శరణార్థులు శిబిరంలో
బాంబు విస్ఫోటనమయ్యాక
చీలలూడిన ఓ దర్వాజ
రోడ్డు వేపు నిస్సహాయంగా చూస్తోంది
చుట్టూ చెత్త గుట్టలు
ఊపిరి తిత్తులలో స్థిరపడ్డ దుమ్ము ధూళితో
దగ్గులు, మాయదారి జబ్బులు
ఎండ వేడిమికి
ముక్కులు ఉబ్బిపోయాయి
వాళ్ళు మనుషుల్లా లేరు
ఇతర ప్రాంతాల నుండి వొచ్చిన
ప్రేతాత్మల్లా ఉన్నారు
అటుగా వొచ్చిన అమ్మాయి
రక్తమంటిన దర్వాజను తెరిచి చూసింది
లోపలొక శవం
భూమి భోరున ఏడ్చింది
కొన్ని వేళ్ళు తెగినా
అతని పిడికిట్లో
ఓ పాత తాళంచెవి కనబడుతోంది
అతని తండ్రి
అతని కిచ్చిన వారసత్వమదొక్కటే
యఫాలోని తన ఇంటి తాళంచెవి అది
యఫాలోని
తన ఇంటిని పేల్చి వేశారని తెలుసతనికి
ఎప్పుడైనా యఫాకు తిరిగొస్తే
ఆ తాళంచెవి
తనకు పాస్ పోర్టులా పనికొస్తుందని చిన్న ఆశ
ఇప్పుడు తను లేడు
చీలలూడిన దర్వాజ
నిస్సహాయంగా పడిఉంది
ఆ అమ్మాయి తలుపు మూసేసింది
లోపలంతా
సుళ్ళు తిరిగే దుఃఖం
***
మూలం : మోసబ్ అబూ తోహా Door on the Roadకు స్వేచ్ఛాను వాదం
(May24,2021 లో హమాస్, ఇజ్రాయేల్ మధ్యన యుద్ధం విరమణ ఒప్పందం సంధర్భంగా పాలస్తినీయులు గాజా లోని తమ ఇండ్లకు వొచ్చిన పుండు కనిపించిన ఒకానొక దృశ్యం.)