రాలిన ఆకులు

కాలంకొమ్మ నుండి
కుప్పలుకుప్పలుగా
రాలిపోతున్న ఆకులను చూసి
శిశిరం సైతం
జ్వరంతో వణికిపోతోంది
దరిదాపుల్లో ఎక్కడా
వసంతపు జాడే లేదు
మణికట్టుపై ముళ్ళు
భారంగా తిరుగుతూ
క్షణక్షణం గుండెల్లో
పదునుగా గుచ్చుకుంటున్నాయి
ఈ దూరాలన్నీ
తిరిగి దగ్గరవడానికే
అని లోకం కోడైకూస్తున్నా
బ్రతుకులలో ఏర్పడ్డ
వేవేల శూన్యాలను
ఆనక ఎవరు పూడుస్తారు
ఏకాంతం అందగత్తే కాదనను
ఒంటరితనమొక రాక్షసి
అది భయపుసెగను రాజేసి
నిత్యం ముక్కలుముక్కలుగా
కొరుక్కుతింటూ ఉంటుంది
బయట పిట్ట కూడా
ఎన్నడూ వినని దుఃఖరాగాన్ని
పాడుతూ
గూట్లోకి రెక్కముడిచింది
ఊరి చివర
మెలితిరిగే ఆకలి కడుపులు
అయినవారి వద్దకు చేర్చే
వంతెనలకు పడ్డ తాళాలు చూసి
ఎటూ పాలుపోక అలసిపోయాయి
ఏ బాధల మరకలు అంటని
మట్టిపొరలలో
శాశ్వతవిశ్రాంతిని కోరాయి
ఎన్నడూ కనీ వినీ ఎరుగని
నెత్తుటిగాధ ఇది
అంతులేని కన్నీటిసముద్రాలను
భారంగా చప్పరిస్తూ
తన చుట్టూ తానే తిరగలేని
భూగోళం
భవిష్యత్తుస్వప్నాల విత్తులను
ఆశావహదృక్పధంతో
ఆకాశమంతా నాటుతోంది
ఏం చేస్తాం
భూమి కొంగు పట్టుకుని
వెనుకవెనుకే తిరుగుదాం
మనమూ మంచిరోజులను కలగందాం

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

2 thoughts on “రాలిన ఆకులు

  1. ఏకాంతం అందగత్తే………👏👏👏👏👏

Leave a Reply