శూన్యం
ఎల్లెడలా ఆవరించినప్పుడు
చిర్నవ్వు సంగీతమై వాళ్ళుంటారు.
దారులన్నీ మూసుకుపోయి
ఉక్క పోస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు
ఒక లేత సమీరమై ఊపిరి పోస్తూ
వాళ్ళుంటారు.
నమ్మకాలు
గాలి బుడగలై పేలిపోతూ..
విషపు తెమ్మెరలు
ప్రాణ వాయువుని కొంచెం కొంచెం హరిస్తున్నప్పుడు,
అమ్మలా ఆదరిస్తూ
వాళ్ళుంటారు.
వాళ్ళు తోడొస్తారు.
ప్రాణం బహుమతిగా ఇచ్చి
మనలనో ఇంద్రధనుస్సు చేస్తారు.
ఎండిన
ఎడారి మీద
కుండపోత జల్లుతో
వాళ్ళు అనవరతం మురిపిస్తారు.
బొగిలిన
గుడిశ మీద
కొత్త చొప్ప నీడై
పల్లె మొగదాల్లో కాపుగాస్తారు.
పస్తులతో
దొర్లే కుండల్లో
అమృతపు గంజిబువ్వయి
మనకో బతుకుని వాగ్దానం చేస్తారు.
వాళ్ళు
రాతల్లోకి కుదించలేని
ప్రాణ రహస్యం అవుతారు.
మనల్ని
ఆయుధాల్లేని యుద్ధంలోకి నెట్టి
తమాషా చూసే
తుంటరి నక్కల నుంచి
అదాటున గుంజి
వాళ్ళు
స్నేహ స్తన్యం ఇచ్చి మన నవ్వుని చూసి మురుసుకుంటారు.
అమ్మల్లాంటి వాళ్ళు.
తోబుట్టువులని మించి తోడుండేవాళ్ళు.
ఇచ్చిన ప్రాణం కోసం
కొనకంటితో కూడా చూడని వాళ్ళు.
లెక్కలు వేసి బారలు చాపని వాళ్ళు
వేకువ పొదుగులో
అమ్మ కొంగు నీడలో
హస్తం సాచిన వాళ్ళు.
వాళ్ళుంటారు.
వాళ్ళు
ఉంటూ వుంటారు.
వాళ్ళు ఉండాల్సిందే.
అవునూ..
వాళ్ళ కోసం
మనం ఏం చేశాం?
అవును వాళ్ళ కోసం వేలకన్నుల్లో వత్తులేసుకొని దీపాలయాల్ల ఎదురు చూస్తున్నారు. అద్భుతమైన కవిత అభినందనలు