విరసం అధికారిక వెబ్ సైట్ విరసం.ఆర్గ్ కొన్ని రోజులుగా సైబర్ దాడులకు గురి అవుతున్నది. ఈ నెల 11 తారీఖున రాత్రి మొదటిసారి దాడికి గురి అయింది. ఆగస్టు 5న మా సభ్యుడు పాణి రాసిన “ఈ నిర్మాణం ఏ విధ్వంసానికి?” అనే ఆర్టికల్, జార్ఖండ్లో సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివాసుల మీద దాడిచేసి దానిని మావోయిస్టు పార్టీ జరిపినట్టుగా చేసిన ప్రచారం మీద నిజనిర్దారణ వ్యాసాలను తొలగించారు. అలాగే కళాకారుడు వంగపండు ప్రసాద్ మీద విరసం నివాళి ప్రకటనను తీసివేశారు. వాటిని విరసం వెబ్ టీమ్ తిరిగి అప్లోడ్ చేయగా ఆగస్టు 12 సాయంత్రం పూర్తిస్థాయిలో హాక్ చేశారు. విరసం వెబ్ హోమ్ పేజీ మీద మీ ప్రవర్తనతో మేము విసిగిపోయాము, మేము ఎన్ని సార్లు చెప్పిన మీరు మారటంలేదు, అందుకు అనుభవించండి అంటూ ఒక మెస్సేజ్ ను పెట్టారు. (hacked by PA4TR1K). తిరిగి టెక్నీకల్ ఎక్సపర్ట్స్ సహాయంతో వెబ్సైటు ను ఆగస్టు 13 నాటికీ పునరుద్దరించగలిగాం. అయితే మళ్ళి ఆగస్టు 14 తెల్లవారుజాము నుంచి సైట్ మీద దాడి చేస్తూ నిన్న రాత్రికి మళ్లి హాక్ చేశారు. (hacked by balck blush). మొదటి సారి హాక్ చేసినప్పుడు విరసం వెబ్ మ్యాగజైన్లో ఈ నాలుగేళ్ల కాలంలో వేరు వేరు సంధర్భాలలో తీసుకువచ్చిన వ్యాసాలను ముఖ్యంగా మోదీ, బిజెపి పరిపాలన మీద వచ్చిన విమర్శ వ్యాసాలను, మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన వ్యాసాలను తొలగించారు. అలాగే మా సంస్థ వ్యవస్థాపక సభ్యులు, భీమాకొరేగాం కుట్రకేసులో అక్రమంగా జైలులో నిర్బంధించబడ్డ వరవరరావు వీడియోల లింకులను తొలగించారు. వీటితో పాటు రోహిత్ వేముల, ఢిల్లీ జేఎన్యూ లో ఆజాదీ వీడియో లింకులను తొలగించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు అనేది సైబర్ దాడుల్లో ఇదిమిద్దంగా పైకి కనపడకపోవొచ్చు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేళ్ల కాలంలో భావప్రకటనా స్వేచ్ఛ మీద, భిన్న అభిప్రాయాల మీద జరుగుతున్న దాడులు చూస్తే ఇది ఖచ్చితంగా సంఘ్ పరివార్ మూక చేసిన దాడిగానే విరసం భావిస్తున్నది. ముఖ్యంగా సామజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తరువాత ఈ తరహా దాడులు పెరిగిపోయాయి. భిన్నమైన భావజాలం, ప్రత్యామ్నాయ రాజకీయాల మీద జరుగుతున్న దాడుల్లో ఇది కూడా భాగమే.
విరసం ఈ సంవత్సరం జులై 4 తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. విరసం 1977 నుండి అరుణతార పత్రికతో తెలుగునాట సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే 2013 జులై 28 న అమరుడు గంటి ప్రసాదం సంస్మరణ సభ, విరసం ఆవిర్భావ దినోత్సవం సభ నాడు విరసం.ఇన్ పేరుతో విరసం వెబ్సైటు ను ప్రారంభించింది. విరసం సభ్యులకు సంబంధించిన రచనలతో పాటు, సంస్థ కార్యక్రమాలు, కరపత్రాలు, పుస్తకాలను విప్లవాభిమానులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసింది. 2014 ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చాక దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారిని చంపేశాయి. ఉత్తర్ ప్రదేశ్లో ఆవు మాంసం తిన్నాడన్న నెపంతో ఆక్లాక్ ను హిందుత్వ మూకలు చంపివేశాయి. రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్య, యూనివర్సటీలలో హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారి మీద దాడులు చేశారు. మరోవైపున ఆపరేషన్ గ్రీన్ హంట్ తరువాత మిషన్ 2016 రూపంలో విప్లవోద్యమం మీద నానాటికి పెరుగుతున్న దాడులను బయటి సమాజానికి చెప్పాల్సిన ఒక స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆలోచనలకు, రాజకీయాలకు ఒక వేదికగా అరుణతార పత్రిక ఒకటే సరిపోదని విరసం.ఆర్గ్ పక్ష పత్రికను విరసం ప్రారంభించింది. ఈ పక్ష పత్రికను విరసం ప్రారంభించిన నాలుగేళ్ళ కాలంలో సాహిత్య, రాజకీయ రంగాలలో తన పరిధి మేర పనిచేస్తూ వచ్చింది. రెండు సార్లు మినహా మిగతా అన్ని సందర్భాలలో ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా పత్రికను తీసుకురాగలిగాం. ఈ కాలంలో నా కవిత్వంతో నేను, కథావరణం,కవిత్వంలోకి , జీవిత కవిత్వం, నిశిత, ఈ పుస్తకం చదివేరా వంటి సాహిత్య సంబంధమైన కాలమ్స్ ను తీసువచ్చింది. అలాగే స్టాలిన్, టిఎమ్ఎస్, ధిక్కార స్వరం – తెలుగు మహాసభల సందర్భం, సమీక్షలు, విరసం 50 ప్రత్యామ్నాయ రాజకీయాలు, వివి 365 వంటి ప్రత్యేక సంచికలను తీసుకువచ్చింది. వీటి కంటే ముఖ్యంగా హిందుత్వ దాడులకు వ్యతిరేఖంగా, విప్లవోద్యమం మీద జరుగుతున్న దాడుల్లో భాగంగా ఆదివాసుల మీద, ప్రజాస్వామ్య వాదుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. వారికి మద్దతును కూడగట్టడంలో తనవంతు పాత్రను పోషించింది. కాశ్మీర్ దగ్గరి నుండి అయోధ్య దాక, సీఏఎ నుంచి కరోనా విపత్తు దాక రాజ్య నిర్బంధం గురించి మాట్లాడుతూనే ఉంది. వాటి గురుంచి మాట్లాడే, రాసేవారికి ఒక వేదికగా ఉంది. ఇదే సంఘ్ పరివార్ మూకలకు కంటగింపుగా మారింది. అసభ్య పదజాలంతో దూషించడం మొదలు మా మీద సైబర్ దాడి చేయడం దాక వచ్చింది. ఇలాంటి దాడులు మా సంస్థకు ఇప్పుడు కొత్తగా ఏమి మొదలు కాలేదు. ప్రభుత్వ నిషేధాలు, కుట్ర కేసులు, అరెస్టులు లాంటివి ఎన్నో ఈ యాభై ఏళ్లలో మా సంస్థ ఎదుర్కొన్నది. దీనినీ అలాగే ఎదుర్కొంటాం. అయితే వెంటనే రాగలిగే ఆర్థిక వనరులు, సాంకేతికత మాకు లేకపోవచ్చు గాని తిరిగి మళ్ళీ సాహిత్య అభిమానులు, విప్లవాభిమానుల ముందుకు త్వరలోనే వస్తాం. ఏదయితే మమల్ని మాట్లాడొద్దు అన్నారో, ఏ రచనలైతే రాయడానికి వీల్లేదన్నారో, ఏ రాజకీయాలను ప్రచారం చేయొద్దు అన్నారో వాటి గురుంచే మేము మళ్ళీ మాట్లాడుతాం.
-విరసం.ఆర్గ్ సంపాదకవర్గం
Condemned