లందల్ల ఎగిసిన రగల్ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్ రగల్ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు. విప్లవకారుడు.

ఎక్కడి యిందూరు. ఎక్కడి హైదరాబాద్. దారిపొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు నీళ్లులేక గొంతెండిన బతుకుల గోసను విన్నాడు. రాజ్యహింసలో తల్లడిల్లుతున్న పల్లెల గోడును చూశాడు. అక్షరం అతనికి ఆయుధమైంది. నడవాల్సిన తొవ్వను చూపింది. భావాలను సాయుధం చేశాడు. సున్నితమైన భావాల సలంద్ర. గొంతెత్తి పాడిన గోరువంక. నెత్తురోడే నెలవంకల కవాతు. జీవితాన్ని ప్రేమించినంత లోతుగా చావునూ ప్రేమించిన విలుకాడు. ఆ చావుకు సార్థకత వుండాలని తపించాడు. చివరి ఊపిరిదాకా జనం కోసమే బతికాడు.

సలంద్ర లక్ష్మీనారాయణ 12 జనవరి 1956లో నిజామాబాద్లోని దారు గల్లీలో పుట్టాడు. నిరుపేద కుటుంబం. పాఠశాల వయసులోనే (1972లో) హేతువాదం వైపు నడిచాడు. కర్మ సిద్ధాంత పునాదులపై నిర్మించిన పుక్కిటి పురాణాలను ప్రశ్నించాడు. భావవాదాన్ని ధ్వంసం చేశాడు. చిన్ననాటి నుంచే అన్వేషణ. తీరని దాహాల అన్వేషణ. అక్షరాల్లో వెల్లువెత్తిన వేనవేల సంద్రాల్ని గుండెల్లో నింపుకున్నాడు. సాగిపోయాడు. కలలై. అలలై. పాటలై హోరెత్తాడు. 1973లో హైదరాబాద్లో ఇంటర్ పూర్తిచేశాడు. చుట్టూ అలముకున్న చీకట్లు. పేదరికం. కన్నీళ్లు. కష్టాలు. గుండెతడి వున్న మనిషి కదా. మనుషుల కోసం తపించాడు. అతనికి బతుకే ఓ యుద్ధమని తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రతిఘటనై నిలబడ్డాడు. కలబడ్డాడు. నమ్మిన విశ్వాసాల కోసం పల్లేరుగాయల్ల నడిచాడు. సలపరించే గాయాలు. మానని గాయాలు. కళ్లెదుటే ధ్వంసమైపోతున్న స్వప్నాలు. అతణ్ని రాటుదేల్చాయి. వడిసెల రాయిలా మలిచాయి. అందుకే గురితప్పని విలుకాడయ్యాడు. ఎక్కుపెట్టిన పద్యమయ్యాడు.

సలంద్ర నక్సల్బరీ రాజకీయాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాడు. ‘దున్నేవారికే భూమి’ నినాదం విప్లవాన్ని ప్రేమించేలా చేసింది. సామాజిక బాధ్యతగా జర్నలిజాన్ని ఎంచుకున్నాడు. 1974లో ‘యిందూరు వాణి’ పత్రికకి అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశాడు. ‘ప్రజారాజ్యం‘ పత్రిక ఎడిటింగ్ లో సహాయకుడిగా, ‘ఆంధ్ర పత్రిక’కు విలేకరిగా పనిచేశాడు. 1975లో సిద్ధాంత విబేధాల వల్ల ‘యిందూరు భారతి’కి రాజీనామా చేశాడు. 1975లో బైస రామదాసు ‘కేకలు’ పత్రిక స్థాపించాడు. ఆ పేరును సూచించింది సలంద్రే. ఆ పత్రిక రూపొందడం వెనక సలంద్ర కృషి వున్నది.

అదేకాలంలో ప్రజాసాహితి సంస్థ ప్రచురణలు ప్రారంభమయ్యాయి. ఆ సంస్థ ప్రథమ కార్యదర్శిగా ఉంటూ వేడిగాలి సంకలనం ప్రచురించాడు. అప్పటికి డిగ్రీ చదువుతున్నాడు. ఇరవయేళ్ల వయసులోనే లోతైన జీవన తాత్వికత అలవడింది. జీవితంలోనూ, కవిత్వంలోనూ. 1977లో నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. పల్లె పల్లెనా తిరుగుతూ అంబేద్కర్ ని పరిచయం చేశాడు. మార్క్సిజాన్ని అధ్యయనం చేశాడు. గతితార్కిక చారిత్రక భౌతికవాదం వెలుగులో సమాజాన్ని విశ్లేషించాడు. మార్క్సిజమే మార్గమనీ, సోషలిజమే ప్రత్యామ్నాయమని నమ్మాడు.

1979లో ప్రజాసాహితి ప్రచురణగా ‘చావుగీతం’ ప్రకటించాడు. 1980లో విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. 1982లో ఉస్మానియా యూనివర్శిటీలో చేరాడు. అక్కడ రాడికల్ విద్యార్థుల సహచర్యం సలంద్ర ఆలోచనల్ని విశాలం చేశాయి. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజం, న్యాయశాస్త్రం చదివాడు. ఒకవైపు చదువు. పత్రికా రచన. మరోవైపు విప్లవ రాజకీయాలు. ఆంధ్రభూమిలో పార్ట్ టైమ్ విలేఖరిగా పనిచేశాడు. సలంద్ర సహచరులకు ఓయూ క్యాంపస్లోని సి హాస్టల్ రాజకీయ చర్చల కేంద్రంగా ఉండేంది. సాంబమూర్తి, ఖలీల్, అల్లం నారాయణ, మరికొందరు రాడికల్ విద్యార్థులకు నీడనిచ్చిన తావది. క్యాంపస్ గోడలపై నక్సల్బరీ రాజకీయ నినాదాలు విద్యార్థుల్ని ఉత్తేజపరిచేవి. బీడీ ముక్కను రంగుల్లో ముంచి వాల్ పోస్టర్ రాసేవాడు సలంద్ర. ఆర్ట్స్ కాలేజీ ఎన్నికల్లో ఆర్ ఎస్ యూ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. 1983లో రమను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. 1985లో జర్నలిస్టు యూనియన్ కి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

ప్రజా రాజకీయాల ఆచరణలో ఉంటూనే కవిత్వానికి పదును పెట్టుకున్నాడు. పాటలు రాశాడు. గుండె గుండెనూ మండించే రగల్ జెండా రణన్నినాదాల్ని గోడలపై అందమైన అక్షరాల్లో రాసేవాడు. అతని మునివేళ్లు తాకని నినాదం లేదు. అతని గొంతులో రగలని సమరనాదం లేదు.
పెద్ది శంకర్ అమరత్వంపై అద్భుతమైన పాట రాశాడు. ఈ పాట ఆనాటి రాడికల్స్ లో ఉజ్వల గీతికగా మార్మోగింది. ‘జన్ను చిన్నాలో… గన్ను చిన్నాలో’ అంటూ చిందేస్తూ పాడేవాడు. భూతల్లి ఒడిలో పెరిగిన చెమట చిత్తడి జీవితాలను గానంచేశాడు. ‘జన్నూ నువు చావలేదు… చావు నీకు లేనేలేదు…’అంటూ గన్నులై పేలుతామన్నాడు. ఈ పాట ‘జనం చిన్నాలు’ కవితా సంకలనం లో అచ్చయింది.

‘‘పొద్దింకా పొడవలేదు
పోరాటం ఆగలేదు
పెద్ది శంకరూ నీకు
పోరాటపు లాల్ సలాం…’’ అమరుడు పెద్ది శంకర్ జ్ఞాపకాల్లో రాసిన పాట. ప్రాణహిత అడుగుతోంది నువ్వెక్కడ పోయావని. చెరచబడ్డ చెల్లెలు కుమిలి ఏడుస్తోంది. మూగబోయిన మొయిబిన్ పేట. జన సంద్రపు అలలకు చావులేదు. అట్లా ఈ భూమిపై ఎప్పటికీ చావులేని మనుషుల గురించి తపనపడ్డాడు సలంద్ర. కామ్రేడ్ వీవీ రాసినట్టు… ‘తల్లి గర్భానికీ స్మశానానికీ మధ్య ఊరేగింపు’ సలంద్ర కవిత్వం. పాట. మాట. వాన చినుకై జనం కనుపాపల్ని ముద్దాడిన సలంద్ర ఆట. చిందాట.
‘‘నేను
భూమికీ.. ఆకాశానికీ వున్న
సంబంధాన్ని చెప్తే వీళ్లు
నవ్వుతారు…’’ అని కోరస్ పాడాడు. ఆలోచనలకూ ఆచరణకూ అర్థంచెప్తే వీళ్లే అపార్థం చేసుకుంటారు’’ అని వాస్తవికతను చెప్పాడు. (సృజన, ఫిబ్రవరి 1978). విప్లవకారుల మహోన్నత ఆశయాలను చెప్తూ…
‘‘కొందరు నన్ను
సుత్తిగా పిలిస్తే
మరికొందరు కొడవలిగా పిలుస్తారు…’’ అన్నాడు. ఎవరే పేరుతో పిలిచినా నేను మాత్రం శ్రమైక జీవినే. ఘర్మ బిందువునే అన్నాడు. (అరుణతార, జూన్ నవంబర్ 1978)

యూనివర్సిటీల్లో వీరంగమాడే కాషాయ మూకలకు సలంద్ర ముగుతాడు వేశాడు. ‘ఈ దేశంలో ఉండాలంటే వందేమాతర గీతం పాడాల్సిందే’ అని విర్రవీగిన తామర పూలను తన అక్షరాలతో తూర్పారబట్టాడు. మతోన్మాద మత్తులో జోగుతూ, కులోన్మాదంలో పొర్లాడే దారితప్పిన యువతను సొంత అన్నలా మందలించాడు. మార్పు తెచ్చాడు. మానవత్వాన్ని మరిచి జాతీయతను ప్రశ్నించే దగుల్బాజీల భావాలకు అగ్గిపెట్టాడు. నేటికీ కొనసాగుతున్న మధ్య యుగాల నాటి భావాలను దగ్ధం చేశాడు. నిలువెల్లా ధ్వంసంచేశాడు. ఈ నేపథ్యంలో సలంద్ర రాసిన కవిత. ‘జాతీయత’.
‘‘స్మశానంలో అడుగుపెట్టి
శవాలకు ప్రాణం పోయాలనుకునే
తెలివిలేని తమ్ముడూ

కుళ్లునీ కుట్రల్నీ కుహకాల్నీ
సంస్కృతి పేరిట పహారా కాసే
మత మౌఢ్యపు కుక్కా

ఆలోచనలకూ కాంతి కిరణాలకీ
జాతీయత వుండదు
భావాలు ఎక్కడ పుట్టినా ఒక్కటే
భావాలు భావాలే

సూర్యుడి జాతీయత
ముందు ఏదో కనుక్కో
నా జాతీయత ఏదో తెలుస్తుంది నీకు…’’
(అరుణతార, జనవరి 1981)

సలంద్ర 1981లో ‘దళిత్ మానిఫెస్టో’ ప్రకటించాడు. ఇది ఆనాటి యువతరాన్ని ఆలోచింపజేసింది. నడవాల్సిన దారిని చూపింది. మనిషిని మనిషిగా చూడని మతాన్ని ధ్వంసంచేయాలని పిలుపునిచ్చాడు. కులాన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నాడు. అంతిమంగా వర్గపోరాటమే విముక్తి మార్గమని చాటాడు.

‘పొద్దింకా పొడవలేదు’, ‘కోరస్’, ‘మహోన్నతానంతం’, ‘అమరుడు’, ‘కాంట్రడిక్షన్స్’, ‘జాతీయత’, ‘నిప్పంటిద్దాం’, ‘దళిత్ మానిఫెస్టో’లాంటి అద్భుతమైన కవిత్వం రాశాడు. తన అనుభవాలను, ఆచరణాత్మకంగా పదునుపెట్టుకొనే సమయంలోనే సలంద్ర ఆరోగ్యం పాడైంది. రోజు రోజుకీ క్షీణించింది. వాంతులు, ఫిట్స్ ఎక్కువయ్యాయి. దీంతో 1986 సెప్టెంబర్ 14న ఉస్మానియా ఏఎంసీ వార్డ్ లో చేరాడు. వైద్యం అందుతున్న క్రమంలోనే అపస్మారక స్థితికి చేరాడు. మరుసటి రోజు ఫిట్స్ తగ్గాయి. అప్పడడప్పుడూ కొద్దిగా స్పృహలోకి వస్తున్నాడు. 16న మేల్కొన్నాడు. కళ్లు తెరిచాడు. మనుషుల్ని గుర్తించాడు. మెడినోవాలో పరీక్షించారు. ట్యూమర్ గ్లోమా ఉన్నట్లు నిర్దారణయింది. ఆ మూడు రోజులూ మూత్రం రాక అవస్థ పడ్డాడు. 17న ఆకస్మికంగా ఊపిరొదిలాడు. తన జీవితమంతా ఉద్యమాలు, పోరాటాలే. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడిన సలంద్ర మరణం దినపత్రికల్లో సింగిల్ కాలమ్ వార్తయింది. సరైన వైద్యం అందక చనిపోతే, సాధారణ మరణంగా రిపోర్ట్ చేశారు. జర్నలిస్టులు హంతక వ్యవస్థకు కొమ్ముకాశారు.

సలంద్రకు జీవితమంటే ఎంత ప్రేమో… చావన్నా అంతే ప్రేమ. అందుకే జీవితాన్ని ప్రతీ క్షణం సంరంభంగా మార్చుకున్నాడు. ‘నా శవానికి నిప్పంటించండి’ అని రాసుకున్న కవితలో జీవితమంటే ఏమిటో చెప్పాడు. జీవితం విలువను చెప్పాడు.
‘‘చావుకు సైతం ఒక కిరీటం పెట్టిన
సెల్యూట్ చేయ వీలు కల్పించిన
ఒక భగత్ సింగ్ లా
ఒక అల్లూరిలా చావాలి…’’ అన్నాడు. అట్లాంటి సార్థక జీవితాన్ని కోరుకున్నాడు. అట్లనే బతికాడు.
సలంద్రే అన్నట్టు… పొద్దింకా పొడవలేదు. పోరాటం ఆగలేదు. లాల్ సలామ్ కామ్రేడ్ సలంద్ర.

(వచ్చే సంచికలో ‘సలంద్ర కవిత్వ విశ్లేషణ’… )

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ); సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు). ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Reply