“రణ నినాదాల” సాక్షిగా

ఇవ్వాళ
వాళ్ళు మన కళ్ళముందు కనిపించకపోవచ్చు
కానీ
నిత్యం మన కంటి పాపలై
పారాడుతున్నారు కదా!

ఇవ్వాళ
వాళ్ళు విషాద గానాలతో
శోకసంద్రంగా మారిండొచ్చు
కానీ
రగిలే “రాగాలాపనలు” ఆపనేలేదు కదా!

ఇవ్వాళ
వాళ్ళు ఓడిపోతూ రాలిపోతుండవచ్చు
కానీ
విజయ గెలుపు కేతనం దించనేలేదు కదా!

ఇవ్వాళ
వాళ్ళు జన ప్రళయంలో అంతగా
మమేకమై ఉండకపోవచ్చు
కాని
ఆశయాల కాలిబాటలు విడవనేలేదు కదా!

ఇవ్వాళ
వాళ్ళ నవయవ్వన విశ్వాసాలు,
కలలు ధ్వంసమైపోవచ్చు
కానీ
ఈ మట్టిని తొలుచుకోనీ పుట్టిన
“రణ నినాదాల”సాక్షిగా
సజీవంగానే ఉన్నాయి కదా!

ఇవ్వాళ
వాళ్ళు జ్ఞాపకాలుగా మారి
జన్మనిచ్చిన తల్లి కడుపు కోతగా మారవచ్చు
కాని
రేపు దిక్కులేని
ప్రతి తల్లి కడుపు పంటగా మొలకెత్తవచ్చుకదా!

ఇవ్వాళ
వాళ్ళు లేవనెత్తిన సమానత్వ సిద్దాంతం
కాలం చెల్లినదని ప్రకటించుకోవచ్చు
కానీ
“ఆకలికి, దోపిడికి” అది ప్రత్యామ్నాయమే కదా!

ఇవ్వాళ
వాళ్ళ “ఊపిరి”లు ఆగిపోయి వుండొచ్చు
కానీ
ఎర్రకారం పీలుస్తూ
శ్వాసించడం మాననేలేదు కదా!

One thought on ““రణ నినాదాల” సాక్షిగా

  1. ఎర్ర కారం పీలుస్తూ శ్వాశించడం మాననే లేదు కదా

Leave a Reply