విసుక్కోకు జీవితమ్మీద

విసుక్కోకు జీవితం మీద
గిన్నె అడుగున మిగిలిన నాలుగు మెతుకుల్లాంటి జీవితం మీద
సాయంత్రంలోకి అదృశ్యమవుతున్న వెచ్చని మధ్యాహ్నపు ఎండలాంటి జీవితమ్మీద
నిన్ను పెంచిన జీవితం మీద
అందరూ వదిలేసినప్పుడు నీ చెయ్యి గట్టిగా పట్టుకున్న జీవితం మీద
నీతో పాటు నీ దుఃఖాన్ని తాగిన జీవితమ్మీద
నీ ఏకాంతపు చీకటి రాత్రుళ్ళల్లో నిన్ను కౌగలించింది తానే కదా
నిన్ను దహించివేసే వేసవి మధ్యాహ్నాలకి వాన చినుకులైంది తానే కదా…!
నీ ఆకలికి నిండు కంచమైంది తానే కదా
నీలోకి దారులు చేసుకుంటూ వచ్చిన జీవితం
నీ గుండెల్లో గూడు చేసుకుని పక్షిలా
అలా సర్దుకుని ఉండిపోయింది కదా నిన్ను వదలక
మిగిలిన జీవితాన్ని
నీ తావులోకి పాల పుంతలా జారుతున్న జీవితాన్ని
పాడు జీవితమంటూ విసుక్కోకు
అర్థ చంద్రుడిలా మిగిలిన ఈ కొద్ది జీవితానికి
నీ నుంచి ఎగిరిపోయిన సగం జీవితానికి కొంత ఆకాశాన్నివ్వు
కొన్ని నక్షత్రాలని ఇవ్వు
కాసింత వెన్నెలనివ్వు
మబ్బులతో స్నానం చేయించు
పోనీ ఏమీ చేయలేక పోతే
“ఆజ్ జానేకి.. జిద్ నా కరో… మేరే పెహెలూ మే బైటే రహో”.. అంటూ
తన జీవితపు చివరంచు మీద నిలబడి పాడుకున్న ఫరీదా ఖాన్నుమ్ లా పాడుతూ
నీతో గజల్ అంత మధురంగా ఉండిపొమ్మని నీ జీవితాన్ని బ్రతిమిలాడుకో
బుజ్జగించుకో వూయలలూపుకో
నీ గుండెలకు హత్తు కొని నీనుంచి..విడివడనివ్వకిక
ఎవరో కోసినట్లున్న సగం నెలవంక లాంటి జీవితాన్ని పూర్ణ చంద్రుణ్ణి చేసుకో
చూడూ… విసుక్కోకు
సగం మిగిలిన జీవితంలో ఆకలి ఉంటుంది కానీ అన్నం ఉండదు
మొహబ్బత్ ఉంటుంది కానీ ప్రేయసో ప్రియుడో ఉండరు
దాహానికి మధువే కాదు మంచు బిందువులూ దొరకవు
నీ మీద పిడుగు పడ్డా గూడు ఉండదు
మిగిలిన సగం జీవితంలో అమ్మా నాన్నా, బిడ్డలూ, భార్యా భర్తా, బంధువులూ, స్నేహితులూ ఉండరోయి
అంతెందుకు నీకు నువ్వే ఉండవు
నీకు కళ్ళో… కాళ్ళో…చెవులో ఉండవు
బహుశా నువ్వు నడవలేవు కూడా
నీ సగం మిగిలిన జీవితానికి పక్షవాతం వచ్చి ఉండొచ్చు
నీ సగం ఎండిన తోట ముసలి వాసన వస్తుండొచ్చు
జీవితం నీ దేహలాలిత్యాన్నో… దృఢత్వాన్నో ముడుతలు ముడుతలుగా మడత పెట్టేయచ్చు
అయినా కానీ చూడూ… జీవితమ్మీద విసుక్కోకు
ఎందుకంటే..ఎడారి కి కూడా సూర్యచంద్రులు ఉంటారు
అమావాస్యకి కూడా లోకాన్ని చూసే కన్నుంటుంది
ఎండి రాలిన పూలలో కూడా సౌరభం ఉంటుంది
మిగిలిన నీ జీవితపు ఖాళీ పాత్రని నింపడానికి ఎక్కడో
ఏ ఆకు పచ్చని అడవిలో తుట్ట తేనె… కొమ్మకు వేలాడుతూనో
ఏడేడు సంద్రాలావల నుంచి
నీ కోసం ఈదుతున్న మనిషి హృదయంలోనో
కొద్దిగా మధువు మిగిలే ఉంటుంది
ఋతువులన్నీ నీ వాకిలి ముందు దాహంతోనో… మోహం తోనో తచ్చాడుతూనే ఉంటాయి
కానీ తలుపుల్ని కాస్త వారగా నన్నా తెరిచి ఉంచుకో
వచ్చిన వాళ్ళు నువ్వు లేవని వెళ్లిపోదురుగాక
విసుక్కోకు ఈ జీవితం మీద…

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

One thought on “విసుక్కోకు జీవితమ్మీద

Leave a Reply