రోమ్‌ ఓపెన్ సిటీ

ఇటలీ దేశం నుంచి, ఇటాలియన్ భాషలో (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో) వచ్చిన అపురూపమైన ఆవిష్కరణ “రోమ్‌ ఓపెన్ సిటీ”. ఇది ఇటాలియన్ నియోరియలిస్ట్ డ్రామా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు “రాబర్టో రోస్సెల్లిని”. దీని నిడివి 125 నిమిషాలు.
ఇతివృత్తం: ఇటలీ రాజధానీ నగరం రోమ్‌ మీద జర్మన్ నాజీసైన్యాల ఫాసిస్టు చర్యలకు, దురాక్రమణకు, దాడులకు వ్యతిరేకంగా ఇటాలియన్ ప్రజల నిరసనలు, ప్రతిఘటనలే ఈ సినిమా కథాంశాలు. యుద్ధ సమయంలో ప్రజల జీవితాలలోని అనుభవాలు, అవరోధాలు, రాజీలు, కుప్పకూలిపోవడాలు మొదలైన వాటిని కళ్ళెదుట నిలిపిన చిత్రం. జర్మన్ గెస్ట్ పో దళాల కంట పడకుండా ఒక విప్లవ నాయకునికి ఆశ్రయమిచ్చి, అతడిని కాపాడటానికి తాను బలైపోయిన ఓ యువతి కథ.

ఈ చిత్ర కథను క్లుప్తంగా చెప్పుకోవాలంటే, 1944లో జర్మన్ ఆక్రమిత రోమ్ లో, జర్మనీ నాజీ దళాలతో పాటు వారికి సహకరిస్తున్న ఇటాలియన్ ఫాసిస్టులకు వ్యతిరేకంగా కమ్యునిస్ట్, ప్రతిఘటనా బృందాలు పోరాడుతుంటాయి. వారి నాయకుడైన ఇంజనీర్ “జార్జియో మన్ ఫ్రెడి” ని జర్మన్ నాజీలు ఖైదు చేయటానికి ప్రయత్నిస్తుంటారు. జర్మన్ సైన్యాల రాకను పసిగట్టిన ఇల్లుగలావిడ జార్జియో మన్ ఫ్రెడిని ఇంకెక్కడైనా రహస్యంగా తలదాచుకొమ్మని హెచ్చరిస్తుంది. అతడు తక్షణం ఇళ్ళపై కప్పుల మీదనుంచి పైకెక్కుతూ వారిని తప్పించుకుంటాడు. అతను మరో రెసిస్టెన్స్ ఫైటర్, “ఫ్రాన్సిస్కో” ఇంటికి వెళతాడు. అక్కడతను తర్వాతి అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఫ్రాన్సిస్కో ప్రియురాలు “పిన”ను కలుస్తాడు. పిన, ఫ్రాన్సిస్కోకి కాబోయే భార్య. వారిద్దరూ త్వరలో వివాహం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటారు. పినా గర్భవతి కూడా. ఆమె అతనిని మొదట ఒక ఫాసిస్టు పోలీసుగా భావించి అతని పట్ల కఠినంగా ప్రవర్తిస్తుంది. కానీ అతను ఫలానా రెసిస్టెన్స్ బృందపు వాడినని స్పష్టంచేశాక, పినా మన్ ఫ్రెడిని, ఫ్రాన్సిస్కో అపార్ట్ మెంట్ లోకి స్వాగతిస్తుంది. ప్రతిఘటనోద్యమంలో భాగస్తురాలైన పినా సహాయంతో గియోర్గియో డాన్ పియట్రో పెల్లెగ్రినిని కలుస్తాడు మన్ ఫ్రెడి. ఆయన ఒక కాథలిక్ పూజారి. కానీ డాన్ పియట్రో ప్రతిఘటన సభ్యులకి రహస్యంగా సహాయం చేస్తుంటాడు. గెస్టపో దళాలు ప్రస్తుతం తనను వెంటాడుతున్నందువల్ల, తానేమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాననీ, నగరానికి వెలుపల ఉన్న ప్రతిఘటన బృందానికి అవసరమైన సందేశాలనూ, డబ్బునూ బదిలీ చేయమని డాన్ పియట్రోని అడుగుతాడు మన్ ఫ్రెడి.

డాన్ పియట్రో కేథలిక్ పూజారి గనుక పెళ్ళి పెద్దగా తర్వాతి రోజు పినా-ఫ్రాన్సిస్కోల వివాహాన్ని జరిపించడానికి ముగ్గురూ ఏర్పాట్లు చేసుకుంటారు. ఫ్రాన్సిస్కో ప్రతిఘటనా బృందంలో ఒక కీలకమైన కార్యకర్త. అతను మతాన్ని కానీ, దేవుణ్ణి కానీ నమ్మడు. కానీ ఒక ఫాసిస్ట్ అధికారి కంటే నిజాయితీపరుడు, దేశభక్తుడైన పూజారి ద్వారా వివాహ మాడటం నయమనుకుంటాడు. మరోవైపు పిన భక్తురాలే! కానీ ప్రజల కింతింత అన్యాయాలూ, భయంకరమైన దాడులూ జరుగుతుంటే, దేవుడనేవాడు చూస్తూ ఎలా ఊరుకోగలుగుతున్నాడు? అని మనసులో మథన పడుతూ ఉంటుంది. ఆమె మొదటి భర్త వల్ల కలిగిన కుమారుడు మార్సెల్లో, అతని స్నేహితులు ప్రతిఘటనోద్యమంలో, డాన్ పియట్రో నాయకత్వంలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ పనిచేస్తుంటారు. పినా సోదరి లారా ఆమెతోనే ఉంటుంది, కానీ రెసిస్టెన్స్ పోరాటంతో ఆమెకేమీ సంబంధం లేదు. పైపెచ్చు ఆమె నాజీలు, ఫాసిస్టులకు సేవ చేసే క్యాబరేట్లలో పనిచేస్తుంటుంది. లారాకి మరీనా అనే ఒక స్నేహితురాలుంటుంది. మరీనా కూడా క్యాబరేలో పనిచేస్తుంటుంది. ఈ మరీనా ఒకప్పటి మన్ ఫ్రెడి ప్రియురాలు. ఆమె తరచుగా వేశ్యగా కూడా పనిచేస్తుంటుంది. మన్ ఫ్రెడీ కోసం తపిస్తూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మరీనాకి, మన్ ఫ్రెడి పనిచేస్తున్న ఉద్యమం పట్ల ఏమాత్రం నమ్మకం గానీ, విశ్వాసం గానీ లేవు. భౌతిక వస్తువులు, విలాసాల పట్ల ఆమెకు మక్కువ ఎక్కువ. ఇప్పుడు అభిప్రాయ బేధాల వల్ల భవిష్యత్తులో ఇక ఆమెతో ఏ సంబంధం పెట్టుకోకూడదనుకుంటాడు.

నగరంలో స్థానికంగా ఉన్నజర్మన్ కమాండర్, ఇటాలియన్ పోలీస్ కమిషనర్ సహాయంతో ఫ్రాన్సిస్కో అపార్ట్ మెంట్ లో మన్ ఫ్రెడి ఉన్నాడనే అనుమానంతో పెద్ద ఎత్తున దాడి జరుపుతారు. భారీగా పోలీసులను మోహరించి ప్రజలను చెదర గొడుతూ డజన్ల కొద్దీ పురుషుల్ని అరెస్టు చేస్తారు. మన్ ఫ్రెడి దూరంగా ఉండి చిటికెలో తప్పించుకుంటాడు. కానీ ఫ్రాన్సిస్కోను పట్టుకుని ఇతర ఖైదీలున్న ట్రక్కులోకి కోపంగా విసిరేస్తున్నట్లే బలవంతంగా తోస్తారు. అది చూసిన పినా, ఆ తర్వాతి రోజే వారి వివాహం జరగాల్సి ఉండగా, తట్టుకోలేక చుట్టు ముట్టిన పోలీస్ వలయం నుంచి ఒక్క విదిలింపుతో తప్పించుకుని ఫ్రాన్సిస్కో కోసం అరుచుకుంటూ పరిగెడుతుంది. ఎంత వారిస్తున్నా వినకుండా ఆమె ఆదుర్దాతో పరుగు పెడుతుంటే, జర్మన్ కమాండర్ హఠాత్తుగా తుపాకీతో పేలుస్తాడు. పినా వెంటనే మరణిస్తుంది. పూజారి డాన్ పియట్రో ఆయుధాలను దాచడానికి, మరణిస్తున్న వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నట్లు నటిస్తూ, అదే భవనంలో ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా అక్కడే ఉన్న ఆయన పినాను చేతుల్లోకి తీసుకుని ఆమె కోసం ప్రార్ధిస్తాడు. మిలిటరీ ట్రక్ వాహనాలతో ఒక కాన్వాయ్ లో కదిలిపోతుంది. కానీ నగర శివార్లలో మిలిటరీ ట్రక్ ను చుట్టు ముట్టి ఒక్కసారిగా మెరుపు దాడి చేస్తారు ప్రతిఘటన యోధులు. ఫ్రాన్సిస్కోతో పాటు బందీలందరూ తప్పించుకుంటారు. ఫ్రాన్సిస్కో తిరిగి వచ్చి మళ్ళీ మన్ ఫ్రెడిని కలుసుకుంటాడు. వాళ్ళిద్దరూ తమను ఒక రహస్య ప్రదేశంగా ఉండే మఠంలో ఉంచుతానన్న పూజారి దగ్గరికి వెళతారు.

మరీనా మాదకద్రవ్యాలకు అలవాటు పడి, సవ్యంగా ఆలోచించలేని పరిస్థితుల్లో మత్తు మందుల కోసం, ఒక ఉన్ని కోటు కోసం, కక్కుర్తి పడి, జార్జియో మన్ ఫ్రెడిని మోసం చేసి, అతని ఆచూకీ గురించిన వివరాలు నాజీ దళాలకు చెప్పేస్తుంది! మరీనా తెలియజేసిన సమాచారం ఆధారంగా గెస్టపో దళాలు మఠానికి వెళ్తున్న జార్జియో మన్ ఫ్రెడి, పూజారి డాన్ పియట్రో, మరొక ఆస్ట్రియన్ లను చుట్టు ముట్టి బంధించి తీసుకెళ్తారు. ఫ్రాన్సిస్కో వాళ్ళ వెనక ఉండి ‘మార్సెల్లో’ కు వీడ్కోలు చెప్తుంటాడు. వీరిని స్వాధీనం చేసుకోవడం చూసి దూరంగా వెళ్ళిపోతాడు. ఆస్ట్రియన్ పౌరుడు నాజీల పైశాచికత్వాన్ని తల్చుకుని, విపరీతంగా భయపడిపోయి తన సెల్ లో ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక గెస్టాపో నాయకుడు, మరికొందరు నాజీలు జార్జియో మన్ ఫ్రెడి ద్వారా ఆయన సహచరుల వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ భయంకరమైన హింసలకు గురిచేస్తారు. తియ్యగా, అనునయంగా, నెమ్మదిగా మాట్లాడి సమాచారం రాబట్టాలని చూస్తారు. మన్ ఫ్రెడి దేనికీ స్పందించక పోయేసరికి కొట్టి, కొట్టి ఓర్పు నశించి, అతని సహన శక్తికి ఆశ్చర్యపోతూ, మరింత తీవ్రంగా హింసను ప్రయోగిస్తూ కనుగుడ్లు ఉబికి ఊడొచ్చేలా కొడతారు. అయినప్పటికీ ఏం చేసినా అతను నోరిప్పడు. ప్రేక్షకులు పైశాచిక చిత్రహింసలను చూడలేక దుఃఖంతో ఆర్ధ్ర హృదయులవుతారు. అతని నుంచి గుట్టు రాబట్టి, తెలిసిన ఆ సమాచారంతో ప్రతిఘటనా సంస్థకి చెందిన పోరాట వీరుల్నీ, సంస్థ మొత్తాన్నీ మట్టుబెట్టాలనీ, ఆ తర్వాత మన్ ఫ్రెడిని చంపేయాలనీ గెస్టపో ఆలోచన. కానీ జర్మన్ ఫాసిస్టుల ఆశలు ఫలించలేదు. చిత్రవధల బారినపడి చావుకైనా సిద్ధమే కానీ నా సంస్థ గురించి గానీ, నా సహచరుల గురించి గానీ, వివరాలు చెప్పేది లేదని మౌనంగానే సవాలు విసిరి మరణిస్తాడు మన్ ఫ్రెడి.

అంతకు ముందే మన్ ఫ్రెడిపై, డాన్ పియట్రో ప్రభావాన్ని గమనించిన జర్మన్ కమాండర్ ఆయన్ని పావుగా ఉపయోగించి మోసంతో తనకి కావలసిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తాడు. మన్ ఫ్రెడి మనందరికీ శత్రువనీ, నాస్తికుడనీ, కమ్యూనిస్ట్ అనీ రెచ్చగొడుతూ, అతనికి వ్యతిరేకంగా డాన్ పియట్రోకి ఎన్నో అబద్ధాలు చెప్తూ, శత విధాలుగా ప్రయత్నించి విఫలమవుతాడు. కానీ డాన్ పియట్రో మాత్రం నీతి, నిజాయితీలతో ప్రజలందరి బాగుకోసం జీవించే వారందరూ ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా దేవుని మార్గంలో నడుస్తున్నట్లేనని చెప్పి, గట్టిగా స్పందిస్తాడు. జర్మన్ కమాండర్ రెట్టించిన కోపోద్రేకాలతో మన్ ఫ్రెడిను చిత్రహింసల పాలుజేస్తూ, వాటిని చూడమని డాన్ పియట్రోను బలవంతం చేస్తాడు. ఏదీ చెప్పకుండా హింస వల్ల మన్ ఫ్రెడి చనిపోయినప్పుడు, డాన్ పియట్రో అతని శరీరాన్ని ఆశీర్వదించి, మన్ ఫ్రెడి స్థిర చిత్తాన్నీ, ధీరగుణాన్నీ ప్రశంసిస్తాడు. మన్ ఫ్రెడి ధిక్కారం, కమాండర్ తో సహా అక్కడున్న జర్మన్లందర్నీ కదిలిస్తుంది. అమితాశ్చర్యపరుస్తుంది. వారి నమ్మకాన్ని చెదరగొడుతుంది. డాన్ పియట్రోతోనూ, మరీనాతోనూ తమని తాము “మాస్టర్ రేస్”గా పేర్కొంటూ, “స్లేవ్ రేస్”లో ఉన్నవారెవరూ తాము పెట్టే హింసను తట్టుకోలేరనీ, ఎవరైనా వారి నరక యాతనల ధాటికి భయపడి, నిజం చెప్పేస్తారనీ ప్రగల్భాలు పలికిన నాజీ మూకల్ని తన మౌనంతో చిత్తుగా ఓడిస్తాడు మన్ ఫ్రెడి.

మరీనా, జర్మన్లు మన్ ఫ్రెడి చేత వారికవసరమైన సమాచారాన్ని రాబడతారనుకుంటుంది గానీ అంత దుర్మార్గంగా చనిపోయేదాక హింసలకు గురిచేస్తారని తెలుసుకోలేక పోతుంది. తాగిన మత్తులో తనవల్ల జరిగిన ఘోరమైన పొరపాటును గ్రహించి, బయటకు వెళ్లిపోతుంది. గెస్టాపో ఛీఫ్, అతనికి సహకరించిన స్త్రీ కలిసి ఇప్పుడు వారికి మరీనా ఏ రకంగానూ ఉపయోగపడదని ఆలోచించి, ఆమెను అరెస్టు చేసి, ఆమెకు ఎరగా చూపిన ఉన్ని కోట్ ని ఆమె నుంచి లాగేసుకుంటారు.

డాన్ పియట్రోని కూడా ఉరితీయడానికి వీలుగా ఒక కుర్చీకి కట్టేసి, నానా హింసలూ పెట్టినప్పటికీ, అతను వారితో మాట్లాడడానికి నిరాకరిస్తాడు. మరుసటి రోజు ఉదయం తన ఉరి గురించి, అతని బాలల సైన్యానికి తెలిస్తే గనక నిరసనతో స్పందిస్తారనుకుంటాడు. డాన్ పియట్రో తలపోసినట్లు నిజంగానే మార్సెల్లో నాయకత్వంలోని ప్రతిఘటనా బాలల సంఘం లోని కొందరు బాలురు, మార్సెల్లోతో పాటు డాన్ పియట్రోని దూరంగా ఒక కంచె కవతలనుండి చూస్తూ, “మీ గురించి మాకు తెలిసింది” అని అతనికి అర్థమయ్యేలా డాన్ పియట్రోకి తెలిసిన ఒక సంగీతపు ట్యూన్ ని (అది వారి కోడ్ భాష కావచ్చు) వినిపిస్తారు. జర్మన్లు ఒక ఇటాలియన్ ఫైరింగ్ జట్టుని డాన్ పియట్రో ఉరిని అమలు చేయటానికి ఏర్పాటు చేస్తారు. కానీ వారు వాళ్ళ ఆచారం ప్రకారం ‘ఇటాలియన్లు ఒక పూజారిని చంపరు’ అని వైదొలుగుతారు. డాన్ పియట్రో స్వయంగా తనని తాను ఉరి తీసుకోవడాన్ని బాలురు చూసి నిశ్శబ్దమైపోతారు. వారు తలలను భక్తితో వంచి, దుఃఖంతో నమస్కరిస్తారు. నెమ్మదిగా దూరంగా నడుస్తారు. పిల్లలను తిరిగి రోమ్ నగరంలో చూపడంతో చివరి షాట్ లో సెయింట్ పీటర్స్ బసిలికా (వాటికన్ నగరంలోని ఇటాలియన్ పునరుజ్జీవన చర్చి)ని ఇక్కడ రోమ్ నగర నేపథ్యంలో ప్రేక్షకులు స్పష్టంగా చూస్తారు. సినిమా బరువుగా విషాదంగా ముగుస్తుంది. ఇదీ కథ.

ఈ సినిమా ప్రత్యేకతలు:
ఇటలీ నియంతగా, ప్రపంచంలోనే మొదటి ఫాసిజం వ్యవస్థాపకుడిగా ముస్సోలినీ (1883-1945) ఆనాటి అడాల్ఫ్ హిట్లర్ నుంచి ఈనాటి మన మోదీ వరకు అనేక నిరంకుశ పాలకులకు ఆదర్శం! ముస్సోలినీ “సినిమాలలో హింస చూపకూడదు. చెడుని చూపకూడదు. అంతా మంచినే చూపాలి. అవి ఇటలీ పరువు, ప్రతిష్టలను పెంచాలి” అంటూ నిషేధాజ్ఞలు జారీ చేశాడు. ముస్సోలినీ మరణించిన తర్వాత రోస్సెల్లిని గతించిన ప్రజల అల్ల కల్లోల ఫాసిస్టు సమయాలను సినీ మాధ్యమం ద్వారా వ్యక్తీకరించానుకున్నారు. అసలు రాబర్టో రోస్సెల్లిని ఇటాలియన్ చలన చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఒక ట్రావెల్ డైరెక్టర్ మాత్రమే. అతను ప్రతిఘటనోద్యమాన్నిసమర్ధించేవాడు కానప్పటికీ, రోమ్ మిత్ర రాజ్యాల విముక్తికి ముందే రోమ్ ఓపెన్ సిటీ కోసం 1944-నుంచే పని చేయడం ప్రారంభించి 1945 జనవరిలో చిత్ర నిర్మాణం చేశారు. రోమ్ నగరం విముక్తి పొందిన తర్వాత వీధుల్లో జర్మన్లు, ఇటాలియన్ ఫాసిస్టులతో పోరాడుతున్న ప్రజలను చూస్తూ పేదరికం, వినాశనం, దౌష్ట్యం, భవిష్యత్ గురించిన అనిశ్చితి మధ్య చిత్రీకరిస్తూ ప్రజల పక్షపాతిగా మారిపోయాడు. రోమ్‌, ద ఓపెన్ సిటీ (Rome the open city-1945), పైసన్ (Paisan-1946), రోమ్‌ జర్మనీ ఇయర్ జీరో (Rome Germany year Zero-1947) – ఈ మూడూ చిత్రాలతో నియో-రియలిస్ట్ ఉద్యమాన్ని రోస్సెల్లిని ప్రారంభించారు.

రోస్సెల్లిని రచనలు నియో రియలిజానికి చెందిన జర్మన్ ఫాసిస్ట్ ఆక్రమణ దారుల భయానక కథలను పట్టుకుంటాయి. “రోమ్ ఓపెన్ సిటీ” నిర్మించిన పరిస్థితుల గురించి ఆలోచిస్తే గనక, స్క్రీన్ ప్లే మొదటి చిత్తుప్రతిని యువ ఫెడెరికో ఫెల్లిని (Federico Fellini) వేడిగా ఉన్న ఒకే ఒక వంటగదిలో కూర్చుని రాశాడు. ఈ చిత్రంలో రోమ్ నగర శిధిలాల్నీ, తుఫాను వీధుల్నీ యుద్ధం సృష్టించిన భీభత్సాన్నీ చిత్తశుద్ధితో అసాధారణమైన ఉద్రిక్త పరిస్థితులలో ఇంకా విముక్తి కాకుండా యుద్ధం జరుగుతున్న మిగిలిన ఇటలీ,యూరప్ లలోని నల్లజాతీయుల వీధుల్నికూడా దృశ్యీకరించారు రోస్సెల్లిని.


సినిమా మొత్తం సౌండ్ రికార్డర్‌లను ఉపయోగించకుండా వాస్తవ అపార్టుమెంట్లు, షాపులు, ఫ్లాట్లు, వీధుల్లో దృశ్యీకరించారు. సంభాషణలను తర్వాత డబ్ చేశారు. ‘రోమ్ ఓపెన్ సిటీ’ చిత్రం ప్రేక్షకుల భావోద్వేగ పంచ్ ని ఆద్యంతమూ పట్టి ఉంచుతుంది. సెకనుకి ఇరవై నాలుగు ఫ్రేముల చొప్పున నిజాన్ని వివరిస్తుంది ఫిల్మ్ అన్నారు నియో రియలిస్టు ఉద్యమకారులు. ఈ చిత్రంలో ఫాసిజం, విషాదం, ఇటాలియన్ నియో-రియలిజం పుట్టుక లున్నాయి. “ఇటాలియన్ నియో రియలిజానికి మైలురాయిగా నిలిచే అత్యుత్తమ చిత్రమని సినీ మేధావులు ప్రశంసించారు.

75 సంవత్సరాల తర్వాత, ఇప్పటికీ ‘రోమ్, ఓపెన్ సిటీ’ కి దిగ్భ్రాంతితో, షాక్ ఇచ్చే శక్తి ఉంది! మన దేశంలోని వైవిధ్యం వలన యూరప్లో ముఖ్యంగా జర్మనీ, ఇటలీలలో వచ్చినటువంటి ఫాసిజం ఇక్కడ ఉందా లేదా అనే అనుమానం వస్తుంది. నియంతృత్వం ఆ రూపంలోనే లేకపోవచ్చు. కానీ దేశ రాజకీయ ఆర్థిక మూలాలలో నియంతృత్వ శక్తులున్నాయి. ప్రస్తుతం మనం ఫాసిజాన్ని రుచి చూస్తున్న కాలంలో ఉన్నందుకో ఏమో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ప్రత్యక్షంగా నియంతల పాలనను అనుభవిస్తున్నట్లే భావిస్తారు. రోజువారీ జీవితాల్లో ఇప్పుడు మనం చూస్తున్న ద్రోహం, నియంతృత్వ హింస, ఆకస్మిక మరణాలు ఈనాటికీ కలవరపెడుతున్నాయి. ఇది కథా, కథన శైలి, దర్శకత్వం లోని నైపుణ్యమైన పనితీరు ద్వారా సాధించబడింది.

అసలు సినిమా ఎత్తుగడ (సెటప్) లోనే ఆ చిత్ర కథను సూచించడం మంచి సినిమా లక్షణమంటారు విజ్ఞులు. ఆ రకంగా”రోమ్ ఓపెన్ సిటీ” అనే శీర్షికే రోమ్ నగర యుద్ధానంతర స్థితిని సూచిస్తుంది!
నిజంగా మర్చిపోలేని పాత్ర ఆస్కార్ విజేత ‘అన్నా మగ్నానీ’ది. నిజాయితీగా ఆమె తన పాత్రకు జీవం పోసింది. నాజీలు యుద్ధం జరిగే సందర్భంలో రోడ్డు మధ్యలో గన్నులతో ఒక మహిళను కాల్చేసిన నిజమైన సంఘటన ఆధారంగా పినా పాత్రను సృష్టించారు. గర్భిణీ అయిన పిన మనుగడ కోసం రోమ్ లోని ఆకలితో అలమటిస్తున్న మిగిలిన సాధారణ మహిళలతో కలిసి ఒక బేకరీలో బేకింగ్ బ్రెడ్ ని తీసుకుని, స్థానిక పోలీసులకు కాస్త పంచుతుంది. ఆమె అంత పేదరికంలోనూ హుందాతనంతో, అద్భుత మైన నటనతో ప్రేక్షకులను అయస్కాంతంలా ఆకట్టు కుంటుంది. ఆమె పాత్ర చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. ఆమె మొదటి భర్తను ఫాసిస్ట్ యుద్ధంలో కోల్పోతుంది. ఆమె కాబోయే భర్త ఫ్రాన్సిస్కోని జర్మన్లు అరెస్టుచేసి, ట్రక్ లోకి తోసినప్పుడు అన్నా మగ్నానీ అంతులేని వేదన, నిరాశతో ట్రక్కుని వెంబడిస్తూ పరిగెత్తే సీన్ చాలా గొప్పగా, అద్భుతంగా ఉంటుంది. కనురెప్ప వేసేటంత తృటికాలంలో క్రూరంగా వరస కాల్పులకు బలై, వెంటనే చనిపోవడం చూసినప్పుడు ప్రేక్షకులు నిశ్చేష్టులవుతారు. ఈ దృశ్యాన్ని ఎవరైనా ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఎప్పటికీ మరచిపోలేని అత్యంత ప్రసిద్ధ క్షణం. నియంతృత్వపు అణచివేతను జీవితంలో మర్చిపోలేరు. ఆమె ఒక్క సెకన్ లో మాయమవుతుంది. “ఔదార్యం, త్యాగం, అగ్నిలో మాడి మసైపోతున్న కొందరి జీవితాలలోని వాస్తవ ఘటనలు పెద్ద చిత్రాలలో కంటే బలమైన సన్నివేశ చిత్రణ లోనే కనిపిస్తాయ”ని ప్రపంచ సినీ విమర్శక దిగ్గజాల ప్రశంసలందుకుంది ఈ సీన్! మాగ్నాని ఈ పాత్రతో ఒక అంతర్జాతీయ సినీ నటిగా ప్రఖ్యాతి గాంచింది.

ఆమె బొంగురు గొంతు, సహజ నటన సాధారణ ఇటాలియన్ మహిళలందర్ని గుర్తు చేస్తుంది. కమ్యూనిస్ట్ అయిన మన్ ఫ్రెడీ, కేధలిక్ భక్తురాలైన పినా మనస్తత్వానికి ముగ్ధుడవుతాడు. ఆమె ప్రతిఘటనా పోరాటంలో విశ్వాస ముంచి నిలబడిన తీరు ప్రేక్షకుల్ని స్క్రీన్ కి కట్టిపడేస్తుంది. మన్ ఫ్రెడి ప్రియురాలు మరీనా అతనికి ద్రోహం చేసి, ఫాసిస్టులకు మన్ ఫ్రెడి ఉనికిని తెలిపి ప్రేక్షకుల్ని చికాకు పెడుతుంది. ఈ ఇద్దరి స్త్రీల మనస్తత్వాలలోని తేడా ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసి వస్తుంది.
ఈ చిత్రంలో నిశ్చితార్థం చేసుకున్న పిన-ఫ్రాన్సిస్కోల జంట మెట్లదారిలో జరిపిన సంభాషణ భావోద్వేగ స్ఫోరకంగా ఉంటుంది. ఇక్కడ అలసిపోయి, ఆందోళన చెందుతున్న పినాకు “మేము సాధించాల్సిన దాని కోసం అలుపెరగకుండా పోరాడుతున్నాం. మనం మంచి ప్రపంచాన్ని తప్పకుండా చూస్తాం” అని భరోసా ఇస్తాడు ఫ్రాన్సిస్కో. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు చాలా శక్తివంతమైనవి.

డాన్ పియట్రోగా నటించిన ‘ఆల్డో ఫాబ్రిజి’(Aldo Fabrizi) కూడా నిజ జీవితంలో వేదిక మీద ఒక హాస్య నటుడు. అతను ప్రతిఘటించి అమరత్వం పొందిన ఒక నిజ జీవితపు కాథలిక్ పూజారి అయిన ‘డాన్ మోరోసిని’ కి నమూనా గా ఉన్నారు. ఆయన తన పాత్రలో అమోఘంగా ఒదిగిపోయారు. ఉన్నతమైన విలువలతో ప్రవర్తించి, వీక్షకుల నుంచి అత్యుత్తమమైన గౌరవాన్ని డిమాండ్ చేస్తారు. అన్నిటికీ మించి, “రోమ్, ఓపెన్ సిటీ” అనైతిక ప్రపంచంలో నైతికత మనుగడను కాంక్షిస్తుంది. ఇది డాన్ పియట్రో వ్యక్తం చేసిన థీమ్. “మంచిగా చనిపోవడం కష్టం కాదు”,”బాగా జీవించడం కష్టం.”( It is not hard to die well, but it is hard to live well ) అని అంటారు పూజారి. ఈ పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. నాకైతే అసలు పరమ మూర్ఖంగా ఉండే అందరి చర్చ్ ఫాదర్లూ, పూజారుల్లా కాకుండా ప్రతిఘట నోద్యమంలో పాల్గొని, ప్రజలకి న్యాయం చేసే వారందరూ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆయన మార్గంలో నడుస్తున్నట్లే అని అనడం అపూర్వమనిపించింది! అంతేకాదు, ఈయన శిక్షణలో పోరాటంలో చేరడానికి చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెడతారు. బుజ్జి బాలల బృందం-పూజరిల మధ్య సామాజిక చింతనకు సంబంధించిన అనుబంధం చివరి సీన్ లో అద్భుతంగా కనిపిస్తుంది.


వామపక్ష నాయకుడు జార్జియో మన్ ఫ్రెడీగా నటించిన మార్సెల్లో పాగ్లిరో (Marcello Pagliero), ఫ్రాన్సిస్కో గా నటించిన ఫ్రాన్సిస్కో గ్రాండ్ జాకెట్ (Francesco Grandjaquet), మార్సెల్లో గా నటించిన చిన్నారి పిడుగు ‘వీటో అన్నిచియారికో’ (Vito Annichiarico) తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ప్రధాన విలన్లు ఇంగ్రిడ్ గా నటించిన జియోవన్నా గాలెట్టి (Giovanna Galletti), మేజర్ బెర్గ్ మాన్ గా నటించిన హ్యారీ ఫౌస్ట్ (Harry Faust) ఫాసిస్టు కర్కశత్వాన్ని పండించారు.
“ఓపెన్ సిటీ” అప్పటి ఇటాలియన్ నియోరియలిజం శైలిని విప్లవాత్మకంగా వ్యక్తీకరించింది. వస్తువు పేద ప్రజల జీవితాలకు సంబంధించింది. ఇది నవ్య వస్తు వాస్తవికతకు ప్రమాణంగా నిలుస్తుంది. చిత్ర నిర్మాణం గురించైతె ఇది ఖచ్చితంగా సినిమాలను స్టూడియోల నుండి వీధుల్లోకి తెచ్చింది. ఇది అనితరసాధ్యమైన అభిరుచితో అలరారే చిత్రం. పూర్తి ముడి సరుకు నుపయోగించి, శక్తివంతమైన అల్లర్లను న్యూస్‌రీల్ లాంటి దృశ్యాలలో బాంబు దాడులు, రెండవ ప్రపంచ యుద్ధంలోని అన్ని గందరగోళాలను బంధించారు. రోస్సెల్లిని ఓపెన్ సిటీ చిత్రం స్థల కాలాల్ని చిరస్మరణీయంగా సంరక్షించింది – అంతే కాదు భవిష్యత్తరాల చిత్ర నిర్మాతలకు వాటిని ఎలా కాపాడుకోవాలో నేర్పింది.

చిత్రంలో ప్రధాన పాత్రలు పినా,మాన్ ఫ్రెడి, డాన్ పియట్రోగా నటించినవారు తప్ప మిగిలిన తారాగణమంతా సాధారణ పౌరులే! అన్నా మాగ్నాని మినహా నటీనటులు అందరూ లాభాపేక్షలేనివారు! తక్కువ ఖర్చుతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు.


ఓపెన్ సిటీ, డాక్యుమెంటరీ-మెలోడ్రామాల మేలు కలయిక. ఈ చిత్రాన్ని తీసే సమయానికి అది ఒక వినూత్న ప్రయోగం. ప్రభావవంతమైన సహజ నటనలు, ఉబల్డో అరాటా సినిమాటోగ్రఫీ ఒక డాక్యుమెంటరీ హృదయాన్ని, ప్రామాణిక నాటకీయ సన్నివేశాలతో మిళితం చేసింది. దేశం విముక్తి కోసం రెండు శత్రు దళాలు కమ్యూనిస్టులు-కాథలిక్కులు పోరాటంలో ఏకమవుతారు.


అంతా బాగానే ఉంది గానీ ఈ నియో రియలిస్టు సినిమా ఒకందుకు నాకు నిరాశ కలిగిస్తుంది. నేను విట్టోరియో డి సికా Bicycle thief, ఆయనదే Two Women కూడా చూశాను. ఈ సినిమాలోనూ, Two Women లోనూ ఆడపిల్లలు చిన్న చిన్న ప్రలోభాలకు (ఉన్ని కోట్, పట్టు మేజోళ్ళు లాంటివి) కక్కుర్తి పడినట్లు చూపిస్తారు. ఇది బహుశా ఆ రోజుల్లోని స్త్రీల దీనావస్థని చెప్పడానికేమో తెలియదు. ఈ విషయాన్ని మినహాయిస్తే, ఈ సినిమాలు చాలా నిబద్ధతతో తీస్తారు. ఇంకొక మహా గొప్ప సూగుణమేమంటే నేను చూసిన మూడు సినిమాల్లోనూ పది పన్నెండేళ్ళ పిల్ల తరాన్ని పెద్ద వారి విశ్వాసాల వారసులుగా చూపిస్తారు. Bicycle thief లో తండ్రీ కొడుకుల సంబంధం, Two Women లో తల్లీకూతుళ్ళ సంబంధం అద్భుతంగా ఉంటాయి.
ఇక ఈ సినిమాలో అయితే నాకన్నిటికంటే నచ్చిన విషయం ఫ్రాన్సిస్కో-మార్సెల్లో ల మానవ సంబంధం. తన తల్లిని వివాహమాడబోతున్నాడని తెలిసి ఫ్రాన్సిస్కోని “నేను మిమ్మల్ని నాన్నా అని పిలవచ్చా” అని అడుగుతాడు చిన్నారి మార్సెల్లో. ఫ్రాన్సిస్కో కూడా తప్పకుండా అలాగే పిలవమంటాడు. బయటిగ్గానీ, పోరాటంలో కెళ్ళే సమయాల్లో గానీ మార్సెల్లోని కలిసి అతనికి చెప్పి వెళ్తుంటాడు ఫ్రాన్సిస్కో.

అలా ఒకసారి చిన్నారితో మాట్లాడుతూ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు కూడ. కాబోయే మారుటి తండ్రి ఫ్రాన్సిస్కోతో బలమైన మానవ సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు మార్సెల్లో. వారి తల్లిదండ్రుల కష్టాలను పక్కనే ఉండి చూస్తున్న ఈ పిల్ల తరం ద్వారా తమ తల్లిదండ్రుల న్యాయమైన, ఉన్నతమైన ఆశయాలను ఈ సిసింద్రీలు కొనసాగిస్తారనే భరోసాతో ప్రేక్షకులకు భవిష్యత్తు మీద ఆశలు రగిలిస్తారు ఈ నియో రియలిస్టు ఉద్యమ రచయితలూ, దర్శకులూ.

ఈ చిత్రం గెల్చుకున్న అవార్డులు:

ఈ చిత్రం 1946 లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ ప్రైజ్, 19 వ అకాడమీ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆస్కార్ కోసం ఎంపికైంది.

ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రాఫి, ఉత్తమ సహాయ నటి అవార్డులందుకుంది.

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డు : ఇటలీ; 1946.

అన్నా మాగ్నాని ఉత్తమ నటిగా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఉత్తమ నటి అవార్డు, మరెన్నోఅవార్డులు.

ఈ చిత్రం వివిధ చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకుంది.

నామినేషన్లు: పామ్ డి ఓర్, మరెన్నో ప్రతిష్టాత్మక నామినేషన్లు సాధించింది.

న్యూయార్క్ టైమ్స్ “ఇది మళ్ళీ మళ్ళీ చూడవలసిన చిత్రం” గా అభివర్ణించింది.

జీన్ లూక్ గొడార్డ్ (Jean- Luc Godard), మార్టిన్ స్కోర్సెస్ (Martin Scorsese) ఈ చిత్రాన్ని”సినీ చరిత్రలో అత్యంత విలువైనది” అని కొనియాడారు.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply