ఒక అమాయక మనిషిని ఏ పరిస్థితి ఎట్లా మార్చి, ఏమార్చుతుందో చెప్పిన కథ ‘రౌడీ’. ఒక అబద్దం ఎంత అందంగా ప్రచారమవుతుందో అర్థం చేయించే కథ ఇది. కింది కులాల మనుషుల్ని అవసరమైనంత మేర వాడుకొని, చివరికి ఎట్లా కడతేరుస్తారో చిత్రించిన కథ. 18 మే 1997 ఆదివారం ఆంధ్రజ్యోతిలో అచ్చయింది.
ఒకరోజు కథకుడు తన స్నేహితుడు రాజుతో కలిసి బయట టీ తాగుతున్నాడు. కొద్ది దూరంలోనే ఓ హత్య జరిగింది. నడిరోడ్డు మీద రెండు ముక్కలైన శవం. తల ఒక చోట. మొండెం మరోచోట. నెత్తుటితో తడిచిన తల వెంట్రుకలు. వీపుపై కత్తిపోట్ల గాయాలు. ఆ గాయాల్లోంచి ధారలుగా కారుతున్న నెత్తురు. నెత్తుటి మడుగులో గిజగిజా తన్నుకొని ఊపిరిరొదిలిన మనిషి. జనమంతా గుంపులు గుంపులుగా జమయ్యారు. వాళ్లందరిలో ఆందోళన. భయం. ఉత్కంఠ. భళ్లున పగులుతున్న బస్సులు, కార్ల అద్దాలు. జనమంతా షాపులపై పడ్డారు. లూఠీ చేశారు. పెద్దపెద్ద వస్తువుల్ని నడిరోడ్డుపై వేసి నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోతున్న వస్తువులు. ఆ ప్రాంతమంతా వ్యాపించిన పొగలు. ఊపిరాడని స్థితి. అంతలోనే పోలీసుల వ్యాన్ దూసుకొచ్చింది. రెచ్చిపోయిన జనాలు పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. గాల్లోకి తూటాలు పేల్చారు. మోకాలి చిప్పలు చిట్లిపోయిన వాళ్లు కొందరు. తలలు పగిలినవాళ్లు కొందరు. కాళ్లు విరిగినవాళ్లు కొందరు. అందర్నీ వ్యాన్ లో కుక్కి స్టేషన్ కు తీసుకుపోయారు. అంతటా విధ్వంసం. ఆ విధ్వంస శకలాల్ని ప్రెస్ వాళ్లు ఫొటోలు తీసుకున్నారు. అప్పుడే కథకుడూ, రాజూ చెరోదిక్కు వెళ్లిపోయారు. కథకుడు ఇంటికి వెళ్లాడు. రాత్రంతా నిద్రలేదు. కన్నీళ్లింకిన దు:ఖాన్ని ఇట్లా చెప్తున్నాడు.
“అంతా చూసిందేగదా. కాపోతే అక్షరాల్లో వుంటుంది.
టీపాయ్ మీద దినపత్రికను తాకబుద్ధి కాలేదు.
ఎంత చూడొద్దనుకున్నా కళ్లకి అడ్డొస్తున్నాయి పెద్ద పెద్ద అక్షరాలు.
‘రౌడీ గురు హత్య’.
ఒక అబద్దం ఎంత అందంగా ప్రచారమౌతుందో.
ఎంత తొందరగా నమ్మేస్తారో జనాలు.
చూసింది చూసినట్లే నమ్ముతారు.
మాయ తెరలను చీల్చి చూసే చూపు వీళ్లకి ఎప్పుడు వస్తుందో.
రౌడీ బతికే వున్నాడు. చచ్చింది గురు వొక్కడే. (అతడు బయలుదేరాడు; 2000, పుట. 23)
చచ్చింది గురు వొక్కడే. నా Innocent friend గురు వొక్కడే”. కన్నీళ్లతో చెప్తున్నాడు కథకుడు. లోలోపల సుళ్లు తిరిగే దు:ఖంతో. తన స్నేహితుణ్ని గుర్తుతెచ్చుకుంటున్నాడు. అతని పరిచయాన్ని. అమాయకత్వాన్ని. పేదరికాన్ని. రెక్కాడితే గాని డొక్కాడని బతుకుని. దిగులు గువ్వలా ఒదిగివుంటే గురు. జీవితంపై అనేక ఆశలు పెట్టుకున్న గురు. నిరుపేద. అయ్యలేడు. అమ్మ ఒక్కతే. మనకూ పరిచయం చేస్తున్నాడు.
“అప్పుడు నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. మొదటి సంవత్సరం ప్రారంభం రోజులు. లీజర్ అవర్ లో లెక్కలు చేసుకుంటున్నా. “నేను చూడొచ్చా” బిడియంగా బెదురుకళ్ల వాడొకడు ఎదురుగ. వాడు కొత్త బట్టలు వేసుకున్నాడు. కానీ ఆ డిజైన్ పాతది. ఆముదం రాసి తలదువ్వుకున్నాడు. వీలయినంత శుభ్రంగా, వినయంగా వున్నాడు. అయినా వాడి బట్టల రంగూ, ముఖ కవళికలను బట్టి ఇట్లే పోల్చేస్తారు. వెకిలిగా నవ్వుకుంటారు. గేలిచేస్తారు.
షోకు పిల్లులకి వాడొక ఎలక.
వాడెప్పుడూ తోక తెగిన ఎలకలా దిగులుగా భయం భయంగా.
“కూచో” అన్నాను.
“ఈ రోజు సార్ జెప్పిన లెక్కలా?” అడిగాడు.
“కాదు ట్యూషన్ లో చెప్పినవి.”
కాసేపు మౌనం. ఆ తర్వాత అన్నాడు- “ఈడ సార్ జెప్పిన లెక్కలు నాకు అర్థం కాలేదు. భయమయితాంది. ట్యూషన్ పోవల్లంటే మా అమ్మ తాన అంత డబ్బులేదు. మా అమ్మ దోసెలు పోసి అమ్ముతుంది.”
వాడంటే జాలి ముంచుకొచ్చింది. వానికేదో చెప్పాలనుకున్నాను. నా భావనల్నితర్జుమా చేసే భాష నాకు రాలేదు. సరే నా నోటుబుక్కులు ఇస్తా… రాస్కో అన్నాను.
వాడి మొహంలో వొక మెరుపు. వాడి కళ్లనిండా కతజతకి మించినదేదో భావన తొణికిసలాడింది.
నా నోట్ బుక్ ని అలా సుతిమెత్తగా చేత్తుల్లోకి తీసుకొని అక్షరాల వేపు శ్రద్ధగా చూస్తుండిపోయాడు.
“ఇంటర్ పాసైతే ఉద్యోగం వస్తుందిగదా” అడిగాడు.
“ఏమో నాకు తెల్దు. డిగ్రీ అయినా చదవాలనుకుంటా. ఏమోలే రేపు మా నాన్నని అడిగి చెప్తా” అన్నాను.
వాడి మొహంలో వొక నిరాశ నీడ కదలాడింది.”
కథకుడు అతని అంతరంగాన్ని చదివాడు. అతని వేదన అర్థమయింది. ఆ కళ్ల మాటున విషాదం అర్థమయింది. ఆ మాట వెనక ఎన్ని గాయాలున్నాయో తెలిసింది. “ఇంటర్ పాసైతే ఉద్యోగం వస్తుందిగదా”. కథకుడి మనసులో ఈ మాటే సుళ్లు తిరుగుతోంది. ఎంత అమాయకత్వం వాడిది. ఎన్ని కలలు. జీవితంపై. ఎంత వెతుకులాట. బువ్వ కోసం. బుక్కెడు బువ్వకోసం. అమ్మ కష్టాన్ని అర్థంచేసుకున్న మనసు. ఒంటరి మహిళపై ఎంత చిన్నచూపుంటుందో చిన్నవయసులోనే అర్థంచేసుకున్న గురు. ఇంటర్ పాసైతే ఉద్యోగం వస్తదనుకున్నాడు. కష్టాలు తీరుతాయనుకున్నాడు. అమ్మను సుఖంగా చూడాలనుకున్నాడు. అందుకే చదువుకోసం తపనపడ్డాడు. కథకుడి నోట్స్ తీసుకున్నాడు. వెనక బెంచీకి వెళ్లిపోయాడు.
“ఆ రోజంతా వాడి కళ్లలోని దిగులుచూపు నన్ను వెంటాడింది. వాడికీ నాకూ అంతర్లీనంగా ఏదో దగ్గరితనం. మా నాన్న చిన్నప్పుడే జేజినాయన పోయాడట. జేజి కూలికి పోయేదట. పల్లె నుండి రోజు అనంతపురానికి నడిచివచ్చేవాడట. నాన్న పుస్తకాలు కొనలేని పేదరికం. వాళ్లవీ వీళ్లవీ అరువు తెచ్చుకొని చదువుకున్నాడట. ఈ విషయాలన్నీ నాన్న ఎపుడయినా చెబితే నా కళ్లలో నీళ్లూరేవి. అలా వాడితో… ఆ గురుమూర్తితో నా స్నేహం.”
అట్టా మొదలైంది వాళ్లిద్దరి స్నేహం. పేదరికం మూలాలు కలిపిన స్నేహం. మనుషుల్ని మనుషులుగా అర్థంచేసుకొనే బతుకుల్లోంచి వచ్చిన మనుషులు వాళ్లు. అందుకే వాళ్లిద్దరి స్నేహం మనల్ని వెంటాడే కథయింది.
ఒకరోజు ఇంటర్వెల్ టైమ్ లో ఓ విద్యార్థి ఫుట్ బాల్ లా ఎగిరొచ్చి గ్రౌండ్ లో పడ్డాడు. వాణ్ని ఈడ్చికొడుతున్నాడు గురు. విరిగిన బెంచీ కాలు తీసుకొని బాదుతున్నాడు. గ్రౌండంతా పొర్లిచ్చి కొడుతున్నాడు. ఒళ్లంతా దుమ్ము దుమ్ము. ముక్కు పగిలింది. రక్తం ధారగా కారుతోంది. భయం. నిలువెల్లా భయం. ప్రాణ భయం. చచ్చిపోతానేమోనని. గజగజా వణుకుతూ నేలపై కూలాడు. గుడ్లు తేలేశాడు. చచ్చాడనుకున్నారు. కట్టెను విసిరేసి నిప్పుకణికల్లాంటి కండ్లతో బయటికెళ్లాడు గురు. ఇదంతా లెక్చరర్లు, విద్యార్థులు చూస్తుండగానే. కానీ ఎవ్వరూ ఆపలేకపోయారు. వాళ్లలోనూ భయమే. ఆ సంఘటన చూసి.
“ఆ తర్వాత తెలిసింది. గురుమూర్తిని ‘లంజ కొడకా’ అని తిట్టాడట వాడు. నిజంగానట వాడి అమ్మ థియేటర్ దగ్గర… గుసగుసలు.”
మరుసటి రోజు పోలీసులు వచ్చారు. అప్పుడు క్లాస్ జరుగుతోంది. గురుమూర్తి గువ్వపిట్టలా ముడుచుకొని నిలబడ్డాడు. అక్కడే గురును కొట్టారు. జీపులో పడేశారు. స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత రోజు ఎప్పటిలాగే కాలేజీకి వచ్చాడు. ఇప్పుడు గువ్వపిట్టలా లేడు. గుండెల్నిండా ధైర్యం. తనిప్పుడు ఒంటరి కాదు. తన చుట్టు ఓ గుంపు. కాలేజీకి వచ్చినా. గ్రౌండ్ కి వెళ్లినా. ఇంటికి వెళ్లినా. చుట్టూ పదిమంది. కాలేజీ అంతా గురుమూర్తి పేరు మార్మోగింది. కాలేజీకి ఎన్నికల్లో పోటీచేశాడు. బంపర్ మెజార్టీతో జాయింట్ సెక్రటరీ అయ్యాడు. రెండో ఏట కూడా సెక్రటరీ అయ్యాడు. ఇంటర్ అయిపోయింది. గురు పరీక్ష తప్పాడు. క్రమంగా రాజకీయ పార్టీ పరిచయమైంది. తొందర్లోనే ఆ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అయ్యాడు. తరచూ ధర్నాలు. రాస్తారోకోలు. ఆందోళనల్లో గురు పేరు చూసి ఆశ్చపోయాడు కథకుడు.
కథకుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు ఓ వార్త పట్టణాన్ని కుదిపేసింది. గురు పేరు వింటే హడల్. సొంత పార్టీ జిల్లా నాయకుణ్ని పట్టపగలు నరికేశాడు గురు. పోలీస్ స్టేషన్ కు పదిగజాల దూరంలోనే. పదిరోజుల్లోనే మళ్లీ వీధుల్లో బలాదూర్ గా తిరుగుతున్నాడు. ఏ భయమూ లేకుండా. ఇదంతా విని ఆశ్చర్యపోయారందరూ. గురు ఆ పార్టీని వదిలేశాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేతో చేతులు కలిపాడు. ఆ సంఘటన తర్వాత కథకుడు గురుమూర్తిని ఎప్పుడూ చూళ్లేదు. పిల్లలూ, ఉద్యోగంలో బిజీ అయిపోయాడు.
“కానీ వాడి పేరు వినిపించేది. రౌడీ మామూళ్లు, కిరాయి హత్యలు, అత్యాచారాలు… ఏవి ఎక్కడ జరిగినా వాడి పేరు వినిపించేది. మనుషుల్లో భయం కనిపించేది. అలా వినబడి నిన్న కనిపించాడు తునాతునకలయిన శవం రూపంలో.”
రాజు వచ్చాడు.
“వాడే ఆ కుక్కల కొడుకు ఎం.ఎల్.ఏ గాడేనంట చంపింది. పాపం ‘గురు’ పందేల కోడి. కూటికి లేనోన్ని తెచ్చి కత్తులు గట్టి కుత్తుకలు కోశార్రా… దొంగ నా కొడుకులు.”
మున్సిపల్ ఎలక్షన్ చైర్మన్ పదవికి తానే పోటీ చేస్తానన్నాడట గురు. వీల్లేదన్నాడట ఎం.ఎల్.ఏ. బామ్మర్దిని నిలబెట్టాలని వాడి ప్లానట. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానన్నాడట గురు. అంతే వాడి పాడే లేచింది. ఇంకో విషయం తెలుసా? వాణ్ని చంపేదానికి ఎం.ఎల్.ఏ గాడూ, అపోజిషన్ వాళ్లూ చేయిచేయి కలిపారంటా.
అదే వాడు మాదిగవాడు గాకుండా వుంటే పిల్లనిచ్చి, వరుస కలిపి మరీ బందోబస్తుగా బరిలోకి దింపేవాళ్లు.
ఏ రంగం అయితేనేమి? రాళ్ల దెబ్బలు మనకీ. రాలిన కాయలు వాళ్లకీ… పెదాలు బిగించి కుడిచేతి పిడికిలిని ఎడమ అరచేతిలో కొట్టుకుంటూ కూర్చున్నాడు రాజు.
మాటలు పెగలని వేదనాగ్రహంలో నేను.
‘నాకు లెక్కలు అర్థం కావట్లేదు… ట్యూషన్ పోయేదానికి మా అమ్మతాన డబ్బులేదు…, ఇంటర్ పాసైతే ఉద్యోగం వస్తుందా….’ గురు దిగులు చూపులు నన్ను వెంటాడుతున్నాయి. గుండెల్ని కరగదీస్తున్నాయి.
మమ్మల్ని దహించివేస్తూ మౌనాగ్ని రాజుకుంది.
బయట మా ఇంటిముందు కొళాయి నీళ్లు పట్టుకుంటూ “పీడపోయింది. రౌడీ నాయాలు. మరీ అంత రౌడీతనమా. వాళ్లమ్మ థియేటర్ దగ్గర దోసెలు పోస్తన్నదంట. దానికి పెండ్లి లేదంట. మొగుడు లేకనే కొడుకును కనిందట. వాడు రౌడీ అయి కూర్చున్నాడు”
చచ్చినవాన్ని శాపనార్థాలు పెడుతున్నారు ధైర్యంగా.
రాజు విసురుగా బయటకు వెళ్లాడు.
ఇగో… మీకు రౌడీ అంటే ఎవరో తెలుసా. రౌడీల్ని గుర్తుపట్టే జ్ఞానం లేనపుడు వూరికే నీళ్లు పట్టుకుపోండి. అని తిట్టేసి వచ్చాడు.”
ఇందులో చివరి వాక్యమే కథకు ప్రాణంగా నిలించింది. కథలోని ఆయువుపట్టునంతా ఒకే వాక్యంలో మెరిపించాడు. ఇట్లా కథను నడిపించడం అద్భుతమైన శిల్పరహస్యం. సమాజంలో అసలు రౌడీలెవరు? రౌడీల్లేని రాజకీయ పార్టీ ఒక్కటైనా ఉన్నదా? పార్టీల ఆధిపత్య కుమ్ములాటల్లో ఎన్ని గ్రామాలు వల్లకాడయ్యాయో. నెత్తురు చిందని ఊరు ఒక్కటైనా ఉందా? దేశమంతా. కులబలం, ఆర్థిక బలం, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లంతా కింది కులాల వాళ్లను ఎట్లా పావులుగా వాడుకుంటారో అర్థం చేయించిన కథ ఇది. కథ పూర్తయ్యాక మనలో అలజడి చెలరేగక తప్పదు. వాళ్లమ్మ కళ్లల్లో పారే కన్నీటి నది మనల్ని నిలువెల్లా ముంచెత్తక తప్పదు. గురు వెంటాడుతాడు. జీవితాంతం. మానని గాయంలా.