భిన్న భావోద్వేగాల సంపూర్ణ సమ్మేళనం – విభా కవిత్వం!

అవును కలలు దుఃఖిస్తాయి. వాస్తవంలో తొలగిపోని భయాలు కలల్లో కూడా వెంబడిస్తాయి. నిజానికి కలలే వాస్తవాన్ని ఎక్కువగా గుర్తు చేస్తుంటాయి. వాస్తవంలోని ఘర్షణ, దుఃఖం… అన్నీ కలల్లో కూడా కొనసాగుతుంటాయి. అలాంటి “కలల కన్నీటి పాట”లని “విభా” కవిత్వం పట్టుకుంది.

***

విభా కన్నడ కవయిత్రి. కేవలం 26 సంవత్సరాలు మాత్రమే బతికిన కవి ఆమె. చిరుప్రాయంలోనే చనిపోయినా అద్భుతమైన కవిత్వాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. 1977 సెప్టెంబర్ 27వ తారీఖున కర్నాటకలోని జన్మించిన విభా 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పోస్టల్ డిపార్టమెంట్లో పని చేసేవారు (అంటే ఒక రకంగా ఆమె నాకు పరిచయం లేని నా సహోద్యోగి!). మార్చి 21, 2004న ప్రసవానంతర సమస్యలతో చనిపోయారు. ఆమె కూతురు పేరు “కనసు”. కనసు అంటే కన్నడంలో “కల” అని అర్ధమట. ఆమె మరణానంతరం ఆమె భర్త సహకారంతో విక్రం విసాజి అనే కన్నడ కవి, విమర్శకుడు ఆమె కవితల్ని కూర్చి “జీవ మిడితద సద్దు” అనే పేరుతో సంకలనం తెచ్చారు. దాన్నే ఇప్పుడు తెలుగు మాతృభాషగా కలిగిన యువ కవి, అనువాదకుడు అల్లూరి అజయ్ వర్మ “కలల కన్నీటి పాట” అనే పేరుతో విభా కవితల్ని తెలుగులోకి అనువాదం చేసి పుస్తకం ప్రచురించారు. ఇందులో సుమారు నలభై కవితలున్నాయి. పుస్తకం చిన్నదే కానీ అందులోని గాఢత చాలా పెద్దది అజయ్ మనసులాగానే.

అజయ్ ఆమె గురించి రాసిన పరిచయం నుండి చెప్పాలంటే చిన్న వయసునుండే కవిత్వం రాసిన విభా కన్నడ కవిత్వంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె కవిత్వం బహుముఖీనం. అందులో స్త్రీవాదం, ప్రేమ, విరహం, మృత్యు స్పృహ, తాత్వికత, అయినవారి మరణం మిగిల్చిన తీవ్ర వేదన….ఇలా ఎన్నో వున్నాయి. ముఖ్యంగా స్త్రీయొక్క ప్రేమాంతరంగం, స్త్రీగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోటానికి పడ్డ ఆరాటం, పెంచుకున్న అవగాహన, చేసిన పోరాటం… ఇవి ఆమె కవిత్వంలో మనల్ని కట్టిపడేసే అంశాలుగా చెప్పుకోవచ్చు. సమాజం ప్రశాంతంగా బతకటానికి వీల్లేకుండా వున్నదనే బాధ ఆమె కవిత్వంలో కనబడుతుంది. ఒక స్త్రీగా జీవితంలోని భిన్న పార్శ్వాల్ని ఆమె తన కవిత్వంలో స్పృశించారు. ఆమె కవిత్వంలో ఆవేశం కంటే భావోద్వేగం, ఆగ్రహం కంటే పరిపక్వత ఎక్కువగా కనబడతాయి. సంక్లిష్టతకి తావు లేకుండా సరళత, క్లుప్తత, ఒక సులభగ్రాహ్య విధానం ఆమె రచనా శైలిలో ప్రస్ఫుటంగా కనబడుతుంటుంటాయి. ఎక్కువ భాగం చిన్న చిన్న కవితలు.

విభా కవిత్వం మొత్తంలో ఏదో వేదనాభరితమైన ఒక రాగం వినబడుతుంటుంది. అది సరాసరి మన హృదయంలోకి వెళ్ళి కూర్చుంటుంది. మానవ సంబంధాల్లోని సహజ ఆకాంక్షలకి, వాస్తవానికి మధ్యనున్న దూరం లేదా వైరుధ్యం విషాదంగా ప్రతిఫలిస్తుంటుంది ఆమె కవిత్వంలో. ఆమె కవిత్వంలో భవిష్యత్తు పట్ల ఆశ వుంటుంది, వర్తమానం పట్ల నిరాశ వుంటుంది. ఇది ఆమె ప్రధాన బలం. అయితే వీటన్నింటి కంటే మిన్నగా తన స్త్రీత్వ స్పృహ, దాని మీద ఆవరించిన భావజాలాల ముళ్ళకంచెలు, అవి కలిగించే నొప్పి…ఆమె కవిత్వానికి మూలాధారం.

“నేనూ బతుకుతున్నాను
ఎన్నో శతాబ్దాల నుండి
అదే వంటింటిలో
అదే పొయ్యి సందులో

అవతల-
సూర్యుడు నిత్యం వెలుగుతున్నాడట
కానీ నేను చూడనే లేదు
నాకెక్కడ అతని దిష్టి తాకుతుందని
నాయనమ్మ బయటికొదలనే లేదు

అవతల-
చాలా వెలుగుందట
కానీ నేను చూడనే లేదు
నా రంగెక్కడ మాసిపోతుందోనని
అమ్మ బయటికొదలనే లేదు

అవతల-
కనులుప్పొంగించే పచ్చదనముందట
కానీ నేను అనుభవించనే లేదు
నేనెక్కడ దానిలో కనుమరుగైపోతానోనని
నాన్న బైటకొదలనే లేదు

కానీ ఇప్పుడిప్పుడే
సూర్యుడు వెలుగ్గుటిలోంచి
లోపలికి చొరబడి నన్నే చూస్తున్నాడు
ఎక్కడినుంచో పొడుచుకొస్తున్న వెలుతురు
మార్చేస్తున్నది నా రంగునంత
పచ్చదనం చేచాపి పిలుస్తున్నది
కిటికీ అవతల నుండి నన్ను (పొడుచుకొస్తుంది వెలుతురు)


చూసారు కదా గాఢ్తకి లోటులేని ఎంత సరళమైన అభివ్యక్తో! కుటుంబాల్లోని పవర్ పాలిటిక్స్ యొక్క అంతిమ ఫలితమైన స్త్రీల అణచివేతని చాలా పటిష్టంగా చూపిన కవిత ఇది. ప్రకృతి సహజంగా స్త్రీ దేహంలో వచ్చే మార్పులకి విపరీతార్ధాలనిచ్చే సమర్త సంబరాల గురించి “సిగ్గు” అనే మంచి కవిత రాసారావిడ.

“నిన్న మొన్నటిదాక
తొడ మీద కూర్చోబెట్టుకొని
కథలు చెప్పి
కితకితలు పెట్టిన నాన్న-
ఇప్పుడలా వసారాలో మెసిలినా
ఆమెకి సిగ్గు”


సంఘర్షించే స్త్రీ అంతరంగాన్ని, పరాయీకరణని వ్యక్తీకరించే “ప్రాణం కొట్టుకునే చప్పుడు”, “గురుతు”, “లోక నిందితురాలి అంతరంగం” వంటి అనేక కవితలు విభా రాసారు. ఈ కవితల్లోని తీవ్రమైన ఆవేదన పఠితుల్ని మెలిపెడతాయి. విభా కొన్ని శుద్ధ ప్రేమ కవితల్ని కూడా రాసారు. “ఏకాంత సంధ్య” అనే ఈ కవిత చూడండి.

“ఒక రొట్టె
ఒక కవిత
వినడానికింత సంగీతం-
ఉంటే చాలు
ఈ చూరుకింద ఒక్కత్తినే
ఉండిపోగలను అని విర్రవీగాను కదా!
మరి-
ఈ సాయంత్రపు
ఏకాంతానికి ప్రాణం పోసేందుకు
నువ్వు కావాలని అనిపిస్తుందెందుకు!”


ఒక సాయంత్రం ఏకాంతానికి ప్రాణం పోయటానికి ప్రియుడు కావాలనే భావుకత్వం ఎంత సౌందర్యవంతంగా వుంది!ఆమె తన ప్రియుడిని “నువ్వు” అని సంబోధిస్తుంది. “ధ్యాస”, “నువ్వు, “నువ్వు లేకపోతే”, “కవితలో నువ్వు”, “ప్రేమ” వంటి కవితలు ఆమెలోని ప్రేమైక మూర్తికి తార్కాణాలు. స్త్రీగా తన వ్యక్తిత్వ ఔన్నత్యానికి సాక్ష్యం టైటిల్ కవిత అయిన “కలల కన్నీటి పాట”.

ఈ సమాజం ఎంత డిస్టర్బింగ్ గా వుంటుందో తన కడుపులో వున్న బిడ్డకి దీపావళి గురించి వర్ణిస్తూ ఎలా చెబుతుందో చూడండి-

“ఏమని చెప్పను కన్నా!
బయటికొచ్చే దాకా నిశ్చింతగా వుండు
ఆ తరువాత జీవితాన్ని గడపాలి
ఇలాంటి చప్పుళ్ళలోనే”
ఆమెకి స్త్రీవాదం మీద అపారమైన నమ్మకం వుంది. ఫెమినిస్ట్ సిస్టర్ హుడ్ కి సంకేతంగా నిలిచే “దోసిలిలో భూమి” అన్న కవితలో ఇలా అంటారు.

“మమ్మల్ని తప్ప అందరినీ కాపాడే
ఈ భూమికి వేరే రక్షకులే లేరు
అందుకే ఇప్పుడు
మా దోసిలిలో ఉంది భూమి”…


ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవితనీ కోట్ చేయాలి. ఇంతటి సున్నితమైన, హృద్యమైన, హృదయాన్ని మెలిపెట్టే సంవేదనాత్మకమైన కవిత్వాన్ని మనందరికీ పరిచయం చేసిన తెలుగులో కవిత్వ ప్రేమికులందరి తరపున అల్లూరి అజయ్ వర్మకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. అతని అనువాద ప్రతిభ ఎంత గొప్పగా వుందంటే ఏ ఒక్క కవితా కూడా అనువాదంలా అనిపించనే లేదు. విభా నేరుగా తెలుగులోనే కవిత్వం రాసిందేమో అనిపించే పఠనానుభవం మనకి దొరుకుతుంది. వయసులో చిన్న కుర్రవాడైన అజయ్ పెద్ద మనసుకి, ప్రతిభకి నా నెనరులు. ఈ పుస్తకానికి ఓల్గా గారు రాసిన ముందు మాట, అజయ్ రాసిన పరిచయం ఎంతో విలువైనవి.

(“కలల కన్నీటి పాట” విభా కన్నడ కవితలకి అల్లూరి అజయ్ వర్మ తెలుగు అనువాదం. వెల: రూ.60/- ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో…)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

2 thoughts on “భిన్న భావోద్వేగాల సంపూర్ణ సమ్మేళనం – విభా కవిత్వం!

  1. యువకవి,, అజయ్ వర్మ కి,దీవెనలు, అభినందనలు..💐💐ముందుగా. వారి అనువాదం ఎంత బాగుంది,అంటే,.. వజ్రాలులాంటి కవితలు, మనముందు మెరిసాయి….👌హ్యాట్సాఫ్.. అజయ్ ji.అరణ్య కృష్ణ సర్..ధన్యవాదాలు, మీకు

Leave a Reply