విప్లవోద్యమాలకు పునరుజ్జీవన స్వాగతగీతం ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’

విశాఖ సముద్ర హోరుగాలితో పోటీపడుతూ తన పాటలతో విప్లవ జ్వాలను ఆరిపోకుండా కాపాడిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు. హిందూస్తాన్ షిప్ యార్డ్ లో దినసరి కూలీగా పనిచేస్తూనే ఉత్తరాంధ్ర బతుకుల్లోని వేదనను పాటలుగా మలచి ప్రజలను మేల్కొల్పిన జానపద వైతాళికుడు వంగపండు. 1950లో విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం, పెదకొండపల్లి గ్రామంలో జన్మించిన ఈ ప్రజాకవి జీవితం అడుగడుగునా అవరోధాలమయమే. చదువుకున్నది తొమ్మిదోతరగతి వరకేగాని సమాజాన్ని మాత్రం నిశితంగా అధ్యయనం చేసాడు.

“ఉప్పుసముద్రం చుట్టూ ఉండి ఉప్పులేని బతుకులను” గంధపు చెక్కవనాలున్నా గతిలేని బతుకులను, నాగావళి ఉండి నాటులేని బతుకులను ’దగ్గరగా చూసి చలించిపోయిన మనిషి వంగపండు. నెత్తురు కన్నీళ్లతో తడిసి ముద్దయిన నేలలోంచి వంగపండు స్వరం విప్లవ ఆహ్వాన గీతికలను ఆలపించింది. జానపద బాణీలను తన పాటకు ముడివేసి లోకాన్ని జజ్జనకరి జనారే జనకుజనా జనారే అని ఉర్రూతలూగించాడు. ఆ వరుసలో వినిపించే పతాకస్థాయి గీతం ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా ’ నేపథ్యాన్ని తెలుసుకుందాం.

వంగపండు అనగానే ‘ ఏం పిల్లడో ఎల్దమొస్తవా ’ అనే పాట గుర్తుకు వస్తుంది. ఈ పాట రావడం వెనుక ఒక ఉద్వేగభరితమైన విప్లవచరిత్ర దాగి ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ దగ్గరగల నక్సల్ బరి గ్రామం పోరాట ఉద్యమాల ఆవిర్భావ కేంద్రం.1967 లో ఆ గ్రామంలో భూమిలేని నిరుపేద రైతులు తమను వేధిస్తున్న భూస్వాములపై, స్థానికులపై సాయుధులై చేసిన తిరుగుబాటు నక్సలిజం పుట్టుకకు కారణమయింది. దాదాపు అదే సంవత్సరంలో శ్రీకాకుళ గిరిజన పోరాటం ప్రాంరభమైంది. ఇక్కడి రైతులు తమ పొలంలో తామే కూలీలుగా మారిపోవాల్సిన దుస్థితి దాపురించింది. భూస్వాముల అధిక వడ్డీలకు, ఇతర దోపిడీ విధానాలకు బలయిపోయిన అమాయక గిరిజనులు ఒక సంఘంగా ఏర్పడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం జరుపుకుంటున్న మహాసభను భూస్వాములు అడ్డుకున్నారు. భూస్వాముల కిరాయి గూండాలు కోరన్న, మంగన్నలనే గిరిజన కార్యకర్తలను దారుణంగా కొట్టి చంపేశారు. దానితో గిరిజనులందరు ఆత్మరక్షణ కోసం ఆయుధం చేపట్టారు. అదే విముక్తి ఉద్యమంగా రూపాంతరం చెందింది. 1967 నుండి 1970 వరకు తీవ్రమైన ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యంలు ఈ శ్రీకాకుళ ఉద్యమానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. ఈ ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. కానీ మరెన్నో ఉద్యమాలకు పురుడుపోసింది. ఉద్యమ కార్యాచరణకు కొత్త ప్రణాళికలను అందించింది. ఈ శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితోనే ఉత్తర తెలంగాణలో అనేక సాయుధ పోరాటాలు ఉదయించాయి. ఆనాటి శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తిని నింపుకుని ఉత్తర తెలంగాణలో వామపక్ష ఉద్యమాలు కొత్త ప౦థాలో కదం తొక్కాయి. వంగపండు ‘ ఏం పిల్లడో ఎల్దమొస్తవా ’ పాటలో విప్లవోద్యమాలకున్న శక్తిని, విస్తృతిని వివరిస్తూ రచించాడు.

‘ ఏం పిల్లడో ఎల్దామొస్తవా
శ్రీకాకుళంలో సీమకొండకి
ఏం పిల్లడో ఎల్దామొస్తవా
అరె చిలుకలు కత్తులు దులపరిస్తయట
సాలూరవతల సవర్లకొండకు
చెమరపిల్లులే శంఖామూదేనటా ’

80వ దశకంలో ఈ పాట వచ్చేనాటికే వంగపండు అనేక ప్రజా సమస్యల మీద వందలాది పాటలు రాశాడు. నిరక్షరాస్యులైన వారికి కూడా అర్ధమయ్యే పద్ధతిలో ‘ జాలరి బాగోతం ’ వరసలో అనేక జానపద బాణీలను కట్టాడు. తనలాగే బతుకు పోరాటం చేస్తున్నవారికోసం ప్రజల భాషలో పదాలను అల్లుకున్నాడు. విరసం, పౌరహక్కుల సంఘం, జన నాట్యమండలి వంటి సంస్థల్లో మమేకమయ్యాడు. కాళ్ళకు గజ్జెకట్టి గద్దర్ తో కలిసి అడుగులు వేసాడు. స్వరం కలిపాడు. పలుకులో పదును పెరిగింది. పాటతో విప్లవ శంఖారావాన్ని మోగించాడు. సీకాకుళం సీమకొండలో దాగిన విప్లవ చైతన్యాన్ని మరోసారి రగుల్కొల్పాడు. ముద్దుగొలిపే ముచ్చటైన చిలుక కత్తుల్ని ఎగురవేసే పోరాట కార్యశీలత ఉందని వర్ణిస్తున్నాడు. ఆ సిక్కోలు కొండలో దాగిన సాహస గుణాల్ని పరిచయం చేస్తున్నాడు. సాలూరు దగ్గరున్న సవర్లకొండలో చెమర పిల్లులు తక్కువేమికాదట. చిన్న అలికిడికే చెదిరిపోయి పొదల్లో దూరే చెమర పిల్లులు విప్లవానికి శంఖమూదాయట. ఆ శంఖధ్వని శత్రువు గుండెల్లో ప్రకంపనాలు పుట్టించే విధంగా పాడుతాడు వంగపండు.

“ ఏం పిల్లడో ఎల్దామొస్తవా
నల్లగొండ నట్టడవిలోనికీ
పాముని పొడిచిన చీమలున్నయట
ఏం పిల్లడో ఎల్దామొస్తవా
తెలంగాణ కొమురయ్య కొండకీ ”

పాట ఒక్కసారిగా శ్రీకాకుళం నుండి తెలంగాణలోకి ప్రవహించింది. నక్సల్బరీ ఉద్యమం పుట్టకముందే తెలంగాణాలో ముఖ్యంగా నల్లగొండ, వరంగల్ జిల్లాలో రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. బలవంతుడైన నిజాంరాజుని గద్దెదింపే ప్రయత్నం ఉధృతంగా జరిగింది. బలవంతమైన సర్పము చీమల బారినపడి హతమయిన సత్యాన్ని తెలంగాణ సాయుధ పోరాటం నిరూపించింది. ప్రజలు చీమల దండులా ఏకమై అధికార సర్పాన్ని కాటువేసిన ఉదంతాన్ని వివరిస్తున్నాడు. దొడ్డి కొమురయ్య హత్యతో తెలంగాణ సాయుధ పోరాటం ఎంత తీవ్రరూపందాల్చిందో తెలుపుతున్నాడు. వీటన్నిటిని పుణశ్చరన చేసుకోవడం ద్వారా మన పోరాట వారసత్వాన్ని వదులుకోకూడదని హెచ్చరిస్తున్నాడు.

“ ఏం పిల్లడో ఎల్దమొస్తవా
అరె గద్దని తన్నిన చేతులున్నయట
ఆకులు మేసిన మేకల కొండకు
పులుల్ని మింగిన గొర్రెలున్నయట”

కవి ఈ పాటను అతిశయోక్తి అలంకారాలతో నింపినట్టుగా కనిపిస్తుంది. సాధ్యంకాని పనులను, చర్యలను సాధ్యమయ్యేటట్లుగా చెబుతున్నాడని అనిపిస్తుంది. కాని నిజంగా చరిత్రను తరచిచూస్తే ఇవన్నీ సాధ్యమైనవేనని నిరూపితమయింది. ప్రపంచాన్ని శాసించిన నియంతలు, చక్రవర్తులు, ధనమదా౦దులంతా ప్రజాబల౦ ముందు దారుణంగా ఓడిపోయారు. ప్రజలకు ఆ తెగువను, సాహసాన్ని, పోరాటశీలతను అదించే౦ది ఇలాంటి భావజాలాలు, విప్లవ ధోరణులు మాత్రమే. వాటితో పాటు పాట తక్షణ చర్యను ప్రేరేపిస్తుంది. ఈ పాటలోని చరణాలన్నీ మరో రూపంలో సాధ్యమయిన పనులకు, విజయాలకు కవితాత్మక రూపంగా భావించవచ్చు.

“ రాయలసీమ రాలుకొండకీ
రక్తం రాజ్యం ఏలుతుందట
ఏం పిల్లడో ఎల్దమొస్తవా
అరె తూరుపు దిక్కున దోరకొండకీ
అరె తుపాకి పేల్చిన తూనీగలున్నాయట ”

కవి ప్రజాఉద్యమాలకున్న భౌగోళిక విస్తృతిని కూడా ఎరుకపరుస్తున్నాడు. కరువు సీమ రాయల సీమలో దోపిడీకి, అధిపత్యానికి మాత్రం కరువులేదు. నీళ్లజాడ లేకపోయినా రక్తప్రవాహపు చారికలున్న రాజ్యం అది. ఈ పాటలో కవి ఊహలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముట్టుకుంటే రాలిపోయే సున్నితమైన లేతరెక్కలున్న తూనీగ తుపాకి పేల్చడం విభ్రా౦తి కలిగిస్తుంది. ఒక్కసారిగా తుపాకిపట్టుకున్న తూనీగ దృశ్యమానమవుతుంది. ఇది నిజం అనిపించేంతగా తదాత్మ్యంలోకి తీసుకెళతాడు కవి. ఇందులో వాస్తవం కూడా ఉంది. భూస్వాముల, దొరల ఏలుబడిలో లేతరెక్కల పసివాళ్లు వెట్టిచాకిరిలో మగ్గిపోయి ఎంతకుమిలిపోయారు. ఎంత కమిలిపోయారు. అవే లేతరెక్కలు ఒక దశలో తుపాకులు పట్టుకున్నాయి కదా! కవి ఊహల లోతుల్లోకి వెళితే వాస్తవికత పునాదులు బయటపడతాయి.

“ ఏం పిల్లడో ఎల్దమొస్తవా
కలకత్తా కొదకారుకొండకీ
ఎలుకలు పిల్లిని ఎంట తగిలెనట ”

కవి వంగపండు విప్లవ ఆవిర్భావ ప్రాంతమైన బెంగాల్ కు వెళ్ళాడు. కొండలు, అడవులు ఉద్యమకారుల కార్యక్షేత్రం. ఆ కొండలు, అడవుల్లో వుండే చిలుకలు, చెమర పిల్లులు, చీమలు, గొర్రెలు, తూనీగలు, ఎలుకలు అన్నీ ఒక్కొక్కరూపం దాల్చిన విప్లవవీరులకు ప్రతీక. ఆ వీరుల గెరిల్లా పోరాట నైపుణ్యాలను, సాహసఘట్టాలను ఆయా ప్రాణులకు ఆపాదిస్తూ మనలో పోరాటపటిమను, విప్లవస్పూర్తిని మండిస్తున్నాడు కవి. ఒక అమరవీరుడిపై స్మృతి కవిత ఉద్యమకారులపై కొండంత ప్రభావాన్ని చూపుతుంది. ఈ పాట ప్రభావం మరింత విస్తృతిని పొదువుకుంది. ఈ పాట నిద్రాణమైన ఉద్యమానికి వైతాళిక గీతంగా వినబడుతుంది. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తావా’ అని పదేపదే పిలిచే కవి గొంతు మనల్ని అడవుల్లోకీ లాక్కెళుతుంది. ఈ పాట కొత్త ఉద్యమాల ఆవిర్భావానికి కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది. ఒక జానపదుల పాటలోకి వంగపండు గొప్ప రసాయన శాస్త్రాన్ని సమ్మిళితం చేశాడు. పాటలో ఎన్నో టన్నుల శక్తిని దాచవచ్చనడానికి ఈ పాట ఒక నిదర్శనం.

“ ఏం పిల్లడో ఎల్దమొస్తవా”
– వంగపండు ప్రసాదరావు


(ఏం పిల్లడో ఎల్దామొస్తవా 3
శ్రీకాకుళంలో సీమకొండకి II ఏం పిల్లడో ఎల్దమొస్తవా
అరె చిలకలు కత్తులు దులపరిస్తయట II ఏం పిల్లడో ఎల్దామొస్తవా II
అరె సాలూరవతల సవర్లకొండకు ,, ,,
చెమర పిల్లులే శంఖమూదేనట ,, ,,
నల్లగొండ నట్టడవిలోనికి ,, ,,
పాముని పొడిచిన చీమలున్నయట ,, ,,
తెలంగాణ కొమురయ్యకొండకీ ,, ,,
అరెరరె అరె హహూ హహూహ ,, ,,
అరె గద్దని తన్నిన చేతులున్నయట ,, ,,
ఆకులు మేసిన మేకలకొండకు ,, ,,
పులుల్ని మింగిన గొర్రెలున్నయట ,, ,,
రాయలసీమ రాలుకొండకీ ,, ,,
రక్తం రాజ్యం ఏలుతుందట ,, ,,
అరె తూరుపు ,, ,,
తూరుపు దిక్కున దోర కొండకీ ,, ,,
అరెరరెరరె హహూ హాహూహ ,, ,,
అరె తుపాకీ పేల్చిన తూనీగలున్నయట ,, ,,
కలకత్తా కొద కారుకొండకీ ,, ,,
ఎలుకలు పిల్లిని ఎంటా తగిలెనట II ఏం పిల్లడో ఎల్దామొస్తవా II)

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

11 thoughts on “విప్లవోద్యమాలకు పునరుజ్జీవన స్వాగతగీతం ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’

  1. సమీక్షలు, విశ్లేషణలలో తనదైన ముద్రవేస్తూ సాహిత్య అంతరాలను ఆవిష్కరిస్తున్న ప్రో. రఘు గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు…✊💐💐

  2. ఏం పిల్లడో… స్ఫూర్తి నింపిన పాట, ఉరకలెత్తించే పాట. ఉద్యమాలకు ఊపిరినిచ్చిన పాట. పూర్వపరాలను వివరంగా తెలిపారు. కానీ ఆ పాట పాటను ఓ సినిమా ప్రేమ గీతానికి వాడటం అనేది ఆ పాట రచయిత తెలివితక్కువ తనం. మీ వివరణ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్

  3. “ఏం పిల్లడో ఎల్దమొస్తవా” పాట విప్లవ నేపథ్యము, నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం & తెలంగాణాలో (నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో) రైతాంగ సాయుధ పోరాట ఆంశాలను సమన్వయ పరచి చక్కగా వివరించారు. 🙏🏽
    మొత్తంగా నేను చదివిన మొట్టమొదటి వ్యాసాల (సంపుటి) “సమన్వయ”. చక్కని అంశాలు అందులో పొందుపరిచారు. నాకు ఆ పుస్తకాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. 🤝🏾🙏🏽

  4. ఈ పాట యొక్క నేపథ్యాన్ని,పాటల ద్వార ఉద్యమం ఎలా పురుడోసుకుంటుందో చెబుతూ,తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోరాటాలను చెబుతూ,వంగపండు గారు ప్రయోగించిన పదాలకు మీ విశ్లేషణ
    చాలా గొప్పగా సాగింది సర్ వ్యాసం..🙏🙏🙏

  5. డాక్టర్ రఘు గారికి శుభాకాంక్షలు !!!
    విప్లవ నేపథ్యంతో పాటు పాట గొప్పతనాన్ని అద్భుతంగా చిత్రీకరించారు .ఉద్యమాలకు పాట ఎంత ఊపునిచ్చింది స్పష్టంగా విశ్లేషించారు .స్థూలంగా మీ విశ్లేషణ చాలా చైతన్య భరితంగా ఉంది .మీ విశ్లేషణ మరెన్నింటికో భూమికగా కొనసా గాలాని విశ్వసిస్తున్న .
    డాక్టర్.ఏ. పున్నయ్య తెలంగాణ విశ్వవిద్యాలయం

  6. ఒక చక్కని చిక్కని వ్యాసం, చరిత్రను పోరాటాన్ని, ఉద్యమాన్ని నింపుకున్న అస్థిత్వపు గొంతుకను పరిచయం చేశారు వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా పరిచయం చేశారు sir, Mee విశ్లేషణ ఏకబిగిన చదివించే లా సాగింది, excellent write up💐💐💐

  7. దశాబ్దాలుగా జన సమూహాల్లో సజీవంగా ఉన్న పాటల్లో అత్యంత ప్రభావవంతమైన పాట ఇది …పాట అనటం కన్నా ఆవేదనా భరిత గీతిక… రఘు గారి లోతైన విశ్లేషణ మరో శతాబ్దపు కాల గమనంపై పాట ప్రభావాన్ని శిలాక్షరం చేసింది….
    అట్లూరి వెంకటరమణ ఖమ్మం

  8. కాలమ్ శీర్షిక ‘వెంటాడే పాట’. ఆ పేరుకి తగ్గట్టుగానే రఘు గారు ప్రతీసారి ఎంచుకునే పాట, వారి విశ్లేషణ మనల్ని వెంటాడుతూనే ఉంది. మనలో ఆలోచనలని రేకెత్తించేలా వేటాడుతూనే ఉంది. వంగపండుని జానపద వైతాళికుడిగా నిర్వచిస్తూ, ఆయన జీవితం ఆయన చుట్టూ ఉన్న ప్రజల వేదనామయ జీవితం, విప్లవ నేపథ్యం ఇవన్ని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ ఆయన్నుండి పుట్టిన పాట ఎంత ప్రభావపూరితమైందో ఎర్రపెన్నుతో రాసినట్టుగా చెప్పారు రఘు గారు. ఆ పాటను, ఆ స్ఫూర్తిని మరొక్కసారి మనకు అందించారు. ధన్యవాదాలు

  9. …అనాదిగా అన్యాయాలకు,అణచివేతలకు గురైన మట్టిబిడ్డలు ఎదురుతిరిగి కదం తోక్కే ఉద్యమ నేపద్యాలకు పునరుజ్జీవన గేయం ఈ పాట
    నిత్యం కష్టాల కడగండ్ల కన్నీళ్లు తాగి బతుకుతున్న శ్రీకాకుళం మన్యంవాసులు, ఆదిలాబాదు అడవితల్లి బిడ్డల రక్తంమరిగి ఉద్యమంలోకి దూకించిన ఈపాట నేటికీ ఉద్యమచరణాల్లో ప్రతిధ్వనిస్తున్నది..
    వంగపండు గారి ఈపాట చారిత్రక నేపధ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించిన డా.రఘు గారి అద్భుతమైన విశ్లేషనాత్మక వ్యాసం అనేక చారిత్రాత్మక కోణాలను ఆవిష్కరించింది.ఇది చదువుతున్నప్పుడు మా కళాశాల రోజుల్లోకెళ్లిపోయింది మనసు.
    డా.రఘు గారికి మరొక్కసారి ధన్యవాదాలతో…

    సి.వి.శ్రీనివాస్

  10. డా. ఎస్. రఘు గారు “కొలిమి” అనే అంతర్జాల పత్రికలో రాసిన “ఉద్యమాలకు పునర్జీవన స్వాగత గీతం – ఏం పిల్లడో ఎల్దమొస్తవా” వ్యాసం పై ఇది విశ్లేషణ కాదు. సాహిత్యములో వచనకవులకు ఇచ్చినంత ప్రాధాన్యత పాట కవులకు రాలేదు. వారిని ప్రజలే ఆదరించారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ అవగాహన లోంచి ఈ కింది మాటలను అర్థం చేసుకోవాలి.

    మానవ జీవ పరిణామ క్రమంలో మొదట వెలువడిన కవితా ప్రక్రియ “పాట”. తర్వాత గేయం, వచన కవిత్వం. గేయాన్ని, వచన కవిత్వాన్ని సాహితీ ప్రక్రియగా గుర్తించిన నేటి మన సాహిత్య లోకం పాటను మాత్రం ఒక ప్రక్రియగా గుర్తించడానికి నిరాకరిస్తోంది. (తెలుగు సాహిత్యంలో పాటలపై విశ్లేషణలు తక్కువగా రావడమే దీనికి నిదర్శనం) గత కొంతకాలంగా పాటను కవితా ప్రక్రియ గుర్తించాలని తన రాతలతో, మాటలతోనూ డా. కాశీ0 ఆ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా కళా మండలి కోటి, జాన్ తదితరులు “శబ్దం” పత్రిక ద్వారా ఆ కృషి చేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో పాటను కవిత్వ ప్రక్రియగా గుర్తించకుండా ఉండటానికి గల కారణం ఏమిటని కాస్త లోతుగా ఆలోచిస్తే పాట కవిత్వాన్ని ఎక్కువగా రాసింది దళిత బహుజన వర్గాలే. చెప్పులు
    కుట్టి న, మగ్గం నేసిన ఆ చేతులతోనే, అడవుల వెంట అలసిపోకుండా తిరిగిన ఆ కాళ్ళ తోనే భూమితో సంభాషించి కుల వర్గ సమాజాలకు వ్యతిరేకంగా పాటలు కట్టారు. ఆశువుగా కవిత్వం రచించారు. వీరిని సమాజంలో కవులుగా గుర్తించకూడదని అగ్రవర్ణ భావజాలం కలిగిన సాహితీకారులు, విమర్శకులు చాలా సుతిమెత్తగా వారిని సాహితీ లోకానికి దూరం చేసిన ఎన్నో సందర్భాలు మనం చూశాము. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఎందుకీ వివక్ష అని ఆలోచిస్తే వారు నడిచివచ్చిన సామాజిక చలనాన్ని కారణమవుతున్నది అందరు ఒప్పుకోవాల్సిన చారిత్రక సత్యం. పాటను గౌరవిస్తూ కొంతమంది సాహితీకారులు విమర్శకులు పాటని కవిత ప్రక్రియగా గుర్తించి కృషి చేశారు. వారి చేసిన కృషిని తక్కువగా చూడడం లేదు కానీ వారి శక్తి సామర్ధ్యాలతో పోలిస్తే అతి తక్కువ గా చేశారు. కనీసం ఈ కృషి చేసింది కూడా ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా సాహితీ రంగంలోకి వచ్చిన దళిత బహుజన కులాలే తమ అస్తిత్వాలను చరిత్రను తిరిగి తవ్వుకొని ముందుకు వెళ్తారని నిరూపిస్తున్న డా. ఎస్. రఘు గారికి వారి విద్యార్థిగా చిన్న వాడినైనా అభినందనలు తెలియజేస్తూ, (ఇలా చెప్పాలో, చెప్పోదో నాకు తెలియదు)వారి చేస్తున్న ఈ కృషి ఏ ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
    ఇమ్మిడి మహేందర్
    . పరిశోధక విద్యార్థి, ఓయూ.

Leave a Reply