ఆపరేషన్ కగార్ – అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను వెతికివెతికి చుట్టుముట్టి చంపుతున్న భారతదేశ కేంద్రప్రభుత్వ సైనిక చర్య. 2006 మార్చ్ నాటికి మావోయిస్టు రహిత భారతం లక్ష్యంగా 2004 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం. CRPF, CoBRA, DRG, STF వంటి సంస్థలకు సంబంధించిన, లక్షకు పైబడిన సాయుధ సైనిక సమూహాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు వ్యవస్థ ఈ కార్యక్రమం లో నిమగ్నమై ఉంది. డ్రోన్లు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ చిత్రాలు వంటి అత్యంత శక్తిమంతమైన సాంకేతిక పరికరాల సహాయంతో లక్ష్యాన్ని గురిచూసి కేంద్రప్రభుత్వం సాగిస్తున్న వేట ఇది. ఒక దేశం తన పౌరుల మీద తానే చేస్తున్న యుద్ధం అది.
ఆర్ధిక పీడనను, దోపిడీనీ నిర్మూలించటం లక్ష్యంగా సాగుతున్న భిన్న సైద్ధాంతిక రాజకీయ కార్యాచరణను సహించలేక కార్పొరేట్ పెట్టుబడుల ప్రయోజనాల కోసం అడవిని ఆక్రమించటం లక్ష్యంగా సాగుతున్నఆపరేషన్ కగార్ లో అయిదువందలకు పైగా మావోస్టులు, ఆదివాసీలు హింసాయుతంగా క్రూరంగా చంపబడినట్లు ఒక అంచనా. కగార్ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ 2005 జనవరిలో చలపతితో మొదలు పెట్టి మే నాటికీ ఛత్తీస్ ఘడ్ లోని గుండెకోట్ ప్రాంతంలో నంబాళ్ల కేశవరావు (బసవరాజు) సుధాకర్ (చలం) వంటి అగ్రనాయకులతో సహా 27 మంది మావోయిస్టులను మింగేసింది. ఆ క్రమంలోనే జూన్ 18 న మారేడుమిల్లి అడవులలో అరుణ గాజర్ల రవి, మరొక ఆదివాసీ యువకుడు భారత ప్రభుత్వ సైనిక పోలీసు బలగాల చేత హత్య చేయబడ్డారు. వీరిలో అరుణ రచయిత కూడా.
అమరుల బంధుమిత్రుల కమిటీ అరుణ కథల పుస్తకాన్ని ముద్రించి హైదరాబాద్ లో జులై 18 న నిర్వహించిన అమరుల సంస్మరణ సభలో ఆవిష్కరించింది. బి. అనురాధ ఈ కథల పుస్తకానికి సంపాదకురాలు. సభలో దీనిని పరిచయం చేసింది బజరా (బమ్మిడి జగదీశ్వరరావు).ఈ కథా సంపుటికి పేరు ‘అప్రతిహతం’. ఇది అరుణ వ్రాసిన కథలలో ఒకదానికి శీర్షిక.
అరుణ అమరురాలై నెల దాటింది. ఆమె జీవిత సహచరుడు చలపతి ఎన్కౌంటర్ మరణానికి కాస్త ముందో వెనుకో వైరల్ అయిన ఫోటో లో చలపతితో పాటు అరుణ ను చూసాను. కానీ ఆమె గురించి తెలుసు కొన్నది ఈ నెల రోజుల వార్తా కథనాల ద్వారానే. ఇప్పుడు అరుణ వ్రాసిన కథలు, అనురాధ ముందుమాట చదివాక ఆ కథనాలవల్ల శకలాలు శకలాలుగా తెలిసిన అరుణ జీవితం ఒక మొత్తంగా చలన చైతన్య సౌందర్యంతో అర్ధం అయింది. అరుణ గురించి ‘విన్నంత, తెలియవచ్చినంత’ తేటపరచటానికి అరుణ కథలే మంచి ముడిసరుకు.
1
నూతన ఆర్ధిక సంస్కరణలకు ద్వారాలు తెరిచిన 1990 వ దశకంలో కంప్యూటర్ తెచ్చిన నిశ్శబ్ద విప్లవం భారతీయ యువతను అధిక సంఖ్యలో చదువులకు అమెరికా మార్గం పట్టేలా చేసింది. అక్కడ ఉద్యోగాలు పొంది స్థిరపడటం, డబ్బు సంపాదించటం సామర్ధ్యానికి గుర్తయింది. తల్లిదండ్రులకు అది ఘనత అయింది. ఆ సమయంలో చైతన్య అమెరికాకు కాదు కదా దేశంలో కాలేజీ చదువుకే వెళ్ళలేదు.చదువు విలువ తెలియక తండ్రి లక్ష్మణరావు ఆమెను కాలేజి కి పంపలేదనుకుందామా ఆయన స్వయంగా టీచర్. ఆడపిల్లలకు చదువెందుకని నిర్లక్ష్యం చేశాడా అంటే వాళ్ళది కమ్యూనిస్ట్ కుటుంబం. అందువల్ల అందుకు కారణం మరేదో ఉంది.
అంతర్జాతీయ మహిళా దశకం (1975- 1985) ఇచ్చిన చైతన్యం కావచ్చు,నక్సల్బరి కొనసాగింపుగా సాగిన శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో మహిళల భాగస్వామ్య స్ఫూర్తి కావచ్చు అరుణ పుట్టిన 1980 వ దశకంలో ఆంధ్రదేశమంతటా అనేక ప్రాంతాలలో స్త్రీల సంఘాలు ఏర్పడి పనిచేసాయి. ఆ రకంగా 1986 తరువాత విశాఖలో స్త్రీ శక్తి ఏర్పడింది. విశాఖపట్నం దగ్గర కరకువానిపాలెంలో ఉండే శాంతి లక్ష్మణరావుల ఇంటికి మహిళా సంఘం కార్యకర్తల రాకపోకలు సహజంగా సాగుతుంటే ఆ వాతావరణంలో అరుణ బాల్యం గడిచింది. ఆ రకంగా అరుణకు పన్నెండు ఏళ్ళ వయసుకే మహిళా సంఘాల పని పట్ల ఆసక్తి, అభిమానం ఏర్పడి సారావ్యతిరేక మహిళా ఉద్యమంలో సాంస్కృతిక కార్యకర్తగా భాగస్వామి అయిందని బి. అనురాధ ఈ కథల పుస్తకానికి ‘వేగుచుక్క సందేశం’, అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటవల్ల తెలుస్తున్నది. ఆ తరువాత మూడునాలుగేళ్లకే – అంటే 1995 – లో స్త్రీశక్తితో సహా మహిళాశక్తి (తిరుపతి) మహిళాస్రవంతి (ఒంగోలు), ప్రగతి మహిళా వేదిక ( గుంటూరు), మహిళావేదిక (గూడూరు), మహిళా స్రవంతి (ఆదోని), అభ్యుదయ మహిళావేదిక (అనంతపురం), మహిళా చేతన (హైదరాబాద్) మొదలైన సంఘాలు చైతన్య మహిళా సమాఖ్యగా రాష్ట్రస్థాయిలో సమీకృతం అయ్యాయి. ‘పదహారేళ్ళ వయసు నాటికి అనేక మహిళా సమస్యలమీద పనిచేస్తున్న మహిళా సంఘంలో కార్యకర్తగా తన క్రియాశీలతను పెంచుకుంది’ అని అనురాధ చెప్పినమాటను బట్టి స్త్రీ శక్తి నుండి మహిళా చైతన్య సమాఖ్యవరకు అరుణ ప్రయాణాన్ని ఊహించవచ్చు. ఈ విధమైన క్రియాశీల లక్షణం వల్లనే పూర్తికాలం దానికే వెచ్చించ దలచి రోజూ కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఓపెన్ యూనివర్సిటీ చదువును ఆమె ఎంచుకొని ఉంటుంది. ఆ క్రమంలోనే అరుణ నాలుగేళ్లు తిరిగేసరికి అనురాధ అన్నట్లుగా తన కార్యక్షేత్రాన్ని విప్లవోద్యమానికి విస్తరించుకొన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో బిఎ చదువుతూ మొదటి సంవత్సరం పూర్తి కాకుండానే విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది.
రెండున్నర దశాబ్దాల ఉద్యమజీవితం, 45 ఏళ్ళ వయసులో అమరత్వం అంటే అరుణ 20 ఏళ్ళ నూత్న యవ్వనంలో అసమానతల అవకతవకల సమాజాన్ని మార్చటానికి (చైనాలో మావో నిర్మించి నిరూపించిన నమూనాలో చారుమజుందార్ భారతదేశంలో రూపొందించిన) పోరాట మార్గమే తన మార్గంగా ఎంచుకొన్నదన్నమాట. అరుణ తొలి కథ ‘ప్రశ్నిస్తేనే’ 1999 అక్టోబర్ – డిసెంబర్ మహిళామార్గం పత్రికలో ప్రచురించబడింది. అప్పటికే ఆమె అజ్ఞాత ఉద్యమం లోకి వెళ్లి ఉండాలి. అందువల్లనే ఆ కథ తల్లిదండ్రులు పెట్టిన వెంకట రవివర్మ చైతన్య అనే పేరుతో కాక ‘లక్ష్మీదుర్గ’ అనే మారు పేరుతో వచ్చింది.
2
కథలకు వస్తువు ఎవరికైనా జీవితం నుండే సమకూడుతుంది. అది వ్యక్తిగత జీవిత వైచిత్రీ విశేషమా? సామాజిక జీవిత సంఘర్షణా సంబంధమా? అన్న దానిని బట్టి కథకు ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది. అరుణ కథలలో- ఆ మాటకు వస్తే సమాజాన్ని సమత్వ విలువ ప్రాతిపదికగా మానవీయ సమాజంగా పునర్నిర్మించటానికి యుద్ధంలో నిమగ్నమై ఉన్నవాళ్లలో ఎవరు వ్రాసిన కథలలోనైనా వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదు. వ్యక్తిత్వ ఆవిష్కారమే ఉంటుంది. విప్లవోద్యమంలో భాగం కావటం వలన వికసించిన వ్యక్తిత్వం అది. వ్యక్తిత్వం అంటే సమిష్టి ప్రయోజనాలకోసం వ్యక్తిగా నిలబడగల సత్తా. ప్రశ్నిస్తేనే కథలో బీజప్రాయంగా కనబడే ఆ సత్తా తరువాతి కథలలో చేవదేలి కనబడుతుంది.
ఉన్నదున్నట్లుగా జీవితాన్నిస్వీకరించలేని అసంతృప్తి ఏదో మదిలో రగలటం మొదలైం దంటే అది అట్లా ఎందుకు ఉంది అన్న ప్రశ్న కలగక మానదు. ప్రశ్న అన్వేషణకు దారితీస్తుంది. గమ్యం ఏదో నిర్దుష్టంగా అర్థమయ్యేవరకు గమనంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. అరుణకు ఆ రకంగా తొలి మలి మజిలీ స్త్రీశక్తి. స్త్రీ పురుష అసమానతల స్వభావాన్ని అర్ధం చేసుకొనటానికి, భిన్న సందర్భాలలో అనుభవానికి వచ్చే అసమానతలను గుర్తించటానికి, ఆ పరిస్థితిని సరిచేసే ఆచరణకు ఏ చిన్న స్థాయిలోనైనా సిద్ధం కావటానికి స్త్రీలను చైతన్య పరిచటంలో ఇలాంటి సంఘాల పాత్ర ఎంతైనా ఉంది. ప్రశ్నిస్తేనే కథలో ఒక మధ్యతరగతి సాధారణ మహిళ సాధికార వ్యక్తిత్వంతో ప్రవర్తించటంలో దాన్నే చూస్తాం. ‘బస్సులలో ఆడవాళ్లకు కేటాయించబడిన సీట్లలో వారిని కూర్చొనివ్వాలి’ అని ప్రభుత్వం కల్పించిన ఒక అవకాశాన్ని హక్కుగా గుర్తించి అడిగిమరీ ఆ మహిళ ఆ సౌకర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొనటం కథావస్తువు. ఆ సౌకర్యం తనకు అందుబాటులోకి రాగానే ఆమె తృప్తి పడలేదు. ఇంకా ఆడవాళ్ళ సీట్లలో కూర్చుని ఉన్న మగవాళ్ళను ఉద్దేశించి ఇళ్ల ల్లో పనులుచేసుకొని వస్తున్న స్త్రీలు, పిల్లలను ఎత్తుకొని ఉన్న స్త్రీలు ఉన్నప్పుడు స్త్రీలకు కేటాయించిన సీట్లలో మీరెలా కూర్చుంటారు? అని నిలదీసి లేపింది. తమ హక్కుగురించిన స్పృహే లేకుండా, కూర్చొనటానికి తమకున్న అవకాశాలను మరెవరో ఉపయోగించుకొంటుంటే నోరు తెరిచి అడిగే చొరవ లేక సర్దుకుపోతూ రోజులు గడిపే ఆడవాళ్ల కోసం గొంతెత్తి మాట్లాడింది. అలా ప్రశ్నించటమే నేరమన్నట్లుగా తనమీద ఫిర్యాదుకు దిగిన పురుష ప్రయాణీకుల తోనైనా, వాళ్ళ మాటలు విని అలా అడగటం ధిక్కారంగా, బరితెగింపుగా భావించి అధికారంతో ఆమెను భయపెట్టాలని, అపరాధ భావనలోకి నెట్టాలని ప్రయత్నించిన టికెట్ కలెక్టర్ తోనైనా ధాటీగా మాట్లాడగలిగిన చైతన్యం ఆమెకు మహిళా సంఘంలో పనిచేయటం నుండే వచ్చింది. మహిళా సంఘాలైనా, ఏ హక్కుల సంఘాలైనా అందరికోసం ఒకరు, ఒక్కరి కోసం అందరూ పనిచేసే సంస్కారాలను అభివృద్ధి చేస్తాయి. మహిళలకోసం పనిచేయటానికి తాను ముందు పడ్డప్పుడు ఆ క్రమంలో సమస్యలు ఎదురయితే ఆ సంఘమే మద్దతుగా నిలబడుతుంది అన్న అవగాహన కూడా ఆమెకు సంఘమే ఇచ్చింది. అందువల్లనే నేనొక మహిళా సంఘంలో పనిచేస్తున్నా, నాకేమైనా అవమానం జరిగితే సంఘం ఊరుకోదు అని హెచ్చరించగలిగింది. సంఘంలో పనిచేయటం వ్యక్తిత్వాలను ఎలా నిర్మిస్తుందో, దొరికిన ఏ చిన్న అవకాశాన్నైనా మనుషులను సమస్యల మీద సమీకరించటానికి, సంఘటితం చేసి పోరాటాల వైపు నడిపే చొరవను ఎంత సహజంగా పెంచుతుందో కథముగింపు సూచిస్తుంది. .
ఈ కథ చదువుతున్నప్పుడు బస్సు ను కేంద్రంగా చేసి స్త్రీ సమస్య గురించి షహీదా వ్రాసిన ‘బస్సులు కూడా’ (1994) కవిత గుర్తుకువచ్చింది. “మీకు బస్సు అంటే/ ఓ రవాణా సాధనం మాత్రమే /కానీ మాకు / ప్రతీక్షణం మేం ‘స్త్రీలం’ అని గుర్తుచేసే సాధనం“ అని మొదలయ్యే ఈ కవితలో కూడా స్త్రీల కోసం ప్రత్యేకించిన సీట్లను ఆక్రమించుకొన్న మగవాళ్ళను లేవగొట్టటానికి చేసే యుద్ధం గురిం చిన ప్రస్తావన ఉంది. అయితే లేడీస్ స్పెషల్ అనే మరో కవితలో షహీదా ఇలాంటి పోరాటాలన్నీ స్త్రీలు సమానత్వం కోసం వేసే మొదటి అడుగులే కానీ వాటితో సమానత్వం సాధించి నట్లు కాదు అని సూచిస్తుంది. బస్సులో సీట్లయినా, స్త్రీలకు ప్రత్యేక బస్సులైనా స్త్రీలు పోరాడి సాధించుకొనే ఒక సౌకర్యపు సందర్భమే కానీ అవి మొత్తంగా అసమానత్వాన్ని రద్దుచేయగలవి కావు అని తెలుస్తూ, శ్రమవిముక్తి జరగనిదే స్త్రీ విముక్తి జరగదని స్పష్టమైనప్పుడు “ఎడారిని నందనవనం చేయటం” లక్ష్యంగా మైదానాలనుండి అడవులకు స్త్రీల ప్రస్థానం సాగుతుంది. షహీదా అయినా, మిడ్కో అయినా , అరుణ అయినా అలా విప్లవోద్యమంలోకి నడిచివెళ్లినవాళ్ళే.
3
అరుణ మరణించే నాటికి ఈస్ట్ డివిజన్ సెక్రటరీ. ఆంద్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు. అగ్రనాయకురాలిగా గుర్తిచబడింది. మార్క్సిస్టు సిద్దాంత జ్ఞానాన్ని, ప్రపంచ విప్లవ పోరాటాల అనుభవాల గుణపాఠాలను సమన్వయించుకొంటూ దేశీయ అవసరాలకు అనుగుణంగా విప్లవోద్యమ సిద్ధాంతాన్ని, ఆచరణను ఎప్పటికప్పుడు నిగ్గుతేల్చుకొంటూ నిర్మాణంలో కొనసాగటం నిరంతర సృజనాత్మక ప్రక్రియ. ఆ క్రమంలో వికసించిన అరుణ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకొనటానికి యుద్ధరంగం నుండి ఆమె వ్రాసిన అయిదు కథలు అందుబాటులోకి వచ్చాయిప్పుడు. కరువుదాడి (2002), అప్రతిహతం (2004) పెద్ద ఎడం లేకుండా వచ్చిన కథలు. ఆ తరువాత ఆరేళ్లకు గానీ ఎర్రజెండా (2011) కథ రాలేదు. పదమూడేళ్ల తరువాత 2023 లోనే మిగిలిన రెండు కథలు వచ్చాయి. అవి ‘చరిత్రముందుకే’, ‘వేగుచుక్క’. ఇవి విప్లవోద్యమాన్ని మూడు అనుభవ కోణాల నుండి చూపించాయి.
మొదటి రెండు కథలు దళజీవితాన్ని అందులో మహిళల భాగస్వామ్య పాత్ర కేంద్రంగా- ఎంచుకొన్న కార్యక్రమాన్ని నిర్దిష్ట వ్యూహంతో ఆచరించి విజయం సాధించిన సందర్భాలను చిత్రించాయి. మొదటి కథ ‘కరువుదాడి’ కథ పేరే వస్తువును సూచిస్తుంది. దారిద్య్రం – మనిషి బతకటానికి అవసరమైన కనీసపు కూడూ గుడ్డా వసతి లేని స్థితి. ఇది వ్యక్తిగతమైనదిగా కనిపించినా చేయాటానికి తగిన పని, పనికి తగిన వేతనం లేకపోవటం – అంటే శ్రమదోపిడి – దానికి మూల కారణం. దానిని పరిష్కరించటానికే కార్షిక కార్మిక పోరాటాల నిర్మాణం. విప్లవంలో ఆయా ఉత్పత్తి రంగాలలో ఉద్యమ నిర్మాణం ఒక అంశం. ఈ కథలో విషయం అదికాదు. కరువు. వానలు పడకపోవటం, పంటలు సరిగా పండకపోవటం, మార్కెట్లో తిండిగింజల కొరత, అధికధరలు మొదలైనవాటి పరిణామం కరువు. దాని ఫలితానికి గురయ్యేది దారిద్య్ర రేఖ కు సమీపంలోనో దిగువలోనో ఉన్న సామాన్య ప్రజా సమూహం. కరువు ప్రకృతి వైపరీత్య ఫలితం ఎవరు మాత్రం ఏమిచేస్తారు? అని వాళ్ళ పట్ల బాధ్యత ఏమీ లేదన్నట్లుగా చేతులు దులిపేసుకొనటం తేలిక. కానీ వానలు లేకపోవటం ప్రకృతి వైపరీత్యమే కానీ వానల మీద ఆధారపడకుండా పంటలు పండించగల నీటివనరులు అందుబాటులో ఉన్న వర్గాల సంగతి ఏమిటి? వర్షాలు పడలేనంతగా వాతావరణంలో విధ్వంసం సృష్టిస్తున్న భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల సంగతియేమిటి? కరువును లాభాల ఉత్పత్తికి అనువైన కాలంగా చేసుకొని ధాన్యాన్ని కూడేసి దాచేసి పరిమితంగా మార్కెట్లోకి విడుదల చేస్తూ ధరలు పెంచుతున్న వ్యాపారవేత్తల సంగతి ఏమిటి? ఉత్పత్తి పంపిణీని నియంత్రించని ప్రభుత్వాల సంగతేమిటి? అనే ప్రశ్నలతో వర్గ సమాజ కృత్రిమ సృష్టే కరువు అని తేల్చి చెప్పగలిగింది విప్లవోద్యమం మాత్రమే. ఆ క్రమంలో దానికి ఒక పరిష్కారంగా తిండి ధాన్యం కరువైన వాళ్ళను కలగలిపి ధాన్యం నిల్వల లాభాలుగాడి పైకి దాడి నడిపించటం. కరువుదాడి కథ ఇతివృత్తం లో తాత్విక సూత్రం ఇదే.
‘ఉన్నవాళ్లను కొట్టి లేనివాళ్లకు పెట్టటం’ ఒక ధర్మంగా లోకంలో చలామణి ఉంది. దానినే మాలపల్లి నవలలో ఉన్నవ లక్ష్మీ నారాయణ ‘ధర్మకన్నాలు’ అన్నాడు . కన్నాలు వేయటం అంటే దొంగతనం చేయటం. అది స్వంత ప్రయోజనానికి కాక ‘అన్నపురాసులు ఒక చోట ఆకలి మంటలు ఒకచోట’ ( కాళోజి , వ్యత్యాసాలు) ఉండే సమాజంలో సమధర్మ స్థాపనకు ఎన్నుకొన్న మార్గం కనుక ధర్మకన్నాలు అయింది .అరుణ కథలో కరువుదాడి ధర్మకన్నాలు వంటి చర్యకాదు. ఆకలి బాధలో ఉన్న ప్రజల సమస్య తీర్చటానికి ధాన్యపు గిడ్డంగులను దళాలు స్వయంగా దోపిడి చేసి పంచలేదు. బాధిత ప్రజల భాగస్వామ్యాన్ని కూడగట్టి దాడికి సిద్ధం చేశారు. వ్యూహరచన చేసి నడిపించారు. నీళ్ళల్లోకి చేపల్లా ప్రజా సముదాయంలోకి ప్రవేశించి – జీవితంలో సమస్యలకు కారణాలు తెలిసినా ఏమి చెయ్యాలో తెలియని నిస్సహాయతలో ఉన్న ఒంటరి మనుషులను ఒక్కటి చేసి తక్షణ పరిష్కారాల సాధన కోసం నడిపించటమే కాక ఆయా సమస్యల శాశ్వత పరిష్కారానికి విప్లవ నిర్మాణంలోకి సమీకరించటం అంటే ఇదే.
విప్లవ పార్టీ కరువు దాడికి ప్రజలను ఎలా సంసిద్ధం చేసి సమన్వయపరచి దాడి నడిపిందీ దళం లోని ఒక మహిళా కామ్రెడ్ లక్ష్మి కోణం నుండి ఈ కథ నడుస్తుంది. కరువుదాడికి గ్రామాల నుండి వచ్చిన వాళ్ళను లెక్కించుకొంటూ రావలసిన వాళ్ళ గురించిన ఆమె ఎదురు చూపులతో కథ మొదలవుతుంది. సెంట్రీ డ్యూటీలో వున్న ఆమె మనసులో మెదిలే గతంగా దళం అయిదు రోజుల క్రితం మొదలుపెట్టి 13 ఆదివాసీ గ్రామాలు తిరిగి కరువుదాడికి ప్రజలను సంసిద్ధం చేసిన క్రమం తెలుస్తుంది. ఈ భాగం ఆదివాసీల జీవన స్థితిగతుల గురించిన వాస్తవాన్ని పాఠకుల ముందుకు తెస్తుంది
ఆదివాసీల ఆర్ధిక అభివృద్ధి కోసం అటవీ ఉత్పత్తులను కొనటానికి ఏర్పాటైన గ్రామపంచాయితీ కోఆర్డినేషన్ కమిటీ ఆదివాసీలు సమయాన్ని, శ్రమను వెచ్చించి సేకరించి కావిళ్ళకెత్తుకొని కొండలు ఎక్కీ దిగీ మోసుకెళ్లే చింతపండు వంటి సరుకుల నాణ్యాన్నితక్కువగ చూపి, తక్కువ రేటు కట్టి దోపిడీ చేస్తున్న తీరు తెలుస్తుంది. వానలు లేక పంటలు లేక ఇబ్బంది పడుతున్న స్థితిలో శ్రమకు తగిన ఆదాయం లేక ఏదీ కొనేట్లు లేని స్థితిలో ఆకలి తీర్చుకొనటానికి దుంపలు తవ్వుకొని ఉండికించుకు తినటమే మార్గంగా ఆదివాసీలు జీవిస్తున్న విషాదమూ అర్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ వాళ్ళ దళం ఆ గ్రామాలలో తిరిగి కరువుదాడికి వాళ్ళను సిద్ధం చేసింది. వలస పోవటం కాక, ఆకలిచావులు చావటం కాక పోరాడి బతకాలని చెప్పింది. ఈ సందర్భంలో కరువు దాడి అంటే దోపిడీ కాదు, కష్టాన్ని దోచుకొన్నవాళ్ళ దగ్గరనుండి మన కష్టాన్ని మనం తెచ్చుకొనటం అని నిర్వచించటం గమనించదగినది.
ఆదివాసీ గ్రామాలలో అప్పటికే పార్టీ ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకొన్నదన్నచారిత్రక వాస్తవం కూడా అర్ధం అవుతుంది. విప్లవ లక్ష్యాల సాధనకు మద్దతుగా ఆయా గ్రామాలలోస్థానికుల నుండి సాయుధ సమూహాల నిర్మాణం ఉండటం. గ్రామాలనుండి కరువుదాడికి ప్రజలను సమీకరించటంలోనూ, కరువుదాడిలో ప్రజలను క్రమ శిక్షణతో నడిపించటంలోనూ వాళ్ళ పాత్ర కీలకమైంది కావటం కూడా పాఠకులకు అర్ధం అవుతుంది. కరువుదాడికి గమ్యం ఒక రైస్ మిల్లు. ధాన్య సంపద పోగుపడ్డ కేంద్రం రైస్ మిల్లు. దానికి పూర్తి విరుద్ధంగా ఆకలి , దరిద్రం ఆదివాసీ గ్రామాలలో పోగుపడి ఉన్నాయి. శ్రీ శ్రీ ఐశ్వర్యం ఎదుట దారిద్య్రం కథలో అవి ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండటంలో కార్యకారణ సంబంధం కూడా సూచించబడితే అరుణ వ్రాసిన కరువుదాడి కథ ఐశ్వర్యం మీద దారిద్య్రం తిరుగుబాటును అనివార్య వాస్తవంగా చూపింది. ఈ తిరుగుబాటుకు వ్యూహరచన, నాయకత్వం దళానిదే కానీ మొత్తం అమలులో బాధిత సమూహాలను భాగం చేయటం ప్రజాయుద్ధపంథా అన్న ఆదర్శాన్ని ఆచరణ వాస్తవం చేయటమే అవుతుంది.
సాయంత్రం 4 గంటలకు మొదలైన కథ కరువుదాడికి దండు కదలటం దగ్గర నుండి గమ్యం చేరి బియ్యం బస్తాలను వీపున మోస్తూ విజయవంతంగా తిరిగిరావటంతో సూర్యోదయం సమయానికి ముగుస్తుంది.
దానిని పోలీసులకు అనుమానం రాకుండా భద్రపరచుకొనటం, ఉపయోగించుకొనటం ఆ క్రమంలో ఘర్షణ దగ్గర మరో కథ మొదలు కావచ్చు. అది అరుణ వ్రాయని కథ.
రెండవ కథ ‘అప్రతిహతం’. ఇది కూడా మహిళల అనుభవకోణం నుండి మావోయిస్టు దళ జీవితాన్ని, యుద్ధతంత్రాన్ని చిత్రించినదే. ఆద్యంతాలలో ఉండే పాత్ర పద్మ అయినా ప్రధానంగా ఇది కుమారి కథ. కథా ప్రారంభంలో కొత్త బాధ్యత మీద కొత్తప్రాంతానికి వెళ్తున్న కుమారి అప్పటికి పార్టీలోకి వచ్చి ఏడాది దాటిందని తెలుస్తుంది.కొత్తల్లో దళానికి అవతల కాంపుకి రక్షణగా ఉండాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు ఆ దళాన్ని విడిచి వెళ్ళటానికి రోజంతా ఏడ్చిన కుమారి ఇప్పుడు పార్టీ ఎక్కడికి పంపినా వెళతాను అని స్థిరంగా, దృఢంగా చెప్పటాన్ని చూసి సీనియర్ దళ సభ్యురాలు పద్మ ఉద్యమం విప్లవకారులను తీర్చి దిద్దటం అంటే ఇదే కదా అనుకొంటుంది. పద్మ ముఖంగానే కుమారి పార్టీలోకి వచ్చిన క్రమం కూడా చెప్పబడింది.
పద్మ దళంలోకి వచ్చి ఆదివాసీ మహిళలను సమీకరించి మహిళాసంఘాలు పెట్టె పనిమీద వెళ్ళినప్పుడు కుమారితో తొలిపరిచయం. ఆడపిల్లలకు బలవంతపు పెళ్లిళ్లు, ఎత్తుకెళ్ళి చేసుకోవటం మొదలైన రివాజుల పట్ల అప్పటికి బాగా విసిగిపోయి వున్నదేమో కుమారి మహిళా సంఘాలు పెడితే ముందు ఆ విధమైన పెళ్లిళ్లు ఆపాలని సమావేశంలో గొంతెత్తి చెప్పింది. ఆ సమావేశంలోనే చర్చల తరువాత కుమారి అధ్యక్షురాలిగా అక్కడ మహిళా సంఘం ఏర్పడింది. అప్పుడు పద్మకు కుమారికి మధ్య జరిగిన సంభాషణ వలన ఆమెకు బాల్యంలోనే తమ గ్రామాలకు వచ్చే విప్లవ పార్టీ దళాలతో పరిచయం ఉందని, విప్లవ బాల సంఘంలో పని చేసిందని తెలుస్తుంది. జంఝావతీ దళం కమాండర్ పద్మ ప్రభావంతో దళంలోకి వెళ్లాలని ఉత్సాహ పడేది కూడా. పద్మక్క చనిపోయాక మళ్ళీ అక్కడకు దళాలు రావటం ఇప్పుడిప్పుడే జరుగుతున్నదని కూడా అంటుంది కుమారి. ఆ పద్మక్క పేరే పెట్టుకున్నావా అని ప్రస్తుత పద్మని అడుగుతుంది కూడా. ఆ తరువాత మహిళా సంఘ నిర్మాణంలో చురుకుగా పనిచేస్తూనే పద్మ దళంలోకే రిక్రూట్ అయింది. మిలటరీ కాంప్ లో శిక్షణ పొందటం, చదువు నేర్చుకొనటం అన్నీ పద్మ కళ్ళముందే జరిగాయి. ఏడాదికి ఇప్పుడు పార్టీ అప్పగించిన ముఖ్యమైన బాధ్యతను నిర్వహించటానికి మరొక నలుగురితో కలిసి కొత్తప్రాంతానికి వెళ్తున్న కుమారికి జాగ్రత్తలు చెప్పి పంపింది పద్మ. ఇది కథకు ఉపోద్ఘాతం. కుమారి సంస్మరణ సభలో పద్మ మాట్లాడటం దగ్గర కథ ముగుస్తుంది.
ఒక ఉదయం వెన్నెల వెలుతురు ఇంకా ఉండగానే పద్మ నుండి వీడ్కోలు తీసుకొని బయలుదేరిన ఐదుగురితో కూడిన బృందానికి కమాండర్ విజయ్. మూడుగంటల ప్రయాణ దూరంలో ‘పనసకోట’ గ్రామం చేరి అక్కడ స్థానిక మిలీషియా సహాయంతో అవసరమైన బియ్యం, పప్పులు, గుమ్మడికాయలు వంటివి మోసుకొంటూ కొండలు ఎక్కుతూ రెండుగంటల ప్రయాణం తరువాత గమ్యం చేరారు. అక్కడ నాయకత్వ ముఖ్యులు ఆరుగురితో పాటు అనేకుల తో కూడిన పెద్ద కాంప్. కోరాపుట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ పై ఆయుధాల కోసం జరపబోయే దాడి కి రిహార్సల్స్ చేయటానికి ఏర్పాటు చేసిన కాంప్ అది.
సాయుధ విప్లవావసరాలకు ఆయుధాలు తప్పని సరి. పార్టీ వాటిని సమకూర్చు కొనటం కోసం అనేక పద్ధతులను అవలంబిస్తుంది. ప్రభుత్వ పోలీసు ఆయుధాగారాల మీద దాడిచేసి సంపాదించటం ఒక పద్ధతి. ఆయుధాలను ఉపయోగించి ఎన్ కౌంటర్ల పేర విప్లవకారులను వేటాడి చంపుతూ వున్న ప్రభుత్వ పోలీసు వ్యవస్థలను ఒకరకంగా సవాల్ చేయటం కూడా అది. కుమారి వాళ్ళు కాంప్ కు చేరేసరికి అక్కడ బత్తునూరు అమరులు స్వరూప రజితల సంస్మరణ సభ జరుగుతున్నది. ఆ ఘటనలో గాయాలతో బయటపడ్డ చిన్ని కథనంతో అమరుల జ్ఞాపకాలతో అందరి హృదయాలు బరువెక్కిన స్థితిలో ‘నెత్తుటి బాకీని తప్పక తీర్చుకుంటా’మని శపధం చేస్తూ కాంప్ కమాండర్ సభను ముగించటం దానికి సూచనగానే చూడవచ్చు.
అలాంటి ఒక చర్య కోరాపుట్ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయటం. ఇది 2004 ఫిబ్రవరి ఆరవ తేదీన జరిగిన చారిత్రాత్మక వాస్తవ ఘటన. వార్తగా బయటి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన సాహసోపేత చర్య. పార్టీ సాధించిన విజయం కూడా. మూడు నెలలు తిరగకుండానే అరుణ పూర్వాపరాల నుండి దానిని పునర్నిర్మిస్తూ కథగా వ్రాయటం ఆ విజయాన్ని ఉత్సవంగా చేసుకొనటంలో భాగమే.
రిహార్సల్స్ కాంప్ కి కుమారి వచ్చేటప్పటికి చలికాలం. చలి నెగళ్లు, చలినీ నిద్రనూ తరిమేసే వేడి టి ప్రస్తావన దానినే సూచిస్తుంది. డిసెంబర్ లేదా జనవరి అయి ఉండాలి. రిహార్సల్స్ కోసం పోలీసు స్టేషన్లు , స్ట్రాంగ్ రూములు, సెంట్రీ బంకర్లు, హైవే రోడ్లు, వ్యాన్లు, జీపులు మొదలైన నిర్మాణాలన్నీ అక్కడి చెట్లు కొమ్మలు, కర్రలతోనే నిర్మించి పట్టణాన్ని తయారుచేయటం రెండు రోజులు. సిద్ధం చేసిన ప్రణాళికను మ్యాప్ చూపిస్తూ వివరించి ఆ చర్యలో పాల్గొనవలసి 116 మందిని 17 బ్యాచులు గా చేసి ఎవరు ఏ విధులు నిర్వహించాలో చెప్పటం ఆయుధాలు ఇయ్యటం ఒక ఘట్టం. మూడురోజుల రిహార్సల్స్ తరువాత దాడి రాత్రిపూట కనుక నాలుగవ రిహార్సల్స్ రాత్రి చేయించటం మరొక ఘట్టం. ఇది యాక్షన్ లోకి రావాలంటే బయటనుండి అవసరమైన పనులు నిర్వహించవలసిన నిర్మాణం గురించిన ప్రస్తావన కూడా ఈ కథలో ఉంది. కుమార్, లక్ష్మి , రమణ ఆ రకంగా బయటనుండి బాధ్యతలు నిర్వహించటం చూస్తాం.
ఈవిధంగా అన్నిటినీ సమన్వయించుకొంటూ ప్రారంభమైన యుద్ధ ప్రయాణం వారం పదిరోజుల పాటు సాగింది. ఒక మజిలీలో దొరికిన సమయంలో కుమారి ఆ రోజే పద్మ నుండి వచ్చిన ఉత్తరానికి జవాబుగా తమ ప్రయాణం రకరకాల మార్గాలలో సాగుతున్నదని ఉత్సాహంగా ఉత్తరం వ్రాసింది. ఆ ఉత్తరంలో ‘అలిపిరి ప్రతీకారేచ్చతో నిప్పులు కురిపిస్తున్న తీవ్ర నిర్బంధం’ ప్రస్తావన ఉంది.
అలిపిరి అనగానే గుర్తుకువచ్చేది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్తుండగా పీపుల్స్ వార్ గ్రూప్ అలిపిరి టోల్ గేట్ దగ్గర 2003 అక్టోబర్ 1 న చేసిన దాడి. క్లైమోర్ మైన్స్ పేల్చి చంపటానికి వేసిన ప్రణాళిక విఫలమై చంద్రబాబు నాయుడు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. అప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి మీదా జరగని దాడి చంద్రబాబు నాయుడు మీద ఎందుకుజరిగింది? నక్సలైట్లే దేశభక్తులు అంటూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989 లో గ్రేహౌండ్స్ అనే పేరుతో ప్రత్యేక పోలీసు బలగాన్ని నక్సలైట్ వ్యతిరేక చర్యల కోసమే ఏర్పాటు చేసింది. ఆంధ్ర తెలంగాణాలలో మావోయిస్టు నాయకులను, కార్యకర్తలను వేటాడటం మొదలు పెట్టింది. 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మరింత దూకుడుగా దానిని కొనసాగించాడు. దానికి ప్రతిచర్య అలిపిరి లో ఆయన మీద దాడి. దానినుండి ప్రాణాలతో బయటపడిన చంద్రబాబు నాయుడు వెంటనే నక్సల్స్ ను అణచివేయటానికి సామూహిక ఉద్యమానికి సన్నద్ధం కావాలని ప్రజలకు పిలుపు ఇచ్చాడు. నిషేధించబడిన పీపుల్స్ వార్ గ్రూపుతో శాంతి చర్చల ప్రస్తావన పక్కకు పెట్టి వాళ్ళు హింసను విడిచిపెట్టి ప్రధాన సామాజిక స్రవంతిలోకి రావాలని అభిప్రాయపడ్డాడు.ఆ క్రమంలోనే నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయటానికి పూనుకొన్నాడు. దానితో నిర్బంధం ఎక్కువైంది ‘అలిపిరి ప్రతీకారేచ్చతో నిప్పులు కురిపిస్తున్న తీవ్ర నిర్బంధం’ అని కుమారి పేర్కొన్నది ఈ సందర్భం గురించే. కథలో ప్రస్తావించబడిన రజిత , స్వరూప, అరుణ్, లత, రమణ మొదలైన వారి అమరత్వం ప్రస్తావన ఆ నిర్బంధ పరిణామాన్ని సూచించేవే. అలిపిరి ప్రతీకారేఛ్ఛ 22 ఏళ్ళ తరువాత కూడా కొనసాగుతున్నదనటానికి 2025 మే 21 న ప్రభుత్వ పోలీసు బలగాల దాడిలో మరణించిన మావోయిస్టు కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని ఆంధ్రాలోకి, అయినవాళ్లు మధ్యకు రానీయకుండా చేయటం ఒక నిదర్శనం అనుకోవచ్చు.
ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ పార్టీ యెట్లా పురోగమిస్తున్నదో కూడా తన లేఖలో వ్రాస్తుంది కుమారి. దాడులు, ప్రతిదాడులతో ‘ప్రజారక్షణ కవచం’ మధ్య పనులన్నీ జరుగుతున్నాయి అని చెప్పిన మాట గమనించదగినది. కొండలు ఎక్కుతూ దిగుతూ వాగులు, నదులు, రోడ్లు దాటుకొంటూ ఎండ, వాన, మంచు , చలి ఏమీ అనుకోకుండా ప్రకృతిని ఎదుర్కొంటూ సాగుతున్న తమ యుద్ధ ప్రయాణంలో ఎక్కడికక్కడ తామెన్నడూ చూడని ప్రజలు ఆదరించి ఆకలి దాహం తీరుస్తూ సహకరించటాన్ని గౌరవంతో ప్రస్తావించింది. ఆరకంగా ఎంత నిర్బంధంలో నైనా పనిచేసుకుపోగల నెట్ వర్క్ ను ప్రజలతో సంబంధాలలో నిర్మించుకొనటమే పార్టీ బలం అని ఈ ఉత్తరంద్వారా అరుణ సూచించింది.
ఈ కథలో దాడికి రిహార్సల్స్ కోసం దాడిచేయవలసిన ప్రదేశాల మీద పూర్తి అవగాహనతో ఆ స్థలాల నమూనాలను పునర్నిర్మించి రిహార్సల్స్ చేయటం దగ్గర నుండి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసి తుపాకులు స్వాధీనం చేసుకొనటంతో పాటు పక్కనే ఉండే జైళ్ళమీద , కొంచెం దూరంలో ఉండే బెటాలియన్ మీద ,మరో మూడు పోలీసు స్టేషన్లమీద 17 బ్యాచ్ లుగా చేయబడిన వాళ్లు వేరువేరు టీములుగా ఏకకాలంలో దాడి చేసేట్లు జరిగిన నిర్ణయం అమలు వరకూ కథనం గొప్ప ఉత్కంఠా భరితంగా సాగుతుంది. పని మొదలయ్యేవరకు యాక్షన్ టీమ్ ప్రతి ఒక్కరిలో నూ నిండిన ఉత్కంఠ పాఠకులలోనూ ప్రతిఫలించే శిల్పం ఇది.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాడి టీమ్ లో కుమారి ఉంది. ఆమె తో పాటు ఝాన్సీ అనే మరొక మహిళ స్ట్రాంగ్ రూమ్ తలుపు తాళం గునపంతో బద్దలు కొట్టిన స్త్రీ. లోపలి నుండి తనచేతులతో తుపాకులు మోసి తెచ్చి వ్యాన్లు నింపటంలో కుమారి పొందిన ఆనందం తారాస్థాయిలో చూపించబడింది. అలా పార్టీ కోసం పని చేయటమే పరమానందంగా పరమోత్సాహంతో బతికే కుమారి ఈ ఘటన జరిగిన రెండు నెల్లకే పోలీసు కాల్పులలో అమరురాలైంది. కమాండర్ విజయ్, శశి కూడా ఆమెతో పాటు అమరులైనారు.
విప్లవపార్టీ ప్రభావంలో బాలసంఘం సభ్యురాలై, క్రమంగా తన పని రంగాన్ని మహిళా సంఘానికి అక్కడినుండి గెరిల్లా దళాలకు మార్చుకొంటూ ఎదిగిన ఆదివాసీ అమ్మాయి కుమారి చేసిన ప్రయాణం 2004 మార్చి 8 న కోరాపుట్ జిల్లా కోటియా దగ్గర ఎగువ సంబి ప్రాంతపు కొండల మీద ముగిసింది. అందుకే ఆమె కోరాపుట్ వీరయోధగా ప్రస్తావించబడింది. అంటే స్థూలంగా అప్రతిహతం కథా కాలం 1980 నుండి 2004 మధ్య పాతికేళ్ల కాలం మీద విస్తరించింది అనుకోవచ్చు. విప్లవం ఉద్యమకారులను తీర్చి దిద్దటం అనే అతి సహజ అనివార్య చర్యను కుమారి జీవిత ఆద్యంతాల అంతఃసూత్రంగా చేసి చూపటం వలన అప్రతిహతం కథ ఇతిహాస స్వభావంతో ఉత్తమ స్థాయికి చేరింది. ఇందులో రేఖామాత్రంగా ప్రస్తావించబడి సమగ్రంగా తెలుసుకోమని సవాల్ చేసే జంఝావతీ దళం పద్మ, కుమారి విడిచివచ్చిన దళం పద్మ, బత్తునూరు అమరులు స్వరూప, రజిత, గాయపడిన చిన్ని కథలు ఉపాఖ్యానాలవంటివి. యుద్ధం ఇందులో ప్రధాన విషయం.
యుద్ధం అనగానే 6 వ శతాబ్ది ఆలంకారికుడైన దండి కావ్యాదర్శం అనే గ్రంధంలో కావ్యలక్షణాలను క్రోడీకరిస్తూ నగరం నుండి సముద్రాలూ, కొండలు మొదలైన ఏయేవాటిని వర్ణించవచ్చో చెప్తూ వాటిలో మంత్రము, ద్యూతం, యుద్ధప్రయాణం, యుద్ధం, నాయక విజయం అనే వాటిని పేర్కొన్న విషయం గుర్తుకు వచ్చింది. మంత్రం అంటే రాజ కార్య విచారం, ద్యూతం అంటే రాయబారం. పొరుగు దేశాలపట్ల రాజు కర్తవ్యాన్ని సమీక్షించి లొంగదీసుకోవాలనుకొన్న రాజ్యాలకు సంధి చేసుకొంటారా, యుద్ధానికి సిద్ధపడతారా అని రాయబారం పంపి తెలుసుకొనటం, సంధి పొసగని చోట దండయాత్ర ప్రారంభించటం, యుద్ధం చేయటం రాజు విజయాన్ని పొందటం ఒక ఫార్ములా. రాజుల అభ్యుదయపరంపరాభివృద్ధి దాని అంతిమ లక్ష్యం. కావ్యవస్తువు ఆదిరాజుల యశోవర్ణన అన్న నిర్ధారణ నుండి ఈ కావ్యలక్షణాలు రూపొందాయి.
అయితే ఈ కథలో యుద్ధం ప్రజాయుద్ధం. అసమానతలు లేకుండా సమాజాన్ని చదును చేయటానికి ఎంచుకొన్న వర్గపోరు పంధాలో భాగంగా జరిగిన సాయుధ విప్లవం. గమ్యం దిశగా గమనంలో చేయవలసిన యుద్ధాలు ఎన్నో. అప్రతిహతం కథలో కార్యవిచారం ఉంది. అది సాయుధ విప్లవానికి అవసరమైన ఆయుధాల సమీకరణ. అందుకు వ్యూహరచన, వేరువేరు దళాల నుండి అవసరమైన వారిని ఒక చోటికి చేర్చి శిక్షణ ఇయ్యటం. యుద్ధ ప్రయాణం సరేసరి. కుమారి ఉత్తరం ఆ క్రమాన్ని చెప్తుంది. వారం పదిరోజులు వివిధ మార్గాలలో కోరాపుట్ హెడ్ క్వార్టర్స్ వరకు చేసిన ప్రయాణం అది. ఏక కాలంలో హెడ్ క్వార్టర్స్ తో సహా ఏడు చోట్ల చేసిన దాడులు యుద్ధం. విజయవంతంగా తుపాకులతో, ప్రజల అభినందనలతో తిరిగి వెళ్ళటం నాయకాభ్యుదయం. ఇక్కడ నాయకుడు ఏక వచనం కాదు. దానిఫలితం ఏ ఒక్కరికో దక్కేది కాదు. ఉమ్మడి ప్రయోజనాల కోసం పార్టీ నాయకత్వంలో జరిగిన ఒక సామూహిక చర్య. అందువల్ల అది ఒక సామూహిక విజయం. ఆ రకంగా అప్రతిహతం కథలో సంప్రదాయ కావ్యలక్షణాలు విప్లవ ప్రయోజనాల దృష్ట్యా కొత్త విలువను పొందటం చూస్తాం.
ఇప్పటికి 21 సంవత్సరాల క్రితం అరుణ ఈ కథను ప్రభుత్వ నిర్బంధాలు, ఒత్తిడులు, మధ్య పార్టీ క్రియాశీల దళ సభ్యులనుండి నాయకత్వం వరకు ఎందరినో కోల్పోతున్నా గద్గదికమవుతున్న స్వరాలనే యుద్ధ శంఖ నాదంగా చేస్తూ, ఒక చేత్తో కంటి నీరు తుడుచుకుంటూనే వేరొక చేత్తో ఎర్రజెండాతో కదలిపోయే పార్టీ నిర్మాణానికి ఎదురులేదని గొప్ప ఆశాభావంతో ముగించింది. 2006 మార్చి కల్లా మావోయిస్టు రహిత భారత్ ను ఏర్పరుస్తామని ఆపరేషన్ కగార్ తో 2005 జనవరి నుండి మరీ ముఖ్యంగా మే నుండి ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్న వర్తమాన నేపథ్యం నుండి ఈ కథను చదివితే లభించే భరోసా సామాన్యమైనది కాదు.
4
‘ఎర్రజెండా’ ‘చరిత్ర మునుముందుకే’ కథలు రెండూ దళకమాండర్ల కోణం నుండే నడిచినా ప్రధానంగా అవి పార్టీ ప్రభావిత ప్రాంత ప్రజల చైతన్యానికి సమస్యలకు సంబంధించినవి. ఎర్ర జెండా కథ దళ కమాండర్ పద్మ కోణం నుండి నడిస్తే, చరిత్ర మునుముందుకే కథ దళకమాండర్ సుధ కోణం నుండి నడిచింది. కరువుదాడిలో కామ్రేడ్ లక్ష్మిని ,అప్రతిహతం కథలో పద్మ ను కలుపుకొంటే ఆ నలుగురూ అరుణ కిరణాలే.చరిత్ర మునుముందుకే కథలో సుధ అంతరంగ ఆలోచనల నుండి ఆమె పని చేసిన ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,తూర్పు గోదావరి జిల్లాలు, ఒడిశాలోని కోరాపుట్, మల్కనగిరి జిల్లాలు అని తెలుస్తుంది. అవి అరుణ పని చేసిన ప్రాంతాలుగా అర్ధం చేసుకోవచ్చు. కోరాపుట్ జిల్లాలో పని చేసింది కనుకనే ఎర్రజెండా కథను నారాయణపట్న భూపోరాటాల నేపథ్యంలో వ్రాయగలిగింది.
నారాయణపట్న కోరాపుట్ జిల్లాలోని వూరు. నారాయణ పట్నగ్రామంలో దళితులు కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న వూరు.మైదాన ప్రాంతాలనుండి వచ్చిన భూస్వాములు, వ్యాపారస్తులు, అటవీ అధికారులు కలిసి ఆదివాసీల భూములను ఆక్రమించి స్వంతం చేసుకొని స్థానిక ఆదివాసీలను భూమిలేని వాళ్ళుగా, స్వంతభూముల్లోనే బానిసలుగా మార్చారు. వాళ్ళను లొంగదీసుకుని పెత్తనం చేయటానికి ఆదివాసేతరులకు మద్యం వ్యాపారం కూడా ఉపయోగపడింది. చాసీ మూలియా ఆదివాసీ సంఘం ఒడిషా లో 1995-96 ల నుండి పనిచేస్తున్నప్పటికీ నారాయణపట్నలో దాని తొలి కార్యక్రమం 2004 లో సారావ్యతిరేక ఉద్యమం లోకి దళితులను ఆదివాసీలను సమీకరించి విజయాలు సాధించటం. తరతరాలుగా కోల్పోయిన భూములను తిరిగి పొందటానికి చట్టబద్ధ ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రభుత్వాల నుండి స్పందన సహాయమూ అందని స్థితిలో అనివార్యంగా సంఘటిత ప్రజాపోరాట దిశగా నడిచింది. దాని ఫలితమే నారాయణపట్నం బ్లాక్ లోని ఆరు గ్రామపంచాయితీల కింద ఉన్న వందలాది గ్రామాల నుండి వేలాది జనం బయలుదేరి 2008 జూన్ 12 నాడు భూస్వాముల భూములను ఆక్రమించటం. ఎర్రజెండాలు పాతి సామూహికంగా భూములను దున్నటం. జులై లో భూమిలేనివాళ్ళ మధ్య పంపకాలు కూడా జరిగాయి. దాదాపు 3000 ఎకరాల భూమి ఆరకంగా ప్రజల పరమైంది. ప్రజా పీడకులైన భూస్వాముల వడ్డీ వ్యాపారుల భూములలో ఎర్రజెండాలు పాతి ఊళ్ల నుండి వెళ్లగొట్టే కార్యక్రమం కూడా తీసుకున్నది చాసీమూలియా ఆదివాసీ సంఘం. .
ప్రభుత్వానికి ఇది సహించరానిదై అణచివేత చర్యకు పూనుకొన్నది.ఆ క్రమంలోనే ప్రభుత్వం పోలీసులు కలిసి శాంతి కమిటీని ఏర్పరచారు. కాంగ్రెస్ బిజెపి వంటి రాజకీయ పార్టీల ప్రతినిధులు,భూస్వాములు, ఆదివాసీ గ్రామ పెద్దలు, చాసీ మూలియా ఆదివాసీ సంఘం భూ అక్రమణల సందర్భంలో భూములు కోల్పోయిన దళితులతో ఈ కమిటీ రూపొందింది. ఇది చాసీ మూలియా ఆదివాసీ సంఘానికి మావోయిస్టులతో సంబంధాలున్నాయి అని ప్రచారం చేస్తూ 2009 మే 5 న నారాయణ పట్నాలో పెద్ద సభ చేస దానిని నిషేధించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. ఊరూరా సంఘబాధ్యుల ఇళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది.
శాంతికమిటీ చేస్తున్న ఈ వరుస దాడులకు, అణచివేతకు, ప్రభుత్వ కుట్రపూరిత చర్యలకు వ్యతిరేకంగా చాసీ మూలియా ఆదివాసీ సంఘం 2009 ఆగస్టులో లక్ష్మీపురాలో బహిరంగ సభ ఏర్పాటుచేయగా వాహనాలను అడ్డుకొంటూ, వచ్చే మనుషులను వెనక్కు మళ్లిస్తూ దానిని భగ్నం చేయటానికి శాంతి కమిటీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయినా వేలకొద్దీ జనం వేరువేరు మార్గాలలో వచ్చి ఆ సభను విజయవంతం చేశారు. ఈ విజయాన్ని సహించలేక శాంతికమిటీ తన వ్యతిరేకతను రకరకాలుగా వ్యక్తం చేస్తూ రెచ్చగొట్టింది. ప్రతిగా ఆదివాసీలు సంప్రదాయ ఆయుధాలు చేపట్టి తిరగబడటంతో సంఘర్షణలు చోటు చేసుకొన్నాయి. వారిని చక్కదిద్దటం పేరున పోలీసుల జోక్యం పెరిగింది. దానిని ఖండిస్తూ గ్రామాల మీద పోలీసుల దాడులు, ప్రజలపై అణచివేత చర్యలు ఆపాలంటూ 3000 మంది జనం నారాయణపట్నం పోలీసు స్టేషన్ ముందు చేసిన ధర్నా చారిత్రాత్మకమైనది.
అయితే ఆనాడు ప్రజల జోలికి రాము అని వ్రాతపూర్వకంగా చేసిన వాగ్దానాలను భగ్నం చేస్తూ పోలీసులు ఆదివాసీలు పోరాడి భూస్వాముల అధీనం నుండి తిరిగి పొందిన దున్ని విత్తుపెట్టిన భూముల్లో పంటకోయటానికి 2009 నవంబర్ 20 న పొలాల్లోకి దిగిన తుంబుగూడ ప్రజలను అడ్డుకొన్నారు. మావోయిస్టులకు సహాయ పడుతున్నారు, వాళ్ళ జాడ చెప్పాలంటూ తిట్టారు. వేధించారు. నాయకత్వం ఇచ్చిన సలహామేరకు వాళ్లంతా పొలాల నుండి పోలీసు స్టేషన్ దారి పట్టారు. వేరువేరు గ్రామాలనుండి ప్రజలు వచ్చి వాళ్ళను కలిశారు. పోలీసు స్టేషన్ చేరిన జనం ప్రశ్నలను ఖాతరు చేయకుండా పోలీసులు స్టేషన్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకొనటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జరిపినకాల్పుల్లో చాసీమూలియా నాయకులు సింఘన, అండ్రు మరణించారు.
అందుకు ప్రజలనుండి ప్రతిఘటనలు నిరోధించటానికి 144 సెక్క్షన్ విధించి మనుషులు కలవకుండా జాగ్రత్త పడ్డారు. .నారాయణపట్నలో పోలీసు బలగాలను మోహరించారు. శాంతికమిటీ నాయకులు వాళ్లకు తోడయ్యారు. సంఘం ఆఫిసుకు తాళం వేసి సంఘం బాధ్యుల ఇళ్ళమీద దాడిచేసి విధ్వంసం చేశారు. తుపాకులతో కవాతు చేశారు.ఎలాగో అమరుల శవాలను తెచ్చుకొని అంత్యక్రియలు జరిపినరోజు పోలీసుల స్వైర విహారంలో అనేకమంది పోలీసు తుపాకి గుళ్లకు బలైనారు, గాయపడ్డారు. ఆ తరువాత కూడా శాంతికమిటీ గుండాలు పోలీసులు కలిసి ఊళ్ళ మీద పడి చేసిన భీభత్సానికి లెక్కలేదు.’చాసీ మూలియా ఆదివాసీ సంఘాన్ని వ్రేళ్ళ నుండి పెకలించటానికి వివిధరూపాలలో ప్రయత్నాలు జరిగాయి. ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి నైతికంగా దెబ్బతీయటానికి ప్రభుత్వం చేసిన విఫల ప్రయత్నాల హీన చరిత్రను సవాల్ చేస్తూ సింగన, నాచిక లింగ రగిల్చిన భూపోరాట జ్వాల ప్రత్యామ్నాయ రాజకీయ ఆశయమే ఆక్సిజన్ గా వెలుగుతూ అసలైన వర్గపోరాటంగా కొనసాగటం వాస్తవం. అంతేకాదు. నారాయణపట్న భూపోరాటం ప్రభావం డియోమాలి పర్వత ప్రాంతల ఆదివాసీలు బాక్సయిట్ గనుల తవ్వకాల వలన ఎదురయ్యే విస్థాపన ప్రమాదానికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి ప్రేరణ అయింది. ఆ రకంగా ఇది పెట్టుబడికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేక ఉద్యమం కూడా అయింది. ఆ విధంగా చాసీ మూలియా ఆదివాసీ సంఘం కార్యచరణ మావోయిస్టు ఉద్యమ రేఖతో సంవదిస్తూ సాగుతున్న సమకాలానికి కర్తగా, సాక్షిగా ‘ఎర్రజెండా’ కథ ను వ్రాసింది అరుణ.
నారాయణపట్న భూపోరాటంలో భూస్వాముల నుండి ఆదివాసీ రైతాంగం భూములను ఆక్రమించటం తొలిఘట్టం. చారిత్రకంగా అది 2008 జూన్ 12 న జరిగింది. మలిఘట్టం భూమిని సాగుచేయటం. దానిని వస్తువుగా చేసిన కథ ఎర్రజెండా. అయితే ఇందులో చాసీ మూలియా ఆదివాసీ సంఘం ప్రస్తావన లేదు. నారాయణపట్న భూములలో సాగు నిర్ణయం సంఘం ఏరియా కమిటీ చేసినట్లు దానిని అమలు చేయించే బాధ్యత పై పద్మ దళం వచ్చినట్లు తెలుస్తుంది. నారాయణపట్న బ్లాక్ లోని అన్ని పంచాయితీల నుండి జనం నాగళ్లు మొదలైన వాటితో నారాయణ పట్న భూమి సాగుకు రావాలని, కాస్త దూరపు వూళ్ల వాళ్ళు ముందురోజే బయలుదేరి నారాయణ పట్నకు దగ్గర వూరికి వచ్చి రాత్రి బస చేసేట్లు, వాళ్లకు తిండి ఏర్పాట్లు ఆ ఊరివాళ్లు చేసేట్లు నిర్ణయం జరిగింది. ఆయా గ్రామాలలో రైతుకూలీ సంఘం, మహిళా సంఘం కార్యవర్గాలు క్షేత్రస్థాయి వ్యవహారాలను సమన్వయం చేసేట్లు పద్మ సూచనలు ఇచ్చింది.
అసలు కార్యక్రమంలో భాగస్వాములు కావలసిన ఆదివాసీల పరిస్థితి ఏమిటి? వాళ్ళ పోరాటాన్ని అణచివేయటానికే పోలీసులు వేసిన శాంతికమిటీలు చేసే దాడుల మధ్య గ్రామాల లో జనజీవనం ఎలా ఉన్నది? అన్నది ఈ కథలో కీలకాంశం. పద్మ జ్ఞాపకంగా అంతకు నెలరోజుల క్రితం శాంతికమిటీ గుండాలు ఆ వూరిపై చేసిన దాడి సంగతి తెలుస్తుంది. దళం ఏ బిర్సు దాదా నున్నో ల పాక దగ్గరకు వెళ్లారో ఆ బిర్సు దాదా నున్నో ల కుటుంబం ఆ దాడిలో చాలా కోల్పోయింది. తెలతెల్లవారుతుండగానే శాంతికమిటీ గుండాలు పోలీసులతో ఊరిమీద పడ్డారు. ఊరిని చుట్టుముట్టి మహిళలు, పిల్లలు, ముసలివాళ్ళతో సహా అందరిని కొడుతూ ఊరిమధ్యకు తెచ్చితలలకు తుపాకులు గురి పెట్టి నిలబెట్టారు. పన్నెండు మంది యువకులను అరెస్ట్ చేశారు. బిర్సు దాదా కొడుకు దాసు మిలీషియా కమాండర్ అని తెలిసి చేతులు వెనక్కు విరిచి కట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు.బిర్సు దాదా ఇంటిని తగలబెట్టారు. అందువల్లనే అతనూ అతనిభార్య ఊరిచివర వ్యవసాయ భూముల దగ్గర ఉన్న పాకకు తమ మకాం మార్చవలసి వచ్చింది భూపోరాటాలు, రాలీలు, ధర్నాలు, సభలు అంటూ ఎర్రజెండాలు పట్టుకొని నారాయణ పట్నం లోకి అడుగుపెడితే కాల్చేస్తాం అని హెచ్చరించి వెళ్లారు.
శాంతికమిటీ గూండాలూ, పోలీసులూ ఇళ్లల్లోకి దూరి దాచుకొన్న డబ్బు , బంగారం దోచుకొనటమే కాదు, పండించుకున్న ఆహారధాన్యంలో ఎండ్రిన్ కలపటం, అన్నమో, అంబలో వండి పెట్టుకొన్న గిన్నెల్లో పొగాకు నమిలి ఉమ్మెయ్యటం వంటి అకృత్యాలు చేశారు. ఇళ్ళల్లో కనబడిన ఎర్రజెండాలతో పాటు ఎరుపు రంగు లంగాలు, జాకెట్లు, చీరెలు ఏవి కనబడినా అన్నిటినీ తెచ్చి కుప్పవేసి తగలబెట్టారు.
నెల రోజుల క్రితమే అంతటి దాడికి, హింసకు గురై ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చితలో రాత్రిళ్ళు ఇళ్ళల్లో పడుకోలేని అభద్రతలో బతుకుతూ కూడా ‘భూపోరాటం అంటూ నారాయణపట్నం వస్తే కాల్చేస్తాం’ అన్న పోలీసు బెదిరింపులకు ఏమాత్రం జడవక ఆ ఊరి జనం నారాయణపట్నం భూములు దున్నటానికే సిద్ధం కావటం అంటే అది కష్టాల్లో కాలి చేవదేరిన చైతన్య లక్షణం. ప్రజలను అలా తయారుచేసుకొనటానికి, నిలబెట్టుకొనటానికే రైతుకూలీ సంఘాలు, మహిళా సంఘాలు వంటి నిర్మాణాలు. వాళ్ళను సమన్వయించే పార్టీ ఉండనే ఉంది , కానీ ఈ కథలో పార్టీ ప్రత్యక్ష చర్యలో లేదు. నారాయణపట్న బ్లాక్ పంచాయతీ గ్రామాల ప్రజలే ప్రత్యక్ష కార్యాచరణలో ఉన్నారు. మోసం చేసి దగా చేసి దోచుకొన్న మాభూములు మాకే ఇవ్వాలని అడగటం నేరం యెట్లా అవుతుందన్న ప్రశ్న వాళ్ళది. ఈ దాడులకు భయపడి సంఘాన్ని పోరాటాన్ని వదిలెయ్యటం అంటే బానిసబతుకు కు దిగజారటమే. అందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. ఎర్రజెండాలు పట్టి భూముల్లోకి దిగటమే అన్నారు. కానీ వాళ్ళకప్పుడు ఎదురైన సమస్య ఎర్రజండాల కొరత. పోలీసులు అన్నీ కాల్చేసి వెళ్లారు కదా అన్న దిగులు మేఘం ఒక్కక్షణం అక్కడ కదలాడినా వూళ్ళో ఎవరి దగ్గర ఎర్రచీర ఉన్నా ముక్కలు చేసి అందరం తలాఒకటి పట్టుకుందామనుకొనటం సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగిపోయే ప్రజల ఉత్సాహశక్తికి గుర్తు. ఉత్సాహమే వీరం. విజయ సాధనం.
నారాయణపట్న భూములు దున్నటానికి తెల్లవారి బయలుదేరవలసిన బిర్సు దాదా దంపతులు తెల్లవారుఝామున మూడుగంటలకే లేచి బట్టల అడుగున పాలిథిన్ కవర్లో భద్రంగా దాచిన ఎర్రజెండాలు తీసి తలకు , నాగలికి, ఎడ్ల కొమ్ములకు, గొడ్డలికి కట్టటానికి అంటూ పంచుకొనటం చూసింది పద్మ. ఇల్లే కాల్చేయబడిన బిర్సు దాదా దగ్గర అన్ని జెండాలు ఎక్కడివి అన్న పద్మ ప్రశ్నకు జవాబు పోలీసులు వూళ్లపై దాడులు చేస్తున్నారని తెలిసినపుడే తమావూరికి కూడా ఏదో ఒకరోజు రాకపోరు అన్న అంచనా వాళ్ళది. అందుకు సిద్ధపడే ఉన్నారు. వాళ్ల నుండి కాపాడుకోవలసినది అదొక్కటే అన్న ఆర్తితో ఎర్రజెండాలను జాగ్రత్తగా పాకకు తెచ్చి దాచిన బిర్సు సుక్కో లనిబద్ధత పద్మనే కాదు పాఠకులను కూడా అబ్బురపరుస్తుంది. ఆహరం నుండి ఆస్తుల వరకు ఏవైనా పోవచ్చు, మనుషులు గాయపడవచ్చు, చంపబడవచ్చు, జైళ్లలో మగ్గుతుండవచ్చు కానీ ఎర్రజెండా అంతిమ విజయం వరకు సాగే విప్లవోద్యమానికి ఆశావహమైన సంకేతం అని స్ఫురింపచేస్తుంది కథలోని ఈ ఘట్టం.
ఈ కథలో నారాయణపట్నం భూములు దున్నటానికి దండు కదిలే ప్రయత్నాల కథనం పద్మ ముఖంగా సాగినా దున్నే కార్యక్రమం ఎలా సాగిందో చెప్పటానికి ఆమె అందులో ప్రత్యక్ష భాగస్వామి కాదు. బిర్సు, సుక్కులు రాత్రికి వచ్చాక జరిగింది ఎలాగూ తెలుస్తుంది కానీ వేసిన ప్రణాళిక, ఎంచుకొన్న వ్యూహం ఎలా అమలవుతున్నదో తెలుసుకోవాలన్న సహజ ఉత్కంఠ పద్మను నిలవనీయలేదు. మరి జరుగుతుండగానే ఆ విషయం తనకు తెలియటం యెట్లా అన్న సమస్యకు ఆమె తమతో ఉన్న స్థానిక మిలీషియా మిత్రుడి చేత బిర్సు, సుక్కోలతో సెల్ ఫోన్ సంభాషణ చేయించటం పరిష్కారంగా ఎన్నుకున్నట్లు వ్రాయటం కొత్త శిల్పం గా అమరింది ఈ కథలో.
‘ఎర్రజెండా అంటే పోలీసులకు భయం, మాకు బలం’ అన్న సుక్కో మాటతో ఈకథ ముగింపుకు వస్తుంది. రాజ్యానికి భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకు ఆస్తులు అధికారాలు లేని బాధితపీడిత ప్రజలకు మధ్య యుద్ధం స్వరూప స్వభావాలను ఆవిష్కరించే వాక్యం ఇది. ఈ యుద్ధంలో మనం ఎవరి పక్షాన నిలబడాలన్నదే తేల్చుకోవలసింది.
పోరాటం వాళ్ళ అవసరమే అయినా, ఆకాంక్ష బలీయమే అయినా పరిస్థితులు ఎప్పుడూ ఒక లాగానే ఉండవు.తీవ్ర నిర్బంధం, నిత్యదాడుల మధ్య ఎదురయ్యే భౌతిక మానసిక ఒత్తిడుల మధ్య మనుషులుపడే సంఘర్షణ నిబద్ధతను బలహీన పరచవచ్చు. పరిణామంలో అది లొంగుబాట్ల రూపం తీసుకొంటుంది. పార్టీ దీనిని ఎలా చూస్తుంది? ఎలా స్వీకరిస్తుంది? దళ కమాండర్ సుధ కోణం నుండి వ్యాఖ్యానించిన కథ ‘చరిత్ర మునుముందుకే …’ దళం కమాండర్ సుధ అడవిలో ఎక్కడో ఆగి అందరూ నిద్రపోతున్న రాత్రి సమయంలో ఆ మధ్యకాలంలో పేపర్లో వచ్చిన వార్తలు, వాటికింద ప్రచురించబడిన ఫోటోలు టాబ్ లో చూస్తూ చేసిన ఆలోచనల తో రూపు కట్టిన కథ ఇది. బయటివార్తలు వాళ్లకు ఏరోజుకు ఆ రోజు అందవని ఎప్పుడో ఎవరో వాటన్నిటిని సేకరించి పంపేవరకు ఎదురు చూపులే అన్న విషయం తెలిసిందే. ఆ రకంగా ఆరోజు సుధకు దొరికిన అవకాశం అది. ఆ వార్తలు ఫోటోలు మావోయిస్టులను సంబోధిస్తూ వూళ్ళల్లోకి రావద్దని చెప్పే ప్లకార్డులతో నిలబడ్డవాళ్లను చూపేవి, దిష్టిబొమ్మల దహనంతో మావోయిస్టు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించేవి. అమరుల స్మారక స్థూపాల మీద యెర్ర జెండాల స్థానంలో మూడురంగుల జండా ఎగరేసి దేశభక్తిని చాటుకొంటున్న ప్రజలను చూపేవి. పూర్వాపరాలు ఆలోచిస్తే అవన్నీ ప్రభుత్వ ప్రాయోజిత చర్యలని ఆమెకు అర్ధం అవుతూనే ఉన్నది. ఆ పరిస్థితిలో ఆమెను బాగా కలవరపెట్టినది మంజరి పంచాయతీలో మావోయిస్టు పార్టీ నిర్మాణంలో వివిధస్థాయిలలో పనిచేస్తున్న మంజరి పంచాయితీకి సంబంధించిన వాళ్ళు పోలీసులకు లొంగిపోయిన వార్త, దానికి సంబంధించిన ఫోటో.
వార్తలో మావోయిస్టుల కంచుకోటగా చెప్పబడిన మంజరి పంచాయితీ ఒడిశా లో మయూర్ భంజ్ జిల్లాలో ఒకటి, మహారాష్ట్రలో పూనా దగ్గరలో ఒకటి కనబడుతున్నాయి. ఆ వూళ్ళో వాళ్ళతో సుధకు సన్నిహిత పరిచయాలే ఉన్నట్లున్నాయి. ఆ ఊరి నుండి 70 మంది లొంగుబాటును ప్రకటించిన ఆ వార్త తో పాటు యథాప్రకారం కుర్చీలలో వరస తీరివున్న పోలీసు ఆఫీసర్ల వెనక తలలు వేలాడేసుకొని చేతులు కట్టుకు నిలబడ్డ లొంగిపోయిన వాళ్ళ ఫోటోను టాబ్ లో జూమ్ చేసి చూస్తూ సుధ ఒక్కొక్కరినీ గుర్తుపడుతూ, విప్లవ కార్యాచరణలో వాళ్ళెంత గట్టివాళ్ళో తలచుకొంటూ, అలా లొంగిపోయి పోలీసు స్టేషన్ లో ఫోటో కు నిలబడ్డ వాళ్ళుఆ సమయంలో ఎంత భావ సంఘర్షణకు లోనవుతున్నారో అని వేదన పడుతుంది. వాళ్లప్పుడు ఏమి ఆలోచిస్తున్నారో, లోలోపల ఏమనుకొంటున్నారో ఊహించే ప్రయత్నం చేస్తుంది.
లక్మో భర్త బిర్సును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి ఎన్ కౌంటర్ చేయబోతే విషయం తెలిసి గ్రామస్థులు పోలీసు స్టేషన్ ముందు అతనిని విడిచిపెట్టాలని ధర్నా చేసిన సంగతి ఎరుకలో ఉంది కనుక లక్మో ను గుర్తు పట్టగానే ఆమె ఆ సమయంలో “వూళ్ళో పట్టుకోటం చాతకాక పని మీద బయటకు వెళ్లిన వాడిని దొంగదెబ్బతీసి చావగొట్టి మీరంతా వచ్చి సరెండరవ్వకపోతే వాడిని చంపేస్తాం అని బలవంతగా సరెండర్ చేయించుకొంటున్న మీరేరా పిరికిపందలు” అని పోలీసులను ఉద్దేశించి అనుకొంటూ ఉండవచ్చు అన్నది సుధకు వచ్చిన వూహ. మైక్ పట్టుకొని ఉన్న పోలీస్ ఆఫీసర్ “ప్రభుత్వం పోలీసులు చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాల వలన వీరంతా చైతన్య వంతులై ,పరివర్తన చెంది మావోయిస్టులను వ్యతిరేకిస్తూ లొంగి పోతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది” అని ఎప్పుడూ పాడే పాటనే పాడి ఉంటాడు అని కూడా అనుకొన్నది.
లొంగుబాటు పైకి కనబడేది. దాని వెనక వున్న ప్రజల మానసిక ఒత్తిడిని చూడగలటం మావోయిస్టు పార్టీ రూపిందించిన వ్యక్తిత్వం వల్లనే సాధ్యం. సుధ ఆ మానసిక ఒత్తిడిని అర్ధం చేసుకోనటమే కాదు, వాళ్ళు నిస్సహాయులైన సమయంలో వాళ్ళను కలవలేకపోతున్నామే అని ఆవేదన పడింది. ఎడతెరిపిలేని కూంబింగులు, ఎన్ కౌంటర్లు , అరెస్టులు, బలవంతపు లొంగుబాట్లు దుష్ప్రచారదాడులు, పోలీసు కాంప్ లు, మొబైల్ నెట్వర్క్ లు ఏర్పరుస్తూ శత్రువు కల్పిస్తున్న ఆటంకాలతో ప్రజలను, నిర్మణాలను ఇదివరలో లాగా ప్రత్యక్షంగా కలవటానికి వీల్లేకపోతున్నదే అన్న చింత ఆ రాత్రి నిద్రను ఆమెదరి చేరనియ్యలేదు.
సమస్యను గుర్తించాక పరిష్కారమార్గాన్వేషణ అనివార్యంగా జరుగుతుంది. ప్రజలతో తెగిపోయిన లింక్ ను మళ్ళీ ఏర్పరచుకొనటం కర్తవ్యం అవుతుంది. ఆ మేరకు మేమున్నాం, పార్టీ ఉంది, నిర్బంధాలను ధిక్కరిస్తూ దృఢంగా నిలబడి న్యాయమైన హక్కులకోసం పోరాడే ధైర్యాన్ని, మానసిక నిబ్బరాన్నిపెంచుకొనాలని సూచిస్తూ ప్రజాయుద్ధంలో ముందుకే సాగాలని కోరుతూ ఆదివాసీ ముఖ్యులకు వచ్చిన ఒక లేఖ ఆమె వ్రాసి పంపిందే అయివుంటుంది.
దాని సానుకూల పరిణామాలు, ఫలితాలు కూడా సుధ కు మళ్ళీ పెన్ డ్రైవ్ లో వచ్చిన పదిరోజుల పేపర్ వార్తలద్వారానే తెలిసింది. అవి దాదాపు ఆంధ్రప్రదేశ్ ఘటనలకు సంబంధించినవి. అభివృద్ధి ఫలితాలు ప్రతి ఇంటికీ అన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరచిన గడపగడపకు కార్యక్రమమాన్నిప్రజలు ముఖ్యమంత్రి ఎమ్ ఎల్ ఎ ల దిష్టిబొమ్మలు తలబెడుతూ తిప్పికొట్టటం ఒక వార్త. తూర్పు గోదావరి జిల్లా నాతవరం మండలంలో దొంగచాటుగా బాక్సయిట్ తరలించుకుపోవటాన్ని అడ్డుకొంటూ అయిదు గ్రామా పంచాయితీల ప్రజలు వాహనాలు తగలబెట్టటం మరొక వార్త. స్వీయ సమస్యల మీద ర్యాలీ చేస్తున్న ఆదివాసీల మీద పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే కోపోద్రిక్తులైన ప్రజలు చిత్రకొండ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం ఇంకొక వార్త. ఇవన్నీ ఆమెకు మహాసంతోషాన్ని కలిగించిన వార్తలు.
సుధ లొంగుబాటువార్తలు చదుకొన్న రోజు పౌర్ణమి వెన్నెల. ప్రజలు మళ్ళీ ప్రజ్వలిస్తున్న, ప్రతిఘటిస్తున్న వార్తలు చదువుకొన్న రోజు అమావాస్య చీకటి. అమావాస్య రాత్రి ఆకాశంలో మిలమిలా మెరిసె నక్షత్రాలు పున్నమి వెన్నెలలో వెలవెలా పోతాయికానీ అంతమాత్రాన నక్షత్రాలు లేనట్లు కాదు అని ఆమెకు అర్ధమైన తరుణం అది. ప్రజలు ఒకసారి జారిపోయినట్లు కనిపిస్తారు కానీ దానికి పార్టీ బాధ్యులు కుంగిపోతే ప్రయోజనం లేదు. జారిపోయినవాళ్లను కూడగట్టటానికి కృతనిశ్చయులై ప్రయత్న పరులు కావాలి. సుధ ఆ ప్రయత్నం చేసింది కనుకనే ఆ ఫలితం, ఈ సంతోషం.
ఈ కథ మొదటి ఘట్టంలో విప్లవోద్యమం మీద నిర్బంధాన్ని, బురదజల్లె ప్రయత్నాలను తలచుకొని బాధపడిన సుధ, పోలీసులకు సరెండరైన తనకు బాగా తెలిసిన వ్యక్తులు ఎదుర్కొన్న ఒత్తిడుల గురించి వేదన పడిన సుధ, వాళ్ళను కలవలేకపోతున్న పరిస్థితుల పట్ల కలవరపడిన సుధ ఒకరకంగా నిరాశ నిస్పృహలకు గురైనట్లే. ఆ సందర్భంలో ఆ రాత్రి ఆమే అంతరంగంలో బలంగా మెదిలిన అంశాలు రెండు. ఒకటి తన ఉద్యమ జీవితం. రెండు సాకేత్ జ్ఞాపకాలు.
సుధ ఇరవై ఏళ్ళ తన ఉద్యమ జీవితాన్ని తలచుకొంటూ యుద్ధం మధ్య అసలు ఇన్ని సంవత్సరాలు తాను బతకుతానని అనుకున్నదా? అని విచారంలో పడింది. తనతో కలిసి నడిచిన వాళ్ళు, తనకన్నా చిన్న వాళ్ళు తనకళ్లముందే అమరులు కావటం గుర్తొచ్చింది. మహా అయితే పది సంవత్సరాలు… అనుకున్నది. 20 సంవత్సరాలంటే ఇదంతా బోనసే అని కూడా అనుకొంది. తాను తిరిగిన ప్రాంతాలు, తాను కలిసిన ఆదివాసీ సమూహాలూ, తరతరాలుగా పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు, పొందిన అనుభవాలు తనకు నేర్పిందేమిటో తలపుకు వచ్చింది. అందులో నుండి సమకాలపు నిర్బంధం గురించి భయపడాల్సింది లేదన్న వివేకం మేల్కొన్నది. కనుకనే పార్టీకి ఇవేమీ కొత్తకాదుకదా! అని అనుకోగలిగింది. ఎంతటి నిర్బంధంలో కూడా ప్రజలను అంటిపెట్టుకొని పోరాటాలవెల్లువను సృష్టించిన అనుభవాలను గుర్తు తెచ్చుకొని తేరుకొన్నది. పరిస్థితులకు ఎదురీదటానికి స్వీయ అనుభవాల జ్ఞాపకాల నుండి తనను తాను సంసిద్ధం చేసుకొంటున్న ఆ సమయంలోనే గడియారంలో కనిపించిన అక్టోబర్ 13 వతేదీ కేంద్రకమిటీ సభ్యుడు సాకేత్ అమరత్వానికి ఏడాది అని గుర్తుచేసింది.
సాకేత్ అంటే ఆర్కే (రామకృష్ణ) అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. 20 వ ఏట 1978 లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరినప్పటి నుండి 2021 అక్టోబర్ 14 న మరణించేవరకు విప్లవోద్యమం తో ముడిపడ్డ నాలుగు దశాబ్దాల పై బడిన జీవితం అతనిది. అతని మరణం గుర్తుకు రాగానే వివిధ సందర్భాలలో ప్రభావవంతమైన అతని మాటలు, మార్గదర్శకత్వం గుర్తుకు వచ్చాయి సుధకు. ‘గాఢాంధకారంలో మిణుగురుల వెలుతురును కూడా చూడగలిగే ఆశావహ దృక్పథం విప్లవకారులకు ఉండాలి’ అని ఆయన చెప్పిన మాటలు గుర్తుకురావటం ఆ క్షణంలో ఆమెకు బలాన్నిచ్చిన టానిక్ అయింది. ‘మిన్ను విరిగి మీదపడినా చలించని దృఢత్వాన్ని, మెరుపు వేగంతో స్పందించగల చురుకుదనాన్ని’ ఏకకాలంలో విప్లవకారులు అభ్యాసం తో సాధించుకోవాలని ఒక క్లాస్ లో ఆయన చెప్పిన మాటలు ఆ క్షణాన ఆమెకు నిలబడటానికే కాదు, తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించటానికి నైతిక బలం ఇచ్చాయి. నారాయణ పట్నా ప్రజా ఉద్యమాలను అణచివేసే సందర్భంలో ప్రజలమధ్య ఉన్న వైరుధ్యాలను ఉపయోగించుకొని శత్రువు చేసిన దుష్ప్రచారానికి గందరగోళానికి లోనైన ప్రజలు మావోయిస్టు వ్యతిరేకత ప్రదర్శించినప్పుడు, ముఖం మీదనే తలుపులు వేసి మొహం తిప్పుకొని పోయినప్పుడు సహనాన్ని కోల్పోకుండా దళాలు వాళ్ళ విశ్వాసాన్ని, ప్రేమను తిరిగిపొందేందుకు చేసిన ప్రయత్నాలను, సాధించిన విజయాన్ని అభినందిస్తూ “కఠిన పరిస్థితులలో ప్రజలను అంటిపెట్టుకొని ఉంటే తప్పక మనం గెలుస్తాం. ప్రజలే మనగురువులు. ప్రజలు అజేయులు” అని పదేళ్ల క్రితం ఆర్కే చెప్పిన మాట , ‘ప్రతికూలతల్లోనూ అనుకూలతలు పట్టుకోవాలి’ అని చేసిన సూచన గుర్తుకువచ్చి ధైర్యం, మానసిక స్వాంతన కలిగించాయి. ఈ రకంగా ఆ రాత్రి ఆర్కే జ్ఞాపకాలు వర్తమాన ప్రతికూలతలు ఎదుర్కొనే పథక రచనకు ఆమె మెదడుకు ఉత్ప్రేరకాలు అయ్యాయి.
ఆ రకంగా సుధ ప్రత్యక్షంగా కలవలేకపోయిన ప్రజలకు లేఖవ్రాసి మళ్ళీ నిర్మాణంలోకి సమీకరించగలిగింది. నిలబెట్టగలిగింది. ఆ క్రమంలో ప్రభత్వాధికారం మీద, పెట్టు బడి మీద ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో చేసే పోరాటాలుగా అవి స్పష్టంగా ప్రకటిత మవుతుంటే ఆమె సంతోష పడగలిగింది. దిగులు నుండి సంతోషానికి కథను పరిణమింపచేయటానికి, చరిత్రమునుముందుకే అన్న విశ్వాసాన్నిదృడంగా పునరుద్ఘాటించటానికి సుధ విప్లవోద్యమ గతాన్ని, సాకేత్ గురించిన జ్ఞాపకాలను సాధనాలుగా ఉపయోగించటం ఇందులోని కథాశిల్పం.
కథావస్తువును, పాత్రల ప్రవృత్తులను, కదలికలను, మనోభావాలను, సంఘర్షణలను బట్టి కథాగమన నేపథ్యంలో వాతావరణ చిత్రణ ఉంటుంది. విప్లవ కథలు, అందునా దళ కదలికలకు సంబంధించిన కథల స్థలం సాధారణంగా అడవి , కొండలు, గుట్టలు అవుతాయి. సమయం రాత్రి. రాత్రి చీకట్లో పాత్రల కదలిక వెన్నెల దివిటీగానే సాగాలి. అందువల్ల ఈ నాలుగు కథల్లోనూ వెన్నెల వర్ణన ఉంటుంది. చరిత్ర మునుముందుకే కథలో వెన్నల గురించిన తాత్విక చింతన కూడా భాగమైంది. ఆదివాసీల మనసులు వెన్నెల స్వచ్చతతో పోల్చబడ్డాయి. నగరాలు, పల్లెలు, పట్నాలు మైదానాలు, అడవులు , ఆదివాసీ ప్రజల గుడిసెలు అన్నిటి మీద సమానంగా ప్రసరించే వెన్నెలను కూడా పేదవాళ్లకు అందకుండా ధనికులు దోచుకొనటం సాధ్యమా అని ఒక తర్కం సుధ ఆలోచనల్లోకి వస్తుంది. పౌర్ణమి వెన్నెల , ప్రేమ , భావుకత వీటి సంబంధాల గురించిన ఆలోచనలను ఒరుసుకొంటూ విప్లవకారుల భావుకత భౌతిక వాస్తవికతకు భిన్నంగా ఊహల్లో సంచారం చెయ్యరాదన్న సహచరుడి హెచ్చరిక కూడా తలుపుకు వస్తుంది. భావుకత భౌతిక వాస్తవాల మీద అల్లుకోవలసిందే అన్నది విప్లవ సౌందర్య దృష్టి అని ఈ కథ సూచిస్తుంది. ‘అడవి కాచిన వెన్నెల’ అనే జాతీయానికి అడవిలో వెన్నెల నిరుపయోగం, నిష్ప్రయోజనం అన్నభావం ఉంది. అడవిలోనూ వెన్నెల అవసరం, ప్రయోజనం పొందే, దాని అందాన్ని అనుభవించే చలన చైతన్యయుత ప్రజాసమూహం ఉంటారన్న ఇంగితరాహిత్యం అందులో ఉంది. ఇతరులను. గుర్తించని ‘మనం’ యొక్క అహంభావ వ్యక్తీకరణ అది. దానిని నిరాకరిస్తూ అడవిలో వెన్నెల అవసరాన్ని, ప్రయోజనాన్ని, అనుభవాన్ని సార్ధకతను ఆవిష్కరించిన కథలు కూడా ఇవి.
అంతేకాదు. అరుణ కథలలో ఆడపిల్లలు వెన్నెల్లో ఆడుకొనే సుకుమారులు, సుందరులు అయిన ఆడపిల్లలు కాదు. ఆర్కే అన్నట్లు ‘శరీరాన్ని మొరటుగానూ మనస్సును సుకుమారంగానూ’ మలచుకొని దళ కమాండర్లుగా, దళంలో చురుకైన కార్యకర్తలుగా, దళ కమాండర్ల రక్షణ బాధ్యులుగా, సెంట్రీలుగా రకరకాల పాత్రలలో వెన్నెల కాగడాలై ప్రవహించే నిత్యా చైతన్యశీలురు.
5
ఈ సంపుటిలో చివరి కథ వేగుచుక్క. విప్లవోద్యమంలో యెన్ కౌంటర్లో అమరులైన వాళ్ళు వేగుచుక్కలు. వారి తల్లిదండ్రుల కడుపుకోత దుఃఖం కథా వస్తువు. కన్న పిల్లలు మరోప్రపంచాన్ని కలగంటూ వెళ్ళిపోయి ఎన్నాళ్ళకూ కంటపడకపోయినా వాళ్ళెక్కడో ఒక చోట తమకు ఇష్టమైన పనిలో బాగున్నారులే అని సమాధానపరచుకొని జీవించటం ఒకయెత్తు. అకాల అసహజ మరణాలపాలైనప్పుడు గుండె పగిలే దుఃఖంతో సుడిపడటం మరొక ఎత్తు. ఈ కథలో గోపాలరావు, జానకమ్మలది అదే పరిస్థితి. నెల రోజుల క్రితం ఎన్ కౌంటర్ లో వాళ్ళ కొడుకు ధీరజ్ చంపబడ్డాడు. ఆ దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. కొడుకు వ్రాసిన చివరి ఉత్తరంలో వ్యక్తమైన అతని ప్రేమ, భావుకత్వం పదేపదే గుర్తు చేసుకొంటూ ఒకరి దుఃఖం ఒకళ్ళు పంచుకొన్నారు. ఒకరినొకరు ఓదార్చుకొన్నారు. కానీ అది ఒడువని దుఃఖమే. అమరుల బంధుమిత్ర సంఘం వాళ్ళు వచ్చి సంస్మరణ సభ ఏర్పాట్లు చేయటం ధీరజ్ అమరత్వ దుఃఖం వాళ్ళిద్దరిదే కాదని సూచిస్తుంది.
విప్లవోద్యమాలను ఉక్కుపాదంతో అణచివెయ్యటానికి సిద్ధమైన ప్రభుత్వాలు దేశీయ ప్రజలనే ఎన్ కౌంటర్ల పేర చంపేస్తూ శవాలను సైతం కుటుంబాలకు అప్పచెప్పక తీరని వేదన మిగులుస్తున్న పరిస్థితులలో అమరుల మృత శరీరాలను స్వాధీనం చేసుకొనటానికి ప్రభుత్వంతో పోలీసులతో వ్యవహారం నడపటానికి అమరుల కుటుంబాలకు అండదండగా ఉండటానికి ఏర్పడిన సంఘం అమరుల బంధు మిత్రుల సంఘం. ఆ సభలో తన వంతు వచ్చినప్పుడు గోపాలరావు మాట్లాడిన మాటలు ధీరజ్ కు రెడ్ శాల్యూట్ చెప్పటం తండ్రిగా స్వీయత్వం నుండి విముక్తం కావటాన్ని సూచిస్తాయి. “అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా వారి కలలను సాకారం చేసేందుకు మనకు చేతనైనంత చేద్దాం. బిడ్డలను కోల్పోయిన బిడ్డలకు మనమే తల్లిదండ్రులం అవుదాం. తల్లులను తండ్రులను కోల్పోయిన వాళ్లకు మనమే తల్లిదండ్రులం అవుదాం. అమరుల కుటుంబాలకు బంధుమిత్రులమవుదాం” అని ఆ తండ్రి తన మాటలు ముగించటం ఆ క్రమంలో జరిగిందే. ఆ రకంగా వాళ్ళు తమ వ్యక్తిగత దుఃఖ విముక్తి అదే విధమైన దుఃఖంలో ఉన్నవాళ్ళ కోసం పనిచేయటంలోనే ఉందని తెలుసుకొనటం విప్లవం వ్యక్తిత్వాల నిర్మాణం లో ఎలాంటి పాత్ర నిర్వహిస్తుందో చెప్పే అద్భుత నిదర్శనం.
అరుణ ఈ కథను మా అమ్మా నాన్నకోసం, విప్లవంలో బిడ్డల్ని కోల్పోయిన మరెందరో అమ్మా నాన్నల వేదనను కొంతయినా పంచుకోవాలనే తపనతో వ్రాసినట్లు కథ చివర పేర్కొన్నది. ఈ కథ లో గోపాలరావు జానకమ్మ తన తండ్రి లక్ష్మణరావు , శాంతమ్మలే. ఎన్ కౌంటర్లో మరణించిన ధీరజ్ తనకంటే ఎనిమిదేళ్ల చిన్నవాడై తన తరువాత ఎనిమిదేళ్ళకు విప్లవోద్యమంలోకి వచ్చి ఎన్ కౌంటర్ లో మరణించిన తమ్ముడు గోపాలరావే. 2016 లో జరిగిన ఎన్ కౌంటర్ అది. కథలో కొడుకు మరణానికి దుఃఖిస్తూ తండ్రి పెద్దమ్మాయి 16 ఏళ్ళ క్రితమే విప్లవోద్యమంలోకి వెళ్లిపోయిందని అక్క అడుగులో అడుగువేస్తూ ఆఖరి కొడుకు 8 ఏళ్ళక్రితం ఉద్యమంలోకి వెళ్లిపోయాడని అనుకొనటం వుంది. ఆ అక్క అరుణ. ఆ తమ్ముడు గోపాలరావు. అమరుల బంధుమిత్రుల కమిటీలో పనిచేయటానికి కథ చివర తండ్రి తీసుకొన్న నిర్ణయమే ఆ నాటి నుండి అరుణ తండ్రి లక్ష్మణరావు గారి ఆచరణ. అరుణ తనతమ్ముడి అమరత్వాన్ని, తల్లిదండ్రుల కోణం నుండి, అమరుల బంధుమిత్రుల కమిటీ పని కోణం నుండి నమోదు చేస్తూ ఈ కథను వ్రాసింది.
తొమ్మిదేళ్ల అమరుల బంధుమిత్రుల కమిటీ పని అనుభవం తరువాత అరుణ ఎన్ కౌంటర్ వార్త ను , ఆమె మృతదేహాన్ని లక్ష్మణరావు గారు, శాంతి ఎలా స్వీకరించారో అందరికీ తెలిసిందే అరుణ అంత్యక్రియల సమయంలో కాలుతున్న చితి దగ్గర నిలబడి ‘అరుణ అమర్ రహే’ అని గొంతెత్తి లక్ష్మణరావు గారు నినదించటం చూస్తే అంత నిబ్బరం, వస్తుగత దృష్టి ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్న రాక మానదు. అలాగే అరుణ సంస్మరణ సభకు ఆయనే అధ్యక్షులు కావటం కూడా వ్యక్తిగత సంబంధాల సుఖ దుఃఖాల స్థాయి నుండి ఉద్యమాలు, నిర్మాణాలలో భాగస్వామ్యం మనుషులను ఎంతగా ఉదాత్తీకరిస్తాయో, వ్యక్తిగత దుఃఖాన్ని సామాజిక దుఃఖంలో బిందువుగా చూడగల విశాల వ్యక్తిత్వాన్ని ఎలా వికసింపచేస్తాయో తెలియచెప్తుంది.
ఒక ఇంటర్వ్యూ లో మీ పిల్లలను విప్లవం నుండి వెనక్కు వచ్చెయ్యమని ఎప్పుడైనా అడిగారా అని లక్ష్మణరావుగారిని శాంతిని ప్రశ్నిస్తే “అడిగాం .. కానీ అలా వచ్చేస్తే నాకన్నా ముందు ఈ ఉద్యమంలో పనిచేసి అమరులైన వాళ్లను అవమానించినట్లు అవుతుంది అన్న సమాధానం ఇచ్చింది అరుణ” అని చెప్పారు. విప్లవోద్యమ ఆశయాన్ని, గౌరవాన్ని తుదకంటా ఎత్తిపట్టి ప్రాతంలో మరణించిన అరుణ ఆ వారసత్వాన్ని తరువాతివాళ్ళకు అందించే వెన్నెల వెలుగుల వేగుచుక్క. ఆమెకు అరుణారుణ జోహార్లు.