వివాహాంధకారం లోంచి…

ఆ వేళ వెన్నెల మచ్చలు దేరి, పొడలు పొడలుగా పడుతోంది. చెట్లూ, మొక్కలూ, గడ్డీ గాదం దాహం తీరక దిగులుగా ఉన్నాయి. వెన్నెలని ఆశించని వీధిలైట్లు వెర్రిగా వెలుగుతున్నాయి. దేన్నయినా మింగేయడానికి సిద్ధం అన్నట్లు రోడ్‌ మెలికలు తిరుగుతోంది. అమ్మలు పరిగెడుతోందో, నడుస్తుందో ఆమెకే తెలీదు. వగురుస్తుంది. అయినా ఆగడం లేదు. అది రాత్రి అని ఆమెకి తెలియడం లేదు. ఒంటరిదాన్నన్న స్పృహ లేదు. పరుగులాంటి నడక సాగిస్తూనే ఉంది. ఎక్కడ ఉందో కూడా ఆమె గమనించుకోవడం లేదు. గుండె అదురు అంత పరుగులోనూ ఆమెకి దడగా వినిపిస్తూనే ఉంది. అంత గట్టిగా వేగంగా కొట్టుకుంటున్న గుండె ఆగిపోకపోవడమేంటన్న ఆలోచన ఆమెకి లేదు. ఎంత దూరం పరిగెట్టిందో తెలీదు. ఎంత సేపట్నించీ పరిగెడుతోందో గుర్తు లేదు. ఆయాసం పెరిగి గుండె దడ ఉధృతమయ్యి ఇక కాలు ముందుకేయలేనన్న స్థితిలో మెల్లిగా ఆగింది. కళ్లు రోడ్‌ని చూశాయి. తన నీడ తనకే భయమేసేటట్లు సాగి ఉంది. ‘అమ్మో’ అని గుండెమీద చెయ్యి వేసుకుంది. రోడ్‌ మీద ఒక్కసారిగా కూలబడిపోయింది. తలకూడా అదురుతున్నట్లుగా తెలిసింది. రెండు కాళ్లు దగ్గర చేసి, కూర్చొని తలని ముడుకుల మధ్యకి చేర్చింది. వగర్పు ఆగేవరకూ అలానే కూర్చుంది. చేతి మీద ఏదో స్పర్శ తాకి భయంతో తల ఎత్తింది. మళ్లీ గుండె దడదడలాడిపోయింది. మెల్లగా కళ్లు తెరిచి చూసేసరికి తన చెయ్యి నాకుతూ పక్కన రాజు. ఏడుపు ఉప్పెనలా తన్నుకొచ్చింది. గట్టిగా ఏడుస్తూ రాజుగాడ్ని రెండు చేతుల్తో చుట్టేసి, నుదుటిపై ముద్దుల వర్షం కురిపించేసింది. కుయ్యి కుయ్యి మంటూ రాజు ఆమె మొహాన్ని నాకడం మొదలు పెట్టింది. అమ్మలుకి దుఃఖం మరింత వెల్లువెత్తింది. దాన్ని అదుముకొని దుఃఖం తీరేదాకా ఏడ్చింది, ఓ… అంటూ. కాస్సేపటికి తెప్పరిల్లింది. అప్పుడు చిత్రంగా రాజుగాడు ఆమె ఒళ్లోకి దూరి, మళ్లీ కురుకురులాడి, నిమురుతున్న ఆమె స్పర్శకి సమాధానంగా అది కూడా ఓ… అని అరిచిందో, ఏడ్చిందో మళ్లీ కురుకురుమంది.

అమ్మలు తేరుకుంది. ఆమెకి గుర్తొచ్చింది, తాను రోడ్డుమీద ఉన్నానని. చుట్టూ చూసింది. రోడ్‌ నల్లని, తెల్లని పసుపుదేరిన మచ్చలతో వికారంగా భయంగా ఉంది. రోడ్‌ పక్క దుకాణాలన్నీ మూసేసి వున్నాయి. ఎక్కడా మనుషుల జాడ లేదు. ఒక్కసారిగా ఆమెకి భయం అలుముకుంది. వెంటనే లేచింది. నడక మొదలు పెట్టింది. రాజుగాడు ఆమెని అనుసరిస్తున్నాడు. ఇందాక భయంతో, ఆందోళనలో రాజు తన వెనుక రావడం ఆమె గమనించుకోలేదు. ఇప్పుడు తనకు వాడు జతగా ఉన్నాడన్న తెలివిడి ఆ క్షణంలో ఆమెకి కలిగింది. కొంచెం దడ తగ్గింది. నడక సాగించడం మొదలు పెట్టింది. రాజు నిర్భయంగా ఆమె వెంట నడుస్తోంది. అలా ఎంతసేపు నడిచారో… రోడ్డుమీద అక్కడక్కడా వీధికుక్కలు వీళ్లని చూసి మొరగడం, రాజు మీదకి దాడికి రావడం, అమ్ములు వాటిని రాళ్లు విసిరి అదిలించడం మినహా నడకలో ఏమార్పూ లేదు. కొంత దూరం పోయాక కుక్కలేవీ లేనిచోట అమ్ములు ఆగింది. రోడ్డు పక్క పేవ్‌మెంట్‌ మీద కూర్చుంది. కాళ్లు లాగేస్తున్నాయి. గొంతు తడారిపోయి, దాహంతో నాలుక పిడచగట్టుకుపోయింది. ‘నీళ్లు కావాలి’ అనుకుంటూ రాజు వైపు చూసింది. అదికూడా నాలుక బయటపెట్టి ఒగరుస్తోంది. కాసేపలాగే కూర్చుంది. చుట్టూ చూస్తుండగా వీధిలైటు వెలుగులో రోడ్డు పక్కన పారేసిన నీళ్ల సీసాలు కనిపించాయి. ఆత్రంగా వెళ్ళి నీళ్లేమైనా దొరుకుతాయేమోనని చూసింది. నిరాశ కలిగింది. కానీ మళ్లీ చిన్న ఆశ పొడ చూపింది. ఎక్కడైనా కొద్దిపాటి నీళ్లతోనైనా బాటిల్‌ దొరకవచ్చని నెమ్మదిగా నడక సాగించింది. ఒకచోట వీధి చివర డస్ట్‌బిన్‌ కనిపించింది. అందులోనుంచి చెత్త బయటకు కూడా వచ్చేసింది. వెతకడం మొదలెట్టింది. ఒక బాటిల్‌ పావువంతు నీళ్ళతో ఆమెకి దొరికింది. ఆకాశం వైపు చూసి ఎవరికో మొక్కింది. నీళ్ళ బాటిల్ని తీసుకొని గబగబా తాగేసింది. వెంటనే గుర్తొచ్చింది. రాజు గాడికి నీళ్ళు ఇవ్వలేదని బాధేసింది. కానీ మళ్ళీ నీళ్ళు దొరికితే వాడికే తాగిస్తాను. అనుకుంటూ నీళ్ళు బాటిళ్ళ వెతుకులాటలో నెమ్మదిగా నడక సాగించింది. ఇక నడిచే ఓపిక నశించి మళ్ళీ కూలబడింది. అమ్ములు ఈ అర్ధరాత్రి ఎందుకిలా అనాదగా రోడ్లంట తిరిగుతోందో కూడా గుర్తురానంతగా అలసిపోయింది. పేవ్‌మెంట్‌ మీద నడుం వాల్చింది. కాసేపు తెప్పరిల్లింది. భయం తగ్గింది. గుండె మామూలు వేగానికొచ్చింది. రాజు ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంది. తను బయలుదేరి ఎంతసేపయిందో? అని మొదటిసారి ఆమెకి ఆలోచన వచ్చింది. వెంటనే ఔను ఏంజరిగింది? ఎందుకిలా తను రోడ్డుమీదకొచ్చింది? అనే స్పృహ కలిగింది. అవునూ, ఏం జరిగింది?

*

అమ్ములు మొగుడు రైల్వేలో పని చేస్తాడు. అందుకే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ దగ్గర క్వార్టర్స్‌లోనే వాళ్ళు నివాసం ఉంటారు. ఆ క్వార్టర్స్‌ చాలా పాతబడి ఉంటాయి. ఇంటికీ ఇంటికీ మధ్య దూరం ఎక్కువే. మనుషుల మధ్య సంబంధాలూ అంతంత మాత్రమే. వీళ్ళ క్వార్టర్స్‌ ఒక మూల మలుపు మీద ఉంటుంది. స్వతహాగానే మెతక మనిషైన అమ్ములుని ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేని పరిస్థితిని ఆమె భర్త కల్పించాడు. అమ్ములు అతనికి రెండవ భార్య. అతని వయసు ఏభై పైబడి ఉంటుంది. అమ్ములూ వాళ్ళది ఒరిస్సాలోని రాయగడ. ఆమెకి చిన్నప్పుడే అమ్మా-నాన్న చనిపోయారు. తొమ్మిదవ తరగతి చదువుతుండగా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. బడి మానేసి నాన్నకి వండిపెట్టేది. నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ముందే తాగుడు అలవాటున్న నాన్న అమ్మ చనిపోయాక మరీ తాగుడుకి బానిసై రెండేళ్ళలో తన దారి తను చూసుకున్నాడు. చిన్న సొంతింట్లో అమ్ములు ఒంటరిగా మిగిలిపోయింది. నాన్న దినంనాడు బంధువులంతా చేరి ఆమె బాధ్యతని ఆమె చిన్నాన్నకి అప్పగించారు.అప్పటికే ముగ్గురు పిల్లలతో సతమతమౌతున్న చిన్నాన్న ముందు ఆ బాధ్యత తీసుకోవడానికి తటపటాయించాడు. అమె పిన్నైతే నా పిల్లలకే దిక్కులేదు చదివించడానికి, నానా అప్పులూ చేస్తున్నాం, దీన్ని తెచ్చి పోషించి, పెళ్ళి చేయాలంటే మా వశంకాదని గట్టిగా చెప్పింది. “ఒక ముద్ద అన్నం పెట్టండమ్మా దాని నాన్న సంపాదించిన ఇల్లు అమ్మేసి, ఎవర్నో ఒకర్ని గంతకి తగ్గ బొంతని చూసి ముడి పెట్టేయండి. మేమందరం సంబంధాలు చూస్తాం” అని ఆశ చూపించారు పెద్దలు. మెల్లగా మెత్తబడ్డారు దంపతులు. అలా అమ్ములు వాళ్ళ పిన్నీ, చిన్నాన్న ఇంటికి చేరింది. ఇంటి పనులన్నీ తెలిసి ఉన్న కారణంగా పిన్నికి అన్నింటిలోనూ సాయం చేస్తుండడంతో ఆమెకి కాస్త వెసులుబాటు దొరికింది. అయినా మంచోళ్ళం కాబట్టి నేలని పోయిందాన్ని నెత్తికి రాసుకున్నాం లాంటి మాటలు రోజూ పిన్ని నోటంట అమ్ములు వినాల్సిందే. కొన్నాళ్ళకి వంట బాధ్యత కూడా అమ్ములు మీద నెట్టేసింది వాళ్ళ పిన్ని. సంబంధాలు చూసి పెళ్ళి చేయడం అన్నమాట పక్కకి వెళ్ళిపోయింది.

సంవత్సరాలు గుడుస్తున్నాయి. పిన్ని కూతురికి మంచి సంబంధం వచ్చింది. మరో ఆలోచన లేకుండా అమ్ములు వాళ్ళ ఇంటిని మంచి రేటుకి అమ్మేసి తమ కూతురి పెళ్ళి చేసేసారు. అమ్ములుని సంతకం పెట్టమంటే మారు మాట్లాడకుండా పెట్టేసింది. పెళ్ళి చాకిరి అంతాకూడా చేసింది. ఆ తరువాత కొడుక్కి మంచి కట్నం తీసుకొని చిన్నాన్న పెళ్ళి చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ మళ్ళీ చాకిరీ చేసింది. ఆమె ఇంటి చాకిరికి అంకితమైపోవడం చిన్నాన్న కుటుంబానికి చాలా హాయిగా నప్పింది. కొన్నాళ్ళకి చిన్న కూతురికి పెళ్ళి చేయాల్సిన వయసొచ్చింది. సంబంధాలు చూస్తుండగా కట్నాల రేట్లు వాళ్ళకి కొంత భారంగా అనిపించి ఏ సంబంధం కుదరని పరిస్థితి వచ్చింది. అమ్మాయికి ముప్పైఏళ్ళు దాటాయి. ఒకసారి చిన్న కూతురి సంబంధం గురించి మాట్లాడటానికి వచ్చిన పెద్ద మనిషి అమ్ముల్ని చూసి ఎవరని అడిగి, వివరాలు తెలుసుకున్నాడు. వారంరోజులు పోయాక వచ్చి అమ్ములుకి ఒక సంబంధం తెచ్చానని, ఆ పెళ్ళికొడుకు రైల్వే ఉద్యోగి అని, అతనికి గతంలో రాయగడ సంబంధమే చేశారనీ, ఆ భార్య చనిపోయిందని, రెండవ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడని, అమ్ములికి తగిన సంబంధమనీ చెప్పాడు. అమ్ములుకి పెళ్ళి చేయడానికి తను సిద్ధంగా లేనన్నాడు చిన్నాన్న. ఆ డబ్బే ఉంటే చిన్న కూతురుకి సంబంధం ఎప్పుడో కుదుర్చుకునేవాడినన్నాడు. “నీకొక్కపైసా ఖర్చు లేకుండా అమ్ములు పెళ్ళి జరిగిపోద్ది. ఖర్చంతా పెళ్ళికొడుకే భరిస్తాడు. అతగాడికి కావల్సింది వండిపెట్టడానికి ఒక ఆడమనిషి” అని చెప్పి నెమ్మదిగా “నువ్వు బెట్టుచేస్తే తిరిగి నీకే కొంత ముట్టచెప్తాడని” ఆశపెట్టాడు, చిన్నాన్నకి ఆ పెద్దమనిషి. అంతే డబ్బు చేతులు మారింది. రాయగడ అమ్మవారి గుళ్ళో పెళ్ళి జరిగిపోయింది. పొట్టిగా చామనఛాయలో ఉండే అమ్ములికి ఆరడుగుల పైన పొడవు, ఎర్రని ఒంటి ఛాయతో భారీగా ఉండే శంకర్రావుతో పెళ్ళైపోయింది. మర్నాడే అమ్ములు విశాఖపట్నం వచ్చేసింది. ఏళ్ళ తరబడి రంగులు వేయక మచ్చలు దేరిపోయిన పాత రైల్వే క్వార్టర్స్‌కి బందీగా మారిపోయింది. వచ్చినరోజే భర్త కఠిన స్వరంతో ఆమె అక్కడ ఎలా మసలుకోవాలో చెప్పాడు. తాను డ్యూటీకి వెళ్ళేటప్పుడు బయట తాళంవేసి వెళ్ళిపోయేవాడు. చుట్టు ప్రక్కల ఎవ్వరితోనూ మాట్లాడకూడదనీ, ఎవరైనా మాట్లాడినా సమాధానం ఇవ్వకూడదనేది అతడి మొదటి ఆంక్ష. తాను చెప్పినట్లే నడుచుకోవాలని, ఎదురు సమాధానం చెప్తే తాటతీస్తానని డైరెక్టుగానే చెప్పాడు. ఎంతోకాలంగా మాట్లాడడమే అరుదైన ఆమె బతుక్కి అదేమీ పెద్ద కష్టమనిపించలేదు.

హాల్లో కిటికీకి పెద్ద చైన్తో కట్టి ఉన్న రాజుని చూస్తే మాత్రం భయం వేసింది. ఎర్రటి దాని కళ్ళూ, బలంగా ఉన్న కాళ్ళూ, భయపెట్టే పంజాలు చూసి మొదట జాకెట్లో ఉమ్ముకుందామె. దాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చి ఆమె చుట్టూ తిరిగి వాసన చూసి గుర్రుమంది అది. శంకర్రావు ఇంగ్లీషులో దాన్ని అదిలించి అమ్ముల్ని ఏమీ అనకూడదని చెప్పాడు. అయినా మొదట్లో అది అమ్ముల్ని అంగీకరించలేదు. తరువాత దానికి తిండి ఎలా పెట్టాలో, ఏటైంకి ఏది పెట్టాలో శంకర్రావు అమ్ములికి నేర్పించాడు. తిండి పెట్టడం మొదలుపెట్టాక రాజు అమ్ముల్ని ఏమీ అనడం మానేసింది. ఇంట్లో ఏకూర వండుకున్నా శంకర్రావు దానికి బయట్నించి చికెన్‌ జాయింట్లు తెచ్చి పెట్టేవాడు. రోజూ రాత్రివేళ అతనిక్కూడా చేపలో, మాంసమో ఉండాలి. వస్తూనే మందు బాటిల్‌ కూడా తెచ్చుకుంటాడు. ఎవరో ఒక స్నేహితుడ్ని ఇంటికి పిలిపించుకుంటాడు. అతను తెచ్చిన కూర వండి అన్నీ అతని రూంలో టేబుల్‌ మీద సర్దేసి అమ్ములు తన గదిలోకి వెళ్ళిపోవాలి. అతను ఒంటరిగానో, స్నేహితులతోనో తిని, తాగి కుక్కకి పెట్టేస్తాడు. మిగిలిన కూరని ఫ్రిజ్‌లో పెట్టి మర్నాడు మధ్యాహ్నం ఆ కూరని కుక్కకి పెట్టమంటాడు. అమ్ములు ఏం తింటుందనేది అతనికి అనవసరం. ఏం తిన్నావని అతడెన్నడూ అమ్ముల్ని అడగడు. తినేసి, తాగేసి, స్నేహితుల్ని సాగనంపేసి వెంటనే అమ్ములి గది తలుపు తడతాడు. ఆమె వచ్చి అన్నీ సర్దేసి అతని గది బయట నిలబడతాది. అతను రమ్మంటే గదిలోకి వెళ్తాది. ఆ తాగిన మైకంలో సరిగా లేని స్థితిలో ఏవో బూతులు గొణుక్కుంటూ అతను మంచం మీదకి పిలుస్తాడు. అతను చెప్పినట్లల్లా వినాలి, చెయ్యాలి. అదిమాత్రం నరకయాతనగా ఉంటుదమ్ములకి రోజూ. ఆ రాత్రి సన్నివేశానికి భయంతో గడ్డ కట్టుకుపోతుందామె. ఆ అనుభవం మర్నాడు కూడా ఆమెని ఆకులా వణికించేస్తుంది. ఎప్పుడన్నా ఆమెనుంచి చిన్న నిరాకరణ ఎదురైనా అతను చాలా గట్టిగా బుద్ధి చెప్తాడు. అతని గదిలో గోడమీద తగిలించి ఉన్న హంటర్‌ ఆమెని చాలా భయపెడుతుంది. ఒక్కొసారి అతను బయటనుంచి ఆడవాళ్ళని రప్పించుకుంటాడు. అప్పుడామె గది తలుపులు బయట్నించి వేసి ఉంటాయి. వాళ్ళు వెళ్ళేదాకా అమ్ములుకి బాత్రూంకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. అయోమయంగా తన గదిలో చాపమీద ఉగ్గబట్టుకుని పడుకుని ఉంటుంది. ఎందుకంటే బాత్రూం శంకర్రావు బెడ్రూంలో ఉంటుంది.

ఒకరోజు అలా వచ్చిన ఒకామె రాత్రంతా ఉండిపోయింది. తెల్లవారి ఆమె బయటకు వచ్చి ఊసుపోనట్లు అమ్ములు గదితలుపు తెరిచింది. అమ్ముల్ని చూసి వెటకారంగా నవ్వింది. అమ్ములు బాత్రూంకి అన్నట్లు వేలు చూపించింది. ఆమె ఆశ్చర్యపోయి వెళ్ళు అంది. గబగబా బాత్రూంకి వెళ్ళి వచ్చిన అమ్ముల్ని జాలిగా చూసిందామె. “నిన్నేనా మళ్ళీ పెళ్ళాడాడు? జాగ్రత్త, మొదటిదాన్ని ఇలాగే హింసించి చంపేసాడట ఈడు” అని మెల్లగా చెప్పి శంకర్రావు గదిలోకి వెళ్ళిపోయిందామె. అది మొదలు భయంతో మరింత గడ్డకట్టుకుపోయింది అమ్ములు. “అతను తన మొదటి భార్యను చంపేశాడా? అమ్మో, నన్నుకూడా చంపేస్తాడేమో” అన్న భయంతో క్షణక్షణం చస్తూ కాలం వెళ్ళదీస్తుందామె. శంకర్రావు వైపు చూడాలంటేనే మొదట్నించీ భయం. ఇప్పుడు వణుకు తోడైంది. అతను డ్యూటీకి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉండేది. ఎలా తప్పించుకోవాలి? అనుకున్నప్పుడంతా, తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలి? అన్న ప్రశ్న తలెత్తి మరింత కంగారుగా దు:ఖంగా ముఖ్యంగా దైన్యంగా అయిపోయేది. చిన్నాన్న ఇంటికి వెళ్తే ఆదరిస్తారా? అనే అనుమానం ఆమెని వేదించేది. తిండి సరిగాలేక, మనస్తిమితంలేక, పోషణలేక ఆమె కదుల్తున్న శవంలా మారిపోయింది. తన బతుకులో చిన్నప్పట్నించీ జరిగినవన్నీ గుర్తొస్తే తనమీద తనకే అసహ్యమో, జాలో కలిగేది. శంకర్రావు ఆమెపట్ల చూపే కఠినత్వం ఎంతటిదంటే చిన్నప్పట్నించీ నిరాదరణకి గురైన అమ్ములు గాబట్టి దాన్ని సహించగలిగేది. ఇంకెవరన్నా అయితే ఏదోఒకటి చేసుకొని చచ్చిపోవాలనిపించేంత క్రౌర్యం చూపేవాడతను. రాత్రి సమయాల్లో ఆమెతో ఇష్టం వచ్చిన రీతిలో సెక్స్‌ జరిపి, వెంటనే కాళ్ళు నొక్కమని చెప్పేవాడు. నొక్కుతూ నొక్కుతూ ఆమె కునికిపాట్లు పడితే పూన్చి కాలితో తన్నేవాడు. బాత్రూంకి వెళ్లొస్తూ కూర్చుని కునికిపాట్లు పడే ఆమెని అమాంతం కిందకి ఈడ్చి కొట్టేవాడు. ఈ అకారణ హింసకి కారణం ఆమెకే కాదు, బహుశా అతనికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అతనెప్పుడూ తను పురుషుడిలా ఎలా ఉండాలన్న తర్ఫీదులోనే ఉంటాడు. తప్పితే మనిషినన్న స్పృహ ఎన్నడో కోల్పోయాడు.

అమ్ములికి ఒకటే ఆశ్చర్యం కుక్కతో అతనంత ప్రేమగా ఎలా ఉంటాడా అని? అతను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాడు. క్యాంటీన్లో తింటాడు లేదా ఫ్రెండ్స్‌తో హోటల్లో తింటాడు. మధ్యాహ్నం అమ్ములు ఏం తింటాదనేది అతడెన్నడూ పట్టించుకోలేదు. చాలాసార్లు ఆమె పస్తులుంటాది. ఒక్కోసారి అన్నం వండుకొని నీళ్ళో, పెరుగో పోసుకుని తింటాది. కాని కుక్కకి పెట్టమని మాత్రం అతను జాయింట్లో, రాత్రి వండిన కూరనో సూచించి ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాడు. రాజుని చూస్తే అమ్ములికి కడుపు మండిపోద్ది. మొగుడ్ని చూస్తే కలిగే వికారం, చీదర, భయం రాజు మీద చూపించేది. భార్యనైన, మనిషినైన తనపై ఏ దయా, కనికరం చూపని మనిషి ప్రేమ చూరగొన్న ఆ ఉత్త కుక్కని చూస్తే అమ్ములికి అసహ్యం. అతను లేనప్పుడు ఒక్కోసారి అది అడుగుతున్నా తిండి పెట్టకుండా, పట్టించుకోనట్లు ఉండిపోతుంది. దాన్ని కర్ర తీసుకొని కొట్టాలన్న కోరికను అణచుకుంటుంది. ఆలాచేస్తే అది తిరగబడి కరుస్తాదని భయం. దాని దర్జా, రాజసం, వైభోగం చూస్తుంటే గుండెమంటెత్తి పోద్ది. దానికి తిండి పెడుతూ తిట్టుకుంటాది. “పగలు దీనిసేవ, రాత్రివేళ అతగాడి సేవ” అని పైకే అంటాది. దానికి భోజనం ఆలస్యం చేసినప్పుడు అది తోక ఊపుతూ, నాలుకతో నాక్కుంటూ, కురు మని గట్టిగా అరుస్తూ, తలవాలుస్తూ తనని అడక్కుంటున్నప్పుడు ఏదో తృప్తి లాంటిది కలుగుతుంది. ఒక్కోసారి దానికి పెట్టాల్సిన జాయింట్లన్నీ కవర్లో పోసి కిటికీలోంచి దూరంగా విసిరేసేది. తృప్తిగా తలాడించుకొని, రాజు వైపు కనీసం చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని చాపమీద వాలిపోయి, హాయిగా నిద్రపోయేది. కచ్చతీరినట్లనిపించేది. బయట హాల్లో అది అరుస్తూనే ఉంటుంది. నీరసించి పడుకున్నదాన్ని చూసి చిన్న నవ్వు నవ్వుకుంటుంది. శంకర్రావు ఇంటికొచ్చాక అది అమ్ములు మీద ఫిర్యాదు చేస్తుంది. కాని అతనికి అర్ధంకాదు. అలా చాలాసార్లు అమ్ములు దానికి అన్నం పెట్టదు. అలాంటప్పుడు శంకర్రావుమీద కసి ఎదో తీర్చుకున్నట్లనిపించేదామెకి.

మొదటి భార్యని చంపేసిన శంకర్రావుకి కోపమొస్తే తననీ చంపేస్తాడనీ భయంతో అతని దగ్గర చాలా మెళకువగా ప్రవర్తించడం, మరింతగా అలవాటు చేసుకుందామె. ఆరోజు ఆమె గదిలో బట్టలు మడతపెడుతోంది. ఎవరో తలుపు కొట్టారు. ఆదివారం కావడంతో శంకర్రావు ఇంట్లోనే ఉన్నాడు. అతడే తలుపు తీసాడు. ఎదురుగా చిన్నాన్న, మరొక వ్యక్తి ఉన్నారు. శంకర్రావు మొహం చిట్టించుకొని ‘ఏవిలావచ్చారు?’ అని అడిగాడు. తలుపు దగ్గర్నుండి తప్పుకోకుండానే! ‘మా చిన్న పాపకి పెళ్లి, శుభలేఖ ఇద్దామనీ…’ అని చిన్నాన్న నసుగుతున్నాడు. ఆ గొంతు విని అమ్ములు గదిలో నుంచి బయటకు వచ్చింది. గబగబా ఎదురెళ్లి “రండి… రండి చిన్నాన్నా బాగున్నారా? పిన్ని బాగుందా”? అంటూ పలకరించింది. శంకర్రావు ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆమె వెనక్కి వెళ్లిపోయి తలొంచుకొని హాల్లోనే నిలబడిపోయింది. శంకర్రావు కొంచెం తప్పుకోగానే చిన్నాన్న లోపలికి వచ్చాడు. శుభలేఖ తీసి శంకర్రావు చేతికి ఇచ్చాడు. శంకర్రావు దానివైపు కూడా చూడకుండా “నేను పెళ్లికి ముందు ఏం చెప్పాను? పెళ్లి జరిగిన తర్వాత మీరు ఇటు రావడంగానీ, నేను అటు రావడంగానీ, దీన్ని పంపించడంగానీ కుదరదని చెప్పానా? లేదా? ఒప్పుకొని లక్షరూపాయలు దొబ్బిన పెద్ద మనిషివి కాదా? నువ్వు ఏ మొఖం పెట్టుకొచ్చావు, కూతుర్నమ్ముకున్న లంజకొడుకువి?” అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ‘సారీ, అల్లుడుగారూ, మరింకరావులెండి, అమ్ములూ అంటూ ఏదో చెప్పబోయిన చిన్నాన్న శంకర్రావు గొంతు రూపం చూసి జడిసిపోయి గబుక్కున బయటకు వెళ్లిపోయాడు. భూమికి కాళ్లంటుకుపోయినట్లు నిలబడిన అమ్ముల్ని ఒక్కతోపు తోసి ‘లోనకెల్లూ, పనీపాటా లేదా నీకు? సిగ్గు లేని జన్మ’ అని తిడుతూనే వున్నాడు.పెళ్లయిన నాటినుంచీ ఒక్కసారి కూడా చిన్నాన్నా వాళ్లూ రాకపోవడం, భర్త ఒక్క కాల్‌ చేసి ఫోన్‌ కూడా మాట్లాడకపోవడం, వీళ్ల ఫోన్‌ నెంబర్‌ కూడా తనకి రాసి ఇవ్వక పోవడం వెనుక దాగిన నిజం ఇప్పుడర్థమయింది ఆమెకి. శంకర్రావు తనని కారు చవగ్గా కొనుక్కొని, ఇప్పుడు వెట్టి చాకిరీ చేయించుకున్నాడని అర్థమయ్యేసరికి తల తిరిగిపోయిందామెకి. ఎలాగో ఉగ్గబట్టుకొని పనులు పూర్తి చేసింది. తినకుండానే మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లిపోయి, బాధతో ఉక్రోషంతో ఏడ్చుకుంది.

సాయంత్రం బయటకు వెళ్లిన శంకర్రావు, మందూ, బిర్యానీ తెచ్చుకున్నాడు. కుక్కకి పెట్టాడు. ఇంతలో తలుపు శబ్దవయింది. వెళ్లి తీసి వచ్చినామె భుజం మీద చెయ్యేసి తన గదిలోకి తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి పదిన్నరకి భర్త తలుపు తెరిచాడు. తన గది తలుపూ తెరిచాడు. వచ్చి రూమ్‌ క్లీన్‌ చెయ్యమన్నాడు. తను క్లీన్‌ చేస్తుండగా హేంగర్‌కి ఉన్న షర్ట్‌ జేబులొంచి పర్స్‌ తీసి కొన్ని నోట్లు లెక్కబెట్టి ఆమెకిచ్చాడు. ఆమె లెక్కెట్టుకుంటుండగా అతడు బాత్‌రూంలోకి వెళ్లాడు. ఆమె డబ్బు లెక్కచూసుకొని జాకెట్లో పెట్టుకుంటూ “గంటకని పిల్చాడు, మూడుగంటలు వాడాడు ఎదవ. గంట డబ్బులే సేతిలో ఎట్టాడు” అని తిట్టుకుంటూ ‘ఆడు మామూలోడు కాడు’ అని అమ్ములికి చెప్తూ బైటకి కదిలింది. బాత్రూంలోంచి శంకర్రావు బైటకి వచ్చాడు. అమ్ములికి బాత్రూం అర్జంట్‌. బాత్రూమ్‌కి వెళ్లిన అమ్ములు ‘అయితే పెళ్ళాన్నే కాదు అందర్నీ తక్కువ రేటుకే కొంటాడన్నమాట. నాతో పగలూ రాత్రి చాకిరీ చేయించుకోవడానికి చిన్నాన్నకి లక్షరూపాయలిచ్చి కొన్నాడు. ఆ యమ్మాయికి గంటకి డబ్బులిచ్చి మూడు గంటలు వాడుకున్నాడన్నమాట. బాబోరు ఈడితో నేనింక ఉండలేను. ఎలాగోలా బయటపడాలి, అనుకున్న అమ్ములికి తెలీని పూనకం వచ్చేసింది.

బాత్‌రూంలోంచి వస్తూ అతని బెడ్‌ దగ్గరకి వెళ్ళకుండా హాల్లోకి వెళ్ళబోయింది. “ఎంటే, రమ్మని పిలవాలనా?” అని అరిచాడతను. “నేను అన్నం తినలేదు తింటాను” అంది అమ్ములు. “అమ్మ లంజకానా, సమాధానాలు చెప్తున్నావే? ఇందాకంతా తినకుండా ఏం చేసావే? ఎవడితోనన్నా పడుకున్నావా? ఇప్పుడు నేను కాళ్ళు పట్టమంటే నీకు తిండి గుర్తొచ్చిందా” అని మంచం మీదనుండి లేచి పటాపటా చెంపమీద వాయించేసాడు. “నా తిండి గురించి మీరెప్పుడైనా పట్టించుకున్నారా?” అంది రోషంగా అమ్ములు. “ఏంటే మీ చిన్నాన్నని చూసి ధైర్యం వచ్చేసిందా నీకు? సమాదానాలు చెప్తున్నావ్‌! ఆడింక ఇక్కడికి రాడు. నిన్ను నేను తలుచుకుంటే పైకి పంపించేస్తాను. నేనెంత కటికముక్కలోడ్నో నీకు తెలీదు…” అంటూ మళ్ళీ తన్నడానికి కాలెత్తాడు. “తెలుసు” అంది నిబ్బరంగా అమ్ములు. “ఏంటి తెలుసే?” అని గోడకున్న హంటర్‌ తీసి బాదడం మొదలుపెట్టాడు. హాల్లో ఉన్న రాజు గట్టిగా అరుచుకుంటూ లోపలికి వచ్చింది. అతన్ని ఆపడానికి అతని మీదకి ఉరికింది. అతడు హంటర్తో దాన్ని కూడా ఒక్కటేసాడు. కురు మని అరుస్తూ అది బయటికి వెళ్ళింది. అతడు అలుపు తీర్చుకోవడానికి ఆగగానే అమ్ములు ఒక్క ఉదుటున బయటకు వచ్చేసి అతని గది తలుపులు వేసేయబోయింది. అతను తలుపుని బలంగా తనవైపు గుంజుకొని, తలుపుని పూర్తిగా తెరిచేసాడు. ఆ ప్రయత్నంలో హంటర్ని కింద పడేసాడు. హాల్లోకి పరిగెట్టిన అమ్ములు తన గదిలోకి పారిపోబోతుండగా పొడవైన ఆమె జడ అతని చేతికి చిక్కింది. మెలిపెట్టి గుంజి ఆమెని గోడకి అదిమిపెట్టి అణిచేసాడు. బూతులు తిడుతూ, మోకాలితో కడుపులో పొడుస్తూ మెడ పట్టేసుకున్నాడు, నొక్కేస్తున్నాడు గట్టిగా, బలంగా నొక్కేస్తున్నాడు. ప్రాణం పోతుంది, ఇక అయిపోయింది అని అమ్ములు ప్రాణం గింజుకుంటున్న వేళ అతను ఆమె పీకని వదిలేసాడు. అమ్ములు కనుగుడ్లు అప్పటికే పైకి తేలవేసింది. తిరిగి గుడ్లు యధాస్థానంలోకి వచ్చి ఆమె చూసేసరికి రాజుగాడు శంకర్రావు తొడ పిక్క పట్టేసి పీకడం కనిపించింది. “అమ్మా” అన్న అతని ఆర్తనాదం చెవులని సోకుతుండగా అమ్ములు అతన్ని దాటుకొని వీధి తలుపు బోల్ట్‌ తీసేసి, బోర్లా తెరిచి బయటకు పరిగెత్తింది. అంతే… అదే గుర్తుంది అమ్ములికి.

*

ఆలోచనల నుండి తేరుకొని తాను చావు నుంచి తప్పించుకొని రాజు తన వెంట వస్తున్నది కూడా చూసుకోకుండా రోడ్‌ మీదకి పరిగెత్తాననే జ్ఞాపకంతో తుళ్ళిపడి లేచింది. రాజూ లేచాడు. అమ్మ కడుపు నుంచి బయడపడిన దగ్గర్నుంచి అమ్మ పాల స్పర్శ తప్ప ఇంకే సుఖానుభవం లేని తనకి రాజుగాడి స్పర్శ ఎంత ఊరట నిచ్చిందో గుర్తొచ్చింది. అచ్చంగా అమ్మ తలపై నిమురుతూ పాలు పెట్టిన స్పర్శలా రాజు తన చెవిని, నుదుటిని నాకడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. దాని ప్రాణాన్ని అడ్డంవేసి తనని కాపాడిన రాజు తన పక్కనే సైనికుడిలా నడుస్తుంటే ఏదో ఊతం, ఏదో ఊరట, ఏదో ఆశ, ఎంతో ఆలంబన. నడిచారు ఆ ఇద్దరూ… ఎంతో దూరం, లెక్క చేయకుండా నడిచారు. చుట్టూ చూస్తే ఏదో బ్రిడ్జి క్రిందకి తాము చేరుకున్నట్లు అర్ధమయింది అమ్ములకి. అక్కడక్కడా మనుషుల అలికిడి వినిపిస్తోంది, అంటే తెల్లార బోతుందన్నమాట. భయం బాగా తగ్గింది. నడక నెమ్మదయింది. అయినా భయమెందుకు? రోడ్‌ ఏంచేస్తుంది. అదేమన్నా తాళికట్టిన మొగుడా? అనుకుంటుండగా మళ్ళీ ఒక్కసారి భయంతో తనకి దిక్కేంటి? అనుకుంది. ఇప్పటివరకు దిక్కుంది కనకనా? పెళ్ళి తనని మరింత దిక్కుమాలిన దాన్ని చేసింది కదా! ఏమైతే అదవుతుంది. ఇప్పటివరకూ జరిగిన దానికన్నా ఘోరం ఇంకేమీ జరగదు కదా అనుకుంది. చుట్టూ పరికించి చూసింది. రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయి! ఆకాశం గొడుగులా తనని కప్పి రక్షించింది రాత్రంతా. వెళ్ళిపోతున్న వెన్నెల నిశిరాత్రి తోడొచ్చిన నెచ్చెలిలా వీడ్కోలు తీసుకుంటుంది. వీధి దీపాలు అన్నదమ్ముల్లా తోడుండి నడిపించాయి. ఇక తెల్లవారుతుంది.

ఏదో ఆసరా దొరకకపోతుందా అని ఆలోచించబోయి, మళ్ళీ సందేహించింది. ఏమో ఎటు తిరగనుందో తన బతుకు ఆనుకుంటూ అడుగులు వేసింది. అక్కడొక ‘టీ’ బడ్డీ ఉంది. దాని పక్కనే పొడుగాటి బల్ల ఒకటి వేసి ఉంది. నిస్రాణ కమ్ముకొని బల్లమీద కూర్చుంది. నిన్నటినుంచీ తిండీ, నిద్రా లేదు. శంకర్రావు కొట్టిన దెబ్బలు సలుపరిస్తున్నాయి. అలా బల్లమీద ఒరిగింది. కళ్ళు మండిపోతున్నాయి, తెరవలేకపోయింది. ఇంతలో “ఓమ్మా… ఎమ్మా… లెగులెగు” అన్న పిలుపుతో గబుక్కున లేచి కూర్చుంది. ఎవరో పెద్దాయన బడ్డీ తలుపులు తెరుస్తూ తనని లేవమంటున్నాడు. లేచి బడ్డీ పక్కన గట్టుమీద కూర్చుంది. బడ్డీ ఆయన తలుపులు తెరిచి దుకాణం పని మొదలుపెట్టాడు. సామాన్లన్నీ బయటపెట్టి బయట టేబుల్‌ మీద ‘టీ’ తయారీకి పని మొదలుపెట్టాడు. ఇడ్లీ సామాన్లన్నీ తీసి ఆపని ఒకపక్క చూసుకుంటున్నాడు. పాలప్యాకెట్లు విప్పి పెద్ద గిన్నెలో పోశాడు. మధ్యమధ్యలో అమ్ముల్ని చూస్తున్నాడు ప్రశ్నార్ధకంగా. అమ్ములికి ఎప్పట్నించో దాహంగా ఉంది. అతను నీళ్ళు తీసుకొచ్చి బయట పెట్టగానే, “అన్నా!… కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా?…” అంది నెమ్మదిగా. అతను ఆమె మొహంలోకి చూస్తూ… నీళ్ళగ్లాసు అందించాడు. తను తాగి మళ్ళీ నీళ్ళడిగింది. మళ్ళీ గ్లాసు ముంచి నీళ్ళిచ్చాడు అతను. “ఒక ప్లేటు ఇవ్వన్నా, నాకుక్కకి చాలా దాహంగా ఉంది.” అంది అమ్ములు. “బాగుంది” అంటూ లోపలికెళ్ళి ఒక చిన్న టిఫిన్‌ తినే ప్లేటు తెచ్చిచ్చాడు. అమ్ములు కొంచెం కొంచెంగా అందులో నీళ్ళు పోస్తుంటే రాజు ఆబగా తాగాడు.

ఇద్దర్నీ కొట్టాయన వింతగా చూస్తున్నాడు. కాస్సేపాగి “ఎక్కడికెల్లాలి?” అని అడిగాడు. “ఏమో తెలీదన్నా… నా కెవ్వరూ లేరు” అంది అమ్ములు. “ఆ ఎవరూ లేరా? మరిక్కడికి ఎందుకొచ్చావు? ఎక్కడి నుంచొచ్చావు?” అని ఆరాగా అడిగాడు. అమ్ములికి దు:ఖం తన్నుకొచ్చింది. కింద కూలబడి ఏడవడం మొదలెట్టింది. కాస్సేపటికి బెక్కుతూ… “నేను… నేను… ఒక అనాద ముండనాన్నా” అంటూ ఏడుస్తూ ఆపకుండా బెక్కుతుంది. కొట్టాయన దగ్గరకొచ్చి “లేమ్మా…లే తల్లి… అలాగేడిస్తే అవుతాదా? మనల్ని ఈ భూమ్మీదకొగ్గిన ఆ నారాయనుడే అందరికీ ఏదో దారిసూపిత్తాడు. నీ కొక్కదానికీ బతికే దారి నేకపోదు” అని ఓదార్చడం మొదలుపెట్టాడు. “లేదన్నా… నా జన్మేవేరు, నాకేదిక్కూలేదు” అంది అమ్ములు లేచి బెంచీమీద కూర్చుంటూ. “ఏమయిందమ్మా.. ఏవీ, ఏటయింది?” అని అడగడంతో సన్నని ఏడుపుతో మొదలెట్టి తన కథంతా చేప్పేసింది అమ్ములు. మొగుడు చంపేయబోయాడన్న సంగతి చెప్తుంటే “అమ్మనా కొడుకు, పెల్లాన్ని సంపేసి తప్పించీసుకునీ ఎదవ నంజి కొడుకన్నమాట వాడు” అని అమ్ములు మొగుడ్ని బూతులు తిట్టాడు. “ఇదిగో అన్నా..! ఈడు… ఈ రాజుగాడు, నేనెప్పుడూ ప్రేమగా ఒక్క ముద్ద కూడా పెట్టక పోయినా, నా బాధల్ని కంటారా చూసాడేమో, ఈడే ఒక అన్నదమ్ముళ్లాగా నన్ను రక్షించాడన్నా..! ఈడు లేకపోతే ఈపాటికి కట్టెగా మిగిలేదాన్ని, ఈడి ఋణం తీర్చుకోలేనిదన్నా…'” అంటూ రాజు మెడచుట్టూ చేతులేసి ముద్దులాడుతూ ముగించింది అమ్ములు. “అమ్మా… మనిసే ఇస్సప్పురుగమ్మా, కుక్క ఎప్పుడూ ఇసోసంతోటే ఉంటాది. అయితే పీకపిసికి సంపేబోన్డన్నమాట” అని మళ్ళీ అడిగాడు. “చూడన్నా” అని మెడచుట్టూ ఉన్న గాయాన్ని చూపించింది అమ్ములు. నల్లగా కమిలిపోయిన మెడని చూసి, చేత్తోతడిమి “అమ్మ కసకంత్రీ నాకొడకా, ఎంత పన్జేస్సినావురా, ఎల్లమ్మీ.. ఎల్లి టేసనుకి కంప్లీటు ఇవ్వు నా కొడుకుని బొక్కలో ఏసి కుమ్మేత్తారు.” అన్నాడు. “వద్దన్నా.. నాకవన్నీ వద్దు. మా చిన్నాన్ననే కొనీసినోడికి, పోలీసోళ్ళని కొనడం ఒకలెక్కా? మంచికైనా, చెడుకైనా నేనింక ఆడిమొకం చూడను.” అంది స్థిరంగా అమ్ములు. “ఔనమ్మా.. మంచి మాట సెప్పినావ్‌, మూతి ముడుపులు కట్టేత్తే నీ ‘పెనివిటే కదా నిన్ను కొట్టినాడు’ ఎల్లి ఆడితోటే ఉండని సెప్పినా సెప్తారు పోలీసునంజికొడుకులు. అలాటియి ఎన్ని సూడ్నేదు. మంచిదేనమ్మలు,ఇంక అలాటి పెయిత్నాలు ఒద్దులే” అంటూ ‘టీ’ గ్లాసు అందించాడు షాపతను.

నిస్సంకోచంగా గ్లాసు అందుకొని తాగుతున్న అమ్ముల్ని జాలిగా చూసి “ఒన్నం, నీల్లూ నేక నానిచ్చిన టియ్య ఎలగతాగుతుందో ఆయమ్మ” అని అనుకున్నాడు. “బాగుంది గాన్తల్లీ నీ ఒక్క పేనం అంటే ఏదో పనిసేసుకోని గడిపీయొచ్చు, ఇది గీ కుక్క పోతురాజునాగుంది. దాని పోసాకారం నీక్కస్టవైపోద్దేటో” అన్నాడు. ఆలోపే సగం తాగేసిన గ్లాసు పక్కన పడేసి “అన్నా అంటూ లేచి ఆడు ప్రాణం పోసిన బతుకన్నా ఇదీ, ఆడే లేకుండా నెనెలా బతుకుతానన్నా…? నా కేదన్నా పనిచూపించండన్నా… నా రాజుని పెట్టుకొని కలో, గంజో తాగి బతికేస్తాను. ఈడ్ని మాత్రం వదల్నన్నా, ఈడు నా తమ్ముడు అంటూ రాజుని గట్టిగా వాటీసుకొని ఏడుస్తుంది అమ్ములు. ఈల్లిద్దరికీ ఒక దారి సూపించనేకపోన్నేను, అనుకుంటూ… టీ కొట్టు అప్పల్రాజు ఆళ్ళిద్దరి దగ్గరికీ వచ్చి అమ్ములు తలమీద చేయి వేసాడు. “ఊరుకో యమ్మా… ఊరుకో” అంటూ. అయితే మరెక్కడికెల్తావమ్ములూ? సార్జీలకి డబ్బుల్నేనిత్తానుకానీ… మీ సిన్నాన్నాల్ల దగ్గటికి ఎలిపోతావా? అన్నాడ అప్పల్రాజు. ఆ ప్రశ్నకి అమ్ములు నిర్వికారంగా అతని మొహంలోకి చూసి, ఆల్లే తిన్నయినోళ్ళయితే నాకెందుకీ గతిపడ్తాదన్నా, ఆళ్ళునే నక్కడికి వెళ్తే ఒక్కపూటన్నా ఉంచుకోరు. ఒక్క ముద్దన్నా అన్నం పెట్టరు. మళ్ళీ నా మొగుడికే నన్నప్పజెప్పేస్తారు. అక్కడికి మాత్రం నేనెల్లను. ఒద్దులేయమ్మా, దయా, జాలి లేని ఎదవ. సినబాబైతే ఏటి? ఎవుడైతే ఏటి? అంటూ టీగ్లాసు అందిచాడామెకి అప్పల్రాజు. “అదే ఏమీ తెలియడం లేదన్నా, పోనీ ఏదో ఒకటి చూసుకోని చచ్చిపోదామా అనిపిస్తుంది. నా పెళ్ళయ్యాక కొన్నిసార్లునుకున్నాను. ఆ జైలు బతుకు బతికేకన్నా సచ్చిపోవడమే నయమనీ… కానీ, ఈడు ఈరాజుగాడు ఆడి ప్రాణమడ్డేసి నన్ను బతికించాడు చూడు! అప్పుడు నా ప్రాణానికి విలువుందనిపించింది. ఆడు కాపాడిన ప్రాణాన్ని తీసుకోవాలని గట్టిగా ఇంతకు ముందులా అనిపించడం లేదు రాత్రి నుంచీ. బతకాలనే అనిపిస్తుంది. నేను బతికి ఈణ్ణి బతికిస్తానన్నా. ఇప్పుడు నాకీడి బాద్యత ఉందికదా! బతకాలన్నా…” అంటుండగా గలగలా మాట్లాడుతూ ఒక ముసలమ్మ టీబడ్డీలోకి వచ్చేసింది.

అమ్ముల్ని చూస్తూ అప్పల్రాజుతో ‘స్టాంగ్‌ టీ కొట్టరా. అల్లుడు తమ్ముడా, పేనం గిలగిల్లాడతంది టీసుక్కకోసం’ అంది, ఆమెకి అరవైదాటి ఉండోచ్చు. తెల్లగా, సన్నగా ఉంది. జుట్టంటా తెల్లబడిపోయింది. మాట్లాడుతుంటే కొన్ని పళ్ళులేని నోరు చిత్రంగా కదులుతుంది. జాకెట్టు లేకుండా, శుభ్రమైన కాటన్‌చీర తూర్పు పద్ధతిలో కట్టుకొని ఉంది. అప్పల్రాజు టీగ్లాస్‌ అందిస్తూ “అప్పా, ఆయమ్మి ఊసు సెప్తాను ఇను. ఇయ్యాల తెల్లారిన కాడ్నించీ ఆయమ్మ ఊసేనాకు. కాల్లూసేతులూ ఆడ్డంనేదు, ఆయమ్మ బాదిన్న కాడ్నించీ, అమ్మా మా యప్పతో నీబాద సెప్పుకో, ఆయమ్మ ఏదోఒక సొల్లూసన్‌ సెప్పకపోదు, తల్లిలాటీ ఆడది. నీ కస్టంసుఖం సెప్పాయమ్మకి, ఆయమ్మ మాయక్కే. ఆల్ల బొట్టినే నీను సేసుకున్నాను. సెప్పుకో, ఇంటాది” అన్నాడు.’ఓస్సీ, ఏటి అంత బాద ఏటోచ్చిందీ యమ్మకి? నీనేటి డాట్రు నేట్రా మందేసి తగ్గించీనాడికి?’ అని గట్టిగా నోటారా నవ్వి ‘ఏటమ్మా ఏటయ్యింది, ఇంత తెల్లవారీ?’ అంటూ వినడానికి అమ్ములు పక్కన బల్లమీద కూర్చుంది ముసిల్ది. టీకొట్టు బేరం ఆ కాసేపట్లోనే ముమ్మరమైపోయింది. తన అక్కకి అమ్ముల్ని అప్పచెప్పీసిన అప్పల్రాజు నిశ్చింతగా బేరాలు చూస్తున్నాడు. తూరుపు తెల్లవారీ లోపల అమ్ములు గుండెల్లోని దు:ఖాన్నంతటినీ ముసలమ్మ తన గుండెల్లోకి ఒంపేసుకుంది. మధ్య మధ్యలో ఏడుస్తున్న అమ్ముల్ని ఓదార్చి, చివరాఖరికి తాను కన్నీరు పెట్టింది.

కన్నీరు తుడుచుకోకుండానే తేటగా నవ్వింది. అమ్ములి చెయ్యందుకొని ధైర్యాన్ని పామింది. ‘అమ్మలా, పులినోట్లోంచి పారొచ్చినావు, ఇంక నీకు బెంగనేదు. నీకింక ఏగండమూనేదు. ఆ మొగుడి గండడి ఇంస ఇంకమరి నీకునేదు. ఆడదానికి పెల్లేనమ్మా అసలు ఆపద. దాన్నిండీ బయట పడిపోనావు. ఇంక మరి నీకేల బయ్యిం?’ అంటుండగా అమ్ములు, ‘కాదమ్మా, నాకేపని తెలుసు? చదువు తొమ్మిదితో ఆగిపోయింది. నేనేంటి చేసుకోని బతగ్గలను చెప్పూ?’ అంది బెంగగా.’ఓస్సదా, నీబయ్యం? నీకేటొచ్చని అడుగుతున్నావా? అసలు నీకేటి రాదో సెప్మీ…”నాకేమిరాదు. ఇళ్ళు శుభ్రం చెయ్యడం, బట్టలుతకడం, అంట్లగిన్నెలు తోమడం, వొంట చెయ్యడం తప్ప నాకింకేమీరాదు’ అంది దిగులుగా అమ్ములు.’ఆ పనులే చిన్నప్పట్నించీ ఇప్పటివరకూ చేశాను. ఇంకేపనీ తెలీదు’. అందిమళ్ళీ.’యెయ్యే… ఎన్ని పనులొచ్చును నీకు… అయన్నీ వచ్చి ఏటీ తెల్దంటావేటీ, నాను ముండమోసీతలికి నాకు ఇరవైఏల్లు. మాయమ్మినొట్టుకొని పొలంపన్లు కెల్లీదాన్ని. పది సదివించి ఇదిగీడికిచ్చి పెల్లిసేసాను. ఈడు అందంట బతుకుల్లేవనీసి ఇలగ సిటీకెలిపొచ్చినాడు నాకూతుర్నట్టుకొని. నానేటి సదివినానూ… బియ్యేలా, బీడీలా? ఎటీ సదవనేదు. అచ్చరం ముక్కరాదు. కానీ నాకొచ్చిన పన్లే ఇక్కడ సెయ్యడం మొదలెట్టాను. ఈడు కూలి పన్లకెల్లీవోడు. నానూ పని మరుగడ్డాను. నా కూతురుకీ పన్లప్పజెప్పినాను. ఏం పన్లనుకుంటున్నావూ? కలెట్రూ, పీడరూ, మేస్ట్రూ పనులు సెయ్యాలంతే సదువుండాల. ఆల్లిల్లంట పనులు జరగాలంటే మనవుండాల. మనకి తెలిసీ ఒక్కపనీ ఆల్లకి తెల్దు, ఆలకిరాదు, ఆలు సెయ్యరు. ఆలకి మనవేగతి. నువ్వు నీకొచ్చని చెప్పిన పెతిపనికీ జీతవుతాంది. ఇంట్లో అత్తకో, మొగుడికో, పిల్లలకో ఒండిపెట్టుకొని ఇంటి సూర్లట్టుకొని ఏలాడే ఆడదానికి ఆ సూర్లు కూలిపోతే ఏంచెయ్యాలో తెల్దు. కానీ అప్పుడు దాకా సేసిన అరవసాకిరీ బయట ఇంకెవులింట్లోనన్నా సేత్తే డబ్బొత్తాది పిల్లా, అది ఖర్సెట్టుకుంతే బతుకుంతాది. మనదైవిర్రమే మన బతుకు. మనం సిన్నప్పట్నించీ సదివిన బడి అంట్లూ, బట్లూ, వంటలే కదా? సీపిరీ, సేట మన డిగ్రీలు ఆట్ని సక్కరంగా వోడితే బతికేయెచ్చు. నాయల్లుడికి ఇక్కడికొచ్చిన నాలుగయిదేల్ల వరకూ ఒకరోజు పనుంతే ఒకరోజు ఉండేది కాదు. అలగని మేవు పస్తులు పడుకోనేదు. నావి రెండూ, నాకూతురివి రెండూ నాలుగుసేతుల్తో నట్టుగా పనిసేసి నాయల్లుడ్ని నిలబెట్టినావు. మొగోడికి పని దొరకడడం కస్టంగానీ ఆడది తనకొచ్చిన పన్లు తోటి సుబ్బరంగా బతకొచ్చు. పెట్టుబడిలేని పని. నవ్వుకొని, తుల్లుకొని సెయ్యెచ్చు. నానులగే సేత్తాను. నానుసేసీ ఇల్లల్లోని వోల్లెవ్వలూ నన్నొగ్గుకోరు. అంత సర్దాగుంతాను. అలగనీ ఆల్లు పెచ్చుమీరిపోతే నాలుగు దులిపేత్తాను. మరొక్కాడ ఎతుక్కుంతాను పని. పని దొరకదనే దేవీనేదు మన్లాంటోల్లకి’ అని ముగించింది.

కళ్లు టప టపా కొట్టుకుంటూ కొంచెం తేట పడిన మొహంతో పాపమ్మ మళ్లీ ఏదో చెప్పబోతుండగా ‘అమ్మీ ఒక ఇసయం సెప్పనా? ఇంత బతుకూ బతికి నన్ను పాసిపని చెయ్యమంతావా? అని నువ్వునన్నడిగితే నేనేటి సెయ్యలేనుగానీ, ఒక్కటి మాత్రం గట్టిగా సెప్పగల్దును. అదేటంటే నిన్న కుక్కకన్నా ఈనంగా సూసినోడికి ఇన్నాల్లూ ఈ పన్లన్నీ సేసినావు. సిన్నపిల్లా, తల్లీ తండ్రీ లేని గుంట మన పంచన సేరిందనే కనికరం లేకంటా నాతో అన్నీ పన్లు సేయించుకోని, నీ ఇల్లు అమ్ముకుదొబ్బి, నిన్నొక కసకంత్రీ నా కొడుక్కి అమ్మీసిన నీ సినబాబూ, పిన్నమ్మలకీ ఆల్ల పిల్లలకీ ఈపన్లే ఇన్నాల్లూ సేసి బతికావు. ఇక్కడివరకా నువ్వు సేసినవి అసలికి సక్కగా సెప్పాలంటే అవీ పాసిపన్లు. మనకోసం మన బతుక్కోసం మనం సేసీపన్లు అయ్యి ఏవైనా అవి గౌరవవైన పన్లే. ఇయ్యన్నీ ఎందుకమ్మలూ, బతకడం కోసం పనిసెయ్యడమే గౌరవ్వూ. అదే పనయినా పర్లేదు. దానికి డబ్బుల్రావల, ఆటితో మనం బతకాల, నాకు మట్టికీ ఇదే కరెట్టు’ నిశ్చయంగా అంది ముసలమ్మ.’అమ్మా! నిన్ను అమ్మా అని పిలుస్తాను. నాకు నువ్వు చేసే దగ్గర పని ఇప్పించు. చేసుకోని ఇదిగో ఈడ్ని పెట్టుకొని బతికేస్తాను’. ధైర్యంగా అంది అమ్మలు. ‘ఈడా, ఈడుంటే ఇంక నీకు బయ్యంనేదు. పని నీను సూత్తాను. నువ్వాడ్నిసూడు. పద, అందాకా నా ఇంట్లో ఉందుగానీ, మొదటి జీతాలందాకా ఇల్లెతుకుందుగానీ, నీను మాయమ్మి గోరింటి దగ్గిట్లోనే ఏరాగా ఉంటన్నాను. ఎంతైనా మన బతుకు మనం బతికితేనే మర్యేద. పద నిన్నింట్లో దింపి నాను పనికెల్తాను. వచ్చాక మిగతా ఊసులాడుకుందాం. ఈ బేపి పేరంటమ్మా? ఏదో పేరుగానీ నీను కిట్టూ అని పిలుత్తానమ్మా. ఎందుకంటే నాకాడా ఒక కుక్కండీది. దానిపేరే కిట్టూ. అది సచ్చిపోయిందమ్మా, నాకూ, నీకు కూడా ఈడు తోడుంటాడు గానీ పదా’…. అంటూ బడ్డీలోంచి బయటకి దారితీసింది. అప్పల్రాజు నవ్వుతూ వాళ్ళిద్దర్నీ చూస్తూ బేరం సాగిస్తున్నాడు. అమ్ములు కళ్లనిండా నీళ్లే. మెరుస్తున్నాయి కళ్లు.

మహిళా సంఘం కార్యకర్త. ఉపాధ్యాయిని. పుట్టిన ఊరు విశాఖపట్నం. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేసి, రాజీనామా చేశారు. నలభై రెండేళ్లుగా మహిళా సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళల సమస్యలపై పనిచేయడం వలన కలిగిన అనుభవాలను రికార్డ్ చేస్తున్నారు.

2 thoughts on “వివాహాంధకారం లోంచి…

  1. “ఆడదానికి పెల్లేనమ్మా అసలు ఆపద” పద్మా అంధకారాన్నీ బిగి సడలకుండా నడిపించావు. ధన్యవాదాలు!

    1. కత్తి లాంటి కథ రాశారు పద్మ గారూ.
      Kudos.

Leave a Reply