తొడ కొట్టి
సవాలు చేయాల్సిదాన్ని
తొడపాశంతో వదిలేయమంటారు
చెమడాలొలిచి
తాట తీయాల్సిన దాన్ని
చెంప దెబ్బతో సరిపెట్టమంటారు
నిలదీసి
సూటిగా ప్రశ్నించాల్సినదాన్ని
మనకెందుకులే అనుకుని
గమ్మునుండమంటారు
ఎట్లాగూ గొంతు పెగలని కాలం
యుద్ధం పాదమ్మోపని నేల
పిరికివాళ్ల రుతువు
దేబిరించే సమయం
కనీసం వాక్యాన్నయినా
వింటినారిలా సంధించి
ఆధిపత్యాన్ని బద్దలు కొడదామంటే
నినాదమై చెలరేగాల్సిన గొంతుకు
పిరికి మందు నూరుతున్నారు
ఫిరంగిలా పేలాల్సిన పదానికి
పిల్లి కూతలు నేర్పుతున్నారు
తలవొంచిన వాక్యం కన్నా
తల తెగుట మేలు కదా
వంగిపోయిన వెన్ను కన్నా
వట్టి వరిదుబ్బు నయం కదా
వట్టి వరి దుబ్బే నయం
చాలా బావుంది