫ్యాక్షన్ నడిపినోడు. నీ కథలకు పనికొస్తుంది.
‘మారుతి గారూ ఎప్పుడో పదోక్లాసు నాటి స్నేహం. ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకోవడం గొప్పే కాదనను. ఇన్నేళ్లలో మనిషి యెంతగా మారిపోయుంటాడో. తీరా వెళ్లాక అప్పటి మనిషి కాదని తెలిస్తే నిరాశ కాదూ. అప్పటి జ్ఞాపకాల్లోని అమాయకత్వాలూ అనుభూతులు అలాగే వుండనీయండి వెళ్లి యెందుకు వాటిని చెరిపేసుకోవాలి. ఇక ఫ్యాక్షన్ కథావస్తువంటారా అదెప్పుడో పాతబడి పోయింది. ఫ్యాక్షన్ కూడా రూపం మార్చకున్నదని మీకూ తెలుసు. పాత కథలు రాసే వోపిక నాకూ లేదు ‘.
‘అబ్బా సారూ యింత యోచన అవసరమా. నిన్ను గుర్తుపెట్టుకున్నాడంటేనే అదే ఒక గుర్తు ఏమీ మారలేదని. ఇంకా నీ పుస్తకాలు చదువుతున్నాడంటే నువ్వేమి ఎదిగావో చూస్తున్నట్టు లెక్క. యింకా యిప్పటి వేదవతి వుద్యమానికి ఆ వూరే ఒక కేంద్రం. వెళ్లడానికి యిన్ని అనుకూలాలున్నాయ్. నిన్ను చదివే ఒక పాఠకుడ్ని చూడ్డానికి పోదాం అనుకొని పదా. నేనూ వస్తా… ‘
‘నిజమే మీరు చెప్పింది వాలీడ్. పాజిటివ్ గా ఆలోచిస్తే పోవడమే కరెక్ట్. పోదాం ‘అన్నా.
* 2*
ఆలూరు నుంచి వచ్చాక నా పనుల్లో పడి నంజుండను మరిచిపోయినా, నంజుండనే మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాటల్లో యేదో వేదన దాగుంది. ఇళ్లు దాటి బయటకు వచ్చే స్థితిలో లేడని అర్థమయ్యింది. మరచిపోయిన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసాడు. అవన్నీ అతని భయం చుట్టూ గూడు అల్లుకున్నవే. మా స్కూలు హాస్టలూ పక్క పక్కనే వుండేవి. వూరికే స్కూలుకూ మధ్యన ఒక పెద్ద చింతతోపు వుండేది. పగలైనా ఆ తోపు వైపు చూడ్డానికి నంజుండ భయపడేవాడు. అందరూ వాడి భయాన్ని సాకుగా తీసుకుని ఏడిపిస్తుంటే,నేనొక్కన్నే తోడుగా వుండేవాణ్ణి. చదువుకంటే ఆటలు, బొమ్మలు గీయడాలూ వాడికిష్టం. ‘అరేయ్, యీ చదువు కంటే మా తాత వెంబడి గొర్లు కాసుకోవడమే బాగుంటుందిరా’ అనేవాడు. ‘అవున్రా, గొర్లు కాయడానికి వాటితో పాటు రాత్రుళ్లు చీకటిలో పడుకోవాలి గదరా’ అంటే, ‘చుట్టూ కుక్కలుంటాయి గదా, మా తాతనో, చిన్నాయనలో వుంటారు గదా అనేవాడు.
ఆతర్వాత నంజుండ యెందుకిలా అయ్యాడు, అతని జీవితంలో యేం జరిగిందో, కలిస్తే తప్ప తెలియని విషయాలు. అదే నన్ను పాళ్యం వెళ్లేలా చేసింది.
ఒక రోజు మధ్యాహ్నం ఆలూరు లో బస్సు దిగగానే, బస్టాండ్ లో సిధ్ధలింగప్ప బుల్లెట్ తో సిద్ధంగా వున్నాడు. నన్ను చూస్తూనే సంబరపడ్డాడు.
‘ఏమండీ మీరే వచ్చారు. ఎవర్నన్న పంపిండొచ్చు, లేదా నేనైనా ఏ పల్లెవెలుగు ఎక్కి వూరుకొచ్చేవాడ్ని కదా ‘అన్నాను.
‘అట్లెట్లా సారూ, మీరు రావడమే పదివేలు. మీరు వస్తున్నారంటానే మా నంజుండ కళ్ళల్లో పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతావున్నాయి. ‘
‘ఏమండీ మీ వూర్లో కరెంటు లేదా… ‘హాస్యంగా అన్నా. ఆయనకు అర్థం కాలేదు.
‘అరెరే ఎందుకు లేద్సార్, వుంది. అయితే కోతలే. మావూరు పేరుకు ఆంధ్రలో వుంది గానీ మా వ్యవహారాలన్నీ బళ్లారితో. పొద్దున లేస్తే బళ్లారిలో వుంటారు సార్ మావాళ్లు. ఆఫీసు పనులకేమో ఆలూరుకూ ప్రైవేటు పనులకేమో కర్ణాటక. అట్లయ్యీ అటు ఆంధ్ర కాక, యిటు కర్ణాటక కాక రెంటికీ చెడ్డ రేవడైనాం సార్. ‘
బుల్లెట్ వెనుక కూర్చున్నాను కాబట్టి హోరు గాలికి చెవులు దిమ్మెక్కి పోతున్నాయి. బండి గతుకుల రోడ్డు మీద కుదుపులతో వెళ్తోంది. దార్లో అక్కడక్కడా మనుషులు సిధ్ధలింగప్ప ను పలకరిస్తున్నారు. వాళ్ల సంభాషణలు కన్నడంలో నడుస్తున్నాయి. ఒకాయనెవరో సిధ్ధలింగప్పను నా గురించి వాకబు చేస్తూ,
‘ఏం సిధ్ధలింగప్ప అన్నో మీ వూర్లో జాతరకు బంధువును పిలుచుకుపోతున్నట్టున్నావూ..’ అన్నాడు. సమాధానంగా సిధ్ధలింగప్ప గట్టిగా నవ్వాడు.
‘ఏం జాతరండీ మీవూళ్లో…’
‘సార్ మా వూళ్లో గాదిలింగేశ్వర తాత రథోత్సవం. మంచిటయానికి వస్తున్నారు మీరు. మావూరు నిండా మనుషులుంటారు యీ రెండ్రోజులూ. మహరాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వేలాది భక్తులు రథోత్సవంకు ప్రతియేటా వస్తుంటారు… గాదిలింగేశ్వర స్వామి మా మూలపురుషుడు. మా కులదేవత. ఆయన యేర్పాటు చేసిండేదే మావూరు. ఆయన గుడే మా బతుక్కు ఆధారం. ‘
‘గాదిలింగేశ్వర స్వామి గురించి తెలుసండీ. అయితే రథోత్సవం యిప్పుడని తెలీదు. తెలిసుంటే యీ సందడి తగ్గాక వచ్చిందును ‘
‘అట్లెట్లా సారూ మీరు రావాల్సింది యిప్పుడే. ఇళ్లు దాటకుండా వున్న మా నంజుండను మీరెట్లైనా యీసారికి రథోత్సవం లోకి వచ్చేలా చేయాల. అందుకే ఆ గాదిలింగేశ్వరుడు మిమ్మల్ని మా వూరికి పంపిస్తాన్నాడు ‘
ఆ మాటతో నేనేమీ మాట్లాడలేకపోయాను. నా మీద యింత నమ్మకం యేమిటో నాకేమాత్రం అర్థం కావడం లేదు. యే కోణంలో నన్ను చూస్తున్నారో మరి… నా మౌనాన్ని పట్టించుకోకుండా సిధ్ధలింగప్ప ఒక వైపు వొడుపుగా డ్రైవింగ్ చేస్తూనే తనగురించి చెప్పుకుపోతున్నాడు…
‘ …….. పాత రోజుల్లో, అంటే రాజశేఖరరెడ్డి సీయమ్ కావడానికి ముందు యిట్లా పబ్లిక్ గా బండిమీద తిరగడమంటే ప్రాణాల్ని పణంగా పెట్టినట్లే వుండేదంట. ఏ బాంబు ఏ పక్కనుంచి మీదబడుతుందో, యేదారి కాచి యెవరు మీదబడతారో అన్నట్లు వుండేదంట. ఇప్పుడు ఆ తరహా ఫ్యాక్షన్ లేదంట. ‘
మరి యిప్పుడు యెలాంటి ఫ్యాక్షన్ వుందని అడిగితే, వూర్లో వ్యక్తిగత స్పర్థలు వున్నా, పార్టీలున్నా, యిప్పుడు ఎత్తులన్నీ కాంట్రాక్టు పనులకూ, గనులలీజుకూ, భూఆక్రమణలకూ పోటాపోటీ నడుస్తుందంట.
‘మరి రైతుల సంగతేందంటే’, పెద్ద రైతులందరూ కౌలు చేసుకొనే వాళ్ళకు భూములిచ్చి, కౌలు డబ్బులు, బ్యాంకులో పంటరుణాలూ, రుణ మాఫీలూ, ఇన్సూరెన్స్ యిట్లాంటివన్నీ సంపాదించుకుంటా బాగుంటే కౌలుకు తీసుకున్నోడు పంటలు పండక, పంటరుణాలూ లేక, ఇన్సూరెన్స్ డబ్బులు అందక చచ్చిపోతున్నాడంట.
మాటల్లోనే తుంగభద్ర లోలెవల్ కెనాల్ బ్రిడ్జి మీద బండి దాటుతోంది. కాలువ ఎండిపోయి వుంది.
‘మీరు మొన్న మీటింగు పెట్టి చెప్పిన ఎత్తిపోతల పథకం నుంచి వేదవతి నీళ్లు యీ కాలువలోకే కదాసార్ యెత్తి పోసేది’ అనడుగుతున్నాడు
‘అవునండీ, ఆ నీళ్లు యీ కాలువ నుంచినే వెళ్లాయి. ఆ పథకం కింద కొత్తగా కాలువలు తవ్వనవసరం లేదు. మీరు యెత్తిపోతల పథకాన్ని అందరికీ ప్రచారం చేసి నాయకుల్ని వొప్పించుకొని నిర్మాణం చేసుకుంటే మీ ప్రాంతం కోనసీమ లాగా పచ్చగా తయారవుతుందండీ.’ అని వూరించా.
‘నిజంగా వస్తుందా సార్ ఆ ప్రాజెక్టు. రానిస్తారా దీన్ని పెద్ద పెద్దోళ్లు గమనిస్తాంటారు, మా మారుమూల ప్రాంతాలకు యిస్తే యెంతా యీకుంటే యెంత అనుకోరా.’
‘మీలాంటి ప్రజల్లో పట్టు వున్నవాళ్లంతా గట్టిగా పట్టుపడితే యెవరాపగలరండీ… నీళ్లు కళ్ల ముందే వున్నా, నీటి అలాట్మైంట్ చట్టబద్ధంగా వున్నా యెందుకు తీసుకోలేక పోతున్నామండీ, ఆలోచించండీ, గట్టిగా అడగడం లేదని కదా.’
‘నీళ్లు, మా యెదురుగా పోయే నీళ్లు తీసుకోవచ్చనీ, తీసుకొనే మార్గాలు వున్నాయనీ తెలిసింది యిప్పుడే సారూ. మీలాంటోళ్లు చెప్తుంటే యిప్పుడే తెలుస్తాంది. యింతకు ముందు మాకు యీ ఆలోచన్లే రానీలేదు. మమ్మల్ని సంపుకోవడంలో నరుక్కోవడంలో వుంచేసినారు. యేంటివో చిన్న చిన్న కాంట్రాక్టులు ఆశ చూపి దారి యేమార్చినారు. వాళ్లేమో పదవులూ పెద్ద పెద్ద గనులూ తవ్వేసుకొనే దాంట్లో మునిగిపోయినారు. వాళ్ల చెప్పుచేతుల్లో లేకుండా జనాన్ని పచ్చగా బతికిచ్చే యిట్లాంటి ప్రాజెక్టులకు వొప్పుకుంటారా అని నా అనుమానం. ఒప్పుకోవాల్సి వస్తే గూడా యెన్ని అడ్డుపుల్లలేస్తారో, యెన్ని స్పర్థలు లేగ్గొడతారో అని నా భయం’.
సిధ్ధలింగప్ప నోటినుంచీ వచ్చిన ఆ మాటలు తన జీవితానుభవంతో చెప్పిన మాటలు. నిజంగా ఆ మాటలతో సిధ్ధలింగప్ప మీద గౌరవం కల్గింది. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషుల దుర్మార్గమైన పనులు చేసి వుండవచ్చు వాటికి నిర్గతి తర్వాత కాలంలో వాళ్ళు చేసే పనుల వల్లా, ఆలోచనల ఆచరణ వల్లా సాధ్యమవుతుందని నాకనిపిస్తుంది.
‘మీ అంచనా కాదనను సిధ్ధలింగప్ప గారూ, మన చుట్టూ వున్న నిస్సహాయ జనాల మంచి కోసం కొన్ని భయాల్ని జయించాలండీ. కొన్ని భయాలమీద రాజీలేకుండా కొట్లాడాలండీ…’ అన్నా.
‘మీ మాట నిజమైతే, మీరూ, ఆ మారుతి సారూ చెప్పింది నేను చేస్తా, అయితే మీరు మా నంజుండ మనసులో పేరుకుపోయుండే భయాన్ని పోగొట్టండి సార్. చేయని తప్పును చేసినట్లు అనుకుంటూ వాన్ని వాడు శిక్షించుకుంటున్నాడు వాన్ని రక్షించండి సార్. మీతో మనసు విప్పి మాట్లాడుతాడనీ, మీరు వాడి మనసును నెమ్మదిపరుస్తారనీ ఆశతో మిమ్మల్ని రమ్మన్నాము సార్. ‘ అంటూ మేనల్లుడి మీద చూపుతున్న అపేక్ష గొప్పగా అన్పిచింది.
అంతలో బండి వూరి ముందుకు వచ్చేసింది. ఎటుచూసినా జనాలే. ఎక్కడ బయలు కన్పిస్తే అక్కడంతా డేరాలు వేసుకొని శిబిరాలు శిబిరాలుగా జనాలు.
ఇంటిముందు బుల్లెట్ ఆగిన శబ్దానికి, పడశాలలోకి యిద్దరు మనుషుల భుజాల మీద చేతులు వేసి, నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని నంజుండగా వూహించాను. తెల్లగా పాలిపోయిన శరీరం, లోపలెక్కడో వున్న కళ్ళు, నా వైపు సారిస్తున్న దీర్ఘమైన చూపులూ, నేను కింద నుండి మూడు మెట్లు ఎత్తున వున్న పడశాలలోకి అడుగుపెడుతూనే రెండు చేతులతో నా చేతిని బిగించి పట్టుకున్న ఆ మనిషిలో నాక్కావాల్సిన వాడి కోసం ముప్పైయేళ్లు వెనక్కి వెళ్ళి వెతుక్కుంటున్నాను. పొడగైన ముక్కూ, మీసాలు కమ్మేసినా సాగి కనబడుతున్న పెదవులూ యేవో పోలికల్ని చెప్తున్నాయి. కన్నడ హీరో రాజకుమార్ కు ముక్కు పెద్దగా వుంటుంది. నంజుండకూ అంతే. ‘యేరా మీ కన్నడా వాళ్లందరికీ ముక్కలు పెంచుకోవడమే పనా… ముక్కోడా’ అనే మాట గుర్తొస్తాంది. ఒక ముసలామె నమస్కారం చేస్తోంది.
‘మాయక్క, నంజుండ వాళ్ళమ్మ’ అంటున్నాడు సిధ్ధలింగప్ప.
‘నోడో, కరెకొండు బందిద్దీని (చూడ్రా, పిలుచుకొని వచ్చాను) నంజుండ వైపు తిరిగి అంటున్నాడు. నంజుండ ఆయన వైపు చూడనైనా చూడలేదు. నన్నే చూస్తున్నాడు. పెదవులపై సాగదీసిన నవ్వు తప్ప, ముఖం నిండా దిగులే వుంది. నేను అతని భుజమ్మీద చేయి వేసాను. చిన్నగా వణుకుతున్నది శరీరం.
‘యీవాగాదరూ నిమ్మామను మాతాడిసోకణా, నిన్న గెలియను కరికొండు బందాన్తానె’ (నీ స్నేహితున్ని తీసుకొచ్చారు కదా అందుకైనా మీ మామను పలకరించరా నాయనా) అంటోంది వాళ్ళమ్మ.
‘సారూ పొద్దున్నే కలుస్తా…’ అని చెప్పి నంజుండను ఒకసారి దీర్ఘంగా చూసి పోయాడు. ఆ కళ్ళల్లో నంజుండ మీద ప్రేమే కన్పించింది. నంజుండ మాత్రం వాళ్ళ మామ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
నంజుండ గదిలో మంచంమ్మీద కూచుంటే, నేను ఎదురుగా కుర్చీలో కూచున్నా. సాయంత్రం ఎండ వాలుగా పడి కిటికీ నీడను ఎదురు గోడ మీద పెద్దదిగా చూపుతోంది. ముప్పై యేళ్ల అఖాతం మీద యీ సాయంత్రం వారధిని కట్టాలని చూస్తోంది. నా మీద అపేక్ష చూపిస్తున్న యీ అపరిచిత ప్రపంచాన్ని అవగతం చేయించడానికి చూస్తోంది. ఎదుటి మనిషి లోపలి చీకటిని పోగొట్టే శక్తి యీ సాయంత్రపు వెలుగు నాకివ్వగలదా? అసలివన్నీ కాకున్నా యీ పరిచిత అపరిచితుడ్ని నాతో అనుసంధానించగలదా? అన్నీ ప్రశ్నలుగా మారిన, రాత్రి కాబోతున్న యీ సాయంత్రాన్ని సమాధానపరచాలి నేను.
‘ఏం నంజుండా ఏంది యిట్లయినావు…’ అనగలిగా. నన్ను చూస్తూ కన్నీళ్ల పర్యంతమవుతున్న ఆ మనిషిని కొంత కొంతగా నాలోకి యింకించుకోవాలని నా ప్రయత్నం. ఆ క్షణంలో నేనొక డాక్టర్, అతనొక రోగపీడితుడు. అందునా డాక్టర్ ను నమ్మి ప్రేమించే రోగి. అది చాలదూ అతనిలోకి పరకాయప్రవేశం చేయడానికి. ఒక్క సారిగా నా పదోతరగతి రోజుల్లోకి వెళ్లిపోయా. ఆ మనిషితో కలవడానికి గింజుకుంటున్న నా అహాన్ని బాల్యావస్థకు అప్పగించి,
‘ఏరా నంజిగా… సరిగ్గా కడుపుకింత బువ్వన్నా తింటాండావా లేదారా. గొర్లు కాసేదానికన్నా శక్తి కావాల్నా వద్దారా. అరే తిక్క నామగనే మీ గాదిలింగేశ్వర గొరజాడ చెప్పిన మాటలే మరచిపోయినావారా. తిండి తింటే కండకలుగోయ్ కండగలవాడే గొర్లువెంట తిరగగలడోయ్’ అన్నా.
ఒక్కసారిగా అతడి కళ్లలో వెలుగు ప్రసరించింది. అప్పట్లో గురజాడ ను మీవాడేరా ఆయన యింటి పేరు గొరజాడ అంటే వీడు నమ్మేవాడు. ఆ మాటతో పాత నంజుండ బయటికొచ్చేసాడు. నా కథలు వచ్చిన మాగజైన్లూ, నా పుస్తకాల రివ్యూలొచ్చిన పేపర్ కటింగులూ, నా గురించి రాసిన ఆర్టికల్స్ అన్నీ ఫైల్ చేసి పెట్టుకున్నాడు. వాడి అభిమానానికి నేను ఫిదా.
నిజానికి ఆ రాత్రి నా జీవితంలో ఒక వుధ్వగ్నభరితమైన రాత్రి. నమ్మలేని నిజాలు విన్న రాత్రి. తుంగభద్రా నది పరవళ్లు లాంటి నంజుండ జ్ఞాపకాల వరద నన్ను ముంచేసిన రాత్రి.
నంజుండ, నేనూ పదోతరగతి తర్వాత విడిపోయాం. నంజుండ ఆలూరులో ఇంటర్ చదివి, బళ్లారి వీరశైవా కాలేజీలో డిగ్రీ చేసి, ధార్వాడ యూనివర్సిటీ లో ఎమ్మే చేరాడు. అక్కడ వేదవతి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమె అతన్ని యింటికి తీసుకెళ్లి తన తండ్రి శివశంకర్ భట్ కు పరిచయం చేసేంత ఘాడంగా మారింది. బళ్లారి దగ్గర పాళ్యం మా వూరంటే, గాదిలింగేశ్వర మఠం వున్న పాళ్యమేనా, అనడిగాడు శివశంకర్ భట్. అవును అదే మీకెలా తెల్సు, అనడిగితే, ‘ఓహో అయితే కురబల కుర్రవాడివి కదా’ అని కనుబొమలెగర వేసాడు. కాఫీ గ్లాసు కిటికీ అంచులో పెట్టి వచ్చేస్తుంటే, పొడి పొడిగా ‘అప్పుడప్పుడు వచ్చి పోతుండు’ అన్నాడు. ఆ మరుసటి రోజే వేదవతి అన్న నాగరాజ భట్ యూనివర్సిటీ కొచ్చి మాట్లాడించాడు. ధార్వాడ లోని యితర మిత్రుల ద్వారా తెలిసిందేమంటే, నాగరాజ భట్ కు అప్పుకూ వ్యసనాలకూ కొదవ లేదు. మొదటి రోజు నుంచినే నంజుండ దగ్గర చేయిచాచడం అలవాటు చేసుకున్నాడు. అక్కడున్న రెండేళ్లలో, యెన్నో నాటకీయ పరిణామాల మధ్య నాగరాజ భట్ వ్యసనాల మూలంగా వేదవతి కుటుంబం ధార్వాడ వదలి బళ్లారిలో తలదాచుకోవలసి వచ్చింది. ఆ కష్టకాలంలో ఆ కుటుంబానికి నంజుండ అండగా నిలిచాడు. బ్రాహ్మడు కాదనేది వొక్కటే శివశంకర్ భట్ ను కుంగదీసింది గానీ కూతురి ప్రేమను కాదనలేకపోయాడు. అలా అని సమ్మతీ చెప్పలేక పోయాడు.
నాగరాజ భట్ ధార్వాడలో చేసిన నిర్వాకాల తాడు పట్టుకొని పోలీసులు బళ్లారి దాకా వస్తుంటే భయపడ్డ శివశంకర్ భట్ ఒక సాహస నిర్ణయంతో, వేదవతి వద్దన్నా వినకుండా నివాసాన్ని పాళ్యానికే మార్చేసాడు. పోలీసులకు అంతుచిక్కకూడదనీ, పాళ్యంలో కర్ణాటక వాతావరణమే వుండడమూ, గాదిలింగేశ్వర మఠంలో పూజారిత్వం సంపాదిస్తే, కొడుకు జీవితం గాడినపడుతుందనే ఆశా, వేదవతి కన్నడ పిల్లలకు ట్యూషన్లు చెప్పుకున్నా గడచిపోతుందనే భరోసా, నంజుండ తరగని అండా అతనితో ఆ పని చేయించింది. నాగరాజ భట్ కూ అదే అర్థమైంది.
పాళ్యం పన్నెండు వందల గడప గల గ్రామం.ఏడువేలుపైబడిన జనాభా. ఎనిమిది వందలు పైబడి కుటుంబాలు గల కురబలదే వూరిమీద ప్రాబల్యం. నూటయాభై కుటుంబాలు బోయలూ, నూరుపైబడి వడ్డెరలూ కురబల మీద రహస్యంగా కారాలూ మిరియాలు నూరుతుంటారు. మాదిగలూ, లింగాయతులూ చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్నారు. వ్యవసాయ భూములపై పట్టు ప్రధానంగా కురబలదే, లిం గాయతులకూ భూములున్నాయి. ఒకటిరెండు సేవక కులాల కుటుంబాలు తప్పితే మిగిలిన వారందరూ కూలీలుగా బతకాల్సిందే.
పాదరసం లాంటి బుర్రగల నాగరాజ భట్ పాళ్యం లో వున్న గుట్టు పట్టేసాడు. వూర్లో గాదిలింగేశ్వర మఠం కురబలదే. బోయలు శక్తి వంతులే గానీ కురబలతో తూగలేకుండా వున్నారు. వీరిద్దరి కేంద్రంగా వూరు చీలిపోయి వుంది. దాన్ని వుపయోగించుకుందాం అనుకున్నాడు నాగరాజ భట్.ఈ ఆలోచనతో మొదట కురబ పెద్దలను కలిసి గాదిలింగేశ్వర స్వామి గుడిలో తనను పూజారిగా చేసుకోమని అడిగాడు. ‘గాదిలింగేశ్వరుడు కురబల పూర్వీకుడు ఆ గుడి పూజారిత్వం కురబలదే, వేరే వారికి యివ్వ’ మన్నారు. ‘ఇంత ప్రసిద్ధి పొందిన మఠానికి బ్రాహ్మణుడు పూజారిగా వుండడం మంచిది, దాని వల్ల గాదిలింగేశ్వరునికి యింకొంచెం శక్తీ, కీర్తీ కలుగుతాయి ఆలోచించుకోమన్నాడు, నాగరాజ భట్. వీడి వల్లే మా దేవునికి శక్తీ, కీర్తీ కలుగుతాయా… వీడూ వీడి అహంకారమూ, అనుకొని,
‘బతకడానికి మావూరొచ్చిన వాడివి, మా గుడి పూజారిత్వం కావాల్సొచ్చిందా’ అని సిధ్ధలింగప్ప అవహేళన చేసాడు.
ఆ విషయాన్ని బోయలతోనూ ప్రస్థావించాడు నాగరాజ భట్. ‘మీ వూరి మఠం మీద మీకూ హక్కుంది నన్ను పూజారిని చేయమని అడగండి మీకు లాభం చూపిస్తానని వారిని వుసిగొల్పాడు. తరతరాలుగా గాదిలింగేశ్వర స్వామి గుడి పూజారిత్వంతో, రథోత్సవం రోజుల్లో లక్షలాది మంది భక్తులు సమర్పించే కానుకలూ యితర ఆదాయాలతో, మందిబలముంది కాబట్టి అన్ని రాజకీయ పదవుల్లో కురబలే లబ్ధిపొందుతున్నారనీ కినుక వహించిన బోయలకూ వడ్డెరలకూ నాగరాజ భట్ ఒక ఆయుధంగా దొరికాడు. ఊరు రెండు శిబిరాలుగా మారింది.
నంజుండ, శివశంకర్ భట్ ను ఎంత వేడుకున్నా ఆయన కొడుకును నియంత్రించలేక పోయాడు. వేదవతి యెంత బతిమలాడినా నాగరాజ భట్ తన కార్యకలాపాలను ఆపలేదు. గాదిలింగేశ్వర స్వామి మఠపు ధర్మకర్త మండలిని రద్దు చేసి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోర్టులో కేసు దాఖలైంది. ఆ బ్రాహ్మడు యింత దూరం రావడానికి నంజుండనే కారణమని సిధ్ధలింగప్ప, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దానికి నువ్వే బాధ్యుడవైతావని హెచ్చరించాడు.
దుందుడుకు పనులకు పేరుమోసిన నాగరాజ భట్, కర్నూలు కోర్టు కేసు మీద హాజరై పాళ్యం తిరిగివస్తున్న కురబల మీద బాంబులతో దాడి జరపగా నలుగురు కురబలూ, అక్కడే జరిగిన ప్రతిదాడి లో ముగ్గురు బోయలూ చనిపోయారు. ఆ దాడిలో బతికి బయటపడ్డ సిధ్ధలింగప్ప ఆ రాత్రి భట్టుల యింటికి నిప్పుంటించగా ఆ మంటల్లో శివశంకర్ భట్ అతడి భార్య కాలిపోగా వేదవతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది. నాగరాజ భట్ పరారయ్యాడు.
నంజుండ చేతుల మీదుగా వేదవతి ప్రాణాలు విడువడంతో నంజుండలో సకల శక్తులు హరించినట్లైంది. మామను ధ్వేషిస్తూ మంచం పట్టాడు. అప్పటి నుండి , భగ భగమండిపోయిన వేదవతి అరుపులనే వింటూ, ఆ భయంలో అదే హింసలో చస్తూబతుకుతూన్నాడు.
‘నంజుండా ఆమె చనిపోవడంలో నీ బాధ్యత యేముంది. ఆ బ్రాహ్మణున్ని యీ వూరు ఎవరు రమ్మన్నారు. కనీసం నువ్వైనా ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోయుండచ్చు గదా’
అనడిగాను.
‘మా అమ్మకు నేనొక్కన్నే కొడుకును. యిల్లూ భూములూ ముసలి తల్లినీ వదిలేసి ఎక్కడికి వెళ్లాలో తెలిసిరాలేదు. యేదో వూర్లో వుంటారనుకున్నా గానీ నాగరాజ భట్ అంత వేగంగా వూరిని అల్లకల్లోలం చేస్తాడని అనుకోలేదు’ .
‘మరి ఆ కేసు లో మీ మామకు శిక్ష పడలేదా ?’
‘మొదట దాడి చేసింది బోయలు కాబట్టి,వాళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహలో లేననీ, ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్పించారనీ ఎలిబీ సృష్టించుకొని కేసులో లేకుండా చేసుకున్నాడు. అది వేదవతి చేసుకున్న ఆత్మహత్యగా, ఆమె నిప్పంటించుకొంటే యింటితో పాటు నిద్రలో వున్న తలిదండ్రులూ మరణించారని కథ అల్లి కేసు ముగించారు. ఆమె తరఫున సాక్ష్యం చెప్పడానికి యెవరున్నారు. నా లాంటి పిరికివాడిని ప్రేమించిన దానికీ, దుర్మార్గుడైన అన్న వున్నందుకూ ఆమె జీవితం అలా ముగిసిపోయింది.’
‘నంజుండా, ఆ బ్రాహ్మడు నిన్ను ఆసరా చేసుకుని తన శక్తికి మించిన జూదం ఆడాడు. దాంట్లో నీ బాధ్యత లేదు. నీవు బాధపడీ సాధించేది లేదు’.
‘నా బాధ్యత లేదనొద్దబ్బా… నా కళ్ల ముందు వేదవతి పడిన నరకయాతన యిప్పటికీ మెదులుతానే వుంది. యెంత అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని అగ్గిపాలు చేసాను. నేను పాపిని. బతికుండే అర్హత నాకుందా. యిప్పుడు బతుకుతున్న బతుకు ఒక బతుకేనా…’
‘నంజుండా యిలా అనుకుంటూనే యీ పదహైదేళ్లుగా జీవిస్తున్నావు. జీవఛ్ఛవంగా వుంటూ మీ అమ్మను బాధపెడుతున్నావూ. నీ టేబుల్ల్మీద యిన్ని పుస్తకాలు వున్నాయి కదా వాటిని చదివేవుంటావు. చదవడమంటే జీవితాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని సంపాదించేమే గదా, ఇట్లా నిర్వీర్యమై పోవడం కాదు గదా. నీకు జరిగింది చాలా ఘోరమైన విషాదమే కాదనను. బాగా ఆలోచించి చూడూ అదొక ఆక్సిడెంట్. దాంట్లో నీ ప్రమేయం యేముంది. నన్ను యెందుకు రమ్మన్నావో నాకు తెలీదు గానీ, నన్ను రమ్మనడమంటే నీ బాధను పంచుకోవడానికి సిధ్ధమయ్యావని అర్థం. పంచుకోవడమెందుకంటే బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించడమే. బాధ తగ్గాలంటే నువ్వు లేచి తిరగాల. ఈ జ్ఞాపకాల జైలు నుంచి బయటకు రావాల. నంజుండా, నువ్వు వేదవతి కాలి బూడిదై పోయిందను కుంటున్నావు గానీ ఆమె మీ వురి పక్కనే వేదవతి నీళ్లుగా మారి పారుతున్నది. మీ పొలాల్లోకి జీవధారగా పొర్లి మీ యిల్లలోకి పంటలా రావాలని చూస్తున్నది. నువ్వొకసారి నీ మనసులో గూడు కట్టుకున్న భావాల్ని తుడిచేసి బయటకు వచ్చి చూస్తే నీ వేదవతి నీకు కొత్తగా కన్పిస్తుంది. రా మరి బయటకు రాగలవా, నువ్వనుకొని జనాల్ని కూడగడితే మీవూళ్లోనే కాదు చుట్టుపక్కల యాభై వూర్లలో వేదవతిని దేవతగా చేసి చూపవచ్చు. ‘
కళ్లు విప్పార్చి మంత్రముగ్ధుడిలా నా మాటలు వింటూ తలూపుతున్నాడు నంజుండ.
ఆ రాత్రి యే తెల్లవారుజామునో యింత నిద్ర పోగలిగాము.
3
తెల్లవారాక చాలా పొద్దుపోయాక నిద్ర లేచాం. ఇన్నేళ్లలో నంజుండకు యింత నిద్ర పట్టడం యీ పొద్దేనంటోంది, నంజుండ వాళ్ళమ్మ. అప్పటికే వూర్లో వొక్కటే సందడి వినిపిస్తోంది. గాదిలింగేశ్వర రథోత్సవపు కోలాహలం అది. సిధ్ధలింగప్ప నన్ను చూడ్డానికి వచ్చాడు. వూరినిండా యిసకేస్తే రాలనంత జనం వున్నారన్నాడు. మీరు గూడా వుత్సవంలోకి రాండన్నాడు.
‘అంతమంది జనాల్లోకి నేను రాలేను, నంజుండ తో వుంటానన్నాను’
‘మీరు యెట్లచేసీ నంజుండ ను యీ జనాల్లోనుంచీ గుళ్లోకి తీసుకొని వస్తే చాలు వాడికి యీ బాధ నుంచి ముక్తికలుగుతుంది ‘ అన్నాడు.
‘మేము గుళ్లోకి రావడమేమోగానీ వచ్చేలోపు జనాల కాళ్లకింద నలిగిపోయి నిజంగానే విముక్తి లభిస్తుంది’ నవ్వుతూ అన్నా.
‘మా గాదెలింగప్ప తాత బ్రాహ్మల దేవుడు కాడు. గొర్లు కాసుకుంటూ తన చుట్టూ చేరిన మనుషులని ప్రేమిస్తూ సంరక్షించే మామూలు మనిషి. ఆయన కోసం ప్రేమతో నడిస్తే ఆయనే చేరదీసుకుంటాడు. మీరు ప్రయత్నం చేయమన్నాడు. నంజుండ కోసమైనా చేయమన్నాడు.’
‘మహిమగల దేవుడి కన్నా మామూలు మనుషుల్ని నమ్మేవాణ్ణి నేను. నంజుండను మనుషుల్లో కలుపుతా పొండి.’ అన్నా.
రథాల వూరంతా వూరేగుతూ ప్రధాన వీధిగుండా గుడికి చేరే సమయంలో నేనూ నంజుండ వీధిలోకొచ్చాం. మూడు రాష్ట్రాల భక్తులు రథాల మీదకు పూలూ పళ్లూ విసురుతున్నారు. చాలా మంది అనుకుంటున్నది యేమంటే, యీసారి కర్ణాటక క్యాంపుల నుంచి చాలా మంది భక్తులు వచ్చారని.మొదటి సారి కోస్తా తెలుగు భాషను యీ వుత్సవాల్లో వుంటున్నామనీ. మేమట్లా నాలుగు అడుగుల వే స్తూనే, నన్ను గుర్తపట్టి పలకరించాడో కొత్త మనిషి,
‘ఎవరండీ మీరంటే’.
‘మొన్న ఆలూరు మీటింగులో మీరూ వున్నారు కదండీ, వేదవతి యెత్తిపోతల పథకం వచ్చినట్లుగ…’ అనడిగాడు.
‘రావాలనే గదా మనుషుల్ని కూడగడుతున్నాం’
ఆ మాటతో ఆయన చాలా వుత్సాహంగా వేదవతి ప్రాజెక్టు గురించి తాను సేకరించిన వివరాల చెప్పడం ప్రారంభించాడు. ఆఖరుగా అసలు విషయం చెప్పాడు.
‘నా పేరు వెంకటేశ్వర్రావండీ మేం బళ్లారి చుట్టుపక్కల సెటిల్ అయిన తెలుగు వాళ్లం. ఇట్లాంటి ప్రాజెక్టుల వల్ల మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందంటే మాకు సంతోషం. ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు ఆపకుండా చేయ్యండీ. మేంగూడా మాకు చేతనైన సహాయం మా రైతు సంఘం నుండి చేయిస్తాం.’ అన్నాడు.
‘మంచిదండీ అలాగే చేద్దాం’ అని బయటపడ్డాం.
నేనూ నంజుండ వూర్లో కాసేపు తిరిగి చీకటి పడుతుండగా గుడివైపు నడిచాం . గుడి ముందు కురబలు పహారా కావస్తున్నారు. మమ్మల్ని చూసి లోపలికి తీసుకుపోవడానికి సిధ్ధలింగప్ప యెదురొచ్చాడు. నంజుండను చూస్తూ చాలా సంబరపడ్డాడు.
‘మా వూరి భూములకు రెక్కలు వస్తున్నాయి సార్ మీ వల్ల’ అన్నాడు, వ్యంగ్యంగా
‘ఎవరు చెప్పారండీ’
‘బళ్లారి నుంచి, కర్ణాటక క్యాంపుల నుంచి చాలా మంది వచ్చి చుట్టుపక్కల భూముల వివరాలు విచారిస్తాండారంట. ఎవరైనా అమ్మేవాళ్లుండారా అని అడుగుతున్నారంట.’ అన్నాడు
‘మంచిదే కదండీ మీ భూముల్లో వ్యవసాయ ప్రయోగాలు జరుగుతాయి లెండి, మీకు నాగరికత నేర్పిస్తారులెండి’ అంటే, నా మాటల్లోని గూఢార్థం యెంతమాత్రం అర్థమయ్యిందో గానీ,
‘పన్నెండేళ్ల కింద యీ కురబల గుడిసొత్తు కోసం ఒగ బాపనయ్య పెద్ద రంపు చేసిపాయ. యిబ్బుడు వేదవతి నీళ్లు యెన్ని రంపుల్ని వెంటబెట్టుకొని వస్తాయో’ గొణుక్కుంటున్నాడు సిధ్ధలింగప్ప.
లోపలికెళ్తే, హుండీ లెక్కబెడుతున్నారు.
గుట్టలు గుట్టలు రాశులుగా నోట్లూ నాణేలూ. రక రకాల నగలూ లైట్ల వెలుగులో కళ్లు జిగేల్ మంటున్నాయి. దేవుడి సంపదను కురబ పూజారులు లెక్కేసుకొని పంచుకుంటున్నారు.
‘ఈ సంపద కోసమే ఆ బ్రాహ్మడు అంత నిర్వాకం చేసింది’ నంజుండ గొణుక్కుంటున్నాడు.
నీళ్లసంపదను పసిగట్టిన కొత్త పూజారులు యీ నేల మీద యింకా యెన్ని నిర్వాకాలు చేస్తారో గదా, అని నాకనిపించింది. వెంటనే మారుతి గుర్తొచ్చాడు.
భూములు అమ్మవద్దని యీ ప్రాంతంలోని రైతుల్ని కోరుతూ మారుతి యింకో కార్యక్రమం చేపట్టాలేమో ననుకుంటుంటే, ఈ నేల యింకా చాలా పోరాటాలు చేయవలసి వుందనే సత్యం కళ్ల ముందు మెదిలింది. ఈ సారి తన కార్యక్రమాల్లో నంజుండనూ కలుపుకొమ్మని మారుతికి చెప్పాలనిపించింది.
** **