మూడు నెలలుగా దేశమంతా కొవిడ్ రెండో దశ విజృంభణతో అతలాకుతలమవుతుంటే, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పశ్చిమ తీరాన 400 కి.మీ. దూరాన అరేబియా సముద్రంలో ఉన్న అందమైన చిన్న లక్షద్వీప్ నీళ్లలో నిప్పు రగిలిస్తున్నారు. ఆయన పేరు ప్రపుల్ ఖోడా పటేల్. ఈ గుజరాతీ రాజకీయ నాయకుడు కేంద్రపాలిత ప్రాంతాలైన డయ్యూ డామన్, దాద్రా-నగర్ హవేలీలతో మొదలు పెట్టి లక్షద్వీప్ వరకు రాజకీయ, సాంస్కృతిక ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ప్రపుల్ పటేల్ తన అజెండా జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి సాధనకేనని చెబుతున్నారు. కానీ, విపక్షాలు, దేశ ప్రజలు, బుద్ధిజీవులు అందులో హిందూత్వ ఛాయలను, జనజీవన ఛిద్రాన్ని చూస్తున్నారు. దీంతో సాధారణంగా వార్తల కెక్కని ప్రశాంతంగా ఉండే పగడపు దీవులైన లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది.
కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా పిలుస్తారు. కేవలం 70 వేల మంది జనాభాతో ప్రకృతి శోభతో ప్రశాంతంగా బతికే ఈ దీవుల్లోని 90 శాతం జనాభా సూఫీ ముస్లింలే. భాష మలయాళం. సంస్కృతీ, సంప్రదాయాలు కేరళీయులవే. ఒకప్పుడు టిప్పుసుల్తాన్ పాలనలో ఉన్న ఈ దీవులు 1799లో ఆయన మరణించిన తర్వాత బ్రిటీష్ వారి హస్తగతమై, 1956 నుంచి భారతదేశంలో అంతర్భాగంగా, అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటున్నాయి. ఈ మొత్తానికి పాలన విభాగాలుగా విభజించారు. దేశంలోని జిల్లాలలో దీన్ని ఒకటిగా పరిగణిస్తారు. కవరట్టి దీని పాలన కేంద్రంగా ఉంది.
సివిల్ కాంట్రాక్టర్, మోడీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ప్రపుల్ ఖోడా పటేల్ 2007లో గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2005 నవంబర్ 26న జరిగిన సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్లో రాష్ట్ర హోంమంత్రి అమిత్‌షా అరెస్టయినప్పుడు, ఆయన స్థానంలో ప్రపుల్ ఖోడా పటేల్ హోం మంత్రిగా నియమితులయ్యారు. 2016లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పటేల్‌ను దాద్రా-నగర్ హవేలి, దమన్ దీవులకు పాలనాధికారిగా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు దాద్రా-నగర్ హవేలి కలెక్టర్, ఎన్నికల అధికారి కణ్ణన్ గోపీనాథన్‌తో పటేల్‌కు పొసగలేదు. దానితో కణ్ణన్ రాజీనామా చేయక తప్పలేదు. పటేల్ వేధింపులే దీనికి కారణమని లేఖరాసి మరీ ఒక హోటల్ గదిలో ఉరివేసుకున్నారు! 2020 జనవరిలో దాద్రా-నగర్ హవేలీ, డామన్-దీవులను విలీనం చేసి వాటి పాలనా బాధ్యతను పటేల్‌కు అప్పగించిన కేంద్రం, గత డిసెంబర్ 4న లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ మరణించడంతో లక్షద్వీప్‌నూ పటేల్ చేతుల్లో పెట్టింది.
చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి లక్షద్వీప్‌ను భద్రతాపరంగా పటిష్టం చేయడం కేంద్ర ప్రభుత్వ విధానమని పటేల్ సూచిస్తున్నారు. ఈ దీవులు తీవ్రవాదులు, మాదకద్రవ్య సరఫరాదారుల అడ్డాలుగా మారకుండా నివారిస్తానంటున్నారు. ప్రపుల్ పటేల్ లక్షద్వీప్‌ని మాల్దీవుల్లా మార్చేస్తానంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థానిక యంత్రాంగంతో మాట మాత్రంగానైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. లక్షద్వీప్ పాలనాధికారిగా ఆయననను నియమించినప్పటి నుంచి అక్కడి ప్రజల్లో అభద్రతా భావం పెరగడం ప్రారంభమైంది. ప్రశాంతంగా జీవించే, శాంతి కాముకులైన వీరిని అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమేయాలని క్రూరమైన మోడీ ప్రభుత్వం బాహాటంగా యత్నిస్తున్నది. దీంతో వారి జీవితాలు, జీవనోపాధి, ఆహార, సాంస్కృతిక హక్కులను కాలరాయాలని అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ ఖోడా పటేల్ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.
హిందూ రాష్ట్ర స్థాపన వ్యూహంలో భాగమే:
1990 ప్రారంభంలో బిజెపి సీనియర్ నాయకులు, ఆరెస్సెస్ సంఘ్‌పరివార్ సభ్యులు ఎల్కే అద్వానీ, వాజ్‌పేయి, అశోక్ సింఘాల్, ఆచార్య గిరిరాజ్ కిషోర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశాన్ని పూర్తిగా మార్చి వేస్తామని చెప్పారు. 1992 డిసెంబర్లో ఆరెస్సెస్ కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చిన రెండు మూడు నెలల తరువాత, ఆచార్య గిరిరాజ్ కిషోర్, మహంత్ రామచంద్ర పరమహంసలు, ‘భారతదేశంపై 450 సంవత్సరాలుగా ఉన్న మచ్చను, హిందూత్వ యోధులు బాబ్రీ మసీదును కూల్చడం ద్వారా తొలగించారని, ఇది హిందూత్వ సంస్కృతి, సామాజిక, రాజకీయ ఆచారాలకు ఒక పెద్ద చారిత్రక విజయం’ అని అన్నారు. ఇలాంటి చర్యలు మధురలో, కాశిలో చేపడుతామని బహిరంగంగానే ప్రకటించారు. ఇంకా గోరక్షణ, లవ్ జిహదీ, ఘర్ వాపసీ వంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో, అటవి ప్రాంతాల్లో గిరిజన తెగలను, ఆదివాసులను హిందువులుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
1984 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి రెండు స్థానాలతో అవమానకరమైన ఓటమిని చవిచూడడంతో, ఆరెస్సెస్ ‘మతం’ అనే ఒక మంచి జనసమీకరణ సాధనాన్ని కనిపెట్టింది. బిజెపికి ఒక ఆశాజనకమైన మార్గాన్ని చూపేందుకు విశ్వహిందూ పరిషత్ తన మొదటి సమావేశంలో, ఆయోధ్యలో రామజన్మ భూమిని ‘‘విముక్తి’’ చేసేందుకు 1984లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆనాటి నుంచి ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే దేశం అనే నినాదాన్ని ఇస్తోంది. ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నినాధాలు కూడ ఇస్తోంది. ‘‘మతాన్ని ఆచరించడం, ప్రజా సమూహాన్ని ఏకీకరణ చేయడం, హిందూ మతాన్ని, మందిరాలను అభివృద్ధి చేయడం’’. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత, ‘హిందూమత రాజ్య స్థాపనే’ లక్ష్యంగా పనిచేస్తున్న ఆరెస్సెస్ ప్రజలను మత ప్రాతిపదికన విభజించి, తన ఎజెండాను ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో ఇప్పుడు లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ పటేల్ ద్వారా పెట్టుబడి అనుకూల, ముస్లిం వ్యతిరేక హిందూత్వ అనుకూల విధానాలను అమలు చేయిస్తోంది.
ప్రపుల్ పటేల్ నియంతృత్వ పాలన :
ఈ దీవులను ఇప్పుడు పట్టి పీడిస్తున్న అశాంతి, ఇబ్బందులు కొవిడ్ మహమ్మారి వల్ల వచ్చినవి కావు. కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ ఖోడా పటేల్ అప్రజాస్వామిక, అనాగరిక చర్యల వల్ల వచ్చినవే. ఇప్పటివరకు లక్షద్వీప్‌కు వచ్చిన అడ్మినిస్ట్రేటర్లు అందరూ కూడా ఐఎఎస్ అధికారులే. ఇప్పటిదాకా ఉన్నతాధికారులనే పాలనాధికారులుగా నియమించే సాంప్రదాయం ఉంది. లక్షద్వీప్ పరిపాలకుడిగా ఉన్న దినేశ్వర్ శర్మ మృతి తరవాత ప్రపుల్ ఖోడాకు ఆ బాధ్యతలు గత డిసెంబర్లో అప్పగించారు. లక్షద్వీప్‌కు శాసనసభ లేదు కనుక నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. మోడీ సర్కార్ ఇలాంటి ప్రాంతాలను తమ కుటిల పన్నాగాలకు ప్రయోగశాలగా వినియోగిస్తోంది. మొట్టమొదటిసారిగా గుజరాత్‌కి చెందిన రాజకీయ నేతను ఇక్కడ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. డామన్ సముద్ర తీరంలో ఆదివాసీల నివాసాలను ధ్వంసం చేసి వారిని నిరాశ్రయులుగా చేసిన ప్రపుల్ పటేల్ వివాదాస్పదుడిగా పేరొందారు. నిరసన వ్యక్తం చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా జైలులో పెట్టించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజకీయనేతకు ఇటువంటి కీలక బాధ్యతలు అప్పగించడమే వివాదాస్పదమైంది. ఆయన బాధ్యతలు స్వీకరించగానే కఠినంగా అమలవుతున్న కరోనా నిబంధనలను ఎత్తివేయడం ద్వారా అప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా లేని లక్షద్వీప్‌లో పది శాతం మందికి కరోనా వైరస్ సోకడానికి పటేల్ కారణమయ్యారు. పటేల్ చర్యల వల్ల ఎన్నడూలేని విధంగా కరోనా విజృంభించిందనే భావన ప్రజల్లో భయోత్పాతాన్ని నిరసనను పెంచింది. అంతవరకు అమల్లో ఉండిన కొవిడ్ నిరోధక పద్ధతిని పటేల్ ప్రభుత్వం మార్చి వేసింది. బయటి నుంచి వచ్చే వారికి ఆర్టిపిసిఆర్ పరీక్ష చేసి వారం రోజుల పాటు క్వారంటె•న్లో ఉంచే విధానాన్ని పటేల్ రద్దు చేశాడు. దీంతో ఇప్పుడు అక్కడ దాని వ్యాప్తి తీవ్రమైంది. ప్రజల అసంతతృప్తి మరింత పేట్రేగింది. భారత దేశ భౌగోళిక సాంస్కృతిక వైవిద్యంలో లక్షద్వీప్ అసమాన స్థానాన్ని అలంకరించింది. అభివృద్ధి పేరుతో దానిని చెదరగొరట్టే ప్రయత్నాలు ఆపించాలని ప్రజలు ఒక లేఖలో ప్రధానిని కోరారు.
కేంద్ర పాలక పక్షం బిజెపి విధానాలకు అనుగుణంగా ఆ ప్రాంత రూపురేఖలను మార్చివేసే వ్యూహానికి పటేల్ పదును పెట్టడం మొదలు పెట్టారు. కేవలం 32 చదరపు కి.మీల అతి తక్కువ విస్తీర్ణంలోని ఈ దీవులకు ఆధునిక అంతర్జాతీయ వాణిజ్య స్థాయి పర్యాటక కేంద్ర రూపును కల్పించడం కోసం లక్షద్వీప్ డెవలప్మెంట్ అధారిటీ (ఎల్డిఎ)ని నెలకొల్పారు. జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వందలాది చెట్లను, ఇళ్లను కూల్చివేసే పనిని పటేల్ తలపెట్టారు. ఇందుకోసం సంబంధించిన వారి అనుమతి లేకుండా ఎక్కడి ఎటువంటి భూమినైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఎల్డిఎ ద్వారా అడ్మినిస్ట్రేటర్ సంక్రమింప చేసుకున్నారు. కారణం చెప్పకుండా ఎవరినైనా అరెస్టు చేసి ఏడాది పాటు నిర్బంధించడానికి అవకాశమిస్తున్న సంఘ వ్యతిరేక చర్యల క్రమబద్ధీకరణ చట్టాన్ని తీసుకు వచ్చారు. అడ్మినిస్ట్రేటర్ చర్యలను చట్టబద్ధంగా, ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రశ్నించే వారిని కూడా జైళ్లలో తోయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.
పటేల్ తెచ్చిన మూడు నిరంకుశ చట్టాలు :
పటేల్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు చట్టాల డ్రాఫ్ట్ (ముసాయిదాలను) తీసుకువచ్చారు. ఆ మూడు చట్టాల లక్ష్యం ముస్లిం రహిత లక్షద్వీప్. ఈ మూడు చట్టాలలో మొదటిది గూండా యాక్ట్ -2021. సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక ముసాయిదాను తీసుకువచ్చారు. దీనిలో భాగంగా పరిపాలనాధికారి అనుమానం వస్తే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ వ్యక్తినైనా ఏడాది వరకూ అదుపులో తీసుకుని నిర్బంధించవచ్చు. విచారణ కూడా ఉండదు. బెయిల్ దొరకదు. దేశంలో అతి తక్కువ నేరాలు నమోదయ్యే ప్రాంతాల్లో లక్షదీవులు ఒకటని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అసలు నేరాలే జరగని ప్రాంతంలో, ఇలాంటి చట్టాల అవసరము ఏముంది అని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిజెపి ఉద్దేశం ముస్లింల అణిచివేత తప్ప మరొకటి కాదు. ముస్లింలు అత్యధిక సంఖ్యాకులుగా ఉండడం మోడీ సర్కారుకు హిందూత్వ అజెండాను అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక రెండవ చట్టం లక్షద్వీప్ జంతు సంరక్షణ నియంత్రణ చట్టం- 2021. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా గొడ్డు మాంసం అమ్మడం, నిల్వ ఉంచుకోవడం, రవాణా చేయడం, అమ్మకానికి ప్రదర్శించడంతో పాటు బీఫ్ ఉత్పత్తులు కొనడంపై కూడా ఈ నిషేధం ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా ఉంటుంది. దీని అసలు ఉద్దేశం బిజెపి అవలంభిస్తున్న మత రాజకీయాల ప్రయోజనాలు మాత్రమే. లక్షద్వీప్ జనాభాలో 97 శాతం వరకు ఉన్న ముస్లింల ఆహారాన్ని నిషేధించడానికి జంతు పరిరక్షణ సాకుగా మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పటిదాకా ఈ దీవులలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. ఇప్పుడు మద్యపానానికి అనుమతి ఇచ్చారు. పైగా టూరిస్టు కేంద్రంగా అభివృద్ధి కోసం ఈ చర్యలు తీసుకున్నాం అని చెబుతున్నారు. ఈ విధంగా అక్కడ దీవుల్లో భౌగోళిక విభజన వంటి పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శలు బయలుదేరాయి. ఈ ముసాయిదా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమల్లో గల గోవధ నిషేధ చట్టాలకు నకలుగా ఉంది.
ఇకమీదట జంతువులను చంపాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు తీసుకోవడం తప్పనిసరి చేశారు. ఇక్కడి జనం ఆవులను వ్యవసాయానికీ, పాడి అవసరాలకు వినియోగిస్తారు. ఆవు మాంసం తింటారు. ఈ చట్టం ద్వారా వారి ఆహార అలవాట్లలో జోక్యం చేసుకోదలచారని స్పష్టపడుతున్నది. అంతేకాక పశు సంవర్దక శాఖను రద్దు చేసి అందులో పనిచేస్తూ వచ్చిన వారిరందరినీ రోడ్లమీదికి తరిమేశారు. పెద్ద పెద్ద పాడి ఉత్పత్తి క్షేత్రాలను మూయించి వేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ డెయిరీలను మూసివేసి గు•రాత్‌కు చెందిన అమూల్‌కు మాత్రమే పాల విక్రయానికి అనుమతిచ్చారు. దీంతో తమ ప్రాంతాన్నే గుజరాత్‌కు వలసగా మారుస్తున్నారన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఏర్పడింది. ప్రజల ఆచార వ్యవహారాలు, భాష, సంస్కృతి, జీవనోపాధి చివరకు తినే ఆహారం విషయంలో కూడా పాలనాధికారి జోక్యం చేసుకుంటుండటంతో స్థానిక ప్రజలకు తిరగబడటం తప్ప మరోమార్గం లేకుండా పోయింది.
ఇక మూడవది అత్యంత వివాదాస్పదమైన డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ ఆథారిటీ రెగ్యులేషన్-2021. ద్వీపంలో ప్రస్తుతం ఉన్న భూ యాజమాన్యాన్ని మార్చాలని దీని ప్రతిపాదన. ‘‘అభివృద్ధి’’ కార్యకలాపాల కోసం ఏ భూమినైనా లాక్కునే అధికారాన్ని ఈ చట్టం ప్రభుత్వానికి ఇస్తుంది. దీని అర్థం ‘‘ప్రజా ప్రయోజనం’’ కోసం భూమిని ఇచ్చిన యజమానికి ఇక ఆ భూమిపై హక్కు ఉండదు. స్థానిక ప్రజలు తమ ఆస్తిని ఎప్పుడైనా పరిపాలనాధికారి స్వాధీనం చేసుకుంటాడనే భయంతో ఎప్పటికీ జీవించాల్సి ఉంటుంది. పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల పేరిట హోటళ్లు, లాడ్జ్‌లు, రహదారులు నిర్మిస్తారు. ఇంకా రైల్వే లైన్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి నివాసితుల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం పాలకులకు అనుమతిస్తుంది. అంతేకాక అక్కడ ‘‘15 మీటర్ల వెడల్పు’’ ఉన్న రహదారులను నిర్మించే ప్రణాళికలు రూపొందించారు. కాని స్థానికులు లక్షద్వీప్‌కు రహదారులు అవసరం లేదని, అలాంటి ప్రాజెక్టులు దీవుల పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
హక్కులను, భద్రతను చిధ్రం చేస్తున్న పటేల్ :
లక్షద్వీప్‌లోని ముస్లింలు భారతదేశంలో అరుదైన ముస్లిం సమూహాలలో ఒకటి. వీరు షెడ్యూల్డ్ తెగగా వర్గీకరించబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రి•ర్వడ్ కోటా, రాష్ట్రం నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో సీట్లు, గ్రామ, జిల్లా కౌన్సిళ్ల స్థానిక కార్యనిర్వాహక పదవులు వారికి రిజర్వు చేయబడ్డాయి. పటేల్ నిర్ణయాలు ముస్లింల నుంచి అధికారాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఎన్నుకోబడిన కౌన్సిల్ ప్రతినిధులు ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, పశుసంవర్ధక, మత్స్య సంపద వంటి అంశాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అనేక సమస్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం పోతుంది. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే ఈ విషయాలు పరిపాలనాధికారి ప్రత్యక్ష నియంత్రణలోకి వస్తాయి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి సముద్రంలో చేపలు ప•్టడం, కోస్టల్ రెగ్యులేటెడె జోన్ (సిఆర్‌జడ్) నిబంధనల పేరిట మత్స్యకారుల పడవల యార్డులను అక్రమ నిర్మాణాలంటూ కూల్చి వేస్తున్నారు. అంగన్వాడీలను మూయించి వేశారు.
పంచాయితీలకు పోటీ చేసే వారికి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదంటున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, మత్స్య పరిశ్రమ, విద్య, పశు పాలనలో అంతకు ముందు పంచాయితీల ప్రమేయం ఉండేది. అదీ కుదరదంటున్నారు పటేల్. అన్నీ తన ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. దీనివల్ల ఈ రంగాలలో పని చేసేవారు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కేరళలోని బేపోర్ రేవు నుంచి అక్కడికి సరుకులు చేరేవి. ఆ సంబంధాన్ని పటేల్ తుంచేశారు. తరతరాలుగా కేరళతో ఉన్న సంబంధాలను పటేల్ విచ్ఛిన్నం చేస్తున్నారు. కేరళలో జనం మాట్లాడేది మలయాళం కనక అక్కడి పాఠశాలలు కేరళ పాఠశాల బోర్డుకు అనుగుణంగా ఉంటాయి. కేరళ హైకోర్టు పరిధిలో లక్షద్వీప్ ఉంది. కనుక పటేల్ అభివృద్ధి వ్యవస్థ మాకు అక్కర్లేదు మొర్రో అని ప్రజలు అంటూ ఉంటే ప్రపుల్ ఖోడా పటేల్ అది అమలు కావాల్సిందేనని పట్టుపడ్తున్నారు. మొత్తంగా లక్షద్వీప్‌లో కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యానికి దారులు వేస్తున్నారు. మైనింగ్ కార్యక్రమాలకు అనుమతులిస్తున్నారు. వీటి కోసం ప్రజల భూములను నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకునే హక్కు పాలనాధికారికి దఖలు పడింది.
ప్రపుల్ ఖోడా పటేల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 500 మంది సాధారణ, కాంట్రాక్టు కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. లక్షద్వీప్ ప్రభుత్వం నడుపుతున్న పర్యాటక సంస్థ, సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ నేచర్, టూరిజం అండ్ స్పోర్టస్ ఫిబ్రవరిలో దాదాపు 200 మంది కాంట్రాక్టు సిబ్బందిని రద్దు చేసింది. వాటిని బయటి వారితో (గు•రాతీలతో) భర్తీ చేయబోతున్నారు. అనేక పాడి క్షేత్రాలు మూసివేయబడ్డాయి. అక్కడి పశువులను వేలం వేయబోతున్నారని ప్రజలు చెబుతున్నారు. గుజరాత్ కేంద్రంగా ఉన్న ఒక పాడి దిగ్గజాన్ని ద్వీపాలలో దాని రిటె•ల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేయడమే పటేల్ ప్రణాళిక అని వారు ఆరోపణలు ఉన్నాయి. ఇది గుజరాత్ అభివృద్ధి నమూనా. ఇది దేశానికీ అవసరమంటూ కార్పొరేట్లు అమలు చేసే అభివృద్ధి నమూనా. ఇప్పుడు లక్షద్వీపాలకు చేరింది.
ఇప్పుడు పటేల్ లక్షద్వీప్‌లో గుజరాత్ నమూనా-హిందూత్వ నయా ఉదారవాద విధానాలను అమలు చేయాలని చూస్తున్నారు. ఈ హిందూత్వ ప్రయోగాన్ని భరించాల్సి ఉంటుందని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రజల భూ హక్కులపై పటేల్ దాడి ప్రారంభించారు. పట్టణ ప్రణాళిక లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలు తమ ఆస్తులను వదులుకోవడానికి లేదా వేరేచోటుకు వెళ్ళిపోవడానికి లక్షద్వీప్ అభివృద్ధి ఆథారిటీ నియంత్రణ ముసాయిదా వీలు కల్పిస్తోంది. బిల్డింగ్, ఇంజనీరింగ్, మైనింగ్, క్వారీయింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజల నుండి ఏ భూమినైనా స్వాధీనం చేసుకునేందుకు నిరంకుశ భూ విధానం ప్రతిపాదిస్తోంది. దీనివల్ల సున్నితంగా ఉండే పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. వివిధ విభాగాల నుండి వందలాది మంది తాత్కాలిక, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు.
తీవ్రమవుతున్న ప్రజాందోళన :
ప్రపుల్ పటేల్, జూన్ 14 నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్‌లో ఆయన పర్యటించనున్నారు. ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై మంతనాలు జరుపుతారు. ఉద్యమం తారస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు.కళ్ల ముందే మాతృ భూమికి మరణ శాసనం రాస్తుంటే ఎవరైనా ఊరుకుంటారా. ప్రపుల్ పటేల్ అనుసరిస్తున్న నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా నిరసనలతో లక్షద్వీప్ హోరెత్తుతోతంది. కేంద్ర పాలకుడి అర్థంలేని నిర్ణయాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా అక్కడ నిరసనలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపుల్ను తక్షణం వెనక్కు పిలవాలని(రీకాల్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జూన్ 7న 12 గంటల పాటు నిరాహార దీక్షలు చేపట్టారు. కరోనా నిబంధనల దృష్ట్యా లక్షద్వీప్‌లోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎవరి ఇళ్లలో వారే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్షలో పాల్గొన్నారు. మూతులకు ముసుగులు బిగించుకొని, చాతీ మీద ప్లకార్డులు పెట్టుకుని ప్రజలు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్లెలా చేశాయి.
ఒకచోట లక్షద్వీప్ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సముద్రంలో ముగిని ‘సేవ్ లక్షద్వీప్’ సహా… కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు ఉన్న ప్లకార్డులను నీటి అడుగున ప్రదర్శించారు. బిజెపి అధ్యక్షుని ఫిర్యాదు మేరకు ప్రముఖ ఫిల్మ్‌మేకర్, సామాజిక కార్యకర్త అయిషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి నిరసనగా 15 మంది బిజెపి సభ్యులు రాజీనామా చేశారు. ఇలా ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రజాగ్రహాన్ని అణచివేసే చర్యలు తీవ్రమవుతున్నాయి. లక్షద్వీప్‌లోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో కలిసి ఏర్పడిన ‘సేవ్ లక్షద్వీప్ ఫోరం’ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చిన ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ దీవులన్నిటా జరిగిన మొదటి ఆందోళన ఇది అని పేర్కొన్నారు.
ప్రపుల్ నిరంకుశ విధానాలను వ్యతిరేకించడంలో లక్షద్వీప్‌లోని అన్ని పార్టీలు, సంఘాలు ఏకతాటిపై నిలబడ్డాయి. అడ్మినిస్ట్రేటర్‌తో పాటు కలెక్టర్ అక్షర్ అలీని కూడా వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. లక్షద్వీప్ ప్రజల జీవనాన్ని, వారి జీవనోపాధిని, అక్కడి సంస్కృతిని దెబ్బతీసేలా ప్రపుల్ చర్యలు ఉన్నాయి. బిజెపి మతతత్వ అజెండాను అమలు చేసేందుకు, కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాజా నిబంధనలు భూహక్కులను హరించడంతో పాటు స్థానిక ప్రజల జీవనశైలిక పూర్తి భిన్నంగా ఉన్నాయి. బీఫ్‌పై నిషేధం, ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులని తేల్చేయడం, రిసార్టుల్లో మద్యానికి అనుమతి ఇవ్వడం, ఎలాంటి కారణం చూపకుండా ఎవరినైనా అరెస్టు చేసేలా యాంటీ గూండా చట్టం తీసుకురావడం పట్ల లక్షద్వీప్ వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పటేల్ తెచ్చిన ‘లక్షద్వీప్ డెవలప్మెంట్ ఆథారిటీ రెగ్యులేషన్’ ముసాయిదాను రద్దుచేయాలన్నది వారి ప్రధాన డిమాండ్ అభివృద్ధి పేరిట ఈ ద్వీపం భౌగోళిక, భౌతిక స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేసే ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ 90 మందికి పైగా విశ్రాంత ఐఎఎస్ అధికారులు ప్రధాని మోడీకి ఇటీవల లేఖరాసిన విషయం తెలిసిందే. ముసాయిదా రూపకల్పన ఏకపక్షంగా, పాలకుడి ఆలోచనలకు అనుగుణంగా జరిగింది తప్ప, పౌరసమాజాన్ని సంప్రదించలేదని వారు అన్నారు. కేరళతో వందలాది సంవత్సరాల సామాజికార్థిక, సాంస్కృతిక సంబంధాలున్న ఈ ప్రాంతాన్ని దానికి దూరం చేసి, భవిష్యత్తులో కర్ణాటకతో అనుసంధానించడానికి ఈ ముసాయిదాలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మంగళూరు రేవు ద్వారా లావాదేవీలు, ఆపదలో ఉన్నవారిని హెలికాప్టర్లల్లో కేరళకు తరలించే సంప్రదాయానికి స్వస్తి చెప్పడం వంటివి ఇందులో భాగమే. కేరళకు చెందిన పార్లమెంటు సభ్యులు లక్షద్వీప్‌లో జరుగుతున్న ఆందోళనకు గల కారణాలను తెలుసుకోవడానికి నిజనిర్ధారణకు సందర్శిస్తామంటే పాలనాధికారి కరోనా సాకుతో అడ్డుకోవడం ఆయన నిరంకుశత్వానికి పరాకాష్ట.
ముగింపు :
36 దీవుల సముదాయమైన లక్షద్వీప్‌లో ఒక దీవి సముద్ర జలాల్లో మునిగిపోగా, 35 మనుగడలో ఉన్నాయి. వాటిలోనూ 10 దీవుల్లోనే జనావాసాలు ఉన్నాయి. వీటిని విడిచిపెట్టి మిగిలిన దీవులను అభివృద్ధి చేయవచ్చు. అది కాదని జనావాసాల పైనే దాడి జరపడమేమిటని కేరళ, లక్షద్వీప్‌లలోని భాజపా వర్గీయులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ప్రపుల్ పటేల్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. లక్షద్వీప్ ప్రజలకు ఆధునిక నాగరిక సదుపాయాలు కొరవడి ఉండవచ్చును. కానీ వారి సంస్కృతి విశిష్టమైంది. దాన్నంతటినీ ధ్వంసం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు పటేల్. ఆధునికతకు దూరంగా ఉన్నా లక్షద్వీప్ ఒక రకంగా స్వర్గతుల్యమైందే. కానీ ప్రపుల్ ఖోడా పటేల్ నిర్వాకం వల్ల అక్కడి భూ స్వరూపమే మారిపోతోంది. సముద్ర తీరాలను నాశనం చేసి లక్షద్వీప్‌ను డబ్బు సంపాదించే ప్రాంతంగా మార్చాలన్నది పటేల్ సంకల్పంలా ఉంది.
పటేల్ ప్రవేశపెడుతున్న పద్ధతులు తమ జీవన విధానాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అంతిమంగా అక్కడ తమ ఉనికికి ముప్పు కలిగిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. లక్షద్వీప్‌తో సన్నిహిత సంబంధాలున్న కేరళలో అక్కడి పరిణామాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీవుల్లో జరుగుతున్నది కేవలం అడ్మినిస్ట్రేటర్ మాత్రమే చేయిస్తున్నది కాదని కేంద్ర పాలకులు తమ సంఘ్ పరివార్ విధానాల అమలు కోసం జరిపిస్తున్న సాంస్కృతిక దాడి అని కేరళలోని పాలక, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో లక్షద్వీప్ ముస్లింల ఆందోళనలు పరిశీలిస్తే ఇవి ఏవి విడిగా లేవని అర్థమవుతాయి. ఇప్పటిదాకా దేశమంతా సాగుతున్న, ముస్లిం వ్యతిరేకత ఇప్పుడు లక్షద్వీప్‌లకు చేరింది. రెండు సంవత్సరాలుగా కశ్మీర్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు లక్షద్వీప్‌లో అదే జరుగబోతున్నట్లు విధితమవుతుంది. లక్షద్వీప్‌కు ఫాసిస్టు ధోరణులు చేరినట్లే, దాని ప్రతిఘటనకు కూడా లక్షద్వీప్ కేంద్రం కాబోతోంది.
ఇక్కడి ప్రజల రాకపోకలు, వాణిజ్య వ్యవహారాలు తరతరాలుగా కేరళతో ముడిపడి ఉన్నాయి. కేరళ కోజికోడ్ జిల్లా నుండి లక్షద్వీప్‌కు జరిగే వాణిజ్య కార్యకలాపాలను ఆయన నిషేధించారు. లక్షద్వీప్‌లో ఆవుల సంఖ్య చాలా తక్కువ! అవి కూడా ప్రభుత్వ డెయిరీల వద్ద తప్ప ప్రజల దగ్గర లేవు. అదే విధంగా దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల రేటు 2.2గా ఉంటే, లక్షద్వీప్‌లో 1.4 మాత్రమే! అయినా బీఫ్ నిషేధం, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదన్న ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం జనాభాను లక్ష్యం చేసుకోవడమే కదా! లక్షద్వీప్‌లో చట్ట సభ లాంటివి లేవు కనక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికే లేదు. అక్కడి ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నది ప్రపుల్ ఖోడా పటేల్ తమకు అక్కర్లేదనే. అందువల్ల అక్కడి ముస్లిం ప్రజలకు మద్దతివ్వడం మన పోరాట కర్తవ్యం కావాలి.