తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో యాభై ఏండ్ల సమున్నత విప్లవ పతాక విరసం కు జేజేలు!
1984 మాకివలస (శ్రీకాకుళం) లో జరిగిన పదవ మహాసభల్లో సాంకేతికంగా విరసం సభ్యున్నైనప్పటికీ, 1982 జులై నుండే మానసికంగా విరసం సభ్యత్వం తీసేసుకున్నాను. 1981-82 లో సిద్దిపేట లోని ప్రగతిశీల సాహిత్య వాతావరణం లో మొలకెత్తి అప్పుడప్పుడే కవిత్వం లో తొలి గీతలు గీస్తూ, హైదరాబాద్ జే యెన్ టీ యూ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేరిన సందర్భం. ఒక వైపు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తో పరిచయం, మరో వైపు శివారెడ్డి సార్ తో సాన్నిహిత్యం నన్ను నా సాహిత్యాన్ని, సాహిత్య ప్రాపంచిక దృక్పథాన్నీ ఒక స్పష్టమైన మార్గం వైపు నడిపిస్తున్న సమయం. అప్పటికే శ్రీ శ్రీ నీ, శివసాగర్ నీ, శివారెడ్డి నీ, చెరబండరాజు నీ, వరవరరావు నీ ఔపోసన పట్టి వాళ్ళ కవిత్వం నిత్య పారాయణం చేస్తున్న కాలం. 1982 జులై లో, అప్పటిదాకా గాంధీ ఆస్పత్రిలో, వ్యవస్థకూ తనకూ పట్టిన క్యాన్సర్ తో పోరాడుతున్న చెర ఇక లేరన్న వార్తా, చెర అంతిమయాత్రలోనూ, సంస్మరణ సభలోనూ, జె యెన్ టీ యూ సహచరులతో పాల్గొన్న అనుభవమూ విరసానికి నన్ను మానసికంగా దగ్గర చేసినయి. 1982 డిసంబర్ 21 న సారస్వత పరిషత్ హాల్ లో జరిగిన సుబ్బారావు పాణిగ్రాహి సంస్మరణ సభా, అందులో నేను చదివిన కవితా నన్ను విరసం లో మానసికంగా, భౌతికంగా సభ్యున్ని చేసినయి. నమ్ము, రత్నమాల, విమల, హెచ్చార్కే, జయ, ఆర్కే, వేణు, నర్సాగౌడ్, సలంద్ర, దేవులపల్లి అమర్ తదితర విరసం సభ్యులెందరో కలిసిన సభ. నాతో పాటు వచ్చిన సుధాకిరణ్, ప్రకాష్ లకూ విరసం తో సాన్నిహిత్యమూ అప్పుడే మొదలైందని చెప్పొచ్చు. అంతకుముందే ప్రగతిశీల విద్యార్థులుగా మా జే యెన్ టీ యూ దోస్తులు రమేశ్ చంద్ర, నగేశ్ తదితరులు సాహిత్యం పట్ల అభిమానం తో విరసం సభల్లో పాల్గొంటున్నారు. అప్పటికే శివసాగర్, చెర, వీవీ రాసిన పాటలూ, కవితా వాక్యాలు మా నోట నినాదాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి. మా చేతుల్లో మొలిచిన బ్రష్ ల చివర జేగురు రంగు రాతలై హైదారాబాద్ గోడల మీద ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు హైదరాబాద్ లో గోడలు మంటల నోళ్ళై విప్లవ నినాదాలను జ్వలించేవి. ఎరుపు, నీలం రంగు సిరాల్లో ముంచిన బీడీలతో రాసిన పోస్టర్లు విప్లవసందేశాలు మోస్తూ సిటీ బస్సులను పొద్దున్నే అలంకరించేవి. ప్రతి రోజూ ఒక ఉద్యమంగా, ప్రతి క్షణం ఒక ఆవేశపూరిత ఉద్రిక్త కవి సమయాలుగా సాగుతున్న సందర్భం అది.
1983 జనవరి నుండే విరసం సిటీ యూనిట్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టిన. 1983 లో శ్రీశ్రీ వెళ్లిపోవడం మరో అశనిపాతం. యే మహాకవి గీతాలు మమ్మల్ని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోనియ్యకుండా ఉక్కిరిబిక్కిరి చేసి, మా ప్రాపంచిక దృక్పథాన్ని మార్చేసి మాలో కవితా బీజాల్ని మొలకెత్తించినయో ఆ మహాకవి ఇంక లేరన్న వార్త నిలువ నీయలేదు. వెక్కి వెక్కి యేడ్చినా కన్నీళ్లు తుడుచుకొని, విరసం సిటీ యూనిట్ తరఫున యేర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొని మహాకవి శ్రీశ్రీ , చెరల ఆశయాలకు పునరంకితమై కవిత్వం రాయడం ఉధృతం చేసిన. తర్వాత 1984 లో మాకివలస సభలకు బయలుదేరి వెళ్ళడం, అక్కడ సాంకేతికంగా నా సభ్యత్వాన్ని మహాసభ సర్వసభ్య సమావేశం ఆమోదించడం నా సాహిత్య జీవితం లో ఎన్నడూ మరవలేని అపురూప సంఘటన. ఆ మహాసభల్లో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కృషిచేస్తున్న మహామహులు ఎందరో పరిచయమయ్యారు. నాతో హైదరాబాద్ నుండి బయల్దేరి వచ్చిన నమ్ము, రత్నమాల, విమల, హెచ్చార్కే, జయ, ఎన్ వేణుగోపాల్, ఆర్కేలతో పాటు త్రిపురనేని, కె వీ యార్, వీ వీ, అట్టాడ అప్పల్నాయుడు, చెంచయ్య, చలసాని, జుగాష్ విలీ, సురా (సీ వీ సుబ్బారావు), శక్తి, వంగపండు, గద్దర్, అరుణోదయ రామారావు, కానూరి, రుద్రజ్వాల, భూపాల్ ఇంకా ఎందరో ఎందరో అప్పటికే నేను వినీ, రచనలను చదివున్న గొప్ప విప్లవ రచయితలు, గాయకులు, కళాకారులు పరిచయమయ్యారు. బహుశా నా జీవితంలో మాకివలస సభలు ఎన్నడూ మరువలేనివి. అక్కడి నుండి ప్రారంభమై విరసంతోనూ, విప్లవ కవిత్వం తోనూ 14 యేండ్లు సాగిన నా ప్రయాణం, 1998 జనవరిలో నా సభ్యత్వం సాంకేతికంగా రద్దైనా ఇంకా కొనసాగుతోంది. ఇకముందూ సాగుతుంది. అప్పటికీ ఇప్పటికీ విరసం లో సభ్యున్ని కాకపోయినా, విరసం తో నా సంబంధం పేగు సంబంధమే. విరసం తో నా ప్రయాణం నా ఉనికిలో ఒక సజీవమైన భాగమే!
ఇప్పుడు విరసం 50 యేండ్ల జన్మ దినోత్సవం జరుపుకుంటోంది. 1970 జూలై 4 న హైదరాబాదులో శ్రీ శ్రీ, కొడవటిగంటి కుటుంబ రావు, కె వీ యార్, త్రిపురనేని, వరవరరావు, చలసాని ప్రసాద్, యెం టీ ఖాన్, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, నగ్నముని తదితరుల నేతృత్వం లో యేర్పడ్డ విరసం, 2020 లో తన 50 వ యేట అడుగుపెడుతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో, ఆ మాటకొస్తే ప్రపంచ సాహిత్య చరిత్ర లోనే ఒక రచయితల సంఘం విజవంతంగా 50 యేండ్లు మనగలగడం అద్వితీయమూ, అపురూపమైన విషయం. నిజానికి ప్రపంచ సాహిత్య చరిత్ర లో ఎక్కడా ఒక సామాజిక విప్లవాన్ని ఆకాక్షించి, ఒక కొత్త సమాజాన్ని ఏర్పర్చడం కోసం, సాంస్కృతిక విప్లవాన్ని సాధించడానికి రచయితలు సంఘంగా ఏర్పడలేదు. ఏర్పడినా కూటముల్లా, వేదికల్లా ఏర్పడ్డారు కానీ ఒక ఆశయానికి నిబద్ధులై, ఒక ప్రణాళికకు కట్టుబడి, ఒక స్థిరమైన ఆచరణతో రచయితల సంఘం ఏర్పడ్డం మన తెలుగు నేల మీదే, అదీ విప్లవ రచయితల సంఘం తోనే ప్రారంభమైంది. అంతకు ముందు అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడ్డా దానికి ఇంత నిర్దిష్ట ఆశయమూ, నిబద్ధత గల ఆచరణ లేకుండినవి. అట్లా 1970 లో ఏర్పడ్డ విరసం ఇప్పటిదాకా 50 యేండ్లు తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తనదైన బలమైన ప్రభావాన్నీ ముద్రనూ వేస్తూ అప్రతిహతంగా సాగుతున్నది. తన ఆశయం నెరవేరేదాకా, విప్లవం విజయవంతమై, అన్ని రకాల అణచివేతలు లేని కొత్త సమాజం ఏర్పడే దాకా విరసం కొనసాగుతుంది. కొనసాగే విప్లవం అన్నీ దశల్లోనూ విరసం తన పాత్ర నెరవేరుస్తుంది. సమాజం లో ఎటువంటి ఆధిక్యతా, అణచివేతా లేనంత వరకూ విరసం అవసరమూ, ఆవశ్యకతా ఉంటుంది.
విరసం యేర్పడ్డ తొలిరోజుల్లో “ఈ సంస్థ ఎంతో కాలం నిలవదు ఇది పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతుంది” అని చాలా మంది పెదవ్విరిచారు. “ఇది సాహిత్య సంస్థే కాదు. ఇది తెలుగు సాహిత్యం పై రాజకీయాలు రుద్ది భ్రష్టుపట్టిస్తోంది. ఇది సాహిత్య రౌడీల సంస్థ” అని పెద్ద నోరు పెట్టుకుని అరిచి లొల్లి చేశారు. పాలకవర్గాల, ప్రభుత్వాల, అధికారుల పంచన చేరి కీర్తి స్తోత్రాలు చదువుతూ, వాళ్ళకు రాజకీయాలే లేవన్నట్టు, రాజకీయాలంటే ఏమిటో తెలియనట్టు నటించారు. మరికొంత మండి శిల్పవాదులు విరసం సాహిత్యం లో రాజకీయాల్నీ వస్తువునీ ప్రధానం చేసి శిల్పాన్ని గాలికొదిలేసిందనీ అభాండాలు వేశారు. సాహిత్యం లో వస్తువు శిల్పాన్ని ఎంచుకుంటుందనీ, ‘శిల్పం వస్తువు అస్తిత్వాన్ని బహిర్గత పరిచే అంతర్గత తర్కమనీ’ తొలితరం విరసం రచయితల నుండీ ఇప్పటి తరం దాకా తమ రచనల ద్వారా పదే పదే నిరూపిస్తూనే ఉన్నారు. ఎంతో కాలం నిలబడదు అని శపించబడింది 50 యేండ్లు సమున్నతంగా నిలిచింది. విరసం లేని గత 50 ఏండ్ల తెలుగు సాహిత్య చరిత్ర లేదు. కవిత్వం, కథ, నవల, నాటకం, సాహిత్య విమర్శ, విభిన్న ప్రజా కళారూపాలు ఒకటేమిటి సాహిత్య సాంస్కృతిక రంగం లో అన్నీ ప్రక్రియల్లో తనదైన ముద్ర వేసింది. అమితమైన ప్రభావాన్ని నెరపింది. కళలూ, సాహిత్యమూ మార్పు కోసం పోరాడుతున్న ప్రజల పరం కావాలని, ప్రజల పోరాటం లో భాగం కావాలని, సాహిత్య సాంస్కృతిక రంగాలకు నాయకత్వం వహించి మార్గనిర్దేశం చేసింది. తను ఆచరణలో నిరూపించింది. ఆచరణే ప్రధానంగా గల తొట్ట తొలి రచయితల సంస్థ విరసం.
ఐతే విరసం ఏర్పడ్డ మరుసటి నెల నుండే ప్రభుత్వం కన్నెర్ర కు గురైంది. నక్సల్బరీ, శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాల ప్రేరణతో, పెన్నూ, జముకూ, గన్నూ పట్టుకుని శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం లో పాల్గొని, బూటకపు ఎంకౌంటర్ లో అమరుడైన సుబ్బారావు పాణిగ్రాహి స్ఫూర్తితో ఏర్పడ్డ విరసం మొదటినుండీ తన ఆశయమేమితో, తన లక్ష్యమేమిటో ఎక్కడా నీళ్ళు నమలకుండా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ప్రకటిస్తూనే ఉన్నది. విరసం మొదటి ప్రచురణలు శ్రీ శ్రీ సంపాదకత్వం తో వెలువడ్డ ‘ఝంఝ’ కవితా సంకలనం, ‘మార్చ్’, ‘లే’ కవితా సంకలనాలు, ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ కథ సంకలనం నిషేధానికి గురైనవి. వరవరరావు, త్రిపురనేని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, కె వీ యార్, ఎం టీ ఖాన్ తదితరుల మీద ప్రభుత్వం కుట్ర కేసులతో పాటు అనేక కేసులు పెట్టి అక్రమ నిర్బంధానికి గురి చేసి జైళ్ళలో తోసింది. 1975 లో ఎమెర్జెన్సీ కాలం లో విరసం అనధికారికంగా నిషేధానికి గురైంది. విరసం సభ్యులంతా జైలు పాలయ్యారు. యేండ్ల తరబడి నిర్బంధమూ, జైలు జీవితమూ తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తే చెరబండ రాజు అమరుడయ్యారు. అప్పటినుండి, ఇప్పటికీ కుట్ర కేసులు నడుస్తూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన యూయేపీయే లాంటి క్రూరమైన చట్టాలతో విరసం సభ్యులను జైళ్ళలో నిర్బంధిస్తున్నారు. వరవరరావు ఎన్నో ఏండ్ల జైలు జీవితం తర్వాత మళ్ళీ గత సంవత్సర కాలం పైగా పుణె చీకటి జైలులో నిర్బంధించబడ్డారు. విరసం రచయితలు సముద్రుడు, నూతన్, రిక్కల సహదేవరెడ్డి, కౌముది, ఎం ఎస్ ఆర్ తదితరులు ఎందరో బూటకపు ఎంకౌంటర్లలో అమరులయ్యారు. పోలీసు స్టేషన్ లలో తీవ్ర చిత్రహింసలకు గురయ్యారు. తప్పుడు కేసుల్లో ఇరికించబడి యేళ్ళ తరబడి విచారణకు కూడా నోచుకోకుండా జైళ్ళలో మగ్గిపోయారు, పోతున్నారు. విరసం లో సభ్యత్వం అన్నా, విరసం తో సాన్నిహిత్యమన్నా క్రూరమైన రాజ్య నిర్బంధానికి బలైపోవడమే అనేది గత 50 యేండ్ల లో స్పష్టమైన విషయం. ఎన్నో సార్లు విరసం ను నిషేధిత రాజకీయ పార్టీకి సంబంధాలు అంటగట్టి నిషేదించే ప్రయత్నం జరిగింది. 2005 లో నిషేధ ఉత్తర్వులు కూడా జారీ అయినవి. ప్రతిసారీ విరసం కూడా నిషేధిత రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ అని ప్రకటించడం ప్రభుత్వానికీ పోలీసులకూ పరిపాటి అయిపోయింది. ఆ పేరు మీద నిర్బంధాన్ని మరింత తీవ్రతరం చేయడం సహజమై పోయింది. 1970 ల్లో ఎమర్జన్సీ, 1980 ల్లో ‘ఆటా పాటా మాట బందు’ , 1990 ల్లో వరుస ఎంకౌంటర్లతో తీవ్రమైన నిర్బంధం, 2000 లో చర్చల పేరుతో జరిగిన మోసాన్ని కనీసం చెప్పడానికి సభ పెట్టుకోలేని పరిస్తితి, 2010 ల్లో క్రూరంగా విరుచుకు పడ్డ మతోన్మాద ఫాసిస్టు రాజకీయాలు ప్రజాస్వామ్యంపై కమ్ముకొచ్చిన కారుమేఘాల చీకటి రోజులు… నిర్బంధానికీ, అణచివేతకూ అంతం లేదు – ఆధిపత్యాలు విస్తరిస్తున్నాయి. బ్రాహ్మణీయ మనువాదం అధికారపగ్గాలు పట్టి వికృత స్వరూపం చూపుతోంది. కులవ్యవస్థ నిచ్చెనమెట్ల ఆధిపత్యం పేట్రేగి దళితులూ, మైనారిటీలు, ఆదివాసీలు అనునిత్యం హింసకూ, దోపిడీకీ, అణచివేతకూ గురవుతున్నారు. సమాజం మొత్తం మీద పొరలు పొరల ఆధిపత్యం, నిశ్శబ్దంగా ‘సమ్మతి’ తో పాకిపోతోంది. మొత్తం దేశమ్మీద విప్లవ శక్తులు, పోరాటాలు, ప్రగతిశీల శక్తులు కొంత వెనుకబడ్డ మాట నిజం. 2000 లల్లో ఉధృతంగా ముందుకొచ్చిన సామాజిక మాధ్యమాలను శక్తివంతంగా ఉపయోగించుకుని బ్రాహ్మణీయ మనువాదం తన అధికారానికి మధ్యతరగతి ప్రజల్లో నిశ్శబ్ద సమ్మతి సాధించుకోగలిగిందన్నది నిజం. ఆదివాసీ పోరాటాలు, జనతన సర్కారు దండకారణ్యం లో, రాజ్య నిర్బంధపు ఆపరేషన్ గ్రీన్ హంట్ లో నెత్తుర్లోడుతూ మొక్కవోని ధైర్యం తో నిలబడ్డా మైదాన ప్రాంతాల మీద, పట్టణాల్లో, నగరాల్లో ప్రజాస్వామిక శక్తులు బలహీన పడ్డ మాట నిజం. ఈ సందర్భం లో విరసం తన 50 యేండ్ల జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నది. తన 50 యేండ్ల సృజనాత్మక ధిక్కార ప్రయాణాన్ని, నూతన ప్రజాస్వామిక విలువలపై ఆధారపడ్డ సాహిత్య సాంస్కృతికోద్యమ నిర్మాణంలో ఎగుడు దిగుళ్ళనూ, విజయాలనూ, లోటుపాట్లనూ అంచనా వేసుకుంటూ వజ్రోత్సవ సభలను జరుపుకుంటున్నది.
విరసం గత 50 యేండ్లుగా విజయవంతంగా ప్రయాణం చేయడానికి కారణాలేమిటి? నిత్యనిర్బంధం లోనూ గత 50 యేండ్ల నిరంతర ప్రయాణానికి, అందులో సాధించిన విజయాలకీ ప్రధాన కారణం విరసం రాజీ లేకుండా పోరాడుతున్న ప్రజల పక్షం వహించడమే. తెలుగు నేలపై ఎక్కడ ఎప్పుడు ప్రజాపోరాటాలు పెల్లుబికినా విరసం వాటికి గొంతునిచ్చింది, వాటితో నిలిచింది, వాటిలో తానూ భాగమైంది, వాటినుండి ఊపిరి పీల్చుకుంది, తిరిగి వాటికి కొత్త ఊపిర్లూదింది. అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలతో నిరంతర గతితార్కిక సంబంధంలో ఉండడం వల్లనే విరసం తెలుగు సమాజంలో, తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ సజీవంగా కొనసాగుతున్నది. 1980 ల తర్వాత తెలుగు సమాజంలో కొత్త పోరాటాలు ముందుకొచ్చినయి. కొత్త పోరాట శక్తులు ఉద్భవించినయి. కొత్త పోరాట స్పృహలు నలుమూలలా విస్తరించినయి. గత దశాబ్ద కాలంలో విరసం, ప్రజాపోరాటాలు, ప్రగతిశీల శక్తులు వేసిన బీజాల్లోంచే ఈ పోరాట స్పృహల సాహిత్యం ముందుకొచ్చినా, అది గుణాత్మకంగా కొత్త స్పృహతో ముందుకొచ్చిందనేది వాస్తవం. అగ్రకుల దురహంకారానికి, బ్రాహ్మణీయ మనువాదానికి వ్యతిరేకంగాముందుకొచ్చిన దళితుల ఆత్మగౌరవ పోరాటాలైనా, కులనిర్మూలనా పోరాటాలైనా, పురుషాహంకారానికి వ్యతిరేకంగా ముందుకొచ్చిన స్త్రీ వాద ఉద్యమలైనా, మెజారిటీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ముందుకొచ్చిన మైనారిటీ ఉద్యమాలైనా, అప్పటిదాకా ఉన్న ప్రగతిశీల వర్గ స్పృహ నుండి చైతన్యం పొందినా, ప్రత్యేక అస్తిత్వ స్పృహలతో ముందుకొచ్చి అద్భుతమైన సాహిత్యం సృష్టించాయి. ఆ సాహిత్యాన్ని, ఆ స్పృహలనీ, ఆ చైతన్యాన్నీ విరసం కొంచెం ఆలస్యంగా నైనా స్వంతం చేసుకున్నది. వాటినుండి నేర్చుకోవాల్సింది నేర్చుకుని, వాటికి అందించాల్సిన స్పృహనూ చైతన్యాన్నీ అందించింది. వాటిలో తానూ భాగమైంది. తర్వాత 2000 ల్లో వచ్చిన మార్పులనూ, కొత్త ప్రాంతీయ చైతన్యాలనూ, సమాజాన్ని ముంచెత్తిన అంతర్జాల సామాజిక మాధ్యమాల వెల్లువనూ , ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పెనుమార్పులనూ విశ్లేషించి, అవగాహన చేసుకుని, తానూ మారుతూ ముందంజ వేస్తున్నది. పోరాడుతున్న ప్రజా చైతన్యం తో కలిసి నడుస్తున్నది. తెలుగు సాహిత్యం లో, సమాజం లో పోరాడుతున్న బహుళ ప్రజాస్వామిక శక్తులకూ, స్పృహలకూ మధ్య అనేక వైరుధ్యాలున్నయి. వాటికీ విరసానికీ (విరసం సైద్ధాంతిక భూమికకూ) మధ్యా వైరుధ్యాలుంటాయి. అయితే ఇవన్నీ మిత్రవైరుధ్యాలు. వీటి మధ్య స్నేహమూ, పోరాటమూ ఉంటాయి. వీటి మధ్య, ఒకదానిని మరొకటి ప్రభావితం చేసుకునే గతితార్కిక సంబంధం ఉంటుంది. ఈ వైరుధ్యాలను పరిష్కరించే విధంగా సాహిత్యాన్ని సృష్టిస్తూ, సంస్కృతిని ప్రభావితం చేస్తూ ఆయా శక్తులను కలుపుకుపోతూ, సమాజాన్ని సమూలంగా మార్చి కొత్త సమాజం నిర్మించే దిశగా నాయకత్వం వహించాల్సిన బాధ్యత విరసం మీద ఉన్నది. ఇప్పటి దాకా ఆ పని శక్తివంచన లేకుండా చేసినా, చేయాల్సినంత చేయలేదని ఈ 50 ఏండ్ల సభల సందర్భంగా నిర్మొహమాటంగా చెప్పుకోక తప్పదు. కమ్ముకుంటున్న చీకటి రోజులు ఆ బాధ్యతని, కర్తవ్యాన్ని, ముందున్న కష్టతరమైన బాటనూ గుర్తు చేస్తున్నాయి.
విరసం గత 50 యేళ్లుగా తెలుగు సాహిత్యం లో ఒక అతి ముఖ్యమైన పని చేసింది. అది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తనదైన అంతర్జాతీయ శ్రామిక వర్గ దృక్పథం తో తెలుగు సమాజం లోని నిర్దిష్టతను గుర్తించి, విశ్లేషించి సాహిత్యం సృష్టించింది. సిద్దాంతం తో మొదలు కాకుండా, వాస్తవాలతో మొదలై, వాటిని సిద్ధాంతం వెలుగులో పరిశీలించి, నిర్దిష్టతనుండి విశ్వజనీనత ను తాత్వీకరించింది. నిర్దిష్ట సంఘటనల్లో, అంశాల్లో ఉండే ప్రత్యేకతలను గుర్తించి, వాటిని సాహిత్యం లో ప్రతిఫలించింది విరసం. అన్నింటికీ ఒకే కాట కట్టి, అన్నింటికీ ఒకే పరిష్కారాన్ని వెదికే మూస సాహిత్య ధోరణి నుండి తొందరగానే బయటపడింది. అందువల్లనే శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నుండి, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, గోదావరి లోయ, దండకారణ్య పోరాటాలలో అతి నిర్దిష్టంగా ఉండే జీవితాలకు, పోరాటాలకు సాహిత్య రూపమిచ్చింది. ఆయా పోరాటాల్లో పాల్గొన్న ప్రజల జీవితాలను సూక్ష్మ స్థాయిలో సాహిత్యం లో చిత్రించి, వాటిలోని విశ్వజనీన తాత్వికతను పాఠకులకు అందించింది. సాహిత్యం అంటే కేవలం ప్రతిబింబం మాత్రమే కాదని, అద్దం లో ప్రతిఫలించినట్టు జీవితాన్ని సమాజాన్ని ప్రతిఫలిస్తే ప్రయోజనం లేదని త్వరలోనే అర్థం చేసుకుని, సాహిత్యం సమాజాన్ని విచలించాలని (deflect) గుర్తించింది. విలువైన సాహిత్యం సృష్టించింది. తెలుగు సాహిత్యం మీద తన చెరిగిపోని ప్రభావాన్ని వేసింది, వేస్తూ ఉన్నది. తెలుగు సాహిత్య చరిత్రలో అరుణాక్షరాలతో లిఖించదగ్గ అపురూప చరిత్ర విరసానిది.
ఈ సందర్భంగా, నేను విరసం లో చేరిన తొలిరోజుల్లో జరిగిన ఒక చర్చను గుర్తు చేసుకోవాలి. నేను సభ్యుడినైనంక విరసం సర్వ సభ్యసమావేశం లో ఒక ప్రధానమైన చర్చ జరిగింది. ఇప్పుడా చర్చ మొత్తం ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు కానీ స్థూలంగా దాని సారాంశమిది. విరసం తన ప్రణాళిక లో ‘మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానానికి కట్టుబడి సాహిత్య కృషి చేస్తూ పని చేసే రచయితలకే విరసం సభ్యత్వ అర్హత’ వుంటుందని ప్రకటించుకున్నది. ఐతే అట్లా కాకుండా ‘నూతన ప్రజాస్వామిక విప్లవ భావజాలం తో, భూస్వామ్య సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా సాహిత్య సాంస్కృతిక రంగం లో పని చేసే రచయితలందరినీ కలుపుకుపోతూ విరసం విశాలమైన ప్రజాస్వామిక రచయితల వేదికగా ఏర్పడేటట్టు ప్రణాళిక మార్చాలని, ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక, ఆచరణల కోసం చర్చ జరిగింది. ఐతే అప్పుడు చాలా లోతుగా, విస్తృతంగా జరిగిన చర్చలో మెజారిటీ ‘మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం’ సభ్యత్వానికి గీటురాయిగా ఉండాలనే వాదననంగీకరించడం తో, మైనారిటీ మెజారిటీ కి కట్టుబడే ప్రజాస్వామిక సంప్రదాయం తో విరసం కలిసి కట్టుగా పనిచేసింది. తర్వాత కాలం లో మళ్ళీ ఆ చర్చ రంగం మీదికి వచ్చినట్టు నాకు తెలియదు. ఐతే మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఇండియా లో, తెలుగు సమాజం లో వస్తున్న అనేకానేక మార్పులు, విచ్ఛిన్నమై బలహీన పడిన అనేకానేక ప్రజా ఉద్యమాలూ, ప్రజాస్వామిక శక్తులూ, సమాజం మొత్తంగా ఒక ‘సమ్మతి’ని సృష్టించి బలపడిపోయిన ఫాసిస్టు శక్తులు, జడలు విప్పుతున్న విద్వేష జాతీయవాదం, పీడిత ప్రజలపై తీవ్రమైన దాడి చేస్తున్న పాలకవర్గాలూ, వారికండదండగా ఉండే క్రూరమైన రాజ్యం నేపథ్యం లో, మరో సారి విరసం ఒక విశాలమైన నూతన ప్రజాస్వామిక సాంస్కృతిక శక్తుల ఐక్యసంఘటనగా ఏర్పడాల్సిన చారిత్రిక అవసరం మన ముందున్నది. బ్రాహ్మణీయ మనువాద, మతోన్మాద, విద్వేష జాతీయవాద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా సాహితీ సాంస్కృతిక ఉద్యమాన్ని విశాల ప్రాతిపదికమీద నిర్మించాల్సిన బాధ్యత ప్రస్తుత సామాజిక సాంస్కృతిక పరిస్తితి దృష్ట్యా , ఈ 50 యేండ్ల సందర్భంగా విరసం మీద ఉన్నది.
ఇందుకు ఆదివాసీ, మూలవాసి, దళిత, బహుజన, స్త్రీ, మైనారిటీ తదితర అన్ని పీడిత ప్రజాసమూహాల జీవితాల్లోని ప్రజాస్వామిక సంస్కృతినీ, ఆకాంక్షలనూ, పోరాటాలనూ కలుపుకుని పోయి, వాటినుండి నేర్చుకుని, తిరిగి వాటికి శాస్త్రీయ అవగాహన వెలుగునందించి, నిజమైన ‘ప్రజల నుండి ప్రజలవద్దకు’ అనే సూత్రీకరణకు మనసా వాచా కర్మణా ఆచరణరూపమిస్తూ, ఈ చారిత్రిక సామాజిక సందర్భంలో కాలం తన ముందుంచిన ఈ సవాల్ ను విరసం స్వీకరించాలని ప్రగాఢ ఆకాంక్ష. గతం లో జరిగిన చర్చల నుండి అవసరమైనదీ, పనికొచ్చేదీ స్వీకరించి, తన మౌలిక ఆశయాలను, ఆకాంక్షలను, ఆచరణను యెట్టి పరిస్తితిలోనూ విడవకుండా, అన్ని రకాలుగా విరసం మరింత విశాలమై, సంఘటితమై, తెలుగు సమాజాన్ని ప్రజాస్వామిక మార్పు వైపు నడిపిస్తూ మరో అర్థశతాబ్దం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ…
విరసానికి జేజేలు. విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి జేజేలు.
ఒకానొక దినాన
నాదేశపు విరాజకీయ మేధావుల్ని
నిలవేసి ప్రశ్నిస్తారు
అమాయకులైన అలగాజనం
ఏం చేస్తున్నారు మీరు
మనదేశం నింపాదిగా తీయని మంటలాగా
చిన్నగా ఒంటరిగా మరణిస్తున్నప్పుడని
పేదవాళ్లు బాధ పడుతున్నప్పుడు
లాలిత్యమూ జీవితమూ వాళ్లలోనుంచి
మండిపోయి మసీ నుసీ అయిపోయినప్పుడు
ఏంచేస్తున్నారు మీరని
ఓ నా సుమధుర దేశపు
విరాజకీయ మేధావులారా
అప్పుడు మీరు జవాబు చెప్పలేరు
ఒక నిశబ్దపు రాబందు
మీ పేవులారగిస్తూ ఉంటున్నప్పుడు
మీ వేదన మీ ఆత్మలనే
పొడుచుకు తింటున్నప్పుడు
మీ సిగ్గులో
మీరే నోరు మూసుకొంటారు .
ఒట్టో రెనె కాస్టిజో
అనువాదం: శ్రీ శ్రీ
విరసం ప్రస్థానంతోపాటు సాగిన మీ నడక మీ నిబద్దత స్ఫూర్తిదాయకంగా అక్షరబద్ధం చేశారు
Thank you Ramesh Babu garu
చాలా మంచి వ్యాసమన్న. విరసానికి నీకు అభినందనలు
Thank you Anna
Virasam prasthanam shaashvatham
Thank you
Those inspiring days..the memorable journey..they stay with us. You captured them Swamy!
Thank you Kiran
ఐతే మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఇండియా లో, తెలుగు సమాజం లో వస్తున్న అనేకానేక మార్పులు, విచ్ఛిన్నమై బలహీన పడిన అనేకానేక ప్రజా ఉద్యమాలూ, ప్రజాస్వామిక శక్తులూ, సమాజం మొత్తంగా ఒక ‘సమ్మతి’ని సృష్టించి బలపడిపోయిన ఫాసిస్టు శక్తులు, జడలు విప్పుతున్న విద్వేష జాతీయవాదం, పీడిత ప్రజలపై తీవ్రమైన దాడి చేస్తున్న పాలకవర్గాలూ, వారికండదండగా ఉండే క్రూరమైన రాజ్యం నేపథ్యం లో, మరో సారి విరసం ఒక విశాలమైన నూతన ప్రజాస్వామిక సాంస్కృతిక శక్తుల ఐక్యసంఘటనగా ఏర్పడాల్సిన చారిత్రిక అవసరం మన ముందున్నది. బ్రాహ్మణీయ మనువాద, మతోన్మాద, విద్వేష జాతీయవాద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా సాహితీ సాంస్కృతిక ఉద్యమాన్ని విశాల ప్రాతిపదికమీద నిర్మించాల్సిన బాధ్యత ప్రస్తుత సామాజిక సాంస్కృతిక పరిస్తితి దృష్ట్యా , ఈ 50 యేండ్ల సందర్భంగా విరసం మీద ఉన్నది.
చాలా వివరంగా రాసావు గురూ , పైన చెప్పినట్లు ఇప్పుడింకా విరసం అవసరముంది
Thank you Guroojee
“బూటకపు ఎంకౌంటర్ లో అమరుడైన సుబ్బారావు పాణిగ్రాహి స్ఫూర్తితో ఏర్పడ్డ విరసం మొదటినుండీ తన ఆశయమేమితో, తన లక్ష్యమేమిటో ఎక్కడా నీళ్ళు నమలకుండా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ప్రకటిస్తూనే ఉన్నది”
విరసం స్ఫూర్తిని సూటిగా గుండెల్ని తాకేలా వివరంగా, సహేతుకంగా అందించారు స్వామీ. కృతజ్ఞతలు!
(నేను సరిగా చూసుకోకుండా చైతన్య రాసిందనుకున్నాను.క్షమించండి)
Thank you Sivalakshmi! No problem at all
విరసం ఏభై ఏళ్ల ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు అక్షరబద్ధం చేసారు సర్. థాంక్యు
Thank you Varma!
ఒక విలువైన సూచనతో ఒక మంచి వ్యాసం. సంస్థలు తమ ఆశయాలకు సమగ్ర ఆచరణాత్మక రూపంగా ఉండాలి కానీ సిద్ధాంతాలకు ప్రతీకాత్మకంగా వుండొద్దు.
Thank you Aranya!
దిల్ సె జో బాత్ నికల్ తీ హయ్ అసర్ రఖ్ తీ హయ్…
పర్ నహీ తాఖతె పర్వాజ్ మగర్ రఖ్ తీ హయ్….
మనసును చీల్చుకుని వచ్చే మాటకు శక్తి వుంటుంది..
రెక్కలు వుండవు కానీ అది ఎగురగలుగుతుంది…
——– ఇఖబాల్
Wah! Wah! Thank you Khader anna!