రాత్రి ఉద‌యిస్తున్న ర‌వి

(మ‌హాస్వ‌ప్న‌. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. ”నేను అరాచ‌క‌వాదిని కావ‌చ్చునేమో కానీ, అజ్ఞానాన్ని మాత్రం ఆశ్ర‌యించ‌లేదు. క‌విగా నేనెప్పుడూ స్వ‌తంత్రుడినే. భావ స్వాతంత్య్రాన్ని అరిక‌ట్టే ఏ వ్య‌వ‌స్థ‌నైనా, ఏ ఉద్య‌మాన్నైనా ద్వేషిస్తాను. ధూషిస్తాను. శాసించే ప్ర‌తి దౌర్జ‌న్య హ‌స్తాన్ని నిల‌బెట్టి న‌రుకుతాను” అని ప్ర‌క‌టించాడు. జూన్ 25న క‌న్నుమూసిన ‘మ‌హాస్వ‌ప్న’ స్మృతిలో కొన్ని క‌విత‌లు.)

గ్లానిర్భవతి భారత


‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మాన‌మ్‌ సృజామ్యహమ్‌
– గీత
కలియుగం రేడియోగ్రామ్ లో
గిరగిర తిరుగుతున్న క్రీ. శ. ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద పిన్నునై
మానవతా రెండు కళ్ళు మూసుకు పోయినప్పుడు
విప్పుకుంటున్న మూడో కన్నునై
కాలం వాయులీనం మీద కమానునై
చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై
నేను వస్తున్నాను దిగంబర కవిని
రాత్రి ఉదయిస్తున్న రవిని –
రంగులు పేలిపోయి
డైలాగులు జారిపోయి
దిక్కులు మార్మో గేట్లు గొల్లుమంటున్న స్వగతాల్లో
తెర పై టెక్నీషియన్ల అస్థిపంజరాల నటనల్లో
జగన్నాటకపు మట్టిపాత్రలు బీట‌లెత్తిన‌ప్పుడు
డైరెక్టర్ అంతర్ధానమైనప్పుడు
మానిషాద శోకంలోంచి వేదన వల్మీకం లోంచి
నేను వస్తున్నాను దిగంబర కవిని
రాత్రి ఉదయిస్తున్న రవిని
డాఫర్ మచ్చను మేకప్ చేసుకుని
వెన్నెల నేపధ్యగానంతో విలాసంగా చంద్రుడు ఆకాశాన్ని పాలిస్తున్న‌ప్పుడు
క్షణక్షణానికి పోజులు మారుస్తున్న మబ్బులతో
ప్రదర్శన శాలల్ని అలంకరించేందుకు
చీకటికోసం తహతహలాడుతున్న తార‌ల‌తో
నగరాన్ని చుంబిస్తున్న గగనంలోంచి
గగనం ప్రతి బింబిస్తున్న నగరంలోంచి
వస్తూన్నాన్నేను దిగంబర కవి ని
ఆరని దాహపు నాల్కల్లో
భూకంపాల ఆకలి ఆవలింతల్లో
కామాగ్ని పర్వతాలు పగిలి ఎగజిమ్ముతున్న లావాల్లో
పోటెత్తిన సముద్రాల తరంగాలు ఉవ్వెత్తున రేగి
చెలియలికట్టల్ని తెగద్రెంచుకుంటున్నప్పుడు
అసంపూర్ణ జ్ఞానుల అహంభావం సిద్ధాంతం అజ్ఞాన ప్రవాహాల్లో
ప్రమాదాల జలావర్తాల్లో
జనతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి పోతున్నప్పుడు
కీర్తి కాముకులు, నియంతల, అహంతల దౌర్జన్య బాహుపుల దురాక్రమణలో
దేశ దేశాల సుఖ వ్యాధి పుండ్లతో
చీడపురుగు నిండిన మేడి పండ్లతో
భూమి వెలయాలై , పతితయై, భ్ర‌ష్ట‌యై పుచ్చి గబ్బు కొడుతున్నప్పుడు
నేను పుడుతున్నాను దిగంబర కవిని
విజ్ఞానం విరజిమ్ముతున్న విష పవనాల్లో
వేదికలు వెదజల్లుతున్న చీకటి పొగల్లో
పుస్తకాల పుటల బంజ‌రు బీళ్ళ‌లో
నాగరికత మత్తు ఇంజెక్షన్ లో సమాజం జీవచ్ఛ‌వమైనప్పుడు
దీపాలు కొడిగట్టి
రక్త ధునులు గడ్డకట్టి
జీవనదులింకి
మానవత మసిపాతలా మారిపోయినప్పుడు
మాసిపోయినప్పుడు
నేను వస్తున్నాను దిగంబర కవిని
స్తంభించిన కవితా స్తంభం బద్దలై పుట్టుకొస్తున్న ఉగ్రనగ్న నరకేసరిని
నాటేసిన చెట్లని నడిపించేందుకు
పాతేసిన రాళ్ళని పలికించేందుకు
గోరీల్లో శవాలకి పునరుత్థానం కలిగించేందుకు
వికృతాకారపు శిలల్ని మానవులుగా మలిచేందుకు
మరణించిన భగవంతుడికి ప్రాణం పోసేందుకు
నేను వస్తున్నాను దిగంబర కవిని -వాచ‌విని
రాత్రి ఉదయిస్తున్న ప్రతిభా రవిని
కలియుగం రేడియో గ్రామ్‌లో
గిరగిర తిరుగుతున్న క్రీ. శ. ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద పిన్నునై
మానవత‌ రెండు కళ్ళూ మూసుకుపోయినప్పుడు
విప్పుకుంటున్న మూడోకన్నునై
కాలం వాయులీనం మీద కమానునై
చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై

(‘దిగంబ‌ర క‌వులు’ నుంచి…)

అశ్రుగీతి

నునురేకులు విప్పకనే
చిరునవ్వులు చిందకనే
నిశీథిలో వర్షించిన
నిబిడహిమానీవృష్టికి
మరణించిన విరి కోసం…

ఏ గిరినో జన్మనెత్తి
తరగలెత్తి పరుగులెత్తి
అగాధాల క్రుంగి, గ్రీష్మ
తాపజ్వాలలకు మరగి
ఆవిరైన ఝరి కోసం…

అంతెరుగని ఎడారిలో
నిరాశలో పిపాసతో
కనులు వ్రాలి తనువు తూలి
నడిదారిని పడిపోయిన
ఒంటరి తెరువరి కోసం…

ఇసుక ఎడారి

పరుగెత్తలే విచట అరబీతురంగాలు
విహరింపలే విచట స్వేచ్ఛాకురంగాలు
కదలిపోలేవు గాంభీర్యదీప్తు లెసంగ
మందగమనాలతో మత్తమాతంగాలు

కాల మొక తుదిమొదలు లేని ఇసుక ఎడారి
ఇది పొడుగుకాళ్లున్న గూని ఒంటెల దారి
నీరసించిన నిరాశాపథికసోదరా!
లోక మిది కొందరికి మాత్రమే రహదారి…

గీతి

తలుపు తట్టి వెళిపోతున్నా వెందుకు?
ఇరులు కురులు విప్పుకున్న
ఏకాంతకుటీరవాటి
నిదురవోవు కన్నుల చాం
ద్రీకిరణమువలె స్పృశించి
మేలుకొల్పి వెళిపోతున్నా వెందుకు?

నిరీక్షణావిలీనమై
నిరాశాపరీవృతమై
గానఝరులు నిదురించిన
మౌనహృదయవిపంచికా
తంత్రి మీటి వెళిపోతున్నా వెందుకు?

కదలలేని కరుగలేని
కారుమబ్బుగుండియలో
శంపాలతవోలె మెరసి
క్షణప్రభాదీప్తి నించి
విదారించి వెళిపోతున్నా వెందుకు?

నిశ్శబ్దత పేరుకున్న
నిర్జీవసమాధిలోన
చైతన్యప్రదమృదుసం
గీతలహరివోలె సోకి
కరగి మాయమైపోతున్నా వెందుకు?

ఎదురుచూచు రక్తాక్షుల
కిక లేదా సుఖసుషుప్తి
ఈ సంధ్యాజీవితమున
కేనాటికి పరిసమాప్తి
తలుపు తట్టి వెళిపోతున్నా వెందుకు?

(‘అగ్నిశిఖలు… మంచుజడులు’ క‌వితా సంపుటి నుంచి…)

జ‌న‌నం: నెల్లూరు జిల్లా లింగ‌స‌ముద్రం. అస‌లు పేరు: కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. 'మ‌హాస్వ‌ప్న' క‌లం పేరుతో దిగంబ‌ర క‌విగా మారాడు. కావ‌లిలో చ‌దువుకున్నాడు. 1964లో  'అగ్నిశిఖలు... మంచుజడులు' క‌వితా సంపుటి ప్ర‌చురించారు.

Leave a Reply