వంట ఇంటిలో పిల్లి ఏమి చేయగలదు?

(గీతాంజలి కథ “ఎ క్యాట్ ఇన్ ద కిచెన్” పరిచయం)

ప్రముఖ రచయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) ప్రజ్ఞావంతురాలు, చేయి తిరిగిన రచయిత్రి అని ఈనాడు కొత్తగా చెప్పవలసిన అవసరమేమీ లేదు. ఆమె కవిత్వాన్ని ఎంత చిక్కగా పండిస్తారో, కథలనూ అంత ఆకట్టుకునేలా చెబుతారు. ‘ఆమె అడవిని జయించింది’ లాటి తొలి నవల నుండి, ‘బచ్చేదాని’ కథలు, ‘పహెచాన్’ కథలు, ‘హస్ బెండ్ స్టిచ్’ కథలు, ‘పాలమూరు వలస జీవిత చిత్రణలు’- ఏది రాసినా సామాజిక సంక్లిష్టతల మూలాలని పట్టుకోవటానికి ప్రయత్నించారు. మనుషుల పై ముఖ్యంగా స్త్రీల పై అమలవుతున్న హింస, అణచివేతలను చిత్రించారు. ఆధిపత్యా లను ప్రశ్నించారు. పాలమూరు లాంటి ప్రాంతాలపై చూపిస్తున్న నిర్లక్ష్యం, వివక్షలను ఆర్ధిక సంఘర్షణలను ఎత్తి చూపారు. ప్రతికూల పరిస్థితులలో ఆధునిక భావజాలం అలవరచుకోవటానికి అస్తిత్వ పోరాటం చేస్తున్న స్త్రీ ఆమె నాయిక.
ఒక ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని, ఆలోచనా రీతిని, ప్రజాస్వామిక వాస్తవికతని ఆమె కథలు ప్రతిబింబిస్తాయి. జెండర్ స్వేచ్ఛా సమానతల కోసం పడుతున్న తపనను చూపిస్తాయి. ఆధునికత పెరుగుతున్నకొద్ది, ఆధిపత్యాలు నశించి, స్త్రీ పురుషుల మధ్య చక్కని మానవీయ సంబంధాలు వృద్ధి కావలసి వుండగా, నేటి సమాజంలో పైకి కనిపిస్తున్న మార్పుల పొరల కింద – స్త్రీల పట్ల వివక్ష, లైంగిక దోపిడి, అవమానం, అణచివేత అలాగే వుంటున్న విషయాన్నిఈమె కథలు విమర్శనాత్మకంగా వెలుగులోకి తెస్తాయి.

ఆమె కథలు తమపై అమలవుతున్న అణచివేతను ఎదుర్కొంటున్న స్త్రీల ఊర్పులు, నిట్టూర్పులు. ఓదార్పులు కూడా. ఈ కోవ లోనిదే ఆమె ఇటీవల (కొలిమి-ఏప్రిల్ 2024) లో ప్రచురించిన ‘‘ఎ క్యాట్ ఇన్ ద కిచెన్’’ కథ. ఈ కథ చదివాక ఒక విభ్రమం, ఒక అంతుచిక్కని వేదన, దాంపత్యం పేరిట సాగుతున్న అంతులేని క్రూరత్వం పట్ల జుగుప్స ఒక్కసారిగా మనల్ని ముంచివేస్తాయి. రచయిత్రి ఎన్నుకున్నకథన రీతివల్ల కథానాయికి మృణాళినితో మమేకత్వం పొందుతాము. ఇది రచయిత్రి సాధించిన గొప్ప విజయం.

మృణాళిని సాధారణ ఆడపిల్లలందరి మాదిరిగానే పెండ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలని కని అటు పుట్టిన యింటి మర్యాదను, ఇటు మెట్టినయింటి ప్రతిష్టను నిలబెట్టుకుంటూ, ఒద్దికగా కాపురం చేసుకుంటున్న స్త్రీ. అయితే భర్త ఆనంద్ కు రెండు కిడ్నీలు పాడైపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమైతే అతని రక్త సంబంధీకులు మొహం తిప్పుకోగా తన కిడ్నీదానం ఇచ్చిఅతని జీవితం కాపాడుతుంది. ఆ మహానుభావుడు మాత్రం భార్యకు వక్షోజాలు ఎదిగి లేవని, తన లైంగిక ఆనందం సంతృప్తికరంగా లేదని భావించి, మృణాళిని చెల్లెలు కృష్ణ వేణితో లైంగిక సంబంధం పెట్టుకుని ఆనందం అనుభవిస్తూ భార్యను మాత్రం ప్రతి నిమిషం అవమానిస్తుంటాడు.

అయితే అతనికి, ఇతర కుటుంబ సభ్యులందరికీ మృణాళిని చేసే అద్భుతమైన వంట కావాలి. ఆమె ఇల్లంతా నిర్వహించుకు రావాలి. అతనికి మైదానం లాటి ఆమె ఛాతీ మాత్రం వద్దు. ఎద పొంగులు బాగా వున్న కృష్ణవేణితో సౌఖ్యం కావాలి. ఇంత అన్యాయమా అని రోదిస్తున్నా మృణాళినికి ఆమె చెల్లెలు గానీ, తల్లి దండ్రులు గానీ , అత్తమామ లు గానీ ఏరకమైన మద్దతు ఇవ్వక పొగా ఆమె భర్తనే సమర్థిస్తూ తానే సర్దుకు పోవాలని చెబుతుంటారు. అనవసరంగా విషయాలని పెద్దవి జేసి జీవితం పాడు చేసుకోవద్దని, కుటుంబాలను అల్లరి పెట్టవద్దని- గుట్టుగా సంసారం చేసుకో మని పెద్దలంతా సలహా ఇస్తారు. ఒత్తిడి చేస్తారు. మానసికంగా ఒంటరిగా మారిన మృణాళిని ఆలోచనల సారమే ఈ కథ. భర్త కడుపు చీల్చి తాను ఇచ్చిన కిడ్నీని పెకలించి వేసి కానీ ఊరట పొందదు మృణాళిని.

తనను యమయాతన పెడుతున్న భర్తను ఒక స్త్రీ కత్తితొ పొడిచి చంపి వేసింది అన్నదే కథ. నేరాలు ఘోరాలు శీర్షిక కింద మనం ఎన్నోసార్లు ఇలాటి కథ చదివి వుంటాము. అయితే ఈ కథలో కథనం ఎంత గొప్పగా వుంటుంది అంటే ఈ హత్యను మనం నేరంగానో, ఘోరం గానో ఏమాత్రం భావించము. ఒక పిల్లి పరంగా మృణాళిని ఆలోచనలను తీర్చి దిద్దిన వైనం కథను ఉన్నత శ్రేణిలో నిలుపుతుంది.

వంటింటి కుందేలు అనేది అందరికీ తెలిసిన పదప్రయోగం. అలాగే “పొయ్యిలో పిల్లి లేవలేదు’’. ‘‘పిల్లి అయినా గదిలో బంధించి హింసిస్తే తిరగబడి తీరుతుంది” అనేవి మనకు తెలిసిన నానుడులు. అందుకే కథ పేరు “ఎ క్యాట్ ఇంద కిచెన్“ వినగానే ఏదో తిరుగుబాటు ధ్వనిస్తుంది. ఇక్కడ తిరగబడేది పిల్లి కాదు. పిల్లి లాంటి పిల్ల. అక్కడే ఒక మార్మికత, ప్రతీకాత్మకత ప్రవేశిస్తుంది కథలో. ఇంక కథను లోతుగా పరిశీలించే ముందు రచయిత్రి అనుసరించిన మిస్టికల్ లేక మాజికల్ రియలిజం [మార్మిక వాస్తవికత] అన్న కథన రీతి గురించి కొంత తెలుసుకుందాం.
2

మాజిక్ రియలిజం అనేది కళాకల్పన లో ఒక శైలి. వాస్తవికమైన ఒక విషయాన్ని బలంగా చెప్పడానికి మ్యాజిక్ అంశాలను ఉపయోగిస్తారు. పైకి ఒక ఫాంటసీలా అనిపిస్తుంది. కానీ అది స్వచ్ఛమైన ఫాంటసీ కాదు. మాయా అంశాలు ఉన్నప్పటికీ అది ప్రాపంచిక వాస్తవాన్నే దర్శింప జేస్తుంది. సాధారణంగా ఫాంటసీ కథలు వాస్తవికత నుండి వేరు చేయబడతాయి. మ్యాజికల్ రియలిజంలో కొన్ని భ్రాంతులను, మార్మిక అంశాలను చేర్చినప్పటికీ, అది స్వాభావిక దృక్పథాన్ని అందిస్తుంది. రూపంలో కల్పన -వాస్తవికతల మధ్య రేఖలను చెరిపి వేస్తుంది వాటి మధ్య దూరాన్ని తగ్గించి వేస్తుంది. మ్యాజికల్ రియలిజం గణనీయమైన మొత్తంలో వాస్తవిక వివరాలను కలిగి ఉంటుంది,వాస్తవిక వివరాలను ఉపయోగిస్తుంది. అందువల్ల ఫాంటసీకంటే భిన్నమైన కళా ప్రక్రియ గా ఇది పరిగణించబడుతున్నది బ్రిటిష్ నవలా రచయిత, విమర్శకుడు డేవిడ్ లాడ్జ్ మ్యాజిక్ రియలిజం గురించి ఇలా అన్నారు, “వాస్తవిక కథనంగా చెప్పబడే దానిలో అద్భుతమైన, అసాధ్యమైన సంఘటనలు సంభవించి నప్పుడు మాజికల్ రియలిజం రూపొందుతుంది.”

లాటిన్ అమెరికన్ కల్పనలో ఇది ప్రధాన కథనా రీతిగా చూడవచ్చు. ఉదాహరణకు కొలంబియన్ నవలా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ రచనలు. అయితే ఇతర ఖండాల నవలలలో కూడా ఇది ఎక్కువగానే కనిపిస్తుంది, గుంటెర్ గ్రాస్, సల్మాన్ రష్దీ, మిలన్ కుందేరా వంటి వారు ఈ ప్రక్రియను ప్రతిభా వంతంగా ఉపయోగించారు. 1949 లో ప్రచురించబడిన అలెజో కార్పెంటియర్ నవల ”ది కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్”ను తరచుగా మ్యాజిక్ రియలిజం యొక్క ముఖ్యమైన మార్గదర్శకంగా పేర్కొంటారు. గాబ్రియేల్ మార్క్వెజ్ నవల “వందేండ్ల ఏకాంతం” [వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలి ట్యూడ్ (1967)] లో ఈ ప్రక్రియ అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంది. డానికి కారణం తాను కాఫ్కా రాసిన “ది మెటామార్ఫోసిస్” ను చదవడం అని అంటాడాయన. ఆ నవల ఇలా మొదలవుతుంది: ‘గ్రెగర్ సంసా అశాంతికరమైన కలల నుండి మేల్కొన్న ప్పుడు, అతను తన మంచంపై ఒక బ్రహ్మాండమైన కీటకంగా రూపాంతరం చెందాడు.’ ఈ మొదటి లైన్ నన్ను మంచం నుండి దాదాపుగా తోసేసింది అని మార్క్వెజ్ అన్నారు. ఆయన తన అమ్మమ్మ తనకు చెప్పిన కథలను కూడా ఉదహరించాడు. “ఆమె నాకు అతీంద్రియమైన, అద్భుత మైన విషయాలను కథలుగా చెప్పింది, కానీ ఆమె వాటిని నమ్మి పూర్తి సహజత్వంతో చెప్పింది. కథలు చెప్పేటప్పుడు ఆమె తన బావ ప్రకటనలో ఏ మాత్రం మార్పు చొప్పించేది కాదు. ఆ ఘటనలను ఆమె పూర్తి నమ్మకంతో సాధారణ విషయాల వలేనే చెప్పేది. ఆశ్చర్యపోవడం వినేవారి వంతు మాత్రమే. గతంలో నేను దాన్ని నమ్మకుండా ఒక కథ చెప్పే ప్రయత్నం చేశాను. మా అమ్మమ్మ చెప్పిన వ్యక్తీకరణను విస్మరించాను. అమ్మమ్మ చెప్పిన వ్యక్తీకరణను అనుసరించాకనే ”వందేళ్ళ ఏకాంతం” విజయం పొందింది.

మాజిక్ రియలిజం కట్టుకథలను, జానపద కథలను, పురాణాలను సమకాలీన సామాజిక ఔచిత్యంలోకి తీసుకు వస్తుంది, అతీంద్రియ ప్రపంచం సహజమైన, సుపరిచితమైన ప్రపంచంతో కలిసిపోతుంది. అద్భుతాలు జరుగు తుంటాయి. అద్భుతమైనది అంటే అసాధారణమైనది, వింతైనది, నమ్మశక్యం కానిది. కానీ అసాధారణమైన దేమీ జరగనట్లు కథ “తార్కిక కచ్చితత్వం”తో సాగుతుంది. మాంత్రిక సంఘటనలు సాధారణ సంఘటనలుగా ప్రదర్శించబడటం తో పాఠకుడు ఆ అద్భుతాన్ని సహజ మైనదిగా అంగీకరిస్తాడు.

కొన్ని సంస్కృతులలో చెట్లకు, నిర్జీవ పదార్ధాలనె వాటికి (కొండలు బండలు) కూడా ప్రాణము, ఆత్మ వుంటాయనే విశ్వాసం ప్రబలంగా వుంది. ఇక జంతువుల సంగతి చెప్పనవసరమేలేదు. దీన్ని యానిమిజం అని వ్యవహరిస్తారు. పూర్వీకుల, సాంప్రదాయ భావనల ఈ బలమైన ఉనికి ఒక మత విశ్వాసంగా మారిపోయింది. దాని ఆధారంగా రాయబడిన సాహిత్యాన్ని యానిమిస్ట్ రియలిజం అని అంటున్నారు. మన పంచతంత్ర నీతి కథలలో ఆ అంశాలు అనేకం వున్నాయి. కొన్ని సంస్కృతుల లోని యానిమిజం- మ్యాజిక్ రియలిజం యొక్క కొత్త భావనగా వికాసం పొందుతోంది. భారతీయ విశ్వాసం లోను, సాహిత్యం లోను ఇది అనూచానంగా, ప్రవహిస్తూ వస్తున్న ఒక బలమైన పాయ. ఆధునిక తెలుగు కథలో మాజిక్ రియాలిజానికి ఆద్యుడనదగ్గ శ్రీ మునిపల్లి రాజు గారు దీనిని ప్రస్తావిస్తూ “మాజిక్ రియలిజం లాటిన్ అమెరికా నుండి దిగుమతి చేసుకున్న సొత్తేమీ కాదు. వ్యాసుడు, వాల్మీకి రాసిన భార తీయ బృహద్గ్రంధాల లో ఈ మాంత్రిక వాస్తవికతకు చెందిన మూలాలు పుష్కలంగా వున్నాయని ప్రతిపాదించారు.

‘ఫాబులిజం’ అన్న ప్రక్రియలో కూడా కొంత ఇలాంటి నిర్మాణ చాతురి కనిపిస్తుంది. “ఫాబిల్’’ అంటే సంప్రదాయకమైన చిన్న నీతికథ అన్న నిఘంటు అర్ధం అందరికీ తెలిసిందే. సాంప్రదాయకంగా వస్తున్న కట్టుకథలు, ఉపమానాలు పురాణాలను ఇది సూచిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని విమర్శించడానికి, ప్రత్యక్ష రూపక వివరణలను అందించడానికి పురాణాలు, కట్టుకథలను అది ఉపయోగిస్తుంది. శ్రీ కొకు -బకాసుర లో ఈ అంశం చూడవచ్చు. మ్యాజిక్ రియలిస్ట్ సాహిత్యం దాని మ్యాజిక్ ఎలిమెంట్ యొక్క వివరణను వదిలివేస్తుంది. లేదా కథలోని అంశాలను గందరగోళపరుస్తుంది, అది ఒక నిగూఢభావనను సృష్టిస్తుంది. పాఠకునికి తాను చదివేది అర్థవంతంగా వుండాలంటే దాగి ఉన్నఅర్థాల గురించి అవగాహన కోసం ప్సాంప్రదాయిక వివరణ, కథా పురోగతి, కాల నిర్మాణం, శాస్త్రీయ తర్కం మొదలైన వాటితో ముందుగా ఉన్న నిర్దిష్ట సంబంధాలను విడిచిపెట్టాలి. కథ సృష్టించిన మాజిక్ పరిధిలో ప్రవేశించాలి. అందులోనే ఆలోచించాలి. సమర్ధుడైన రచయిత తన పాఠకుణ్ణి సులభంగా కథలో ప్రవేశ పెడతాడు. నమ్మిస్తాడు. సమాజంపై, ముఖ్యంగా ఉన్నత వర్గాలపై పరోక్ష విమర్శ” ఉంటుంది. మ్యాజిక్ రియలిజం యొక్క ‘‘ప్రత్యామ్నాయ ప్రపంచం’’ స్థాపిత దృక్పథాల వాస్తవికతను సరిదిద్దడానికి పనిచేస్తుంది. వాస్తవికత, సహజవాదం, ఆధునిక వాదం వంటి వాటిని నవీకరిస్తుంది. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారి గురించి వెలికి తీస్తుంది. సామాజికంగా ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన భావనలు ప్రవేశ పెడుతుంది.

ఈ పద్దతిలో కథలు చెబితే మన భారతీయ కథన విధానానికి చాలా దగ్గరగా వుంటుంది. జంతువులు మాట్లాడా యన్నా, పక్షులు మనిషికి సహాయం చేసేయన్నా ఏ సంకోచమూ లేకుండా మనం అంగీకరిస్తాము. మన పౌరాణిక కథలు, కావ్యాల నిండా ఇలాటి అద్భుతాలు ఎన్నో చదివాము. జటాయు పక్షి రామునికి సీతమ్మ జాడ చెప్పింద న్నా, వానర సైన్యం వారధి కట్టిందన్నా, ఉడుత సాయం చేసిందన్నా మనకు స్వాభావికంగానే అనిపిస్తుంది. మట్టి కుండలో మనుషులు పుట్టినారన్నా, కన్నీటి చుక్క వల్ల సంతానం కలిగిందన్నా, మనకు అబ్బురంగా,అసహజంగా ఏమీ అనిపించదు. సహజ తార్కికంగా ఈ కథలను ప్రశ్నించము, తాత్వికంగా వాటిని అంగీకరిస్తాము. ఒక జానపద కథానాయకుడు, గొర్రె గానో, సింహం గానో పరకాయ ప్రవేశం చేసి ఒక పని పూర్తి చేసుకుని వచ్చి తిరిగి మనిషిగా మారిపోయినా, ఒక యువరాణి కాసేపు చిలకగా కాసేపు మనిషిగా వ్యవహరించినా మనం ఆ కథలో లీనమవుతా ము. గురువు పాము, శిష్యుడు ముంగిస గా అయి పోరాడుతుంటే గురువుని మించిన శిష్యుడని పొంగిపోతాము ఆ కథలోని నీతి (కంటెంట్ ) ఏమిటో దాని మీద దృషి పెడతాము. కథనాన్ని ఒక ఎత్తుగడగానే భావిస్తాము. ఆధునిక సాహిత్యంలోనూ ఈ పద్దతులు చాలామంది పాటించి ఒప్పించారు. గోవులు తిరుగుబాటు చేసాయన్న, పాము పగ బట్టిందన్నా, ఎద్దు పగతో ఒకరిని చంపి వేసిందన్నా, తమ యాజమానుల పట్ల విశ్వాసంతో, న్యాయ వర్తనుల పట్ల అభిమానంతో వాళ్ళను గెలిపించటానికి చరాచర జగత్తు వారికి సహకరించిందన్నా, చివరకు ప్రకృతి చీకటి కల్పించినా, వెలుగులు చిమ్మినా, బీభత్సం సృష్టించినా, దాన్ని మంచికి తోడ్పడటంగా భావించాము. మనిషికి-ప్రకృతికి మధ్య నెలకున్న ఆవినాభావ సంబంధంగా మనం దర్శిస్తాము. ఈ సృష్టిని ప్రకృతి-పురుషుల సంగమం అని కొనియాడు తాము. అంతే కాదు ఆ సంబంధం సజావుగా లేకుండా పోవటమే నేటి ప్రకృతి విలయాలకు కారణం అని భావిస్తాము.

తెలుగు కథను మాజికల్ రియలిజంలో తడిపి, తమదైన కథనరీతితో ఒక అరుదైన గౌరవం దక్కించినవారు శ్రీ మునిపల్లె రాజు. ప్రముఖ తెలుగు కథా రచయిత వి.చంద్రశేఖర రావు తన కథా రచనలో మ్యాజిక్ రియలిజం టెక్నిక్‌ ని విరివిగా వాడుకుని నూతన ఒరవడిని సృష్ఠించారు. తెలుగు కథల మాంత్రికుడు అని పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ రచయిత కేశవ రెడ్డి అనేక రచనలలో ఈ సంవిధానాన్ని ఉపయోగించి అద్భుత ఫలితాలు సాధించారు. ఇంకా ఎందరో ఈ శైలిలో రాశారు. అయినా మాజిక్ రియలిజంను- మాంత్రిక వాస్తవికతను-నిర్దుష్టంగా నిర్వచించడం సాధ్యం కాదు. వేర్వేరు రచయితలు అనుసరించిన మాజిక్ రియలిజం పద్ధతుల మధ్య చాలా తేడాలు కనబడతాయి. కొందరు చాలా అస్పష్టతను, అయోమయాన్ని సృష్టించగా కొందరు నర్మగర్భంగానే చాలా బలమైన ప్రతిపాదనలు చేశారు. సంక్లిష్ట విషయాలను, మానసిక సంఘర్షణలను సులువుగా బలంగా చెప్పగలిగారు. ఇప్పుడు శ్రీమతి గీతాంజలి గారు ఈ కథలో ఆద్యంతం మాంత్రిక వాస్తవికతను వాడి మంచికథను బలంగా చెప్పారు. పైన మనం వివరంగా చూసిన ఈ ప్రక్రియ లక్షణాలను పాటించారు. ఆమె గతంలోనూ బోన్సాయ్ లాంటి కథలలో ఈ శైలిని అనుసరించారు. ఆ కథలో ఊర్మిళను గురించి చెబుతూ “ఈ ఇంటికి వచ్చే ముందు తనకు రెక్కలుండాలే-వాటిని కత్తిరించి వేశారు. ఆమె చేతిలో గరిటా, అంట్లు తోమే పీచు, బట్టలుతికే బ్రష్హు ఎంత గట్టిగా పీకాలన్నా ఊడి రావటంలేదు. (అవి శరీరంలో కలిసి పోయాయి అన్న అర్ధంలో) చేతి వేళ్ళనుండి ఉప్పు,కారం మసాలా, ఆవాలు, పొళ్లు పొళ్లు గా రాలుతున్నాయి” అంటే వంటిల్లు ఆమె జీవితంలో ఎంత విడదీయరాని భాగమో చెప్పటానికి ఇలా మాజికల్ గా వర్ణిస్తారు. అయితే మాజిక్ లోని సంక్లిష్టతను,రహస్యాన్ని, మార్మికతను తగ్గించి, వాస్తవికత పాళ్ళు మరింత పెంచి కథను తేటతెల్లం చేయటం వల్ల ఈమె చేతిలో ఈ సంవిధా నం కొత్త సొగసులు సంతరించుకుంటోంది. పాఠకునికి సుబోధకంగా వుంటోంది. ఈ ఎరుకతో ప్రస్తుత కథను పరిశీలిద్దాము
3
ఒక వణుకుతున్న ఇల్లు- తన కళ్ళముందు జరుగుతున్న దానికి బిత్తర పోయిన చంద్రుడు, నక్షత్రాల తోపాటు సూర్యుణ్ణి కూడా జత తెచ్చుకోవాలని, కాస్త ధైర్యం పొందాలని వణికి పోతున్నప్పుడు, ఆకాశం పగిలిన చప్పుడు భీకరంగా వినిపిస్తున్న మెరుపుల వెలుగుల్లో ఈ కత ఆరంభ మవువుతుంది. ఆరంభం లోనే నిగూఢ వాతావరణం మనల్ని అలుముకుంటుంది. మూలుగు, నొక్కి పడుతున్నఆర్తనాదంలో- ఒక నక్క లాంటి పురుషుడు, ఎర్రబడ్డ కళ్ళతో ఆగ్రహంగా ఊగిపోతూ అతని పొట్టమీద కత్తితో పొడుస్తున్న స్త్రీ కనపడతారు చంద్రునికి. అప్పుడు ఆమె పులి లా గాండ్రించింది. పురుషుడు నక్కలా, స్త్రీ పులిలా కనిపించడం లోనే ఒక ఉక్త్తి వైచిత్రం గోచరిస్తూ-వారి స్వభావాన్ని అర్ధం చేసుకుంటాం. ఇది సాధారణ వర్ణనే కానీ ఆ పక్కనే “ఆమె నోటిలో పులి కోరలు పొడుగ్గా మొలిచాయి’’ అని చదవగానే ఉలిక్కిపడమూ ! అతగాడి పొట్టను చీల్చితే ఆమెకు కలిగిన “ఆనందం ఆమె ముఖంలో అత్యంత క్రూరమైన అందం తో నాట్యమాడింది” అనగానే వళ్ళు జలదరించిపోదూ? దీని వెనుక ఏమి జరిగింది అనే ఆసక్తి , భయానక ఆతృత పాఠకుడిలో ఎంత వువ్వెత్తున ఎగిసిపడతాయో కదా? ఇదీ కథ ఆరంభం.
“వద్దు. వొదులు. నే సచ్చిపోతా, నువ్వు విధవవుతావు. పతివ్రతవు కాలేవు” అంటూ ఏడుస్తూ ఆమెను వేడుకుంటు న్నవాడి దీనాలాపంలో కూడా ఆమెను అంతవరకు కట్టి పడ వేసిన పాతివ్రత్యం, పుని స్త్రీ అన్న భావజాలం తనను కాపాడగలదనే నమ్మకం, దాన్నే తన ఆఖరి అస్త్రం గా ప్రయోగించిన మగవాడి వొడుపు చూస్తూ ఆశ్చర్యానికి లోనవు తాము. “నేను తప్పు చేశాను, క్షమించు “లాటి మాటలు అనడు, బదులుగా నేను (భర్త)బతికి వుండటం నీకు (భార్యకు) అవసరం అన్న భావం ఆఖరి క్షణాల్లో కూడా వాడిని వదలదు. ఈ రకం పురుష భావాధిక్యత నుండి తెగ తెంపులు చేసుకుని బయటపడటానికి, భర్తనే చంపివేయడానికి ఆ స్త్రీ ఎంత యాతన పడి వుండాలి?

తనకు కావలసింది తీసుకున్నాక- “ఆమె రెక్కలు మొలిపించుకుంది. రివ్వున కిటికీలోనుంచి ఎగిరిపోయింది.” ఆమె ఎక్కడకు వెళ్లిందో చూడవచ్చిన నక్షత్రానికి కనపడింది ఆమె తన డాబా మీదే. తన పక్కన ఒక రాజస దర్పంతో కూచుని వున్న ఒక గర్భిణీ పిల్లితో వెన్నెలను తనతో నింపుకుంటూ కనపడ్డది. నక్షత్రానికి ముచ్చట వేసింది. ఆమెను కావాలి అనుకుంది. నీతోనే వుంటా అన్నది. ఆమె తన నేస్తం పిల్లి వైపు చూసింది. అది ఒప్పుకో గానే ఆమె నక్షత్రాన్ని చూస్తూ తన నోటిని భూగోళమంత తెరిచింది. నక్షత్రం ఆమె లోపల వొదిగి పోయింది. ఆమె మరింత వెలిగి పోయింది. ఆమె చాలా సేపు చల్లని వెన్నెలలో కూర్చొంది. తరువాత ఆమెలో వెన్నెల కూర్చొంది. ఆమె దాబా దిగి ఇంట్లోకి నడిచింది ఆ ఇల్లు చీకటిగా వుంది. ఆమె ప్రతి గదిలో దీపాలు వెలిగించింది. వంటింటి లో కూడా. వంటింటిలోనుంచే వెలుగు ఇల్లంతా నిండుతోంది.” ఇదీ కథ చెప్పిన పద్దతి. ఎంత నవ్యంగా, నవీనంగా, పాఠకుని గుండెల్లోకి ఒలికిపోతూ సాగుతుందో కథ. కథ పేరులోనే వంటిల్లు. అక్కడి నుంచే వెలుగు ఇల్లంతా పరుచుకోవటం. ఎంత చక్కని నాంది.

తన భర్తను చంపివేసిన ఒక స్త్రీ గురించి, ”ఆమె నిలువెల్లా- వెన్నెల కూర్చొంది” అని రచయిత్రి వర్ణించింది. ఇది చదవ గానే మునిపల్లె రాజు గారి కథ ” శ్మశానం చిగిర్చింది” లోని వాక్యాలు “శ్మశానంలోని బూడిదంతా మాయమై పోయింది. పచ్చగా, మృత్యు సన్నిధిలో కళ్యాణాన్ని పాడుతోంది.” గుర్తొస్తాయి. శ్మశానంలో పచ్చదనాన్ని, మృత్యు వు లో కళ్యాణాన్ని చూడగల మాజిక్ రియలిజం ఇది. బీభత్సమైన హత్య తరువాత రక్తసిక్త మైన చేతులతో కూర్చొన్న మృణాళిని- నిలువెల్లా నిండిన వెన్నెలగా భాసించడం లో వున్న మాజిక్ లోని రియలిజం, ఆమె కొన్ని సంవత్సరాల మానసిక యాతన నుండి బయటపడటం తో ఆమె మనసుకు చిక్కిన ప్రశాంతతను రచయిత్రి చూడ గలగడమే కదా! అసలు కథ, రచయిత్రి సందేశం ఇక్కడే ముగిసిపోయింది. పాఠకుణ్ణి తన గుప్పిటిలో పట్టేసుకుంది. తరువాత వచ్చిందంతా కారణాలు, కారకాల వివరణే. మృణాళిని చర్యకు వున్న ధర్మబద్దత గురించిన సమర్ధనే మృణాళినికి ఎంత కష్టం వస్టే ఇలా చేసింది అన్న సహానుభూతే తప్ప ఆమె ఏదో నేరం చేసింది అని అనిపించదు. రచయిత్రి అప్పుడు చెబుతుంది మృణాళిని కథ. ఇలా గొప్ప ఎత్తుగడతో, మార్మికతతో కథ లోకి నడిపిస్తారు.

వంటింటి లో మృణాళిని, పడకటింట్లో కృష్ణవేణి వ్యవహారం అందరికీ తెలిసే జరుగుతోంది. మృణాళిని దీన్ని ఎందుకు జరగనిచ్చింది? జరిగి పోనీక ఆమె చేతిలో ఏముంది? చెల్లెల్ని బ్రతిమాలింది. భర్తను వేడుకుంది. “నాకు ఎత్తైన గుండెలు లేకపోయినా చూసే చేసుకున్నారుగా’’ అని నిలదీసింది. “నాకప్పుడు నీవిచ్చే కట్నం .. నీ పదెకరాల పొలం, సిటీ లో ఫ్లాట్ నీ గుండెలకంటే ఎత్తుగా కనపడ్డాయి’’ అన్న వాణ్ని ఏమి చేయగలదు. ఆనంద్ కర్కశమైన కోరలతో క్రూరమైన కళ్ళతో నక్కగా మారిపోయాడు అంటుంది రచయిత్రి. ”బావకు నీతో సుఖమే లేదట. బావను ప్రేమించా, బావ లేకుండా నేనుండలేను” అంటూ మేకగా మారిపోయిన చెల్లి, నక్క బావ వెనకాల చేరి పడక గదికి తలుపేసుకుంది. అత్తామామల కాళ్ళ మీద పడితే “…గిడస బారిన వళ్ళు, నువ్వు…. నా కొడుకుకు సుఖమే లేకుండా పోయింది.” అని ఈసడించారు “నీ మావ కూడా పొలంకాడ రెండో ఇల్లు పెట్టాడు. కానీ ఇంటిమీద పెత్తనాన్ని నాకే ఇచ్చాడు. నేను సర్దుకుపోలా“ అని అత్త గొర్రెలా, తోడేలు మావ చేయి పట్టుకుని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇవి మూత పడ్డాక తలుపులు లేని వంటగది కి చేరుకుంది మృణాళిని. ఎప్పుడో యుగాల క్రితమే ఆవులా మారిపోయిన అమ్మ ‘సర్దుకుపో’ అని చెప్పింది. ఆమె మాట వినేవారు ఎవరూ లేరు. పాలకోసం వచ్చే గర్భిణీ పిల్లి , పర్షియన్ హిమాలయ బ్రీడ్ మిష్టి తో తన సొద వెళ్లబోసుకోవటం మొదలెట్టింది. అది మ్యావ్, మ్యావ్ అంటే “ ఊర్కో .. ఏదైనా చేద్దాం” అన్నట్లు అనిపించేది మొదట్లో. క్రమంగా వాళ్లిద్దరూ రోజూ గంటల తరబడి కబురులు చెప్పుకునేవారు. గరగరలాడే గొంతుతో మిష్టి ఏదో మాట్లాడుతు న్నట్టు, తాను అదీ ఒకటే అని భావిస్తోంది మృణాళిని. అలాగే పక్కింటి లాబ్రడార్ కుక్క’ చోటు’ దాని యజమాని జానకమ్మతో మాట్లాడటం గమనించింది. మిష్టి, చోటులు కూడా స్నేహితులే. నీలాగా “మాట్లాడుకోవటానికి మనుషులే దొరకని వారితో మేము జంతువులం మాట్లాడతాం” అని కూడ మిష్టి చెప్పింది.

ఈ క్రమంలోనే ‘మూడేళ్లక్రితం నువ్వు మీ ఆయనకు గుండెకాయకంటే విలువైనది చాలా పెద్దదే ఇచ్చావు. అది తీసేసుకుంటే తప్ప వాడికి బుద్ధి రాదు” అనికూడా చెప్పింది మిష్టి . ఇది చెప్పేటప్పుడు అది పులీలా ముందరి కాలి పంజాతో నేల మీద చరిచి పులీలా గాండ్రించి చెప్పింది. అయినా మృణాళినికి అది ఏమి చెబుతున్నది అర్ధం కాలేదు. మిష్టి ఇక్కడో మాయ చేసింది. వంటింటి గోడ మీద ఒక స్క్రీన్ సృష్టించి ఒక చిత్రాన్ని చూపించింది. మృణాళిని తో పాటు మనం కూడా ఆ మాయ తెర మీద బొమ్మలు చూస్తాము.

ఒళ్ళంతా మొగుడు అన్న నల్ల టాటూ పొడిచి వున్న బలమైనవాడు బంగారు గంగాళం పెట్టుకుని రాజసం వలకబోస్తూ కూర్చుని వుంటాడు. మెడలో సన్నని సంకేల తో వేలాడుతున్న పతివ్రత అన్న నేమ్ ప్లేటు, నెత్తి మీద త్యాగ మూర్తి అని రాసి వున్న కిరీటం ధరించిన స్త్రీలు అవి ఎటూ జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని అతని చుట్టూ వున్నారు. ఈ స్త్రీలంతా తమ శరీరాల నుండి కోసి తీసి ఆ గంగాళంలో ఏదో ఒకటి వేస్తున్నారు. గర్భ సంచి, రొమ్ములు, గుండెకాయలు, కిడ్నీలు . ఏదో ఒకటి .. కొందరు తమ రక్త నాళాలు కోసి గంగాళంలో తమ రక్తం నింపుతున్నారు. అయినా ఆ పురుషునికి తృప్తి లేదు. ఇంకా దేనికోసమో చూస్తున్నాడు. ఒకామే తన మెదడు తీసి గంగాళంలో వేసింది. అప్పుడు సంతృప్తి చెందిన వాడు ఆమెకు “ఆదర్శ గృహిణి” అన్న కిరీటం పెట్టి ఒక వెండి ఈటెతో దాన్ని తలమీద సవరించాడు. అయినా పురుషుడి గంగాళం నిండటం లేదు. ఇంకా ఇంకా కావాలి అంటూ అరుస్తున్నాడు పురుషుడు. చూడలేక పడిపోతుంది మృణాళిని. “నేను వంటింటి పిల్లిని. ఇలా యుగాలుగా చూస్తూనే వున్నాను. నువ్వు కూడా ఇలా చాలానే ఇచ్చావు గుర్తు చేసుకో “ అంటుంది పిల్లి. పొట్ట తడిమి చూసుకున్న మృణాళినికి పిల్లల్ని కనటానికి ఆపరేషన్లు. పిల్లలు కాకుండా వుండటానికి ఆపరేషను. మళ్ళీ పిల్లవాడి కోసం రికానలైజేషన్ .. చివరికి అననంద్ కి కిడ్నీ ఇవ్వటానికి ఆపరేషన్.. అన్నీ గుర్తుకొస్తాయి. కిడ్నీ ఇవ్వటానికి ఆడబిడ్డతో సహ అందరూ నిరాకరిస్తున్నప్పుడు ఆనంద్ నక్కనుంచి జింక లా మారిపోయి “భర్త కోసం త్యాగం చేసిన పతివ్రతవై పొతావ్” అంటుంటే, పిచ్చి మమకారంతో, పిల్లలకు తండ్రి వుండాలన్న భయంతో, పూర్తిగా పతివ్రత గా మారిపోయిన మృణాళిని కిడ్నీ ఇచ్చింది. ఆ తరువాత ఆమెనే పక్కకు తోసేసి, రెండు కిడ్నీలు, ఎత్తైన రొమ్ములు వున్న మరదలిని ట్రాప్ చేసి లొంగదీసుకున్నాడు భర్త . అవును తన కిడ్నీ భర్త దేహంలో వుంది. ఆ కిడ్నీనె వెనక్కి తీసుకోమని మిష్టి చెబుతోంది. వంటింటి కుకింగ్ రేంజ్ నుంచి సింకులోకి బలంగా దూకుతూ చికెన్ కోసే బారాటి కత్తిని నేల మీద పడేసింది. అంతే కాదు మెడ పక్కకి తిప్పి చూస్తూ సైగ కూడా చేసింది. ఆ రాత్రి అనువైన సమయంలో జరిగినది కథ మొదట్లో మనం చదివిన సంఘటన. అప్పుడు గాఢమైన మార్మిక సంగీతం అలల్లా వంటింట్లో వున్న మిష్టి ని చేరింది. వెచ్చని కన్నీళ్ళు మిష్టి చెంపల మీడినుంచి నేల మీదికి ముత్యాల్లా రాలాయి.

ఇలా ఈ కథలో మిష్టి ప్రధాన పాత్ర. మృణాళినికి మాత్రమే వినిపించే, అర్ధ మయ్యే మాటలు చెబుతూ, మనలాటి వాళ్ళకు ఒక జంతువు సహజ చర్యలుగా కనిపిస్తూ… కథను మలుపు తిప్పుతుంది మిష్టి. సన్నివేశంలో పాత్ర స్వభావాన్ని బట్టి వారు ఒకో జంతువులా కనిపించడాన్ని అలవోకగా తేలికగా అర్థమయ్యేలా చిత్రించారు గీతాంజలి.

ఇంత గొప్ప శైలి తో రాసిన ఈ కథలో తాపీగా ఆలోచిస్తే రెండు మూడు విషయాలు సమాధానం కోరుకుంటాయి. “వ్యక్తిగత సమస్యలను అర్ధం చేసుకునే క్రమంలో ఏదీ వ్యక్తిగతం కాదని అంతా రాజకీయమేనని , వర్గ పోరాటంలో భాగం గా వీటిని చూడాలని” ఒక ఆలోచనా ధోరణి, ఒక మార్గ దర్శక సూచన ఈనాటి మహిళా కేంద్రీత సాహిత్యంలో ప్రధానంగా వినిపిస్తోంది. సమస్యకు మూలం సామాజికం అయినప్పుడు పరిష్కారం కూడా సామాజికమే, సామాజిక మార్పులోనే వుంటుంది కదా! మృణాళిని తన సమస్యకు ఒక వ్యక్తిగత ముగింపునే సూచించింది.

తన జీవితంలో అలుముకున్న కన్యాశుల్కమనే దురాచార అంధకారానికి పరిష్కారం తన చావులోనే చూసుకుంది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఆత్మాహుతినే ఒక మార్గంగా అనుసరించింది.”కన్నుల కాంతులు కలవల చేరెను/మేలిమి జేరెను మేని పసల్ !/హంసల జేరెను నడకల బెడగులు/దుర్గను జేరెను పూర్ణమ్మ.” అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ చదువుకుంటాం ఇప్పటికీ. ఆ గాధలో దుర్గమ్మలో కలిసి పోయింది 170 సంవత్సరాల నాడు పూర్ణమ్మ.

తరువాత గాథల్లో లిల్లి పూవు లాటి చెంద్రమ్మ మొగిలి పూవు లాటి మొగిలన్న. ఊరిలోని మోతుబరి రాకాసి కాశీ రెడ్డి వేసిన కాటుకు బలైపోతాడు మొగిలన్న. నిరామయమైన లోకం, బాధ, దుఃఖం, కొపం, పగ, ద్వేషంగా మారి తీవ్రమైన ఆవేశం ముంచుకు రాగా కాశిరెడ్డిని ఖతం చేసి ప్రతీకారం తీర్చుకుంటుంది చెంద్రమ్మ. నుదుటి మీద రక్తతిలకం దిద్దుకుని చిటికెలో చీకటిలో కలిసి పోయింది. జాలారీ జంగయ్య సాయంతో ఏరుదాటి అడవిలో అన్నలతో కలిసి పోయింది చెల్లి చంద్రమ్మ 55 ఏళ్ల క్రితం. అప్పుడు “ఆ పొద్దు పల్లె నవ్విందండి /గాలి వీచిందండి – గరిక పూచిందండి/ కోడె దూడ మెడలో గంట మోగిందండి సారి తిరిగిందండి – కదురు కదిలింది/ రావిచెట్టుకింద – కొలిమి మండిందండి” అంటాడు కవి దాన్ని ఒక వీర గాధగా వర్ణిస్తూ. కానీ కాశిరెడ్డి వారసులు ఇప్పటికీ రాజ్యమేలుతూనే వున్నారు.

“నలుగురు కూచుని నవ్వే వేళల వారి పేరొక తరి తలుచు కుంటే సరిపోతుందా? ఆత్మహత్య -హత్య పరిష్కారాలు కావని అప్పుడే తేలిపోయింది. పరిస్థితులను ఎదుర్కోవటానికి మహిళ చేతిలో వున్నవి ఈ రెండు ఆయుధాలు మాత్రమైనా.? తన నిరసన , తిరుగుబాటు తెలియజేయటానికి ఆధిపత్యం చేస్తున్న మగవాడిని చంపివేయటమేనా మార్గం? వాడు ఒక్కడు కాదు కదా? పురుషాధిక్య సమాజం అని కదా అంటున్నాము. ఒక వేరు పురుగును ఏరివేయటం సాధ్యమే కానీ చెట్టు మొత్తం పురుగుగా మారినప్పుడు ఏమి చేయాలి? అన్నది ప్రశ్న. “నేనిచ్చిన కిడ్నీని నేనె తీసేసుకుంటా’’ అనటంలో ఒక చిన్నపిల్లలోని ఉక్రోషం, రోషమే కదా కనిపిస్తున్నది. అది తీవ్రమైన ప్రతిస్పందనను, ప్రతి చర్యను, ఉద్రేక భరితమైన భావోద్వేగాన్ని చూపిస్తు న్నదే కాని ఒక మార్గదర్శక పరిష్కార వైఖరిని సూచిస్తున్నదా? చెల్లి చంద్రమ్మల కాలం తరువాత మన ప్రయాణం ఎలా సాగుతోంది? ఈ ప్రశ్నకు మృణాళిని ఏ సమాధానం చెబుతుంది? కథానంతరం ఆమె ఉరికంబం పాలవ్వడమే కదా జరిగేది. కరుణ-వీరం మధ్య విజ్ఞత కదా వికసించాల్సింది.

స్త్రీ అడవిని జయించాలని పోరాడుతున్నది. స్త్రీల సమస్యలన్నీ దట్టమైన కీకారణ్యాలే. మానవ సంబంధాలలోని సంక్లిష్టత కూడ ఒక ఆడవే. ఒక అడవిని జయించింది అనుకునే సరికి మళ్ళీ ఒక కొత్త అడవి కనపడుతోంది. “అసమానతలు, వికృతత్వాలు, అన్యాయాలు, దుర్మార్గాలు అనే అడవులు చూసి మళ్ళీ మళ్ళీ పోరాడాలనే నిర్ణయించుకుంటోంది నేటి స్త్రీ. తాను కలగన్ననూతన జీవిత ఆవిష్కరణ కోసం కొత్త ప్రశ్నలతో, కొత్త దాడులను ఎదుర్కొంటూ కొత్త డాలు, కరవాలం సిద్దం చేసుకుంటూ కొత్త అడవులను నరికివేస్తూ- ఓడిపోయి గెలిచినా, గెలుస్తూ ఓడిపోయినా- ఆమె ప్రయాణం చేస్తూనే వుంటుంది” అని స్పష్టంగా తెలిసిన రచయిత్రి గీతాంజలి. నూతన మానవుడి ఆవిష్కరణం కోసం ఆమె ప్రయాణం సాగుతూనే వుంటుంది. మరి మృణాళిని కథ సగంలోనే సమాప్తమై పోవటం హర్షించగలమా? ఈ సంక్షోభంలో నుంచి మరో సంధ్య పుట్టుకొస్తుందేమో చూద్దాం. ఒక విజ్ఞురాలైన రచయిత్రి నుండి ఇలా ఆశించటం అత్యాశ కాదనుకుంటా.

రచయిత, సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషకుడు

Leave a Reply