మీలో వొక సూర్యుడు
మీలో వొక చంద్రుడు
మీలో వొక సముద్రం
మీలో వొక తుఫాను
మీలో వొక సుడిగాలి
పుస్తకాలు పూసిన చేతుల్తో
అక్షరాలు కాసిన చూపుల్తో
సకులం ముకులం వేసుకున్న
వొక దేశంలా
నాముందు కూర్చుంటారు
భూమి ఆకలి తీర్చే తపస్సు మునిగిన
విత్తుల్లా
నా ముందు కూర్చుంటారు
మీ ముఖంలో
ముకుళిత తోటల నవ్వులు !
మీ మాటల్లో
మనస్సున్న పరిమళాలు
మౌనంగా వ్యాపిస్తుంటాయి
మీ కళ్ళల్లో
నక్షత్రాలు తుళ్ళుతుంటాయి
మాసిన వజ్రాల్లారా!
మీ అడుగులు
ఆధునిక దీర్ఘకావ్యాలై
నలిగిన కాలం చెట్టును
నగిషీలు పడ్తుంటాయి
చిటపట చిందుల చినుకుల్లా
మీరే వానలైనట్టుంటారు
గలగల ఊగే మొక్కల్లా
మీరే పంటలైనట్టుంటారు
ఈ తండాల మీంచి
ఈ పల్లెల మీంచి
ఈ ఎండిన బతుకుల మీంచి
చెమట బిందువుల్తో విరిసిన
చెరగని సింగిడీలై ప్రవహించి
ఈ మట్టి
ఈ మనిషి
గాయాల్ని మాన్పే
మహా వైద్యుల్లా కన్పిస్తుంటారు.