మూలం: మౌమితా ఆలం
మా అబ్బా తన కూతుళ్ళ కోసం వెతుకుతున్నాడు.
అసలైతే అబ్బా తన కూతుళ్ళను మరిచే పోయాడు.
ఆయన కూతుళ్లు ఇప్పుడతన్ని బాబా అని పిలుస్తున్నారు.
మీకు తెలుసో లేదో అబ్బా నుంచి బాబా పిలుపు, సాధారణ మానసిక స్థితి నుంచి ఉన్మాదం వైపుగా జరిగిన ఒక ప్రయాణం.
భారతీయుడి గా ఉన్నటువంటి స్థితి నుంచి అతి కష్టంగా,బలవంతంగా భారతీయుడిగా ఉండాల్సి రావడం వరకు నడిచిన వైకల్య స్థితి!
***
మా అమ్మీ అన్నయ్య లంచ్ బాక్స్ ను మూడుసార్లు సరిచూస్తుంది.
లంచ్ బాక్స్ మీద పెద్ద అక్షరాలతో గుడ్డు కూర అనో బ్రాకెట్ లో దిమ్ బాత్ అనో రాస్తుంది.
అదీ మార్కర్ పెన్ తోనే!
ఎవరైనా గుడ్డు కూరని ఎద్దు మాంసం అని అనుకుంటారేమో అని ఎప్పుడూ భయంతో వణికిపోతుంటుంది.
అన్నయ్య రోజూ లోకల్ ట్రైన్ లో నౌఖరికి వెళుతుంటాడు మరి.
***
వాళ్ళు పాలకూరను కూడా గొడ్డు మాంసమనే అంటారని పాపం మా అమ్మీకి తెలీదు!
మా వదినేమో అన్నయ్య నొప్పితో అరుస్తున్నా వదలకుండా, గడ్డంలో ఒక్క వెంట్రుకని కూడా ఉంచకుండా పీకేస్తుంటుంది.
ఎక్కడ తన భర్త మతం వాళ్ళకి తెలిసిపోతుందేమో అన్న ఆందోళన ఆమెది!
***
ఇక నేనంటారా రైల్లో కిటికీ పక్కనే కూర్చుని,
కనిపించిన ప్రయాణీకులనల్లా శల్య పరీక్ష చేస్తుంటాను.
ఇంజన్ చేసే ప్రతీ శబ్దం నన్ను భయంతో చంపేస్తుంది.
టికెట్ కలెక్టర్ నా పేరు అడుగుతాడు.
తడబడిపోతూ ఇంటి పేరు వదిలేసి మొదటి పేరు మాత్రమే గొణుగుతాను.
కళ్ళు మూసుకుని నేను దిగవలసిన స్టేషన్ త్వరగా రావాలని ప్రార్థిస్తాను.
కానీ నా సోదరులారా.. ఒక విషయం అడుగుతాను !
ఏ భాషలో అల్లాహ్ ను ప్రార్థించాలో కాస్త చెబుతారా?