నువ్వు ఖైదులో ఉన్నప్పుడు
నీ పై వాలి నీ దేహాన్ని గడ్డకట్టించిన
మంచు సీతాకోకచిలుకలు
ఇప్పుడు అగ్గి రెక్కలు తొడుక్కున్నాయి
ఆ అనంత చీకటి తెరలిప్పుడు
తెల్లటి పావురాలై
మా చుట్టూ ఎగురుతున్నాయి
స్వేచ్ఛ కోసం
నువ్విడిచిన నిట్టూర్పులిప్పుడు
కవితలై మా చుట్టూ తిరుగుతున్నాయి
నింగి విస్తరణ కింద
నీలపు తోవలా మా పాదాల కింద
పరుచుకుంటూ ఉంది నువ్విచ్చిన ధైర్యం
ఖైదు లో ఉన్నప్పుడు ఖైదు తో
బయట ఉన్నపుడు
ఖైదు సంస్కృతి తో
గట్టి వైరం పెట్టుకున్న
నీ నిబ్బరం
నిలకడా మా ఊపిరిలో ఊపిరులైనాయి
అసత్యాల నిర్బంధంలో
హింసా- ఆంక్షల కదనరంగంలో
నిత్యం సైనికుడవై
రాజ్యపు అహంకారాన్ని
అడుగడుగూ నిలదీసావ్
అక్కడ ఎవరెవరికి
స్వేచ్ఛా పాఠాలు చెప్పావూ?
అక్కడ చెట్ల మధ్య బిగుసుకుపోయిన గాలికీ,
అక్కడి చెట్ల పై మకాం పెట్టిన విహంగాలకీ,
నీకూ మధ్య జరిగిన సంభాషణల మధ్య ఏఏ
యుధ్ధ వ్యూహాలు రచించావూ?
ఇప్పుడా విహంగాలూ
గాలీ సాయుధమై ఆదివాసీల మధ్య
గస్తీ లో ఉన్నాయి
వారికి పోరుబాట లో నడవడం నేర్పిస్తున్నాయి
వానలో నదిలా మళ్ళీ నువ్వు
ఇవే దారుల గుండా నడుస్తుంటావు!
వాన పడ్డప్పుడు మట్టి విడిచే సువాసనలా
నువ్వెప్పుటికీ మా మధ్యనే ఉండిపోతావు
లేత చిగుళ్ళ వసంతంలో నేల నవ్వులాగా
మా మధ్యలో తాచ్చాడుతుంటావు
మట్టి మీద వెన్నెల సిరాతో చేసిన నీ
వెలుతురు సంతకాన్ని
మోసుకొని ఎగురుతున్న
మిణుగుర్ల మధ్య మిణుగురులా
ఎగురుతూనే ఉంటావు