రిపబ్లిక్‌ తనని తానే రద్దు చేసుకుంటుందా?

విప్లవోద్యమాన్ని అంతం చెయ్యాలనే లక్ష్యంతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం కొనసాగిస్తున్న ‘‘ఆపరేషన్‌ కగార్‌’’ కేవలం ‘‘అంతిమ’’ యుద్ధానికి సంబంధించిన సైనిక చర్య  మాత్రమే కాదు. అది గత ఏడున్నర దశాబ్దాలుగా  (ఉదారవాదులు ఊదరకొడుతున్న) నామమాత్రపు భారత రిపబ్లిక్‌ ను మొత్తంగా అంతం చేసే రాజకీయార్థిక ప్రక్రియ. ప్రస్తుత ఫాసిస్టు సందర్భంలో కగారే భారత రిపబ్లిక్‌ ఆత్మగా మారే స్థితి ఒకటి ముంచుకొస్తున్నది. ఈ ప్రక్రియను అనేక వైపుల నుండి విశ్లేషిస్తూ దాని దశ, దిశను పట్టుకునే ప్రయత్నంగానే దశాబ్దాలుగా అనేక ఉద్యమాలతో కలిసి నడుస్తున్న ఒక సహ ప్రయాణికుడు (ఫెలో ట్రావెలర్‌) ‘‘కగార్‌ రిపబ్లిక్‌’’ను మన ముందుకు తెచ్చాడు. ఈ పుస్తకంలో ‘‘కగార్‌ రిపబ్లిక్‌ అంటే ఇది’’ అని నిర్వచించ లేదు. కానీ, రాజ్యాంగ ప్రవేశికలో ‘‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రం’’ అని ప్రకటించుకున్న  రాజ్యం  ఏ విధంగా తన ప్రకటిత స్వభావాన్ని,  వాటికి సంబంధించిన అన్ని మౌలిక విలువలను  (కనీస ఉదారవాద,  ప్రజాస్వామ్య, సంక్షేమ, లౌకిక విలువలను) ధ్వంసం చేసుకుంటూ చివరికి ‘‘కగార్‌ రిపబ్లిక్‌’’గా ఎట్లా రూపాంతరం చెందిందో అర్థం చేయించే అనేక రాజకీయ ప్రక్రియలతో, సంఘటనలతో, సామాజిక చరిత్ర వివరణలతో ఈ రచన కొనసాగింది.

ఈ పుస్తకం చదివాక నాకు రెండు ప్రధానమైన ఆలోచనలు కలిగాయి. ఒకటి, భారత రిపబ్లిక్‌ ను కగార్‌ ద్వారా అంచనా వెయ్యడం. రిపబ్లిక్‌ లో కగార్‌ మూలాలు వెతకడం.  ఎందుకంటే కగార్‌ లో సైనిక చర్యతో పాటు న్యాయ వ్యవస్థల మౌనం (అంటే నేరంలో భాగస్వామ్యం), వైఫల్యం (అంటే పాలక వర్గాలకు ఊడిగం చెయ్యడం)ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. అంతేకాదు, పెద్దమొత్తంగా పౌర సమాజపు స్పందనలేని తనం, దాని మూలంగా రాజ్యహింస సాధారణీకరించబడటం, తాను చేసే నేరాలకు శిక్ష పడుతుందనే భయం రాజ్యానికి లేకపోవడం (impunity) కగార్‌ సందర్భంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పౌర సమాజమే కాదు, దాదాపు అన్ని పాలకవర్గ పార్టీలు బిజెపి ప్రభుత్వం ప్రజలపై కొనసాగిస్తున్న హింసాకాండకు మౌనంగా మద్దతు పలుకుతున్నాయి. కగార్‌ ఆపరేషన్‌ భారత రాజ్య వ్యవస్థ స్వభావాన్ని, దానికి వెన్నుదన్నుగా ఉండే దోపిడి పాలకవర్గాల, కులాల స్వభావాన్ని మరింతగా బహిర్గతం చేస్తోంది.

రెండో విషయం, రిపబ్లిక్‌ దృష్టి నుండి కగార్‌ అసలు రూపాన్ని చూడటం. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలకులు పెద్ద ఎత్తున కగార్‌ దాడిచేస్తూ విజయగర్వాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్లు చేసే చర్యలను భారత రాజ్యాంగం, రిపబ్లిక్‌ యంత్రాంగం ఏది కూడా ఆపే స్థితిలో లేవు. అంతేకాదు, అన్ని రాజ్య వ్యవస్థలు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దోపిడి కుల, వర్గ పునాదులమీద నిర్మితమైన రిపబ్లిక్‌ హింసను నమ్ముకునే మనుగడ సాగిస్తుంది. అటువంటి హింసా మార్గంలో రాజ్యం ఉపయోగిస్తున్న అతి పెద్ద ఆయుధం ‘‘కగార్‌’’ దీని ద్వారా భారత రిపబ్లిక్‌ తన పిల్లలను తానే చంపుకునే ప్రక్రియను నిరాటంకంగా కొనసాగిస్తున్నది. 

ప్రజా పోరాటాలకు ఉండే సామాజిక, రాజకీయ, ఆర్థిక మూలాలను, న్యాయ భావనను రిపబ్లిక్‌ చూడ నిరాకరిస్తున్నది. పోరాడే ప్రజలను ‘‘టెర్రరిస్టులుగా’’, ‘అభివృద్ధి నిరోధకులు’గా, ‘దేశద్రోహులుగా’ ముద్రలు వేస్తున్నది. చట్టసభల సాక్షిగా చంపుడు పందెంపెట్టి, దానికో ముహూర్తం ఖరారు చేసి, ఉద్యమకారుల తలలకు వెల కడుతున్న సుపారీ సర్కార్‌ కొనసాగే నైతికతను రిపబ్లిక్‌ ఇస్తుంది. అయితే భారత రిపబ్లిక్‌ దృష్టిలో కగార్‌ అనేది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసే పనిలో ఉన్న విప్లవ శక్తులను అదుపులోకి తేవడానికి, దేశ సార్వభౌమత్వం- భద్రతను కాపాడడానికి, అభివ ృద్ధి-పాలనను అడ్డుకునే శక్తులను నిర్మూలించటానికి చేపట్టిన చట్టబద్ధమైన భద్రతా-పరిపాలనా చర్య. ఈ అవగాహనలోని ప్రతీ పదం ప్రశ్నించదగినవే. ఇది భారత రిపబ్లిక్‌ మొత్తం సమాజాన్ని, దాని పరివర్తనను ఎలా అర్థం చేసుకుంటుందో ప్రకటిస్తుంది.

ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్లో ఏ విధంగా కగార్‌, భారత రిపబ్లిక్‌ తమ అంతిమ లక్ష్యాల ద ృష్ట్యా ఒకదానికొకటి పెనవేసుకొని ‘కగార్‌ రిపబ్లిక్‌’గా మారిందో ఫెలో ట్రావెలర్‌ మనకు అనేక ఉదంతాలతో వివరించాడు. అయితే  భారత రిపబ్లిక్‌ కగార్‌ రిపబ్లిక్‌ గా మారిన తీరు ఇంకా లోతుగా అర్థం కావాలంటే అసలు రిపబ్లిక్‌ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? అది ప్రజలకు ఏమి హామీ పడుతుందో అర్థం చేసుకోవడం అవసరం.

భాషాపరంగా రిపబ్లిక్‌ అనే భావన ‘Res Publica’ అనే లాటిన్‌ పదం నుండి వచ్చింది. దాని అర్థం ‘‘ప్రజలకు సంబంధించింది’’ లేదా ‘సార్వజనిక వ్యవహారం’. ఈ భావనను రాజకీయంగా అన్వయించినప్పుడు ‘‘ప్రజలకు సంబంధించింది’’ అంటే రాజరిక వ్యవస్థల నుండి విముక్తి అయిన  ప్రజలు తమకు తాముగా  లేక తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించుకునే వ్యవస్థగా మారడం. ఈ మారడం సహజసిద్దంగా జరిగే ప్రక్రియ కాదు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా జరిగిన మార్పు.

రిపబ్లిక్‌ అనే భావన, దానిని నిర్వచించే పద్దతి స్థలకాలాలకు అనుగుణంగా మారుతూ వస్తుంది. రాజనీతిశాస్త్ర పండితుల నిర్వచనాల ప్రకారం ఆధునిక గణతంత్రం (modern republic) అనేది ప్రజల సార్వభౌమాధికారం పునాదిగా ఉనికిలోకి వచ్చి, అధికారం దుర్వినియోగం కాకుండా చూడగలిగే వ్యవస్థలను ఏర్పర్చుకొని, స్వేచ్ఛను హరించని చట్టబద్ద, బాధ్యతాయుత పాలన కొనసాగిస్తూ, అందులో పౌరులను భాగస్వాములు  చేస్తూ  మొత్తం ప్రజాహితం కోసం పనిచేసే ఒక రాజకీయ వ్యవస్థ. అయితే ఒక్కో రాజ్య వ్యవస్థ ఒక్కో విధంగా తమ చారిత్రక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తాము (సారాంశంలో తమ ఉన్నత వర్గాలు) ఎలాంటి రిపబ్లిక్‌ గా అభివృద్ధిచెందాలో నిర్ణయించుకున్నాయి. భారత రిపబ్లిక్‌ కూడా రాజ్యాంగంలో తనదైన లక్షణాలను ప్రకటించుకుంది. 

ఇంతకుముందు ప్రస్తావించినట్టు భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశం ‘‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రం’’అని ప్రకటిస్తుంది. రాజ్యాంగ సూత్రాల ప్రకారం సార్వభౌమం అంటే భారతదేశం తన నిర్ణయాలను ఇతర ఏ దేశం లేదా బాహ్య శక్తికి  లోబడకుండా పూర్తిగా స్వతంత్రంగా తీసుకోగలదని అర్థం. దేశాన్ని ఎలా పాలించాలి? ఏ విధానాలు అవలంబించాలి? అంతర్గత, బాహ్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలి? అనే అంశాలు పూర్తిగా భారతదేశ ప్రజల (వాళ్లు ఎన్నుకున్న ‘‘ప్రజా ప్రతినిధుల’’) చేతుల్లోనే ఉంటాయి. 

భారత రాజ్యాంగం దేశాన్ని ‘‘సార్వభౌమ గణతంత్రం’’గా నిర్వచించినా, ఈ సార్వభౌమత్వం వాస్తవంలో ఎంత మేర నిలిచిందన్న ప్రశ్నకు దేశ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ నిర్ణయాలు సమాధానం ఇస్తాయి. ప్రతీ దశలో తన పాలసీ విధానాలను రూపొందించేటప్పుడు పాలక వర్గాలు చూస్తున్నది ప్రజల అవసరాలను కాదు. గ్లోబల్‌ మార్కెట్లు సంతోషపడతాయా, అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలమా, పెట్టుబడిదారులు భారతదేశాన్ని ‘‘సురక్షిత’’ వ్యాపార స్థలంగా భావిస్తారా అన్నదే.

దేశంలో వచ్చిన ప్రతీ ఆర్థిక సంస్కరణ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, తమ దళారీ పెట్టుబడిదారుల కోసమే అని చరిత్ర పొడువునా ఆధారాలు ఉన్నాయి. అన్ని సంస్కరణలు (వ్యవసాయ, కార్మిక, రిటైల్‌, బీమా, రక్షణ, పన్నులు మొదలగు రంగాలలో) ‘‘దేశీయ ప్రయోజనం’’ కోసమే అనే మాటతో అలంకరించబడినా, అసలైన లబ్ధిదారులు బహుళజాతి కంపెనీలే, క్రోనీ కాపిటలిస్టులే. భారత్‌ W.T.O., I.M.F, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి గ్లోబల్‌ సంస్థలు సూచించే ‘‘సంస్కరణలు’’ అమలు చేస్తున్నది. వాటిని అమలు చేయకపోతే విదేశీ పెట్టుబడులు పారిపోతాయన్న భయం దేశ పాలక వర్గాలను వెంటాడుతున్నది.

అమెరికాతో పెరుగుతున్న రక్షణ భాగస్వామ్యం ద్వారా దేశ సార్వభౌమాధికారం ఎంత బూటకమో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక రక్షణ ఒప్పందాలు (LEMOA, COMCASA, BECA) ఒక్కొక్కటీ భారతదేశాన్ని అమెరికా వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలో ఇరుక్కునే విధంగా చేస్తున్నాయి. నేడు భారత రక్షణ కొనుగోళ్లలో అమెరికా కీలక పాత్ర పోషిస్తున్నది. దాని ఆధారంగానే (మీడియా, సోషల్‌ మీడియా ప్రచారం ఎలా వున్నా) భారత విదేశాంగ నిర్ణయాల్లో అమెరికా జోక్యం రోజురోజుకూ పెరుగుతున్నది.

ఈ నేపథ్యాన్ని మొత్తం చూస్తే, భారతదేశం పేరుకే ‘‘సార్వభౌమ గణతంత్రం’’. వాస్తవంలో అది ఇంకా సామ్రాజ్యవాద కనుసన్నల్లో పనిచేస్తున్న అర్థ-వలస రాజ్య వ్యవస్థే. నిర్ణయాలు ప్రజల వల్ల కాక, ప్రజల పేరిట కాక, ప్రజల కోసం కాక అంతర్జాతీయ పెట్టుబడిదారుల నిబంధనల ప్రకారం జరుగు తున్నాయి. దేశీయ పాలక వర్గాలకు ఈ విధానంతో అంగీకారం ఉంది. ఎందుకంటే వాళ్ల లాభాలు కూడా ఇదే గ్లోబల్‌ మార్కెట్‌ తో ముడిపడివున్నాయి కాబట్టి. 

అభ్యుదయ రాజ్యాంగవాదుల విశ్లేషణ ప్రకారం సామ్యవాదం అంటే సమాజంలో సామాజిక, ఆర్థిక న్యాయాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకోవడం. అంటే సంపద కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కాకుండా చూడడం.

పేదలు, కార్మికులు, రైతాంగం, అట్టడుగు వర్గాల కులాల, జాతుల సంక్షేమం కోసం సమన్యాయ భావనతో రాజ్యం పనిచేయడం. ప్రతీ పౌరుడికి సమాన అవకాశాలు లభించేలా ఏర్పాటు చేయడం. ఐతే, సామ్యవాదం అంటే కేవలం ‘‘న్యాయం’’ అనే మృదువైన  మాట కాదు. అది సమాజాన్ని వర్గ సంబంధాల నుండి  విముక్తం చేసే   పునర్‌వ్యవస్థీకరణ.   ‘‘రాజ్యాంగం అమలు చేస్తే  సమాజంలో ఆర్థిక-సామాజిక న్యాయం వస్తుంది, అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమం దగ్గరవుతుంది, అణగారిన వర్గాలకు, కులాలకు సమాన అవకాశాలు కల్పించబడతాయి’’ అని రాజ్యాంగవాదులు చెప్పేవి చాలా తేలికైన మాటలు. వినడానికి అవి చాలా బాగుంటాయి. కానీ అవేవీ వర్తమాన భారత రాజ్య యంత్రాంగం నుంచి  ఎదురుచూడగలిగే విషయాలు  కావు.  ఎందుకంటే ఫాసిస్టు రాజ్యం రూపంలోనూ, సారంలోనూ పీడిత వర్గ వ్యతిరేక స్వభావాన్ని కలిగివుంది. 

సామ్యవాదం అనేది దోపిడి వర్గాల ‘‘ఉదారత’’ మీద ఆధారపడే వ్యవస్థ కాదు. అది సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవకుండా ఉండాలి అని చెప్పడంతో సరిపెట్టుకోదు. సంపద ఎలా, ఎవరితో,  ఏ పద్ధతిలో ఉత్పత్తి అవుతుందో, దాని మీద ఎవరి హక్కు ఉంటుందో  అనే ప్రశ్నను వర్గ పోరాటం కోణంలో చూస్తుంది. సమానత్వం అనేది కేవలం ఒక అభిలాష కాదు. దోపిడి వర్గాలను కూలదోయకపోతే సమానత్వం అసాధ్యం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా సోషలిస్టు విప్లవాల ద్వారా తప్ప మరే విధంగా సమానత్వం సాధించిన దాఖలాలు లేవు. ఈరోజు భారతదేశంలో, అగ్రకుల- అగ్రవర్గ కార్పొరేట్‌ శక్తులు, భూస్వాములు, గ్లోబల్‌ ఫైనాన్స్‌ క్యాపిటల్‌- ఇవన్నీ శ్రమ దోపిడీ, సంపద కేంద్రీకరణ వెనుక ఉన్న వాస్తవ శక్తులు. వీటిని  ఎదిరించకపోతే  సామ్యవాద  న్యాయం కేవలం పుస్తకాల మాటగానే మిగిలిపోతుంది. సామ్యవాద రిపబ్లిక్‌ సూత్రప్రాయంగా కార్మికులకూ, రైతులకూ సమాన అవకాశాలు కల్పించాలని చెబుతుంది. కానీ అదే రాజ్యం కార్మిక సంఘాల హక్కులను బలహీనపరుస్తుంది,  అణిచివేస్తుంది. కాంట్రాక్టు పనిని పెంచుతుంది, 12 గంటల పని చట్టాలకు మార్గం  సుగమం చేస్తుంది. ఇది ‘‘సమాన అవకాశం’’ కాదు, ఇది కార్మిక వర్గం శ్రమను చౌకగా మార్చే  నయా – ఉదారవాద దోపిడీ విధానం.

రైతాంగానికి సంబంధించిన ‘‘సంక్షేమం’’ పేరుతో ప్రభుత్వాలు పెద్ద కంపెనీలకు భూములు అప్పగిస్తున్నాయి. స్వతంత్ర ధర నియంత్రణను తొలగిస్తున్నాయి. విదేశీ దిగుమతుల ద్వారా రైతు మార్కెట్లను నాశనం చేస్తున్నాయి. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పగించడానికి అక్కడ  నిర్మాణమైన బీజరూప  ‘జనతన రిపబ్లిక్‌’  పై,  దానికి   అండగా ఉన్న విప్లవోద్యమంపై, ఆదివాసులపై ‘కగార్‌ యుద్దాన్ని’ కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయాలను ఫెలోట్రావెలర్‌ చాలా విసృతంగా, లోతుగా వివరించాడు.

‘సామ్యవాదం’ అనే మాటను రాజ్యాంగవాదులు అట్టడుగు వర్గాలకు అందే సంక్షేమానికి పర్యాయ పదంగా వాడుతుంటారు. కానీ ప్రభుత్వాలు సంక్షేమాన్ని సాధికారతగా కాకుండా ఆధారపడే పథకంగా మలిచేశాయి. అట్టడుగు వర్గాల శక్తిని పెంచే భూపంపిణీ, వనరుల పునర్వ్యవస్థీకరణ, వాస్తవిక రాజకీయ ప్రతినిధిత్వం, ఇవి కాకుండా (పరిమితంగానైనా) ఆధారపూరిత సంక్షేమ పథకాలనే రాజ్యం ప్రవేశపెడుతుంది. ఇది దోపిడీ నిర్మాణాన్ని అంచులు మార్చి యథాతథంగా నిలబెట్టే చర్య. సమాజంలో రాజకీయార్థిక నిర్మాణం మారకపోతే న్యాయం దొరకదు.

సామ్యవాదం అంటే ప్రతి పౌరుడికీ సమాన అవకాశం ఇవ్వడం అని కూడా చెబుతుంటారు. కానీ ఏ అవకాశాలు, ఏ వర్గానికి? ఒక కార్మికుడు, ఒక భూమిలేని రైతు, ఒక ఆదివాసి  ఇవాళ వారి జీవితాన్ని నిర్ణయించే శక్తులు మార్కెట్‌ ధరలు, కార్పొరేట్‌ లాభాలు, ప్రభుత్వ కట్టడీలు, గ్లోబల్‌ వ్యాపార ఒత్తిడులు. ఈ శక్తులు ఉన్నంత కాలం ‘‘సమాన అవకాశం’’ అనేది అసలు వీలు కాదు. అవకాశాలు కొత్త సామాజిక నిర్మాణాలతో ఏర్పడతాయి. ఆ నిర్మాణాలు ప్రజా పోరాటాలతోనే జరుగుతాయి. అందుకే సామ్యవాదం అనేది సంక్షేమ విధానాల మెరుగుదల కాదు,  అది క్రాంతికారీ పునర్వ్యవస్థీకరణ. ఈ మార్పు లేకుండా సామ్యవాదం గురించి మాట్లాడటమంటే ఆకాశాన్ని అద్దంలో చూపెట్టినట్లే.

దీనికి తోడు భారత రిపబ్లిక్‌ సామాజిక వైవిధ్యం (plurality), లౌకికత్వం (secularism) అనే రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైంది. వాటిని ఇంకా  క్షీణింపజేసే పనిని ముందుకు తీసుకుపోతోంది.  భారత రాజ్యాంగం సమాన పౌరసత్వం, మత స్వేచ్ఛ, లౌకిక ప్రజాస్వామ్యం వంటి విలువలపై ఆధారపడినప్పటికీ, పాలక వర్గాల రాజకీయాలు వాటిని ఆచరణ స్థాయిలో బలహీనపరిచాయి. సామాజిక – ఆర్థిక అ సమానతలను నిర్మాణాత్మకంగా పరిష్కరించడంలో విఫలమై, ప్రజల మధ్య సహజంగా ఉండాల్సిన పౌర ఐక్యతను దెబ్బతీసి, రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమైన విభజనలను హిందుత్వ రాజ్యం ప్రోత్సహిస్తోంది.

బాబ్రీ మసీదు కూల్చివేత (1992), గుజరాత్‌ అల్లర్లు (2002), ముజఫర్‌నగర్‌ అల్లర్లు (2013) వంటి సంఘటనల్లో రాజ్య యంత్రాంగం హిందుత్వ రాజకీయాలను ఎలా అమలుచేస్తుందో కనిపిస్తుంది. మైనారిటీల మౌలిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత నుంచి రాజ్యం తప్పుకోవడం, రాజ్యాంగం హామీ ఇచ్చిన చట్ట సమానత్వం, హక్కుల రక్షణ సూత్రాలను దెబ్బతీసి హిందూ మత -సాంస్కృతిక జాతీయతను ప్రమోట్‌ చేస్తూ, లౌకికత్వం రాజ్యాంగ ఆత్మకు కాకుండా పాలక వర్గాల రాజకీయ ప్రయోజనాలకు సేవ చేసే సాధనంగా వాడుకుంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), NRC వంటి విధానాలు పౌరసత్వాన్ని మతంతో అనుసంధానించడంతో, రాజ్యాంగం ఊహించిన సమాన పౌరసత్వ భావన దెబ్బతిన్నది. పౌరుడు అనే గుర్తింపు బలహీనమై, మతం ఆధారంగా పౌర హక్కులపై అనిశ్చితి ఏర్పడడాన్ని గమనిస్తే రాజ్యాంగం లోలోపల ఎట్లా తగలబడిపోతోందో అర్థమవుతుంది.

ఇక ప్రాతినిధ్య  ప్రజాస్వామ్యం గురించి. ప్రాతినిధ్య  ప్రజాస్వామ్యం (ప్రజలు ఓట్లు వేస్తారు, నాయకులను ఎన్నుకుంటారు, ఆ నాయకులు ప్రజలకు బాధ్యత వహించి వ్యవహరిస్తారు) అనేది ఒక అందమైన అబద్ధమని  చెప్పడానికి మేధోచర్చలు చేసి తేల్చాల్సిన పనేమి లేకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఆచరణే దానిని నిరూపించింది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాన హక్కులు- అన్నీ పేపర్‌ మీద అద్భుతంగా కనిపిస్తాయి. కానీ భారతదేశపు చరిత్ర, సామాజిక నిర్మాణం, ఆర్థిక వ్యవస్థను చూసినప్పుడు అవి మనకు కనిపించవు. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఒక రంగస్థల నాటకం లాంటిదే. పేరుకు ‘‘ప్రజల రాజ్యం’’, లోపల మాత్రం అగ్రవర్గాల, అగ్ర కులాల ఆధిపత్యం, కార్పొరేట్‌ ప్రభావం, కుల- వర్గ అసమానతల పునరుత్పత్తి.

పాలకవర్గాలు, వాళ్ల బుట్టలో పడ్డ రాజ్యాంగవాదులు చెబుతున్నట్లుగా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల సమస్యలను పరిష్కరించే సాధనం కాదు. సమాజంలోని అసమానతలు కులంలో, వర్గంలో, భూమిలో, వనరుల పంపిణీలో ఉన్నాయి. కానీ ఎన్నికలు ఈ అసమానతలను మార్చవు. ప్రతి ఐదేళ్లకో సారి అవే కుల, వర్గ శక్తులు, అదే ధనబలం తిరిగి పునరుత్పత్తి అవుతాయి. సామాజిక  వైరుధ్యాలు మారకపోవడమే కాదు, రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. కానీ, భ్రమలను పంచే మేధావులు, ఉదారవాదులు మాత్రం సమాజం మారిపోయిందని గొంతెత్తి పాడిన పాటే పాడుతున్నారు. ఎన్నికల రాజకీయాలు కుల, వర్గ వైరుధ్యాలను పరిష్కరించలేవని ఏడున్నర దశాబ్ధాల చరిత్ర చెబుతూనేవుంది. అది కేవలం అసమానతలను మేనేజ్‌ చెయ్యడానికి కొనసాగుతున్న ప్రక్రియ మాత్రమేనని తేటతెల్లమయ్యింది.

చివరిగా, గణతంత్రం అంటే దేశాధినేత వంటి అత్యున్నత పదవులు వంశపారంపర్యంగా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ఏర్పాటు చేయబడతాయని అర్థం. అంటే రాజరికం ఉండదు. పదవులు వారసత్వంగా ఎవరికీ దక్కవు. ప్రతీ పౌరుడూ సమాన హక్కులతో దేశ పరిపాలనలో భాగస్వామ్యం పొందగలడు. కానీ, వాస్తవ రాజకీయ- ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే, ఇది ఒక ఆదర్శవాద రూపకం అని తెలుస్తుంది. భారతదేశంలో పాలక వర్గాలు తమను రాజుల్లా ప్రకటించుకోకపోవచ్చు, కానీ, రాజ్యాన్ని ఏలే శక్తి మాత్రం వాళ్లే కూడగట్టుకున్నారు. పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనట్టే కనిపిస్తాయి. కానీ వాస్తవానికి అవి కుటుంబ వంశాలు, వ్యాపార వర్గాలు, కార్పొరేట్‌ దాతలు, కుల ఆధారిత కేంద్రీకరణలతో నడుస్తాయి.

‘‘ప్రతి పౌరుడూ సమాన హక్కులతో పాలనలో భాగం’’ అని చెప్పడం గణతంత్రం ఆదర్శం. కానీ ఆ హక్కులను వినియోగించుకోగల శక్తి సమాజంలోని ఏ వర్గానికి ఉంది? ఒక పేద ఆదివాసీ తన హక్కులను వినియోగించుకోవాలంటే అతని లేదా ఆమె కడుపుకు తిండి ఉండాలి. చేయడానికి పని ఉండాలి. భయం లేకుండా జీవించే పరిస్థితి ఉండాలి.  కానీ పేరెన్నిక గన్న ఈ  గణతంత్ర వ్యవస్థలో అది సాధ్యమేనా? బూర్జువా గణతంత్రం ప్రజలందరికీ తలుపులు తెరిచినట్టుగా కనిపించినా, వాస్తవానికి ఆ తలుపులకు  తాళాలు పాలక వర్గాల చేతుల్లో ఉంటాయి. నిజానికి గణతంత్రం అనే ముసుగు కింద రాజ్యం తన అసలు వర్గ స్వరూపాన్ని దాచుకుంటుంది.

అందుకే ఈ దృష్టిలో ‘‘గణతంత్రం అంటే ప్రజలకు అధికారమని’’ చెప్పడం సరిపోదు. ఎవరు అధికారాన్ని తయారు చేస్తున్నారు? ఎవరికి పాలనలో ప్రవేశం ఉంది? ఎవరు నియంత్రిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకొని ఫోజులు పెట్టడం, గణతంత్రాన్ని కొనియాడటం మరో రకమైన ప్రజా వంచనే.

రిపబ్లిక్‌ అమలు ఉదార రాజ్యాంగ వ్యవస్థ (liberal constitutionalism) మీద ఆధారపడి నడుస్తుంది. ఇందులో మౌలిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పరస్పర నియంత్రణలు (checks and balances), చట్టబద్ద పాలన (rule of law), బలమైన సమాఖ్య నిర్మాణం (federal system) వంటి అంశాలు భాగమై ఉంటాయి. కానీ, ఇవన్ని ఆచరణలో వర్గ సంబంధాలకు లోబడే పనిచేస్తాయని ఈ పుస్తకం నిండా అనేక ఉదాహరణలు ఉన్నాయి.

భారత రిపబ్లిక్‌ తనను తాను కొన్ని ఉదారవాద, ప్రగతిశీల, ప్రజాస్వామ్య లక్షణాలతో నిర్వచించుకున్నా, అది తన పుట్టుకలోనే ఒక అసమాన, విచ్ఛిన్న స్వభావాన్ని (unequal and fragmented republic) కలిగివుంది. ఎందుకంటే 1947 అధికార మార్పిడికి ముందున్న సామాజిక, రాజకీయ వైరుధ్యాల (అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సంబంధాల) పునాది మీదనే రిపబ్లిక్‌ నిర్మాణం జరిగింది. రిపబ్లిక్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ వైరుధ్యాలు మరింత తీవ్రమై అణగారిన వర్గాల, కులాల, జాతుల మీద హింసను, పెత్తనాన్ని కొనసాగించడం మూలంగానే విప్లవోద్యమం ఉనికిలోకి వచ్చింది.

‘‘భారత రిపబ్లిక్‌ తన పిల్లల్ని తానే చంపుకుంటుందా?’’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ, ఆ రిపబ్లిక్‌ నిర్మాణ పునాదిలోనే లోపముందనే విషయం చూడలేక పోయాడనిపిస్తుంది. ఆ న్యాయమూర్తికే కాదు, అనేక మంది ఉదారవాదులకు, అంబేద్కరైట్లకు ఆ రిపబ్లిక్‌ మీద ఇంకా భ్రమలు వీడకపోగా మరింతగా పెరుగుతున్నాయి. బహుశా ఈ భ్రమల వాతావరణం దోపిడీ పాలక వర్గాలకు, కులాలకు చాలా అవసరం.

నిజానికి భారత రిపబ్లిక్‌ తాను ప్రకటించుకున్న అన్ని విలువలను తానే ధ్వంసం చేసుకొని, ప్రజలకు హామీపడిన సామాజిక ఒప్పందాన్ని (social contract) తుంగలో తొక్కి హింస ద్వారానే పాలన సాగించవచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. అటువంటి సందర్భంలోనే ఆ రిపబ్లిక్‌ ఎవరి ప్రయోజనాల కోసమైతే పనిచేస్తోందో ఆ వర్గాల హింస, పీడన నుండి తమను తాము కాపాడుకోవడం కోసమే అనివార్యంగా ప్రజలు సాయుధులయ్యారు. ఈ పుస్తకంలో ఫెలో ట్రావెలర్‌ అన్నట్టు ఒకవేళ సాయుధ రాజకీయాలు, హింస మీద చర్చ జరగాల్సి వస్తే ముందు చర్చించాల్సింది న్యాయ, అన్యాయాల మీద. మరో మాటలో చెప్పాలంటే ప్రజల బతుకులను ధ్వంసం చేసిన, చేస్తున్న విఫలమైన రిపబ్లిక్‌ (failed republic) మీద.

సంఫీు పుత్రుడు అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 2004లోనే ‘‘ భారత దేశం వెలిగిపోతోంది’’ అని ప్రకటించి ఆ వెలుగు చుట్టూ ఉన్న చీకట్లను మాయచేసి కమ్మేయాలనుకున్నాడు. అదే పోగులోంచి వచ్చిన మోడి ఇప్పుడు ‘‘వికసిత్‌ భారత్‌’’ అనే మరో  భ్రమల  బ్రహ్మపదార్థాన్ని దేశమంతా పంచుతున్నాడు. దేశం ఏ రంగాలలో వెలిగిపోయిందో, ఏ రంగాలలో వికసిస్తోందో ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేదు. లెక్కా పద్దులు లేవు. కానీ, తమ చేతుల్లో వున్న అన్ని ప్రచార సాధనాల ద్వారా ఆ భ్రమలు సమాజమంతా (ముఖ్యంగా మధ్యతరగతిలో) వెలిగి పోయేలా చేస్తున్నారు.

ఏడున్నర దశాబ్దాల విఫల రిపబ్లిక్‌ తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న విప్లవోద్యమాన్ని దెబ్బకొట్టడం కోసం అన్ని రకాల ఆయుధాలను వాడుతున్నది. ఒక కొత్త భాషను  కూడా  ప్రవేశపెట్టింది. విప్లవోద్యమాన్ని సమాజానికి పట్టిన ఒక  ‘చెద’గా ప్రస్తావిస్తూ దాని నివారణకు ఆయా ప్రాంతాలను సానిటైజ్‌  (అంటే తూటాల వర్షం  కురిపించాలని) చేయాలని  పోలీస్‌ అధికారులు చాలా సాధారణంగా మాట్లాడుతున్నారు. అయితే ఫెలో ట్రావెలర్‌ ప్రస్తావించినట్టుగా విప్లవోద్యమాన్ని చెదలా చూడటమే కాదు, విప్లవంలో ఎదిగిన ఒక ‘ మహా వృక్షా’నికి (మల్లోజుల వేణుగోపాల్‌ అనే కగార్‌ రిపబ్లిక్‌ కోవర్ట్‌ ఏజెంట్‌కు) చెద పట్టించారు. ఆ చెద వనమంతా వ్యాపిస్తున్నది. ఇది విప్లవోద్యమంలో అతి పెద్ద, అతి దుర్మార్గమైన సంక్షోభంగా మారింది.

ఫెలో ట్రావెలర్‌ అనేక చాప్టర్లలో విరివిగా ప్రస్తావించినట్టు కగార్‌ ఒక మిలిటరీ ఆపరేషన్‌ గా మొదలయ్యాక వందలాది విప్లవకారులను, ఆదివాసీలను కాల్చి చంపారు. ఈ హత్యలు విప్లవ శిబిరంలో మరింత వర్గ కసిని పెంచాయి. కానీ, మల్లోజుల వేణుగోపాల్‌ చేసిన ద్రోహం ఎందరినో నైతికంగా కుంగదీసింది. ఎందుకంటే విప్లవం కేవలం ఒక అందమైన సమాజ నిర్మాణాన్ని కలగనడమే కాదు, నైతిక విలువలతో నిటారుగా నిలబడే మనిషిని తయారుచేసే పనికూడా చేస్తుంది. త్యాగాల మీద, నిబద్దత పునాదిగా విప్లవ నైతికతను నిర్మిస్తుంది. ఆ నైతికత  మూలంగానే ప్రజలకు విప్లవకారుల మీద   గౌరవం,  నమ్మకం కలుగుతాయి. ఆ నైతికతే  విప్లవకారులకు, ప్రజకు మధ్య ఒక సామాజిక ఒప్పందాన్ని, అవగాహనను కల్గిస్తుంది. కానీ, మల్లోజుల వేణుగోపాల్‌ ఫాసిస్టు రాజ్యం ముందు మోకరిల్లిన తీరు విప్లవాభిమానులనే కాదు సామాన్య ప్రజలను కూడా కలచివేసింది.

మల్లోజుల వేణుగోపాల్‌ ప్రజలకు ఆయుధాలు లేకుండా చెయ్యడం కోసం వాటిని రాజ్యానికి ఇచ్చి (దీనికి ‘ఆయుధ విసర్జన’ అనే విచిత్రమైన మాట వాడుతున్నారు కొందరు) దానికి మరింత బలాన్ని ఇచ్చాడు.

రాజ్యాంగం తమకు అవసరం లేదని ముఖ్యమంత్రి దాన్ని మల్లోజుల చేతికిచ్చాడు. (బహుశా దీనిని ‘రాజ్యాంగ విసర్జన’ అనాలేమో!). ఇదే కగార్‌ రిపబ్లిక్‌ అంతస్సూత్రం. ప్రజల్ని నిరాయుధులుగా చేసి, అన్ని రకాల ప్రజా ప్రతిఘటనల్ని రాజ్యం సాయుధంగా అణిచివేస్తూ నామమాత్రంగా అమలవుతున్న రాజ్యాంగాన్ని పూర్తిగా ‘విసర్జించే’ ప్రక్రియ. 

ఈ ‘రాజ్యాంగ విసర్జన’ ద్వారానే రిపబ్లిక్‌ అంతమవుతుంది. అంటే కనీసం పేపర్‌ మీదనైనా ఉన్న ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక భావనలు తుడిచివేయబడి ఒక ఫాసిస్టు రిపబ్లిక్‌ పూర్తి స్థాయిలో నిర్మాణం కాబోతోంది. దీని ప్రభావం అన్ని ప్రజా పోరాట రూపాల మీద, మొత్తంగా సమాజం మీద ఉండబోతోంది. ఈ సంక్షోభ  సందర్భంలో విప్లవ ద్రోహులు, వివ్లవ వ్యతిరేకులు, ఉదారవాద అవకాశ వాదులు, రాజ్యాంగవాద ఆశావాదులు, ఇంకా అనేక సమూహాలు మొత్తం చర్చను సాయుధపోరాట పంథా చుట్టే తిప్పుతున్నారు కాని, విఫలమైన రిపబ్లిక్‌ గురించి కాని, బలపడుతున్న ఫాసిజం గురించి కాని మాట్లాడడం లేదు. సాయుధమై ఉన్న ఫాసిజాన్ని ఎట్లా ఓడిరచాలో చెప్పడం లేదు. కేవలం ఓటు ద్వారానో, అడపాదడపా వీధి పోరాటాల ద్వారానో దాన్ని ఎదురుకోవచ్చనే భ్రమలో ఉన్నారు. ఫాసిజాన్ని ఓడిరచడానికి దీర్ఘకాలిక పోరాట  పంథానే  మార్గమనే  విషయాన్ని విస్మరిస్తున్నారు. ‘ఆయుధ విసర్జన’లను,  విద్రోహపు లొంగుబాట్లను స్వాగతిస్తున్నారు. విద్రోహాన్ని కూడా సిద్దాంతీకరిస్తున్నారు.

‘‘అరవై ఏండ్ల సాయుధ విప్లవ పంథా విఫలమయింది, బయటకురండి’’ అని చెబుతున్నారు కదా, మరి డె బ్బై అయిదేండ్లుగా విఫలమవుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆ ‘విఫల’ విప్లవ పంథాకి ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది? విప్లవకారులను బయటికి రమ్మని పిలిచే వారి దగ్గర పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మించిన రాజకీయ ప్రణాళిక ఏమైనా వుందా? అలాంటిది ఏమీ లేదంటే విప్లవ రాజకీయాలను లేకుండా చేసే ఒక సంస్కరణవాద, రాజ్యాంగవాద కుట్ర జరుగుతోందని భావించవచ్చు. ఇదేమీ కుల, వర్గ రాజకీయాలకు బయట జరుగుతున్నది కాదు. ఇది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం నిర్మిస్తున్న విషపూరిత ఆవరణలోనే జరుగుతున్నది. ఈ సంక్షోభ కాలంలో పోరాడే ప్రజలను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. దీనికి సంబంధించిన అవగాహనను ఫెలో ట్రావెలర్‌  ‘ కగార్‌ రిపబ్లిక్‌’  ద్వారా మనకు అందించాడు. ఇది అందరూ చదవాల్సిన రచన.

డిసెంబర్‌ 7, 2025

(త్వరలో రాబోతున్న ఫెలో ట్రావెలర్ పుస్తకం ‘కగార్ రిపబ్లిక్’ కు రాసిన ముందుమాట)

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply