రాలిపడే బాధలన్ని చిత్రాలే
భాషింపలేని చిధ్రాలే
మృత్యుముఖంలోని
శ్వాసను వలిచే విచిత్రాలే
సడలే ఊపిరిలే.
శిఖరంలా కూలిన ఆనందం
నిత్యం వినిపించే ఆర్తనాదమే.
ఎక్కడ తవ్వినా జ్ఞాపాకాలే తడే.
వేలుకు తగిలే వెతల సవ్వడే.
వెలుతురు తునక కోసం
చీకటిని తోడుతూ
కన్నీటి సంద్రంగా మారి
ఉనికి పాలిట ఉప్పుపాతరయ్యినా
వెలుగు నీడలో
ఒడిసిన ప్రాణాలకు
ఓటమి భయమేలేని ధైర్యమే
ఐకమత్యానికి ఊపిరి.
మెదిలే బరువు కరకుతనంలో
దూరంగా వెలిగే
చుక్కల మిణుకుతనాన్ని
ఓ కరదీపికగా చేబూని
తూర్పు దిక్కువైపుకు
కలను గురిపెట్టి నడిపించింది.
ఆశను తొడిగిన పాదానిది
అహర్నిశలు మెలుకువే.
వేకువను ఒడిసిపట్టాలన్నది ఎప్పుడూ
ఆత్మవిశ్వాసమే.
***
మనిషికి ఇన్ని ముఖాలా?
మనిషికి
ఇన్ని ముఖాలా?
మనిషి ముఖమంటే
ఇన్ని భయాలా?
కోరలు చాచిన పాము
భయపడేలా ఒక చోట
పంజా విసిరే పులి
జంకే వైనం మరోచోట
సముద్రం విరిగి, మనసు మరలి
చవ్వగా మారేలా ఒకచోట
నేలముక్కలయ్యేలా
గోతులు లోతుగా మరోచోట
నీటికి దప్పిక తీరక
లోతున దాగేది ఒక చోట
చెట్టును కరిచిన మనిషితో
పచ్చన కరువు మరొకచోట
మనిషిలో ‘మనిషి’ కనిపించక
మనిషి మృగమై తిరిగేది ప్రతిచోట
మంచికి అర్థం మారి
చెడు తెలివిగా రాణిస్తుంది ప్రతిచోట
మనసు మనసులో విషబిందువును
నాటే స్వార్ధం ప్రతిచోట.
ఒక్క మనిషి
ఇన్ని ముఖాలు తొడుక్కోవాలా?
ఒక్క జీవితం
ఇన్ని ముఖాలతో గడపాలా?