ఎక్కడికో పోయిన…
ఎప్పుడో పోగొట్టుకున్న తప్పిపోయిన నవ్వులివి!
అమ్మా నాన్నల నవ్వులు..
మతిమరుపు కమ్ముకుని,
జ్ఞాపకాల్లోంచి మరుగున పడిపోయినవి పిల్లలు గుర్తుకు తెచ్చినప్పుడో
అర్థం కాని జోక్ అర్థం చేయించినప్పుడో
ముసలితనాన చుట్టంలా వచ్చేసే అల్జీమరో ..
డేమన్షియా భయాల్లోంచి వాళ్ళను వాళ్ళు బయటపడేసుకోడానికో…
జీవించడం మరిచిపోయి వృద్ధులైపోయిన పిల్లలను తేలిక పరచడానికో…
వాళ్ళలా నవ్వుతారు!
ఆ నవ్వుల ముందు చందమామా, వెన్నెలా… తోటలోని పూవులూ, కోయిల పాటలు ఏపాటివని?
బ్రతుకు గర్భంలో ఏళ్లకేళ్లుగా ఈది ఈది
పుట్టిన పసివాళ్ళు కాదూ వాళ్ళిప్పుడు..
అందుకే ఆ పసినవ్వులు!
ఎక్కడివీ నవ్వులు వీళ్ళకి ?
కన్నవాళ్ళు ఏమిచ్చారని?
మనవళ్లను చూసి మురిసిపోతూ ముసి ముసి నవ్వులు నవ్వుతుంటారు?
వొంట్లోని శక్తీ సారం .. చెమటా.. రక్తం అంతా పిల్లల కోసం ధారపోసాక
దేహాన్ని షుగరూ, బీపీ, గుండె జబ్బులూ కమ్ముకున్నాక ..
నడవలేక నడిచే కాళ్ళు
ఓపికే లేని చేతులు
ప్రేమ నిండిన బిడ్డల పలకరింపుల కోసం ..
వేసారిన ఎదురు చూపులతో
కన్నీటి సముద్రాలు కేటారాక్ట్ పొరలుగా మారాక.. మసకబారిపోయిన కళ్ళతో..
మనసు నొప్పించే మాటల్ని వింటూ చెవుడై పోయిన చెవులతో…
‘అబ్బ ఉరుకో..మాట్టాడకు
కృష్ణా రామా అంటూ ఓ మూలన కూర్చో…’లాంటి కసుర్ల మధ్య
మాటలు మాయమై మూగవై పోయిన పెదాలతో..
వాళ్ళు అమ్మ నాన్నలు…
మన నిర్లక్ష్యాన్ని దాచుకునే నవ్వులు నవ్వుతారు
సంతోషాన్ని నటిస్తూ… నవ్వుతారు.
ఏ ప్రేమ రాహిత్యాల్లోనో నరాలు వడలి
తీగలు తెగిన వీణలా వణికించే పార్కింసన్స్ లోకి దిగిన నీరసపు దేహాలతో…
తీరం దాట బోతున్న నావలు మంద్రంగా నదిలో నాట్యం చేస్తున్నట్లుగా వాళ్ళు…
ఇలా పసినవ్వులతో వెన్నెల అద్దుకున్న చందమామల్లా
చీకటి ఆకాశాలను వెలిగించే మెరుపుల నవ్వులు నవ్వుతారు.
తమకు ఏమీ తెలీదంటూనే… ఏమీ చేయలేదంటూనే…
ఈ అమ్మ నాన్నలు మొత్తం భూగోళపు బరువును మోసేస్తూ తేలికగా నవ్వేస్తూ ఉంటారు.
ఎప్పుడైనా కూతుళ్లు.. వృద్ధాశ్రమాల్లో ఎందుకని చేయి పట్టుకుని తమ ఇళ్ళకి తీసుకెళుతున్నప్పుడు..
కూతుళ్ళలాంటి కోడళ్లు గోరు ముద్దలు తినిపిస్తున్నప్పుడు.,
వాళ్ళు అమ్మ నాన్నలు
వాకిట్లో ఎండలో మెరిసిపోయే బంతిపూవుల్లా నవ్వుతారు !
వాళ్ళు… అమ్మ నాన్నలు..
నిదానంగా జీవితం వైపు చూస్తూ ప్రేమగా వీడ్కోలు నవ్వులు నవ్వుతారు.
రంగులు మారుతూ…నవ్వలేకపోతున్న మనల్ని చూస్తూ
వాళ్ళు .. నొప్పిని దాచుకునే నవ్వులు నవ్వుతారు.
రాలబోయే పువ్వు గాల్లోకి వదిలే చివరి పరిమళంలా నవ్వుతారు !
ఆరిపోబోయే ముందరి దీపపు నవ్వులు నవ్వుతారు.
సరిగా చూసారా లేదో వాళ్లెప్పుడూ కడసారి నవ్వులే నవ్వుతారు.
నువ్వూ-నేనూ చేయాల్సింది
ఆ నవ్వుల్ని అరువు తీసుకుని బతకడమో…
వాళ్ళ ఎండిపోయిన పెదాలకి మరిన్ని
నవ్వుల్ని అతికించడమో…
ఏదో ఒకటి చేయాలి !
జీవితాన్ని ఇచ్చిన వాళ్ళకి పోనీ… మంచి మృత్యువైనా ఇవ్వాలి.
ఏదో ఒకటి… కానీ చేయాలి !!
(ఈ కవిత కి ప్రేరణ గుంటూరులో ఉండే నా ఫ్రెండ్ రాజ్యలక్ష్మి గారు. తను పంపిన తన చిరునవ్వులు నవ్వుతున్న అమ్మ నాన్నల ఫోటో! అందమైన ఈ ఫోటోని చూసిన వెంటనే మనసులో వెన్నెల చల్లదనం నిండి నట్లై ఎంతోమంది అమ్మా నాన్నల మొఖాలు కళ్ళ ముందు కనిపించాయి. నవ్వుతూ బాధతో ముకుళించుకు పోతూ నన్ను కదిలించాయి. కానీ ఇక్కడ ఉన్న అమ్మానాన్నల ఫొటోలో అమాయకమైన పసి నవ్వులు వెంటనే నాలో ఏదో కొత్త సంతోషాన్ని ఇచ్చాయి. వాళ్ళ మొఖాల్లో ఆ నవ్వుల్ని పూయించినది కూతురిగా తానే… వృద్ధాప్యంలో అమ్మ నాన్నలను పసివాళ్ళల్లాగా భద్రంగా చూసుకుంటున్న రాజ్య లక్ష్మికి నా ప్రేమ)