7
ఏగ్నెస్ కథ రాసేటప్పుడు మధ్యలో భావోద్వేగానికి దుఃఖానికి గురై కలం జారి… కన్నీళ్ళు తొణికి చిందరవందరైన అక్షరాలను మళ్ళీ రాస్కుంది. మహిమ. పరిమళ, ఏగ్నెస్ కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఏగ్నెస్ జీవితంలో హింస ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దర్లో పరిమళ చాలా ఏళ్ళు భరిస్తే… ఏగ్నెస్ మూడేళ్ళు భరించి బయటపడి తన జీవితాన్ని కాపాడుకుంది. పరిమళకి బయటపడే అవకాశాలు ఉన్నా భర్త వాడుకున్నంత కాలమూ భరించి… అతడు తనకు తానుగా ఇంకో స్త్రీని వెతుక్కునేంత వరకూ అలానే ఉంది. పిల్లల కోసం భరించింది. కానీ తను ఏగ్నెస్ అంత సమయం కూడా తీస్కోలేదు తీస్కోదు కూడా. ఆ ఒక్క సంఘటన తరువాత తన ఒంటి మీద చెయ్యి వెయ్యనీయలేదు చరణ్ణి. ఏమైంది తనకీ, చరణ్ కి మధ్య? ఏం మిగిలింది తన జీవితంలో?
అమ్మకీ నాన్నకి మాట ఇచ్చాక బిపితో తెగతెంపులు చేస్కుంది. ఆ తర్వాత గుండె పగిలేలా ఏడ్చింది. నాన్నకి గుండె జబ్బు పెరగకుండా ఉండడం కోసం… నాన్న విషం తాగి చావకుండా ఉండడం కోసం, చెల్లి పెళ్ళి కోసం అంటూ రాజీపడే ప్రయత్నం చేసింది. బిపిన్ చంద్రని మర్చిపోయి, నిజాయితీగా చర తో కొనసాగాలనుకున్నది. గుండె శిలగా చేస్కుంది… మనసుని ఏమార్చింది. తొలిరాత్రికి ముందే ఫోన్లో చరణ్ కి చెప్పింది. తనకు కొంత గడువు కావాలని మొదటి రాత్రిని వాయిదా వేయాలనీను. సరే అని ఒప్పుకున్నాడు. పెద్దవాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసాడు. అత్తయ్య నానా గొడవ చేసింది. మంచి ముహుర్తం పోగొడ్తున్నారని. వెంఠనే రెండు రోజులైనాక ముహుర్తం పెట్టారు తను వద్దన్నది. భయంగా ఉంది తను ఇంకా మానసికంగా సిద్ధంగా లేనని చెప్పింది. అమ్మ వింటం లేదు అన్నాడు. “నిన్ను నేనేం చేయను ప్రామిస్… ఊరికే గదిలోకి వెడదాం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదాం నన్ను నమ్ము మహిమా” అన్నాడు. తను నమ్మింది. ఆ రాత్రి శోభనపు గదిలోకి వెళ్ళింది. నిజంగానే చరణ్ ఏం చెయ్యలేదు. తనను మంచంపై కూర్చోబెట్టి చాలా కబుర్లు చెప్పాడు. తను, తన ఊరు, తన బాల్యం, స్కూలింగ్, అమ్మా నాన్న, అక్కా చెల్లెళ్ళ కబుర్లు. తనూ చెప్పింది శ్రద్ధగా విన్నాడు. అతని సమక్షంలో కంఫర్ట్ గానే ఫీలయ్యింది. తన మాటకు విలువ ఇచ్చాడన్న గౌరవ భావం కలిగింది. ఇక ఈ వేషం తీసేస్తా అంటూ మల్లెపూలు తీసేసి తెల్ల చీర తీసేసి స్నానం చేసి నైటీ వేస్కుంది. అప్పటికే రాత్రి పన్నెండయ్యింది. చరణ్ మాటి మాటికీ వాచీ చూస్కుంటుంటే ‘ఎందుకు’ అని అడిగింది. చరణ్ ఖంగారు పడూ “అబ్బే ఏం లేదు” అంటున్నాడు. ఈ లోపల అతని ఫోన్ మోగింది. “సరే… అమ్మా నువ్వూరుకో అర్థం అయింది… టెన్షన్ పడకు” ఖంగారు ఖంగారుగా మాట్లాడుతున్నాడు చరణ్. బాల్కనీలోకెళ్ళి ఏదో రహస్యంగా గుసగుసలాడున్నాడు ఫోన్లో, తనకి బాగా నిద్ర పట్టేస్తున్నది. వారం రోజుల నుంచీ నిద్రే లేదు. బాగా అలిసిపోయింది కూడా. పైగా… చరణ్ మీద ఎందుకో నమ్మకం కలిగింది. తను సేఫ్ గానే ఉన్నట్లు అన్పించింది. కళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి మత్తుగా.
ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. తన ముఖం మీద చరణ్ ముఖం వాలి ఉంది. వేడి శ్వాస వదులుతున్నాడు. తన ఛాతీ మీద అతని చేతులు, తన తొడల మీద అతని మోకాలు ఉంది. దాదాపు నఘ్నంగా ఉన్నాడు. నిర్ఘాంతపోయింది. వెంఠనే “ఏంటిది… చరణ్ లే..” అంటూ తొయ్యబొయ్యింది. “ప్లీజ్.. ఆగలేను… అమ్మ… అమ్మ… కూడా ఒప్పుకోడం లేదు. ముహుర్తం ఉంది. ఇప్పుడే… ఇంకో ఐదు నిమిషాల్లో అయిపోవాలిట” అతను వగరుస్తున్నాడు. ఎంత దగా… తను విడిపించుకోవాలని చూస్తున్నది కానీ ఆరడగుల పొడవు… భారీదేహం… అతనిది… బలప్రయోగంతో తన మీదకు ఎక్కేసాడు చరణ్. అతని బరువుకి ఊపిరాడట్లేదు. ఏడ్చేస్తున్నది తను విడిపించుకునే ప్రయత్నంలో దబ్బున మంచం మీద నుంచి కిందికి పడిపోయింది. అతనలాగే తనని ఒడిసిపట్టాడు పూర్తిగా నఘ్నంగా… అసహ్యంగా ఉన్నాడు. ఒళ్ళంతా భల్లూకంలా వెంట్రుకలూ… కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అతన్నలా చూసి భయంతో ఒణికి పోయింది. తన మీద పడబోతున్న అతన్ని చూస్తూ రెండు చేతులెత్తి దండం పెడ్తూ… “ప్లీస్ చరణ్ ఒద్దు… నేను సిద్ధంగా లేను ఒదిలేయ్… ఇంకో రెండు రోజులు” అంది ఏడుస్తూ ఊహూ… అతను వినలేదు. ఫోర్సుగా నైటీ తీసేసాడు. తను తేరుకునేలోపే తన మీద పడి ఘోరంగా రేప్ చేసేసాడు. తన రెండు కాళ్ళ మధ్య… రక్తం వెచ్చగా కారడం, నొప్పితో అరవడం తెలుసు. తనకు స్పృహ తప్పింది. నీళ్ళు ముఖం మీద పోసినట్లున్నాడు మెలకువ వచ్చింది భయంతో.. కోపంతో గావుకేకలు వేసింది. తన ఒంటి మీద నూలు పోగు లేదు. తను లేచి “యూ బాస్టర్ట్… యూ రేష్ మీ… హౌ డేర్ యూ…” అని అరుస్తూ… ‘సారీ అమ్మ…’ మహీ అంటూ నసుగుతూన్న వాడి మీద ఖాండ్రించి ఉమ్మేసి ఏడుస్తూ నైటి పట్టుకొని బాత్రూం వైపుకి పరిగెత్తింది. నైటీ వేస్కుంది. తనలో ఆవేశం… కోపం… దుఃఖం… అవమానం పెల్లుబిక్కాయి నిలువెల్లా ఒణికిపోయింది. ఒళ్ళంతా చెమటలు ధారగా కారసాగాయి. ఏం చేసాడు వాడు? తనను రేప్ చేసాడు. వెంఠనే అక్కడున్న లైజాల్ తాగేసింది లోపం వచ్చిన చరణ్ నిర్ఘాంత పోయాడు అమ్మా అని అరిచాడు తనకు స్పృహ తప్పింది.
“నో… వాడ్ని వదలను కంప్లైంట్ చేస్తాను నన్ను పోలీస్ స్టేషన్ కి తీస్కెళ్ళండి” తను అరుస్తోంది, అమ్మనీ నాన్ననీ అర్ధిస్తోంది తీస్కెళ్ళమని మంచంపై నుంచి దిగే ప్రయత్నం చేస్తున్నది కానీ పానిక్ అయిపోయి మళ్లీ స్పృహ తప్పుతున్నది.
మెలకువ వచ్చినప్పుడల్లా అత్తయ్యా… మామయ్య… అమ్మనీ నాన్ననీ ఏదో దీనంగా అడుగుతున్నారు చేతులు పట్టుకొని… బహుశ కంప్లైంట్ ఇవ్వద్దనేమో…. కొడుకు జైల్లో పడతాడని కన్నీళ్ళేస్తున్నాయి అత్తయ్యకి
కానీ ముహుర్తం.. గర్భాదానం అంటూ తననంత కృరంగా రేప్ చేయించింది ఆమెనే కదూ… ‘అమ్మా…’ అంటూ తను అరిచింది రక్తం మరిగిపోతుంటే. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. “నో… వాళ్ళ మాట వినకండి… కంప్లైంట్ ఇద్దాం…” అంటున్న తనని అమ్మ దగ్గరికి తీస్కుంది.
తను కాంపోస్ ఇంజెక్షన్ మత్తులో కూడా పోలీస్ కంప్లైంట్ మాటని ఒదలడం లేదు. ఆ వారం రోజులూ హాస్పిటల్లో శవంలా పడి ఉంది. భయం, ఆందోళన తగ్గడానికి ఇస్తున్న ఇంజెక్షన్లు అన్నిసార్లు పని చేయడం మానేసాయి. పట్టే ఆ కాసింత నిద్రలో వచ్చే పీడ కలలతో భయంతో అరుస్తూ నిద్రలేచి ఏడుస్తూనే ఉండేది తను. సైకియాట్రిస్టు పిలిపించారు. ఆయన యాంటీ – డిప్రెసెంట్స్ రాసాడు. అవి బతికించాయి తనను. ఆ మందులు వేస్కోవడం గంటలు గంటలు నిద్రపోవడం. మెలకువ రావడం ఇష్టమే లేదు. మెలకువ వస్తే ఖంగారు, భయం. భయంకరంగా, కౄరంగా రాక్షసుడిలా నిప్పుకణికల్లా ఎర్రబడ్డ కళ్ళతో తన మీదకు దాడి చేసిన చరణ్ వికృత రూపం… కళ్ళముందుకు వచ్చి నిలబడుతున్నది. తన మీద ధనమని పడిన అతని దేహపు ఒత్తిడి… తన దేహం సమస్తంలో వంద కత్తులై చరణ్ ఒక్కడే దిగబడ్డట్లు… నొప్పితో… భయంతో… కన్నీళ్ళూ చమటలతో వచ్చే మెలకువ.. ఆ తర్వాత గొంతు పేగులు భగభగ మండించే లైజాల్… ఆ తర్వాత ఇక నిద్దేది? అవమానం నిలువెల్లా దహిస్తుంటే… చాలాసార్లు ఒక అభావ మానసిక స్థితిలో పడిపోతూ.. టీవీ… ఫోన్… లాప్ టాప్ లో ఏవీ చూడాలని అనిపించదు… ఎవరితో మాట్లాడాలని అనిపించదు ఎంతో ఇష్టమైన సాహిత్యం చదవాలనీ అనిపించదు. కథలూ రాయాలనిపించడం లేదు.. ఎలా అనిపిస్తుంది? కవిత్వం… రాస్తుంది. అదీ తన మనసులోని ఆవేదనా… బాధ దుఃఖాన్ని కవిత్వీకరిస్తున్నది చిన్న చిన్న కథలు రాస్తూ ఇప్పుడిప్పుడే రచయిత్రిగా మారుతున్న తన జీవితంలో ఇంత విషం ఒలికాక ఇక సృజనాత్మకత ఉంటుందా? ఎంతగా దేశీయ… పాశ్చాత్య సాహిత్యం చదివేది? తనకంటూ ఒక స్వంత బ్లాగ్ తయారు చేసి రాయాలని ప్లాన్ చేసింది. తెలుగునించి మంచి సాహిత్యాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడం తన కల కానీ… ఇప్పుడు అంతా పోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మందుల మత్తులో ఉండిపోతోంది. ఒక్కసారి కూడా చరణ్ ని ఈ నాలుగు నెలల్లో కలవలేదు తను కలవనీయ లేదు. ఇంటికి వచ్చాడు. తను తలుపు కూడా తెరవ లేదు “అమ్మాయితో అంత కృరంగా ఎట్లా చేసావని” అమ్మా… నాన్నా తిట్టారు. యామినికి మెసేజ్ చేసాడు “మీ అక్కను చూడాలని ఉంది’ అని “అక్క నీ ముఖం కూడా చూడాలని అనుకోవడం లేదు” అని పెట్టిందిట బదులుగా. నానమ్మ ఒక్కతే చరణ్ మాట్లాడుంది. అత్తయ్యా, మామయ్య, పెద్దాడబిడ్డ సురేఖా వచ్చి చాలా బతిమిలాడారు. “నిజమే… మావాడు దురుసుగా చేసాడు… మొరటువాడు. చిన్నప్పట్నించే ఇంతే ఈసారి ఏమీ కాకుండా చూస్కుంటాంగా.. మేముంటాంగా ఒక మూణెళ్ళు వాడితో” అంటూ ఎంతో మెత్తగా మాట్లాడారు. “చాల్లేమ్మా నీ కొడుకు చేసిన అప్రాచ్యపు పనికి మా మహి మీ కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాంటే… మావాడి కాళ్ళా వేళ్ళ పడి ఆపేసారు. మా మహి విషం తాగింది నీ కొడుకు మూలాన్న. చచ్చిపోయి ఉంటే ఏం చేసేవారు… పంపం పొండి… మా మహికి మీ ఇంట్లో రక్షణ లేదు…” అమ్మమ్మ అరిచింది.
వాళ్ళలా ఒకసారి కాదు… చాలాసార్లు అడుగుతూనే ఉన్నారు…. ఇంటికొస్తూ… ఫోన్లు చేస్తూ… “మా చిన్నమ్మాయి పెళ్ళి కావాలి కదా. వదిన వెళ్ళిపోయింది, కాపురం విడిచిపెట్టి అంటే అవుతుందా చెప్పండి? మీ చిన్నమ్మాయి యామిని కూడా పెళ్లికి ముందే అక్క భర్తను వదిలేసిందనో లేదా భర్తె వదిలేసాడనో అపనింద వస్తే యామిని పెళ్ళి అవుతుందీ చెప్పండి” అని ఒకటే బుర్ర తిన్నారు. నానమ్మ, అమ్మమ్మ, మేనత్త వచ్చి అమ్మ నాన్నకు తోడుగా ఉన్నారు. నాన్నమ్మ చరణ్ తల్లి మాటల్లో పడిపోయి ఒకటే పోరు మొదలు పెట్టింది. నానమ్మకు రోజో ఫోన్ చేస్తుంది అత్తయ్య “ఎంత వరకూ వచ్చింది…
మీ మహిమేవన్నా మారిందీ? ఎప్పుడు పంపిస్తున్నారు… కొత్తగా పెళ్ళైన ఇల్లు… కోడలు కనపడకపోతే చుట్టూ జనం అడుగుతున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాము. ఏం చెప్పాలో తెలీకండా… పంపండి త్వరగా” అంటూ. “వాళ్ళంతట వాళ్ళు అన్ని సార్లు వచ్చారు. మగ పెళ్ళి వాళ్ళయ్యి ఉండీ కాళ్ళమీద పడినంత పని చేస్తున్నారు. సారీ కూడా చెపుతున్నాడు అబ్బాయి. మరీ లాగితే తెగిపోతుంది. మన పిల్ల జీవితవూ పాడవుద్దిగా… పంపుదాం దాన్ని కాపురానికి” కోపంగా అరుస్తున్నది నానమ్మ. ఎప్పుడూ ఇంతే నానమ్మవన్నీ దాష్టీకాలే నా మీద, యామినీ మీద అమ్మ మీద… ఎన్నడూ ప్రేమగా మాట్లాడదు. దగ్గర తీయదు. అమ్మమ్మ మటుకు “ఎట్టా పంపుతాము వదినా… పశువులా మీద పడి అత్యాచారం చేసినవాడి దగ్గరికి… మీరు ఇట్టా మాట్లాడ్డం బాగోలేదు. అసలు బయట వాడెవడో ఇట్టా మనమ్మాయిని రేప్ చేస్తే వూరక వుంటామా? కేసు పెట్టెయ్యఁవూ… లోకాన్ని కిందా… మీదా చేసెయ్యవూ? మక్కెలిరగదన్నమూ… రేప్ చేసింది అల్లుడనా… భర్త అనా… మన్నించేసి, మళ్ళీ కాపురానికి పంపటం… వాడు మళ్ళీ అలానే చేయడని ఏమిటి గ్యారంటీ కాపురం అంటే.. మొగుడితో రేప్ చేయించుకోడమా” అంటూ అమ్మమ్మ విరుచుకుపడింది.
“అవును అమ్మామ్మా… రేపిస్టుతో నేను సంసారం చేయను అది అవమానం నాకు… చరణ్ సంసారం చేయడానికి అర్హత లేనివాడు” అంటూ తమ అమ్మమ్మని గాఢంగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.
“కామాక్షమ్మ వదినా… మనం ఇంతలా ఆలోచిస్తావా? మనఁవూ కాపురాలు చెయ్యలా… ఎంత నొప్పిగా ఉన్నా… సంసారఁవు అంటే అట్టాగే ఉంటుంది. చూడబోతే మీరు మహిమ కాపురం చెడగొట్టేటట్టుగా ఉన్నారే ఒరేయ్ సోమరాజూ… దాన్ని కాపురానికి పంపుతావా లేదా… ఎంత అప్రదిష్టరా…?” అంటూ నాన్నమ్మ నాన్న మీద అర్చింది… “పద్మావతి వదినా… కాపురం అంటే సున్నితంగా… సరసంగా ఉండాలి. రాక్షసంగా కాదు. స్వచ్ఛమైన పూల పరిమళంలా ఉండాలి గానీ. కుళ్ళిన పువ్వు దుర్గంధంలా ఉండకూడదు. వదినా, నా కథ చెవుతా విను. నాకిష్టం లేకపోతే…. నన్ను కష్టపెడితే నేను అస్సలు ఒప్పుకునే దాన్నే కాదు. అతగాడ్ని వదిలేసి పుట్టింటికి పారిపోయేదాన్ని. పుట్టింట్లో అమ్మ ఎంత చెప్పినా… నాన్న ఎంత కొట్టినా పోయేదాన్ని కాదు. బలవంతాన బస్సెక్కిస్తే బస్సులో కొంత దూరం పోనిచ్చాక. బస్సు ఆపుకుని మళ్ళీ పుట్టిల్లు చేరేదాన్ని. అలా ఎన్ని వందల సార్లు అయ్యిందో లెక్కేలేదు. నాన్న చాలాసార్లు ఇంటి బయటకు గెంటేసేవాడు. నాన్న పొలం వెళ్ళాక అమ్మ ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టేది నాన్నొచ్చాక రాత్రి మళ్ళీ ఇంటి బయటకు గెంటేసేవాడు. ‘ఇది నీ ఇల్లు కాదు ఫో” అంటూ. గొడ్ల చావిట్లో ముడుక్కొని పడుకునే దాన్ని. అమ్మ ఎంత కాళ్ళా వేళ్ళా పడ్డా వినేవాడు కాదు అమ్మనీ కొట్టేవాడు. అమ్మ రాత్రంతా కాపలా కాసేది.
ఊర్లో అంతా నా గురించి చర్చే… “ఎట్టా పాడయ్యారు ఈ కాలపు ఆడపిల్లలు… సామ దాన దండోపాయాలకీ లొంగకండా” అంటూ. మా అత్తారింటి వాళ్ళు ఇంటికొచ్చినా… నేను వాళ్ళతో వెళ్ళకండా అట్టాగే మొండిగా ఉండిపోయా. ఇట్టా చాలా కాలం గడిచింది. ఇక అమ్మా నాన్నా చేతులెత్తేసారు. ఈ నాన్నలెందుకింత హృదయం లేకండా ఉంటారు కన్న బిడ్డలతో…? తండైనా… భర్తెనా పడక మీద ఒకటేగా గామోసు. కనీసం తండ్రికి కనికరం ఉండొద్దూ…?
మా ఆయన్ను, అత్తారిని పంచాయితీకి పిలిచారు. పడక మీద మోటుగా ఉండకుండా బుద్ధిగా, సున్నితంగా ఉంటానని కాగితాలు రాయించుకున్నాకే… నలుగురి ముందు ఒట్టేయించుకున్నాకే వెళ్ళాను. మా ఆయన దారికొచ్చాడు… మారాడు బుద్ధిగా ఉండటం మొదలెట్టాడు. ఏమాత్రం మాట తప్పినా వెధవేషాలు వేసినా తిరిగి పుట్టింటికో… నట్టింటికో వెళ్ళిపోతానన్న ఒప్పందం మీదే కాపురానికొచ్చాను కదా మరి? ఇదిగో అలా గౌరవంగా కాపురం చేసాకే కదా ఈ కాత్యా పుట్టింది?” అని గర్వంగా కూతురు కాత్యాయని వైపు చూపిస్తూ… “నాలాంటి దానికి పుట్టి, నీ కూతుర్ని బలత్కారం చేసిన వాడి దగ్గరికి ఎంత భర్త అయితే మాత్రం ఎట్టా పంపాలనుకుంటున్నావే కాత్యా సిగ్గులేకుండా?” అంది కోపంగా… అమ్మ మొఖం ఎఱ్ఱబడింది… “నాకూ… ఇష్టం లేదే… కానీ…” అంటూ… అమ్మ… వీళ్ళు అంటూ పూర్తి కాని మాటలూ.. కన్నీళ్ళూ రెండూ మింగింది. “చాల్లే ఊర్కో…” అంటూ అమ్మని కసిరి తన వైపుకి తిరిగి… “నేను నీలాగా విషం మింగలేదు… పారిపోయి వచ్చేసా కాపురం చేసి తీరాల్సిందే అని హింసించిన… శిక్షించిన నాన్నని ఎదిరించి… మీ తాతను బెదిరించి… షరతులతో కాపురానికి వెళ్ళా” అంది రుద్దమైన గొంతులో తన తల నిమురుతూ ఆ క్షణాల్లో అమ్మమ్మ ఎంత అద్భుతమైన మనిషిగా ఎంత అందంగా కనపడిందనీ… తాను ఎంత ఆరాధనతో అమ్మమ్మని చూసిందనీ? యాభై ఏళ్ళ క్రితం అమ్మమ్మ ఇంత రెబెల్ గా ఉందా?” అమ్మమ్మ… “ఎప్పుడూ నీ కథ చెప్పలేదే మాకు?” అంది తను కోపంగా అలకగా. “ఎంత సేపూ వంటలెలా చేయాలి? కాపురాలు ఎట్టా చేయాలి? మొగుళ్ళనెలా సుఖ పెట్టాలి? అత్త మామలకు సేవలు ఎట్టా చేయాలి? లాంటివి తప్ప… ఇట్లాంటి గొప్ప విషయాలు ఎందుకు చెప్పరు మీ పెద్దవాళ్ళు…?” యామిని కూడా కోపంగా అడిగింది అమ్మమ్మను. “మీ అమ్మకు చెప్పేదాన్నే… అది బాగా దిగులుగా ఉండేది… చాలా సార్లు ఏడుస్తూ ఉండేది… మీ నాన్నకూ… నానమ్మకూ చెప్పాల్సింది నా కథ అసలు…” అంది నాన్నను ఓరకంట చూస్తూ అమ్మమ్మ. నాన్న ఖంగారు పడి నేల చూపులు చూసాడు… నానమ్మ కోపంగా మొఖం తిప్పుకుంది. “ఇప్పటికైనా ఏమయ్యిందే మహీ… ఆలోచించుకో బాగా… నాకైతే నువ్వెళ్ళటం ససేమిరా ఇష్టం లేదు…” అంది ఖచ్చితంగా.
“బుద్దీ… గ్నానం లేని మూర్ఖులంతా కలిసి దాని కాపురం చెడగొట్టేసేటట్టు ఉన్నారు… చావండి” అంటూ నానమ్మ కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. “పరువు పోతున్నది తలెత్తుకోలేకండా ఉన్నాం మహిమని పంపండి” అని అత్తయ్య పోరుతూనే ఉంది. కొడుకు కూరంగా కోడల్ని రేప్ చేసినప్పుడు పోలేదు పరువు. అది అవమానం కాదు. కొడుకు కోడల్ని రేప్ చెయ్యడం అనేది కొడుకు దౌష్ట్యం కాదు… తమ పెంపక లోపమూ కాదు. అది కొడుకు మగతనం… సరసం… శృంగారం…
మొత్తానికి సంసారం. కానీ… గాయపడ్డ అవమానపడ్డ కోడలు దాన్ని ఎదిరించి, ప్రశ్నించినందుకు, తన దేహమూ… జీవితం మీద తనకు మాత్రమే అధికారం ఉందని చెప్పి ఆత్మగౌరవ ప్రకటన చేసినందుకు మాత్రం వాళ్ళకి తలవొంపులుగా పరువు పోయినట్లుగా ఉంది. ఎంత అన్యాయం? హింసే… అహింసగా… అన్యాయం… న్యాయంగా… నేరాన్ని భర్తన్న పేరుతో అధికారికంగా చేయడం దానికి వీళ్ళందరి ఆమోదం రక్షణ దొరకడం… అదీ స్త్రీల నుంచి అన్నీ అవసరాన్ని బట్టి… స్థానాన్ని బట్టి…? చరణ్ పురుషుడైపోయి తాను స్త్రీ అవటం మూలాన్నా… ఈ వివక్షంతా? తను కేస్ వేస్తే భర్త దారుణంగా రేప్ చేసాడని… నో అని చెప్పినా వినకుండా బహుశ భర్త రేప్ చేసాడంటావేంటి… పిచ్చా అని నవ్వి జడ్జి కూడా కొట్టివేస్తాడేమో జడ్జి పురుషుడైతే. జడ్జి స్త్రీ అయితే ఏమవుతుంది? ఏమో స్త్రీ అయినా ఆమె తన నానమ్మ… అత్తయ్య ఆడబిడ్డలాంటిదో అయితే… ఖచ్చితంగా “భర్త సంసారం చేస్తుంటే నోర్మూస్కుని సహకరించాల్సింది పోయి రేప్ చేసాడంటూ సిగ్గులేకుండ బజారుకెక్కుతావు… కథలు చెబుతావు….” అంటూ కేస్ డిస్మిస్ చేసి “ఫో… పోయి భర్తతో బుద్దిగా సంసారం చేసుకో… భర్తను ఆనందపరిచి కాపురం నిలబెట్టుకో…” అని కేస్ డిస్మిస్ చేస్తారేమో… ఎవరూ… ఆఁ… ఏగ్నెస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి భర్తమీద తన ఒంటి మీద రక్తగాయాల సాక్షిగా కంప్లైంట్ చేయడానికి వెళ్ళినపుడు అన్నట్లుగా “భర్తె రేప్ చేసాడని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తావా సిగ్గులేదూ? నీ భర్త వేశ్యల దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికే సెక్స్ కోసం వస్తున్నందుకా ఈ పొగరు? ఫోమ్మా… పోయి నీ భర్తకు కావల్సిన విధంగా తృప్తి పరుచు ఫో… అలా చేస్తే ఎందుకు కొడతాడూ ఫో” అని తరిమేసినట్లు తనను పంపేసి ఉండేవారు, పగలబడి నవ్వేవారు. అయినా తను కంప్లైంట్ ఇస్తా అంది.. అంత మత్తులో బాధలో కూడా పదే పదే అడుగుతూ పోయింది.
కానీ అత్తయ్య మామయ్య కాళ్ళా వేళ్ళా పడ్డారట. అత్తయ్య వెళ్ళి నానమ్మ కాళ్ళమీద పడిపోయిందిట. “దీం తర్వాత పెళ్ళికి యామిని ఉంది. ఇదొక్కతే లేదు కేసు.. వద్దు ఏం వద్దు మళ్ళీ కాపురానికి పంపవా ఏమిటి” అని కేసు పెట్టనివ్వలేదు. కనీసం ఆత్మహత్యకు కారణం అయ్యాడన్న ఆలోచననీ అణిచివేసారు మొసలి కన్నీళ్ళతో.
ఇంట్లో చర్చలు, రాద్దాంతాలు, ఆరోపణలు, కన్నీళ్ళూ… ఏ నిర్ణయానికి రాకపోవడం. అత్తయ్య, చరణ్, ఇంట్లో నానమ్మ సాధింపులు. “రేపిస్టుతో కాపురం చేయనని” తనూ… వీటిన్నింటి మధ్యా కాలం బరువుగా… చిరాగ్గా… ఆందోళనగా సాగిపోతున్నప్పుడు యామినికి మంచి సంబంధం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మా నాన్నా ఆశపడ్డారు.
కానీ యామిని తనకు జరిగింది చూసాక… తన జీవితం చూసాక… పెళ్ళంటేనే భయపడసాగింది. చరణ్ తనని పశువులా రేప్ చేసాక తనకు తీవ్రంగా రక్తస్రావం అవడం. రెండు కుట్లు వేసేంతగా తన వెజైనా చీలిపోవడం. రక్తసిక్తం అయిన తన బట్టలు… దేహం… ఆత్మాహత్య ప్రయత్నం… లైజాల్ తాగడం వలన గొంతు పేగులు దెబ్బతిని… తిన్న తిండి వాంతులు చేస్కోడం… డిప్రెషన్… మత్తుమందులు వాడుతూ పీనుగులాగా మారిపోవడం ఇవన్నీ యామినిలో విపరీతమైన భయాన్ని పెంచసాగాయి. ‘మహీ… ఆ రాక్షసుణ్ణి క్షమించకు’ అంది ఏడుస్తూ. ‘నేనసలు పెళ్ళే చేసుకోను’ అని కూర్చుంది. ‘పెళ్ళంటే ఇదా మనసు… దేహం… జీవితం అన్నీ ఛిద్రం అవడమా.. మనిషి ఆశాంతం కుప్పకూలి జీవితం ఆగిపోవడమా’ అన్న దిగ్ర్భాంతిలో ఉండిపోయింది. “అందరూ అట్టా చరణ్ లాగా ఉండరే యామీ భయపడమాకు” అని అమ్మమ్మ, అమ్మా, నాన్నా చెప్తూ వస్తున్నారు “కావలిస్తే పెళ్ళికి ముందే అబ్బాయితో ఒకటికి నాలుగు సార్లు కలుస్తూ మాట్లాడు…” అంటూ యామిని ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. “మంచి సర్కారీ నౌఖరీ… వదులుకోడం అంత బుద్ది తక్కువ పని ఇంఛాహకటి లేదు” నానమ్మ ఖంగారు పెట్టేస్తోంది… –
“యామీ… చరణ్ మొరటువాడు, పశువు కానీ అందరూ అలా ఉండరు. నా ఫ్రెండ్ మౌక్తిక తెలుసుగా ఆమె భర్త… కౌశిక్ ఎంత మంచి వాడో తెలుసా…? తను భయపడుతుందని ఒంటిమీద చెయ్యి వేయలేదు. మౌక్తికను మేరేజీ కౌన్సిలర్ దగ్గరికి తీస్కెళ్ళి కౌన్సిలింగ్… థెరపీ ఇప్పించి తనూ కౌన్సిలింగ్ తీస్కోని, తన భయం పూర్తిగా పోయాకే… అది ‘ఎస్’ అని చెప్పాకే ఆమెకు దగ్గరయ్యాడు. మళ్ళా వాళ్ళది లవ్ మేరేజీ కూడా కాదు. తన తల్లిదండ్రులు కొడుకు జీవితం నాశనం అయ్యిందనీ… పెళ్ళైనాక కూడా కొడుకుకి సంసార సుఖమే లేకుండా పోయిందని గొడవ చేసినా… మీ అమ్మాయి సంసారానికి పనికి రాదు విడాకులు కావాలి అన్నా… “ఇది మా ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం… టైం పడితే పడుతుంది… మేం చూసుకుంటాం.
“మీ జోక్యం అవసరం లేదు” అని ఖచ్చితంగా చెప్పి వాళ్ళందరి నోళ్ళు మూయించి, మౌక్తికను బెంగుళూరు తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఇప్పుడు మౌక్తిక ఎంత సంతోషంగా ఉందో తెలుసా… మొన్నే మెయిల్ చేసింది కూడా… ఆలోచించు యామీ… కౌశిక్ లాంటి మంచి వాళ్ళూ ఉంటారు” తన ఒళ్ళో తల పెట్టి తను చెప్తున్నది వింటూ యామిని దీర్ఘమైన ఆలోచనలో పడిపోయింది. “ఒక పని చేయి… పోనీ అతన్ని ఒకటి రెండు సార్లు లేదా నీకు నమ్మకం కలిగేంత వరకూ కలిసి మాట్లాడుతూ ఉండు… గమనించు. సెక్స్ పట్ల.. సెక్స్ లో పార్టనర్ ఫీలింగ్స్ పట్ల అతని అభిప్రాయాలేంటో… సున్నితత్వమూ గౌరవమూ ఉన్నాయో లేవో… అవి జెన్యూనో… కాదో తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకో” అంది తను. యామిని ఒక్కదుటున లేచి తన ముఖంలోకి ఉద్వేగంగా చూస్తూ… “యూ మీన్… డేటింగ్ చేయమనా అతనితో” అంది కళ్ళు విప్పార్చి. “తప్పేం ఉంది? నేను చరణ్ణి చేస్కునే ముందు డేటింగ్ చేసి అతనేంటో అర్థమయ్యాకే చేస్కోవాల్సింది” అంటున్న తనను గట్టిగా కౌగిలించుకుంది యామిని.
అన్నట్లే యామిని… కిరలు మధ్య… మధ్యలో చాలా సార్లు కలుసుకున్నారు. యామిని కుదుట పడసాగింది. మెల్లగా కిరణ్ కనెక్ట్ అవడం తను గమనిస్తున్నది. “కిరణ్ చాలా మంచివాడు మహీ… అతనికి సెక్స్… పెళ్ళి మెంటల్ రిలేషన్లిప్స్ మీద మంచి హెల్దీ ఆలోచనలు ఉన్నాయి. ఒక్క పురుషుడికే కాదు, సెక్స్ లో సహ భాగస్వామ్యం, ఆనందం స్త్రీలకీ ఉండాలి. ఆ రైట్ వాళ్ళకీ ఉంది. భార్యతో సెక్స్ చేయడానికి భర్తకి ఆమెనించి సంపూర్ణాంగీకారం ఉండాలి” అంటాడు. “ఐ లైక్ ఇట్ మహీ” అంటుంది మెరుస్తున్న కళ్ళతో. “హౌ లక్కీ యూ ఆర్” అంటూ తను యామినిని సంతోషంగా కౌగలించుకుంది. ఎంతగా రిలాక్స్ అయ్యిందో తను కిరణన్ని ఇష్టపడుతున్న యామినిని చూసి.
“కానీ మీ ఇంట్లో మీ అక్కెందుకు కాపురానికి వెళ్ళటం లేదు? మీ అక్క కాపురానికి వెళ్ళాకే యామినిని చేస్కుంటారట. అది ఆలోచించుకో ముందు… యామినికి పెళ్ళి కుదిరింది అని ఓC… సంతోషపడడం కాదు యామి బతుకు నీతో ముడిపడి ఉంది మరి” నానమ్మ ఎకసెక్కంగా అంటోంది. “అవును మహీ అయితే ఇది కిరణ్ మాట కాదు. వాళ్ళ పేరెంట్స్ మాటలు అమ్మా.. నాన్నతో కూడా వాళ్ళు మాట్లాడారట. మన పెళ్ళికి… అక్కతో ఏం సంబంధం అన్ని గట్టిగానే అడిగాను కిరణ్ ని” అంది యామిని మెల్లగా. ఆ రోజు బాల్కనీలో తీరిగ్గా కూర్చున్నప్పుడు “కిరణ్ నీ విషయం సెటిల్ అయ్యేంత వరకూ ఆగుతానంటున్నాడు మహీ… వాళ్ళ వాళ్ళతో గట్టిగానే మాట్లాడుతున్నాడు” అంది యామిని తన పక్కనే కూర్చుని తన చేతులు నిమురుతూ లాలనగా. ఆ మర్నాడు ఇంకో ఆర్నెల్ల వరకూ ముహూర్తాలు లేవనీ వచ్చే నెల పెళ్ళి చేసి కొడుకుని కలకత్తా ఉద్యోగానికి పంపేయాలన్న పట్టుదలతో ఉన్నారని అమ్మా, నాన్నకి చెప్పారట కిరణ్ అమ్మా నాన్న.
“కిరణ్ కి వేరే సంబంధాలు కోటి రూపాయల కట్నంతో బోల్డన్ని వస్తున్నాయట మన యామిని చాలా నచ్చి వేరే అమ్మాయిల్ని ఒప్పుకోవటం లేదట కిరణ్. అదీగాక కట్నం కూడా తీస్కోవట్లేదు… ఆలోచించండి వాళ్ళెప్పుడు పెళ్ళి చేద్దామంటే వప్పుకొందాం చేసేద్దాం. ఈ మహి విషయం ఏ కాలానికి తెల్లారాలీ ? కిరణ్ కూడా తన అమ్మా నాన్నకి ఎంతకని చెప్పుకుంటాడూ మహి కోసం యామి పెళ్ళి ఆలశ్యం అవ్వాల్సిన అవసరమే లేదు” నానమ్మ ఖచ్చితంగా తేల్చి చెబుతోంది.
“అమ్మా… పోనీ నేను హాస్టల్లో ఉంటాను… యామిని పెళ్ళి చేసెయ్యండి” అంది తను. అమ్మ కళ్ళ నీళ్ళు నింపుకుంటూ.. ఒద్దంటూ భోరున ఏడుస్తూ… అమ్మమ్మా,యామీ, నాన్నా కూడా ఒద్దు ఒద్దంటూ ఏడ్చేసారు. ఒక్క నానమ్మ మాత్రం “ఆ వెళ్ళేదేదో మొగుడింటికే పోతే మా పురువూ నిలబడుతుంది కాదూ… అహఁ వెళ్ళనంటావూ… ఫో… పోయి… హాస్టల్లో నన్నా ఉండు… పుట్టింటిలో ఉండబాకు నీ వల్ల చెల్లి పెళ్ళి కాదు… చెల్లి పెళ్లినాక అప్పటికి తిరిగి వద్దువు” అన్నది నిష్కర్షగా… ఎటో గాల్లోకి చూస్తూ. ‘నేనొప్పుకోను.. మహి ఎక్కడికీ వెళ్ళదు అన్నీ ఒప్పుకుంటేనే చేస్కుంటాము అని చెబ్దాం” అంది అమ్మ గట్టిగా ఏడుస్తూ… “అసలు మీరు నా పెళ్ళి గురించి ఆలోచించకండి మహి విషయం సెటిల్ అయ్యేదాకా నేను పెళ్ళి చేస్కోను. మహిని బాధ పెట్టకండి ఇదే నా నిర్ణయం” యామి గట్టిగా అరుస్తూ అని ‘ఇప్పటికి మహి నా గురించి చేసిన త్యాగం చాలు’ అని భోరున ఏడ్చేసింది. తన మీద వాలిపోతూ. ,
పోనీ… పోనీ చరణ్ మారాడేమో మొన్న నాకు ఫోన్లో “అంకుల్ మహిని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పమనండి నేను ఆమె నమ్మకాన్ని సాధిస్తాను ఈ సారి” అని మెసేజ్ పెట్టాడు… వాళ్ళ పేరెంట్స్ కూడా “ఇప్పుడు చాలా మారిపోయాడు… మునుపటి ఆవేశం తొందరపాటు లేవు పంపండి మహిమను ప్లీజ్ అంటూ ఫోన్లలో బ్రతిమిలాడుతున్నారు” గిల్టీగా తలవంచుకుని… తన కళ్ళల్లోకి సూటిగా చూడలేక నేల చూపులు చూస్తూ నాన్న… “అదేగా నేనూ చెప్పింది…? విడాకులు తీస్కుని ఇంకోణ్ణి చేస్కున్నా వాడూ ఇట్టా మొరటుగా ఉండబోడని ఏఁవిటీ నమ్మకం? అయినా విడాకులైన వాడే… మొదటి పెళ్ళాన్ని విసిగించిన వాడేగా దీనికి రెండో పెళ్ళికి దొరికేది” అంది నానమ్మ… నాన్న మాటలతో కొండంత బలం వచ్చినట్లు… తన దార్లోకి వస్తున్న కొడుకు వైపు బోల్డంత ప్రేమతో చూస్తూ. “ఏం విడాకులు తీస్కుంటే నువ్వూర్కో” యామిని నానమ్మను గట్టిగా కసిరింది. అప్పటికే ఒకసారి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చింది నాన్నకి తన మీద దిగులుతో… “మొన్న కిరణ్ వాళ్ళ మేనత్త ఫోన్ చేసి మీ పెద్ద మనవరాలు భర్త రేప్ చేసాడని అతగాడ్ని వదిలేసిందిట కదా… ‘ఎవరైనా భర్త రేప్ చేసాడని అంటారాండీ’ అన్నప్పట్నించీ నాకు యామి పెళ్ళిమీద బెంగట్టుకొంది” నానమ్మ అన్నది.
ఆ రాత్రి తన కంటి మీద కునుకు లేదు. నిద్రమాత్రలకు కూడా నిద్ర పట్టలేదు. యామిని అమాయకంగా నిద్రపోతున్నది పక్క మంచం మీద. ఎంతటి హుందాతనం ప్రదర్శిస్తున్నది.. తనెక్కడ బాధ పడతానో అని… అక్క సెటిల్ అయ్యేదాకా తను పెళ్ళే చేస్కోనని అంటుంది. తను సెటిల్ అవడం అంటే… చరణ్ ని ఒప్పుకొని రాజీపడిపోవడం… లేక విడాకులు తీస్కోవడమా? ఒక రేపితో రాజీపడ్డం ఏమిటీ? తన వల్ల కాదు. ఖచ్చితంగా విడాకులే తీస్కుంటుంది. కానీ విడాకులకు ఇంకో ఎనిమిది నెలలు ఆగాలి. సంవత్సరం పూర్తవ్వాలి. పెళ్ళైన ఆరు నెలల తర్వాత విడిగా ఉండచ్చు పడకపోతే అప్పటికి కానీ విడాకులు సాధ్యం కావు. అలాగని చర లో రోజూ ఉండడం తన వల్ల కాదు. అప్పటి దాకా ఎక్కడికైనా వెళ్ళిపోయి చెల్లి పెళ్ళైనాక తిరిగి వస్తే? కిరణ్ పేరెంట్స్ కి తను అత్తారింట్లో ఉన్నానని చెప్తే సరిపోతుందేమో? ఏం చెయ్యటం? చెల్లి పెళ్ళి కోసం బిపిన్ చంద్రని వదులుకుంది. నాన్న చనిపోతానన్న కారణం కూడా ముఖ్యమైనది అయినప్పటికీ… ఇలాగే నిలబడితే… చెల్లి పెళ్ళి అయ్యేదాకా…? మొన్న కిరణ్ వాళ్ళ మేనత్త కూడా నానమ్మతో వికారంగా మాట్లాడిందట. “అక్క ఇలా ఉంది మరి చెల్లెలా ఉండ బోతుందో.. మావాడు చెయ్యేసినా రేప్ అంటే మా వాడేం కావాలి” అందిట నానమ్మ చెప్పింది. చెల్లి పెళ్ళైనాక తన పేరు మీద చెల్లినిలాగే వేధిస్తారులా ఉంది. తనకు జరిగింది విని కిరణ్ చాలా బాధ పడ్డాడట. తన వలన యామి పెళ్ళి డిస్టర్బ్ కావడం ఏమిటి? వచ్చే నెలలోనే ఉన్నాయట ముహుర్తాలు ఇంకో ఆర్నెల్ల వరకూ లేవట. వాళ్ళు తొందరలో ఉన్నారు పోనీ తను తాత్కాలికంగా చరణ్ దగ్గరికి వెళ్ళి ఉండి చెల్లి పెళ్ళి అయ్యాక తిరిగి వస్తే..? చెల్లి అత్తారింటి వాళ్ళు నెమ్మదిస్తారు లేనిపోని ప్రశ్నలతో యామినిని వేధిస్తున్నారు కిరణ్ ని కూడా. చరణ్ దగ్గరికి వెళ్ళడం ఎంత వరకూ సమంజసం… మనసు ఇంతగా నెగటివ్ గా మారాక? ఒక క్షణం అయినా అతను పక్కనుంటే భరించలేదు. అలాంటిది అతనింట్లో ఉండడం ఎలా… కానీ చెల్లికోసం ఈ తాత్కాలిక ఏర్పాటు.. ఒప్పందం తప్పదు. ఇంత జరిగాక తన ఒంటి మీద చెయ్యి వేసే సాహసం చేస్తాడా? పైగా తను వెళ్ళడం వాళ్ళకీ అవసరం. చరణ్ కోసమే కాదు పెళ్ళి కావల్సిన చరణ్ చెల్లెలి కోసం. .
చెల్లికోసం వెళ్ళి ఉంటుంది తను… ఇంకో రెట్లెళ్ళల్లో విడాకులకు అప్లై చేస్తుంది కదా… వెళ్ళాలా… వద్దా… ఎంతకీ తెమలని మీమాంసలో తెల్లారింది.. మహీ… మహీ అంటూ అమ్మ ఏడుపు వినిపిస్తోంది. ఖంగారుగా గది బయటకు వెళ్ళితే నాన్న ఒళ్ళంతా చమటలలో కుప్పకూలి పోయి ఉన్నారు. తను వెంఠనే అంబులెన్స్ కి ఫోన్ చేసింది. నాన్నకి ఏమాత్రం స్టెస్ లేకుండా చూస్కోమన్నారు కార్డియాలిజస్ట్. ఈసారి హార్ట్ ఎటాక్ వస్తే బతకడని చెప్పారు. వారమయ్యాక డిశ్చారి అయ్యారు నాన్న. “నీ వల్లే… ఇదంతా. వాణ్ణి బతకనిచ్చేట్లు లేవు’ నానమ్మ దెప్పి పొడుస్తోంది.
తను చరణ్ దగ్గరికి… చెల్లికి కిరణ్ తో పెళ్ళి రెండూ అయిపోతే నాన్నకి బోల్డంత ప్రశాంతత. నాన్నకేమైనా అయితే అమ్మ ఏమై పోవాలి? తను వెళ్ళాల్సిందేనా ఇంటి బయటకు? హాస్టల్ కి వెళితే నాన్న భరించలేడు. చరణ్ మారాడని నాన్న నమ్ముతున్నాడు అంతగా ఫోన్లు చేస్తూ… తను లేనప్పుడు వచ్చి నాన్నను కలుస్తూ మెప్పిస్తున్నాడు నానమ్మను కూడా.
“రాత్రి యామిని పెళ్ళై కిరణ్… మహి… చరణ్ ఒకేసారి అత్తారిళ్ళకు వెళ్ళినట్లు కల వచ్చింది” ఉదయమే వేడి వేడి టీ తాగుతూ తోటలో కూర్చుని అమ్మతో చెప్తున్న నాన్న మొఖంలో సంతోషం చిరునవ్వుగా విచ్చుకుంటుంది. ‘అట్టాగే అవుతుంది లెండి… మీరు ఆలోచించకండి టీ తాగండి’ అమ్మ అంటుంటే… ఆ దృశ్యం మనోహరంగా కన్పించింది. ఆడపిల్లలు ఇళ్ళల్లోంచి వెళ్ళిపోతే ఇంత ప్రశాంతంగా ఉంటారా తల్లిదండ్రులు అని అనిపించింది. ఇంత హింస పడ్డాక కూడా… ఎంత విచిత్రం.. ఆడపిల్లల భద్రత దుర్మార్గమైన అత్తింట్లో ఉందా? తనకు మనోహరంగా కన్పిస్తున్న ఈ దృశ్యం వవెనకాల దుర్మార్గమైన కథ గురించి ఎవరికైనా పట్టింపు ఉంది?
“నాన్నా రేపు ఉదయం చరణ్ణి, అత్తయ్య వాళ్ళను పిలిపించండి మాడాలి.. వెళతాను కానీ కొన్ని కండిషన్స్ రాసి కాగితం మీద సంతకం తీస్కుందాం” అంది తను. నాన్న మొఖంలో ఆనందం. యామిని నానా గొడవ చేసింది. “నువ్వు నా కోసం చరణ్ దగ్గరికి వెళతాననడం ఏమిటి? మళ్ళీ అతనలా చేయడని ఏంటి గారంటీ… తర్వాత అసలు రంగులు బయటపడుతాయి. నువ్విక్కడే ఉన్నా నా పెళ్ళి జరుగుతుంది. నిన్ననే వాళ్ళు ఎవరు చెప్పు… అన్నా పట్టించుకోకు ఒద్దు… వెళ్ళొద్దు… నువ్వెళ్ళడం ఏంటి మహీ…” యామిని నిర్ఘాంతపోయింది.
“నీ పెళ్ళి కోసం కాదు యామీ… ఇప్పుడు నాన్న ప్రాణాలతో ఉండటమే నాకు ముఖ్యం” అంది తను నిశ్చయంగా యామిని ఓదారుస్తూ… ‘చెయ్యి త్యాగాల మీద త్యాగాలు నాన్న ప్రాణం… నా పెళ్ళి అంటూ బిపిన్ చంద్రని కాకుండా చరణ్ణి చేస్కుని నీ జీవితం నాశనం అయిపోయింది చాలదూ” అంటూ యామిని కుమిలి కుమిలి ఏడుస్తున్నది. నాన్న కళ్ళల్లో కూడా నీళ్ళు… చెంపల మీదుగా కారిపోతున్నవి. రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేస్తూ ‘మహీ నన్ను క్షమించు’ అని ఏడ్చేసారు నాన్న. “ఒద్దే మహీ… నా మాట విను తర్వాత పశ్చాత్తాప పడతావు” రాత్రి వచ్చిన అమ్మమ్మ ముక్కు చీదుతూ అన్నది. వాళు వచ్చారు.
“తను వస్తుంది… కానీ చరణ్ తనను ముట్టుకోకూడదు… తనకిష్టం లేకపోతే అతను హద్దు మీరితే మరుక్షణం వెళ్ళిపోతుంది” అని రాసిన కాగితాల మీద సంతకాలు తీస్కుంది. అత్తయ్య కోపంతో ఎర్రబడ్డ ముఖంతో “అయితే మా వాడితో కాపురం చెయ్యవా?” అంటూ అరిచింది. “ఈ కండిషన్స్ ఏంటి… మేం బాగా చులకన అయిపోయాం మీకు” అంటూ మామయ్య మండి పడ్డారు. ‘ఏడ్చినట్లే ఉంది ఇంత అవమానమా” ఆడబిడ్డ సురేఖ… ఆమె భర్త రాజేష్ చిరచిరలాడారు. చరణ్ వాళ్ళందర్ని నెమ్మదింప చేసాడు. కాగితాల మీద రెండు కుటుంబాల వాళ్ళు సంతకాలు చేసారు చరణ్, తను కూడా.
“మహిమ గారూ మీరు ఇలా వెళ్ళడం బాగోలేదు… మేం ఎవరినీ పట్టించుకోవద్దు మీరెలా మా పెళ్ళికి అడ్డమో నాకు అర్థం కావట్లేదు” కిరణ్ బాధగా అన్నాడు. “నాన్నకోసం వెళుతున్నా బాధ పడకండి కిరణ్” నవ్వుతూ అన్నది తను. కోపంతో రుసరుసలాడుతున్న యామిని “మహీ ఇది నీ ఆత్మగౌరవ సమస్య కాదా’ అంది. ‘కాదు…” అంది తననే దీనంగా చూస్తున్న నాన్నవైపు చూస్తూ. వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ రాత్రి అమ్మమ్మ వళ్ళో పడుకుంది. “నేనిలాగే కాగితాల మీద షరతులతో వెళ్ళి కాపురం చేసాను. మీ తాతని భయంలో పెట్టాను. తర్వాత నేను కాపురం చేయగలిగాను. దానికోసం నేనెంతో ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సి వచ్చింది మహీ… కానీ నువ్వు ఈ కాలపు పిల్లవి. నాకు తెలుసు చరణ్ నీకు దాంపత్య జీవనం ఇక ఏమాత్రవూ పొసగదని. నీకు ఆత్మగౌరవం ఎక్కువ… అతను నీకిష్టం లేకపోయినా బలాత్కరించాడని అవమానంతో నిన్ను నువ్వు చంపుకో ప్రయత్నించావు. అలాంటిది ఎలా ఉంటావు అక్కడ… అసలీ నిర్ణయం అవసరమా? పోనీ నాతో వచ్చెయ్యకూడదూ… మీ తాతలో ఇంకా పొగరు తగ్గలా… ఇద్దరఁవూ కలిసి సరిచేద్దాం” అంది అమ్మమ్మ దుఃఖంలో గొంతు భారం అవుతుంటే… . “నేను హాస్టల్ కో… నీ దగ్గరికో… నా స్నేహితురాలి దగ్గరికో వెళ్ళి ఉండచ్చు.
కానీ ఇప్పుడు నేను భర్తతో ఉన్నట్లు రికార్డు ఇటు కిరణ్ తల్లిదండ్రులకీ… నాన్నకీ అవసరమే మరి మరీ ముఖ్యంగా నాన్నకి… లేకపోతే నాన్న గుండె ఆగిపోతుంది. అమ్మమ్మా… నాకింకా అయోమయంగానే ఉంది కానీ… చరణ్ ని నేను నామీద చెయ్యి వెయ్యనిస్తానా… చెల్లి పెళ్ళవనీ” అంది తను చెయ్యెత్తి ఆకాశంలోని చందమామకి పోటీగా వెలిగిపోతున్న అమ్మమ్మ పచ్చటి ముఖాన్ని తన చేయెత్తి తడుముతూ… అమ్మమ్మ కన్నీళ్ళు తుడుస్తూ.. “ఉండగలవా మహిమా… బాగా ఆలోచించుకున్నావా..” వర్షా… వరద ఇద్దరిదీ ఒకటే ప్రశ్న దిగ్ర్భాంతి. “చెల్లి పెళ్ళి కాగానే బయటపడతాను అప్పటికి నాన్న దిగులు సగం తగ్గుతుంది” అన్నది తను. తన ఈ కథ అంతా విన్న లాయర్ వరద.
“అయితే నువు హైకోర్టుకు పిటిషన్ వేయచ్చు మహిమా… స్పెషల్ కేసు కింద మెంటల్ రేప్ ద సూయిసైడ్ ఎటెంప్ట్… డిప్రెషన్ పాయింట్స్ మీద నీకు చరణ్ తో భద్రత లేదు… నీ మానసిక స్థితికీ అబధ్రత ఉంది. కోర్ట్ కీ డిస్క్రిప్షన్ పవర్ ఉంది. ఖచ్చితంగా నీకు సంవత్సరంలోపే విడాకులు మంజూరు చేస్తుంది. అయితే విడిగా ఉండాలి. యామిని పెళ్ళి కాగానే బయటపడు” వరద చెప్తోంది.
నా పేరు భువన. నేనొక డైవోర్సీని. డ్రైవర్సీగానే చాలా సంతోషంగా, నొప్పి, బాధా, భయం లేకుండా ఉన్నాను. స్వేచ్ఛలోని ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతున్నాను. రెండేళ్ళ క్రితం నాకు పెళ్ళైంది. పల్లె పట్నం కాని ఊరిలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు పెళ్ళి చేసారు. చదువుకుందామన్నా నా తరువాత ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని రాజీ పడిపోయాను. నేనొక మనిషిని పెళ్ళి చేసుకున్నానని అనుకున్నాను. కానీ కాదు. తొలి రాత్రి వాడు నన్ను ఎనిమిది సార్లు అనుభవించాడు అంటే రేప్ చేసాడు. తొలిసారి దగ్గరకు తీసుకుని ముద్దు కూడా పెట్టుకోలేదు.. కౌగలించుకోనూ లేదు… నేనేంటో నా ఇష్టాలేంటో కూడా తెలుసుకోలేదు. విపరీతమైన నొప్పితో శిలలాగా అయిపోయాను. స్పృహ తప్పి పడిపోయాను.
మరునాడు ఒక వీధవతల ఉన్న మా ఇంటికి అతికష్టం మీద వెళ్ళి అమ్మను పట్టుకొని గుండెలు పగిలేలా ఏడిచాను. అమ్మా నాన్న ఇది మామూలే అన్నారు. పిన్ని ఇంటికి పారిపోయాను. నడక నరకం చూపించింది. కాళ్ళు ఎడం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాను. పిన్ని నిర్ఘాంతపోయింది. నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చింది తనే స్నానం చేయించింది. తొలిరాత్రి ఎనిమిది సార్లు వాడు చేసిన రేప్ కి నా దేహం రక్తమోడుతున్న మాంసపు ముద్దలా మారిపోయింది. పిన్ని ఇచ్చిన పాడ్స్ కాళ్ళ మధ్యన పెట్టుకున్నా. పిన్ని ఇచ్చిన మందులు వేస్కొని ఇంత తిని పడుకున్నా. నిద్ర లేచాక ఇక మళ్ళీ పోనని ఏడిచా. అమ్మా, నాన్న, అన్న వచ్చి నన్ను బలవంతంగా ఈడ్చుకుపోయారు. వాడికి అప్పచెప్పారు. వాడు మళ్ళీ నన్ను నిర్దాక్షిణ్యంగా రేప్ చేసాడు. రేప్ నా జీవితంలో భాగమై పోయింది. ఇంటి పని, వంట పని చేయడంతో పాటు అంతే మామూలుగా రేప్ చేయించుకోవడం కూడా ఒక పని లాగా మారిపోయింది. రేప్ లేని పగలు రాత్రి నా జీవితంలో లేకుండా అయిపోయింది. ఇక పగలు, రాత్రీ తేడా లేకుండా తన సెక్స్ అవసరం ఒక హక్కుగా నా మీద అత్యాచారాలు చేయడం అతనికి మామూలు అయిపోయింది. నాకు మాత్రం పడక గది ఒక వధ్యశాల… కసాయి ఎట్లా పదునైన… ప్రత్యేకమైన కత్తితో మేకలను కోస్తాడో నా భర్త కూడా అంతే, అతని పురుషాంగం ఒక కత్తి… పగలెప్పుడు పడుకున్నా ఒక ఐదు నిమిషాలు కూడా నిద్ర రాదు. నిద్రలో… మగతలో కూడా అతను నన్ను రేప్ చేస్తున్నట్లే దేహమంతా భగభగమనే మంటతో మెలకువ వచ్చేస్తుంది. నా కల ఎప్పుడూ ఒకటే… అతను… ఒక మృగమై నన్ను రేప్ చేస్తుంటాడు. నేను ప్రతిఘటిస్తుంటాను లేదా ఆ గది తలుపులు తెరిచి భయంతో బయటకు పారిపోతుంటాను. సెక్స్ లో భయంకరమైన, వికృతమైన ధోరణులు బలవంతంగా తిడుతూ… కొడుతూ ఓరల్, యానల్ సెక్స్ బలవంతంగా మార్చి మార్చి చేస్తాడు… మంచం మీది నుంచి లేవనివ్వడు… వాష్ చేస్కుంటానన్నా… మూత్రం పోసుకుంటానన్న పోనివ్వడు. పైగా “నువ్వు నొప్పితో అరుస్తుంటేనే నాకు కిక్కొస్తుంది” అంటాడు ఆ రాక్షసుడు.
‘నేను సంపాదించి నిన్ను పోషిస్తున్నా… నీ అన్ని అవసరాలు తీరుస్తున్నా… నువు నా కోరిక తీర్చి తీరాలి కాదనడానికి ఎంత ధైర్యం నీకు… నా కోరిక తీర్చకపోతే ఇంట్లోంచి మెడ బట్టి గెంటేస్తా ఏఁవనుకున్నావో’ అంటాడు. అన్నట్లే చేసాడో రోజు. ఆ రోజు యానల్ సెక్స్ కి ట్రై చేసాడు… నన్ను మంచం మీద బోర్ల పడేసి భయంతో అరుస్తున్న నా మీద పిడిగుద్దులు గుద్దుతున్నాడు. నేల మీద పడిపోయా నేను. నా పెనుగులాటలో నా కాలు అతని మొఖానికి తగిలింది. ఆగ్రహంతో ఊగిపోయాడు ‘లంజా… మొగుడి కోరిక తీర్చవానే నువ్వు…’ అంటూ… చచ్చేట్టు కొట్టాడు. కాళ్ళతో చేతులతో… ముఖం
మీద ఊసాడు, మెడబట్టి ఇంట్లోంచి బయటకు గెంటేసాడు. “ఫో ముండా నా ఇంట్లోంచి…” అంటూ బయట భోరున వాన పడుతున్నది. నా కన్నీళ్ళు.. పెదవి చిట్లి కారుతున్న రక్తం వాన నీళ్ళల్లో కలిసిపోయాయి… ఎక్కడికి వెళ్ళాలి?
ఎదురింటి సుబ్రమణ్యం కిటికీ తలుపు వారగా తెర్చుకుంది. మళ్ళీ చటుక్కున మూస్కుంది. కిటికి తలుపు మూసింది మటుకు సుబ్రమణ్యం భార్య వారిజ ‘మనకెందుకండీ’ అంటూ. ఇంతలో పక్కింటి సృజన తలుపు తెర్చుకుంది.. అది మూసుకోలేదు తెర్చుకున్న తలుపుల్లోంచి సృజన నా వైపుకి వచ్చింది. వెనక నుంచి “మనకెందుకే వాడసలే దుర్మార్గపు ముండా కొడుకు” అంటున్న భర్త మాటలు పట్టించుకోకుండా… “ఎందుకు భరిస్తావు చెప్పు…? వెళ్ళిపో ఇంకా పిల్లలు పుట్టలేదు కదా… పిల్లలున్నా ఇంత హింస రోజూ భరించడం ఎంత కష్టం భువనా… ఎందుకు కొడతాడసలు” అంది కోపంగా సృజన. కన్నీళ్ళు.. వర్షపు నీళ్ళు తుడుచుకుని, నేను బట్టలు మార్చుకున్న… తల తుడుచుకుని కూచున్నాక పెదవి మీద మందేదో రాసింది. ఎందుకు కొడతాడో చెప్పాను నేను. బయట ఆకాశంలో మబ్బులు పగిలిపోతున్నాయి అన్నట్లు ఉరుములు పిడుగులు. సృజన నిర్ఘాంతపోయి వింది. “వీడు సెక్స్ పర్వర్డ్ భువనా నువ్వు అమ్మ నాన్నకు చెప్పు లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు భరించాల్సిన అవసరమే లేదు” సృజన కళ్ళ నీళ్ళతో ఆరాటంగా నా గడ్డం పట్కొని అడిగింది. ఆ రాత్రి వేడి వేడిగా నూడుల్స్ చేసిచ్చింది.
“నీతో మీ ఆయన ఎట్టా ఉంటాడు? సెక్స్ అంటే ఇట్టానే ఉంటుందా… అదే మా ఆయన చేసినట్లు… వికారంగా…” సిగ్గుపడుతూ… బాధగా అడుగుతున్న నన్ను చూసి సృజన “అతడూ ప్రయత్నం చేసాడు నాతో.. కానీ నేను జరగనివ్వనుగా… ఖచ్చితంగా ఉంటాను” అంది. “ఖచ్చితంగా అంటే…” నేనడిగాను ఆత్రంగా “ఒద్దంటాను. వేరే గదిలో పడుకుంటా. మా అమ్మా నాన్నలకు… వాళ్ళమ్మ నాన్నలకు చెప్తానంటాను” అంది సృజన. “కొట్టడా” అన్నది తను ఆశ్చర్యంగా… “కొట్టనివ్వను… పిచ్చి భువనా నేను మహిళా సంఘాలు పెట్టే మీటింగ్ లకు వెళ్తుంటాను. నా ఫ్రెండు ఇంటికి తీస్కోస్తాను. ఆ స్పృహ కలిగిస్తా అతనికి నువ్వు వస్తావా నా ఫ్రెండ్స్ దగ్గరికి? ఇదిగో ఈ కార్డ్ ఉంచుకో నీ దగ్గర” అంది. నా చేతిలో ఒక కార్డు పెడుతూ సృజన బీఎస్సీ.. బీఎడ్ చేసింది. గవర్నమెంటు స్కూల్లో టీచరు… ఎంత ఆత్మవిశ్వాసం సృజన మొఖంలో… బహుశ అది చదువు… ఉద్యోగం వలన వచ్చిందా… రెండూ ఉన్న వాళ్ళు కూడా ఎంత మంది మొగుళ్ళు చేతుల్లో చావుదెబ్బలు తింటం లేదు… చచ్చేదాకా కొడితే సచ్చిపోతూనో… లేదా చచ్చేదాకా దెబ్బలు తింటూనో బతికెయ్యటం లేదు… ఊహూ… ఇంకేదో కావాలి ఇంత సాహసం కావాలి అంటే. వెళ్ళిపోతే… విడాకులు తీస్కుంటే అమ్మా నాన్న ఊర్కుంటారా? నాన్న ఇప్పటికీ అమ్మను కొడుతూనే ఉంటాడు… మొగుణ్ణి విడిచి నేను వెళితే తననీ కొడతాడు మొగుడికీ… తండ్రికీ మధ్య నా బతుకిట్టా తెల్లారాల్సిందేనా? – నేనింకా లేవలేదు… నా మొగుడు సృజన ఇంట్లోకి తాళం విసిరేసి పోతుంటే… “ఏం అలా హింసిస్తున్నావు ఎవరూ లేరనుకున్నావా… ఖబడ్డార్” అంటూ అరుస్తున్న సృజనను నిర్లక్ష్యంగా చూస్తూ.. వంకరగా నవ్వుతూ బండి స్టార్ట్ చేసి వెళ్ళి పోయాట్ట.
ఆ చిత్రహింసల కొలిమిలోకి మళ్ళీ ఎట్లా వెళ్ళను? సృజన స్కూలుకి వెళ్ళాలి తప్పదు… వెళ్ళేముందు… తాళం తీసే ముందు ఎంత నరకయాతన అనుభవించానో… ఏదో భయం, నొప్పితో కూడిన వింత అనుభూతి… గుండెలు దడదడలాడాయి.. తాళం తీసే వేళ్ళు ఒణికిపోయాయి. “ఈ లెక్క చేయకపోతే రేపు కూడా ఇదే శిక్ష” అని మళ్ళీ అదే కష్టమైన లెక్క ఏం వగా ఇచ్చే లెక్కల మాష్టారి… దగ్గరికి వెళ్ళబోయే ముందరి భయం… తాళం తెరిచి పడక గదివైపు చూస్తుంటే గుండె పగిలిపోతుందేమో అన్నంత భయం… హాల్లో సోఫాలో పడుకుని చాలా సేపు ఏడుస్తూండిపోయాను. రాత్రి వచ్చాడు… నేను మళ్ళీ వాడికి బలిచ్చుకున్న మేకను అయిపోయాను. ఈ సారి పారిపోయే ప్రయత్నం చేయలేదు శిలలా పడి ఉన్నాను. ఇది పెళ్ళి కాదు. మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు. అతను కనీసం నాతో మాట్లాడడు. నా గురించి ఆలోచనన్నా చేస్తాడా లేదో… తెలీదు. ఒకవేళ ఆలోచించినా ఈ రాత్రి ఏ పద్ధతిలో సెక్స్ చేయాలి అని ఆలోచిస్తాడేమో? నేను అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినా వినేవాడు కాదు. అతను హింసకు నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. తన వెజైనా ఎప్పుడూ పచ్చిగానే ఉ ండేది. మూత్రంలో మంటతో.. జ్వరంతో నరకం అనుభవించేది. డాక్టరు ప్రతీసారి ‘నీ భర్తను కొన్ని రోజులు దూరం పెట్టమ్మా’ అనేది. ‘వినడంటే …. ‘నువ్వే పుట్టింటికి వెళ్ళిపో’ అనేది. పుట్టింటి కెళ్ళితే నాలుగు రోజులు గడువు దాటిపోతే వచ్చేసి తీస్కెళ్ళిపోయేవాడు. వంటకు కష్టంగా ఉంది అంటూ ఒంటికి కష్టంగా ఉంది అని చెప్పలేక. డాక్టర్ మాట వినేవాడు కాదు. ఆవిడ ఫోన్లో చెప్పేది. ‘వయోలెన్స్ ఎక్కువగా ఉంది ప్రమాదం ఆమె హెల్త్ పాడయ్యింది పిల్లలు పుట్టడం కష్టం ఏమనుకుంటున్నావు.. కేసు పెడితే జైలుకి పోతావు’ అని కోపంగా చెప్పినా వినేవాడు కాదు. తనసలు తప్పు చేస్తున్నట్లు ఒప్పుకునేవాడు కాదు. నాకు గర్భం వచ్చింది. అయినా నన్ను వదలలేదు బాగా కొట్టేవాడు. పొట్ట మీద దెబ్బలు పడుతుంటే నరకం కనిపించేది. వద్దు వద్దంటుంటే ‘ఏం కాదు… ఏం కాదన్నానా’ అంటూ ప్రతిఘటించే కొద్దీ అసలెందుకు వద్దంటావే నువ్వు… ఎవడైనా ఉన్నాడా నీకు” అంటూ రేప్ చేస్తాడు… ‘బిడ్డకేమైనా అవుతుంది’ అన్నా వినేవాడు కాదు… ‘ఎంత సేపూ సాకులు వెతుకుతావేమో లంజా’ అంటూ రేప్ చేసేసి లేచి తననో చెత్త బుట్టలా కాలితో పక్కకి తన్నేవాడు… ‘లే… ఫో’ అంటూ. ఒక పక్క వేవిళ్ళు… వాంతులు ఇంకో పక్క వీడి హింసలు ఎక్కువైపోయాయి. ఆ హింసల్లో.. ఒక రోజు అబార్షన్ అయిపోయింది. ఆ రాత్రి వద్దన్నా మూడు సార్లు రకరకాల పద్ధతుల్లో యూ ట్యూబ్ చూస్తూ సెక్స్ చేసాడు… కాళ్ళ మధ్య నుంచి పిండం బుళు క్కుమని పడిపోయింది.. పరుపంతా రక్తం. నాకు స్పృహ తప్పింది. హాస్పిటల్లో “కాలు జారి పడింది బాత్రూంలో” అని చెప్పాడు ఆ నీచుడు… అత్తా మామ ఒకటే తిట్లు ‘ఇంత అశ్రద్దా…’ అంటూ నిజం ఎలా చెబుతుంది అసలు… కానీ చెప్పేయ్యాలి… సృజన పోరుతూనే ఉంది. ఒక రోజు ఇంటికి వచ్చింది. ‘డాక్టర్ సెక్స్ కి దూరముండమని… కడుపులో పాపకీ తల్లికీ ప్రమాదం అని చెప్పినా మీ కొడుకు వినేవాడు కాదు. మొన్న ఒక్క రాత్రి మూడుసార్లు చేసాడు…’ కోపంగా అర్చినట్లే చెప్పింది అత్తకి. ఆమె నిర్ఘాంత పోయి వెంఠనే ‘వాడు మగాడు… దీనికి బుద్ధి ఉండడూ… ఒద్దనాలి… వేరే గదిలోకెళ్ళి పోవాలి. తనను తాను రక్షించుకోవాలి… చేతకావద్దూ’ అంటూ సమర్థించుకుంది.
అబార్షన్ అయిన వారం రోజులకే మళ్ళీ సెక్స్ కావాలంటూ వేధించడం మొదలెట్టాడు. ‘ఎన్ని రోజులాగాలి? అబార్షనంటారా దీన్నసలు? ఇది నెలవారీ లాగా మాత్రమే అయ్యింది. దానికి ఇంత నాజూకు వేషాలు వేస్తావా?’ అంటూ ఆ రాత్రీ అతను నన్ను అనుభవించాడు. మళ్ళీ రక్తస్రావం అయ్యింది. తెల్లారి పుట్టింటికి పారిపోయాను. వారం తర్వాత వాళ్ళు నన్ను మళ్ళీ నా మొగుడి దగ్గరికి గెంటేసారు… ‘ఎన్నాళ్ళుంటావు’ అంటూ… తిరిగి ఇంటికొచ్చిన నన్ను ‘దిక్కు లేని దానివి తెలుసుకో నా ఇల్లే నీకు దిక్కు’ అంటూ చెంపలు పగలు గొట్టాడు. పెద్దమ్మ… చిన్నమ్మ… అన్నా వదినా… తాతయ్య అందరికీ చెప్పా ఉ ండలేనని… వచ్చేస్తాననీ కొన్ని రోజులు ఆశ్రయం ఇమ్మని… “ఇలానే ఉంటుంది సంసారం అన్నాక సర్దుకు పోవాలి” అంటూ ఎవరూ నన్ను ఓదార్చలేదు, రా బిడ్డ అనలేదు.
మూడుసార్లు అతడు చెప్పుకోలేని పద్ధతుల్లో సెక్స్ చేస్తేనే గర్భం పోయిందని అమ్మ నాన్నకి చెబితే నమ్మడే నాన్న? “అదంతా అబద్దం చెవుతున్నది మొగుడంటే ఇష్టం లేకపోతే ఇట్టాగే చెప్తారు. ముందు దాన్ని దింపిరా మొగుడింట్లో.. అల్లుడు ఇప్పటికే చాలా సార్లు ఫోన్లు చేసాడు” అన్నాడు నాన్న. ఇక నావల్ల కాలేదు.. దింపడానికి వచ్చిన అన్నయ్యను కూర్చోబెట్టి ‘ఉండరా టీ చేస్తాను’ అంటూ బాత్రూంలోంచి హార్ఫిక్ తెచ్చి అన్నయ్య ముందే గుటగుటా తాగేసి స్పృహ తప్పాను. మళ్ళీ ఆసుపత్రిలోనే కళ్ళు తెరిచాను. వెంఠనే తెచ్చారు కాబట్టి బతికిపోయాను. సృజన తన ఇంటికి తీస్కెళ్ళింది భర్తమీద డీవీఏక్ట్ పెట్టమన్నది… కేసు తనే దగ్గరుండి ఫైల్ చేయించింది. డీవి ఏక్ట్ కి భయపడి మ్యూట్యువల్ గ్రౌండ్స్ మీద విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు…” చెప్పడం ఆపేసిన భువన దీర్ఘ శ్వాస తీస్కుని అందర్ని చూసింది.
మహిమతో పాటు అందరూ ఈ కథ తర్వాతి నిశ్శబ్దానికి అలవాటు పడ్డ వాళ్ళలా చూసారు. ఆ నిశ్శబ్దాన్ని తన మాటలతో ఛేదిస్తూ అనుపమ గొంతు సవరించుకుంది. “నా కథా దాదాపు ఇదే… కాకపోతే నాకు పిల్లలు పుట్టేసారు. అదీ పెళ్ళైన ఆరు ఏళ్ళల్లో ఇద్దరు పిల్లలు….
రోజులో ఎప్పుడైనా… ఎవరున్నా, లేకున్నా మెన్సస్లో ఉన్నా, గర్భమా… ప్రసవం అయి… పచ్చి బాలింతనా, జ్వరమా ఏదీ అవసరం లేదు అతనికి… సెక్స్ కావాల్సిందే… నేను ఇవ్వాల్సిందే. తిరస్కరించినా తిట్లూ…. దారుణమైన దెబ్బలు… నోరుమూసి అరవకుండా తొడపాశం పెడతాడు… రొమ్ముల చనుమొనల మీద కొరుకుతాడు… పసిబిడ్డల తాగాల్సిన పాలను తను తాగేసేవాడు మీద పడి… పసి పిల్లలకు పాలు లేక గుక్కపట్టి ఏడ్చినా ఒదిలేవాడు కాదు. అతను బెడ్ మీద ఎలా ఉండే వాడంటే… అడవిలోకి వచ్చిన క్రూరమైన సింహం తన ఇష్టమైన జంతువుల మీద దాడి చేసి… హింసించి రక్తం తాగి వెళ్ళిపోయినట్లుండేది… అదే వాడి దృష్టిలో సెక్స్ అంటే. అతనితో నేను సెక్స్న తిరస్కరించినపుడల్లా నాకూ… నా పిల్లల అవసరాలకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఒక్కోసారి పప్పు బియ్యం… గోధుమ పిండి… గేస్ కూడా ఉండేవి కావు… కొనడానికి డబ్బులిమ్మనో …. లేదా అతన్ని సరుకులు తెమ్మనో అడిగితే “సెక్స్ కి ఒప్పుకుంటేనే నీకూ… నీ పిల్లలకి తిండీ బట్టా గుర్తుకు పెట్టుకో” అని బెదిరించి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేవాడు. అంటే నా ఇంట్లో నాకూ, నా పిల్లలకు సెక్స్ అనేది తిండీ, బట్టా, గూడూ రోటీ, కప్ ఔర్ మకాన్ ఇచ్చే పెట్టుబడి అన్నమాట. ఏం చేయాలి? అతని సెక్స్ హింసకు ప్రతిఘటించకుండా ఉండాలా.. నా పిల్లలకు తిండి కోసం, బాధ్యత కోసం? నేను వినకపోతే రక్తాలు కారేలా కొట్టేవాడు. పిల్లలు బిక్కసచ్చిపోయి ఏడుస్తూ ఉండేవాళ్ళు. అతడు నన్ను రేప్ చేసాక చాలా రోజులు రక్తస్రావం అయ్యేది. నా భర్తకు నేను సెక్స్ ఇవ్వకపోతే పిల్లలకు కూడా తిండి పెట్టనిచ్చేవాడు కాదు. పిల్లల్ని శిక్షించేవాడు. సెక్స్ కి ఒప్పుకోకపోతే వదిలేస్తా లేదా విడాకులిస్తానని బెదిరించే వాడు. నన్ను రేస్ చేసేసి మంచిగా బెడ్ మీద హాయిగా నిద్రపోయేవాడు. నాతో అంత దారుణం చేసాక, అంత ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది అతనికి” ఎలా సాధ్యం అసలు అయినా… హృదయం ఉంటే కదా అతనికి? ఒక రోజు పిల్లలు కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషను చేస్కున్న మూడోరోజు సెక్స్ చేసాడు.
ఒక రోజు పీరియడ్స్లో వద్దన్నా బలవంతంగా రేప్ చేసాడు. బట్టలు… నా శరీరం… పరుపూ రక్తం కారిపోయింది. కుట్ల దగ్గర నుంచి రక్తం, వెజైనా నుంచి రక్తమే. నా మెదడు నొప్పితో చిట్లి పోయింది. సహనం పూర్తిగా నశించిపోయింది. అలానే లేచి నా బట్టలు కూడా సరిచేస్కోకుండా రక్తశికమైన బట్టల తోటే పిల్లల్నేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాను. ఆ రోజు అక్కడ ఒక స్త్రీల సమస్యల పై పని చేసే స్వచ్ఛంద సంస్థ ఉంది. వాళ్ళు నన్ను, నా ధైర్యాన్ని చూసి అభినందించారు. నా ఫోటోలు తీసుకున్నారు. నాకు వెంఠనే ట్రీట్మెంట్ ఇప్పించారు.
కానీ పోలీసులు భర్తతో రాజీ పడమ్మా ఇద్దరు పిల్లలున్నారు. పెద్దగా చదువు లేని దానివి’ అంటే… ‘రోడ్లూడ్చి అన్నా బతికించుకుంటా కానీ వాడి దగ్గరకు పోను’ అన్నాను. బంధువులకి తెల్సింది. “నాటకాలు ఆడుతున్నది. భర్త పరువు తీయడానికా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది… భర్తమాట వినకుండా అయ్యింది. దాన్ని బాగా చితక్కొట్టి దార్లోకి తెచ్చుకోరా…” అని నా భర్తకి సలహా ఇచ్చారు. నేను స్వచ్ఛంద సంస్థ సంరక్షణలోకి వెళ్ళిపోయాను. నా భర్తతో సంసారం చేయనని చెప్పి వచ్చేసాను” అంటూ అనుపమ ముగించిన తర్వాతి నిశ్శబ్దంలో ఈసారి ఎవరి మాటలూ కొనసాగలేరు.
“అసలు మనతోటి రెండు వైపుల బంధువుల అంటే అమ్మ, నాన్న అన్న.. అత్త మామ ఆడబిడ్డ, భర్తల భాష ఒకేలా ఉ ంటుందనుకుందాం కానీ… పోలీసులు కూడా అలానే మాట్లాడతారు ఎందుకు? బాధతో, కన్నీళ్ళతో ఆందోళనతో శరీరం మీద గాయాలతో తమ దగ్గరకు వచ్చిన స్త్రీలతో. ఎంత సేపూ భర్త చెప్పినట్లు నడుచుకోమని, అతనికి కావాల్సినట్లు సుఖ పెట్టమని వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళకుండా, మన దగ్గరికి భర్తలు సెక్స్ కోసం రావటం మన అదృష్టమనీ… ఎందుకు పోలీసుల భాష కూడా ఇలానే ఉంటుంది ఆడ పోలీసులు కూడా అలానే మాట్లాడతారు ఎందుకు?” అనుపమ ప్రశ్నలకు అక్కడ ఉన్న వాళ్ళంతా సాలోచనగా తలలూపారు. “ఎందుకంటే పోలీసు వ్యవస్థను తయారు చేసింది రాజ్యమే కదా… రాజ్యం పునాది ఫ్యూడలిజం కదా… రాజ్యభాష… ఆధిపత్య భాష… మగ భాష పోలీసులకీ అదే వస్తుంది… ఒట్టి లొంగుబాటు భాష ఆడ పోలీసులా… మగ పోలీసులా అని ఉండదు.. వాళ్ళను నడిపించే పితృస్వామ్య భావజాలం ప్రకారం వాళ్ళు మాట్లాడతారు” వరద అంటోంది.
బాగుంది మేడం… బాగుంది అనాలా వద్దా! నిత్యం బయటకి రాని ప్రతి పగలు రాత్రి జరిగే ఆధిపత్య అత్యాచారాలను కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాదు… చదువు ఉదోగ్యం కంటే మనిషి చైతన్యమే వారి సంకెళ్లను తెంచుకొడానికి పనికొస్తున్నదని పాత్రలతో చెప్పించడం, సమాజం ఎప్పుడు ఆధిపత్యపు భావజాల ముసుగు మూసలో నడుస్తుంటే,,, దానిలో వ్యవస్థలు కూడా ఆ దారిలోనే పయనిస్తాయని సూటిగా చెప్పారు…
మాటలు రావడం లేదు🙏
Thanks githa garu
చాలా విన్నాను.. చూశాను కూడా.. చైతన్యం అవసరమే కానీ వారికి భరోసా ఇచ్చే వారు కావాలి..
అవును జ్వలిత గారూ…
దూరమైన శ్రమసంబంధాలు , జీవితంలో సృజనాత్మకతకి దాని వ్యక్తీకరణ కి అవకాశం లేకపోయి మూర్ఖత్వపు అధిపత్యంతో మిడిసిపడే మ( మృ) గాడికి అబల వలే కన్పించే స్త్రీ ఒక దగ్గరి అవకాశం. భయమేసింది చదువుతుంటే …, కానీ అది వాస్తవం. ఎలా మారుతుందో ఈ స్థితి అనే దానికి మాత్రం దగ్గరలో ఆశలు లేవు.
Thanks sir
చాలా బాగా చూపించారు మగ దౌర్జన్యం. సమాజం లో కూడా పెళ్లి పేరుతో జరిగే ఈ దౌర్జన్యం ఆపే ప్రయత్నం చేయరు.