ప్రియమైన జోయా బెన్ (అక్కా) ఎలా ఉన్నావు? మౌజ్(అమ్మ) పరిస్థితే బాగోలేదు బోయ్ (తమ్ముడు) కోసం ఏక ధారగా ఏడుస్తూనే ఉంది. బోయ్ సమర్ గాయబ్ అయ్యి ఇప్పటికి నెల రోజులైంది.
మౌజ్ రోజూ ఠాణాకి పోయి వస్తుంది. వాళ్ళు సమర్ ని రాళ్లు రువ్వే పిల్లల జాబితాలో వెతుక్కోమంటున్నారు. లేదా అరవై వేలు కట్టి తీసుకొని పొమ్మంటున్నారు. నీకు తెలుసు కదా మోల్ (అబ్బా) ఎన్కౌంటర్ అయినప్పటి నించీ మౌజ్ ఎంత కష్ట పడి పెంచిందో మనల్ని? నీకు చిన్నగా ఉన్నప్పుడే నిఖా చేసాడు మోల్ అని నీకు కోపం కూడా వచ్చింది. తనని ఆర్మీ వాళ్ళు ఎలాగైనా ఎన్కౌంటర్ చేస్తారని దానికి ముందే నిన్ను రక్షించుకోవడానికి నిన్ను ఇండియా అబ్బాయికి ఇచ్చి నిఖా చేసాడు. అక్కడైతే నువ్వు మిలిటరీ వాళ్ళ చేతుల్లో పడవని అట్లా చేసాడు మోల్. అప్పటికింకా సమర్ పుట్టనే లేదు. మౌజ్ కడుపులోనే ఉన్నాడు. మోల్ ని మిలిటరీ వాళ్ళు ఎత్తుకెళ్ళి చంపేశారు. అప్పటికి నాకు ఐదేళ్లు మాత్రమే.
మొన్న రుహాన్ వాళ్ళ మోల్ (అబ్బా) ఎవరినెవర్నో అప్పులు అడుక్కొని రుహాన్ని విడిపించుకున్నాడు. ఇంకా సాయన్, మిహ్రాన్, తైమూర్, అర్హమ్, అరిబ్, ఖిజార్, మాహిబ్ వీళ్లంతా జువెనైల్ హోమ్స్ లోనే ఉన్నారు. వీళ్ళ మౌజ్ లు ఎన్నిసార్లు ఆర్మీ మీదకు రాళ్లు విసరద్దు అని చెప్పినా వీళ్ళెవ్వరు వినలేదు. వీళ్ల మౌజ్ లు రోజూ నమాజు చేస్తున్నట్లే ఠాణాకు పోయి వస్తున్నారు. ఈ ఆర్మీ వాళ్లు వీళ్ళ దుఃఖాన్ని దాచుకోవడానికి అయినా వాళ్ళ చెహెరాల మీద నఖాబ్ లను ఉంచనివ్వటం లేదు. సమర్ రెండు రాళ్లు ఎక్కువే విసిరాడు. అంతే! ఎత్తుకుపోయారు. మౌజ్ కి ఇప్పుడు నా మీద నిఘా ఎక్కువైంది. వాళ్ళు ఎత్తుకుని పోతారని దిన్ రాత్ పహారా కాస్తుంది. “నీకెంత వయసనీ సమర్ కంటే ఐదేళ్లు మాత్రమే పెద్దవాడివి” అంటుంది. నాకిప్పుడు పదహారేళ్లు. నేనింకా మౌజ్ కి చిన్న పిల్లవాడినే.
మరో పక్క నీ సంగతి కూడా ఏమీ తెలియటం లేదు. బెన్ ఎట్లా ఉన్నావు? నువ్వు బాగుంటావనే అనుకుంటున్నా. పైగా నువ్వు మా లాగా ఖైదు కాబడని బందీవి కాదు కదా. కాక పోతే మా కోసం ఫికర్ పడుతూ ఉంటావు. మౌజ్ కోసం సమర్ కోసం, నా కోసం మామూ, ఫుప్పాల కోసం మొత్తం కాశ్మీర్ కోసం బెంగ పెట్టుకొని ఉంటావు. మా కోసం ఎంతగా తల్లడిల్లుతున్నావో కదా. 56 రోజుల నించీ, నీకు తెలుసు కదా… నువ్వు ప్రయత్నించే ఉంటావు. ఇక్కడంతా కరెంటు, ఫోన్లు, ఇంటర్నెట్లు అన్నీ బందు చేసేసారు. మౌజ్ నీకోసం ఎన్ని సార్లు నాతో ఫోన్ చేయించిందో. మన ఇంట్లో ఆరిపోయిన ఫోన్, మౌజ్ ఎలా ఉందని నువ్వు మూగగా అడుగుతున్నట్లే ఉంది.
బెన్, బెమా (బావ) ఎట్లా ఉన్నాడు? మొన్న ఈదుల్ ఫితర్ నాడు మౌజ్ నిన్ను, సమర్ ని, మోల్ ని తలచుకుని తలచుకుని ఏడుస్తూనే ఉన్నది. బెన్ ఖుదాకి కసం. నీ మీద చాలా బెంగగా ఉంది. నువ్వు నా తోడు లేక పోవడం ఒక పెద్ద లోటుగా ఉంది. నువ్వుంటే, నేనూ నువ్వూ మౌజ్ కలిసి సమర్ కోసం వెతికే వాళ్ళం. బెన్ గుర్తుందా? మౌజ్ తో కలిసి మోల్ కోసం, నువ్వూ నేనూ మౌజ్ కి రెండు వైపులా మౌజ్ వేళ్ళు గట్టిగా పట్టుకొని దిగులుగా ఉన్నా. ఆ రోజన్నా మోల్ ఖబర్ తెలుస్తుందేమో అని ఆశతో కనిపిస్తూ.
పీ.ఎస్ లో ఎప్పటిలాగే మోల్ ఆచూకీ తెలీక వెక్కి వెక్కి ఏడుస్తూ ముందర నడిచే మౌజ్ కి వెనక నించి నువ్వూ, నేనూ ఏడుస్తూనో, కళ్ల నీళ్లు కుక్కుకుంటూనో దిగులు దిగులుగా పరుగెత్తేవాళ్లం. అలా ఎన్ని ఏళ్ళు నడిచామో కదా? బహుశా ఖుదాకి మనసులో ఎన్ని సార్లు దువా చేసి ఉంటామో అన్ని సార్లు కదా. బెన్, ఏడుపు వస్తుంది. మోల్ ఉంటె ఎంతో బాగుండేది. ఆ దుర్మార్గులు మోల్ ని కాల్చేయ్యకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది? రుహాన్ ని వాళ్ళ అబ్బా పైసలు ఇచ్చి విడిపించుకున్నట్లు మన సమర్ ని కూడా మన మోల్ విడిపించుకునే వాడు. ఇప్పుడు చూడూ మౌజ్ దగ్గర డబ్బులు లేవు. బెన్ నువ్వేమైనా పంపగలవా? సమర్ ని విడిపించాక, నేను ఆపిల్ పండ్ల డీలర్ షిప్ తీసుకుని కష్టపడి సంపాదించి నీ పైసలు నికిచ్చేస్తాను. వీలైతే రాత్రీ పగలు కుంకుమ పూల బగీచాల్లో, టులిప్ తోటల్లో పనిచేస్తాను. నీ అప్పు తీర్చేస్తాను. బేనే సమర్ ని రక్షించుకుందాము. నువ్విస్తావు. నాకు తెలుసు. బెమాని వప్పిస్తావు. మౌజ్ కి చెప్పకు తుమ్హే మేరీ కసం.
బెన్ డాక్ ఘర్ కూడా మూసేసారు. నీకు రాసిన ఈ ఖత్ పంపలేను. గుర్తుందా? మనం రోజూ ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళం. రోజూ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు నేను చెప్పాలి. లేక పోతే నాకు నిద్రే రాదు. నీకు తెలుసు కదా. నువ్వు నీ ఘర్ బార్ షోహార్ గురించి నాకు చెప్పాలి. కొన్ని రహస్యాలు నీ షోహార్ గురించి చెప్పి, మౌజ్ కి చెప్పద్దని నా దగ్గర అల్లా కసం తీసుకునే దానివి. అందులో బెమాకి తెలియకుండా మౌజ్ కి పైసలు పంపియ్యడం. బేన్ నిజంగా నువ్వు ఫరిస్తావి.
బెన్ అదిగో మౌజ్ ఎందుకో అరుస్తున్నది. ఎవరో ఖాథున్ (స్త్రీ) కూడా గుండెలవిసేలా ఏడుస్తున్నది. ఏమైందో చూడాలి. అదిగో మౌజ్ నన్ను పిలుస్తున్నది. వెళ్ళాలి. మళ్ళీ రాస్తాను. కానీ, ఈ ఖత్ ను నీ దాకా ఎలా చేర్చాలో? ఏదైనా దారి చెప్పు.
బెన్, హఫ్తా కింద ఒక ఖాతూన్ ఏడ్చుకుంటూ మౌజ్ దగ్గరికి వచ్చిందని చెప్పా కదా. నీకు మన వెనక గల్లీ లో అష్రఫ్ ఖాలు గుర్తున్నాడా? ఆయన ఆపిల్ పండ్ల రైతు. ఆయన ఆపిల్ పండ్లను సోపోర్ ఆపిల్ మండి మార్కెట్ కి సప్లై చేస్తాడు. ఆగస్టు నెలలో సోపోర్ మండీ గేట్లు మూసేసారు. ఎవరూ కొనట్లేరు. రైతులు కూడా గిట్టుబాటు ధర సంగతి అటుంచి కొనే వాళ్ళు లేక పండ్లు చెట్లకు వదిలేశారు. అవి కుళ్ళి రాలిపోతున్నాయి. మొన్న ఆపిల్ పండ్ల రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.
మిలిటరీ వాళ్లు కాలిస్తే అష్రాఫ్ ఖాలూ మొత్తం కుటుంబం నాలుగేళ్ల చిన్నారి మున్నీ కూడా గాయపడింది. మగవాళ్ళని బయటకు పంపిస్తే కాల్చి పడేస్తున్నారు. లేదా ఎత్తుకుపోతున్నారు. అట్లా మాయమైన తండ్రులు ఎంతో మంది ఉన్నారు. అందుకని తస్రీన్ ఖాలా మున్నీకి పాల కోసం బయటకు వచ్చింది. ఒక మిలిటరీ ఆయన ఐడీ చూపియ్యమన్నాట్ట. మా తాతల కాలం నాటి నుంచి ఇక్కడ్నే ఉంటున్నాం. అదే నా ఐడీ అని చెప్పిందట. నఖాబ్ తీసి చెహెరా దిఖానా పడతా అన్నాడట. ఖాలా తియ్యను అన్నదంట. వొంటి మీద చెయ్యేసాడట. ఖాలా ఏడుస్తూ అరుస్తూ పరిగెత్తుకుంటూ మన గల్లీ లోకి వచ్చి మన ఇంట్లోకి వచ్చేసింది. హమారే ముల్క్ కే ఖాథునోకొ బహుత్ సతారై ఏ హైవానో. మన మౌజ్ తో కూడా ఇట్లా ఎన్నో సార్లు అయ్యింది.
అర్షిద్ వాళ్ళ మౌజ్ ది ఇంతేఖాల్ అయ్యింది. ఆయన బెన్ లు, ఖుర్షీదా, షమీమా ఇద్దరు ట్రాన్ టౌన్ లో ఉంటారు. ఇంటర్నెట్, ఫోన్లు లేవు. వాళ్ళ మౌజ్ ఇంతేఖాల్ అయిందని ఎట్లా చెప్పాలి. రెండు రోజులు చూసి లాష్ కుళ్ళిపోతుంది అని అర్షిద్ మౌజ్ ఇద్దరు కూర్లు(కూతుర్లు ) లేకుండానే మౌజ్ జనాజాని ఏడ్చుకుంటూ ఖబరిస్తాన్ లో దఫన్ చేసాడు. ఇంతేనా బెన్. ఎదురొచ్చిన ఎవర్ని అడిగినా మౌతోంకో జాకె ఆయే అంటారు. మౌత్ ఇక్కడ రోజూ ఉదయించే సూర్యుడంత మామూలు ఇక్కడ. చెక్ పోస్ట్ దగ్గర అంబులెన్స్ ఆలస్యం అయ్యి రసూల్ మామూ దిల్ కా దౌర్ వచ్చి ఇంతేఖాల్ అయిపోయాడు. నజ్జర్ తెల్సు కదా. నా బాచ్ పన్ కా యార్ వాడు ఇంటి ముందు నిలబడితే కాల్చి పడేసారు. తుపాకీ గుండు వాడి తలలోనించి దూసుకెళ్లింది. ఇంట్లో ఉన్నవాళ్ళ బెన్ కి భయంతో బేహోష్ అయ్యి అయిదు నెలల అమల్ పోయి చాలా ఖూన్ పోయింది. నజ్జర్ ఇంతేఖాల్ అయినప్పటినుంచి మౌజ్ నన్నుఇంట్లో ఖైదు చేసేసింది .
బెన్… నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎప్పుడూ కర్ఫ్యూ నే. అందుకే మౌజ్ హాఫ్తాకు సరిపడే దాల్, చావల్, తేల్ తెచ్చి పెడుతుంది. సాలోన్ సే ఇదే ఆదత్ కదా మనది? తనిఖీ పేరుతో మిలిటరీ వాళ్ళు వచ్చి చావల్, దాల్ ల్లో కిరోసిన్, బొగ్గు పౌడర్ కలిపి పోతున్నారు. ఇలా రోజూ చాలా ఇళ్లల్లో చేస్తున్నారు. మౌజ్ మొన్న వధ్ధు అని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. మౌజ్ ని వాళ్ళు కాళ్లతో తన్ని పోయారు. బేనే నా రక్తం మరిగి పోయింది. మౌజ్ నన్ను బయటకు రావద్దని కళ్ళతో ఇషారా చెయ్య బట్టి ఆగిపోయాను. ఆకలితో మల మల మాడుతున్నాము. బెన్, బయట మౌజ్ కి ఏ పనీ దొరకట్లేదు. ఆపిల్, కుంకుమ తోటలు ఎండిపోతున్నాయి. మండీలు మార్కెట్లు దుకాణాలు మూసేస్తున్నారు.
ఈ చినార్ నదిలో ఆజాదీ కోసం రక్తం తెరలుతోంది. రైతులు నిరాశతో కోయకుండా వదిలి పెట్టిన ఆపిల్ పండ్లు చెట్లకే కుళ్ళి రాలిపోయి భూమిలో కలిసిపోతున్నాయి. బడులకెళ్ళి చదువుకోవాలని ఇక్కడి పిల్లలు నాతో సహా తహ తహ లాడుతున్నారు. తమ అన్నతమ్ములను, అబ్బాలను చంపిన మిలిటరీ మీద రాళ్లు రువ్వుతున్నారు. పిల్లలంతా రాళ్లతో జంగ్ చేస్తున్నారు. ఏమీ బాగోలేదు. కుఛ్ భీ ఠీక్ నహీహై. సబ్ కుఛ్ గలత్ హో రహా హై.
అవును బెన్…. ఇండియాలో కూడా కాశ్మీర్ ముస్లిం పిల్లల్ని కొడుతున్నారంట కదా. మొన్నటి దాకా అక్కడ గాయ్ కి ఘోష్ తింటున్నారని కొట్టి చంపడం తెలిసిన సంగతే. కానీ ఇప్పుడు కొత్తగా ఆగస్ట్ 5 తర్వాత ఇది మొదలైంది. సోఫియానాలో మొన్న రాత్రి మాఖ్రీబ్ నమాజు తర్వాత చదువుకోవాలని దీపం వెలిగించిన అమ్మాయి ఇంటిమీద దాడి చేసి ఆ పాప అబ్బాని, భాయ్ ని ఎత్తుకెళ్లిపోయారు. వాళ్ళు ఇంకా ఎప్పటికీ తిరిగి రారు మన మోల్ లాగా, సమర్ లాగా.
బెన్… చాలా భయంగా ఉంది. సమర్ బతికే ఉన్నాడా…? ఇక ఇక్కడితో ఆపుతాను. కన్నీళ్లు రాయనివ్వటం లేదు బేనే. దీపాలు ఆర్పాల్సిన వేళయింది. మౌజ్ దీపం ఆర్పేయమంటున్నది. లేక పోతే వాళ్ళు వస్తారు. నన్ను ఎత్తుకుపోతారు. ఎత్తుకు పోయినా నన్ను మామూలుగా వదులుతారో అని నమ్మకం లేదు. గాయాలతో .. కళ్ళల్లో పుల్లలు గుచ్చి రోడ్డు మీద వదిలేస్తే అని మౌజ్ భయం. మొన్న ఇద్దరు గ్యారా సాల్ పిల్లలను ఒంటి నిండా గాయాలతో రోడ్డు మీద పడేసి పొయారు. అందులో ఒక పిల్లవాడికి కంట్లో పుల్ల గుచ్చి ఉంది. రక్తం కారుతోంది. మిలిటరీ మీద రాళ్లు రువ్విన పిల్లలంట వాళ్ళు. వాళ్లిద్దరూ తస్లీమా పిల్లలు. వాళ్ళు గాయబ్ అయినప్పటినించీ తస్లీమా మెంటల్ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. ఎంత సేపూ పిల్లలకోసమే ఏడుస్తుంది. రోడ్ల మీద పరిగెడుతుంది. పిల్లల పేర్లు అరుస్తూ. ఆ పిచ్చి తల్లి మీద మిలిటరీ వాళ్ళు రాళ్లు విసురుతారు. పిల్లలని అలా చూసిన తస్లీమా గుండెలు బధ్ధలయ్యాయి.
*
నా ప్రియాతి ప్రియమైన జోయా బెన్… మొన్న ఎవరో ఇద్దరు మగవాళ్ళు ఇండియా నించి వచ్చారు. మౌజ్ తో ఏదో గుస గుస లాడారు. మౌజ్ గట్టిగా యా ఖుదా అని అరుస్తూ బేహోష్ అయిపోయింది. పక్కింటి జుబేదా ఆంటీ, నానీ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు జుబేదా ఆంటీ కి కూడా ఏదో చెప్పారు. నేను సమర్ గురించి ఏదైనా బురీ ఖబర్ తెచ్చారేమో అని ఏడవ సాగాను. నన్ను లోపల పెట్టి దర్వాజా బందు చేశారు. మౌజ్ కి హోష్ వచ్చింది. తర్వాత అంతా నిశ్శబ్దం ఎవరూ నాతో ఏమీ చెప్పరు. నేను మాత్రం చావు కబురు వినపడద్దు అని అదిరే గుండెలతో ఎదురు చూస్తున్నాను.
ఉన్నట్టుండి మేరీ కూర్ (కూతురా) జోయా అని మౌజ్ గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలు పెట్టింది. నా గుండె ఝల్లుమంది. నీకు ఏమైనా అయ్యిందా? రోజూ ఠాణాకు ధైర్యంగా ఒక్క నిమిషం కూడా అటూ ఇటూ తప్పకుండా వెళ్లి … తన మోల్ (షోహెర్, భర్త) జాడ అన్నా చెప్పమని లేక పోతే, డెత్ సర్టిఫికెట్ అన్నా ఇమ్మని భీష్మించుకుని మొండిగా పోలీసులతో మర్ గయా… యా జిందా హై కుచ్ తో బోలో మై బేవా(విధవ నా) హుం క్యా? అని లడాయి వేసుకొని వచ్చే జుబేదా ఖాలా కూడా వల వల ఏడుస్తూనే మౌజ్ ని ఓదారుస్తున్నది. నేనూ పెద్దగా ఏడుస్తూ అరుస్తూ దర్వాజా బాదసాగాను.
*
నాకు తెలిసి పోయింది బెన్… మన ఇద్దరికీ మోల్ లేడు. మౌజ్ తప్ప. సమర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సజీవంగా ఉన్నాడా? లాష్ గా మారాడా? సజీవంగా ఉంటే గాయాలతో వస్తాడా? కళ్ళు పోగొట్టి, కాళ్ళు చేతులు విరిచి పంపిస్తారా? తెలీదు జోయా బెన్. కానీ నీకు నేనున్నా. మౌజ్ ఉంది. కానీ నువ్వెలా వస్తున్నావు? కఫన్లో చుట్టబడి లాష్ గా మారిపోయి వస్తున్నావెందుకు? నువ్వు కాశ్మీర్లో లేవు కదా? అయినా నా పిచ్చి గానీ, నువ్వున్న చోట ఈ బలిదానాలు లేవనా?
నా జోయా బెన్ దయ చూపు. చచ్చిపోయి రాకు. చూడు ఇక్కడ ఇప్పుడు మంచు కరిగి చల్లగా ప్రవహిస్తున్నది. ఆ తెల్లటి మంచు ముద్దలు విచ్చుకొని ఆ పగుళ్ల లోనించి నీకు అత్యంత ఇష్టమైన లైలాకు పువ్వులు వూదా రంగులో విచ్చుకొంటున్నాయి. రంగు రంగుల లిల్లి పువ్వులు తలలు వూపుతున్నాయ్. ఇక టులిప్ తోటలైతే మతులు పోగొట్టే అందం తెలుసు కదా. మంచు మల్లె పూవులై పూల సువాసనలను తాగి ప్రవహిస్తున్నది.
నువ్వూ… నీ దోస్తులైన ఆఫ్రిన్, సయ్యదా, నస్రీన్ లతో ఆ కవ్వించే లైలాక్ పూల కోసం పరిగెత్తి అంతా మంచులో జారీ పడి కిల కిలా నవ్వేవాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచు చల్లుకునేవాళ్ళు. భయం ఉండేది. కానీ ఎంతో కొంత ఆశ, ఖుషీ ఉండేది. ఇప్పుడు అంతా గాయబ్. మనుషులూ, ఖుషీ అంతా ఎక్కడా ఏమి కనపడట్లేదు. నువ్విప్పుడొచ్చి మంచు చల్లక పోయినా కన్నీళ్లు పంచుకొనేదానివి కదా. దోస్తులతో ఆడక పోయినా నాతో, మౌజ్ తో కలిసి సమర్ ని వెతికే దానివిగా. కుంకుమ పూల తోటలో నువ్వూ.. మౌజ్ పనికి వెళ్ళే వాళ్ళు. అలిసిన నీకూ, నీ దోస్తులకి ఆపిల్ చెట్లు మౌజ్ లా ఆపిల్ పండ్లను ఇచ్చేవి. మౌజ్ సమర్ ను నన్నూ అసలు పనిలోకి రానిచ్చేది కాదు. ఇంట్లో సందూకులో సోనా దాచినట్లు దాచి పెట్టేది. నిన్ను తీసుకొని పనిలోకి వెళ్ళేది. ఎంత నీరసంగా ఏ మాత్రం ఖువ్వత్ (బలం) లేకుండా కనిపించేవారో నువ్వూ …. మౌజ్.
నాకు సిగ్గనిపించేది. మీకు మదద్ చేయలేక పోతున్నందుకు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు బెన్? ఎందుకు చచ్చిపోయావు? బెన్ ఏమనుకున్నాము మనం? ఆజాదీ కోసం చనిపోయిన మోల్ కల నిజమైతే చూద్దాం అనుకున్నాం కదా… మనకి ఎవరూ వద్దు. మన హృదయాన్ని ఎవరూ రెండుగా చీల్చద్దు అనుకున్నాం కదా. ఇప్పుడేమయ్యింది నీకు ? అయినా బెన్… ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఇన్నేళ్ల ఆజాదీ కల ఛిద్రమయ్యింది. యహా …. రోజ్ రోజ్ మౌత్ కా ఆనా…. జానా హోరా. రోజూ మౌత్ మాతో శ్వాసిస్తున్నది. రాత్రి పక్కనే కౌగలించుకొని పడుకొంటున్నది. తెల్లారేటప్పటికి మాతోనే లేచి ఆదాబ్ ఆర్జ్ హై చెబుతున్నది. నువ్వు సరైన జాగాకే వస్తున్నావు బెన్. ఇక్కడ నీకొక శవపేటిక అవసరమే లేదు. ఎప్పట్నుంచో కశ్మీర్ ఒక కబరిస్థాన్. అడుగుకో లాష్ దాచుకున్న భూమి ఇది.
కానీ ఒక నిరాశ బెన్… ఈ లేఖలు కశ్మీర్ చీకటైపోయిన యాభై ఆరు రోజుల నుంచీ రాస్తున్నా. ఎప్పటికైనా వెలుతురులో నీతో చదివించాలని. ఇక నువ్వెలా చదవగలవు? నేనెవరికి రాయాలి లేఖలను? సమర్ కు రాయాలా? ఇండియాలో ముస్లిమ్స్ లనే కాదు ఇప్పుడు కాశ్మీరీలను కూడా కొడుతున్నారట కదా? నిన్నెవరైనా అట్లా కొడితే చనిపోయావా? బెమా కొట్టాడా చెప్పు? ఏమీ తెలియదు. ఇండియా నుంచి ఆకాశ మార్గాన హవాయి జహజ్ లో జనాజా తీసుకొని వస్తున్న దానివి నా ప్రియాతి ప్రియమైన జోయా బెన్ … నా ఫరిస్తా… సమర్ ఎక్కడున్నాడో చెప్పు. బెన్… నీ కోసం ఏడ్చి ఏడ్చి మళ్ళీ మౌజ్ బేహోష్ అయింది. నువ్వోసారి పోనీ కనీసం లాష్ గా అన్నా కనిపించు.
****