విజి తుకుల్ కోసం…

అది పగలో, రాత్రో, మిట్ట మధ్యాహ్నమో తెలియదు
ఊపిరి బిగబట్టుకున్న భయోద్విగ్న కాలం
కాలం గడ్డకట్టిన క్షణాలు
తలుపుల చివర వీడ్కోలు ఘడియలనీ
వీధి మలుపున ముసురుకున్న జ్ఞాపకాలనీ
నిస్సహాయంగా వదిలేసి వచ్చిన చూపులనీ
నిశ్శబ్దంగా ఈడ్చుకుపోతూ
భారమైన సముద్రాలని
భుజంపై సంచీలో మోసుకుంటూ
దిక్కులు తోచని దారులలో
గమ్యం తెలియని చీకటిలో
పలాయితుని పయనం

సోలో, జోగ్జకార్తా, మగెలాంగ్, జకార్తా, పొంటియినాక్,
టాంగేరాంగ్, బాండుంగ్, కలిమంటాన్
ఒక చోటునుండి మరొక చోటుకు
ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి
ఒక వేషం నుంచి మరొక మారు వేషంలోకి
పేర్లు మార్చుకుంటూ,పోలికలు మార్చుకుంటూ..
ఏదీ స్థిరంగా కనిపించదు
వెంటాడే నిఘా నేత్రాల పహరా నుంచి
తప్పించుకునే నిరంతర చలనం తప్ప

మాటల దేముంది?
అవి మనిషికీ, మనిషికీ మధ్య వంతెనలు
అప్పుడప్పుడూ వంతెనలు కూలిపోతాయి
ఆశ్రయం తీసుకున్న చీకటి గదిలో ఒంటరితనం
ఎప్పటికీ దాటలేని నదిలా విలపిస్తుంది
పలకలేని మాటలు
మౌనంగా నదిని దాటించే పడవలుగా మారిపోతాయి

చూపులదేముంది?
వర్ణమయ దృశ్యానికి నేత్రఫలకమొక ప్రతిబింబం
వేసుకున్న రంగులు వెలిసిపోతాయి
చిత్రహింసలో చిట్లిన కనుపాపపై
నెత్తురు శాశ్వతంగా చీకటిలా పరుచుకుంటుంది
చూపు కనిపించని కళ్ళలో కలలు
దారి చూపించే దీపాలవుతాయి

రూపానిదేముంది?
గుర్తుపట్టకుండా వేషం మార్చుకున్న బహురూప విన్యాసం ఒక ముసుగు
ముసుగులు తొలగిపోతాయి
రూపాలు, ఆనవాళ్లు చెరిగిపోతాయి
జాడ తెలియకుండా మాయమైన మనిషి రూపాలు
అంతుతెలియని అగాధాలలోకి అదృశ్యంగా దొర్లిపోతాయి
మరుగున పడిన మనిషి రూపాన్ని జ్ఞాపకాలే
వెలుగులో నిలబెడతాయి

అక్షరాలదేముంది?
అవి కదలని చెట్టు కొమ్మలపై వాలిన పక్షులు
గాలిలో మేఘాల వలె ఊహలు చెదిరి, ఎగిరి పోతాయి
పంజరంలో పక్షిలా
ఒంటరితనం మనిషిని చుట్టుముడుతుంది
గోడలపై మొలకెత్తిన అక్షరాల ధిక్కార స్వరం
లావాన్* కవిత్వమై ప్రతిధ్వనిస్తుంది

(*విజి తుకుల్ ఇండోనేషియా కవి, కళాకారుడు, కార్యకర్త. నియంత సుహార్తో పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. సైనిక అధికారుల దాడి నుంచి తప్పించుకోవడానికి 1996 ఆగస్టులో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 1998 మే నెల తర్వాత తన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. సైనిక పాలనలో మాయమైపోయిన మనుషుల జాబితాలో చేరిపోయాడు. ‘హెచ్చరిక’ అనే తన కవిత ‘లావాన్ (తిరగబడు)’ పిలుపుతో ముగుస్తుంది. ఆ కవిత ఆనాటి ప్రజా ఉద్యమంలో చాలా ప్రాచుర్యం పొందింది)

విజి తుకుల్ గురించి మరిన్ని వివరాలు, కవితల అనువాదం కోసం ఇక్కడ చూడండి. https://kolimi.org/?p=5746

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply