కవిత్వం ఏమి చెయ్యగలదు? జీవితాన్ని సహానుభూతితో స్పృసించగలదు. బాధల్ని కష్టాలకి అక్షర రూపం ఇచ్చి ప్రపంచం ముందు ఉంచగలదు. కవిత్వానికి ఉన్న శక్తి గురించి గ్రీకు పాశ్చాత్య సాహిత్యకారుడు అయినా ఫిలిప్ సిడ్నీ ఇలా అంటాడు… “The power to move stones and make beasts to listen to it…” (అది రాళ్లను కదిలించగలదు, మృగాలని కూడా శ్రోతలు గా చెయ్యగలదు) మరి కవిత్వానికి రాళ్లే కరిగినప్పుడు మనుషులు మాత్రం ఎందుకు కరగరు? ఇదే ప్రశ్న దాసోజు లలిత మదిలో నిరంతరం రగులుతూ వచ్చింది. చిన్నప్పటి కష్టాలకి, వృత్తి లోని సాధక బాధలకి ఒక అక్షరం రూపం ఇచ్చి బహుజన లోకానికి ఏదో చెప్పాలని ప్రయత్నంలో “దాతి” కవిత్వ సంకలనం తెచ్చారు. ఈ “దాతి” తో చేతి వృత్తుల కష్టాలు ఒక్క తీరుగ లేవు అని తలపోసింది.
సాహిత్యలోకంలో ఎన్ని వాదాలు ఉన్నా కూడా “వృత్తి వాదం” ఒక భిన్నమైన కోణాన్ని చూపుతుంది. కుల వృత్తులు దాదాపు అంతరించిపోయిన స్థితిలో వృత్తి సాధనాల ద్వారా గొంతు విప్పటం బహుశా అతి తక్కువ కావొచ్చు. ఈ “దాతి”లో చాలావరకు చేతి వృత్తిల ఇతి బాధలు, వైయుక్తిక భావాలూ, ఇంకా మహిళల గురించిన కవితలు ఉన్నాయి.
“విద్య ద్వారా సముపార్జించినటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారు ఈ విశ్వాన్ని శాసిస్తారు’’ అని 1848 వ సంవత్సరంలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పాడు.
బహుజనులు (ఎస్.సీ, ఎస్.టీ, బీ.సీ, మైనారిటీ) అంతా ఈ దేశపు ‘మూల వాసీలు’ దేశ జనాభాలో 95 శాతం వున్న బహుజనులను కొద్దీ శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాలు శాసిస్తున్నారు . వీరందరి తరపున తన గొంతుని సవరించి ప్రపంచానికి ప్రశ్నలు వేస్తుంది లలిత. చైతన్యపరచడమనే ప్రక్రియ సుదీర్ఘంగా నిరంతరం కొనసాగించవలిసినది. ఏదో ఒక సమయంలో సందర్భంలో రచనలు చేయడం, సంకలనాలను వేయడంతో పూర్తయ్యేది కాదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. నేడు అస్థిత్వ వాదం ఆలంబన చేసుకొని ఎందరో కవయిత్రులు కవితలు రాస్తున్నారు. దానికి ఉదాహరణగా “నీలిమేఘాలు” కవితా సంపుటిలో గల వంటిల్లును ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఇది వంటింట్లో మహిళా వివక్షత గురించి, స్త్రీలపై పురుషుల గుత్తాధిపత్యాన్ని నిలదీసింది.
చేతివృత్తులు , కులవృత్తులు మన సమాజంలో అనాదిగా ఉన్నాయి. ఆయా వృత్తుల పేర్లతోనే కులాలు ఏర్పడ్డాయి. అయితే ఈనాడు కులవృత్తులు కుప్పకూలుతున్నాయి. ఈ వృత్తుల్నే నమ్ముకున్న వారి జీవితాలు తెల్లారిపోతున్నాయి. ఆధునిక పనిముట్లు ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. చేతిలో చేవఉన్నా పనిలేక బలహీనవర్గాలు నలిగిపోతున్నాయి. ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా చేతివృత్తుల్ని తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలి. ఆ దిశ గా అడుగులు వెయ్యాలని కవయిత్రి బలంగా కోరుకుంటుంది.
నేటి సాహిత్యం లో భిన్న వాదాలు ఉన్నాయి. దళిత వాదం/మైనారిటీ వాదం/బీ సి వాదం ఇలా రక రకాల వాదాలు ఉన్నా అస్తిత్వ వాద /వృత్తి వాద కవిత్వం దగ్గరికి వచ్చేసరికి నిబద్ధత తో రాసే కవయిత్రులని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అస్తిత్వ స్పృహ, లోతైన అభివ్యక్తి, సహానుభూతి, తన కోణంలో సాగే దృక్పథం దాసోజు లలిత కవిత్వ జీవ లక్షణాలు.
మహిళల వైపు నుంచి మాట్లాడుతూనే, ఉద్యమ కారిణిగా, గృహిణిగా, వృత్తి ఉపాధి కారుల గురించి గొంతు వినిపిస్తూ ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది. వృత్తి పరంగా వచ్చే బాధల్ని, ఎమోషన్స్ ని కవిత్వం చేసింది. గీత కార్మికుల గురించి “పందాళ్ల పరుపు తాడమే” లో వివరిస్తూ గీత కార్మికులలో దళారి వ్యవస్థలో ఉన్న అరాచకాల్ని
నిలదీస్తుంది.
“దూపగొన్న ఎట్టి నోర్లకు//వా డీ క ముంతామే /మద్ది పేరైన షేరు ముంతల్లో పులిసిపోయింది ఆమె”. వృత్తి కవిత్వంలో బలమైన అభివ్యక్తి. గీత కార్మికుల వ్యధకు అక్షర రూపం. వాళ్ళ బతుకు పై దళారి ల పెత్తనం నశించాలి అంటుంది.
“ఆమె వాటా పై వాలిన దళారులని
తాటి డెగ్గు అందుకొని తన్ని తరమాలి” పోరాడే విషయము లో ఎక్కడ రాజి పడొద్దు పోరాటం చెయ్యాలి అని ఒక కొత్త చైతన్యాన్ని అందిపుచ్చుకుంది.
చాలామంది సమస్యల నుంచి దూరంగా పోతూ పలాయనవాదం (Escapism_) అనుసరిస్తారు. కానీ లలిత ఎక్కడా కూడా పారిపోవాలని అనుకోలేదు నిలబడి ప్రశ్నించింది. వృత్తి కవిత్వాన్ని బలంగా వినిపిస్తూనే ఉద్యమకారిణి గా తన వంతు అక్షరాన్ని అందించి బాసట గ నిలిచింది. ఇక “దాతి ” కవిత లో రాజుల కాలం నుంచి సమాజం లో భాగం అయి సేవలు అందించినా కూడా ఫలం దక్కలేదని ఆవేదన చెందుతుంది. చట్ట సభలకి పరికరాలు అందించి శ్రమ చిందించటమే తప్ప, తామే చట్టం గా రూపొంద లేకపోయామని వెనుకబాటుతనాన్ని గుర్తించి సరిద్దిదు కోవాలి అంటుంది.
“చట్ట సభల కుర్చీలు
మలిచిన కానీ, నేను ఎందుకో చుట్టాన్ని కాలేదు ..” అంటూ అయినా కూడా రేపటి రాజ్యం కోసం
“వర్ధిల్లే వాకిళ్ళ మీద పెద్ద బాడిశ కి పదును పెట్టాలి
రేపటి రాజ్యం కోసం
కోట్లాది లోగో కావాలి (దాతి)….తమ వృత్తి చిహ్నాన్ని రేపటి రాజ్యం కోసం ఎన్నికల గుర్తు గా మారి అస్తిత్వాన్ని నిలబెట్టాలి ఇదే ఆశయం.
తెలంగాణా ఉద్యమ నేపధ్యం లో “బతుకమ్మ పాట”లో కమ్మరి జీవితం లో కొలిమి కస్టాలు బాగుపడాలి అనుకుంటుంది. కొత్త రాష్ట్రం లో అయినా తమ బతుకులు బాగుపడతాయి అని ఆశించింది.
“ఆమె కల గన్న బుడ్డి దీపం
రెప రెపలాడిన కరువు సీకటి ని నిలిపే
ఎక్కాల వెలుగు కావాలి
జిట్టేడు కడుపు నింపుకునే
కండ్లల్ల వొత్తులు వెలగాలి (బతుకమ్మ పాట )
వృత్తి పుట్టుక పూర్వోత్తరాలు ఎవరికీ తెలుస్తాయి. పరిశోధకులకు కదా… మట్టి లో కలిసిపోయిన కుల వృత్తుల్ని తవ్విన కొద్దీ కన్నీళ్ల కధలు బయటపడుతాయి. అందుకే
“భూమి లోపల పాతిన మా శవాలను తవ్వుకోండి/రాశులకు రాసులు
రాసుకున్నంత వారికి రాసుకున్నంత దొరుకుతుంది [కళేబర సాహిత్యం ]
ఆమె ఒక కదిలే చైతన్యం . పురుషాధిక్యత తనపై జులుం చేసినా కూడా భయపడక ఎదురొడ్డి నిలబడుతుంది. ఎక్కడ జంకని ఒక ధైర్యం .
“గొలుసు లు తెంపుకొని కలలు కంటాను” దాస్య విముక్తి కై /కన్న కల ని నిజం చేస్తుంది. అలాగే తన ఆలోచలని/భావాల్ని ఎవరు అడ్డుకోలేరని తన అడుగులు ఎప్పుడు ప్రగతి పదం వైపే అంటుంది
“నా తడి అడుగుల పై ఆనకట్టలు లేని ఊటనై
నది లా ప్రవహిస్తాను ” అంటూ ఆత్మ స్థైర్యం తో ముందు అడుగు వేస్తుంది.
నలుపు శ్రమకి సంకేతం. కష్టపడి దాచుకున్నది నల్ల దనం గా మారితే బాధ ఉంటుంది కదా. కుబేరులంతా పేదోళ్ల ధనాన్ని అప్పనం గా నల్ల దనం గా మార్చుకొని బ్యాంకుల్లో దాచుకొని లూటీ చేస్తున్నారు అని దాన్ని బయటకు తీయాల్సిందే అంటుంది ..అలాగే నలుపు ఏమి అసహ్యించుకునేంత వికారం ఏమి కాదని, నలుపు ఈ దేశపు శ్రామిక వర్గానికి సంకేతం అని బలంగా నమ్ముతుంది.
“ఈ దేశం లో శ్రమంతా నలుపు కి ప్రతీక
మరి మాకు చెందాల్సిన నల్లధనం
ఏ ప్రపంచ బ్యాంకు లో బందు అయ్యింది” అని నల్ల దనం పై సూటి ప్రశ్న… ప్రజల్లో చలనం వచ్చినప్పుడే నల్లధనాన్ని బయటకు తీసుకు రాగలం. ఇది ఎవరిదో కాదు జనం డబ్బు. జనాలకే చెందాలి.
“మా శ్రమ ను గౌరవించే సమస్త చలనం కావాలి
ప్రపంచం నలుమూలల్లో దాగిన నల్లధనం//జనం కట్టిన పన్నులే దాన్ని జన దనం చేయాలి (చలనం కావలి) కవిత లో నినదిస్తుంది.
తెలంగాణ మలి దశ ఉద్యమం విజయం సాధించిన రాష్ట్రం లో తమ బతుకు చిత్రం ఎలా ఉందొ అవత “రణ” స్థూపాలలో చక్కగా వివరించారు. అభివృద్ధి చేస్తాం అన్న నాయకులు ముఖం చాటేసి చేయాల్సిందంతా చేశారు . ఉద్యమం కోసం కొడుకుల ప్రాణాలు త్యాగం చేశారు అవి వృద్ధానే ..
“త్యాగాల పూలలో ఇంటి గోడ ఫోటో లు
పూల చెండువలే అల్లిన/మాటలెన్నో వింటున్నా
కడుపు లో దుఃఖం దుమారం” అవును కొడుకులని కోల్పోయిన దుఃఖం తీరేది కాదు
ప్రజా ఉద్యమాన్ని అణిచివేసే స్థలాలని //నిరసన తెలియజేచే గడ్డ ల్ని బ్యాన్ చేస్తే ఉద్యమాన్ని నీరు కార్చవచ్చని ఎక్కడ ఉద్యమం రాజుకుంటుందో వాటి అన్నీటిని తుడిచి పెట్టేసింది ఇదేనా స్వేచ్ఛ అంటే
“ధర్నా చౌక్ ముందు/మల్లన్న నిర్వాసితులు/యురేనియం తవ్వకాలు/ఇంటికొక ఉద్యోగం ఎగవేత /వృత్తి ఉత్పత్తులకు తెడ్డు/ఇంటర్ బోర్డు కు ఉరిపడ్డ పిల్లలు “
వివిధ సందర్భాల్లో జరిగిన అన్యాయాలపై ఎలుగెత్తిన నిరసన అక్షరం అది. ఒకచోట అణిచివేస్తే మరొకచోట మొదలు అవుతుంది అని భయం. తమ జనాలపై జులుం చేసే ప్రతీ సందర్భం లో రాజ్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. తమ కలల్ని/బతుకుల్ని అణిచివేసే ఎవ్వరిని సహించదు.
సొమ్ము ఒకడిది అయితే సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యమం చేసి సాధించిన రాష్ట్రం లో పాలుపంచుకున్న నిజమైన వీరులకి కాకుండా, ఉద్యమం తో సంబంధం లేని వారికి పట్టం కట్టి అందలం ఎక్కించడం చాలా నిరాశ కి గురి చేసింది.
“వలస దోపిడీ పార్టీలు చెంత చేరి
తెలంగాణ కోసం నినదించని తలల పిడికిళ్లు
అధికార పీఠాల్ని పూనారు “…నిజమే త్యాగం ఒకడిది అయితే.దాని ఫలం ఇంకొకడు దోచుకుపోవడం ఇదే ఇప్పటి రాజ నీతి … మరి వీటికి పరిష్కారం ఏమిటి, పోరాటమే..
“మలి విజయం లో అపజయం //రేపటి తోలి పోరాట బీజం రణ స్థూపాలు అవుతాయి” {అవతరణ స్థూపాలు}
చైతన్య మాంద్యం (hypnoactivity) ఆలోచనలలో మాటలలో అవసరమైన చురుకుదనం లేకపోవడం. ఈ రకమైన లక్షణం ఎక్కడా లలిత లో కనిపించదు. పరిస్థితులకి తగ్గట్టు గా ఎప్పుడు చురుకుగా తన ఆలోచనల్ని చైతన్యం వైపు గా మరలిస్తుంది. బహుశా తన చిన్నప్పుడు అనుభవించిన కష్టాల వలన కావొచ్చు స్థబ్ధత ఎక్కడ కనిపించదు. అదే ఆ లక్షణమే తనని ఉద్యమ బాట వైపు నడిపించింది. బాల్యం అందరికి తీయటి జ్ఞాపకం అయితే తనకి మాత్రం చేదు .. “నిమ్మ పచ్చగోదా ” లో అందమైన బాల్యం కష్టాల కొలిమి లో కాలిపోతే ?,ఓదార్పు కోసం అక్షరాలలో సేద తీరుతుంది. పేలాలు తో కడుపు నింపుకున్న పేదరికం ఇప్పటికి వెంటాడుతూనే ఉంటుంది. అందుకేనేమో
“పొట్ట నింపే గోండు పేలాలు
అమ్మ చెట్ల మీద వాలిన బాల్యం
ఇప్పుడు బొట్టు బొట్టు గా పగిలే (గుండె )
జిగురై కారుతుంది …ఎంత గోస పడిందో కదా…
మన దేశం వ్యవస్థ అంతా వ్యవసాయ ఆధారితమే …ఎంత అభివృద్ధి లోకి దూసుకుపోతున్నా కూడా వ్యవసాయన్ని మరువలేదు అలాంటి వ్యవసాయాన్ని దెబ్బ తీసే చట్టాలని పాలకుల నిర్లక్ష్యాన్ని తనదైన మాండలిక యాస లో ఖండించింది. వ్యవసాయ పాలసీ కి వ్యతిరేకం గా కలం ఝళిపించిది.
“పాలక వర్గాల కంచె గేట్లు తెంపుకొని
చేలో మేస్తున్నాయి”
కాపు కాయాల్సిన వారే వ్యతిరేకంగా పాలసీ లు తెస్తే బతుకు భారమే కదా అది మూగ జీవులకి అయినా మనుషులకి అయినా [జీవాలకి మేత కావాలి ]
వీరి కవిత్వం ఒక ప్రభావక ఉద్దీపన (Effective Stimulus) కవిత్వం ద్వారా తమ భావజాలానికి దూరం గా ఉన్నవారిని కూడా ఒప్పించగల ప్రతిభ వీరి సొంతం ఇంకా ప్రతిస్పందన ని తెప్పించగలదు ..
చాలామంది కవులు కవిత్వానికి కావలసిన ఆలోచనను ని చివరివరకు కొనసాగించరు కానీ లలిత ఒక నిశ్చితత్వ ఆలోచన [Consitency of thought ] చివరి వరకు కొనసాగిస్తూ తన భావాన్ని అక్షరంలో నింపేస్తుంది. ఈ ఆలోచన క్రమం నుంచి ఎన్నో కష్టాలని ఎదుర్కొంది . అది వృత్తి పరంగా కావొచ్చు …పర్సనల్ గా అయినా అయ్యి ఉండొచ్చు కానీ కష్టాలు వచ్చాయి అని తాను నమ్మిన మార్గాన్ని వదల్లేదు. అక్షరం తో నే చైతన్యం వస్తుంది అని నమ్మి ముందుకు సాగారు
సామాజిక సున్నితత్వం (Social Sensitivity) చాలా కవితల్లో చూడవచ్చు ..అది తన తల్లి తండ్రుల గురించి చెప్పినప్పుడు, ఇంకా స్త్రీ తన సహజ భావజాలం పరంగా వెలువరించిన కవితల్లో చూడవచ్చు ..ఒక వైపు సున్నితంగా ఉంటూనే, అన్యాయాన్ని నిలదీస్తుంది. ఏదైతే బలంగా విశ్వసించిందో అదే కవిత్వం గా మలుచుకుంది. ఇతరుల అభిప్రాయాలు తన కవిత్వం మార్చలేవు. ఒక నిబద్ధత నిజాయితీ ఉంటుంది. ఒకటే లక్ష్యం అన్యాయాన్ని ప్రశ్నించాలి ..”ఇప్పటికి యుద్ధాశ్రమమే ” కవితలో మనుస్మృతి ఆధారిత లో స్త్రీ ఎప్పటికి అణిగి మణిగి ఉండాలి అన్న సూత్రాల్ని ఖచ్చితంగా నిలదీస్తుంది.
“అదే మంచం మీద/పురిటి బిడ్డలని కంటుంది
వంశం నిలుపుతుంది/అదే కదా మనువు ప్రసాదించిన స్త్రీ పాత్ర “/ ఎప్పుడో యుగాల కింద రాసిన మనుస్మృతి ఇప్పటికి ఈ పురుషాధిక్య సమాజం తమపై రుద్దడాన్ని నిరసిస్తుంది. తనని తానూ నికార్సమైన స్త్రీ వాది అని కూడా అనుకోదు కానీ తన సంఘర్షణల నుంచి / అనుభవాల నుంచి అక్షరాల్ని రాస్తే మాత్రం ఖచ్చితంగా స్త్రీ వాదం వైపే నిలబడుతుంది.
చాలా కవితల్లో వాడిన ప్రతీకలు చాలా ఆశ్చర్యం గొలుపుతాయి. మాండలికం లో కూడా ప్రతీకల్ని వాడటం అతి కొద్ది మంది కి మాత్రమే సాధ్యం
“ఆకాశం లోనుంచి వేలాడే జడకు నక్షత్రాల్ని మూటగట్టి
ఆమె సెమట తడి ని జుర్రి జుర్రి / “
చాలా చోట్ల సిద్ధార్ధ కవిత్వం గుర్తుకు వస్తుంది ..ఇంకా ఆ మాండలికం లో రాసిన అన్నవరం దేవేందర్, నలిమెల భాస్కర్ గారి యాస సౌందర్యం అద్భుతంగా ఈ సంచిక లో కనిపిస్తుంది మనకి. ఒక యుద్ధం చేసే వీరనారిగా ఉన్నా కూడా కేవలం స్త్రీ కారణంగా భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. తన కవిత్వం లో కాల్పనికత కన్నా సామాజిక వాస్తవికత (Social Reality) ఎక్కువగా చూడొచ్చు. ప్రతి వ్యక్తి కి జ్ఞాపకాలు ఉంటాయి అది మంచివి కావొచ్చు/చేదు నిజాలు/.చెడు కావొచ్చు . తన అన్న/చెల్లి/తమ్ముడు లతో తనకి ఉన్న అనుభవాల్ని జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ “జ్ఞాపకాల తుట్టెలో” వివరిస్తుంది.
“ఒకే కొమ్మకు పూసిన కొలిమి పూవులం
నడిసి న నేలలో దిగబడ్డ చిన్న పాద ముద్రలం ” అలాగే నాన్న తో తనకి ఉన్న అనుబంధాన్ని యాది చేసుకుంటూ ఇలా అంటుంది
“నాయన విప్పారిన రెక్కల మీద ల్యాండ్ అయినా విమానాలం” వాహ్ ఎంత గొప్ప పోలిక తెచ్చిందో చూడండి. అన్న లో అమ్మా నాన్న ని చూసిన చెల్లి ఇలా అంటుంది
“ఎప్పటికైనా నీ భుజాల మీద మళ్ళీ ఉప్పు బస్తానే
ఒక్కసారి నా కోసం వచ్చేయి
అక్షరపు బస్తా గా మారి ఎదురు చూస్తున్నాను (జ్ఞాపకాల తుట్టె )… తన వాళ్ళతో తనకి ఉన్న ప్రేమ ని ఇంత పావురం గా ఎవరు వివరించగలరు.
సమాజంలో భిన్న వృత్తులలో ఉన్న కష్టాలకి /ప్రశ్నలకి తన కవిత్వం ద్వారా సమాధానం ఇవ్వాలి అని పూనుకుంది. ఒక సామాజిక తదానుభూతి (Socio Empathy) కనిపిస్తుంది. వారి ఆలోచనల్ని /అనుభూతుల్ని అక్షరాల సాయంతో కవిత్వమై ఎదురొడ్డి నిలబడుతుంది. ఇలాంటి ఒక వైఖరి చాలా కవితల్లో కనిపిస్తుంది. ఇక తన కవిత్వానికి కావలసిన అన్ని వస్తువులని చక్కగా వాడుకున్నారు. ఎవరికీ పట్టని సంచార జీవితాల గురించి ఎంత బాగా రాసారో ….
“సగం దేశాన్ని సంక పావులా జెసి /కొంగున వాళ్లే కట్టుకున్న నూటొక్క పేదరికం .//ముతక సంచార తల్లి (ముతక చీర ) ….
అభివృద్ధి పేరిట వాతావరణాన్ని కలుషితం చేస్తున్న తీరు ని నిలదీస్తుంది . కవులు రచయితలు మేల్కొని ఈ సమస్యలపై గళం విప్పాలని ఆశిస్తుంది.
“తాగే నీళ్లలో మలినాలు
బోరు బావుల విష రసాయనాలు
కడుపు లో ఆయాలకు తూట్లు “
కాలుష్యపు నీళ్లు తాగిన ఫలితం ఇది.అందుకే
“నినదించే గొంతులకి కోరస్ లవుదాము” అని ఈ పోరాటం లో తనతో కలిసి నడవాలని /దాని కోసం సమిష్టి అక్షర ఆయుధమై పోరాటానికి స్వాగతం పలుకుదాం రాండ్రి అంటుంది.
ఒక చైతన్యం రావాలి అంటే ఆలోచన ముఖ్యం. చైతన్యాన్ని శబ్దం లో ఇమిడ్చి తానూ ఏమిటో తెలుసుకోమని చెప్తుంది. ఈ చైతన్యం అన్ని అణచివేత అని ప్రశ్నిస్తుంది కాబట్టి మన పోరాటానికి చైతన్యం అవసరం అని భావిస్తుంది.
“నిరసన అక్షరం నా శబ్దం
విదేశీ పెట్టుబడుల పై తిరుగుబాటు నా శబ్దం
ఆట పాట .,మాటలపై
అణిచివేత పై నా అస్త్రం శబ్దం “
స్త్రీల పై అణచివేత ల ధోరణి నిలదీస్తుంది ..ఎక్కడా రాజి పడకూడదు అంటుంది
“నాలోని నేను /నా చుట్టూ నేను /భ్రమణ శబ్ద తరంగాన్నీ (శబ్దం)..
వృత్తి కవిత్వానికి పట్టం కట్టిన లలితకి అభినందనలు. పైన ఉదాహరించినవి కేవలం పరిచయం కోసం మాత్రమే. దాతి ని పూర్తి గా చదివితే లలిత ఆలోచలలో ఎలాంటి తప్పు లేదని భావిస్తాం. నిజాయితీ గా బహుజన లోకానికి తన వంతు గా గొంతు కలిపి నడవమని ఆహ్వానం అందిస్తుంది . సబ్బండ వర్గాల శ్రేయస్సు కై కదం కలిపి నడవమని అభ్యర్థిస్తుంది. చైతన్యం తో నే అభివృద్ధి సాధ్యమని నమ్మింది కాబట్టే సూటి గా ప్రశిస్తుంది. ఈ ప్రయాణం లో మరిన్ని విజయాల్ని సాధించాలని కోరుకుంటూ మంచి కవిత్వాన్ని అందించిన దాసోజు లలిత కి ధన్యవాదాలు…