2016లో జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో 2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని సగర్వంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని 2019లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కూడా బిజెపి నమ్మబలికింది. ఇందుకోసం సంస్థాగత సంస్కరణల నిమిత్తం నగదు బదిలీ సహా పలు చర్యలను ఏకరువు పెట్టింది. ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. మోడీ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. ఆయన హయాంలో రైతన్నల ఆదాయం మరింత పడిపోయింది. మోడీ పాలనలో గతంలో ఎన్నడూ లేని రీతిలో దేశంలో రైతులు నేడు ఎన్నో రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. నలువైపుల నుంచి చుట్టుముడుతున్న సమస్యలతో అల్లాడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ఇస్తున్న తప్పుడు హామీలను నమ్మి మోసపోతున్నారు.
భారతీయ రైతు సాగుభారంతో కుంగిపోతుంటే, తరచూ కష్టాలూ కన్నీళ్లే దిగుబడిగా తల్లడిల్లిపోతుంటే బాధ్యత గల పాలకులు ఎవరైనా సరే, ఏం చేయాలి? కాసింత సాయం అందించాలి. భుజం కాచి, బరువును పంచుకోవాలి. సాగు వ్యయాన్ని తగ్గించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. అందుకోసం తగినన్ని నిధులూ, అంతకుమించి ఆచరణకు అవసరమైన చిత్తశుద్ధినీ వెచ్చించాలి. దేశానికి రైతే వెన్నెముక అని చెప్పుకుంటున్న దేశంలో ఆ రైతును, వ్యవసాయరంగాన్నీ కంటికి రెప్పలా కాపాడుకోవటానికి కంకణబద్ధులై పనిచేయాలి. కానీ, ఘనత వహించిన మోడీ జమానా అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఒకపక్క కర్షక జనోద్ధరణ గురించి ఆడంబరంగా కబుర్లు వల్లిస్తూనే, మరోపక్క రైతాంగం పట్ల కర్కశ వైఖరితో, నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తోంది. వ్యవసాయ రంగానికి తోడ్పాటునివ్వటానికి కేటాయించిన నిధులను సైతం వెనక్కి తీసుకోవడం బిజెపి ప్రభుత్వపు రైతు వ్యతిరేక ధోరణికి అద్దం పడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే మోడీ ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనంగా, కార్పొరేటులకు అనుకూలంగా లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తోంది. కార్పొరేటు పన్ను తగ్గించడం వల్ల సంవత్సరానికి ఆరు లక్షల కోట్ల రూపాయల లబ్ది పొందుతున్నారు. గత పది సంవత్సరాలలో బ్యాంకుల పారు బకాయిలు రూ. 14.56 లక్షల కోట్లు కార్పొరేట్లకు రద్దు చేసింది. రైతుల ప్రధాన డిమాండ్ అయిన ఎమ్మెస్పీకి నిధులు లేవంటుందీ ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020 నవంబర్ 26 నుంచి రైతులు చేపట్టిన ఆందోళన సుమారు ఏడాదిపాటు కొనసాగడం ఆషామాషి విషయం కాదు. ఢిల్లీ సరిహద్దుల్లో, ఎండకు ఎండుతూ… వానకు తడుస్తూ… చలికి వణుకుతూ వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ సుదీర్ఘ పోరాటంలో 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం ఒకవైపు, మరోవైపు ముంచుకొస్తున్న గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్త్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును ఇరుకున పెట్టాయి. గత్యంతరం లేక, మూడు సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టక తప్పలేదు. అయితే 2021 డిసెంబర్లో రైతులతో కుదుర్చుకున్న, 12 సమస్యలలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో 2023 ఏప్రిల్ 5న కార్మికులతో కలిసి ఢిల్లీలో ర్యాలీని నిర్వహించాయి.
మోడీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో మూడు సాగు చట్టాలను ఉపసంహారించుకున్నప్పుడు కనీస మద్ధతు ధర సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే అప్పటి నుండి ఇవాళ్టీ వరకు ఏలాంటి పురోగతి లేనందున కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు 12 పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు మరికొన్ని రైతు సంఘాలు దాదాపు 200కు పైగా రైతుసంఘాలు ‘చలో ఢిల్లీకి’ ఫిబ్రవరి 13న మార్చ్ నిర్వహించ తలపెట్టాయి. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి ఫిబ్రవరి 13న ఉదయం 10 గంటలకు మహిళలతో సహా రైతులు ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ఢిల్లీకి బయలు దేరారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసేందుకు వారు జెసిబిని వెంట తెచ్చుకున్నారు. అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరియాణా, పంజాబ్ సరిహద్దు ప్రాంతం శంభు చేరుకున్న 15000 మంది రైతులను ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు.
పలుచోట్ల ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు, మేకులతో రోడ్డుకు అడ్డుగా పోలీసులు పెట్టిన ఆటంకాలను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు యత్నించగా రైతులను అరెస్టు రూపంలో అరికట్టడం సాధ్యపడదు అని గ్రహించిన పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలను, జల ఫిరంగులనూ రైతుల పైకి పోలీసులు ప్రయోగించారు. డ్రోన్ల సహాయంతో టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో, ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. శంభు వద్ద జరిగిన ఘర్షణలో డిఎస్పీ సహా 24 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని అంబాలాలోని ఆసుపత్రికి తరలించారు. 60 మంది రైతులూ గాయపడ్డారు. హరియాణాలో 64 కంపెనీల పారా మిలిటరీ బలగాలను, 50 కంపెనీల పోలీసులను మోహరించారు. పంజాబ్వైపు నుంచి హైవే మార్గం ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించే రైతులను అడ్డుకునేందుకు అంబాలా-శంభు సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన భారీ సిమెంటు దిమ్మెలను గ్రామస్థులు, రైతులు తొలగించారు. జాతీయ రహదారులపై అడ్డంకులను తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్రంతో పాటు పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలకు పంజాబ్, హరియాణా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రైతులపై రబ్బురు పెల్లెట్ల వర్షం :
పంజాబ్-హర్యానా శంభు సరిహద్దుల్లో రైతులను చెదరగొట్టడానికి ఫిబ్రవరి 14న భద్రతా దళాలు యత్నించాయి. ఈ క్రమంలో అన్నదాతలపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. రబ్బరు పెల్లెట్లను రైతులపైకి సంధించారు. పాటియాలా-అంబాలా సరిహద్దు, సంగ్రూర్-హిసార్ సరిహద్దులలోనూ ఇదేవిధమైన ఉద్రిక్తత ఏర్పడింది. పంజాబ్-హర్యానా బార్డర్ వద్ద జరిగిన నిరసనల్ల పాల్గొన్న పంజాబ్ రైతు 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇప్పటివరకు పెల్లెట్ గాయాల కారణంగా దాదాపు ముగ్గురు రైతులు కంటిచూపును కోల్పోయారని పంజాబ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. టియర్ గ్యాస్‌ను నిరంతరాయంగా రైతులకు విడిచి పెడుతుండడంతో పూర్తిగా కళ్లు కోల్పోయిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఢిల్లీ మార్చ్‌లో భాగంగా హర్యానాలోని శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న జియాన్ సింగ్ (63) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు.
2021లో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నప్పుడు ప్రభుత్వం పరిష్కరిస్తామన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ఎదుట నిరసనకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి మెగామార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల ఉద్యమాన్ని అణచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల ముందస్తు చర్యలతో సిద్ధం అయింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 12వ తేదీవరకు నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులను మూసివేసింది. ఇక మరికొన్ని సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని అణిచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కేంద్రంలోని మోడీ సర్కార్ కర్షకులపై కర్కశత్వం ప్రదర్శిస్తోంది.
మూడు సంవత్సరాల తరువాత డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు. రైతుల డిమాండ్లలో 2020-21లో తమపై పెట్టిన కేసుల్ని తొలగించాలనీ, లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, 2023 ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ఎమ్‌ఎస్‌పిపై స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలు చేయాలని, దేశవ్యాప్తంగా రైతులు, రైతుకూలీల రుణాలను మాఫీ చేయాలని, మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఉపాధి అవకాశాలు, వేతనాలు మెరుగుపరచాలని, 2013 భూసేకరణ చట్టాన్ని రైతులకు అనుకూలంగా తిరిగి ప్రవేశపెట్టాలని, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్ తొలగాలనీ, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై దిగుమతి సుంకం తగ్గించడం విరమించుకోవాలని, దిగుమతి సుంకం పెంచి దేశీయ రైతులను కాపాడాలనీ ఇలాంటి డిమాండ్లను రైతులు వినిపిస్తున్నారు.
రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వంతో నాలుగు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అన్నదాతలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ప్రధానంగా మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను పాత ఎంఎస్‌పికి కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతులు పండించే 23 పంటలకు కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేయాలన్నదే రైతుల ప్రస్తుత ప్రధాన డిమాండ్. తక్షణమే అన్ని పంటలకు కనీస మద్ధతు ధర చట్టం తీసుకురావాలని, ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చర్చల విఫలం నేపథ్యాన కేంద్రంపై మరింత నిరసనాగ్రహంతో రైతన్నలు తమ మలి విడత పోరాటాన్ని మునుపటి కంటే ఉధృతంగా చేపట్టేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే దిశగా ఫిబ్రవరి 14న ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం తమ ఆందోళలను పునఃప్రారంభించింది.
ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన ‘శంభూ’కు ఫిబ్రవరి 13 సాయంత్రానికే రైతులు వేలాదిగా తరలివచ్చారు. వందలాది ట్రాక్టర్లు, ట్రాలీలు చేరుకున్నాయి. పోలీసులు కూడా ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్, హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో రైతులను, వ్యవసాయ కార్మికులను సమీకరించడంతో పాటు అణిచివేత చర్యలను కూడా ఎదుర్కొనేందుకు కర్షకులు మరింత సంసిద్ధమయ్యారు. భాష్పవాయు గోళాలను ప్రతిఘటించేందుకు ఇనుప కవచాలను ధరించిరావడం విశేషం. శంభు సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు భారీగా చేరుకున్నారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. రైతుల పోరాటాన్ని అణిచివేసే చర్యలు మానుకోవాలని, శాంతియుత నిరసనలకు అనుమతించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
రైతులు సుదీర్ఘ ఆందోళనకు సిద్ధపడి అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుని వచ్చినట్లు రైతులు వెల్లడించారు. ఆరు నెలలకు సరిపడే సామాగ్రి, వాహనాలకు డీజిల్‌ను తమవెంట తెచ్చుకున్నామని పంజాబ్‌కు చెందిన రైతులు తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఆందోళన నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని తెలియచేస్తున్నారు.
రైతులపైకి శబ్ద ఫిరంగులు :
శంభు, దాతాసింగ్ వాలా-ఖానౌరీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్నారు. పోలీసులు రైతులను బారికేడ్లతో అడ్డుకున్నారు. అయినా ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు యత్నిస్తున్న రైతులు బారికేడ్‌ను కూడా విరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు తన వ్యూహంలో కొత్త టెక్నాలజీలను ఉపయోగించారు. ఇది ఢిల్లీకి చేరుకున్నప్పుడు గుంపును చెదరగొట్టడానికి లాంగ్-రేంజ్-అకౌస్టిక్ డివైస్(ఎల్ఆర్ఎడి) అంటే సౌండ్ కెనాన్ (ఫిరంగి)ని మోహరించింది. సౌండ్ ఫిరంగి అనేది ఒక ప్రత్యేక రకం లౌడ్ స్పీకర్, ఇది చాలా దూరం వరకు పెద్ద ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పీకర్ నుంచి వచ్చే శబ్ధం యొక్క డెసిబెల్ సామర్థ్యం నుంచి ఒక మీటరు వద్ద 160 డిబి వరకు ఉంటుంది. సామాన్యంగా ఒక మనిషి 50-60 డిబి వరకు శబ్దాలను వినే సామర్థ్యాన్ని మాత్రమే వినగలుగుతారు. గుంపు నియంత్రణకు సౌండ్ ఫిరంగులను ఒక పద్ధతిగా ఉపయోగిస్తారు. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో, అనేక నౌకాదళాలతో సహా రక్షణ దళాల ద్వారా మాస్ కమ్యూనికేషన్ కోసం కూడా ఉపయోగించబడుతోంది.
సౌండ్ కానన్ ఎలా ప్రారంభమైంది ? :
అమెరికన్ క్షిపణి విధ్వంసక నౌక యుఎస్ఎస్ కోల్‌పై ఆత్మాహుతి దాడి తర్వాత ఈ పరికరం సాధారణ ఉపయోగంలోకి వచ్చింది. 2000లో, యెమెన్‌లో క్షిపణి విధ్వంసక నౌకపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 17 మంది యుఎస్ నేవీ నావికులు మరణించారు. 37 మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత యుఎస్ నేవీ సౌండ్ ఫిరంగి పరికరాన్ని ఇన్స్టాల్ చేసింది. దూరం నుంచి వస్తున్న ఓడ గురించి తెలుసుకునేందుకు నౌకాదళం కోసం ఈ పరికరాన్ని తయారు చేసింది. రేడియా కాల్లకు స్పందించలేని దూరం నుంచి వచ్చే నేవీ షిప్‌లను సంప్రదించడానికి ఈ పరికరంతో సాధ్యమైతుంది. ఈ పరికరం 2002లో మొదటగా ఉపయోగించడం మొదలు పెట్టారు. తర్వాత ఈ పరికరాలు అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ఈ పరికరాలు కమ్యూనికేషన్ల కోసం, నిరసనలతో సహా అనేక గుంపు నియంత్రణ ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
రైతులు దేశద్రోహులా?
రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం కొనసాగుతూ ఉండటం దురదృష్టకరం. ఒకప్పుడు రైతులను ‘జై కిసాన్’ అంటూ హీరోలుగా చూసిన దేశంలో నేడు ఖలిస్తాన్ మద్ధతుదారులుగా చిత్రీకరించే దుస్థితికి దిగజారడానికి మించిన దేశద్రోహం మరొకటి ఉండదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన వివాదాస్పదమైన మూడు రైతు చట్టాల పట్ల చెలరేగిన రైతుల ఆగ్రహ జ్వాలలు సుమారు సంవత్సరం పాటు తీవ్ర నిరసనలకు దారితీయగా, స్వయంగా ప్రధానమంత్రి జోక్యం చేసుకొని, ఆ చట్టాలను ఉపసంహరించుకొంటున్నట్టు పార్లమెంట్లో ప్రకటించడంతో ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ గత మూడేళ్లలో ఆ దిశలో ఎటువంటి ప్రయత్నం జరగకపోవడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు వీరిని రెచ్చగొడుతున్నాయంటూ బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు కనీసం మద్ధతు ధర గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘నిపుణుల కమిటీ’ సభ్యుడు ఒకరు ఒక టివి చర్చలో ఉద్యమిస్తున్న రైతులను ‘దేశద్రోహులు’ అని పేర్కొన్నారంటే ‘రైతు వ్యతిరేక’ వ్యక్తులు లేదా రైతుల సమస్యల పట్ల కనీసం అవగాహనలేని వ్యక్తులు నేడు కీలక స్థానంలో ఉండటం రైతులకు బాధకరంగానే ఉన్నది.
2020లో రైతుల మధ్య చీలికలు తీసుకొచ్చి, వారిలో ఖలిస్థాన్ తీవ్రవాదులు చేరిపోయారంటూ ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని అణచివేయడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. దాంతో ఇప్పుడు ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమై రైతులు అసలు ఢిల్లీకి రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మద్ధతు ధరను చట్టబద్ధం చేస్తే ఆహార ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతుందని, ప్రభుత్వంపై రూ.10 లక్షల కోట్లమేరకు అదనపు వ్యయం పడుతుందని నిరాధారమైన కథనాలు నేడు మీడియాలో వ్యాపిస్తున్నాయి. భారత్‌ను 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెబుతున్న ప్రధాని మోడీ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయకుండా సాధింపగలరా? ‘సబ్ కా సాత్… సబ్ కా వికాస్’ తన లక్ష్యంగా ప్రధాని చెబుతున్నారు. దేశ జనాభాలో సగం మంది, అంటే 70 కోట్ల మందికి ఇంకా వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయ కుటుంబాల గురించిన తాజా సర్వే ప్రకారం ఒక్కో కుటుంబం సగటు వార్షిక ఆదాయం రూ.10,218 మాత్రమే.
చాలామంది వితండవాదన చేస్తున్నట్లు రైతుల ఆదాయం పెరగడం ప్రభుత్వానికి భారం కాబోదు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు, అత్యంత బలీయంగా మారేందుకు దారితీస్తుంది. రైతుల కొనుగోలుశక్తి పెరిగితే అన్ని వ్యాపార రంగాలు పుంజుకుంటాయి. దేశ జనాభాలో 50 శాతంగా ఉన్న రైతుల కొనుగోలు శక్తి మద్ధతు ధర కారణంగా పెద్ద ఎత్తున పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి ఊహించనంత వేగవంతం కాగలదని గ్రహించాలి. మద్ధతు ధరను చట్టబద్ధం చేయడంలో మన ఆర్థిక వ్యవస్థపై ఉండే సానుకూల ప్రభావాన్ని గుర్తించకుండా, ప్రభుత్వంలోని పెద్దలు, ఆర్థిక నిపుణులు, మీడియా మార్కెట్లపై ఎక్కువగా విశ్వాసం వ్యక్తం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. లోపభూయిష్టమైన మార్కెట్ల కారణంగానే థాబ్ధాలుగా మన రైతులు ప్రపంచంలో మరే దేశంలో కనీవినీ ఎరుగనంతటి దోపిడీకి గురవుతున్నారని మరచిపోతున్నారు.
రైతులపై ఉక్కు పాదం :
ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు ‘ఢిల్లీ చలో’ పాదయాత్ర కొనసాగుతుందని రైతు సంఘాల నేత సర్వన్ సింగ్ పందేర్ ప్రకటించారు. రైతుల ‘ఢిల్లీ చలో’ పిలుపు నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఇప్పటికే 177 సోషల్ మీడియా ఖాతాలను, రైతుల ఆందోళనలతో అనుబంధంగా ఉన్న లింక్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించింది. ప్రభుత్వంతో నాలుగు దఫాలా చర్చలు విఫలమైన తరువాత వేలాదిమంది నిరసనకారులు ఫిబ్రవరి 21న ఢిల్లీకి తమ మార్చ్‌ను తిరిగి ప్రారంభించినప్పుడు పోలీసులు టియర్ గ్యాస్ రౌండ్లు కాల్చడంతో ఒక నిరసనకారుడు, 21 ఏళ్ల రైతు శుభాకరన్ సింగ్ తలకు గాయం కావడంతో పంజాబ్‌లోని రాజింద్ర ఆసుపత్రిలో మరణించాడు. 100కి పైగా రైతులు గాయపడ్డారు. మరోవైపు వందకు పైగా ట్రాక్టర్లను పోలీసులు తగుల బెట్టారు. మీరట్‌లో 21 ఫిబ్రవరి నాడు నిర్వహించిన కిసాన్ ర్యాలీ సందర్భంగా రాకేష్ తికాయత్ మాట్లాడుతూ రైతుల్ని ఢిల్లీకి రానివ్వకపోతే రేపు ఓట్లు అడుక్కునేందుకు మిమ్మల్ని గ్రామాలకు రానివ్వకుండా నిషేధిస్తామని హెచ్చరించాడు. ఇంకేమాత్రం రైతులపై దమనకాండ సాగించి మోడీ ప్రభుత్వం మనగల్గలేదని ఆయన హెచ్చరించాడు.
ముగింపు :
మోడీ ప్రభుత్వం రైతుల డిమాండ్లను సానుభూతితో పరిశీలించే ప్రయత్నం చేయకుండా వారిని దేశద్రోహులనో, తీవ్రవాదుల మద్దతుదారులు అనో, ప్రతిపక్షాలు వదిలిన బాణాలనో దుర్మార్గంగా నిందించడం బాధ్యతా రహితమే అవుతుంది. ఈ సందర్భంగా రైతులను నిట్టనిలువుగా దోపిడీకి గురిచేస్తున్న కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతుల డిమాండ్లు సహజంగానే కార్పొరేట్ సంస్థలను కలవరానికి గురిచేస్తున్నాయి. పరిశ్రమలకు ముడి సరుకులను రైతులు సరఫరా చేయాల్సిందే. వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు చెల్లిస్తే తమ లాభాలు తగ్గిపోతాయని వారు ఆందోళన చెందడం సహజమే. దేశంలో సుమారు పదికోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 82 శాతం రెండు హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులే. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ వీరికి మేలు చేసే చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ నిర్ణయం బడుగు బలహీన రైతాంగానికి మేలు చేసే విధంగా ఉండాలి. వారు కార్పొరేట్ శక్తుల బారిన పడకుండా ఏటికేడాది వారి ఆదాయాలు స్థిరంగా వృద్ధి చెందాలి. ఇప్పటికే మోడీ కార్పొరేటీకరణ విదానాల వల్ల అన్యాయాలకు గురవుతున్న రైతులు నగరాలలో కూలీలుగా, అపార్ట్మెంట్ వాచ్మన్లుగా, ఆటోవాలాలుగా మారిపోయే దుస్థితి దాపురించింది.
వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థను పెట్టుబడిదారీ శక్తుల పరం చేయాలన్న మోడీ విధానాలతో సన్న చిన్నకారు, కౌలు రైతులకు తీవ్ర అభద్రత వాటిల్లింది. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత ఉండాలని అందుకే వారు కోరుతున్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీల విచ్చలవిడి లాభాలు కొనసాగేటట్లు చేయడం కోసం దేశ జనాభాలో సగం మందిగా ఉన్న రైతులను మరింత పేదలుగా మార్చేందుకు ఒక దేశంగా సిద్దపడాలా? రైతులు దుర్భర జీవనం సాగిస్తుంటే మనది ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కలిగే ప్రయోజనం ఏమిటి? పెట్టుబడిదారీ మిత్రులకు అయాచితంగా వరాలు ఇచ్చే మోడీ ప్రభుత్వం దేశానికి అన్నంపెట్టే రైతులను చీదరించుకుంటున్నది. ఇవే నేడు దేశం ముందున్న మౌలిక ప్రశ్నలు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, దుర్మార్గపూరితమైన విద్యుత్ విధాన బిల్లును ఉపసంహరించుకోవాలి, రైతుల రుణాలను రద్దు చేయాలి. పంటలకు కనీస మద్ధతు ధర చట్టం చేయాలి. రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ ఉపకరణాలు సరఫరా చేసే మార్గాలు అన్వేషించాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఇలాంటి వ్యాసాలు ఇంకా రావాలి