విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape) – 5

9

‘‘ఊర్కో నానమ్మా… అతని గదిలో కలిసి పడుకోలేను. నా వల్ల కాదు మీకోసమే ఉంటున్నా అతను మారతాడు మారతాడు అని మీరు పంపారు ఒకటే చెప్తున్నా విను అతను మారినా కానీ నాకు నచ్చడు. చరణ్‌ వాళ్ళమ్మ నీకేం చెప్పినా నాకు చెప్పకు. ఇట్లా ఫోన్‌ చేసి వేధించకు ఉంటా’’ మహిమ చిరాగ్గా ఫోన్‌ పెట్టేసింది.

నాన్న కూడా ఈ మధ్య మేసేజీలు పెడ్తున్నాడు ‘‘ప్లీజ్‌ ట్రై టు అడ్డెస్ట్‌ విత్‌ చరణ్‌… డైవోర్స్‌ వద్దు… సపరేషన్‌ వద్దు… రెండో పెళ్ళి వాడు చరణ్‌ కంటే ఘోరంగా ఉండొచ్చు… చరణ్‌ పశ్చాత్తాప పడుతున్నాడు. అతన్ని క్షమించు… అంగీకరించు… నా రిక్వెస్ట్‌ ఇది. నేను పోయినా నా ఆత్మ శాంతిస్తుంది.’’ ఇలా ఉంటాయి నాన్నతో మెస్సేజెస్‌ మాటలు. చెల్లి పెళ్ళికోసం నాన్న పడే ఆందోళన, నాన్న అనారోగ్యం వల్ల వచ్చిన హార్ట్‌ ఎటాక్‌ చూసి తను నాన్నను సేవ్‌ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ తన లోపల ఏం ప్లాన్‌ నడుస్తుందో నాన్నకి చెప్పలేదు. చరణ్‌ నించి విడాకులు తీసుకునే ప్లాన్‌ నాన్నకి తెలీదు.

నానమ్మ ఊరికే చేస్తుంది ఫోను. తన అత్తమ్మ ఏమందో… ఆడబిడ్డేమందో చెప్తూ ఉంటుంది. అందులో చరణ్‌ రికమండేషన్లు కూడా ఉంటాయి. చరణ్‌ చాలా సార్లు అల్లుడి హోదాలోనే తన ఇంటికి వెళతాడు. అందరికీ ఏవేవో కానుకలు తీస్కెళతాడు. మరీ ముఖ్యం నానమ్మకు ఆగ్రా స్వీట్స్‌ అంటే ఇష్టమని ప్రత్యేకంగా తీసుకువెళతాడు. ఖరీదైన కాటన్‌ చీరలు కూడా. అందరి ఆరోగ్యాలూ కనుక్కుంటూ ఉంటాడు. నాన్న ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా కనుక్కోవడమే కాదు నాన్న కార్డియాలజిస్ట్‌కి ఫోన్‌ చేసి కనుక్కుంటూ ఆ వివరాలు మళ్ళీ నాన్నకి చెబుతుంటాడు. ‘‘మీ అల్లుడు చాలా కేరింగ్‌ సోమరాజుగారూ… కొడుకు లేని లోటు తీర్చే అల్లుడు దొరకడం మీ అదృష్టం’’ అంటాడట డాక్టర్‌. అంతగా నాటకాలు ఆడుతున్నాడు చరణ్‌. యామిని పెళ్ళి విషయాలు… ఎలా చేయాలో చెప్తుంటాడు ‘‘తను… తన ఫ్రెండ్స్‌ పెళ్ళి పనులు చేస్కుంటాం మీరేం వర్రీ కావద్దంటాడు.’’ ఇలా నాటకాలు ఆడ్తూనే… ‘‘మీ మహిమ ఇంటి పట్టాన ఎక్కువ ఉండదు. బయటి తిండి ఆమె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నేనంటే ఎట్లా అయినా అడ్జెస్ట్‌ అవుతా అనుకోండి. నాకు బాచిలర్స్‌ లైఫ్‌ నుంచీ వండుకోవడం అలవాటే ఇపుడు అదే పనికొచ్చింది’’ అంటుంటాడు గుంభనంగా… వింటూ నానమ్మ రగిలిపోతూ ఉంటుంది. మంచి అల్లుడు, మంచి భర్త అనిపించుకోవడానికెన్ని తంటాలు పడుతుంటాడో అంతేగానీ.. ఇంత జరిగాక కూడా… అంతగా కండిషన్స్‌ కాగితాల్లో రాస్కోన్నా… దాన్ని తప్పి రాత్రింబగళ్ళు తనను సెక్స్‌ కోసం ఎంత వేధిస్తాడో చెబుతాడా అసలు? పగలు పొరబాట్న తగిలినట్లు తగలడం… తన ముందు టవలు మాత్రమే చుట్టుకుని అర్ధనగ్నంగా తిరగడం తన సిక్స్‌పాక్స్‌ ప్రదర్శన చేస్తూ… రాత్రిళ్ళు తన గది తలుపులు తడుతూ… ఇవన్నీ చెప్తాడా అసలు? తన ఇంట్లోని మీటింగ్‌లో మాట్లాడిన ఒక్క మాటా పాటించడం లేదు. ఈసారి సున్నితంగా అప్రోచ్‌ అవుతాననీ… అంగీకరించమనీ.. మెస్సేజ్‌ల మీద మెస్సేజీలు పెడతాడు. ముద్దుల ఏమోజీలు… బ్రాల… బికినీల ఎమోజీలు పెడతాడు ఛీప్‌గా. తను ఎందుకు అలా పెడ్తున్నావని తిడుతున్నా ఆపడు. కానీ వీళ్ళందరి ముందు సున్నిత మనస్కుడిలాగా… మారిపోయిన మనిషిలాగా… ఇంక తనే మారాల్సి ఉన్నట్లుగా… మొండితనంలో మహిమే మారనట్లుగా మాట్లాడుతూ ఉంటాడు… తనెట్లా మారాలి… అసలెందుకు మారాలి? ఒక రేపిస్ట్‌తో కాపురం చేయడానికి మరోసారి రేప్‌ చేయనివ్వడానికి మారాలా… అసంభవం అది. అతను గుర్తుకు వచ్చినా… ఇంట్లో తిరుగుతున్న అతన్ని చూస్తున్నా… తన మీద పడి రక్తం కారే దాకా కుళ్ళబొడిచిన ఒక అడవి మృగం గుర్తుకు వస్తుంది తప్పితే మనిషిగా గుర్తుకు రాడే. ముఖ్యంగా చరణ్‌ తనను రేప్‌ చేసిన ఆ రాత్రి, అతని ముఖంలో కామంతో ఎర్రబడ్డ కళ్ళు… గొంతులోంచి వచ్చిన భయంకరమైన గీరతో కూడిన మూలుగు… వికృతంగా సాగి ఎర్రబడి, చమటలు కారుతున్న ముఖపు ముడతలు… డిస్కవరీ ఛానల్లో చూపించినట్లు కుందేలుని పొడిచి పొడిచి తిన్నప్పటి ఎలుగుబంటి దేహ కదలిక… ఎంత మరచినా మరుపుకు రాదు. చరణ్‌ దగ్గరికి వచ్చి నెల. ఇంకో కొన్ని రోజులో, నెలలో ఉండాలి. చెల్లి పెళ్ళే తన టార్గెట్‌… ఈ లోపల హైకోర్టుకు స్పెషల్‌ కేసు కింద తన విడాకుల పిటిషన్‌ వేయాలి. వరద సాయం తీస్కోవాలి. ఈ నెలన్నర ఎన్ని కథలు పడ్డాడనీ… ఇంతలో ఫోన్‌ మోగింది. అవతల నుంచి ‘‘మహీ ఒక విషయం చెప్తా… ఆవేశం తెచ్చుకోకు… చరణ్‌ వాళ్ళమ్మ ఫోన్‌ చేసింది. మళ్ళీ మీకు శోభనం పెడతారట నువ్వు అన్నీ మర్చిపోయి మామూలై పోవాలట చరణ్‌కి సహకరించాలట… ఆగాగు మహీ… అరవబాకు తల్లీ… నేను ససేమిరా ఒద్దన్నాను. మా మహిమ ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. అసలు చరణ్‌తో మామూలుగా అంటే సెక్స్‌లో కాకుండా… ఊరకనే కలిసి ఉండగలనన్న నమ్మకం కూడా కలగలేదు. సెక్స్‌ జీవితం మొదలెట్టడం అసలు చాలా దూరం సంగతి. వాళ్ళ నాన్నకి హార్ట్‌ఎటాక్‌ వచ్చాక నాన్న కోసం, చెల్లి కోసం వాళ్ళ నాన్న చెప్పినందుకు మళ్ళీ చరణ్‌ దగ్గరికి వెళ్ళింది కదా… అదీ తమ మధ్య ఏ సెక్స్‌ సంబంధం ఉండద్దు అని కండిషన్‌ పెట్టి మరీ? దానికి మీరంతా ఒప్పుకున్నాకే మీ ఇంటికి వచ్చింది కదా… మొన్న వాలంటైన్స్‌ డేనే తనకు చెప్పకుండా చెయ్యడం మహికి నచ్చనేలేదు. పైగా మీ చరణ్‌ పగటి పూట ఆమెను ఊరక తాకే ప్రయత్నం చేస్తూ చిరాకు పెట్టటంతో పాటు… రాత్రిళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నాడు… మీ చరణ్‌. రాత్రిళ్ళు తలుపులు తెరవమని తడుతూనే ఉంటాడు. అమ్మాయికే కాదు… నాకూ నచ్చటం లేదు. మహిని కోలుకోనివ్వండి. తానంతట తాను మానసికంగా, శారీరకంగా సిద్ధం కానివ్వండి. నా కూతురికి ఇంకో గాయం కానివ్వను వద్దు అని మీ అత్తయ్యకి చెప్పేసాను… సరేనా… నువ్వేమీ టెన్షన్‌ పడకు… నేనేమన్నా చెబితే వాళ్ళమీద రెచ్చిపోబాకు. నే చెప్పాగా… అలాగే నువ్వు కూడా చెప్పు నీ గదిలో నువ్వు గడి పెట్టుకుని పడుకో… ఏం మహీ? నేను చెవుతున్నాగా… నీకిష్టం లేకుండా ఏఁవీ జరగదు… నీకు అక్కడ బాగో లేకపోతే పూర్తిగా వచ్చేయి తల్లీ… భరించాల్సిన అవసరం ఏ కోశానా లేదు గాక లేదు. వాళ్ళ మనసుల్లో ఏం జరుగుతున్నదో నీకు తెలయాలని చెప్పటం తప్ప ఇంకో ఉద్దేశ్యం లేదు మహీ… నువ్వు జాగ్రత్తగా ఉంటావనీ అంతే మీ అత్త నీతో మాట్టాడుతుందిట. జాగ్రత్తగా మాట్లాడు మరి. ఉంటాను మహి’’ అమ్మ ఫోన్‌ పెట్టేసింది.

మహీ కోపం నషాళానికి అంటుకున్నది. ఛీ… ఏం మనుషులు వీళ్ళు? తానసలు ఇక్కడ ఉండడమే తప్పు… తిరిగి వచ్చిందని చులకన… తన ప్రమేయం లేకుండా… చెప్పకుండా శోభనం ఏర్పాట్లా… తనడిగితే ఏం చెబుతుందో చరణ్‌ వాళ్ళమ్మ… ‘నా కొడుకుతో నువ్వు మరోసారి రేప్‌ చేయించుకోవాలి. మొదటిసారి పెట్టినట్లు నేనే ముహుర్తం పెడతాను… ఏం’ అంటుందా? అడగనీ చెప్తా… తనకు తలబద్దలైపోతున్నది. రేపు ఎస్‌.డబ్ల్యూ.ఎఫ్‌. సెంటర్‌కి వెళ్ళాలి. వారం అయ్యింది.

10

‘‘నా పేరు వరద. నాన్న రిటైర్డ్‌ జడ్జి. డ్యూటీలో మంచి పేరు. నాన్నే నాకు ఆదర్శం. నాన్న రచయిత కాకపోయినా పుస్తకాలు బాగా చదివేవాడు. జ్యుడీషియరికి సంబంధించి, స్త్రీలకి, పిల్లలకి, వృద్ధుల హక్కులకి సంబంధించి చాలా పుస్తకాలు రాసాడు. సాహిత్య పిపాసి… ఎంతో మంది గొప్ప సమకాలీన రచయితలతో స్నేహ సంబంధాలుండేవి. రాష్ట్ర స్థాయి రచయితలతో మా ఇంట్లో రకరకాల చర్చలు జరుగుతుండేవి. నాన్నవల్ల నాకు అభ్యుదయ సాహిత్యం చదవడం అలవాటైంది. నాలో హక్కుల పట్ల సమ`అసమ స్త్రీ పురుష సంబంధాల మధ్య వ్యత్యాసం… అమానవీయత, ఆధిపత్యం, స్త్రీల హక్కులు వీటి పట్ల మంచి అవగాహన కల్గింది. నాన్న లాయర్‌గా సాధించిన అనేక విజయాల వల్లనేమో… నాకు లాయర్‌ కావాలని చిన్నప్పటి నుంచీ మనసులో పడిపోయింది. నాన్న ఆశయం కూడా అదే. అమ్మ చాలా సాంప్రదాయ భావజాలంలో ఉండేది. నాన్నెంత చెప్పినా పూజలు ఉపవాసాలు మానేది కాదు ‘‘నా మానాన్న నన్ను 

ఉండనివ్వండి. మీ బతుకు మీరు బతకండి నాకు వీటిల్లోనే మనశ్శాంతి. మా అమ్మమ్మ, నాన్నమ్మ, అమ్మా వీటిల్లోనే బతికారు జీవితమంతా… వదిలెయ్యండి నన్ను అనేది’’ నింపాదిగా. నాన్న వదిలేసారు. ‘‘నీ పెళ్ళి నీ ఇష్టం… కులం, మతం, ప్రాంతం ఏదీ ఒద్దు వ్యక్తిగా ఉన్నతుడైతే చాలు’’ అన్నాడు నాన్న… వరదా ఎల్‌.ఎల్‌.బీ. పూర్తి చేసాక… నేను ప్రేమలో పడ్డాను… గుడ్డిదాన్ని అయ్యాను. రెండేళ్ళుగా నా ఫ్రెండ్‌ నాగలక్ష్మి అన్నయ్య సుధాకర్‌ను పిచ్చిగా ప్రేమించాను. ‘‘మంచివాడైతే చేసుకోమ్మా’’ అన్నారు నాన్న. ‘‘అమ్మ మొత్తుకుంది. మన కులం వాడు కాదు, బంధువుల్లో ఎట్లా మొకం పెట్టుకుంటాం’’ అని కానీ ప్రేమ గుడ్డిదే కదా… అమ్మ అన్నట్లు కులం కాదు కానీ అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక పోయాను. రిజిస్టర్‌ పెళ్ళికి ఒప్పుకున్నాడు సుధాకర్‌. కాపురానికి అతని ఫ్లాట్‌కి వెళ్ళిపోయాను. సుధాకర్‌ అమ్మా నాన్నా కొన్ని రోజులుండి వెళ్ళిపోయారు. మూడు నెలలు లోకమంతా సుధాకరే నిండిపోయాడు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఇంటి పని, వంట పని కూడా పంచుకునేవాడు. ‘‘నేను ఫెమినిస్టునోయ్‌’’ అంటూ నవ్వేస్తాడు. అదే కదా నన్ను అంతగా సుధాకర్‌ని ప్రేమించేలా చేసింది మరి. కానీ సుధాకర్‌ ఎందుకో చాలాసార్లు మూడీగా… డిప్రెస్డ్‌గా అనిపించేవాడు. నాతో సెక్స్‌లో కూడా పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. అడిగితే స్ట్రెస్‌ అనేవాడు. గంటలు గంటలు ఫోన్‌లో మాటలు.. ఏవో వీడియోలు చూడ్డంలో గడిపేసేవాడు. అర్థరాత్రి పక్కన కనిపించేవాడు కాదు లేచి చూస్తే ఇంకో బెడ్రూంలో తలుపేసుకుని ఉండేవాడు. ఏంటిది అంటే ‘‘నాకు కొన్నిసార్లు ఏకాంతం అవసరం అనిపిస్తుంది వసూ… ఏమీ అనుకోకు’’ అనేవాడు ఖంగారుగా. నాకు బాధ కలిగేది నన్ను కాదనుకునే ఏకాంతం ఏమిటీ అదీ అర్థరాత్రిళ్ళు అనిపించేది. ఇంటికి అతని అడ్వకేట్‌ కొలీగ్‌ వరుణ్‌ ఎప్పుడూ వెన్నంటి ఉండేవాడు. ఇంట్లోని ఆఫీసు రూంలో… ఒక్కోసారి బెడ్రూంలో గంటలు గంటలు గడిపేవారు. ఆఫీస్‌ వర్క్‌ డిస్కస్‌ చేస్తున్నాం అనేవాడు సూధాకర్‌. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులకంటే కూడా ఎక్కువగా చనువుగా ఉండేవారు. నా కళ్ళముందే సుధాకర్‌ని ఉన్నట్లుండి కౌగలించుకునేవాడు వరుణ్‌. చాలా దగ్గరగా రాస్కుంటూ కూర్చునేవారు ఇద్దరూ. వరుణ్‌, సుధాకర్‌ను చూసే చూపులు కూడా వింతగా ఉండేవి. ఎంతో ఇష్టంగా ఒక మైకంలో ఉన్నట్లు చూసేవాడు. వరుణ్‌ చూపులకి సుధాకర్‌ బ్లష్‌ అవడం నాకు వింతగా అన్పించేది. నాకు ఏవో అనుమానాలు రాసాగాయి. కొన్నిసార్లు ఉన్నట్లుండి వారం రోజులంటూ గోవా, బాంబే, బెంగుళూరు… అఫిషియల్‌ ప్రాజెక్ట్‌ ట్రిప్స్‌ అంటూ వెళ్ళిపోయేవాడు. వెళ్ళొచ్చాక చాలా హేపీగా ఉండేవాడు. ఇలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి.

చాలాసార్లు నా బాధ నాగలక్ష్మికి చెప్పుకునేదాన్ని… తన దగ్గరా సమాధానం లేదు. ‘‘సుధాకర్‌, వరుణ్‌తో చాలా క్లోజ్‌గా ఎందుకు ఉంటాడు’’ అంటే… నాగలక్ష్మి ‘‘నువ్వు కాస్త అతిగా ఆలోచిస్తున్నావేమో’’ అంది… కాస్త గాభరాగా. లా ప్రాక్టీస్‌ మీద ఆసక్తి పోయింది. ఏదో బాధ, దుఃఖం, ఒంటరితనం నన్ను వేధించసాగాయి. ఒకసారి ఒక మహిళా సాధికార సంస్థ నిర్వహించిన నాలుగు రోజుల సదస్సుకు గెస్ట్‌ ట్యూటర్‌గా ఒంగోలు వెళ్ళాల్సి వచ్చింది. కానీ సదస్సు మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మధ్య మధ్యలో సుధాకర్‌ నుంచి మెస్సేజీల వస్తూనే ఉన్నాయి ‘‘ఎప్పుడు వస్తున్నావు… మిస్‌యూ, లవ్యూ’’ అంటూ. అవేవీ నాకు ఆనందాన్ని కలిగించడం లేదు. రెండేళ్ళ ప్రేమ, ఆకర్షణ ఎటు పోయాయో అర్థం కాలేదు. నేను హైద్రాబాద్‌కు బయలుదేరాను. ఫ్లాట్‌కి వచ్చిన నాకు మెయిన్‌ డోర్‌ దగ్గరగా వేసి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. తోసుకుని మెల్లగా లోపలికి వెళ్ళాను. హాల్లో బూట్లు… వరుణ్‌వే. బెడ్రూంలోంచి ఏవో శబ్దాలు మూల్గుల్లాంటివి వినిపిస్తున్నాయి. మెల్లగా శబ్దం లేకుండా తలుపు తోసాను. ఎదురుగా కనిపించిన దృశ్యం నాలో ప్రకంపనలు నింపింది… ఒణికిపోయాను. నిశ్చేష్టురాలినై పోయాను… మంచం మీద వరణ్‌, సుధాకర్‌ పూర్తిగా నఘ్నంగా ఉన్నారు. వరుణ్‌, సుధాకర్‌ వెనక నుంచి సెక్స్‌ చేస్తున్నాడు. పక్కనే పెద్ద లాప్‌టాప్‌లో అదే దృశ్యం ప్లే అవుతున్నది. వాళ్ళెంతగా నిమఘ్నమై పోయారంటే నన్ను గమనించలేదు. ‘‘స్టాప్‌ ఇట్‌’’ పెను కేక వేసాను. వాళ్ళిద్దరూ ఒక్కసారి తేరుకున్నారు. విడిపోయి… ఖంగారు ఖంగారుగా బట్టలు… దుప్పట్లు వెతుక్కుంటూ దొరికిందానితో ఒళ్ళు కప్పుకుంటున్నారు. సుధాకర్‌ పరమ వింతగా… కొత్తగా కనిపించాడు… సిగ్గుతో… పక్కచూపులు చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ బయట పడ్డాను. దుఃఖం ఆపుకోలేక, గుండె పగిలిపోతుంటే… సుధాకర్‌ ‘‘వరదా ఆగు…’’ అంటూనే ఉన్నాడు.

‘‘ఎస్‌ అయాం బై సెక్సువల్‌… నాకు వరుణ్‌తో ఏడేళ్ళ అనుబంధం ప్రేమించుకున్నాం…’’ సుధాకర్‌ చెప్తుంటే ‘‘నా మీద ప్రేమ… అదేంటి’’ అని అరిచాను… ‘‘నువ్వంటే కూడా నాకు ప్రేమే… కోరికలున్నాయి’’ అంటున్న సుధాకర్‌ను ‘‘షటప్‌ యూ రాస్కెల్‌’’ అన్న అరుపుతో నోరు మూసుకున్నాడు. ‘‘నీ జీవితంలో నాకంటే ముందునుంచే వరుణ్‌ ఉంటే నా ప్రపోసల్‌ను ఎలా ఒప్పుకున్నావు. నన్ను మోసం చేసావు’’ అంటూ ఏడ్చాను ఆగ్రహంగా. ‘‘నాకు పెద్దగా ఇష్టం లేదు. నీకు అన్యాయం చేయద్దనే అనుకున్నా కానీ ఎక్కడో నువ్వంటే నాకు కొద్దిగా ఇష్టం ఏర్పడిరది. పైగా ఇంట్లో అమ్మ ఒత్తిడి సమాజం కోసం అన్నా చేస్కోరా… నీకంటూ పెళ్ళాం పిల్లలు, సంసారం ఉండాలి, అంటూ ఒకటే ఒత్తిడి పెట్టింది. నాకూ సరైందే అన్పించింది’’ అంటున్న సుధాకర్‌తో ‘‘అంటే మీ అమ్మకీ, నాన్నకీ తెలుసా నువు ‘గే’ ’’ అని, కోపంగా అడిగాను. ‘‘తెల్సు’’… తలవొంచుకుని అన్నాడు సుధాకర్‌.

‘‘నాగలక్ష్మికి తెలుసా? ప్రాణమంతా వేగంగా కొట్టుకుంటున్న హృదయ ధ్వనితో కొట్టుకుపోతుంటే… అడిగాను. ‘‘తెల్సు’’ అన్నాడు సుధాకర్‌ బలహీనంగా. నా గుండె బద్దలయ్యింది. మూడేళ్ళ నుంచీ చేస్తున్న స్నేహం… ఇంత భయంకరమైన నమ్మక ద్రోహంగా బయటపడిరది. నాకు కళ్ళు తిరిగాయి. కుటుంబమంతా నా మీద కుట్ర పన్నింది. నాగలక్ష్మి నా మీద చూపించిన ప్రేమ… మా అన్నయ్య… అంటూ సుధాకర్‌ గురించి గొప్పగా చెప్పటం మాటిమాటికీ ఇంటికి తీస్కెళ్ళడం… అన్నీ ఈ కుట్రలో భాగమేనా?

‘‘నేను వరుణ్‌ లేకుండా బతకలేను. నా సెక్సువల్‌ డిసైర్స్‌ అన్నీ వరుణ్‌తోనే సంపూర్ణంగా తీరతాయి. అలాగని నీమీద కోరిక లేకుండా లేను నీకేం తక్కువ చెయ్యను… నా స్పెర్మ్‌ కౌంట్‌ కూడా చాలా బాగుంది.. యూ కెన్‌ బికమ్‌ మదర్‌ విత్‌ మీ’’ అంటున్న సుధాకర్‌ చెంప పగల గొట్టి ‘‘యూ ఛీట్‌’’ అంటూ  అక్కడ్నించి బయటపడ్డాను. అదే చెంపదెబ్బ నాగలక్ష్మికీ పడ్డది. నేనూ సూధాకర్‌ మ్యూచ్‌వల్‌గా విడిపోయాం. మేం విడిపోయిన నెలకే ప్రేమలో మోసపోయిన నాలుగు నెలల గర్భవతి నాగలక్ష్మి ఆత్మహత్య చేస్కుంది. సూసైడ్‌ నోట్స్‌లో ‘‘వరదా… నేను నిన్ను మోసం చేసాను. అన్నయ్య ‘గే’ అని తెలిసీ అమ్మా, నాన్న ఒత్తిడి… కన్నీళ్ళూ… అన్నయ్య ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కి లొంగిపోయాను. నన్ను క్షమించు నాకు తగ్గ శిక్ష పడిరది పెళ్ళై భార్యా పిల్లలున్న వాడి చేతిలో మోసపోయాను. శెలవు…’’ అని రాసింది. నాకు ‘గే’ల మీద గౌరవం ఉంది. అలా ఉండడం వాళ్ళ హక్కు. కానీ సుధాకర్‌ తన స్వార్థం కోసం నన్ను మోసం చేసాడు.

సుధాకర్‌ మీద అతని తల్లిదండ్రుల మీద ఛీటింగ్‌ కేసు ఫైల్‌ చేసాను.

అమ్మా, నాన్న తట్టుకోలేకపోయారు. నాకు ఒక్కసారిగా మగవాళ్ళ మీద అసహ్యం పుట్టేసింది. కాలం ఒక పదేళ్ళ ముందుకు సాగిపోయింది. మంచి లాయర్‌గా నేను తెచ్చుకున్న పేరే అమ్మా, నాన్నకు, నాకూ ఒకింత ఊరటనిచ్చే విషయం.

నాన్న దిగులుతో నాలుగేళ్ళ క్రితం పోయారు. నాన్న మరణం అమ్మని కృంగదీసింది. అమ్మ కూడా నాన్న పోయిన సంవత్సరానికి హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయింది. నేను ఒంటరి దాన్నైపోయాను. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలతో కలిసి అలుపెరగకుండా పని చేస్తూ నా లోపలి దుఃఖాన్ని ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న నాకు ఈ విభాత్‌ పరిచయం అయ్యాడు’’ అంటూ పక్కనే ఉన్న పాంట్‌షర్ట్‌లో క్రాఫ్‌తో ఉన్న అమ్మాయి విభాత్‌ని చూపించింది వరద.

విభాత్‌ అక్కడున్న అందర్ని చూసి చిరునవ్వు నవ్వింది. ‘‘మాది చాలా బీద కుటుంబం. నాన్న తాగుబోతు, అమ్మ హాస్పిటల్లో నర్సు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళం. చెల్లి వినోద. నాపేరు విభాత. చిన్నప్పట్నించి మాతో నాన్న ప్రవర్తన బాగుండేది కాదు. అమ్మని తాగుడికి డబ్బు కోసం బాగా కొట్టేవాడు. అమ్మ నైట్‌ డ్యూటీ చేసినపుడు రాత్రిళ్ళు… మా మధ్య పడుకుని వికారంగా చేసేవాడు. చెడ్డీలోపల వేళ్ళ పెట్టటం… మా రెండు కాళ్ళ మధ్య గట్టిగా గుచ్చడం చేసేవాడు. అమ్మకు చెబితే అమ్మనీ మిమ్మల్నీ చంపేస్తా అనేవాడు. అమ్మని చంపేస్తే మేం ఎక్కడ ఉండాలి? అని భయపడేవాళ్ళం. నాన్న చెల్లికంటే నా మీదే ఎక్కువగా చెడ్డ పనులు చేసేవాడు. భయంతో రాత్రిళ్ళు పక్క తడిపేసేదాన్ని. నాన్న దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఏ మగాణ్ణి చూసినా భయం. చెల్లి నా కంటే ఐదేళ్ళు చిన్న. నా ఒళ్ళంతా తడుముతూ ‘ఇది నా తండ్రి ప్రేమ… ఇలానే ఉంటుంది మీ అమ్మ కూడా ఇలాగే ముద్దులు పెట్టుకోదా’ అంటూ అనేవాడు. కానీ అమ్మ కాళ్ళ మధ్య చేతులు, వేళ్ళు పెట్టటం చేయదుగా… చదువులో పూర్తిగా వెనకబడి పోయాను. అమ్మతో చెబితే ఇద్దర్ని చంపేస్తాననే వాడు. భయంతో అన్నం సహించేది కాదు.. నిద్ర పట్టేది కాదు.. నాన్నను తప్పించుకోడానికి వీధుల్లో… పక్కిళ్ళల్లో ఎక్కువగా గడిపేదాన్ని. వెతుక్కుని మరీ గుంజుకుపోయేవాడు. ‘‘అన్నం తిందువురా… హోం వర్క్‌ చేస్కుందువురా’’ అంటూ.. అమ్మకు నైట్‌ డ్యూటీ లేకపోతే చాలా ఆనందంగా ఉండేది. కానీ నాన్న అమ్మను నన్ను సతాయించినట్లే సతాయించేవాడని రెండు గదుల ఆ చిన్న ఇంట్లో స్పష్టంగా తెలిసేది. అమ్మ చాలా ఏడిచేది.. ‘‘కొరకకు నొప్పిగా ఉంది. ఒదిలెయ్‌’’ అని. అమ్మ బుగ్గల మీద పెదాల మీద గాట్లు కనపడేవి. ఒక్కోసారి అమ్మ పళ్ళు బిగువన భరించలేని బాధను ఓర్చుకోలేక.. తలుపు తీసి రోడ్డు మీదకు పారిపోయేది. నేను చెల్లి అమ్మను పట్కోని కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాళ్ళం. ‘‘నాన్న అక్కను బాగా కొడతాడు’’ అని చెప్పేది చెల్లి అమ్మతో. నేను భయంతో చెల్లి నోరు మూసేదాన్ని నాన్న నన్నేం చేస్తున్నాడో అమ్మకు తెలిస్తే.. అమ్మను నాన్న చంపేస్తాడేమోనని. ఒకే ఇంట్లో పులి… కుందేళ్ళలా బతుకుతున్నాం. మాటి మాటికీ మూత్రంలో మంటతో జ్వరంతో ఏడ్చేదాన్ని. అమ్మకు ఎందుకో భయం వేసింది. నన్ను డాక్టరుకి చూపించింది. డాక్టర్‌ నన్ను రెండు కాళ్ళ మధ్య చూసి పరీక్ష చేసి ‘‘మీ పాప యోనిలోకి ఎవరో వేళ్ళు దూరుస్తూన్నారు. అందుకే ఇంత వాపు నొప్పి. ఎవరో తెలుసుకోండి’’ అని అడిగింది. అమ్మ గుండెలు పగిలేలా ఏడ్చింది… బ్రతిమిలాడిరది. నేను చెప్పలేదు… చెప్పబోయే చెల్లి నోరు మూసాను. ఆ రోజు నాన్న చేసిన పనితో నాకు చాలా నొప్పి వచ్చింది. మూత్రంలో మంట… మూత్రం పోసే దగ్గర నొప్పి ఎక్కువై పోయాయి. ‘‘ఒద్దు నాన్నా… ఒదులు నాన్నా’’ అని అమ్మ నాన్నను బతిమిలాడినట్లే బతిమిలాడాను. ఒకరోజు రాత్రి నా రెండు కాళ్ళ మధ్యలోకి కత్తి దించుతున్నట్లే అన్పించింది. అరవబోతున్న నా నోరు మూసాడు నాన్న. నేను స్పృహ తప్పి పడిపోయాను.

మరునాడు అమ్మ లేపింది నన్ను ‘లేమ్మా లే.. స్నానం చేద్దువు’ అంటూ బాత్రూంలోకి తీస్కెళ్ళింది. ఇక ఈ దుర్మార్గుడి గురించి అమ్మకి చెప్పేయాలి . అమ్మ నేను పళ్ళు తోముకునేంతలోనే స్నానం చేయించింది. కాళ్ళ మధ్య రక్తం పోతుంటే భయంతో అరిచాను. ‘‘నువ్వు పెద్ద మనిషివైనావు విభా… జాగ్రత్తగా ఉండాలి’’ అంది గుండెలకు హత్తుకుంటూ. ఐదు రోజులు శెలవు పెట్టి నన్ను కంటికి రెప్పలా కాచుకున్నది. చుట్టుపక్కల ఎవరైనా అబ్బాయిలు వస్తున్నారేమోనని కనుక్కుంది. చెల్లిని పక్కకి తీస్కెళ్ళి ‘నాన్న గురించి అమ్మకి చెబితే నాన్న అమ్మను చంపేస్తాడు మనకు అమ్మ ఉండదు’ అని ఏడ్చాను. చెప్పనని చెల్లితో ప్రామిస్‌ తీస్కున్నాను.

ఒక రోజు నాన్న చెల్లితో నాతో చేసినట్లు చేస్తుండడం చూసాను. నన్నెందుకో వదిలిపెట్టాడు. ‘‘ఒద్దు నాన్న చెల్లిని అలా చేయకు’’ అన్నా నాన్నని పక్కకి నెడుతూ. నాన్న చెంప పగలగొట్టాడు.

అమ్మకి ఆ రోజు శెలవు. చెల్లికి స్నానం చేయిద్దామని అమ్మ చెల్లి బట్టలు విప్పింది. చెడ్డీ అంతా గంజిలా జిగురు జిగురుగా ఉంటే అమ్మ నిర్ఘాంతపోయింది. ‘‘నాన్నా… నాన్న…’’ అంటూ వెక్కిళ్ళు పెట్టింది. అమ్మ భయంకరమైన కోపంతో కర్ర తీస్కుని నిద్రపోతున్న నాన్నని బాదింది. గావుకేకలు వేస్తూ నాన్న లేచాడు. చెల్లి చెడ్డి పట్కొని అమ్మ ‘‘ఏంట్రా కుక్కా ఇది ఏంటి’’ అంటూ నాన్న మీదకు వెళ్ళింది. అంతే నాన్న కర్ర లాక్కొని అమ్మని చావ బాదాడు. ‘‘ఇద్దరితో కాపురం చేస్తానే… అది నా రెండో పెళ్ళాం’’ అంటూ ఎంతలా బాదాడంటే అమ్మ ఒళ్ళంతా రక్తపు మరకలైనాయి. అమ్మ కుప్పకూలిపోయింది. నేను చెల్లి నాన్నకి అడ్డం పడుతున్నా ఆపలేదు ఆ రాక్షసుడు. నాకన్నీ అర్థం అవుతున్నాయి. నాకు పన్నెండేళ్ళు వచ్చాయి మరి. అమ్మ నాన్నను వదిలేసి ఇల్లు మారింది. హమ్మయ్య అక్కడ నాన్న లేడు.. ధైర్యంగా అమ్మకి.. నాన్న నాతో, చెల్లితో చేస్తున్న దుర్మార్గమంతా చెప్పాం నేను చెల్లి. అమ్మ మమ్మల్నిద్దర్ని గుండెకు అదుముకుని గొంతు తెగిపోయేలా ఎందుకు నాకు చెప్పలేదని… మమ్మల్ని ఏడుస్తూనే రెండు చేతులతో మా భుజాలు కుదుపుతూ… చెంపల మీద కొడుతూ… తన చెంపలు వాయించుకుంటూ, నేల మీద పడి ముడుచుకుపోయి జుట్టు పీక్కుని పొర్లుతూ… అమ్మ ఏడుస్తూనే ఉంది.

నాన్న లేని ఇల్లు చాలా హాయిగా ఉంది. ముఖ్యంగా రాత్రిళ్ళు కంటినిండా నిద్రపోతున్నాం నేను చెల్లీ. కానీ నాలో భయం అలానే ఉండిపోయింది మధ్య రాత్రిళ్ళు ‘‘ఒద్దు… ఒదులు నాన్నా’’ అంటూ ఏడుస్తూ లేస్తునే ఉన్నా. అట్లా సంవత్సరం గడిచిపోయింది.

ఒకనాడు మా అమ్మ లేన్నాడు… మా నాన్న వచ్చాడు. నన్ను ఒడిసిపట్టాడు దారుణంగా రేప్‌ చేసాడు తప్పించుకొనే వీల్లేకండా… లంగా అంతా నెత్తుటి మయం అయిపోయి నేను స్పృహ తప్పిపోయాను. చెల్లి పారిపోయింది. అమ్మొచ్చింది కాళికై పోయింది. నన్నట్టాగే ఎత్తుకుని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళింది నాన్న ఫోటో చూపించింది. కేస్‌ ఫైల్‌ చేసింది. నాన్న అరెస్ట్‌ అయినాడు.

తన ఒంటి మీద నాన్న చేసిన రాక్షస గాయాలు కూడా చూపించింది. అమ్మ రొమ్ముల మీద, తొడల మీద నాన్న కాల్చిన సిగరెట్‌ మచ్చలే. అమ్మ అందుకే రాత్రిళ్ళు తలుపు తీసుకుని రోడ్డు మీదకి పారిపోయేది. అమ్మకు మల్లె నాకు సిగరెట్టు వాతలు పెట్టేవాడు కాదు కానీ కొరికేసేవాడు ఆ రాక్షసుడు. అమ్మకు తోడుగా మహిళా సంఘాలు చాలా పెద్ద గొడవ చేసాయి. వాడు అరెస్ట్‌ అయ్యాడు. వాడికి 20 సంవత్సరాలు అంటే జీవిత కాల శిక్ష పడిరది. కోర్టులో శిక్ష ఖరారు కాంగానే అమ్మ వెళ్ళి వాడి మీద ఖాండ్రిరచి ఉమ్మింది. నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చాను.

తర్వాత అమ్మ మా గురించి చాలా జాగ్రత్తలు తీస్కునేది ఒంటరిగా ఒదిలేది కాదు. తనతో హాస్పిటల్‌కి తీస్కేళ్ళేది. మామీద పురుషుల కన్ను పడకూడదు అని మాకు ఇద్దరికీ ప్యాంట్‌, షర్ట్స్‌ వేసేది. జుట్టు క్రాఫ్‌ చేసేది. చెల్లి చాలా ఏడ్చేది పంజాబీ డ్రెస్‌లు, గౌవున్లు కావాలని. నాకు మాత్రం పాంట్స్‌, షర్ట్స్‌లోనే రక్షణగా అనిపించేది. నన్ను నేను మగపిల్లాడిలాగా ఊహించుకోవడం మొదలైంది. ఆ ఊహే చాలా బాగుండేది, ధైర్యంగా అనిపించేది.

అమ్మ నన్నూ చెల్లినీ హాస్టల్లో ఉంచి చదివించింది. నాకు చెల్లికి స్కాలర్‌షిప్స్‌ వచ్చేవి. అమ్మ వారం వారం వచ్చి జాగ్రత్తలు చెప్పేది. అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది మా ఇద్దరి మీద. కానీ చెల్లి నాకు అమ్మకు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఎవరో అబ్బాయిని పెళ్ళి చేస్కుని వెళ్ళిపోయింది. తను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుందని… ప్రణవ్‌ తనను చాలా గాఢంగా ప్రేమిస్తాడనీ తనను బాగా చూస్కుంటాడన్న నమ్మకం ఉందనీ… తాను చాలా సంతోషంగా ఉన్నాననీ ఉత్తరం రాసింది. ఎక్కడుందో కూడా రాయలేదు. అమ్మ కుప్పకూలిపోయింది. వారం రోజులు అన్నం తినలేదు. కృంగి కృశించిపోయింది. చెల్లి హాస్టల్‌, కాలేజీ ఫ్రెండ్స్‌ అందర్ని అడుగుతూనే పిచ్చిగా వెర్రిగా తిరిగింది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చెల్లి నుంచి కబురే లేదు. అలా సంవత్సరం గడిచిపోయింది. చెల్లి నేనూ మంచి స్నేహితులం నాతో ఎందుకు సంబంధం పూర్తిగా తెంపుకుందో తెలియదు. నాకు చాలా దుఃఖం వచ్చింది. అమ్మ పూర్తిగా మారిపోయింది. నిద్రపోదు. అన్నం తినదు. రాత్రింబగళ్ళు చెల్లిని కలవరిస్తుంది. ఉన్నట్లుండి ఒక రోజు టీవీలో… న్యూస్‌ పేపర్లలో వార్త. చెల్లి ఫోటోతో సహా వచ్చింది. తొలిచూలు ఆడపిల్లని కన్నదని బిడ్డని, తల్లిని గొంతు నులిమి చంపిన భర్త, అత్తమామలు అని చెల్లి, ప్రఫుల్ల ఫోటోతో సహా వేసారు. గుండె పగిలిపోయింది. చెల్లి ఊరికి పరిగెత్తుకు వెళ్ళాం నేనూ అమ్మ. అప్పటికే పోస్ట్‌మార్టం చేసేసారు. వారం రోజుల పచ్చి బాలింత చెల్లి ఒంటినిండా దారుణమైన గాయాలున్నాయి. పండ్లతో కొరికినవి, సిగరెట్లతో కాల్చినవి, పిడిగుద్దులతో కమిలిన మచ్చలు పాతవి, కొత్తవి గోడకేసి కొడితే చితికిపోయిన తల… రాలిపోయిన పళ్ళు… దేహం ఒక చిత్రహింసల మాంసపు ముద్దలా ఉన్నది… చెల్లిని చూసి నేను అమ్మ తట్టుకోలేకపోయాం. చివరి స్నానం చేయిస్తూ అమ్మ చెల్లి దేహం మీదే గాయాలు పుణుకుతూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. చెల్లిని సమాధి చేసాము.

తర్వాత చెల్లి వస్తువులు తీస్కొచ్చాం. డైరీలో తన సమస్త వేదనను రాస్కుంది. నాకు రాసిన పోస్ట్‌ చేయని ఉత్తరాల్లో ‘‘నన్ను తీస్కెళ్ళిపో అక్క ఈ నరకం నుంచి విముక్తిరాలిని చేయు’’ అని రాసింది. ప్రవీన్‌ తన కుటుంబ చరిత్ర తర్వాత తెలుసుకున్నాడనీ నాన్న… నీ మీద, నా మీద చేసిన లైంగిక అత్యాచారాలు అతనికి తెలుసుననీ… అనుక్షణం నేను కన్నతండ్రితోనే అపవిత్రమైన దాన్నంటూ హింసించేవాడనీ… నీ అక్క కూడా అదే జాతని, నీ అక్క కన్న తండ్రి గర్భాన్నే మోసిన కులట అనీ చిత్రహింసలు పెట్టేవాడు. ‘‘మీ అమ్మ, నువ్వు, మీ అక్కా ముగ్గురూ కలిసి కాపురం చేసేవారటే వంతులవారీగా మీ నాన్నతో’’ అని అసహ్యంగా మాట్లాడేవాడు.. అక్కా… అమ్మా ప్రవీణ్‌కి ఈ విషయాలు తెలియద్దనే నేను అనాధని చెప్పా ప్రవీణ్‌తో. పెళ్ళి కాగానే అతని ఊరు వచ్చేసాను. మీకు అడ్రెస్‌ కూడా ఇవ్వద్దని స్వార్థం చూస్కున్నా. అక్కా అమ్మా క్షమించండి. కానీ ఎవరో చెప్పేసారు ప్రవీణ్‌కి వాళ్ళమ్మ నాన్నలకీ… అంతే నా జీవితం పరమ ఘోరంగా మారిపోయింది. మీ జాడ తెలుసుకోవాలని శతధా ప్రయత్నించాడు కానీ వీలవలా… నేను చెప్పలేదు’’ చెల్లి లేఖల నిండా ఈ రాతలే కనిపించాయి. అమ్మకి దాదాపు పిచ్చెక్కింది. రోడ్లమీద పరిగెత్తడం… బట్టలు చించుకోవడం… ఇంతలో నవ్వడం.. అంతలో ఏడవడం చేసేది. అమ్మని మళ్ళీ సైకియాట్రిస్ట్‌కి చూపించాను. చాలా మందులు రాసాడు. వేస్కునేది కాదు విసిరికొట్టేది. చెల్లిని కలవరిస్తూ ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లి పోయింది. చెల్లి భర్త ప్రవీణ్‌కి యావజ్జీవ శిక్ష పడిరది.

ఆ వార్తని అమ్మ నిర్వికారంగా విన్నది. అమ్మని పక్కింటి ఆవిడ దగ్గర విడిచి ఒక రోజు నా పీహెచ్‌డీకి అప్లై చేద్దామని యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ దళిత పరిశోధక విద్యార్థిని శైలజ మీద లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ప్రొఫెసర్‌ శ్యాంరెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొని ఇంటికొచ్చే సరికి చాలా ఆలస్యం అయింది. మధ్యలో పక్కింటి ఆంటికీ ఫోన్‌ చేసి కనుక్కుంటే ‘‘అమ్మ నిద్రపోతుంది నేను కొంచెం పనుండె మా ఇంట్లోకి వచ్చాను విభా’’ అంది. అమ్మకి తెలియకుండా పొద్దున్నే టీలో మందులు పొడి చేసి వేస్తున్నా. అందుకే ఈ మధ్య కొద్దిగా నిద్రపోతున్నది. ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రం ఆరైంది. నిద్రపోతున్న అమ్మ వైపు చూసాను. అమ్మ నిద్ర మామూలుగా లేదనిపించింది. ఎంత కుదిపినా లేవట్లేదు. పక్కనే నీళ్ళ గ్లాసు కింద అన్నీ ఒక నెల కోసం కొన్న మందుల ఖాళీ స్ట్రిప్పులు పడి ఉన్నాయి. అవే కాదు ఇంట్లో 

ఉన్న అన్ని మందుల స్ట్రిప్పులు ఖాళీగా అంటే దాదాపు ఒక వంద మందుల దాకా… నాకు గుండె గుభిల్లుమంది. అమ్మ గుండె చప్పుడు ఎక్కడో వినిపిస్తుంది శ్వాస కూడా సరిగా లేదు. వెంఠనే ఆసుపత్రికి తీస్కెళ్ళాను… ఎంత ప్రయత్నించినా అమ్మ బతకలేదు. చాలా పవర్‌పుల్‌ మందులు వేస్కుంది. ‘‘డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రమాదకరమైన మందులు అందుబాటులో పెట్టకూడదు అని తెలీదా మీకు’’ అని డాక్టర్‌ కోప్పడ్డాడు. ‘‘నా భార్య కూడా డిప్రెషన్‌ పేషంట్‌ మందులు ప్రతి పూటా నేనే వేస్తుంటాను ఈ భయంతో… పసి పిల్లల్లాంటి వాళ్ళు ఈ మానసిక రోగులు… జాగ్రత్తగా చూస్కోవాలమ్మా’’ అన్నాడు డాక్టర్‌ చెమ్మగిల్లిన కళ్ళతో.

అమ్మ నా గురించి ఆలోచించలేదు. తన సమస్త బాధలకి ఆత్మహత్యే పరిష్కారం అనుకుంది నన్ను ఒంటరిని చేసేసింది. నాకు మగవాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. నాన్న, ప్రవీణ్‌, ప్రొఫెసర్‌ శ్యాంరెడ్డి ఇంకా ఎంతో మంది లక్షల, కోట్ల పురుషులు… మృగాల్లాంటి వాళ్ళను ఎలా నమ్మను… పూర్తి విశ్వాసం పోయింది. ఆఖరికి అమ్మను కూడా నాకు దక్కనివ్వని ఈ పురుష సమాజం… వీళ్ళనిట్లా తయారు చేసిన వ్యవస్థ మీద అసహ్యం వేసింది. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అని వెంట పడుతున్న హరీష్‌ని మొదటి నించీ తిరస్కరిస్తూ వచ్చాను. ఖచ్చితంగా నో అని చెప్పేసాను.

‘‘నువ్వు ఆడదానివి కాదా… ఇంత ప్రేమిస్తున్నా’’ అంటూ బాధపడ్డాడు. ఏమో… తెలీదు. పురుషుడు మృగంలా దాడి చేసి తూట్లు పొడిచే ఈ స్త్రీ దేహం… స్త్రీత్వం అంటే భయం. నాలో ఆ భావనలు పూర్తిగా పోయాయి. పురుషుడు అన్నా, అతని దేహ నిర్మాణం అన్నా విపరీతమైన అసహ్యం వేస్తుంది.

పురుషుల డ్రెస్‌లో ఉంటూ అమ్మాయిల మీద,  చెల్లిమీద, నా మీద దాడి చేసే నాన్నలాంటి మగవాళ్ళను ఎదిరిస్తూ తంతూ తరుముతున్నట్లు, అమ్మ చెల్లిని రక్షించే బలమైన పురుషుడిలా నేను చిన్నప్పటి నుంచే ఫీలవసాగాను. నాలో మెల్లగా పురుషుడికి తలుపులు మూసుకుపోయాయి. నాన్న లాంటి దుర్మార్గుడితో అంత ధైర్య సాహసాలతో యుద్ధం చేస్తూ గెలుస్తూ వచ్చిన అమ్మే నా హీరోయిన్‌ అంత పోరాడి, కాపాడుకున్న చెల్లి. అంత దారుణంగా హత్యకి గురైందని బాధ, వేదనలో అమ్మ ఆత్మహత్య చేసుకున్నా… నిత్యం నాన్నతో పోరాడిన అమ్మే నాకు ప్రేరణ.

పెళ్ళి, భర్త అంటే హింసాత్మక జీవితం తప్ప మరొకటి కాదని అర్థం అయిపోయింది. నన్ను ప్రేమించిన, మంచివాళ్ళైన హరీష్‌ లాంటి యువకులపైన కూడా నాకు ఏ ఫీలింగ్స్‌ కలగడం లేదు. మమ్మల్ని నాన్న కోరల్నించి రక్షించిన అమ్మలాంటి స్త్రీలలోనే భద్రత ఉంది అని అర్థం అయిపోయింది. ఈ ఆలోచనల్లోంచే నాకు, నా పీహెచ్‌డీ ఫ్రెండ్‌.. స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకురాలు మానస మీద ప్రేమ, ఆకర్షణ కలగసాగాయి. ఈ మార్పుకి నేను ఖంగారు పడ్డాను. కానీ నన్ను నేను కంట్రోల్‌ చేస్కోలేకపోయాను. ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఆమె మీద రోజురోజుకీ ప్రేమ పెరగసాగింది. ఒకసారి ప్రేమలేఖ రాసాను. షాక్‌కి గురి అయ్యింది. ముక్కలు చేసి మొఖం మీద విసిరికొట్టింది. క్లాస్‌లో అందరికీ చెప్పింది. అందరూ నన్ను దూరం పెట్టసాగారు. నాకు బాధ కలిగినా భరించాను. చాలాసార్లు మానసను ముద్దు పెట్టుకోవాలనిపించేది. ఆ కోరిక వేధించేది. కానీ ఆమెకి ఇష్టం లేకుండా ఆపని చేయలేను. ఆమెకెలాగూ నేనంటే ఇష్టం లేదు. పైగా నాది ఎస్సీ కులం ఆ చిన్న చూపు కూడా ఉంది యూనివర్సిటీలో… నా మీద ఎలాగూ లెస్బియన్‌ అనే ముద్రపడిపోయింది. నాకేం పెద్ద బాధ కలిగేది కాదు. అవును నేను స్త్రీనే ప్రేమించగలను. పురుషుణ్ణి ప్రేమించలేను. మానసకు పెళ్ళైపోయిన రోజు బాగా ఏడిచాను. నా పీహెచ్‌డీ పూర్తవుతున్న సమయంలో యూనివర్సిటీలో ఒక బ్రిలియంట్‌ దళిత క్రిస్టియన్‌ స్టూడెంట్‌, ప్రొఫెసర్స్‌ చూపించే కుల వివక్ష భరించలేక ఆత్మహత్య చేస్కుంటే… పెద్ద ఉద్యమం నడిచింది. ఆ సమయంలో నాకు ఇదిగో మన వరద పరిచయం అయ్యింది. ఇద్దరం కలిసి ఆ ఉద్యమంలో పని చేసాం. మాకిద్దరికీ స్నేహం… కుదిరి మనసులు కలిసాయి. ముందుగా నేనే ప్రొపోస్‌ చేసాను. తనకు ఒప్పుకోవడానికి సంవత్సరం పట్టింది. ఇద్దరం ఇప్పుడు లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాం. ఒక పాపను దత్తత తీస్కుంటున్నాం. త్వరలో తల్లిదండ్రులం అవబోతున్నాం. విభాత వరద వైపు చూస్తూ.. సంతోషంగా నవ్వుతూ మెరుస్తున్న కళ్ళతో చెప్పింది.

సమాజం, కుటుంబం నించి చాలా ప్రశ్నలు అవమానాలు వస్తున్నాయి. కానీ అన్నింటినీ ఫేస్‌ చేస్తున్నాం. మాదొక అసహజ లైంగిక ధోరణా కాదా అనేది పక్కన పెడితే పెళ్ళి అనే వ్యవస్థలో భార్య భర్తల అక్రమ, అసహజ సంబంధం కంటే కల్మషం లేనిది మా ప్రేమ. మాకు సపోర్ట్‌గా… ఉండే హక్కుల పోరాటంలో భాగంగా ఎల్‌జీబీటి హక్కుల సంఘంలో చేరాం. ఈ అపసవ్య సమాజం మమ్మల్ని అంగీకరించకపోయినా ఫరవాలేదు. మాకు సవ్యమైనది అనిపించే దిశలో నడుస్తున్నాం’’ అంది వరద. ఇంతలో షాపింగ్‌కి వెళ్ళాలన్న యామిని మెస్సేజ్‌ వచ్చింది మహిమకు… వెంఠనే బయలుదేరింది ‘‘వచ్చేవారం’’ కలుద్దాం అంటూ అందరూ విడిపోయే ముందరి ముచ్చట్లలో పడ్డారు.

షాపింగ్‌ పూర్తయ్యాక… ఇద్దరూ రెస్టారెంట్‌లో కూర్చున్నారు. ‘‘రేపే జాబ్‌లో జాయిన్‌ అవుతున్నా’’ అంది మహిమ ‘‘వావ్‌… మహీ చాలా సంతోషంగా ఉంది నాకు నీకెంత డైవర్షన్‌ కదా… ఆ ఇంటి నుంచి… చరణ్‌ నించి… ఈ బాధల నుంచీ… మహీ… నా కోసం నువ్వా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చెయ్‌. కిరణ్‌ పేరెంట్స్‌ కోసం… సంతోషం లేని దాంపత్య జీవితాన్ని నటించఖ్కర్లేదు,’’ అంది యామిని కళ్ళల్లో తిరుగుతుంటే ‘‘ఛ యామీ నువ్వలా ఆలోచించకు. ఇంకో రెణ్ణెల్లు అంతేగా… నీ కోసమంటే, నా కోసమన్నట్లేగా నా చెల్లికోసమేగా, సంతోషంగా పెళ్ళి చేసుకో… కిరణ్‌ బాగా అర్థం అవుతున్నాడా’’ యామిని కళ్ళల్లోకి ప్రేమగా… లోతుగా చూస్తూ అడిగింది మహిమ. యామిని నవ్వింది. ‘‘అవుతున్నాడు. రెణ్ణెల్ల నుంచీ కలిసి తిరుగుతున్నాం కదా… సున్నితమైన మనస్తత్వం… మంచివాడే’’ అంది కళ్ళు మెరిసిపోతుంటే… ‘‘పోనీలే యామీ… నువ్వదృష్టవంతురాలివి’’ అన్నది మహిమ… చెల్లెల్లి వైపు సంతృప్తిగా చూస్తూ ‘‘చరణ్‌ మీద నీ అభిప్రాయం ఏమన్నా మారిందా మహీ…’’ యామిని ప్రశ్నకు ‘‘నో… ఏ కోశానా మంచి అభిప్రాయం ఏర్పడ్డం లేదు. ఈ మనిషిలో నేను సహజీవనం చేస్తానని అనిపించట్లేదు. రోజు రోజుకీ నాకు దగ్గరయ్యే ప్రయత్నంలో వెకిలి వేషాలు ఎక్కువైనాయి. నీ పెళ్ళైపోయే లోపల నా శోభనం అయిపోవాలని వాళ్ళమ్మ పట్టుదల. అంతకుముందే ఒక భయానక శోభనం కానట్లు… అప్పుడు అయిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది… మళ్ళీ రేప్‌ చేయించుకోమంటుంది బుద్ధి లేకుండా… తొందరగా బయటపడాలి. ఎప్పుడూ నన్ను ఆకలి చూపులతో చూస్తుంటాడు చరణ్‌. నాకు చాలా చీదరగా అనిపిస్తుంది. ఎంత సేపూ ఆ చూపుల నుంచీ, చేష్టలనుంచీ తప్పించుకొంటూ ఉండడమేనా నాపని అని మహా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఈ మధ్య బూతులు కూడా మాట్లాడ్తున్నాడు ఇక నా వల్ల కాదు. నీ పెళ్ళైన మరుక్షణమే… బయట కొస్తాను. మొన్న కొట్టటానికి కూడా వచ్చాడు. నేను తోసి పడేసా’’ మొఖం కోపంతో ఎర్రబడిరది మహిమకు… ‘మహీ’ అంటూ యామిని మహిమ అర చేతుల్ని తన అరచేతుల్లోకి తీసుకుని ప్రేమగా, సాంత్వనగా ఒత్తిపట్టింది. యామినిని క్యాబ్‌ ఎక్కించి తను ఇంటికి బయలుదేరింది. మళ్ళీ చరణ్‌ దగ్గరికీ అంటే ఒక్కసారి నిస్సత్తువగా అన్పించింది. ఇంటికెళ్ళి స్నానం చేసి నడుం వాల్చింది. చరణ్‌ ఇంకా రాలేదు. వచ్చినా అతని దగ్గర కీస్‌ ఉన్నాయి. మహిమకి నిద్రరావట్లేదు. స్ట్రాంగ్‌ వుమెన్‌ ఫైట్స్‌ సంస్థలో భర్తలతో లైంగిక హింసలు అనుభవించిన స్త్రీలు… వారి ఘర్షణ, బాధ, వేదన, పోరాటం హింసాత్మక సంబంధాల్ని ధిక్కరించి, విడిపోయి ఆత్మ గౌరవంతో బతకడం… ఇవన్నీ తనలో రోజు రోజుకీ చరణ్‌తో తన సంబంధం గురించిన తనవైన ఆలోచనలను బలపరుస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. ఏ మాత్రమూ ఇక ఈ అమానవీయ సంబంధంలోకి తను వెళ్ళలేదు. చరణ్‌ ఒక రేపిస్ట్‌… ఇతన్ని తను తన సహచరుడిగా ఒక్క క్షణం కూడా ఊహించుకోలేదు. నాన్న కోసం, చెల్లి కోసం ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళతో చెప్పి వచ్చింది కానీ తనకు సాధ్యం కావట్లేదు పైగా తన ప్లాన్‌ విడాకులు మాత్రమే.. చెల్లి పెళ్ళే ముఖ్యం. తర్వాత ఒక్క క్షణమైనా తను ఉండదు. ఇప్పటికే ఏ క్షణంలోనైనా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది.. చెల్లి పెళ్ళిలో సంబంధం లేకుండా అంతగా ఊపిరాడదు. ఇక్కడి ప్రతీ గదిలో, గాలిలో అత్యాచారపు వాసన వేస్తుంది. ‘‘నీవల్ల దాని పెళ్ళి ఆగిపోతే న్యాయంగా ఉంటుందా. శాంతిగా ఉండగలవా నువ్వు’’ నాయనమ్మ నిలదీసి అడుగుతుంది. దాని పెళ్ళైయ్యేదాకే ఏం చేసినా… తనకు ఉద్యోగం రావడం ఒక పెద్ద సాంత్వన. తను పట్టుదలతో రాసిన బ్యాంక్‌ ఎక్సామ్స్‌ ఫలితాన్నిచ్చాయి. ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. చరణ్‌ గిజగిజలాడాడు. అత్త కూడా. ‘‘అవసరమా వాడు నెలకు లక్ష సంపాదిస్తున్నాడు.. ఇంత ఆస్థి ఉంది ఇంట్లో ఉండక ఇప్పుడు ఎందుకు జాబ్‌… బయట తిరగాలని కాకపోతే’’ అంటూ మాట్లాడిరది. తను పట్టించుకుంటే కదా… తను ఆర్థికంగా స్వాతంత్య్రంగా ఉండడం చరణ్‌కి అస్సలు ఇష్టం లేదు. అతని మీద తను ఆధారపడాలి. లొంగిపోయి ఉండాలి… ఇదీ అతని ఆలోచన.

ఇంతలో మెస్సేజ్‌ అలర్ట్‌ వచ్చింది. బిపిన్‌ చంద్ర నించి… మహి గుండె రaల్లుమన్నది. ‘‘ఎలా ఉన్నావు మహీ’’ బిపిన్‌ పలకరింపు. ‘‘నాతో మాట్లాడవూ?’’ అభ్యర్థన. బిపిన్‌ మెస్సేజ్‌ చూస్తున్న మహి చేతి వేళ్ళు వణికాయి. కళ్ళు నిండుకున్నాయి. వెంఠనే ఫోన్‌ పక్కన పెట్టేసింది. తనకోసం ఇంకా ఎదురు చూస్తున్నాడా… ఒఠ్ఠి పిచ్చితనం కాకపోతే…

వెంఠనే ‘‘బాగున్నా… నువ్వు బాగున్నావని ఆశిస్తున్నా… ఇంకా ఎంత కాలం ఒంటరిగా ఉంటావు? జీవితంలో సెటిల్‌ అయిపో డోంట్‌ డిస్టర్బ్‌ మీ…’’ అని టైప్‌ చేసేసింది వణుకుతున్న వేళ్ళతో.

‘‘నన్నేమీ మాట్లాడనీయవా మహీ… నువ్వు నిజంగా బాగున్నావా. నిజం చెప్పు. వర్ష నాకంతా చెప్పింది’’ బిపిన్‌ మెసేజ్‌. ‘‘నేను నా జీవితం బాగు చేసుకునే ప్రయత్నంలో ఉన్నా.. నేను బాగుంటాను. నా జీవితమూ బాగుంటుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్‌ ఉంది. నాకు ఎవరి సానుభూతీ అవసరం లేదు’’ మహి ఆవేశంగా టైప్‌ చేసింది. ‘‘నా దగ్గరే అంత అభిమానం ఎందుకు మహీ… నేను నీకంత పరాయివాణ్ణై పోయానా? పోనీ ఒఠ్ఠి స్నేహితుడిగానైనా చూడలేవా.. నన్ను? చరణ్‌, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా… బిపిన్‌. ‘‘అయాం ఫైన్‌… నేను బాగున్నా బై బిపిన్‌’’ మహిమ ఫోన్‌ ఆఫ్‌ చేసింది.

ఇంతలో తలుపు టకటక చప్పుడైంది. అది చరణ్‌ మునివేళ్ళ చప్పుడు. బాగా డిస్టర్డ్బ్‌గా ఉందేమో మహి ఒక్కసారి కోపంగా ‘గెట్‌ లాస్ట్‌ చరణ్‌’ అని అరిచింది. ‘‘నువ్వు చాలా టూమచ్‌ చేస్తున్నావు. నాకు ఓపిక నశిస్తుంది’’ అన్నాడు చరణ్‌ కోపంగా. ‘‘గో టు హెల్‌’’ అరిచింది మహిమ. చరణ్‌ ఈసారి కాలితో తలుపు తన్నాడు. మహిమకు కోపం నషాళానికి అంటింది. మంచం దిగి ఒక్కసారిగా తనూ కాలితో తలుపుని తన్ని, ‘అంతా రికార్డ్‌ చేస్తున్నా’ అని అరిచింది. ‘చేస్కో నాకేం భయం మీ ఇంట్లో అందరి సపోర్ట్‌ నాకే ఉంది ఏవనుకున్నావో ఫ్లీజ్‌ తలుపు తియ్యవే అర్థం చేస్కో’ ముద్ద ముద్దగా వినిపిస్తున్నాయి చరణ్‌ మాటలు తాగి ఉన్నాడు. రోజూ తాగి వస్తాడు. మహిమ పట్టించుకోక ముసుగుతన్ని పడుకుంది. ఒక పది నిముషాల తర్వాత చరణ్‌ నించి మేస్సేజి వచ్చింది. ఓపెన్‌ చేసి చూసిన మహిమ ఆగ్రహంతో రగిలిపోయింది. ఫోర్న్‌ వీడియో పంపాడు. మహిమ సైలెంట్‌గా ఉండిపోయింది. డిలీట్‌ చేయలేదు. తిరిగి మెస్సేజ్‌ పంపలేదు. తననెంత అసభ్యంగా వేధిస్తున్నాడో ఇవే సాక్ష్యాలుగా ఉంటాయి. ఉండనీ ఇతనితోనా తను జీవితం గడపాలని నానమ్మ కోరేది. నాన్నకి, నానమ్మకి తను మారిపోయినట్లు బిల్డప్‌ ఇస్తాడు. చెల్లి పెళ్ళికి ఇంకో ఇరవై రోజులున్నది. పెళ్ళి రోజుకంటే ముందే తను ఇక్కడ్నించి వెళ్ళిపోవడం. తను ఈ టార్చర్‌ భరించలేక పోతున్నది. భార్యకే అసభ్యమైన వీడియోలు పెడ్తూ వేధిస్తున్న ఇతన్ని ఏమనుకోవాలి? ఇక ఇతనితో ఉండదు… పుట్టింటికీ వెళ్ళదు గాక వెళ్లదు.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply