పాలకుల చేతిలో
అవిటిదైన సమాజానికి
అతడు చక్రాల కుర్చీనిచ్చి నిలిచాడు
చీకటి గదుల్లో బంధించి హింసించినా
అతడు హక్కుల వెలుగు రేఖల్ని
నిరంతరం కలగన్నాడు
అంగవైకల్యాన్నే కాదు
చావును అతడు ఎదిరించి ఓడించాడు
అతడి ఊపిరి ఆపి శాశ్వతంగా
అతడి ఉనికిని నిర్మూలించాలనుకున్న
రాజ్యం కలల్ని అతడు పటాపంచలు చేశాడు
కాళ్లు లేకున్నా నిరంతరం పయనించాడు
గొంతు లేనోళ్ల కోసం
కోట్ల గొంతుకలై గర్జించాడు
తన చుట్టూ ఉన్న ఇరుకును చూసి
ఈసడించుకున్నాడు
విశాల ప్రపంచాల వైపు
కష్టమైనా సరే సాగిపోయాడు
కక్షగట్టిన రాజ్యం కంట్లో నలుసయ్యాడు!
సచ్చుబడిన కాళ్లలాంటి
ఈ దేశ పాలకుల మీద
ఒక అప్రకటిత యుద్ధం చేశాడు
పేదోళ్ల భరోసై నిలిచాడు
అతడి జీవితంలాగే
అతడి మరణమూ ఒక సందేశమే
నిజమే…
హక్కులు అడక్కుంటే వచ్చేవి కావు
పోరాడి సాధించుకోవాల్సిందే!!