– గిదే ముపాసా
అనువాదం: జె. బాల్‌రెడ్డి
బెర్లిన్ అధికార పీఠం కుప్పకూలినట్లు అప్పుడప్పుడే పారిలో వార్త గుప్పుమంది. రిపబ్లిక్ ను ప్రకటించారు. కూటమి రాజ్యాల అధికారం ప్రకటించే వరకు ఫ్రాన్స్ ఫ్రాన్సంతా వెర్రెత్తి ఉర్రూతలూగింది. దేశం ఆ కొన నుంచి ఈ కొన దాకా ప్రతి మనిషి సైనికుడై వ్యవహరించాడు. టోపిలు తయారు చేసే వారు కల్నల్స్ అయ్యారు. ఏకంగా జనరల్ పదవికే ఎగబాకడానికి కలలు గన్నారు. భారీ ఉబకాయాలు ఒంటికి రివాల్వర్లు, చురకత్తుల ఒరలు చుట్టుకున్నాయి. వేలాడే ఎర్రటి ఒరల్లో వాటిని దర్పంగా వేలాడదీసుకున్నారు. మాములు మనుషులు యుద్ధ వీరులయ్యారు. స్వచ్ఛంద సైనికులతో బారులు తీరిన బెటాలియన్లను నడిపే నాయకులయ్యారు. ఎవరికి వారే తమ గొప్పను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైనికుల్లా ప్రమాణాలు చేస్తున్నారు.
ఇప్పటివరకైతే ఆయుధాలు ధరించడానికి, తుపాకులు చేతబూనడానికి అక్కడ ఒక పద్ధతి పాడు ఏమి లేవు. ఎవరు ముందొస్తే వారికే అన్న చందంగా ఆయుధం, అధికారం అందిపోతున్నాయి. ఆలా అధికారం అందుకున్న వారు దారిన పోయే అమాయకుల అసువులు తీశారు. సరిహద్దునున్న జర్మన్ల బంజర్ల దాకా ఊరువాడ కలియ దిరుగుతున్నారు. ప్రపంచం ఏమి పట్టనట్టు గడ్డి పరకల్ని నమిలే గంగి గోవుల్ని, బీళ్ల మీదకు మేతకొదిలిన బక్కచిక్కిన గుర్రాల్ని, వీధిన తిరిగే ఊర కుక్కల్ని కాల్చిచంపుతున్నారు. సాగుతున్న మిలటరి వ్యవహారాల్లో తమదే గొప్ప పాత్రని ఎవరికి వారే గట్టిగా నమ్ముతున్నారు. ఊరు చివరున్న టీ హోటల్ దగ్గర, కమ్మిరి కొలిమి దగ్గర, ఒడ్డాయన దాతి దగ్గర వివిధ చేతి వృత్తుల వాళ్ళు మిలటరి డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు. అవన్నీ మిలటరీ బ్యారాక్స్ లాగా, ఫీల్డ్ ఆస్పత్రులాగా కనిపిస్తున్నాయి.
రాజధాని అధికారం గురించి, కదం తొక్కె మిలటరి కవాతుల గురించి ఉద్రిక్త వార్తలేవి కేన్స్ పట్టణాన్ని చేరడం లేదు. ఏదెట్లున్నా ఒక నెల కాలంగా గొప్ప ఆందోళనలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒక దాని మీద ఒకటి దాడులు ప్రతి దాడులకు పాల్పడుతున్నాయి. వర్నెతో (జిల్లా అధికారి)విస్కౌంట్. ఆ పట్టణానికి మేయర్. పొట్టి బక్క పల్చటి మనిషి. అప్పటికే వయోవృద్ధుడు. ఆయనే ఇప్పుడిక్కడ ప్రష్యన్, సామ్రాజ్యానికి ప్రతినిధి. రిపబ్లికన్ పార్టీ నాయకుడు డాక్టర్ మార్సెల్ ఒక్కడే ఆయనకు ప్రమాదకరంగా కనపడుతున్నాడు. మార్సెల్ మాసోనిక్ లాడ్జికి, వ్యవసాయ సహాకార సంఘానికి , అగ్నిమాపక శాఖకు అధ్యక్షుడు. దేశ రక్షణకు రూపొందించిన గ్రామీణ పౌరసైన్యానికి ఆర్గనైజర్. రెండు వారాల్లో డాక్టర్ మార్సెల్ అరవై మూడు మందిని స్వచ్ఛంద పటాలాల్లో సమీకరించాడు. పెండ్లయిన వాళ్ళు. కుటుంబానికి ఆదెరువైన తండ్రులు, దూరదృష్టిగల పెద్ద రైతులు, పుర వ్యాపారులు ఆయన భర్తీ చేసిన సైనికులు. వీరందరితో పొద్దునె మేయర్ భవనం కిటీకి ఎదురుగా కవాతు సాగుతుంది. మేయర్ కనబడి కనబడగానే కమాండర్ మార్సెల్ పిస్తోళ్ళున్న ఆంగరక్షకుల నడుమ డాబుసరిగా ముందుకు వెనుకకు పటాలం మందు నడుస్తాడు. “ మన రాజ్యం వర్థిల్లాలి.. మన దేశం వర్థిల్లాలి” – అదిరి పోయేలా ఆరిచి అరిచి నినాదాలిస్తాడు. మేయర్ భవనంలో ఉన్నవాళ్లది గమనిస్తూనే ఉన్నారు. ఇదంతా జిల్లాధికారి కొడుక్కు చిరాకు తెప్పించింది. ఇప్పటి వరకు ఇలాంటి బెదిరింపులు, అదిరింపులు, విశ్వాసఘాతకం చూసి ఎరగడు. ఇవి మహా విప్లవం నాటి దుస్వప్నాలను గుర్తుకు తెస్తున్నట్లున్నాయి.
ఆరోజు సెప్టెంబర్ 5. కమాండర్ డాక్టర్ మార్సెల్ ఉదయాన్నే యూనిఫారమ్ ధరించి తన కన్సెల్టింగ్ రూమ్ లో కూర్చున్నాడు. టెబుల్ మీద రివాల్వార్ పడి ఉంది. ఆరోజయాన ఒక వృద్ధ రైతు దంపతులకు ఆపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ రైతు దీర్ఘ కాలంగా వెరికోస్ వెయిన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఒక్కడే టౌన్ కెళ్లి వైద్యుడిని కలవడమెందుకులే భార్యకు కూడా వచ్చాకా జోడుగా వెళ్లి చూపించుకోవచ్చని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇపుడా భార్యకు అదే వ్యాధి వచ్చింది. వాళ్ళూరికి దిన పత్రిక తెచ్చె పోస్టు మేన్ సలహా మీద ఇప్పుడిద్దరు కలిసి మార్సెల్ ను కలవడానికి వచ్చా రు.
డాక్టర్ మార్సెల్ తలుపు తీశాడు. ఒక్కసారిగా ఆయన మొఖం పాలి పోయింది. హఠాత్తుగా నిటారుగా నిలబడ్డాడు. … గౌరవ వందనం స్వీకరించే సేనానిలా ఆకాశంలోకి చేయెత్తాడు. శక్తినంతా కూడ గట్టుకొని గట్టిగా నినాదలందుకున్నాడు. బిగబట్టిన ఊపిరితో శక్తి కొద్ది ఆరిచె ఆరుపులకు
మొఖమంతా ఉబ్బరించి బయంకరంగా ముడతలు పడింది. “ వర్ధిల్లాలి రిపబ్లిక్. రిపబ్లిక్ వర్ధిల్లాలి. వర్థిల్లాలి రిపబ్లిక్” – పిక్కటిల్లేలా అరిచాడు. తరువాత ఉద్వేగం ఉసూరుమంది. నీరసంగా వాలు కుర్చీలో చేరబడ్డాడు. కాళ్ల నరాల్లో చీమలు బారినట్లవుతుందని రైతు తన బాధను తాను చెప్పుకు పోతున్నాడు. డాక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “ఏయ్ కొంచెం శాంతించు. మూర్ఖుడా ఇప్పటికే మీ కోసం చాల సమయం వృధా చేశాను. గణతంత్రం ప్రకటించారు. చక్రవర్తి ఖైదీ అయ్యాడు. ఫ్రాన్స్ విముక్తయ్యింది. “ వర్థిల్లాలి రిపబ్లిక్” అంటూ తలుపు వరకూ పరిగెత్తాడు. మెల్లగా “
సెలెస్ట్… సెలెస్ట్ తొందరగా రా” – కేకేశాడు.
భయపడుతూ పని మనిషి పరిగెత్తుకొచ్చింది. మార్సెల్ తొందరగా మాట్లాడే క్రమంలో తత్తర పడుతున్నాడు. ” నా బూట్లు.. ఖడ్గం. నా తూటాల బాక్స్. ఆ.. ఆ.. నా స్పానిష్ డాగర్ .. అది నా నైట్ టెబుల్ మీద ఉంది. త్వరగా.. హు త్వరగా ” ఆర్డర్ వేశాడు. ఆశావాదైన రైతు డాక్టర్ ఆగడమే అవకాశంగా తీసుకొని “ చూస్తుంటే కాళ్లలో ఎవో పురుగులు పారుతున్నట్లనిపిస్తుంది. నడుస్తుంటే బాగా బాధ కలుగుతుంది”విసిగిపోయిన డాక్టర్ కోపంతో “ ఆగవయ్యా ! దైవుడి తోడు మీరు ఎప్పటికప్పుడు కాళ్ళు కడుక్కుంటే ఈ జబ్బే వచ్చేదే కాదు.”- అతని మెడమీద చేయి వేసి మొఖం ముందుకు గుంజుకొని “మూర్తుడా నీకు అర్థం కావడం లేదా? మనం రిపబ్లిక్ లో జీవిస్తున్నా”మంటూబుసలు కొట్టాడు. హఠాత్తుగా తన వృత్తి ధర్మ గుర్తుకొచ్చింది. వెంటనే ప్రశాంతంగా మారిపోయాడు. వృద్ధ దంపతులు విస్మయంతో వీధిలోకి వెళ్ళారు. ” రేపు రండి మిత్రులారా ! రేపురండి. నాకీ రోజు అస్సలు టైం లేదు”- పదే పదే అవే మాటలు చెప్తున్నాడు డాక్టర్ మార్సెల్..
ఆపాద మస్తకం తన సైనికాలంకారాలు తగిలించుకుంటూ మరో వరుస ఆజ్ఞలు జారీ చేశాడు. “ పరిగెట్టు. లెఫ్టినెంట్ పికార్డు, సబ్ లెఫ్టినెంట్ పొమ్మెల్ లను ఉన్నపళంగా నా దగ్గరుండాలని చెప్పు. ఆ,, అలాగే టార్చ్ బొఫ్ ను కూడా… అతని ఢంకా తీసుకొని రమ్మను. ఉహు.. ఇక్కడున్నట్లు రావాలి”- సెలెస్ట్ వెళ్లగానే ఆలోచనలను కూడ గట్టుకొంటున్నాడు. గడ్డు పరిస్థితులను గట్టెక్కాలని సిద్ధమౌతున్నాడు.
ముగ్గురు కట్టగట్టుకొని కలిసే వచ్చారు. మార్సెల్ కు వారిని చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ముగ్గురికి ముగ్గురు పనిమీద వేసుకొనే బట్టలే వేసుకున్నారు. సైనిక విధులకు హాజరైనప్పుడు యూనిఫారమ్ ధరించాలనే స్పృహా అయినా వారికున్నట్లు లేదు. “మీకు ఇంకా ఏమి తెలియదా? చక్రవర్తిని ఖైదు చేశారు. రిపబ్లిక్ ను ప్రకటించారు. నా పరిస్థితి చాల క్లిష్టంగా ఉంది. నిజంగా ఇది ఆపత్కాలం”. ఆశ్చర్యం మొఖాల మీద పేరుకు పోయిన అనుచరుల ప్రతిస్పందన కోసం ఒక నిమిషం చూసి తిరిగి కొనసాగించాడు. “ ఇంకా వెనుకా ముందు చూడొద్దు. ఇక మనం చర్యకు దిగక తప్పదు. ఇప్పుడు ప్రతి నిమిషం విలువయింది. నిర్ణయాల ఖచ్చితత్వం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. పికార్ వెళ్లు, వెళ్లి క్యూరేటు ఎక్కడున్నాడో చూడు. అందర్ని అలెర్ట్ చేస్తూ గంట మోగించి నెన్కడికి వచ్చే సరికి అందరిని సమీకరించు. టార్చ బఫ్
నీవు… నీవు ఢంకా వాయించి మిలిషియాను ఆయుధాలతో సెంటర్ లో హాజరు కమ్మను. గెరిసే, సల్మార్ వంటి దూర ప్రాంత పల్లెలకు కూడా కబురు చేరాలి. ఆ( పొమ్మెల్ వెళ్లు వెళ్లి వెంటనే యూనిఫారమ వేసుకో. జాకెట్, టోపి మర్చిపోవద్దు. అందరం కదిలి వెళ్లి మేయర్ కార్యాలయం స్వాధీనం చేసుకోవాలి. వెంటనే విస్కౌంట్ (జిల్లా అధికారి) వెర్నెతోకు ఆదేశాలు పంపించు. అధికారం వెంటనే నాకు బదలాయించ మను. అర్థమయ్యిందా ?.”.
“ఆ సరే”
” పదయితే పని పక్కాగా ఉండాలి. నేను నీ ఇంటి వరకు నీతోడొస్తా, పొమ్మెల్… ఇక మీద మన మంతా ఒక్కతాటి మీద పని చేయాలి.”-5 నిమిషాల తర్వాత కమాండర్ అతని అనుచరులు ఆయుధాలతో వీధి కూడలికి చేరుకున్నారు. వీరంతా కూడిన సమయానికి విస్కౌంట్ (జిల్లా అధికారి) వెర్నెతో కొడుకు వేట బరిసేపట్టుకొని భుజం మీద రైఫిల పెట్టుకొని పక్క వీధి నుండి వస్తూ కనిపించాడు. బిరాబిరా నడుస్తున్న అతగాడికి ఇరువైపుల ఆకు పచ్చటి జాకెట్లు వేసుకున్న ఆంగరక్షకులనుసరిస్తున్నారు. అందరి ఒరలో కత్తులు. భూజాల మీద తుపాకులున్నాయి. వెళ్తూ వెళ్తు డాక్టర మార్సెల చెంప చెల్లు మనిపించారు. ఆ దెబ్బకు దిమ్మ దిరిగి ఆచేతనంగా అలాగే నిలబడి పోయాడు. ఆ నలుగురు మేయర్ భవనంలోకి వెళ్లారు. వెంటనే తలుపు మూసుకుంది. –
” మన వాళ్లను కొనేశారు”- డాక్టర్ గొనుక్కున్నాడు. “ఇక తప్పదు వేచి చూడాల్సిందే. ముందు బలగాల్ని పునః సంఘటితం చేయాలి. ఈ పావు గంటలో ఏమి చేయలేం” – ఇంతలో లెఫ్టినెంట వికార్డ్ కనిపించాడు. ” క్యూరేట్ మీ ఆజ్ఞలను దిక్కరించాడు. అతను బిడేల్, పోర్టర్లతో కలిసి చర్చీలో తలుపేసుకొని ఉండిపోయాడ”ని కబురు తెలిపాడు. – కూడలికి ఆటువైపున తెల్లటి మేయర్ భవనం. పక్కనే చర్చ. ఇనుప కమ్ములో బిగించిన భారీ ఓక్ ద్వారాలు. అంతా నిశ్శబ్దం. దిగ్బంధం.
చుట్టు పక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఇండ్ల కిటీకిల సందుల్లోంచి, ఆరుగుల మీద నిలబడి వింతగా చూస్తున్నారు. బేరిని దొర్లిస్తున్న చప్పుడు వినిపించింది. ఆ వెంటే టార్బీ బొఫ్ కనిపించాడు. అతను వెర్రి కోపంతో ‘తీన్మార్’ వాయిస్తున్నాడు. అది అందరు ఆయుధాలతో సిద్ధం కావాలనే సూచన. క్రమశిక్షణతో క్రమబద్ధమైన అడుగులతో కూడలి దాటి గ్రామాల వైపుగా అదృశ్యమయ్యాడు. కమాండర్ మార్సెల్ యుద్ధఖడ్గాన్ని దుశాడు. ఒక్కడే రెండు భవనాల మధ్య శత్రువు నిర్మించిన బారికేడ్ వరకు వెళ్లి చేయి తల ఎత్తుకంటా లేపి కత్తి గాల్లో తిప్పాడు. డొక్కలు పికిలిపోయే ఊపిరితో “ రిపబ్లిక్ వర్థిల్లాలి. విద్రోహులు హతమవ్వాలి”- అరిచి తిరిగి వెనుకకు మర్లాడు. అతని అనుచర అధికార్లున్న చోటికి చేరుకున్నాడు. మాంసం దుకాణం యాజమాని, బేకరి ఓనర్, నాడీ వైద్యుడు అయోమయంగా చూస్తున్నారు. షట్టర్లను కిందికి గుంజారు. దుకాణాలను మూసేశారు. కిరాణ దుకాణమొక్కటే తెరిచి ఉంది. .
మిలిషియా సైనికులు చిన్న చిన్నగా వచ్చి చేరుకుంటున్నారు. మనిషికో తీరు బట్టలు ధరించారు. అయితే అందరి నెత్తి మీద టోపిలు మాత్రమున్నాయి. మొత్తంగా సైనిక యూనిఫారానికి అదొక్కటే గుర్తుగా ఉంది. తుప్పు పట్టిన నాటు, మోటు తుపాకులు. ముప్పై ఏళ్ళ నుంచి ఆవి ఇంటి పొగగొట్టాల్లో, చూరుల్లో పెట్టినట్టున్నారు. నల్లగా కదురూపం పట్టి ఉన్నాయి. గ్రామీణ బలగంలా నిశ్శబ్దంగా చూస్తున్నారు. కమాండర్ చుట్టు మూగిన ఓ ముప్పై మందికి ఆయన రాజ్యవ్యవహారాలు వివరించాడు. అటువైపున్న మేజర్ వైపు తిరిగి ” ఇప్పుడు మనం దాడి మొదలు పెట్టాలి”అన్నాడు. చుట్టు ఇండ్ల వాళ్ళంతా చేరారు. మాట్లాడారు. చర్చించారు. డాక్టర్ మార్సెల్ వెంటనే తన పథకాన్ని సిద్ధం చేశాడు. ఈ “ లెఫ్టినెంట్ పికార్డ్! మేయర్ భవనం కిటికీలను ఆక్రమించుకో! రిపబ్లిక్ ఆదికారామోదానికి సూచికగా భవనాన్ని ఖాళీ చేసి నాకప్పగించమని తెలుపు” లెఫ్టినెంట్ పికార్డ్ నకెత్తులోడు – ” నేను చేయనని’ తిరస్కరించాడు. “ నీ యమ్మా కోతి వెదవ! నన్ను టార్గెట్ చేద్దామనే… ఆ… వాళ్ళు గురివిందను కూడా కొట్టే గురికాళ్ళు ఆది తెలుసా నీకూ? అయ్యా నమస్తే…. ధన్యవాదాలు. నీ దాడి పథకం నీవే అమలు పర్చుకో.” కమాండర్ మార్సెల్ ఉగ్రుడయ్యాడు. “ నేనాజ్ఞాపిస్తున్నా!. నీవు కదిలి వెళ్ళాల్సిందే. అది క్రమశిక్షణ” శాసించాడు. ” ఎందుకెందో తెలియకుండా నా మొఖం బద్దలు కొట్టుకోవడానికి సిద్ధంగా లేను” లెఫ్టినెంట్ వికార్డ్ జవాబు. చుట్టున్న మంది మీద దాని ప్రభావం పడింది. వాళ్లు నవ్వుతున్నారు. గుంపులొంచొకడు ” పికార్డ్ నీవే రైట్. దాడికిది సరైన సమయం కాదు”
డాక్టర్ ఎగపోస్తూ “మూర్ఖులు” – గొణిగాడు. అతని కత్తి, రివాల్వర్ పక్కనున్న సైనికుని చేతిలో పెట్టి, అడుగులో అడుగేస్తూ నేలను కొలుస్తున్నట్టుగా ముందుకు కదిలాడు. కండ్లు మాత్రం మేయర్ భవనం కిటికీలనే చూస్తున్నాయి. ఏ తుపాకి, ఏ ఫిరంగి గురిచూస్తున్నాయేమోనని అదురు. మరో నాలుగడుగుల్లో భవనానిన చేరుతాడనగా దానికి రెండు చివర్లలో ఉన్న పాఠశాలల ప్రవేశ ద్వారాల్ని తెరిచారు. చిన్నారులు ఒకే సారి వరదలా వచ్చిపడ్డారు. ఆబ్బాయిలు ఒక వైపు నుంచి అమ్మాయిలు మరోవైపు నుంచి వచ్చి ఆరు బయట స్థలంలో ఆనందంతో ఆడుకోవడం మొదలు పెట్టారు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఆకాశాన్నాక్రమంచిన పక్షుల్లా డాక్టర్‌ను చుట్టుముట్టారు. ఆయనకది ఆరుదైన అనుభవం. ఏమి పాలుపోక కళవెళ పడ్డాడు.
చివరకు తలుపులు మూసేశారు. పిల్లకోతులు చాల మట్టుకు చెదిరి పోయారు. కమాండర్ మార్సెల్ గొంతెత్తి బిగ్గరగా పిలిచాడు- ” మిస్టర్ వర్నెతో?” చివరకు మొదటి అంతస్తులోని ఒక కిటికీ తెరుచుకుంది. అందులోంచి వెర్నెతో కనిపించాడు. కమాండర్ చెప్పడం మొదలు పెట్టాడు ” అయ్యా! మీకు ఈ పాటికి ప్రభుత్వ వ్యవస్థను మార్చిన పరిణామాలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మీరు
ప్రాతినిథ్యం వహించే పార్టీ ఉనికిలో లేదు. మా రిపబ్లికన్ల పక్షం అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితి విషాదకరమైనా తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. కొత్తగా అవతరించిన రిపబ్లిక్ సాక్షిగా మీరు అధికారాన్ని నా చేతిలో పెట్టాల్సి వుంది.” జిల్లాధికారి వెర్నెంతో “ డాక్టర్ మార్సెల్ నేను ఈ క్యాని పట్టణానికి మేయరు. అదీ ఉచితనుచితాలు తెలిసిన అధికారులు జరిపిన నియమాకం.
మేయర్ పదవిని రద్దు పర్చే వరకు నేనే ఈ పట్టణానికి మేయరు. అది నన్ను నియమించిన ఉన్నతాధికారులు చేస్తేనే సాధ్యం. మేయర్‌గా నేను ఈ భవనంలో ఉండాలి, ఉన్నాను. ఉంటాను. మీకింకేమైనా కావాలంటే… నన్నిక్కడి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేసి చూడు.”- దాటిగా సమాధానం చెప్పి కిటికీ మూసుకున్నాడు.
కమాండర్ తన బలగాలను చేరుకున్నాడు. విషయం వివరించే ముందు లెఫ్టినెంట్ పికార్డ్ ను ఎగదిగ చూసి ” మూర్ఖుడా ! పిరికి బాతు. నీవలన సైన్యానికే అగౌరవం. ఈ క్షణమే నీ హోదా తగ్గిస్తున్నా!” – అన్నాడు.
లెఫ్టినెంట్ పికార్డ్ తిరుగు జవాబుగా ” నీవు తగ్గించేదేంది. నాకు నేనే తగ్గించు కుంటున్నా” – అంటూ అక్కడే గుసగుసలాడుతున్న ఓ గుంపులో దూరాడు.
డాక్టర్ సందేహించాడు. ఏం చేయాలిప్పుడు? దాడి చేయాలా? చేస్తే ఈ సైన్యం నా అజ్ఞలు పాటిస్తుందా ? నిజంగా దాడికి ఇది సమయమేనా? అతనికి మెరుపుల ఒక ఆలోచనొచ్చింది. కూడలికి ఆవలి వైపున్న టెలిగ్రాఫ్ ఆఫీసుకు పరిగెట్టాడు. “పారిస్ లోని రిపబ్లికన్ ప్రభుత్వానికి”. నూతన రిపబ్లిక్ ఆధికారులకు, దిగువ సియాన్ నది. రొయేన్.” నూతన రిపబ్లిక్ ఉప విభాగం, దిఆపే.” హడావిడిగా మూడు టెలిగ్రాములు పంపాడు. టెలిగ్రామ్ లో పరిస్థితిని సవివరంగా పేర్కొన్నాడు. నియంతృత్వాధికారి మేయర్ వలన కూటమి రాజ్యాలకు రాబోతున్న ప్రమాదాన్ని వివరించాడు. తన విశ్వాసనీయమైన సేవల అందుబాటును పేర్కొన్నాడు. తన పేరు మీద అధికార మార్పిడికి ఆజ్ఞపత్రాలను పంపించవలిసిందిగా కోరాడు. తర్వాత వెనుదిరిగి తన బలగాల వద్దకు చేరుకున్నాడు. వెళ్తూనే జేబు నుంచి ఒక పది ఫ్రాంకుల నోటును బయటకు తీశాడు. – ” మిత్రులారా!! వెళ్లి ఏదైనా తిని తాగండి. ఒక పది మంది దళాన్ని మాత్రం ఇక్కడ వదిలి పెట్టండి. అట్లయితే మేయరు భవనం నుంచి ఎవ్వరూ బయటకు వెళ్ళరు.” – అని ఆదేశాలిచ్చాడు.
మాజీ లెఫ్టినెంట్ పికార్డు అక్కడే ఒక వాచీల రిపేరీదారుతో పిచ్చాపాటిలో ఉన్నాడు. ఈ మాటలు విన్నంతనే చిన్నగా దగ్గి “క్షమించండి. ఒక వేళ వాళ్లు బయటకు పోతే… లోపటికెళ్లడానికి మీకది చక్కటి అవకాశం . అది కాక పోతే మీరు లోపటికి వెళ్ళేదారి నాకైతె కనిపించడం లేదు.” అన్నాడు.
డాక్టర్ ఏ జవాబు ఇవ్వకుండానే అక్కడి నుండి ….బోజనానికి వెళ్లాడు. ఆ మధ్యాహ్నం అన్ని కార్యాలయాలను వదిలి ఏ ఆద్భుతమో, ఆశ్చర్యమో కలిగించే వార్త వింటానేమోననే ఆశతో అనేక మార్లు మేయర్ భవనం చర్చీల మధ్య కాలుగాలిన పిల్లిలా తిరిగాడు. అనుమానించాల్సిన విషయమేది అక్కడ కన్పించలేదు. భవనంలో మనుసుల అలికిడి లేక బోసి పోయినట్లనిపించింది.
కటికె దుకాణం, బేకరి ఓనర్, నాడీ వైద్యుడు దుకాణాలను తెరిచారు. మెట్లరుగు మీద నిలబడి పిచ్చాపాటి వేసుకుంటున్నారు. చక్రవర్తి బందీ అయ్యాండంటే ఎక్కడో, ఎవడో ద్రోహి ఉండే ఉంటాడు. కొత్త ప్రభుత్వం శిస్తు వసూళ్లు చేయడం కష్టమేనని తేల్చారు. రాత్రయ్యింది. 9 గంటల వేళ డాక్టర్ ఒక్కడే సడిచప్పుడు లేకుండా మేయరు భవనం చేరుకున్నాడు. ఇక ఈ దెబ్బతో కష్టాలు గట్టెక్కి నట్లేనని భావించాడు. తలుపులు బద్దలు కొడదామని పిక్కాసుతో నాలుగు దెబ్బలేసాడు. గార్డు గొంతు బొబ్బరించింది. “ఎవరక్కడా?”- డాక్టర్ మార్సెల్ వెనుకకు తిరిగాడు. రిట్రీట్…కాల్లేపితే దుమ్మెకనబడుతోంది.
మరో రోజు తెల్లారింది. పరిస్థితుల్లో మార్పేమీ లేదు. మిలిషియా సభ్యులు ఆయుధాలతో సెంటర్లో హాజరయ్యారు. చుట్టుపక్కల జనాలు గుమిగూడి ఎదురు చూస్తున్నారు. ఆసక్తి అంతా పరిష్కారం ఏమిటనే. చుట్టు పక్కల గ్రామాల నుండి కూడా జనాలు ఏం జరుగుతుందో చూద్దామని వస్తున్నారు. చివరాకరికి డాక్టర్‌కు అర్థమయ్యింది. పరువు మర్యాదలు మైలపడుతున్నాయిని.
“ఏదో రకంగా ఏదో ఒకటి చేసి పరిష్కారం చూడాలి.”- అప్పుడే టెలిగ్రాఫ్ ఆఫీసు తలుపులు తెరుచుకున్నాయి. అధికారిణి సేవిక చేతుల్లో రెండు పేపర్లు పట్టుకొని వస్తుంది. ఒక్కసారే మార్సెల్ కు పోయే ఊపిరి తిరిగొచ్చినట్లయింది.
ఆమె నేరుగా కమాండర్ దగ్గరికి కొచ్చి ఒక టెలిగ్రామ్ కాగితం ఇచ్చింది. తిరిగి కూడలి దాటింది. అక్కడున్న వారి కండ్లన్ని ఆమె మీదే ఉన్నాయి.
తలవంచుకొని మందగమనంతో బారికేడ్లకు ఆవల ఉన్న తలుపును మెత్తగా తట్టింది. తలుపు కొంచే తెరుచుకుంది. ఆ సందులోంచి ఓ చేయి ముందుకు వచ్చి ఆ టెలిగ్రామ్ కాగితాన్ని అందుకుంది. ఆ అమ్మాయి వెనుదిరిగింది. జనాల చూపులకు సిగ్గుతో కందిపోయి, కండ్లు ఏడవడానికి సిద్ధంగా ఉన్నాయి.
డాక్టర్ ఆతృత నిండిన గొంతుతో “దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి”- అందరు ఒకింత మౌనం దాల్చారు. గర్వంగా “ ఇదో సమాచార పత్రం. నేనిది ప్రభుత్వం నుంచి అందుకున్నాను” అంటూ కాగితాన్ని గాలిలో ఊపి చదవడం మొదలు పెట్టాడు. ” పాత మేయరును తొలిగించాం. అత్యవసరాలేమిటో సూచించండి. తక్కిన ఆదేశాలు తర్వాత” – ఫర్ ది సబ్ ఫర్ఫెక్ట్ సాపిన్. కౌన్సిలర్. అతను ఉబ్బితబ్బిబై పోతున్నాడు. గుండె ఆనందంతో ఉప్పొంగి పోయింది. అతని చేతులు వనుకుతున్నాయి. కమాండర్ మాజీ అనుచరుడు లెఫ్టినెంట్ పికార్డ్ పక్క గుంపులోంచి అరిచే గొంతుతో “ ఆది సరే- ఆ మేయర్ భవనం ఖాళీ చేసి వెళ్లనంటే , నీ కాయితం అధికారం చేస్తుందా?” – అన్నాడు
డాక్టర్ మొఖం పాలిపోయింది. ఒక వేళ వాళ్ళు ఆజ్ఞలు అమలు పర్చి బయటికెళ్ళక పోతే అతను అడుగు ముందుకేయక తప్పదు. అది హక్కు కాదు బాధ్యత. మేయర్ భవనం వైపు బాధ క్రోధం కలెగలిసిన చూపొకటి చూశాడు. శత్రువు తనకు తానుగా తలుపు తెరుస్తాడని ఆశ, కాని అవి మూసుకొనే ఉంది. ఏం చేయాలి? మిలిషియా చుట్టు గుంపు పెరుగుతోంది. కొందరు నవ్వుతున్నారు. ప్రత్యేకించి ఒక ఆలోచన మరింత బాధిస్తోంది. ఒక వేళ తానే గనుక తెగించి దాడిచేస్తే తప్పనిసరిగా తానే ముందు వరుసలో నిలబడాలి. మేయర్ వెర్నెతో అంగరక్షకులు ప్రధానంగా తనకే గురి పెడతారు. ఒక వేళ తను చస్తే పోరాటం అంతమౌతుంది. అంతా ఆఖరవుతుంది. అందులోనూ వాళ్ళు పక్కా గురికాళ్ళు, దెబ్బతప్పరు. ఆ మాట ఇందాకే పికార్డ్ గుర్తు చేశాడు.
అంతే ఒక కొత్తలోచన ఆక్రమించిదతని మనస్సును. అటు తిరిగి పొమ్మె తో “త్వరగా వెళ్లు. వెళ్ళి ఆ నాడి వైద్యుని ఒక గెడకర్ర , ఒక తుండుగుడ్డను నాకు పంపించుమను ” లెఫ్టినెంట్ అలాగే ఆత్రపడ్డాడు. డాక్టర్ గారు రాజకీయ బ్యానర్ చేయనున్నాడు. తెల్లది. అది బహుశ ఆ వృ ధ చట్టపారాయన వాద (నియతివాద)మేయరు మనస్సును సంతృప్తి పర్పవచ్చు
పొమ్మెల్ లెనియన్ గుడ్డ, ఒక బూజు దులిపె కర్ర తీసుకొని వచ్చాడు. ఆ చేత్తోనే నాలుగు దారపు పోసలు. వాటిని మార్సెల్ రెండు చేతుల్తో అందుకున్నాడు. మరోసారి మేయర్ భవనం వైపు అడుగేశాడు. శాంతి పతాకంతో మేయర్ ముందుకెళ్తున్నాడు. తలుపు ముందు నిలబడి ” వెర్నెతో గారూ” – పిలిచాడు. హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. వెర్నెతో ముగ్గురు ఆంగరక్షకులతో గడపలో ప్రత్యక్షమయ్యాడు. డాక్టర్ దిగ్గున ఒకడుగు వెనుకకేశాడు. వెంటనె శత్రువుకు గౌరవపూర్వకంగా నమస్కరించాడు. ఉద్వేగంతో గొంతు తడబడుతుండగా ” సార్ నేను…. ఇప్పుడే నాకొచ్చిన ఆదేశాలను మీకు వివరించాలని వచ్చాను.”
మేయర్ ప్రతి నమస్కారం కూడా చేయలేదు
” సార్ నేను విరమించు కుంటున్నాను. కానీ నేనిది భయంతోనో, అధికారం నుంచి వైదొలిగిన ఆ నీచ ప్రభుత్వానికి విధేయతతోనో కాదని అర్థం చేసుకోవాలి” -మార్సెల్ మాటపూర్తవలేదు. “ రిపబ్లిక్ ఒక్క రోజు కూడా అధికారంలో ఉండి పాలన చేయాలని నేను కోరుకోవడం లేదు. అంతే” – అన్నాడు మేయర్ మార్సెల్ ఆశ్చర్యంతో ఆ ప్రతిబుడయ్యాడు. నోట మాట రాలేదు.
అంగరక్షకులు వెంటరాగా వెర్నెంతో విసావిసా నడిచి వెళ్ళాడు. డాక్టర్ ఒకింత దిగులు పడ్డాడు. మూగివున్న జనం వైపు కదిలాడు. మరో పదడుగుల్లో జనాలను సమీపించెంతలో “హుర్రే రిపబ్లిక్ అన్నింటా విజయాలు సాధిస్తూ పురోగమిస్తుంది” – పెద్దగా అరిచాడు.
మూగిన జనాల్లో ఏలాంటి స్పందన లేదు. ఆయన మళ్ళీ మరో ప్రయత్నం చేశాడు. “ప్రజలు స్వేచ్ఛాజీవులు. మీరంతా స్వతంత్రులు. మీకు స్వేచ్ఛ లభించింది. మీకర్థమయ్యిందా? ఇందుకు మీరు గర్వించాలి” అసంఖ్యాకులైన గ్రామస్థులు కళాకాంతులు లేని ముఖాలతో అతని వైపు చూస్తున్నారు. అతను వారి అలక్ష్యం పట్ల తన వంతుగా కోపంగా చూశాడు. వాళ్ళను ప్రభావితం చేసే పనేదో చేయాలనుకుంటున్నాడు. ఈ నీరసించిన దేశానికి విద్యుత్ ఉత్తేజం కావాలి. ఆతని లక్ష్యానికి మంచి జరగాలి. అతన్ని ఉత్సాహం కమ్మేసింది. పొమ్మెల్ వైపు తిరిగి “ లెఫ్టినెంట్ వెళ్ళు. వెళ్లి కౌన్సిహాల్ లో ఉన్న మాజీ చక్రవర్తి విగ్రహం తీసుకురా. దాంతో పాటే ఓ కుర్చీ కూడా. ” – ఆజ్ఞాపించాడు.
పొమ్మెల్ భుజం మీద సుద్దతో చేసిన చాతి వరకున్న మాజీ చక్రవర్తి నెపోలియన్ 2 ప్రతిమ. మరో చేత కుర్చీ తెచ్చాడు. మార్సెల్ ఎదురెళ్లి కుర్చీ ఆందు కొని దాన్ని ఆక్కడ పెట్టాడు. విగ్రహాన్ని దాని మీదుంచాడు. నాలుగడుగులు వెనుకకు నడిచి ఖంగుమనే గొంతుతో ” ద్రోహి, ద్రోహి నీవిక్కడే పడిపోవాలి. ఈ చిత్తడిలో పడి మట్టి కొట్టుకు పో. ఈ దేశాన్ని నీ పాదాల కింద నలిపి నజ్జు చేశావ్. ఇప్పుడు కాలం ప్రతీకారం తీర్చు కొమ్మంటుంది. లజ్జాకరమైన ఓటమి నిన్ను కౌగలించుకోనుంది. నీవు ఓడి పోయావ్. నిన్ను జయించాం. ప్రష్యన్లకు చిక్కిన ఖైదీవి. నీ కూలిన సామ్రాజ్యపు శిథిలాల మీద రిపబ్లిక్ మొలిచి నిలిచింది. తునకలైన నీ ఖడ్గాన్ని అందుకుంది.” హర్షద్వానాల కోసం ఎదురు చూశాడు. కాని అక్కడ చడిచప్పుడు లేదు. అనాగరిక రైతు జనం నిశ్శబ్దంగా నిలిచారు. కుర్చీలో ఉన్న ప్రతిమ చెంపలను దాటి నిలిచిన కోరమీసాలు. అది ప్రతిమ. అందుకే చలనం లేదు. మంగళి షాపులో చక్కటి మోడల్ గా పనికొచ్చేటట్లుంది. డాక్టర్ మార్సెల్ ను చూస్తున్నట్లుగా నవ్వు. అది చెరగని నవ్వు. కమాండరు వెక్కిరింత నవ్వు.
వాళ్లు ఒకరెదురుగా ఒకరున్నారు. చక్రవర్తి నెపోలియన్ 2 కుర్చీమీద, కమాండర్ మార్సెల్ అతనికి ఎదురుగా మూడడుగుల దూరంలో. హఠాత్తుగా కమాండరు ఉద్రేకం తన్నుకొచ్చింది. ఏం చేయాల్సివుండే? ఈ ప్రజలకు నిశ్చయ విజయ భావన ఏది కలిగిస్తుంది? నడ్డి మీద చేయి వేసుకున్నంతలో అతనికి రివాల్వర్ పిడి చేతికి తగిలింది. ఉషారు లేదు, ఉత్తేజం లేదు. రివ్వున రివాల్వర్ బయటకు లాగాడు. రెండడుగులు ముందుకు కేసి గురి చూశాడు. చచ్చిన చక్రవర్తిని కాల్చాడు. గుండు నుదురులో దిగబడింది. నల్లటి కన్నం ఒక మచ్చలాగా కనబడుతుంది. తర్వాత రెండోది. రెండో కన్నం. తరువాత మూడోది. తరువాత… అలా ఆగకుండా కాల్చి రివాల్వర్‌ను ఖాళీ చేశాడు. నెపోలియన్ కనుబొమ్మలు తుపాకి మందు తెల్లటి బూడిదతో కలిసి పోయాయి. కండ్లు, ముక్కు, కోరమీసాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. రెచ్చిపోయిన డాక్టర తరువాత ఒక్క పిడికిటి పోటుతో ఆ కుర్చీ తిరిగేశాడు. విజయోత్సహాంతో ప్రతిమ మిగిలిన భాగాల మీద కాలు బెట్టాడు. “ ఇంతే ద్రోహులంతా నశించాలి” – బిగ్గరగా అరిచాడు.
అప్పటికి అక్కడ ఏలాంటి ఉత్సాహం వ్యక్తం కాలేదు. చుట్టున్న జనమంతా ఏదో పిచ్చివాడి వ్యవహారాన్ని చూసినట్లు ఆశ్చర్యపోతున్నారు. కమాండర్ మిలిషియా సైనికులను పిలిచాడు. “ ఇప్పుడిక మీరు మీ ఇండ్లకు మరల వచ్చు” – చెప్పి పెద్ద పెద్ద అంగలతో తన ఇంటి వైపు కదిలాడు. పని మనిషి వచ్చి ఆస్పత్రి గదిలో రోగులు మూడు గంటలుగా ఎదురు చూస్తున్నారని చెప్పింది. ఆయన లోపలికి అడుగేశాడు. ముందు రోజు పంపించిన వెరికోస్ వెయిన్స్ రోగులు తిరిగి వచ్చారు. జడ్డిగా ఉన్నా ప్రశాంతంగానే ఉన్నారు. ఆ వృద్ధ రైతు వివరించడం మొదలు పెట్టాడు. “ఇద వచ్చినప్పటి నుండి కాళ్ళలో కిందికి మీదికి చీమలు పారుతున్నట్లనిపిస్తుంది”.
అయిపోయింది.