రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడం దానికదే నేరం కాదు. చట్టానికి లోబడి ఆ విశ్వాసాలను ఆచరించడం, ప్రచారం చేసుకోవడము న్యాయసమ్మతం. ప్రజలు, సంస్థలు, వ్యక్తుల అభిప్రాయాలతో పాలకులు విబేధించవచ్చు. అంత మాత్రానా వారి నోరునొక్కడం, వేధించడం, నిర్బంధించడం తప్పు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రజల వాక్ స్వాతంత్య్రానికి గ్యారంటీని ఇస్తున్నది. అయితే కాంగ్రెస్ మొదలు ఇవ్వాళటి బిజెపి వరకూ అన్ని ప్రభుత్వాలు మీసా, టాడా, యూఎపిఎ పేరిట కరడుగట్టిన నల్ల చట్టాలను తీసుకొచ్చి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించాయి. ఈ దుర్మార్గం ఇంకా కొనసాగుతుంది. సంస్థలు, వ్యక్తుల హక్కులను హరిస్తూ, ప్రజస్వామిక భావనలను, విలువలను ఛిద్రం చేస్తూ ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలకు తావులేకుండా పోయింది. ఉంటే మాతోటి ఉండాలె. లేదంటే ‘దేశద్రోహి’వే అనే విధంగా అధికార మత్తులో పాలక పార్టీలు తమకు గిట్టని వారిపై ముద్రలు వేస్తున్నాయి.
సమాజం చైతన్యం అవుతున్న కొద్దీ నేర విచారణలోనూ, నిర్ధారణలోనూ మేలైన మార్పు రావాలి. కాని అందుకు విరుద్ధంగా విచారణ లేకుండానే నిందితులను- నేరస్థులుగా పరిగణించడం, వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా నిర్ధారించడం జరుగుతోంది. ఇవ్వాళ రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడమే నేరంగా మారింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర చేసిండ్రంటూ ‘భీమా కోరెగావ్’ (ఎల్గర్ పరిషత్) ‘కుట్ర’ కేసులో దేశ వ్యాప్తంగా పదిమంది బుద్ధిజీవులను అరెస్టు చేసిండ్రు. వారిపై సవరణలు చేసి, మరింతగా పదును పెట్టిన అమానుష ‘యూఎపిఎ’ (అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్) చట్టాన్ని ప్రయోగించి బెయిల్‌కు వీలు లేకుండా కేసులు నమోదు చేసిండ్రు. ఇలాంటి కేసులే విప్లవ కవి, తెలంగాణ వాది వరవరరావు మీద కూడా పెట్టిండ్రు. అట్లాగే మరో కేసులో అంతర్జాతీయ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధంగా 90శాతం వికలాంగుడైన సాయిబాబను ‘అండాసెల్’లో పెట్టిండ్రు.
న్యాయంకోసం- చట్టపరిధిలో కొట్లాడేందుకు ప్రభుత్వాలు ‘యూఎపిఎ’ పేరిట పెట్టిన కేసులు అడ్డొస్తున్నాయి. న్యాయదేవత కళ్ళకు గంతలు బదులు ఏకంగా ముసుగేసిండ్రు. ఇట్లాంటి కేసుల్లో సాధారణంగా విచారణాధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అయితే అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారాలను సైతం హరించింది. మహారాష్ట్ర పరిధిలోని కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తమ ఆధీనంలోకి తీసుకున్నది. కేంద్రం కక్ష సాధింపుకు, హై హాండెడ్నెస్ ధోరణికి ఇది మచ్ఛు తునక. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు కరోనా సమయంలో సైతం ఈ బుద్ధిజీవుల విడుదలను డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. సభలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. చట్టం పేరిట తమ పాలకులు తమ ఇంటరెస్టులను అమల్లో బెడుతున్నారు. కాసేపు చట్టం ఏమి చెబుతుందనేది కొంచెంసేపు పక్కనబెడితే.. ముందుగా మనం మనుషులం. మనుషులుగా… మానవత్వమున్న మనుషులుగా ఆలోచిద్దాం.
ఇండియన్ పీనల్ కోడ్ మే 1, 1861 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సెక్షన్ 82 ప్రకారం ఏడేండ్ల లోపు బాలుడు ఏమి చేసిన నేరం కాదు. 2012 -నిర్భయ కేసు తర్వాతనే 16-18 ఏండ్లలోపు పిల్లలను తీవ్రాతి తీవ్రమైన కేసుల్లో మాత్రమే శిక్షార్హులుగా నిర్ణయించాలని తీర్పునిచ్చారు. నిజానికి 18 ఏండ్లలోపు పిల్లలు నేరాలు చేసినట్లయితే దానికి సమాజమే బాధ్యత వహించాలి. బాల నేరస్థులను ‘కరెక్షన్’ సెంటర్‌లో ఉంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని రాజ్యాంగం చెప్పింది. ఇందులో వయసు రీత్యా, నేర స్వభావం రీత్యా కొంత శిక్షల్లో తేడా ఉన్నది.
బాలలకు వర్తిస్తున్న చట్టాలే ‘వయోవృద్ధు’లకు కూడా అమలు చేయాలి. ఇందుకు ప్రభుత్వాలు మానవీయ దృష్టికోణాన్ని అలవరచుకోవాలి. ‘భీమా కోరెగావ్’ కేసులో అందరు నిందితులు ‘వయోవృద్ధులు.’ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ‘సీనియర్ సిటి జన్ చట్టం-2007’కు సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం పెద్దలను వేధిస్తే ఆరు నెలలు జైలు, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ సవరణలు తీసుకొచ్చింది. ఈ సవరణలను ప్రస్తుత బిజెపి ప్రభుత్వం తరపున సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థాపర్‌చంద్ గహలోత్ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిండు. వేధింపులంటే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపూరితంగా, ఆర్థికంగా, దూషణ ద్వారా హింసించింనా వేధింపులే అని చట్టం చెబుతుంది. అట్లాగే సంరక్షణలో నిర్లక్ష్యం వహించినా వేధింపుగానే గుర్తించింది. కన్నపిల్లలు, దత్తత సంతానం, సవతి పిల్లలు, మనమలు, మనవరాండ్రు, అల్లుళ్ళు ఈ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెబుతుంది. అంతేగాకుండా ఇట్లాంటి కేసుల్లో ప్రత్యేక ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసి సత్వర న్యాయాన్ని చేకూర్చాలని కూడా చెప్పింది. 80 ఏళ్ళకు పైబడిన వారు దాఖలు చేసే పిటిషన్లను రోజుల్లోనే పరిష్కరించాలని కూడా ఈ చట్టం చెబుతుంది. అయితే బిజెపి ప్రభుత్వం తాను చేసిన చట్టాలను తానే అతిక్రమిస్తోంది. కనీసం తాము చెప్పే ‘పెద్దలను గౌరవించడం’ అనే సంప్రదాయానికి కూడా కట్టుబడి లేదు. పెద్దలు, వృద్ధులు, వికలాంగుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ లేకుండానే కరడుగట్టిన నేరస్థులతో వ్యవహరించినట్లుగానే వారితోనూ వ్యవహరిస్తోంది.
వరవరరావు ఎనిమిది పదులు దాటిన వయసులో ఎక్కడికి పారిపోతాడని నిర్బంధంలో ఉంచి విచారిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ‘కరోనా’ వైరస్ రాపిడ్‌గా స్ప్రెడ్ అవుతున్నది. ఈ పాండమిక్ పరిస్థితుల్లో జైలులో నిందితులకు, మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే ‘వయోవృద్ధుల’కు వైరస్ వేగంగా సోకే ప్రమాదమున్నది. అల్రెడీ వరవరరావుకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. హక్కుల సంఘాల ప్రతినిధులు కోర్టుని ఆశ్రయిస్తే గాని మెరుగైన వైద్య సహాయం అందని స్థితి. వరవరరావు బాడీలో ఉండాల్సిన సోడియం, పోటాషియం లెవెల్స్ గణనీయంగా పడిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హక్కుల సంఘాల వాండ్లు, ప్రజాస్వామిక వాదులు ఆందోళనలో ఉన్నారు. అట్లాగే 90శాతం వైకల్యంతో తన పనులు తాను చేసుకోవడమే కష్టంగా గడుపుతున్న సాయిబాబపై ‘దేశద్రోహం’ లాంటి తీవ్రమైన నేరాలు మోపిండ్రు. వికలాంగుల పట్ల కనీస గౌరవం, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారు.
గత ఐదు దశాబ్దాలుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఉద్యమకారుడు, విప్లవ రచయిత సంఘం స్థాపకుల్లో ఒకరైన వరవరరావు రాజకీయ కార్యాచరణతో అందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు అభిప్రాయం కలిగి ఉండడమే నేరం అనే విధంగా అరెస్టులకు తెరలేపింది. ఈ పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం మెరుగైన, మేధోవంతమైన సమాజానికి సూచికగా గుర్తించాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విఘాతం కలిగిస్తూ అమానవీయమైన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. చట్టాలు అమానవీయంగా ఉన్నప్పుడు మాట్లాడాల్సింది ప్రజా ప్రతినిధులు. అయితే ఈ ప్రజా ప్రతినిధులు ప్రజలకు పూచిదారులుగా కాకుండా, కాళోజి అన్నట్టు ‘పార్టీవ్రత్యం’తో పార్టీలకు బద్ధులు కావడంతో సమస్యలు మరింత జఠిలంగా తయారయ్యాయి. ఎక్కడ సమస్యుందో పరిష్కారం కోసం కూడా అక్కడే వెతకాల్సిన అవసరమున్నది. అందులో భాగంగానే చట్ట పరిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. ప్రజాస్వామిక వాదులందరూ ప్రభుత్వంపై వత్తిడి పెంచి నల్ల చట్టాలు చెల్లబోవని తేల్చి చెప్పాలి.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, దేశ చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వ్యక్తులు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజుకు 50వేలు దాటి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో జైళ్లల్లో ఖైదీలకు ముఖ్యంగా ‘వయోవృద్ధులై’న ఖైదీలకు రక్షణ లేదు కాబట్టి వారిని వెంటనే విడుదల చేయాలి. ఆరు పదులు దాటిన వారందరినీ ప్రభుత్వం ‘రిటైర్’ చేసి వృద్ధులుగా గుర్తిస్తుంది. అంతర్జాతీయ కోర్టు ప్రమాణాలను లెక్కలోకి తీసుకున్నా 65 ఏండ్లు నిండిన వారిని ‘వయోవృద్ధులు’గా గురించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల చార్టర్- వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెబుతుంది. అందువల్ల ఈ విషయంలోనూ అరవైఐదేండ్లు దాటిన వారిని, విచారణలో ఉన్న నిందితులను వెంటనే విడుద చేయాలి. ‘కరోనా’ సమయంలో ఇది ప్రభుత్వాల బాధ్యత కూడా!
నిజానికి ‘జువెనైల్’ చట్టం లాగానే ‘సీనియర్ సిటిజెన్’ చట్టంలో మెరుగైన మార్పులు తీసుకొచ్చి నేర తీవ్రత/శిక్షార్హతను బట్టి వారికి మినహాయింపును ఇవ్వాలి. బెయిలు సదుపాయం కల్పించాలి. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అంతర్జాతీయ న్యాయసూత్రాలను, మానవ హక్కుల కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటిని ఆదర్శంగా పాటించాలి.
వచ్చే పంద్రాగస్టు (2020) నాటికి తెలంగాణలోని జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. అట్లాగే తెలంగాణ ముద్దుబిడ్డ వరవరరావు విడుదలకు కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. 2005లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్రమంత్రి హోదాలో చంచల్‌గూడా జైలులో ఖైదీగా ఉన్న (నిషేధిత విరసం సంస్థ బాధ్యుడుగా) వరవరరావుని నిబంధనలను అధిగమిస్తూ కలిసిండు. ఆయన విడుదలను డిమాండ్ చేసిండు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గౌరవం, మర్యాద, గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి వరవరరావు. అంతే కాదు నిఖార్సైన తెలంగాణ వాది. తెలంగాణ ప్రేమికుడు. 1968 నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆనాడు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరపున జయశంకర్ సార్‌తో కలిసి ఉద్యమాలు చేసిండు. రచయితగా తన కర్తవ్యాన్ని నిర్వర్వించిండు. అట్లాంటి వ్యక్తిని ‘యూఎపిఎ’ చట్టం కింద అరెస్టు చేసి బెయిలు నిరాకరించడం అమానుషం. వరవరరావు అరెస్టు తెలంగాణ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన విడుదలకు చట్ట పరిధిలో ఉన్న అవకాశాలన్నింటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలి. తమకు కేంద్ర నాయకులతో ఉన్న సత్సంబంధాలను వివి విడుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వినియోగిస్తే తప్పేమి లేదు. ఎందుకంటే 2018-19 ఎన్నికల సమయములో ఈ విషయాలను కేసీఆర్ సభల్లో మాట్లాడిండు కూడా. వివి విడుదలను డిమాండ్ చేయడం వల్ల కేసీఆర్ గౌరవం ఇనుమడిస్తది కూడా. కాళన్న, జయశంకర్ సారు బతికుంటే ఇదే కోరుకునేవారు. జయశంకర్ సారు సిద్ధాంతాలతో నడుస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ కూడా వివి విడుదలకు కృషి చేయాలి.
వరవరరావు రాజకీయ విశ్వాసాలతో విభేధాలున్నప్పటికీ చట్టపరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఆయన విడుదలకు ఏ విధంగా తోడ్పడగలదో ఆలోచించాలి. మాట సాయం, న్యాయ సాయం, నైతిక మద్ధతు ఇట్లా అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం మద్ధతు తెలిపేందుకు అవకాశమున్నది. నల్ల చట్టాలను సమర్ధిస్తూ పోయినట్లయితే ఎపుడో అపుడు ఎంతటి వారైనా దాని కోరల్లో చిక్కుకు పోయే ప్రమాదమున్నదనే సోయితో ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు మెలగాలి.
వీటన్నింటి కన్నా ముందుగా జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యంతో ముంబయి సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో కోవిడ్-19కు చికిత్స పొందుతున్న వరవరరావుకి మెరుగైన వైద్య సహాయం అందేలా మహారాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్రం తరపున అధికారికంగా వత్తిడి తీసుకురావాలి. ఆయన ప్రాణాలు కాపాడడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.