ప్రేమను ఆవిష్కరించే ప్రయత్నం: సుభాషిణి తోట ‘రెండు ఒకట్ల పదకొండు’

రెండు ఒకట్ల రెండు ఎక్కాల పుస్తకం లో గణితాన్ని చదివితే రెండు ఒకట్ల పదకొండు అంటూ సమాంతర ఒకట్లను జీవితానికి ఆయువైన ప్రేమను ఆవిష్కరించే ప్రయత్నం సుభాషిణి తోట గారి సంపుటిలో జరిగింది.

ప్రేమ లో అతనూ ఆమె లో బంధాలేవైనా బంధం గట్టిగా పట్టుకుని ఎగిరెగిరినా ఊహల్లో తేలి పోతున్నా అక్షరాల విన్యాసం అక్షరాలా గుండె లోతుల్లో తడిని తడుతుంది. తడి ఆరని కన్నీటిని, బాహువుల్లో కరిగి పోయే సున్నితత్వాన్ని, ఆమె ఆమెగా మసలుకుందామన్నా మసిలే పురుషాధిక్యత పై ఎర్ర కాలువలు పారించినా సాహితీ సేద్యంలో విభిన్నత ఆమె కలంలో సిరాకే సొంతం.

ఇంకా నీళ్లెక్కడుంటాయ్ రా! కవితలో పాడు బడ్డ బావిలో పాతివేయబడ్డ చిన్నారుల ఆక్రందనలు వినిపించారు. ‘బావులు తవ్వితే అరణ్య రోదనలు, పాచినీటి కులవివక్ష ఆత్మహత్య ల అసలు రంగు’ ను బయట పెట్టారు. బావులు తవ్వి తే నీళ్ళు రాకపోగా చిన్నారులను చిదిమి పాతే నెలవులు గా మారాయనే ఆవేశం కవిత నిండా పోగు చేయబడింది. నాదొక విన్నపం కవితలో ‘ క్షణ క్షణం నన్ను నువ్వు రాతిని చేసి రాగాలను సమకూరుస్తుంటావు చూడు ఖచ్చితంగా అప్పుడే నాలోని అస్తిత్వం నిన్ను తరిమేందుకు కొన్ని శబ్దాలను విడుస్తుంది’ అంటూ స్త్రీ వాద కవిత్వ పదును ని కలానికి నేర్పింది. ‘నా ప్రేమ కి స్వస్తి చెప్పలేను అలా అని నిన్ను కోల్పోను’ అనే సందిగ్దావస్థలో మనసున గాయానికి లేపనాన్ని పూసే ప్రయత్నం చేసారు. సింధూరం కవితలో ‘నిలుచున్న చోటే కూలిపోయే దేహం నాది కాలిపోయే వరకు దేహానికి కూలీ ఇచ్చేది మాత్రం అతని స్పర్శే’ అంటూ ఆధిపత్య ధోరణి లో సతమత మవుతున్న స్త్రీ పక్షాన ఎక్కుపెట్టిన అస్త్రం ఈ కవిత.

ఆమెలందరూ కవిత లో ‘ నాగరికత నేర్వక ముందే సమానతల్ని తెగ నరికి అస్తిత్వాన్ని బొమ్మ గా మలిచారంతే’ అంటూ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. కోరికల చిట్టా కవిత లో ‘నేనొక కథ చెప్పాలి నీకు అన్నాడతను, బండరాయి ని జోకొడుతూ రోజూ చెప్పేది కాకుండా కొత్తగా చెప్పవా అందామె’ లోని మర్మం లోతు అంచనా వేయగల్గితే లింగ వివక్ష కి చరమ గీతం పాడినట్లే. ఉనికే ఊపిరి చేస్తూ కవితలో ‘ఆమె అందంగా నవ్వాలంటే అవతలి మనిషి మీద నమ్మకం కూడా వుండాలి’ అని ప్రేమ కి పునాది నమ్మకమనే భావనను పలికించారు. ‘మాటల యుద్దాలని నా ఉనికికి ఊపిరి అందగానే ముగిస్తానని’ ఆమె ఉనికి కోసం పడే తాపత్రయాన్ని సున్నితంగా తేట తెల్లం చేసారు.

ఎర్ర కాలువ కవితలో ‘నల్ల రక్తం ఎరుపు విరిగి సన్నని తీగరాగం అందుకుంటుంది అదే విప్లవ గీతం. వంటిల్లే కాదురా… ఏ గదిలోనైనా ప్రవేశం నా ఎర్ర కాలువ పారుతున్న దేహాంగం తోనేనని నిర్ద్వంద్వంగా తెగేసి చెప్పిన తీరు వంటింట్లోకి రానీయని మనువాదం పై ఎగసిన విప్లవ జెండా అని చెప్పటంలో అతి శయోక్తి లేదు. ఎర్ర కాలువ పారనిదే మనువు లేడు వాడి అజెండా లేదనే సత్యాన్ని గ్రహింప జేయ అక్షరాలను సంధించిన తీరు ప్రశంసనీయం. నగ్నంగా చూడాలని వుందా కవితలో ఓటి తొడలతో మట్టి ఎడారి నాట్యమాడుతున్నా నువ్వు హారతి పట్టిన దాన్ని నీరెండి ఎడారిని మద్దూరోడి గోదారి నని మద్దూరి ని యాది చేసుకుంటూ ఆమెను ఆమె గా బతక నీయని సమాజంపై ఎక్కు పెట్టిన విల్లు ఈ కవిత.

విప్లవ కారుడా కవితలో ‘ కొన్ని స్పందనల్ని అక్కడెందుకో పూడ్చి పెడుతున్నారు కాస్త విప్లవాన్ని నా చేతిలో రాశిగా పోయవూ’ అనే విజ్ఞాపనలో చేతనమయ్యే పిడికిళ్లు కనిపిస్తున్నాయి. నేటి ఫాసిజం పోకడల పై ఎగుస్తున్న జ్వాలలకి ఉత్ప్రేరకంగా సాగిన శైలి. వాడి పై బలమైన అస్త్రం ప్రయోగించాలి నాకు కొన్ని మగ పదాలు కావాలి అని ఫెమినిస్ట్ భావజాలాన్ని వదిలారు. పదాలన్నీ ఆమె చుట్టే అల్లిన పదాలు కావటం చేత మగ పదాలకై నిగ్గ తీసి అడిగారీ కవిత లో.

ఆమె కథలో ‘దోసిలి పట్టిన వాన చినుకుని చెరువు తన బాహువుల్లో పొదిలినట్లు అతని కౌగిల్లో కరుగుతూ బావుందా కథ అందామె’. కరిగిపోయే భావనలు జ్ఞాపకాల్లో ప్రోది చేసుకునే క్షణాలను అందంగా ఒడిసి పట్టుకున్న కవితా ఝరి కనిపిస్తుంది. నిజం చెప్పొద్దూ కవితలో ‘కొన్ని సంకెళ్ళను తెంపుకుని స్వేచ్ఛా విహారి నైతేనేమి ఆ ఆడ పక్షి కి లేని అంతరాలు నాకెందుకని’ ‘కొన్ని కంచెలను తెంపేసి క్షేత్రాన్నైతేనేం ‘ అని సమాజ గోడలను బద్దలు కొట్టే ఆలోచన కి రూపు దిద్దారు. తెంచుకోవాలన్న సంఘర్షణలో ఎంచుకున్న పంథా సూటిగా స్పష్టంగా అనాదిగా ఆమె చట్రాన్ని చేధించ ప్రయత్నించారు. మేం విగ్రహాలను ఆరాధిస్తాం ఆదరణ కి నోచుకోని ఎన్నో బతుకుల్ని విస్మరిస్తాం అని నేటి వాస్తవ పరిస్థితిని కళ్ళ ముందుంచారు.

ఈ పుస్తకం రెండో పేజీలో నిచ్చెనలు ఎందుకు వేసారో కానీ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద ఝుళిపించిన కవితలకు సందర్భోచితంగా కనిపించింది . అతను ఆమె రెండు నిచ్చెనలపై సమాంతరంగా ఎదగాలనే ఆదర్శం ఫలించాలని ఆశిద్దాం.

ప్రతులకు
సుభాషిణి తోట
15-13-309 బ్యాంక్ కాలని ఎస్ బి ఐ దగ్గర
ఖమ్మం
పిన్ 507002

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply