వినాశ దేవుడు

యుద్ధ దేవుడు వెకిలి వేటలకి
దేశాలు ఒక్కొక్కటిగా తగలబడిపోతూ
దేశ ద్వార పాలకులు బలైపోతూ
ఊర్లూ , ఏడార్లు , నదులూ, నగరాలూ
జాతులూ , జెండాలూ, జీవన గీతాలూ
మందుగుండులో కలిసినుసై పోతూ!

ఈ దేవుడికి నీతీ లేదు, న్యాయం తెలియదు
వాడికి ఎదురు నుంచున్న ప్రతోడూ శిక్షార్హుడే
విలువ నిలవలున్న భూములన్నీ శాపగ్రస్తమే
పచ్చని పొలాలు, చమురు సాగరాలు రణరోదనై !

దేశమంటే వేలఏళ్ళుగా
పరుచుకున్న నాగరికత
జ్ఞాపకాలను మట్టిమూళిగల్లో
తరాలుగా దాచుకున్న మేధాపేటిక
ఎప్పుడూ ఒంటరికాని
సమూహాల సాంగత్యం
అదో బతుకు భవిష్యత్తు నిర్మాణం
భయాలకీ, బాంబులకి లొంగని మనిషితనం !

ఓరే వినాశ సామ్రాట్టూ
దేశాలు మార్కెట్టు లెక్కలకు చిక్కవు
మానవ చరిత్రలు అక్రమార్కుల దార్లు కావు
పాలకుల చీకటి ఒప్పందాలు కానేరవు !
దేశమంటే మానవ మనుగడ పోరాటమైన కాడ
ఇంకా పుట్టని పిల్లోడుకూడా ఈసడించుకుంటూ
మానవ చరిత్రలో నువ్వొక చెరగని మచ్చగానే !

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply