నల్లమేఘాలు తెల్లబోతాయి
పలుగుపోట్లు కొండ గుండెతో పాటు
మబ్బు మోముకీ గాయాలు చేస్తాయి
ధనమై పొంగితే ఇంధనం
గిరిపుత్రుల చేతిలో సత్తు బొచ్చెగా మిగులుతుంది
మలయం కొండబిడ్డల కళ్ళల్లో మాత్రమే మెదులుతుంది
అవును
నేలతల్లి కడుపు కొస్తే
జీవకోటి కడుపుని కొడుతుంది
అలిగిన మేఘాన్ని అడుగు
తెగిన అడవి గొంతుల చిట్టా
కన్నీరుగా కురిపిస్తుంది
రగిలే ధరణినడుగు
కొండ గాలులను నిశ్వాసించే
తిత్తుల చిరుగుల గాధలు చెప్తుంది
చచ్చిపోయిన అడవిని అడుగు
కడుపున బిడ్డలు రాలి
గదుల్లో తన దుస్తులెలా అయ్యాయో చెప్తుంది
ఇంకా మిగిలివున్న మనుషులనడుగు
వంగిన కాలుగా, రెప్ప తీయలేని కన్నుగా
మళ్ళీ పుట్టిన రేడియేషన్ అసలు నిజం చెప్తారు
అవును!
ఈ తవ్వకం
ఎడారికి రహదారే
కాదంటారా..!?
హ్యాపీ జర్నీ టు నల్లమల డిసెర్ట్