Testimony of a farmer poet – A Fine balance
: Moumitha Alam
***
ప్రియా ఇప్పుడెలా మనం ప్రేమించుకునేది చెప్పు?
మోకాల్లోతు ఏప్రిల్ నెల వర్షంలో నానిపోయి, చాలా కాలం తడబడ్డాక,
చచ్చిపోయిన మక్క జొన్న మొక్కలు దెయ్యాల్లాగా మారిపోయి నిలబడ్డాయి…
***
అవేమన్నా రైతుల కలల్ని వెంటాడి వేధించి ఉంటాయా?
లేక ఏకంగా రైతులే మాయమయ్యారా?
వాళ్ళిక దేన్నైనా ఎలా నమ్ముతారు?
అసలు మనుగడే ఒక నీచమైన విషయంగా మారిపోయిందా వాళ్ళకి, ఆ అమాయకమైన రైతులకి?
ఇంతకీ ఈ కవులనబడే వాళ్ళకి రైతుల గురించి ఏమైనా తెలుసా అని?
పదేళ్లలో ఒకసారి మంచి పంటకి, మరోమారు అనేకమైన విఫలమైన పంటలకి మధ్యన ఉండే సన్నని తాడు మీద ఈ రైతులెంత భయంగా పడిపోకుండా తమని తాము సంబాళించుకుంటూ నడుస్తారో అసలేమైనా
తెలుసా ఈ బుద్ధి జీవులకు?
**
మృత్యువనేది ఒక జ్వలించే రూపకాలంకారం లాంటిది కదా?
దిక్కులేని మర్రిచెట్ల ఎండిపోయిన కొమ్మల నుంచి ముదిరి పాడై పోయిన బంగాళా దుంపల్లా వేలాడే రైతుల దేహాలు
భూమికి సమాంతరంగా ఎలా ఊగుతూ ఉన్నాయో చూడోసారి!
***
మరిప్పుడు మనం అసలు ఎలా ప్రేమించుకోగలమో నువ్వైనా చెప్పు?
**
మన అన్నదమ్ములు, తండ్రులు, ఎండిపోయిన రొమ్ములతో తల్లులు
ఒకరి తర్వాత ఒకరు వేదిక మీద రాలిపోతూ ఉన్నప్పుడు కూడా, వేదిక మీది ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పుడు?
మరీ ముఖ్యంగా నీ మంచం మీద శవాలు పడుకుని ఉన్నప్పుడు,
మనిద్దరం ప్రేమించుకోవడం రాజద్రోహం కాదా చెప్పు?