విద్రోహ ‘కగార్’ : విపరీత భాష్యాలు

విప్లవ సేనాని, మట్టిలోంచి ఎదిగివచ్చి (rose from the dust) విప్లవోద్యమ నాయకుడైన మాడ్మి హిడ్మా, అతని అనుచరులను దొంగ ఎదురుకాల్పుల్లో చంపి నిస్సిగ్గుగా ఫాసిస్టు మూకలు తమ వీరత్వాన్ని ప్రకటించుకున్నాయి. కోవర్టులను, కుట్రలను, విద్రోహాలను కగార్ లో భాగం చేసుకొని ప్రజా సైన్యాన్ని దొంగదెబ్బ కొడుతూ విజయం సాధిస్తున్నామని విర్రవీగుతున్నారు. వీళ్ళ దేశభక్తి మాదిరిగానే, వీళ్ళ వీరత్వం కూడా బూటకమే.

దోపిడీ రాజ్యానికి, దానికి మద్దతునిస్తున్న అద్దె మేధావులకు అర్థంకాని విషయం ఏమంటే, విప్లవోద్యమం అంటే కేవలం సాయుధ గెరిల్లాలే కాదు; విప్లవ రాజకీయాల ప్రభావానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమైన కోట్లాదిమంది ప్రజలు. ఆ ప్రజలు ఉన్నంత వరకు, వాళ్లకు విప్లవం అవసరం ఉన్నంత వరకు “చివరి నక్సలైట్ అంతమే నా పంతం” అని పదే పదే ప్రకటిస్తున్న ప్రజా శత్రువుల కల ఎప్పటికీ నెరవేరదు. ఇది అమాయకత్వంతోనో, అత్యుత్సాహంతోనో, అలంకార భాషా ప్రయోగం కోసమో చెబుతున్నది కాదు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం.

వందలాది విప్లవకారులు, ప్రజలు ఒరిగిపోవచ్చు. ఇక విప్లవంలో కొనసాగలేనివాళ్లు వెనుదిరగవచ్చు. రాజ్యం ముందు మోకరిల్లినవాళ్ళు విద్రోహులుగా మారిపోవచ్చు. అనేక విప్లవ స్థావరాలు చేయిజారిపోవచ్చు. కేవలం ఇవి మాత్రమే అతిపెద్ద దీర్ఘకాలిక విప్లవ ప్రవాహాన్ని అంతం చేస్తాయనుకుంటే మనం విప్లవోద్యమాన్ని చాలా సంకుచితంగా, కేవలం సాయుధ చర్యలకు పరిమితంగా చూస్తున్నామని అర్థం. వాస్తవానికి శత్రువు కూడా అట్లా అంచనా వెయ్యడం లేదు. కేవలం బస్తర్ నుండి సాయుధ విప్లవకారులను వెళ్లగొట్టి, వాడు చేతులు కట్టుకొని కూర్చోడు. 31 మార్చ్, 2026 తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని, దాని అనుబంధ సంఘాల మీద నిషేధం ఎత్తివెయ్యడు.

వాడు డంభాచారంగా విజయ ఘంటలు మోగించవచ్చు. వాడి ఎంగిలి మెతుకులకు ఆశపడే మీడియా హడావుడిచెయ్యొచ్చు. కానీ, వాడు ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోగలడా? నిరంతర సైనిక పహారా లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వెయ్యగలడా? అడవిలోని ప్రతీ ఆదివాసి తన మీద ఏదో కుట్ర చేస్తున్నట్లుగానే వాడు భావిస్తాడు. వాళ్ళ మౌనంలో పేలడానికి సిద్దమవుతున్న మందుపాతరలను ఊహించుకుంటాడు.

మానవ చరిత్రలో ఏదీ దానికదిగా చివరి ఘటన కాదు (Nothing is an end in itself!). ఒకటి మరొకటిగా రూపాంతరం చెందుతూ గుణాత్మకంగా పదునెక్కుతుంది. అలా జరగకపోతే మానవ సమాజం భౌతికంగా, భావజాల పరంగా అభివృద్ధి చెందేది కాదు. అయితే సంక్షోభ సందర్భాల్లో చరిత్రకు సరైన వైపున (పోరాడే ప్రజల వైపున) నిలబడటమే అసలైన బుద్ధిజీవుల, ప్రజాస్వామికవాదుల కర్తవ్యం.

అయితే హిడ్మా హత్య తర్వాత ఆయన వీరత్వాన్ని, త్యాగాన్ని కీర్తించే ప్రజలున్నట్లుగానే, అతని హత్యతో సాయుధ రాజకీయాల చరిత్ర ముగిసిపోయిందని విశ్లేషణలు చేసే దళారీ మేధావులు మొదలయ్యారు. నిజానికి ఈ హత్యకంటే ముందు నుండే (ముఖ్యంగా అగ్రనాయకత్వ కగార్ కోవర్ట్ ఆపరేషన్ తర్వాత) తెలుగు మేధోసమాజంలో వక్రభాష్యపు గ్యాంగ్ ఒకటి సొషల్ మీడియా, టీవీ చర్చల్లో విప్లవోద్యమం మీద విపరీతమైన విషం కక్కుతున్నది. వ్యక్తులుగా ఎవరైనా ఎలాంటి అభిప్రాయాలనైనా కలిగివుండొచ్చు. ప్రకటించవచ్చు. ఐతే, ‘రాజ్యాంగం’, ‘ప్రజాస్వామ్యం’ అటూ గంభీరమైన పదాలు పలికేవాళ్ళు పనికట్టుకొని విప్లవోద్యమం మీద భావజాల పరమైన దాడిచేస్తూ రాజ్యహింసకు మద్ధతు కూడగడుతున్నప్పుడు ఆ గ్యాంగ్ స్వరూప స్వభావాలను తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్ళను వ్యక్తులుగా కాకుండా వాళ్ళు ప్రతీ రోజూ చర్చకు పెట్టే అంశాలవారీగా విశ్లేషించుకోవడం ముఖ్యం.

మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలోనే విప్లవ రాజకీయాల మీద (లోపల కూడ) జరిగినంత చర్చ మరే పార్టీ సిద్ధాంతాలు, ఆచరణ మీద జరిగి ఉండకపోవచ్చు. బహుశా విప్లవ రాజకీయాల అవగాహన, ఆచరణ మొత్తం సమాజంపై వేసే ప్రభావమే దీనికి కారణం అయివుండొచ్చు. విప్లవ రాజకీయాలను కేవలం ఆ పార్టీ వ్యవహారంగా కాకుండా సమాజంలో జరిగే ఒక పరివర్తనగా, మానవీయ విలువల ఆధారంగా మనిషిని నిర్మించే ఒక ప్రక్రియగా చూడటం మూలంగానే వాటికి అలాంటి ప్రాముఖ్యత వచ్చిఉంటుంది.

అతి సాధారణ కుటుంబాల్లో పుట్టిన ఎందరో అట్టడుగు మనుషులను గొప్ప ప్రజా నాయకులుగా, సిద్ధాంతకర్తలుగా, కవులుగా, కళాకారులుగా తీర్చిదిద్దిన ఒకేఒక్క రాజకీయ ప్రక్రియ విప్లవ రాజకీయం. అన్నింటినీ మించి ఆ రాజకీయాల్లో ప్రజలు చూసిన, అనుభవించిన నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, గౌరవం, త్యాగం. వీటి మూలంగానే విప్లవకారులకు, విప్లవ రాజకీయాలకు ప్రజల్లో అంతటి పదిలమైన స్థానం ఉంది. ప్రజలు ప్రతీరోజూ ఎర్ర జెండాలు పట్టుకొని తిరగకపోవచ్చు. కానీ, ఆ రాజకీయాలను ఉన్నత స్థాయిలోనే చూస్తున్నారు. “పరిస్థితులు మారాయి కాబట్టి ప్రజలు వాళ్ళతో లేరు,” అని రోజూ ఊదరగొట్టే ఏ విమర్శకులైనా ఇంతవరకు ఎక్కడైనా ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేశారా? తమ సొంత ఊహలను, అభిప్రాయాలను ప్రచార సాధనాల ద్వారా ప్రజలపై రుద్దుతున్నారు తప్ప. ఇటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ పోస్టులు, వీడియోల కింద సామాన్య ప్రజలు వెల్లడించే అభిప్రాయాలను చదువుకున్నా వాళ్లకు పరిస్థితి అర్థమవుతుంది.

విప్లవోద్యమం మీద దుమ్మెత్తి పోస్తూ, వివిధ రంగుల ముసుగులు కప్పుకొని దాడులు చేసే వాళ్లు మనకు అనేక రూపాల్లో కనబడుతున్నారు. అందులో మొదటివాళ్ళు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తులు. వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లకి కమ్యూనిస్టులు సహజసిద్ధ శత్రువులు. అందులోనూ విప్లవ కమ్యూనిస్టుల మీద వీళ్లకు ప్రత్యేకమైన కసి వుంటుంది. ఎందుకంటే విప్లవకారులు కేవలం హిదుత్వ భావజాలాన్ని మాత్రమే కాదు, వాళ్ళ భౌతికదాడులను సైతం మిలిటెంట్ గా ఎదిరించి, ఓడిస్తారు కాబట్టి. అంత మాత్రమే కాదు. తెలుగు నేల మీద భూస్వామ్య, అర్ధభూస్వామ్య సామాజిక సంబంధాలతో కొనసాగే కుల, వర్గ పీడనలను ధ్వంసం చేసింది విప్లవ రాజకీయాలే. దీని మూలంగా బాగా నష్ట పోయింది బ్రాహ్మణీయ హిందుత్వ పునాదే.

అన్నింటికి మించి దేశంలో విప్లవ రాజకీయాలు చలామణిలో ఉండగా మనువాదులు కలలు కనే హిందుత్వ రాజ్యం ఏర్పడదని వాళ్ళకు స్పష్టంగానే తెలుసు. అందుకే విప్లవోద్యమాన్ని ఎట్లయినా ఓడించడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం. అందుకోసం విప్లవ రాజకీయాలను కేవలం సాయుధ చర్యలకే కుదించి, మొత్తం వ్యవహారాన్ని హింస చుట్టూ తిప్పుతున్నారు. వాళ్లేదో అహింసావాదులయినట్లు! అహింసా రాజకీయాలకు ప్రపంచ సంకేతంగా మారిన గాంధీని చంపిన గాడ్సేను పూజించేవాళ్ళు కూడా హింస గురించి సుద్దులు చెప్తున్నారు. రోజూ వాళ్ళు పెట్టే భావజాల గడ్డితినే వాళ్ళు తప్ప వీళ్లను ఎవ్వరూ నమ్మరు.

ఇక రెండో రకం దాడి చేసేవాళ్ళు దళారీ బ్యూరోక్రాట్లు. ఇందులో అన్ని రకాల అధికారులు ఉంటారు. వీళ్లలో చాలామంది దేశంలో చట్టబద్ధ పాలన అమలవుతున్నదనీ, దాన్ని ఏ రూపంలోనైనా ఎదిరించడం నేరమని వాదిస్తుంటారు. తుపాకి గొట్టం ద్వారా పొగ తప్ప రాజ్యాధికారం రాదని హేళనగా, వెకిలి కామెంట్లు చేస్తుంటారు. విప్లవకారుల తుపాకుల ద్వారా విప్లవం రాదు అనుకుందాం. మరి రాజ్యం తుపాకి ద్వారా రిపబ్లిక్ నిలబడుతుందా? ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందా?

వీళ్లు తెలిసో, తెలియకనో కుల, వర్గ దోపిడీ రాజకీయాలకు వెన్నుకాస్తూ తాము ప్రమాణం చేసిన రాజ్యాంగానే కాలరాస్తుంటారు. కొందరు ఎలాంటి సామాజిక, రాజకీయ సృహ లేకుండ కేవలం hired guns మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు తమ కుల, వర్గ కసితో విప్లవోద్యమాన్ని అణిచివేయాలనే దూకుడుగా ఉంటారు. నిజానికి వీళ్లే హింసకు హింసే సమాధానం అని నమ్ముతారు. ఆచరిస్తారు. అందుకే అన్ని రాజ్యాంగ విలువలను, దేశీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి బలాదూర్ తనాన్ని చూపిస్తుంటారు. “రాజ్యమంటేనే పోలీసు రాజ్యం” అని సామాన్యులు సైతం అనే వరకు పరిస్థితిని దిగజార్చింది పోలీసు దొరలు. వాళ్ళ పొలిటికల్ బాసులు. అందుకే ఈ బ్యూరోక్రాట్లు చెప్పే నీతి సూత్రాలు వినే స్థితిలో సమాజం లేకపోవడం ఒక మంచి పరిణామం.

ఇక మూడో రకం, ప్రజాస్వామ్య వేషధారులు. ఇందులో ఉదారవాదుల నుండి మార్క్సిస్టుల వరకు ఉన్నారు. వీళ్ల రూపంలోనే ప్రజాస్వామ్యం వుంటుంది. కానీ, సారంలో వీళ్లు అయితే సాయుధ విప్లవ వ్యతిరేకులు, లేదంటే మారువేష డోపిడీ వర్గాల బంట్లు. వీళ్లు పరిగడుపునే ప్రజాస్వామ్యాన్ని ఫేసుబుక్కుల్లోనో, టీవీలలోనో పుక్కిలిస్తూ ఉంటారు. పుంఖానుపుంఖాలుగా అనేక సిద్ధాంతకర్తలను ఉటంకిస్తుంటారు. అవసరం అయితే మార్క్సిజాన్ని కూడా ప్రవచనంగా మార్చి ప్రబోధిస్తుంటారు. వీళ్లలో కొందరైనా విప్లవాన్ని కోరుకుంటారు. కానీ, దాన్ని కేవలం కీబోర్డ్ పదవిన్యాసాలకే పరిమితం చేసి విప్లవాన్ని ఒక అభూత భావనగా మార్చేస్తుంటారు. దినచర్యగా ప్రజాస్వామ్యాన్నిబోధిస్తూ అందరినీ ప్రశ్నించే ఈ పెద్దమనుషులను ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే మాత్రం తట్టుకోలేరు.

విప్లవోద్యమం మీద వీళ్ల ఫిర్యాదేమంటే, సాయుధ రాజకీయాల మూలంగా రాజ్య హింసకు సాధికారిత పెరుగుతుందని, దాని ద్వారా ప్రజాస్వామిక ఉద్యమాల మీద నిర్బంధం పెరుగుతుందని వాదిస్తుంటారు. అంతేకాదు, ప్రస్తుత భారతదేశంలో సాయుధ రాజకీయాలకు స్థానం లేదని నమ్ముతారు. విప్లవానికి, ప్రజాస్వామ్యానికి మధ్య ఒక పెద్ద వైరుధ్యాన్ని చూడటమే వీళ్లలో ఉన్న అవగాహనా లోపం. వీళ్లకు విప్లవ రాజకీయాలు ఏ విధంగా దేశంలో పౌరహక్కుల, ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్మించింది, మద్ధతునిచ్చింది తెలియక కాదు. తెలిసి కూడా విప్లవోద్యమం మీద తమ వ్యతిరేకతను వదులుకోరు.

అయితే వీళ్లలో చాలావరకు అవకాశవాదులే ఉంటారు. విప్లవం దూకుడుగా వుంటే దాని ఫలితాలను అనుభవించడానికి ముందువరుసలో ఉంటారు. విప్లవం సంక్షోభంలో ఉంటే దాని మీద నాలుగు రాళ్లు వెయ్యడానికి వెనుక ఉండే ప్రయత్నిస్తుంటారు. నిజానికి వీళ్లతో ఒరిగేదేమీ ఉండదు. కానీ, వీళ్ళు నిరంతరం “జ్ఞాన” కాలుష్యాన్ని సృష్టించి సమాజంలో, ముఖ్యంగా విప్లవాభిమానుల్లో కొంత గందరగోళాన్ని తయారుచేస్తారు. దీంతోనే ఏదో సాధించామని అల్పసంతోషం పొందుతారు. కానీ, వీళ్ల వాదనలను కొన్ని బేసిక్ ప్రశ్నలతోనే ఓడించవచ్చు. వీళ్లను విప్లవానికి శత్రువులుగా చూడాల్సిన అవసం లేదు. కానీ, సంక్షోభ కాలంలో, విద్రోహ సందర్భాల్లో వీళ్ళను నిర్మొహమాటంగా ఎండగట్టకపోతే ప్రజల్లో సంక్షోభ తీవ్రత పెరుగుతుంది.

ఇక చివరిగా విప్లవ వ్యతిరేక కులవాదులు. నిజానికి అసలైన అంబేద్కరైట్స్, కులనిర్మూలనా పోరాట సంస్థలు విప్లవ రాజకీయాలకు తమ లక్ష్యాలకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయని అనుకోవు. ఎందుకంటే విప్లవం ఎవరు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు జవాబు వెతికితే అది అర్థమవుతుంది. విప్లవ రాజకీయాల్లో ఇంకా కొనసాగున్న కొన్ని ఆధిపత్య పోకడల మీద కుల సంఘాలు ప్రశ్నించడం, విభేదించడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది విప్లవానికే ఇంకా మేలు చేస్తుంది. సమస్యంతా విప్లవోద్యమాన్ని ఒక బ్రాహ్మణీయ ఆధిపత్య చట్రంలో చూసేవాళ్ళతోనే. వీళ్లు విప్లవోద్యమంలో కులం మీద జరిగిన చర్చలు, తీర్మానాలు, ఆచరణకు సబంధించిన విషయాలేవీ పట్టించుకోరు. కేవలం విప్లవ రాజకీయాలను బద్నాం చెయ్యాలనే ఉద్దేశం తప్ప మరొకటి ఉండదు.

దీనికి తోడు కొత్తగా రాజ్యాంగ సిండ్రోమ్ అనే కొత్త గాలి సోకింది వీళ్లకు. మనువాది “వేదాల్లో అన్నీ ఉన్నాయష” అంటుంటే వీళ్లకేమో రాజ్యాంగం ఒక సర్వరోగ నివారిణిగా మారిపోయింది. హిందుత్వ ఫాసిస్టులు రాజ్యాంగాన్ని చెరపడుతుంటే, లేదంటే చెదలుపట్టిస్తుంటే వీళ్లు మాత్రం రాజ్యాంగ భజన ఉద్యమాలకే పరిమితమవుతున్నారు.

మరికొందరు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మనువాదుల విషకౌగిళ్లలో సేదతీరడానికి సిద్ధమయ్యారు. బ్రాహ్మణిజంలో ఫాసిజం తప్ప మరొకటి లేదని చెప్పిన అంబేద్కర్ సాక్షిగా మనువాదుల పంచన చేరుతున్నారు. ఇంకొందరికి ఓటు ద్వారానే అన్నీ సాధించవచ్చు అనే భ్రమలు బలంగా ఉన్నాయి. వీళ్లకు ఈ దేశంలో ఓటు రాజకీయాలకున్న రాజకీయార్థిక, సామాజిక పునాది ఇంకా అర్థమయినట్లు లేదు. అర్థమయినా అవకాశవాదంగా నటిస్తున్నట్లున్నారు. ఇలాంటి వాళ్ళే విప్లవోద్యమంలో లొంగుబాటులే సరయినవి, ఓటు రాజకీయాలే మేలయినవనే తమ భ్రమలను ప్రచారం చేస్తున్నారు.

అన్ని వైపుల నుండి విప్లవోద్యమం మీద ఇన్ని రకాల దాడులు జరుగుతున్నా ఆ ఉద్యమం ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. ఎన్నో కష్టాలను భరిస్తున్నది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ముప్పేటదాడి తీవ్ర నష్టాలను కలిగిస్తున్నది. అయితే ఇంతటితో విప్లవ రాజకీయాలు అంతమయిపోతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విప్లవోద్యమ ప్రభావం, పరిధి చాలా విస్తారమైంది. దేశంలో పై పై మెరుగులను చూసి నక్సల్ బరీ సాయుధ పోరాట రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని వీలునామా రాస్తున్నారు. కానీ, నిజానికి పేట్రేగుతున్న ఫాసిస్టు సందర్భంలో ఆ రాజకీయాలకున్న ఆవశ్యకత మరే రాజకీయాలకూ లేదు. ఐతే, కేవలం విప్లవోద్యమమే ఫాసిజాన్ని ఓడిస్తుందనే భ్రమలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా ఐక్యసంఘటన రాజకీయాలే ఫాసిజాన్ని, అది ఇప్పుడు కగార్ రూపంలో కొనసాగిస్తున్న దాడిని నిలువరించగలుగుతాయి. అయితే ఈ కష్ట కాలంలో ఆదివాసీ పోరాటాలకు, విప్లవోద్యమానికి మద్ధతుగా నిలబడటం మన కనీస ప్రజాస్వామిక బాధ్యత.

Leave a Reply