యెండా వాన పొగమంచు నీడల మధ్య సీతాకోకచిలుకలు

హెరిటేజ్ వాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ యిలా రకరకాల గ్రూప్స్ లో చేరి వాళ్ళతో కలిసి తిరగటం మొదలైన కాసేపటికే బోర్ అనుకునేది స్వేచ్ఛాగీతిక. వెంటనే ఆ గ్రూప్స్ ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టేది. కొంత గొడవ. కొంత సపోర్ట్. తనకి సపోర్ట్ గా వున్న వాళ్ళలో కొంతమందిని విమర్శించేది. యిదంతా యెందుకు చేస్తున్నాను రెస్ట్ లెస్ గా అనుకోవటమే కానీ అదేమిటో తెలుసుకోవాలనే కోరికా వుండేది కాదు. తను ప్రతీ చోటా అన్ ఫిట్ అనుకోడానికి ఆమె యింజినీరింగ్ లోని స్కోర్ అడొచ్చేది. పెయింటింగ్ నేర్చుకోవాలని అక్కడ జాయిన్ అయింది. అక్కడా నిలవలేకపోయింది.

యేదో వొకటి నేర్చుకోవాలనుకొని స్పానిష్ నేర్చుకోడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు శశికిరణ్. తన కంటే వొకటో రెండో యేళ్ళు చిన్నవాడు. అతనిలో యిప్పటి వరకు తనెప్పుడూ చూడనివి చాల చూసింది. యిప్పటికి యెన్నో భాషలు నేర్చుకున్నాడు ఆయా భాషల్లోనే ఆయా రచయితల్ని చదువుకోవాలనే కోరికతో. యింగ్లీషులో దొరుకుతున్నప్పుడు అలా చదువుకోవచ్చు కదా మళ్ళీ యీ భాషలు నేర్చుకోవటం యెందుకో అనుకొంది. నువ్వెందుకు స్పానిష్ నేర్చుకుంటున్నావు అని చాల మంది అడిగారు కానీ ఆ మాట శశికిరణ్ అడగలేదు. అదీ చిత్రంగానే అనిపించింది స్వేచ్ఛాగీతికకి.

ఆ రోజు వూరులో నడవటానికి వెళ్ళుతున్నాను అని శశికిరణ్ చెపితే నేనూ వొస్తాను అందామె.

నడుస్తూ నడుస్తూ వో కాఫీ షాప్ దగ్గర ఆగారు.

వాన కురుస్తునప్పుడు కమ్ముకుంటున్న వాసనని గుండెల నిండా నింపుకుంటూ “యిదేం వాసన” అని అడిగింది స్వేచ్ఛాగీతిక.

“మట్టివాసన” చెప్పాడు శశికిరణ్.

“మట్టివాసన” ఆశ్చర్యపడుతూ అందామె.

“వూ.. రోహిణి కార్తె యెండలకి యెండిపోయిన భూమ్మీద మొదటి వాన కురిసినప్పుడు భూసుగంధం చిమ్ముతుంది. ఆ పరిమళానికి మించిన పరిమళం లేదనిపిస్తుంది. నేచురల్ ఫ్రాగ్రన్స్.. లవ్ లీ…” అన్నాడతను.

“నీకివన్నీ యెలా తెలుసు” మరింత ఆశ్చర్యపోతూ అడిగిందామె.

కాఫీ షాప్ కి బయట వున్న వరండాలో చిన్ని టేబిల్ కి అటూయిటూ కూర్చున్న ఆ యిద్దరినీ వాన చల్లదనం మెల్లమెల్లగా కమ్ముకుంటుంది. గాలి లేని వొత్తైన వానని చూస్తూ “నాకూ నా పద్నాలుగో యేట వరకూ చాలా తెలీయవు” నిదానంగా అన్నాడు శశికిరణ్.

“అప్పుడెలా తెలిసింది” ఆసక్తిగా అడిగింది.

“అప్పడే నేను నన్ను పెంచడానికి వొప్పుకోలేదు. పెరగటాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను”

“యెవరి నుంచి” కుతూహలంగా అడిగింది స్వేచ్ఛాగీతిక.

“యింకెవరి నుంచి నా పేరెంట్స్ నుంచి. మా అమ్మానాన్నగారు యిద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు. వుద్యోగస్తులు. వాళ్ళిద్దరికీ అన్నింటి కంటే పెద్ద వుద్యోగం నన్నూ మా అక్కని పెంచటం. క్లాస్ పుస్తకాలే లోకంగా వున్న స్కూల్, యింట్లో పెరుగుతుండే వాళ్ళం. మా అక్కకి ట్రెక్కింగ్ యిష్టం. యెప్పుడూ వెళతానని అడుక్కోవటమే. అక్క గొడవ భరించలేకో తామూ పిల్లల యిష్టాలని వొప్పుకుంటామని చెప్పడానికో తెలీదు కానీ ట్రెక్కింగ్ ని ఆర్గనైజ్ చేసే వొక చిన్న గ్రూప్ తో పంపించటానికి వొప్పుకున్నారు. మా అక్క భలే సంతోషపడింది. అక్క బయలుదేరే రోజు మా నాన్నగారు “నాకూ ట్రెక్కింగ్ అంటే చాల యిష్టం. మనిద్దరికీ ఫీజ్ కట్టాను” అంటూ అక్క వెంట వెళ్ళారు. నాన్నగారికి అప్పటికే మోకాళ్ళు నొప్పులు వున్నాయి. డయాబెటిక్. అయినా వెళ్ళారు. పాక్కుంటూ పాక్కుంటూ ఆ కొండలు యెక్కడానికి ఆయన తన కూతురు వెంట వెళ్ళింది ట్రెక్కింగ్ అంటే యిష్టమై కాదు. వారి ఆసక్తి అంతా అక్కడ తన కూతురు యెవరి ప్రేమలోనూ పడకుండా చూడటానికి. అదీ మా పేరెంట్స్ భయం. అదీ వాళ్ళకి వాళ్ళ పెంపకం మీదున్న నమ్మకం. యేమైనా అంటే పరిస్థితులు బాలేవు అంటారు. మా అక్కకి నాకు ఆ విషయం అర్ధం అయ్యాక చదువు తప్పా మరేం వొద్దు అనే మా పేరెంట్స్ కి మా అక్క మౌనంగా సరండర్ అయిపోయింది. ఆ పెంపకం నుంచి నేను బయటకి మెల్లగా వొచ్చేసాను. మా అక్కా నేనూ కూడా యింజినీరింగే చదువుకొన్నాం. తేడా యేమిటంటే అక్కకి యేది యిష్టమో తెలుసుకునే ఛాయిస్ లేకుండా చదవాల్సి వొచ్చింది. నేను బై ఛాయిస్ గా చదువుకొన్నాను” అన్నాడు.

“మీ అక్క యిప్పుడేం చేస్తున్నారు?”

“పిల్లల్ని పెంచుతుంది గ్రేడ్ ల కోసం మా పేరెంట్స్ కన్నా మరింత యెక్కువ కమిట్మెంట్ తో” అని నవ్వాడు.

ఆడర్ చేసిన కాఫీ తీసుకొచ్చిన స్టీవర్డ్ ని ‘మీదే వూరు’ అని అడిగింది స్వేచ్ఛాగీతిక.

ఆమె చెప్పిన వూరు యెక్కడో అర్ధం కాలేదు. ఆ విషయాన్ని మళ్ళీ అడగకుండా ‘యేం చదువుకున్నారు’ అని అడిగింది.

‘యింజినీరింగ్’ అందామ్మాయి.

కొన్నాళ్ళుగా దారమ్మట పోయే వాళ్ళని కూడా ఆపి మీరేం చదువుకున్నారు అని అడగాలని అనిపిస్తోంది స్వేచ్ఛాగీతికకి. యీ మధ్య యెక్కడికి వెళ్ళినా వాళ్ళ వివరాలని అడగటం శశికిరణ్ ని చూసే అలవాటైయింది. యిలా అపరిచితులు తనని అడిగితే తను చెపుతుందా?! యీ అడిగే పవర్ యెక్కడ నుంచి వొస్తోంది?! తను పొటంషియల్ కన్స్యూమర్. గెస్ట్. చాలా చోట్ల యింజినీరింగ్ చదివిన వాళ్ళు రిసెప్ష నిస్టుల్లా, సేల్స్ బాయ్స్ లా డెలివరీ బాయ్స్ – గర్ల్స్ గా, అపార్ట్మెంట్స్ లో సూపర్వైజర్స్ గా జాబ్స్ చెయ్యటం తనీ మధ్య గమనించింది. యిలా చాల కాలం నుంచే జరుగుతుందని అర్ధం అవుతోంది.

“యింజినీరింగ్ చదివితేనే మంచి జాబ్ అనే కదా మనకి చెప్పేవారు. కానీ మరి అందరికీ అలా లేదేమిటి?!” అందామె.

“నిజమే కదా… మంచి జీతం. అమెరికా వెళ్ళొచ్చు. యింజినీరింగ్ చదివిన వాళ్ళు రిటైర్ అయ్యేవరకూ కూడా తమ పేరెంట్స్ సంపాదించలేనిది వొక్క యేడాది పేకేజ్ లోనే అందుకున్నవాళ్ళున్నారు. వేరే దేశాలకి వెళ్ళి పనిచెయ్యటం వల్ల డాలర్స్ తో వచ్చే యెకానమీలో పెద్ద మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది కానీ మన యెకానమీ పెరుగుదలలో డొల్లతనం వుంది. సర్వీస్ రంగంలో తప్పా వొక స్టేబుల్ యెంప్లాయిమెంట్ ని గవర్నమెంట్స్ యెక్కడిచ్చాయి?! అయినా యింజినీరింగో మరేదైనా చదువుకున్నవాళ్ళు యింకేం పని చెయ్యకూడదా?! చదువు అనేదే వుద్యోగం కోసమనేది దాదాపు అందరిలో వుంది. నిజానికి అది పెంచిపోషించిన అభిప్రాయమనిపిస్తోంది. నీకూ అలాంటి అభిప్రాయముందా యేమిటి” అడిగాడు శశికిరణ్.

ఆ మాటలకి ఆమె ముఖం మీద వాననీడ కమ్ముకుంటుంది మెల్లగా.

కురుస్తోన్న వాన యిచ్చిన చిన్నిచిన్ని నీటి కాలువల్ని చూస్తూ టేబిల్ మీద వున్న నేప్కిన్ పేపర్లతో చిన్ని చిన్ని పడవలు చేసి ఆ నీళ్ళల్లో వదులుతున్నాడు అతను. తనకి వున్నట్టు స్టేబుల్ జాబ్ లేదు. తనకి వొకప్పుడు వున్నట్టు టీమ్ లీడర్ గా యెదగాలన్న కోరిక అతనికి లేదు. యితనికి జ్ఞానాన్ని పెంచుకోవటం ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్న కోరిక మాత్రం వుంది. భ్రష్టు పట్టిపోతున్న విషయాల్ని తన పరిధిలో బాగుచేసుకోడానికి తనతో పాటు కలిసి వచ్చేవారితో నడవటం. యెంత అవసరమో అంతే సంపాదించటం యిలా తన జీవితాన్ని బాధ్యతగా యిష్టంగా బతుకుతోన్న అతనికి వున్న సంతోషం తనకి లేదు. యిదంతా యెలా అతనికి సాధ్యమయింది?!

వాన వొస్తున్నప్పుడు “యింట్లోకి రండి రండి” అని అరిచి బలవంతంగా తమని యింట్లోకి లాక్కొచ్చే అమ్మకి తడిస్తే జలుబు చేస్తే, జ్వరం వొస్తే స్కూల్ పోతుందనే బాధ తప్పా తాము యే రోజూ వానని కానీ మంచుని కానీ పుస్తకాల్ని బొమ్మలు వేయ్యటాన్ని కానీ చివరికి ఆడుకోవటమూ కూడా లేకుండా చేసి తనని తన అక్కని యింజినీర్స్ గా తయ్యారు చేసారు. తన చెల్లెలు అమెరికా వెళ్ళిపోయింది వుద్యోగమంటూ. తనేమో బెంగుళూరు ఐటి హబ్ లో చేరిపోయింది. బోలెడు జీతం టెక్నాలజీ అందిస్తోన్న అన్ని సౌకర్యాలు ఫుడ్ అంతా బానే వుంది. రొటీన్ బోర్. హాలిడే కి వెళ్ళినప్పుడు ఆ డిజైన్ హాలిడే విసుగొచ్చింది. మెల్లగా మొదలయింది “యేమిటీ జీవితం”?!!

అదే భూమి అదే ఆకాశం తనూ నేను జీవిస్తుంది. అతనికి అదే ఆకాశం అదే భూమి యెందుకంత సంతోషాన్నిస్తున్నాయి. జీవితం రంగురంగుల పుష్పగుచ్ఛంగా అతనికి యెలా తోస్తోంది?!

“నడుద్దామా?!” అడిగాడు శశికిరణ్ .

నడవటం మొదలుపెట్టారు.

“అసలిదంతా యెలా మొదలయింది?!” ఆలోచిస్తోంది స్వేచ్ఛాగీతిక వొక్కో విషయం గుంపుగా గుర్తురాసాగాయి.

**

స్వేచ్ఛాగీతిక అమ్మానాన్న ప్రకాష్, భార్గవి. స్వేచ్ఛాగీతిక అక్క క్రాంతి. ప్రకాష్ తమ్ముడు సురేష్, మరదలు అరుణకుమారి. వాళ్ళ పిల్లలు అల, గౌతమ్. అలకి పదవ తరగతిలో B గ్రేడ్ వొచ్చింది.

అరుణ కుమారి ఫేస్ బుక్ లో తన స్నేహితుల జాబితాలో వున్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు వాళ్ళ పిల్లలకి వచ్చిన A+ అని, A గ్రేడ్ పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్స్ కి వొస్తోన్న అభినందనలని లైక్స్ ని, లవ్స్ ని చూస్తూ రగిలిపోయింది అరుణ కుమారి. అలా పోస్ట్ చేసుకొనే అవకాశం లేకుండా చేసిన అల మీద ఆమెకి వుప్పెనలా కోపం వచ్చింది. అల మీద విరుచుకుపడింది. సురేష్ దాదాపు వొణికి పోయాడు. యింట్లో వుండి చదువుకుంటే A గ్రేడ్ రాదని, దృష్టంతా ఫోన్ మీదే వుంటుందని చదువుని నిర్లక్ష్యం చేస్తుందని అలని హాస్టల్లో చేరిపించింది అరుణకుమారి.

హాస్టల్ లో వుండటం అలకి అస్సలు యిష్టం లేదు. పైగా చదువు, భోజనం, నిద్రా తప్పా మరో వైపు చూడడానికి వీలులేని హాస్టల్. స్వేచ్ఛాగీతిక, క్రాంతి కూడా అదే హాస్టల్లో చదువుకొన్నారు. అక్కడే అన్నిరకాల పరీక్షలకి యిచ్చే కోచింగ్ తీసుకొన్నారు. యింజినీరింగ్ లో సీట్స్ కి రావాల్సిన ర్యాంక్ స్వేచ్ఛాగీతికకి, క్రాంతికీ వచ్చాయి.

ఆ హాస్టల్ లైఫ్ లో యిమడలేక యింట్లో వాళ్ళని వొప్పించలేక స్వేచ్ఛాగీతికకి మానసికంగా యిబ్బంది పడింది. చాల మంది పిల్లల్లానే క్రాంతి మాత్రం మొదట్లో కొద్దిగా యిబ్బంది పడినా తరువాత అలవాటు పడిపోయింది. తమ బంధువుల పిల్లల్లో కొంతమందికి, తన క్లాస్ మేట్స్ లో కొందరికి హాస్టల్ లైఫ్ అంటే చాల యిష్టం. అక్కలా అలవాటు పడలేక, బంధువుల పిల్లలా యిష్టమూ లేక తనలో తానే నలిగిపోయింది స్వేచ్ఛాగీతిక. తల్లి మాట, తన తండ్రి యెందుకు జవదాటరో స్వేచ్ఛాగీతికకి యెప్పుడూ అర్ధం అయ్యేది కాదు. అలానే పిన్ని మాట తప్పా ఆ యింట్లో యెప్పుడూ బాబాయ్ మాటా వినపడదు. యెందుకనో తెలిసేది కాదు.

హాస్టల్లో చేరిన అల సెలవలకి యింటికి వచ్చినప్పుడు వొక రోజు కనిపించకుండా పోయింది. రోజంతా వెతికి వెతికి చివరికి పోలీస్ కంప్లైంట్ యిచ్చారు.

ఆ తరువాతి రోజు వచ్చిన మీడియా వాళ్ళు అరుణ కుమారీకి వేస్తోన్న ప్రశ్నలని వింటున్నప్పుడు స్వేచ్ఛాగీతిక ముఖంలో స్పష్టంగా కనిపిస్తోన్న మార్పుని గమనించిన తండ్రి కళ్ళు దించుకున్నారు.

వాటిని శ్రద్ధగా వింటున్న భార్గవి “వీళ్ళెప్పుడూ యింతే తల్లుల పెంపకం అనేస్తారు. నువ్వు గమనించావో లేదో బయట ప్రపంచంలో ఆడపిల్లలకి యేమి జరిగినా లేదా వాళ్ళు ప్రేమించిన వానితో వెళ్ళిపోయినా తల్లిని మాత్రమే అంటారు. ఆ తల్లి వర్కింగ్ వుమెన్ అయినా కాకపోయినా తల్లినే దోషిగా నిలబెడతారు. తండ్రిని నిలబెట్టటం తక్కువ. అందుకే నేను పిల్లల పెంపకంలో నా మాటే ఫైనల్ అని పిల్లలు పుట్టినప్పుడే మీకు చెప్పేసాను. పిల్లలు ఐదో క్లాస్ కి వస్తున్నప్పుడే పిల్లలని యింజినీరులు, డాక్టర్స్ అవ్వాలని వొత్తిడి చెయ్యొద్దని అప్పటి వరకూ మనిద్దరం స్టేజ్ లు యెక్కి చెప్పే అభ్యుదయ పాఠాలని, అలాంటి మాటల్ని యింట్లో పిల్లల ముందు మాటాడకూడదని కూడా చెప్పాను. పిల్లలు యే విధమైన మీటింగ్స్ కి తీసుకుపోరాదని అన్నాను. యింట్లో వున్న పుస్తకాలు పిల్లలకి పరిచయం చెయ్యకూడదని దాచేసాము. మాలోని చదువుకునే అలవాటుని మెల్లగా టీవీలకి అలా అలా ఫోన్ కి సోషల్ మీడియాకి మారిపోయింది. అంత కట్టడిగా వుండటం వల్లే మన పిల్లలు బాగా చదువుకోగాలిగారు. అన్నానని కాదు కానీ అరుణ తన పిల్లలని మేం పెంచినంత డిసిప్లీన్ గా పెంచలేదు” అంది భార్గవి.

తలూపుతోన్న తండ్రిని బిత్తరపోయి చూస్తోంది స్వేచ్ఛాగీతిక.

తల్లి తండ్రి కొత్తగా కాస్త దొంగగా కనిపించారు స్వేచ్ఛాగీతికకి.

వొక్క సారిగా గాలి ఆడని గదిలో చాల కాలంగా కూర్చున్నట్టు అనిపించింది స్వేచ్ఛాగీతికకి.

మెల్లగా బయటకి వచ్చింది.

“యెక్కడికి” తల్లి గొంతు వినిపిస్తోంది. ఆగలేదు స్వేచ్ఛాగీతిక.

నడుస్తోంది మెల్లగా బయటకి. యింటి ప్రహారీగోడ దాటుతుండగా “మీరు అల వాళ్ళ కజిన్ కదండి” అని వినిపిస్తే పక్కకి చూసింది.

వో పదిహేనో పదిహేడో యేళ్ళుంటాయి.

యేమిటన్నట్టు చూసింది.

“అల యింట్లో యీ కవర్ యిమ్మని చెప్పిందండి. యిద్దామని వచ్చాను. యీ హడావిడి చూసి నన్ను రెండు బాదుతారేమోనని దడుచుకొని ఆగిపోయాను” అన్నాడు.

ఆ కవర్ తీసుకు వెళ్ళుతుంటే “మీడియా వాళ్ళకి యివ్వకండి. యిప్పటికే అంతా రచ్చరచ్చ చేసేసారు.” అన్నాడు.

“వూ.. యింతకీ మీరేమిటి? మీరెవరూ?” అని అడిగింది.

“ఫిఫ్త్ క్లాస్ వరకూ వొకే స్కూల్ అండి. నాపేరు ప్రవీణ్.”

“లోపలికి రండి”

“వొద్దులేండి. యిక్కడే వుంటాను. నేను టీవీలో కనిపించానంటే మా నాన్న బాదుతాడు” అన్నాడు.

“యేమిటో యీ పిల్లవాడు బాగా దెబ్బలు తింటున్నట్టున్నాడు” అనుకొంటూ యింట్లో కి వెళ్ళి పిన్నిని లోపలికి పిలిచి ఆ కవర్ యిచ్చింది.

అమ్మా, నాన్నగారు,

మా భవిష్యత్ కోసం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చక్కని హ్యూమన్ బీయింగ్ అవ్వాలని మీరు అంటుంటారు. అలానే మా భవిష్యత్ ని మేమే నిర్మించుకోవాలని అంటుంటారు. మా భవిష్యత్ ని కంస్ట్రక్ట్ చెయ్యడానికి మాకు మెట్ల వైపుకి వెళ్ళే దారి చూపించాల్సిన మీరు మీరే దారిగా మారిపోతే యెలా? మీరే బస్సు యెక్కిస్తారు. మీరే బస్సు దగ్గరకి వస్తారు. కాపలానా… ప్రేమా… మా సామర్ద్యం మీద చుట్టూ వున్న పరిస్థితుల మీద అపనమ్మకమా?! పరిస్థితులు బాగులేవంటారా?! అందరమూ అవే పరిస్థితుల్లో వున్నాం కదా? మాకు వీటిని అర్ధం చెయ్యించాలి కానీ యిలా పెంపుడు జంతువుల్ని చేసేస్తే యెలా?! ఫోన్ తో పాటే పుట్టిన జనరేషన్ మాది. యీ ఫోన్స్ యిచ్చే వేగవంతమైన యింఫర్మేషన్ కోసం మా తరం యెదురు చూస్తోంది. ట్రోలింగ్ లా ప్రతి రోజు ఫోన్ కు అడిక్ట్ అయిపోయామనే నస యింట్లో. అఫ్ కోర్స్ మోబైల్ యీజ్ యె మేగ్నైట్. అవును అయస్కాంతంలా కట్టి పడేస్తోంది.

మమ్మల్నేనా?!!

“వాట్సాప్ లో బోలెడన్ని గ్రూప్స్ వాటిని చూసుకోవటం వాటిని డిలీట్ చెయ్యటం ఫేస్ బుక్ లో పోస్టింగ్స్ మెస్సెంజర్ కాల్స్ చాటింగ్ యెక్కువ టైం స్పెండ్ చేస్తుంది నిజానికి మీ పెద్దవాళ్ళే. వుద్యోగం చేస్తూ, ఆఫీసుల్లో డ్రావ్ చేస్తూ బస్సుల్లో ప్రయాణం చేస్తూ, యెఫ్ బి చూస్తూనో, చాటింగ్ చేస్తునో, ఫోన్ మాటాడుతూ కనిపించే పెద్దవాళ్ళు యెందరో. నేనేదో ప్రేమలో పడతానని మీ భయం. నేనెలా నమ్మకాన్ని యివ్వగలను?

నా ఆసక్తి అంతా చదువుకోవటం నాలెడ్జ్ ని పెంచుకోవటం యీ పర్యావరణంని కాపాడుకోవాలనే ఆసక్తి, యిష్టం. యస్.. ఐ లవ్ యెంటర్‌టేన్‌మెంట్.

గ్రేడ్స్ తెచ్చుకోవాలనే ఆసక్తి, నీ స్నేహితులో, బంధువులో పిల్లలకి యేయే గ్రేడ్స్ వచ్చాయనో లేదా పలాన యూనివర్సీటీలో సీట్ వచ్చిందనో డాక్టర్స్ యింజినీర్స్ అవుతున్నారని వాళ్ళతో పోటీగా నన్ను చదవమంటే యెలా?! నాకేమనిపిస్తుందంటే మీకు నా కెరీర్ మీద ఆసక్తి కంటే నన్ను మీ ప్రస్టేజ్ గానే చూస్తున్నట్టు అనిపిస్తోంది. యింతకు ముందు యెప్పుడైనా పప్పీని పెంచుకుందాం అంటే వద్దనే అమ్మా, తన ఎఫ్.బి ఫ్రెండ్స్ వాళ్ళ యిళ్ళల్లో ని కుక్కపిల్లల మీద పోస్ట్ పెట్టటం చూసి పెట్ ని తెచ్చి పోస్టింగ్స్ పెట్టింది. రోజూ వండుకునే వంటలు, యింట్లో వాడుకునే వస్తువులు ప్రతీదీ పబ్లిక్ ప్రదర్శనే. యిదిగో యిది మేం కొనుక్కున్నాం అని పెట్టదు.. దాని చుట్టూ వొక కథ అల్లుతుంది. మన యింట్లో ప్రదర్శనకి అతీతం కానిదేది లేదు. వాటిల్లో నేనూ, మా తమ్ముడూ కూడా భాగమే.

యిప్పుడు చెప్పండి ఫోన్ కి అడిక్ట్ అయింది యెవరు?!

మీకు లాయల్ గానే వుంటాను. కానీ యెసట్ట్ గానో కాపిటల్ గానో వుండాలని లేదు.

యీ యిల్లు నాది కూడా. ప్రతిరోజూ నేనీ యింట్లో ప్రతి దాంట్లో భాగం కావాలి. ప్రతీ రోజూ అమ్మానాన్న తమ్ముడ్ని చూడాలి. మాటాడాలి. అరుచుకోవాలి. గారాబాన్ని పొందాలి. సెలవలకి వచ్చీపోయే అతిధిగా వుండాలని లేదు. నాకు మన యిల్లు కాస్త చిందరవందరగానో అప్పుడప్పుడూ నీట్ గానో సర్దుకున్న యిల్లు కావాలి. వాళ్ళతో వీళ్ళతో పోల్చకండి. అలా క్లాస్ పుస్తకాలే చదువుగా వుండే హాస్టల్ గోడల్ని లేదా తామున్న చోటునే సంబరంగా, స్నేహంతో నింపుకునే యిష్టం ఆసక్తి వాళ్ళకి వుండొచ్చు. నాకు రోజూ మనింటికి పనికి వచ్చే నిర్మలక్కతో, కూరలు తెచ్చే మామ్మతో యిలా అందరితో మాటాడాలని వుంటుంది. మన యింటి గోడలపై బొమ్మలు వేసుకోవాలి. యేమో ముందుముందు నేనూ మారొచ్చేమో మీరు కోరుకున్నట్టు. యిప్పుడు మాత్రం నేనా హాస్టల్లో వుండలేను.

యింట్లో వుండే చదువుకుంటాను. హాస్టల్ కి పంపనూ అంటేనే యింటికి వొస్తాను.

మీ,
అల.

కాసేపు అంతటా నిశ్శబ్దం.

“నీకు ముందు నుంచి చెపుతున్నాను దానికి యిష్టం లేదని” నిష్టూరంగా అన్నారు సురేష్.

“దాని భవిష్యత్ కోసమే కదా. అయినా వుంటానంది కదా నచ్చచెప్పినప్పుడు. రానీ కాళ్ళిరగొడతాను. రమ్మనమన్నానని చెప్పు ఆ కుర్రాడికి. యింతకీ ఆ కుర్రాడు యెవరో గుర్తు లేదు” అంది అరుణకుమారి.

అల వుత్తరానికి వున్న చోటునే నిశ్చేష్టగా నిలబడిపోయిన స్వేచ్ఛాగీతిక యిదేమిటి అల తనకింత అపరిచితురాలా అనుకొంది.

ప్రవీణ్ కి చెప్పింది స్వేచ్ఛాగీతిక.

*

కాసేపటికి అల వచ్చింది.

అలని వొక్క మాట కూడ అనకుండా చుట్టూ వున్న వాళ్ళు అరుణకుమారీని కంట్రోల్ చేసారు.

నిన్నటి నుంచి కనిపించని అలని చూడగానే తమ్ముడు గౌతమ్ దగ్గరకి వొచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు.

కొమ్మ మీద నుంచి వుడుత పిల్ల యవ్వనం వొంటి మీదకి దూకినట్టుగా చిన్నపిల్ల గా కనిపిస్తోన్న యీ పిల్లలోని యీ లోతైన చూపేమిటో అర్ధం కాలేదు స్వేచ్ఛాగీతికకి. పదహారేళ్ళ పసితనం వదలని అల వైపు చూపుల్ని అప్పగించి చూస్తుండిపోయిందామె.

“చెప్పొచ్చుగా?! నువ్వు వుంటాను అంటేనేగా వుంచాను?” లాలనగా అడిగింది అరుణకుమారి.

“యెప్పుడు యెలా తన స్వరాన్ని మార్చాలో ఆమెకి చాల బాగ తెలుసు. అంతే కాదు తన ప్రవర్తనలో పొరపాటుని వొప్పుకునే స్వభావమూ కాదామెది” అనుకొంది స్వేచ్ఛాగీతిక. యిదీ కొత్తగానే అనిపించింది స్వేచ్ఛాగీతికకి.

“రేపు మీరంతా వొక్క సారి మా ఆఫీస్ కి రండి. కౌన్సిలింగ్ తీసుకోండి” అన్నారు చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్.

యింత బతుకూ బతికి మీ నుంచి వినాలిప్పుడు పిల్లల పెంపకం గురించి అనుకొంది అరుణకుమారి.

యిల్లంతా ఖాళీ అయి భార్గవి, అరుణకుమారి ఫ్యామిలీ మాత్రమే మిగిలారు.

వదిన గారి ముందు తనొక ఫెల్యూర్ తల్లిలా నిలబడాల్సి రావటం అరుణకుమారి మనసుని చెద తొలిచినట్టు తొలిచేస్తోంది.

ఆ విషయాన్ని గమనించిన ప్రకాష్ “పిల్లల పెంపకం యేమాత్రం తేలిక కాదు. వాళ్ళ భవిష్యత్ కి యేది వుపయోగమో, యేది అభివృద్దో తెలియటం తేలిక కాదు. వాళ్ళని వాళ్ళ యిష్టానికి వదిలెయ్యాలా? నడుస్తోన్న సమాజంతో నడిపించాలా?! కొన్ని కొంత మందికి సూట్ అవుతాయి. వీళ్ళని అనుకున్నట్టు చదివించగలిగాము. పెద్దదానికి పెళ్ళి చెయ్యాలని యెంతో కాలంగా ప్రయత్నిస్తున్నాం. యే సంబంధమూ తనకి నచ్చటం లేదు. యిష్టమో కాదో మాకనవసరం. మీకు మంచి వుద్యోగాలు వొస్తాయి చదవండి అంటే యేదో చదివేశారు. మీకీ పెళ్ళి మంచిదని బలవంతపు పెళ్ళి చెయ్యలేము కదా. వాళ్ళు చేసుకోరు. యిక గీతూకి యీ వుద్యోగం పట్ల విపరీతమైన అసహనంగా వుంటుంది. వాళ్ళ అమ్మకి ఆ జాబ్ మానడానికి వీలులేదంటుంది. పెళ్ళి అయ్యేవరకేనా జాబ్ చెయ్యమంటుంది. పిల్లల పెంపకం యిప్పటి పేరెంట్స్ కి అంతులేని పెంపకంగా మారిపోయింది. వొకప్పటి కంటే అమ్మలు మరింత అలసిపోతున్నారు. యిదేదో ఫేల్యూర్ అనో సక్సస్ అనో అనుకోనక్కరలేదు. యిక మేం అంతా మీయిష్టం అనటం వెనుక యేముందో అందరికీ తెలిసిందే. “చినుకులు, చిరుజల్లులు కురిసినప్పుడు చిన్నిమడుగులై పారుతున్నప్పుడు కేవలం కాగిత్తప్పడవలు చేసిచ్చి బుజ్జిబుజ్జి ఆనందాలని పంచే వ్యక్తి నాన్న. వరదలు ముంచెత్తినప్పుడు నిబ్బరంగా కొయ్యపడవై అగాధాలని దాటించే వ్యక్తి అమ్మ. సో కాల్డ్ సొసైటీ లో నాన్నలందరూ యెస్కేపిస్టులే. అమ్మలందరూ మెటీరియలిస్టులే” అన్నారు.

అలా వో ట్రాన్స్ లో వున్నట్టు మాటాడుతోన్న తండ్రి వైపు కొత్తగా చూస్తున్నట్టు చూస్తోంది స్వేచ్ఛాగీతిక.

యీ తండ్రి తనకి కొత్త.

“అవును.. తను ఫ్రస్టేట్ అవుతూనే వుంది. కానీ తనకేం కావాలో కూడా తెలియటం లేదు. మెదడుకి గంతలు కట్టటం యెప్పుడు మొదలయిందో తెలుసుకోవాలా?! యేమో..!!” అనుకొంది మనసులో.

స్వేచ్ఛాగీతికకి, తను వొత్తిడికి గురైన ప్రతీ సారీ తను పేపర్ తో చేసి దాచుకున్న సీతాకోకచిలుకకి తన మనసులో వున్నవన్నీ చెప్పుకొని గాల్లోకి యెగరవెయ్యటం యీ మధ్యే అయిన అలవాటు. లార్వా నుంచి గొంగళి పురుగై సీతాకోకచిలుకగా మారే క్రమంలో వున్న తనకి ముందు యేమి కావాలి అన్నది తెలియకపోవటం కన్నామనుష్యులతో భాంధవ్యాలు యెలా యేర్పార్చుకోవాలో తెలియకపోవటం చాల భయం కలిగించే సమస్య కదా.. యితరులతో తోటి తనతోతానే బాంధవ్యం యేర్పరచుకోవటం శశికిరణ్ నుంచి నేర్చుకోవాలి అని అనుకొందామె.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

39 thoughts on “యెండా వాన పొగమంచు నీడల మధ్య సీతాకోకచిలుకలు

  1. ఈ కాలపు తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే కథ. బాగా రాసారు. అభినందనలు పద్మాజీ..

  2. హృదయ పూర్వక కృతజ్ఞతలు కుమారా గారు.

  3. బావుంది పద్మా.ఈ రిజల్ట్స్ వచ్చే రోజుల్లో రావటం కూడా బావుంది.పిల్లల పెంపకానికి తల్లులే బాధ్యులుగా నిలబడాల్సి రావటం వాళ్ళను పిల్లల పట్ల కఠినంగా మార్చటం వాస్తవం.
    అభినందనలు.

    1. హృదయ పూర్వక కృతజ్ఞతలు కాత్యాయని గారు.

  4. కథ బావుంది పద్మా.ఉ రిజల్ట్స్ వచ్చే రోజుల్లో రావటం కూడా బావుంది.పిల్లల పెంపకానికి తల్లులే బాధ్యులుగా నిలబడాల్సి రావటం వాళ్ళను పిల్లల పట్ల కఠినంగా మార్చటం వాస్తవం.

  5. నన్ను పెంచటాన్ని ఒప్పుకోలేదు పెరగటాన్ని నాచేతుల్లోకి తీసుకున్నాను….ఒక వాక్యంలో మొత్తం సంగతిని కూర్చేశారు… చాలా బాగుంది

    1. శివా గారు, భలే పట్టుకున్నారు. థాంక్యూ అండి.

  6. You have touched upon very contemporary topics, Padma garu. Well written. Most of us can connect with the theme as individual and parents.

  7. ముందు యేమి కావాలి అన్నది తెలియకపోవటం కన్నా మనుష్యులతో భాందవ్యాలు ఎలా యెలా యేర్పార్చుకోవాలో తెలియలేని చాలా భయం కలిగించే సమస్యల్లో ఉన్నాము మనం…
    బాగా చెప్పారు మేడం

    1. మీ అభిప్రాయం ని పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు Bollampally Prabhu గారు.

  8. స్వేచ్ఛాగీతికకి తగిన బాణీ సమకూరుతుందనే ఆశిద్దాం.. తండ్రి ‘ట్రాన్స్ ‘లోకి వెళ్లినట్టయ్యి, కన్ఫెస్ కావడం అనుకూల సంకేతాల్లో ఒకటి కదా! అవునూ.. స్వేచ్ఛాగీతిక, ఆమె అక్క క్రాంతి పేర్లు రెండూ అమ్మానాన్నల ప్రత్యేకతా ప్రదర్శనకే పెట్టారు తప్ప పిల్లలు ఆ పేర్లకు సార్థకత తేవాలన్న ముచ్చటతో కాదని పరోక్షంగా చెప్పారనుకుంటా. ముఖ్యంగా స్వేచ్ఛాగీతిక పేరు! అలా కాకపోతే అది మీ మక్కువ కావాలి!

  9. U.Surya Chandra Rao garu,
    స్వేచ్ఛాగీతికకి మీరు అన్నట్టు చక్కని రాగం దొరుకుతుందనే ఆశిద్దాం. పేర్లు కథలో భాగమే కదండి. థాంక్యూ సర్.

  10. చాలా బాగుందండీ కథ. ముఖ్యంగా మీరు రాసిన తీరు నచ్చింది చాలా

    1. Sridevi Somanchi గారు, హృదయ పూర్వక కృతజ్ఞతలండి.

  11. తమ సంతానాన్ని తమ assets గా, Capital గా, భ్రాంతించే మధ్యతరగతి మానసిక చాపల్యం పై, వెల్లువెత్తిన సోషల్ మీడియా దౌర్భాగ్యపు, దౌర్బల్యపు జ్ఞాన సంచయం పై ఎంత సున్నితంగా, సునిశితంగా ఏం దెబ్బ కొట్టారండి.. తిరిగి మళ్ళీ పైకి లేవలేనంత మధ్య తరగతి జీవుల దొక్కల్లో కుళ్ళబొడిసారండి .. మెత్తగానే కథని నడిపి సర్వులూ ఆలోచించాల్సిన చాలా తీవ్రమైన, ప్రస్తుతం బాగా కలవర పరచుతున్న ఒకానొక సామాజిక సమస్యను అత్యంత ప్రతిభావంతంగా సమాజం ముందు పెట్టారు.. తండ్రి confession ఒక అశక్తతలోంచి వచ్చినా నిజాల్ని నికార్సుగా బయల్పరచింది.. ఇక.. వాననీడ, మెదడుకు గంతలు .. మీరే రాయగలిగిన పదబందాలు .. “యెండా వాన పొగమంచు నీడల మధ్య సీతాకోకచిలుకలు” ఎంత కవితాత్మకంగా ఉందో అంతే గమనాత్మకంగా ఉన్న మీ కథనం ఆకట్టుకుంటుంది .. Hearty Congratulations.

    1. Thimsaa Pc garu, కథలోని జీవితాన్ని జీవనాన్ని యెత్తి పట్టి మీరు చెప్పిన తీరు నాలో భలే వుత్సాహాన్ని కురిపించింది. నాలో మరింత ధైర్యంని నింపింది. హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

  12. పందిరి తీగను అల్లుకోవాలని ప్రయత్నిస్తే ఫలితం ఎలా వుంటుందో చాలా బాగా చెప్పారు. అభినందనలు

    1. హృదయ పూర్వక కృతజ్ఞతలు పక్కి రవీంద్ర నాథ్ గారు.

  13. కధ చాలా బావుంది.. ఈ రోజుల్లో పిల్లలని ముఖ్యంగాఎంత ఆడ పిల్లలని ఎంత నిరంకుసంగా పెంచుతారో బాగాచెప్పారు. అంతకన్నా చదువుల్లో , మిగతా చాలా విషయాల్లో వాళ్లకి స్వేచ్ఛ లేకుండ చేయడం కూడా బాగా చెప్పారు.

  14. D. Subrahmanyam గారికి నమస్తే అండి.
    మీరు మీ అభిప్రాయాలను పంచుకోవటం నాకెంతో సంతోషాన్ని స్పూర్తిని కలిగించింది.
    హృదయ పూర్వక కృతజ్ఞతలండి.

  15. గుల్జార్ కవిత ఒకటి గుర్తుకొచ్చింది.

    ఈ రోజు ఆదివారం
    నా ఇంటి పక్క మైదానం
    నిశ్శబ్దంగా ఒంటరిగా ఉంది!
    అవును పిల్లల బంతులు
    మొబైళ్ళు దొంగిలించేసాయిగా!

    1. R.S. Venkateswaran గారు, భలే బాగుంది.
      థాంక్యూ సర్.

  16. చాలా బాగా వచ్చింది. చక్కగా తల్లీ తండ్రిలకు మెత్తగా హెచ్చరిక

  17. కధ ను అద్భుతంగా రాశారు అనడం కన్నా యౌవన కాంక్షలను మొగ్గ తొడిగే ఆలోచనలను అవి ధ్వసం అయ్యే తీరును అట్లా దృశ్యమానం చేసింది రచయిత్రి

  18. ఓ ఆర్నెల్ల చంటి బిడ్డను ఆట పట్టించడం కోసం “”మీ అమ్మ నాది””అంటూ అమ్మ మీద చెయ్యేస్తే ఆ బిడ్డ గుక్కపెట్టి పొర్లి పొర్లి ఏడుస్తుంది😢possessiveness! అలాగే తల్లితండ్రులకు బిడ్డలమీద అదే possesiveness ఉండడం తప్పనలేం ! మొన్నోపిల్ల “తన మెళ్ళో తానే తాళి కట్టుకుని.. తనను తానే పెళ్ళి చేసుకుంది ” పేరెంట్స్ తన ఇష్టానికి ఒప్పి దగ్గరుండి తంతు జరిపించారు.. ప్రయోజనం ఓ ప్రశ్న ! కాబట్టి పట్టు విడుపులతో అర్థవంతమైన పేరెంటింగ్ సబబని నేనంటాను.. మీరేమంటారు ? మీ కథ కథనం అద్భుతం.. శుభాకాంక్షలు మీకు💐💐💐💐

    1. Thank you very much for sharing your opinion Sir. Basavaraju Venugopal garu.

  19. త్వరితంగా కొనసాగుతున్న సామాజిక మార్పులలో దిశరహితంగా కొట్టుకుపోతున్న సమాజం-తల్లితండ్రులు పిల్లల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక, చేసుకునే శక్తిలేక, ఎలా అర్థం చేసుకోవాలో తెలీక హింస ఒక్కటే సులభమైన పరిష్కార మార్గంగా భావించి పిల్లలపై ప్రయోగిస్తున్న వేళ- పరిస్థితులని అర్థం చేసుకుని విలువల్ని కాలానుగుణంగా మధించి, ఒక్క రచయిత మాత్రమే ‘ఎలా అర్థం చేసుకోవాలో’ తెలియజేస్తూ ఒక కాగడా మాదిరిగా వెలుగు చూపించగలుగుతాడు. సమాజం యొక్క బాధ్యత రచయితదే. రచయితకాక సామాజిక సమస్యల్ని ఎవరు అర్థం చేసుకోగలరు?

    ఈ కథలో ఎంతో ముఖ్యమైన సమస్యల్ని ఎత్తిచూపడమే కాకుండా మానవీయంగా వివేచించి పరిష్కారాల్ని కూడా చూపించగలగడం ఈ రచయిత్రి యొక్క అపారమైన సామాజిక పరిశీలనాశక్తి, దార్శనికత, తెలివిడికి నిదర్శనం.

    తమలోని బాల్యాన్ని కాపాడుకోగలిగినవారే పిల్లల కోణంలో ఆలోచించగలరు. అటువంటివారు అరుదు. నిజమైన కళాకారులు పిల్లల పక్షాన ఖచ్చితంగా నిలబడి తీరుతారు. పిల్లలకి ఇప్పుడు సహాయం ఎంతో అవసరం.

  20. SriRam M గారు,
    విషయాలని లోతుగా అర్ధం చేసుకునే మీ స్పందన యెంతో స్ఫూర్తిదాయకం. హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  21. ఇంకానయం, ఈ కథలో ఏ మూలనుంచి లైంగికత, స్వేచ్చా లైంగిక సంబంధాలు తొంగి చూస్తాయో అని భయపడి చచ్చా, ఆ అబ్బాయి ప్రవీణ్ రాగానే ఇంకా భయం పెరిగింది, రక్షించారు

  22. ఆ మాత్రం భయం వుండాలి అండి.. ☺️
    Thank you very much B. Sudheer.

  23. Very educative and timely …it is an excellent combination of nonfiction and fiction! Congratulations to the writer

Leave a Reply